coal mines
-
సింగరేణిలో శరవేగంగా తగ్గిపోతున్న బొగ్గు నిక్షేపాలు.. ఈ ఏడాది నుంచే గనుల మూత!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొంగు బంగారం కరిగిపోతోంది. సింగరేణి బొగ్గు గనుల్లో నిక్షేపాలు శరవేగంగా తరిగిపోతున్నాయి. ఉత్తర తెలంగాణీయుల కొలువుల ఆశలు ఆవిరైపోతున్నాయి. సింగరేణి బొగ్గు బాయి అంటేనే ఉద్యోగాల పంట. ఇప్పుడు సింగరేణిలో కొత్త ఉద్యోగాల భర్తీ దేవుడు ఎరుగు.. ఉన్న ఉద్యోగాలను కాపాడుకోవడం కష్టంగా మారనుంది. వచ్చే కొన్నేళ్లలో సింగరేణి బొగ్గు గనులు సగానికిపైగా మూతబడిపోనుండగా, బొగ్గు ఉత్పత్తి సగం కానుంది. అదే జరిగితే తెలంగాణలోని ప్లాంట్లతో పాటు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు తీవ్రమైన బొగ్గు కొరత ఏర్పడుతుంది. ఇతర ప్రాంతాల నుంచి కానీ, విదేశాల నుంచి కానీ అధిక ధరలు వెచ్చించి బొగ్గు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు విద్యుత్ చార్జీలు కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు జీతాలు, బోనస్‌ల చెల్లింపులు కూడా కష్టంగా మారతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఏడాది నుంచే గనుల మూత ప్రారంభం కానుండగా, ప్రత్యామ్నాయంగా కొత్త గనులను ప్రారంభించి సంస్థ భవిష్యత్తును సుస్థిర చేసుకోవడం కష్టసాధ్యమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంస్థ విస్తరణకు మూలధనం కొరత కూడా సమస్యగా మారింది. మరోవైపు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు నేరుగా గనులను కేటాయించేందుకు ససేమిరా అంటుండగా, వేలంలో పాల్గొని కొత్త గనులు దక్కించుకునే విషయంలో సింగరేణి సంస్థ పెద్ద ఆసక్తి చూపడం లేదు. గనులను నేరుగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం వేలానికి దూరంగా ఉంది. కేంద్రం ఇప్పటికే కోయగూడెం, సత్తుపల్లి గనులను వేలం ద్వారా ప్రైవేటు సంస్థలకు కేటాయించగా, శ్రావణపల్లి ఓసీ గనికి సైతం వేలం నిర్వహించడం గమనార్హం.వచ్చే ఏడేళ్లలో 19 గనుల మూత సింగరేణి ఏరియాలో 11,257 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు శాస్త్రీయ అధ్యయనాల్లో తేలగా, 2,997 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనుల్లో మాత్రమే తవ్వకాలు జరిపేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ లీజులను కలిగి ఉంది. కాగా ఇప్పటికే 1,565 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీయగా, ఇక 1,432 మిలియన్ టన్నుల నిక్షేపాలే మిగిలిఉన్నాయి. సింగరేణి సంస్థ ప్రస్తుతం 22 భూగర్భ, 20 భూఉపరితల గనులు కలిపి మొత్తం 42 గనులను కలిగి ఉండగా..»ొగ్గు నిక్షేపాలు నిండుకుంటుండటంతో వచ్చే రెండేళ్లలో 8 గనులను మూసివేయాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. అలాగే 2031–32 నాటికి ఏకంగా 19 గనులను మూసివేయనుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ఓ నివేదిక ప్రకారం..ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25)లో సింగరేణి సంస్థ 42 గనులు, 40,994 మంది కారి్మకులతో ఏటా సగటున 72.01 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. అయితే 2042–43 నాటికి కేవలం 19 గనులే ఉండనుండగా, కారి్మకుల సంఖ్య సైతం 35,665కి తగ్గిపోనుంది. ఇక బొగ్గు ఉత్పత్తి కూడా 39.03 మిలియన్ టన్నులకు పడిపోనుంది. విస్తరణకు మూలధనం చిక్కులు సంస్థను కాపాడుకునే క్రమంలో కేవలం బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా థర్మల్, పంప్డ్ స్టోరేజీ, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులను చేపట్టి ఇతర రంగాల్లో సంస్థ విస్తరణకు బాటలు వేయాలని ప్రయత్నాలు జరుగుతుండగా, మూలధన పెట్టుబడులు లేక ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జైపూర్‌లోని 1200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ గని నుంచి బొగ్గు కేటాయింపులుండగా, ఆ గనిని సింగరేణి సంస్థ గతంలోనే చేజిక్కించుకుంది. అక్కడ ఉత్పత్తి చేసే విద్యుత్ రాష్ట్రానికి తరలించడానికి రవాణా ఖర్చులు తడిసిమోపెడు కానున్నాయి. ఈ నేపథ్యంలో నైనీ బ్లాకుకు సమీపంలో 1600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జైపూర్‌లోనే కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని ఇప్పటికే ప్రారంభించింది. అలాగే కాలం చెల్లిన రామగుండం థర్మల్–బీ స్టేషన్ స్థానంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో, సింగరేణి సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి అవసరమైన పెట్టుబడి వ్యయంలో 80 శాతాన్ని బ్యాంకుల నుంచి రుణం రూపంలో పొందడానికి వీలుండగా, మిగిలిన 20 శాతం వాటాను సింగరేణి స్వయంగా భరించాల్సి ఉంటుంది. మెగావాట్‌కు రూ.10 కోట్లు చొప్పున ఈ మూడు విద్యుత్ కేంద్రాల నిర్మాణానికి రూ.32 వేల కోట్ల వ్యయం కానుండగా, అందులో 20 శాతం అంటే రూ.6,400 కోట్లను సింగరేణి భరించాల్సి ఉంటుంది. ఇలావుండగా రామగుండం రీజియన్‌లోని మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ గనిలో రూ.3 వేల కోట్ల వ్యయంతో 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణానికి సైతం ఇటీవల శ్రీకారం చుట్టింది. ఇల్లందు జీకే గనిలో మరో 100 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ కేంద్రం నిర్మించాలని యోచిస్తోంది. రూ.1,640 కోట్లతో లోయర్ మానేరు డ్యామ్‌పై 300 మెగావాట్లు, మల్లన్నసాగర్‌పై 500 మెగావాట్లు కలిపి మొత్తం 800 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకుంది. మరో 100 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటును పరిశీలిస్తోంది. శ్రావణ్‌పల్లి, మాదారం, గోలేటీ ఓపెన్ మైన్స్‌ను ప్రారంభించాల్సి ఉంది. అనుకున్న విధంగా ఈ ప్రాజెక్టులన్నింటినీ చేపట్టి, సకాలంలో పూర్తి చేయాలంటే సింగరేణి రూ.వేల కోట్లను వెచ్చించాల్సి ఉండగా మూలధనం కొరత సమస్యగా మారనుంది. సర్కారు బకాయిలు రూ.31 వేల కోట్లు గనుల మూత, విస్తరణకు మూలధనం కొరతతో పాటు ప్రభుత్వం నుంచి వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉండటంతో సింగరేణి పరిస్థితి అయోమయంగా మారింది. విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం చెల్లింపులు జరపకపోవడం సంస్థ విస్తరణపై ప్రభావం చూపుతోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడానికి సింగరేణి సంస్థ నుంచి పెద్ద మొత్తంలో బొగ్గు, విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న రాష్ట్రం..అందుకు సంబంధించిన చెల్లింపులు మాత్రం జరపడం లేదు. గడిచిన ఏప్రిల్ నాటికి సంస్థకు రావాల్సిన మొత్తం బకాయిలు రూ.32,325.29 కోట్లు ఉండగా, అందులో ఒక్క తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలే రూ.31,000.5 కోట్లు ఉన్నాయి. ఇందులో విద్యుత్ విక్రయాలకు సంబంధించిన రూ.22,405.76 కోట్లు తెలంగాణ స్టేట్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(టీఎస్పీసీసీ) చెల్లించాల్సి ఉండగా, బొగ్గు విక్రయాలకు సంబంధించి రూ.8,594.74 కోట్లను తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) నుంచి రావాల్సి ఉంది. సింగరేణికి మరో రూ.1,324.79 కోట్లను ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర బకాయిపడ్డాయి. ఏటేటా రావాల్సిన బకాయిలు పేరుకుపోయి రూ.32,325 కోట్లకు చేరినా సింగరేణి సంస్థ లాభాల్లో నడుస్తోందని యాజమాన్యం పేర్కొంటోంది. గత ఆర్థిక సంవత్సరం 2023–24 చివరి నాటికి రూ.57,448 కోట్ల నష్టాల్లో కూరుకుపోయిన తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) నుంచి సింగరేణి సంస్థ బకాయిలను రాబట్టుకోవడం కష్టమేనని విద్యుత్ రంగ నిపుణులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే బకాయిల చెల్లింపులకు చర్యలు తీసుకోని పక్షంలో భవిష్యత్తులో సింగరేణి ఉద్యోగులకు జీతాలు చెల్లించడం కూడా కష్టంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఉత్తర–దక్షిణ కారిడార్‌తో పొంచి ఉన్న ముప్పు ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య కోల్ కారిడార్ పేరుతో కొత్త రైల్వే లైన్ వేయాలని ఇటీవల కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ కారిడార్ వస్తే సింగరేణి బొగ్గుకు డిమాండ్ గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతం సింగరేణి టన్ను బొగ్గును రూ.3,500కు విక్రయిస్తుండగా, ఒడిశాతో పాటు ఉత్తరభారత దేశంలోని రాష్ట్రాలు రూ.1,100కే విక్రయిస్తున్నాయి. పైగా సింగరేణి బొగ్గుతో పోలి్చతే అక్కడి బొగ్గులో నాణ్యత ఎక్కువ. కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఆయా రాష్ట్రాల నుంచి బొగ్గును సులభంగా దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.చదవండి: ధరణి పోర్టల్‌లో ఇక నుంచి ఒకటే చట్టం... ఒకటే మాడ్యూల్ముందస్తు ప్రణాళిక లేకుంటే ఇబ్బందే.. ముందస్తు ప్రణాళిక లేకపోతే సింగరేణి పరిస్థితి భవిష్యత్తులో కష్టమే. గతంలో బొగ్గు ఉత్పత్తిపై దృష్టి పెట్టడం తప్ప, విస్తరణను పట్టించుకోలేదు. దీనికితోడు కేవలం వేలంలోనే గనులు దక్కించుకోవాలన్న కేంద్ర నిబంధన కూడా ఇబ్బందికరంగా మారింది. తాడిచర్ల బ్లాక్‌కు అనుమతులు తీసుకోవడం, అలాగే మరో మూడు గనులు ఇల్లందు, కోయగూడెం, సత్తుపల్లిని కూడా ప్రభుత్వం తీసుకుంటే మరో 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఢోకా ఉండదు. – వాసిరెడ్డి సీతారామయ్య, అధ్యక్షుడు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) -
నల్ల బంగారులోకం!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా సింగరేణిగా ఏలూరు జిల్లా చింతలపూడి ప్రాంతం వెలుగొందనుంది. నల్ల బంగారు గనులతో రాష్ట్రానికి కాసుల పంట పండించనుంది. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనుంది. నవ్యాంధ్ర అభివృద్ధికి ఊతం అందించనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ జాబితాలో ఏలూరు జిల్లా చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లు 44, 45 స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు సెక్టార్లు కూడా చింతలపూడి మండలంలోనే ఉండటం విశేషం. దీంతో చింతలపూడి మండలంలో నాణ్యమైన బొగ్గు తవ్వకాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే వేలంలో చోటు దక్కినా...!చాట్రాయి మండలం సోమవరం గ్రామం నుంచి చింతలపూడి వరకు 2వేల మిలియన్ టన్నుల నుంచి 3వేల మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తెలంగాణలోని సింగరేణి తరహాలో ఇక్కడ బొగ్గు తవ్వకాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి 2015లో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏపీఎండీసీ) లేఖ రాసింది. దానిపై కేంద్రం స్పందించలేదు. కానీ, గతంలో కేంద్రం దేశవ్యాప్తంగా నిర్వహించిన బొగ్గు గనుల వేలంలో ప్రస్తుతం ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవరం, తడికలపూడితోపాటుగా చింతలపూడి బ్లాక్‌లోని జంగారెడ్డిగూడెం కూడా ఉన్నాయి. ఈ వేలంలో సింగరేణి సంస్థ పోటీలో లేక పోవడంతో బొగ్గు గనుల వేలం వాయిదా పడింది. తాజాగా ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి దేశవ్యాప్తంగా నూతన బొగ్గు గనుల వేలం జాబితాను ప్రకటించగా, చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్డబ్ల్యూ), చింతలపూడి సెక్టార్ ఏ–1 (ఎస్ఈ)లకు చోటు దక్కింది. దీంతో బొగ్గు తవ్వకాలు ప్రారంభమైతే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రజలు భావిస్తున్నారు.60 ఏళ్ల నుంచి అన్వేషణ.. » ఉమ్మడి పశ్చిమ, కృష్ణా జిల్లాల పరిధిలో బొగ్గు గనులను కనుగొనేందుకు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జీఎస్ఐ)తోపాటు వివిధ సంస్థలు 60 ఏళ్ల నుంచి సర్వేలు చేశాయి. తొలి దశలో 1964 నుంచి 2006 వరకు నాలుగు దఫాలుగా సర్వేలు నిర్వహించారు. 2006 నుంచి 2016 వరకు మళ్లీ సర్వేలు కొనసాగాయి. » అన్ని సర్వేల్లోనూ చింతలపూడి ప్రాంతంలో నాణ్యమైన బొగ్గు గనులు ఉన్నట్లు గుర్తించారు. ఆయా సర్వే సంస్థల నివేదికల్లో కొన్ని స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ చింతలపూడి మండలంలో 30 కిలో మీటర్ల వ్యాసార్థంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నట్లు దాదాపు అన్ని సంస్థలు అంచనా వేశాయి. » లక్నోకు చెందిన బీర్బల్ సహానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలియో బోటనీ అనే సంస్థ 2013లో నాటి కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బొగ్గు గనులపై అధ్యయనం చేసింది. చాట్రాయి మండలం సోమవరం నుంచి చింతలపూడి, టి.నరసాపురం, జంగారెడ్డిగూడెం మండలాల మీదుగా రాజమండ్రి వరకు నాణ్యమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది. ఇతర రాష్ట్రాల్లో లభించే బొగ్గుతో పోల్చితే ఇక్కడ అత్యంత నాణ్యమైన గ్రేడ్–1 రకం బొగ్గు ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అది కూడా భూ ఉపరితలానికి 500 మీటర్ల లోతులోనే బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని వెల్లడించింది. » సౌత్ వెస్ట్ పినాకిల్ సంస్థ మరో సంస్థతో కలిసి చింతలపూడి ప్రాంతంలో 120 పాయింట్లను గుర్తించి అధునాతన రిగ్గులతో డ్రిల్లింగ్ చేపట్టింది. ఈ 120 పాయింట్ల ద్వారా సుమారు 65,000 మీటర్ల లోతున బొగ్గు అన్వేషణ చేపట్టి సుమారు 40,000 మీటర్ల పనులు పూర్తి చేసింది. » ఇక్కడ గనుల్లో తవ్వకాలు ప్రారంభమైతే ఏడాదికి 8 వేల మెగావాట్లు చొప్పున 60 సంవత్సరాల వరకు విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు సరిపోతుందని వివిధ సర్వే రిపోర్టుల ఆధారంగా అధికారులు అంచనా వేశారు. -
సింగరేణికే కేటాయించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ రంగంలో ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ (ఎస్సీసీఎల్)లో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం, కేంద్రానికి 49 శాతం వాటాలు ఉన్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. గనులు, ఖనిజాభివృద్ధి నియంత్రణ చట్టంలోని (ఎంఎండీఆర్) సెక్షన్ 11ఏ/ 17 (ఏ) (2) ప్రకారం వేలం జాబితా నుంచి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను తొలగించాలని, అదే సెక్షన్ ప్రకారం గోదావరి లోయ బొగ్గు నిల్వల క్షేత్రం పరిధిలోని కోయగూడెం, సత్తుపల్లి బ్లాక్–3 గనులనూ సింగరేణికే కేటాయించాలని కోరారు. రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల అవసరాలు తీర్చేందుకు ఈ గనుల కేటా యింపు కీలకమైనందున సింగరేణికే వాటిని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీని ఆయన నివాసంలో కలిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సుమారు గంటసేపు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన బొగ్గు గనుల కేటాయింపు, ఐటీఐఆర్ పునరుద్ధరణ, రక్షణ భూముల కేటాయింపు, రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని అంశాలపై చర్చించారు. ప్రధానికి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి వినతులు ఇవీ.. ⇒ హైదరాబాద్–కరీంనగర్ రహదారి, హైదరాబాద్–నాగ్‌పూర్ రహదారి (ఎన్‌హెచ్–44)పై ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మధ్యలో అడ్డుగా ఉన్న రక్షణ శాఖ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి. ఆ కారిడార్లతోపాటు హైదరాబాద్‌లో రహదారుల విస్తరణ, రవాణా, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు రక్షణ శాఖ పరిధిలో 2,450 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించాలి. ఆ భూములకు ప్రత్యామ్నాయంగా రావిరాలలో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్ఐసీ)కు లీజుకిచ్చిన 2,462 ఎకరాలను కేంద్రానికి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం ఉంది. ⇒ 2010లో నాటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్, బెంగళూరుకు కేటాయించిన ఐటీఐఆర్ ప్రాంతాల విషయంలో 2014 తర్వాత ముందడుగు పడలేదు. అందుకే హైదరాబాద్‌కు ఐటీఐఆర్ ను పునరుద్ధరించాలి. ⇒ భారత్‌మాల పరియోజన మొదటి దశలో హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం (సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు) జాతీయ రహదారి నిర్మాణ టెండర్ల ప్రక్రియను వీలైనంత త్వరగా చేపట్టాలి. ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని (చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు) వెంటనే జాతీయ రహదారిగా గుర్తించి దాన్ని కూడా భారత్ మాల పరియోజనలో చేర్చి నిర్మించాలి. ⇒ రాష్ట్రంలో పెరిగిన రవాణా అవసరాల దృష్ట్యా 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలి. (జగిత్యాల–పెద్దపల్లి–కాటారం, దిండి–దేవరకొండ–మల్లెపల్లి–నల్లగొండ, భువనగిరి–చిట్యాల, చౌటుప్పల్ ఆమన్‌గల్–షాద్ నగర్–సంగారెడ్డి, మరికల్–నారాయణపేట రామసముద్ర, వనపర్తి–కొత్తకోట–గద్వాల మంత్రాలయం, మన్నెగూడ–వికారాబాద్–తాండూరు–జహీరాబాద్–బీదర్, కరీంనగర్–సిరిసిల్ల–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం, ఎర్రవల్లి ఎక్స్ రోడ్డు–గద్వాల–రాయచూరు, కొత్తపల్లి–హుస్నాబాద్–జనగాం–హైదరాబాద్, సారపాక–ఏటూరునాగారం, దుద్దెడ–కొమురవెల్లి–యాదగిరిగుట్ట రాయగిరి క్రాస్ రోడ్డు, జగ్గయ్యపేట–వైరా–కొత్తగూడెం) – రాష్ట్రానికి ఒక ఐఐఎం మంజూరు నిర్ణయం కింద తెలంగాణకు ఇంకా ఐఐఎం మంజూరు చేయలేదు. ఇప్పటికైనా హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయాలి. – తెలంగాణలోని కొత్త జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలి. – ఏపీ పునరి్వభజన చట్టంలో హామీ ఇచ్చినట్లుగా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలి. – హైదరాబాద్‌లో సెమీకండక్టర్ ఫ్యాబ్స్‌ను నెలకొల్పేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నందున ఇండియా సెమీకండక్టర్ మిషన్‌లో తెలంగాణను చేర్చాలి. – 2024–25 నుంచి ప్రారంభమవుతున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో తెలంగాణకు 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలి. – తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి (బీఆర్జీఎఫ్) కింద 2019–20 నుంచి 2023–24 వరకు తెలంగాణకు రావల్సిన రూ. 1,800 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. – రాష్ట్ర పునరి్వభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం బయ్యారంలో వెంటనే ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పే ప్రక్రియను వేగవంతం చేయాలి. -
‘ప్రైవేటు’తో సింగరేణి కుదేలు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు, ఖనిజాల చట్టం (ఎంఎండీఏ)లోని సెక్షన్ 17ఏ(2) కింద సింగరేణి బొగ్గు గనుల సంస్థకు బొగ్గు గనులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించేందుకు అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేలంలో ప్రైవేటు కంపెనీలకు గనులను కేటాయించడం సింగరేణిని కుదేలు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని 2015లో కేంద్రం సవరించడంతో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై అంతకుముందున్న లీజు హక్కులు, అధికారాలను సంస్థ కోల్పోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనతో మాట్లాడారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి... సింగరేణి ప్రాంతంలోని గనులను సంస్థకే కేటాయించేలా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డి, తాను, ఇతర పారీ్టల నేతలతో కలిసి అఖిలపక్షంగా ఆయన్ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. గత సర్కారు వేలంలో పాల్గొననివ్వలేదుచట్టంలోని సెక్షన్ 17ఏ(2) కింద తమకు అతిముఖ్యమైన సత్తుపల్లి–3, శ్రావణపల్లి, పీకే ఓసీ డీప్‌సైడ్, కోయగూడెం బ్లాక్–3 బొగ్గు బ్లాకులను కేటాయించాలని గతంలో సింగరేణి కోరగా వాటిని కూడా కేంద్రం వేలం వేయాలని నిర్ణయించడం బాధాకరమని భట్టి అన్నారు. ప్రభుత్వ సంస్థకు ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. వేలంలో పాల్గొనైనా ఈ గనులను దక్కించుకోవాల్సిన అవసరముండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిందని విమర్శించారు.దీంతో సత్తుపల్లి–3 బ్లాక్ అవంతిక మైనింగ్ పరమైందని.. కోయగూడెం బ్లాక్–3 ఆరో మైనింగ్ అనే సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులను వేలంలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. సత్తుపల్లి–3, కోయగూడెం–3 బ్లాకుల్లో ఇంకా ప్రైవేటు కంపెనీలు తవ్వకాలు ప్రారంభించలేదని, చట్టప్రకారం ఆ కేటాయింపులను రద్దు చేసి వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని భట్టి కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా కింద 0.5 శాతాన్ని అదనంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణిని కాపాడేందుకు అవసరమైతే చట్టంలో సవరణలు చేపట్టాలని కోరారు. మిగిలిన గనులను సింగరేణికే ఇవ్వాలి.. సింగరేణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి–ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. వాటిలో 388 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న 3,008 మిలియన్ టన్నుల బొగ్గును వెలిసితీసే అవకాశం ఇవ్వగా సింగరేణి 1,585 మిలియన్ టన్నుల బొగ్గునే వెలికితీసిందన్నారు. ఇంకా 1,422 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనులను చట్టప్రకారం రిజర్వేషన్ కోటాలో సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి భట్టి అందజేశారు. సింగరేణి మూతబడే ప్రమాదంసింగరేణికి ప్రస్తుతం 39 గనులు, 42 వేల మంది కార్మికులు ఉన్నారని భట్టి చెప్పారు. రానున్న ఐదేళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్‌కాస్ట్ గను లు, ఆ తర్వాత 5 ఏళ్లలో మరో 5 భూ గర్భ గనులు, 6 ఓపెన్‌కాస్ట్ గనులు మూతపడతాయ ని ఆందోళన వ్యక్తం చేశారు. 2037–38 నాటికి మరో 5 గనులు మూతబడతాయన్నారు. మరో 15 ఏళ్లలో 8 గనులు, 8 వేల మంది కార్మికుల స్థాయికి సంస్థ పడిపోయి చివరకు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందన్నా రు. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, నాయకులుగా ఈ పరిణామాలను ఊహించలేమన్నారు. -
