సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో బొగ్గు గనులను చేజిక్కించుకోవడానికి సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, మెజాంబిక్ తదితర దేశాల్లోని బొగ్గు గనుల కోసం అక్కడి కంపెనీల నుంచి గత నెలలో సింగరేణి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను కోరగా, 13 విదేశీ బొగ్గు గనులనుంచి ఆఫర్లు వచ్చాయి. వీటిలో ఇండోనేసియా, ఆస్ట్రేలియాల్లోని చెరో మూడు గనులతో పాటు మోజాంబిక్, బోత్సవానల్లోని చెరో రెండు గనులు, నమిబియా, అమెరికా, దక్షిణాఫ్రికాల్లో ఒక్కో బొగ్గు గని వుంది.
వాటిని సింగరేణికి కేటాయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తూ సంబంధిత యాజమాన్య కంపెనీలు దాఖలు చేసిన బిడ్లపై ప్రస్తుతం సింగరేణి అధ్యయనం చేస్తోంది. ప్రతిపాదిత గనుల్లో బొగ్గు నాణ్యత, లభ్యత, దిగుమతికి రవాణా సౌకర్యాలు వంటి వాటిని సింగరేణి యాజమాన్యం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. పై అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం ఆమోదయోగ్యమైన గనులను నిపుణుల కమిటీ షార్ట్‌లిస్ట్ చేయనుంది.
ఈ కమిటీ ఎంపిక చేసిన గనులను సింగరేణి నిపుణులు సందర్శించనున్నారు. ఆయా దేశాల చట్టాలు, గనుల తవ్వకాలకు స్థానికంగా ఉన్న అనుమతులు, బిడ్లు వేసిన కంపెనీలకు గనులపై ఉన్న న్యాయపర హక్కులు తదితర కీలక విషయాలను ఆరా తీయనున్నారు. అన్నీ సవ్యంగా వుంటే వాటితో గనుల నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకోనుంది.
కనీసం 51 శాతం యాజమాన్య హక్కులను సింగరేణి చేజిక్కించుకోనుంది. ఒక్కో గని నుంచి ఏడాదికి కనీసం రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాలని, ఒక మిలియన్ టన్నును దేశానికి దిగుమతి చేసుకోవాలనే లక్ష్యంతో సింగరేణి ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూరై్త ఒప్పందాలు జరుపుకోడానికి ఏడాదికాలం పట్టనుంది. ఈ 13 గనుల్లో ఐదారు విదేశీ బొగ్గు గనులను చేజిక్కించుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది.
దక్షిణాఫ్రికా, మోజాంబిక్ గనులపై ఆసక్తి
అమెరికా, బోత్సవాన నుంచి వచ్చిన బొగ్గు గనుల ఆఫర్‌లను తిరస్కరించాలని సింగరేణి ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రాంతాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయని, ఆర్థికంగా నష్టదాయకమని అధికారులు తేల్చారు. మిగతా ఆఫర్లతో పోల్చితే కొంత దగ్గరగా ఉన్న ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, మోజాంబిక్‌లలోని గనులను పరిశీలించాలని భావిస్తున్నారు. మోజాంబిక్‌లో కేవీఎల్ కంపెనీకి చెందిన గనితో పాటు దక్షిణాఫ్రికాలోని కాంటినెంటల్ కంపెనీకి సంబంధించిన గనిని సందర్శించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో సింగరేణి బోర్డు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది.
కొత్తగా మరో మూడు గనుల్లో ఉత్పత్తి
ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని 60 మిలియన్ టన్ను(ఎంటీ)లకు పెంచాలని సింగరేణి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2013-14లో 50 ఎంటీలు, 2014-15లో 52 ఎంటీలను ఉత్పత్తి చేయగా, ఈ సారి 8 ఎంటీల ఉత్పత్తిని పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అండ్రియాల గని నుంచి ఉత్పత్తి పునః ప్రారంభంతో పాటు ఈ ఏడాది చివరి నాటికి కొండాపూర్(భూగర్భ), బెల్లంపల్లి ఓసీ-2లో ఉత్పత్తి ప్రారంభించడం, రామగుండం-03ని విస్తరించేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంది.
సింగరేణి... కొత్త బాణీ
Published Wed, Aug 19 2015 8:24 AM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement
Advertisement