సాక్షి, జనగామ: తెలంగాణలో రాక్షస పాలన నడుస్తోందన్నారు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొంద రాజయ్య. కాంగ్రెస్ పార్టీది ప్రజాపాలన కాదు.. ప్రజలను పీడించే, హింసించే పాలన అంటూ ఘాటు విమర్శలు చేశారు. పార్టీ మారిన నేతలకు దమ్ముంటే వెంటనే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై పోటీ చేసి గెలవాలని డిమాండ్ చేశారు.
కాగా, స్టేషన్ ఘనపూర్‌లో శనివారం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గూండాలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నాడు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి ప్రభుత్వం పక్షపాత ధోరణిని అవలంభించింది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. దాడి చేసిన గుండాలను అరెస్టు చేసి, చర్యలు తీసుకోవాలి. మాజీ మంత్రి అని కూడా చూడకుండా హరీష్ రావును తీసుకెళ్లడం దారుణం. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన శాంతియుతంగా జరిగింది.
కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదు.. ప్రజలను హింసించే పాలన. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 1985లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పార్టీ ఫిరాయింపుల చట్టం తీసుకువచ్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మొన్న ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా చేర్చారు. పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో, కోడి గుడ్లతో కొట్టండని రేవంత్ రెడ్డే చెప్పారు. నాడు తెలంగాణ ఆకాంక్ష కొరకు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీఆర్‌ఎస్ పార్టీ గుర్తుపై గెలిచాను.
నైతిక విలువలు, అభివృద్ధి అంటున్న కడియం శ్రీహరి ముందు రాజీనామా చేయాలి. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా.. హైకోర్టు బెంచ్, సుప్రీం కోర్టుకు వెళ్తా అనడం సిగ్గుచేటు. దమ్ముంటే రాజీనామా చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలవాలి. జనరల్ డిగ్రీ కాలేజ్ తీసుకొస్తానని అనేక సార్లు చెప్పిన కడియం.. దీనిపై ఇప్పటి వరకు అతీగతీ లేదు. అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం.. స్టేషన్ ఘనపూర్‌కు చేసింది గుండు సున్నా. బీఆర్‌ఎస్ తెచ్చిన రైతుబంధును రైతుభరోసాగా మార్చారు. రైతుభరోసా లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: డీసీపీ ఫిర్యాదు..కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు
Comments
Please login to add a commentAdd a comment