అవంతిక, అరబిందో గురించి నోరుమెదపరేం?
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా కోట్లాది మంది తెలంగాణ ప్రజల మాటలను పట్టించుకోకుండా కనీసం వారి మాటలను వినడానికి కూడా ఇష్టపడని బీఆర్ఎస్ నేతలు... ఇప్పుడు వాస్తవాలను వింటారనే నమ్మకం కూడా లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. అయినా వారిలో మార్పు రావాలని కోరుకుంటున్నానని అన్నారు. బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ వైఖరిని తప్పుపడుతూ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ శుక్రవారం రాత్రి ‘ఎక్స్’ వేదికగా కౌంటర్ ఇచ్చా రు.‘కేటీఆర్ గారు... మన సంస్థల ప్రైవేటీకరణను, మన ప్రజల వాటాలను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణు లు అడుగడుగునా వ్యతిరేకించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను తొలిసారి వేలం వేసి రెండు ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. అరబిందో, అవంతిక అనే రెండు కంపెనీలకు కట్టబెట్టింది. అందుకు సహకరించింది మీ ప్రభుత్వమే.అప్పుడు మీరు, మీ పార్టీ నేతలు వాటి గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? మా ఉప ముఖ్యమంత్రి సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారు. అవంతిక, అరబిందో కంపెనీలకు కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి సింగరేణికి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు, వారి ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే. తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్‌తోనే సురక్షితం. మన బొగ్గు.. మన హక్కులను కాపాడి తీరుతాం. తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడతాం. అటు సింగరేణిని, ఇటు ఓఆర్ఆర్ను టోకున ప్రైవేటుకు అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడటం విడ్డూరం’ అని సీఎం రేవంత్ ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో విమర్శించారు. -
సింగరేణిపై ప్రధానితో చర్చిస్తా
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థకి నష్టం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు లాభం చేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి ఉంటుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞ ప్తితో పాటు ఆయన లేవనెత్తిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కేంద్ర బొగ్గు, గనుల శాఖ సీనియర్ అధికారులతో పాటు సింగరేణి సంస్థ అధికారులతో ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ దఫా వేలం ప్రక్రియను శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో కిషన్‌రెడ్డి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ఈ కార్యక్రమంలో ప్రారంభించగా, ఇందులో సింగరేణి ప్రాంతం పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థకు ఉన్న ప్రాముఖ్యత ఈ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు.అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నాం. బహిరంగ వేలంలో గనులు పొందిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు.. కేటాయింపుల ద్వారా గనులు పొందడం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. దేశాభివృద్ధికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడడమే వేలం లక్ష్యం. కేంద్రానికి ఆదాయం కోసం కాదు.ఓపెన్ రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో గనులను కేటాయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలే లబ్ధి పొందుతున్నాయి. 10 ఏళ్ల రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేది. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేశారు. కానీ కేంద్రం అవలంభిస్తున్న విధానాలతోనే నేడు విద్యుత్ కొరత లేదు..’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నైనీలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు ‘సింగరేణి సంస్థకు 2015లో ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని కేటాయించగా, అనేక సమస్యలతో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చంది. అక్కడి సీఎంతో స్వయంగా మాట్లాడి నైనీ బొగ్గు బ్లాకులో సత్వరం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 15 శాతం నైనీలోనే ఉత్పత్తి కానుంది..’