బొగ్గు బ్లాకులపై ప్రధాని మోదీకి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విజ్ఞప్తి
హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను పునరుద్ధరించాలి
తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయండి
రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలు కేటాయించండి
విభజన చట్టంలోని హామీలను అంశాలను నెరవేర్చాలని వినతి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్‌సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలు ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/ 17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్–3 గనులనూ సింగరేణికే కేటాయించాలని కోరారు.
రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటా యింపు కీలకమైనందున సింగరేణికే వాటిని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సుమారు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాలపై చర్చించారు.
ప్రధానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వినతులు ఇవీ..
⇒ హైదరాబాద్–కరీంనగర్ రహదారి, హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హెచ్–44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మధ్యలో అడ్డుగా ఉన్న రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఆ కారిడార్లతోపాటు హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ పరిధిలో 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాలలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌ఐసీ)కు లీజుకిచ్చిన 2,462 ఎకరాలను కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉంది.
⇒ 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరుకు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాంతాల విషయంలో 2014 తర్వాత ముందడుగు పడలేదు. అందుకే హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలి.
⇒ భారత్‌మాల పరియోజన మొదటి దశలో హైదరాబాద్ ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణ టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలి. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి దాన్ని కూడా భారత్ మాల పరియోజనలో చేర్చి నిర్మించాలి.
⇒ రాష్ట్రంలో పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలి. (జగిత్యాల–పెద్దపల్లి–కాటారం, దిండి–దేవరకొండ–మల్లెపల్లి–నల్లగొండ, భువనగిరి–చిట్యాల, చౌటుప్పల్ ఆమన్‌గల్–షాద్ నగర్–సంగారెడ్డి, మరికల్–నారాయణపేట రామసముద్ర, వనపర్తి–కొత్తకోట–గద్వాల మంత్రాలయం, మన్నెగూడ–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్, కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు–గద్వాల–రాయచూరు, కొత్తపల్లి–హుస్నాబాద్–జనగాం–హైదరాబాద్, సారపాక–ఏటూరునాగారం, దుద్దెడ–కొమురవెల్లి–యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం)
– రాష్ట్రానికి ఒక ఐఐఎం మంజూరు నిర్ణయం కింద తెలంగాణకు ఇంకా ఐఐఎం మంజూరు చేయలేదు. ఇప్పటికైనా హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలి.
– తెలంగాణలోని కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి.
– ఏపీ పునరి్వభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి.
– హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నందున ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలి.
– 2024–25 నుంచి ప్రారంభమవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి.
– తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్‌జీఎఫ్) కింద 2019–20 నుంచి 2023–24 వరకు తెలంగాణకు రావల్సిన రూ. 1,800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి.
– రాష్ట్ర పునరి్వభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment