
సాక్షి, జనగామ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లాగా మారిపోయారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రే భూములు అమ్మడం విడ్డూరం ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
ఈ నెలలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఘనపూర్‌లో పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రాజయ్య మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో దోపిడీ పెరిగింది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రే భూములు అమ్మడం విడ్డూరం. ముఖ్యమంత్రికి నేనేమన్నా తక్కువ అన్నట్టుగా ఇనపరాతి గుట్టలపై కడియం శ్రీహరి కన్నేశాడు.
అక్కడ 28 ఎకరాల దేవనూరు భూమి తన బినామీ పేరుపై ఉన్నది వాస్తవం కాదా?. ఆ 28 ఎకరాల వద్ద తన బినామీలతో కడియం దిగిన ఫోటోలు నా వద్ద ఉన్నాయి. దేవనూరులో కడియం శ్రీహరి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులు ఏమీ లేవు. వ్యవసాయం చేసే కుటుంబం అంతకన్నా కాదు. కడియం శ్రీహరి అవినీతి, అక్రమాలకు.. ఆయన ఆస్తులే సజీవ సాక్షాలు. రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనాపూర్ ప్రజలే రాజకీయ సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ విమర్శలు చేశారు.