అని కేంద్రమంత్రి తెలిపారు. గుదిబండగా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయి. సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థలతో పోలి్చతే సింగరేణి సంస్థ ఉత్పత్తి తగ్గింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింగరేణి కార్మికులతో కూడా మాట్లాతాం.సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. సంస్థ విషయంలో మాకూ బాధ్యత ఉంది..’అని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్రదూబే, కార్యదర్శి అమ్రీత్‌లాల్ మీనా, సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు, సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సింగరేణి’సమస్యల పరిష్కారానికి కృషి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ శాఖ అధికారులతో చర్చించి సింగరేణి సంస్థకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లకాగితాలపై రాసిస్తే బొగ్గు బ్లాకులు కేటాయించారని విమర్శించారు. తాము అత్యంత పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. -
సింగరేణిని బీఆర్ఎస్ బొంద పెట్టింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: తెలంగాణకు తలమానికంగా ఉన్న సింగరేణిని పదేళ్లలో బీఆర్ఎస్ సర్వనాశనం చేసి బొంద పెట్టిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేంద్రం గనులు, ఖనిజాల చట్టం–1957 ను సవరించి దేశంలో బొగ్గుగనులకు వేలం నిర్వహించేలా చట్టం చేస్తే 2015లో ఈ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు పలికిందని, తెలంగాణ ప్రయోజనాల కోసమే ఆలోచించి ఉంటే బిల్లును వ్యతిరేకించి ఉండేవారన్నారు.అయితే, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెబుతున్న మాటలు తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించేలా ఉండగా.. దొంగే దొంగ అన్న చందంగా బీఆర్ఎస్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. భట్టి గురువారం ఖమ్మం కలెక్టరేట్లో విలేకరుల సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి మాట్లాడారు. సింగరేణిలో 42 వేల మంది ఉద్యోగులు, 26 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, రాష్ట్రంలోని 40 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందన్నారు. అయితే, త్వరలో 22 బొగ్గు గనులు మూసివేతకు గురికానుండగా, 2031 వరకు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే కొత్తగా గనులు సాధించాల్సి ఉందని తెలిపారు.అనుచరులకు దక్కేలా...2021లో గనుల వేలంలో పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుంటే... వారం రోజుల్లోనే సంస్థ గనులు తీసుకోవద్దని నాటి సీఎం కేసీఆర్ నిర్ణయించారని భట్టి చెప్పారు. ఆయన అనుచర పారిశ్రామిక వేత్తలకు గనులు దక్కేలా కుట్ర చేశారని, అందులోభాగంగానే లిక్కర్ స్కామ్‌లో ఉన్న అరబిందో గ్రూపునకు చెందిన అరో మైనింగ్ కంపెనీకి కోయగూడెం బ్లాక్, ప్రతిమ గ్రూప్ కంపెనీకి చెందిన అవంతిక కాంట్రాక్టర్‌కు సత్తుపల్లి బ్లాక్ దక్కిందని చెప్పారు. తెలంగాణలో వదిలేసి ఒడిశాలో జరిగిన గనుల వేలంలో మాత్రం సింగరేణి పాల్గొనడం వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు.తాము అధికారంలోకి రాగానే కేంద్ర మంత్రిని కలిసి వేలం వేయకుండా బొగ్గు గనులు సింగరేణికి ఇవ్వాలని కోరామని, అదీగాక ఇప్పుడు ఆ శాఖ కిషన్‌రెడ్డికి దక్కినందున రాష్ట్ర ప్రయోజనాల కోసం చొరవ తీసుకోవాలని కోరారు. వేలం లేకుండానే రాష్ట్రంలోని బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని, దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలం ప్రక్రియ శుక్రవారం హైదరాబాద్‌లో జరగనున్నందున రాష్ట్ర ప్రభుత్వం నిరసిస్తోందని తెలిపారు. సింగరేణిపై కేటీఆర్, హరీశ్‌రావు చర్చకు వస్తే అన్ని ఆధారాలతో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని భట్టి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలతో కూడిన అఖిలపక్షంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో త్వరలో ప్రధానమంత్రి మోదీని కలుస్తామని పేర్కొన్నారు.సింగరేణికే కేటాయించాలి: తుమ్మలవేలం లేకుండా సింగరేణి సంస్థకే గనులు కేటాయించాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు డిమాండ్ చేశారు. సింగరేణి సంస్థకు వందేళ్లకు పైగా చరిత్ర ఉందని, బొగ్గు వెలికితీతలో ఈ సంస్థకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. 2016లో ఒడిశాలోని నైనీలో ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించినందున ఇక్కడ కూడా అలాగే చేయాలన్నారు. తద్వారా తెలంగాణ ప్రజల ఆస్తి సింగరేణిని కాపాడేలా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మట్టా రాగమయి, రాందాస్‌నాయక్, కలెక్టర్ ముజ మ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. -
సింగరేణి ‘సెగ’పట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో సింగరేణి బొగ్గు గనుల అంశం మంటలు రేపుతోంది. సింగరేణి ప్రాంతం పరిధిలోని ఓ బొగ్గు గని వేలానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో దుమారం చెలరేగింది. కేంద్రం, రాష్ట్రంలోని అధికార, విపక్ష పార్టీల నేతలు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఒకవైపు సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్తున్న కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు దేశంలోని 60 బొగ్గు గనుల వేలం ప్రక్రియను శుక్రవారం తెలంగాణ గడ్డ నుంచే ప్రారంభిస్తుండటం, ఇందులో సింగరేణి ఏరియా పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారింది. శ్రావణపల్లి బ్లాకులో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు గతంలో సింగరేణి నిర్వహించిన భూగర్భ సర్వేలో తేలింది. సింగరేణి ఏరియాలో ఉన్న ఈ బొగ్గు బ్లాకును వేలం వేయకుండా, నేరుగా సింగరేణికే కేటాయించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేసినా.. కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. సింగరేణి ఏరియాలోని బొగ్గు బ్లాకులపై.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో 10వ విడత బొగ్గు గనుల వేలం ప్రక్రియను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతం ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. సింగరేణి సంస్థను కాపాడుతామని పైకి చెప్తున్న కేంద్రం.. సింగరేణి ఏరియా పరిధిలోని బొగ్గు బ్లాకులకు వేలం నిర్వహిస్తుండటం ఏమిటని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. పైగా ఈ వేలంలో పాల్గొని బ్లాకులను దక్కించుకోవాలని సింగరేణి సంస్థను కోరుతుండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిజానికి కేంద్రం ఇంతకుముందు పలు దఫాలుగా సింగరేణి ఏరియాలోని కల్యాణఖని, శ్రావణపల్లి, కోయగూడెం, సత్తుపల్లి బొగ్గుబ్లాకులకు వేలం నిర్వహించింది. అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కారు ఆ వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకించి, దూరంగా ఉంది. మీదే తప్పంటే మీదేనంటూ.. గతంలో బీఆర్ఎస్ సర్కారు బొగ్గు గనుల వేలంలో పాల్గొనకుండా అడ్డుకోవడం ద్వారా సింగరేణి సంస్థకు అపార నష్టం కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే దిశగా కలసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను వేలంలో ఎవరు దక్కించుకున్నా మళ్లీ తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాదీనం చేసుకుంటామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం ఈ వ్యవహారంలో తీవ్రంగా స్పందించింది. బొగ్గు గనుల వేలాన్ని తప్పనిసరి చేస్తూ 2015లో కేంద్రం తెచ్చిన చట్టానికి పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్ధతు తెలిపిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. బీఆర్ఎస్ పెద్దలు గతంలో జరిగిన వేలంలో సింగరేణి పాల్గొనకుండా చేసి, వారి అనుయాయులకు సత్తుపల్లి, కోయగూడెం బొగ్గు బ్లాకులు దక్కేలా చేసుకున్నారని ఆరోపించారు. సింగరేణి ఏరియాలోని గనులను ఆ సంస్థకే కేటాయించాలని కేంద్రాన్ని కోరుతామని చెప్పారు. మొత్తంగా మూడు ప్రధాన పక్షాలు కూడా పరస్పర ఆరోపణలు చేసుకుంటుండటంతో ‘సింగరేణి’ అంశం చర్చనీయాంశంగా మారింది. వేలానికి సింగరేణి దూరమే? – రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం చూస్తున్నామన్న అధికారులు సింగరేణి (కొత్తగూడెం): శ్రావణపల్లి బొగ్గు బ్లాకు వేలం ప్రక్రియలో పాల్గొనాలని తొలుత సింగరేణి యాజమాన్యం భావించినట్టు తెలిసింది. కానీ ప్రస్తుత రాజకీయ విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని సంస్థ అధికార వర్గాలు తెలిపాయి. నిజానికి శ్రావణపల్లి బొగ్గు బ్లాకును దక్కించుకుని, తవ్వకాలు చేపట్టే విషయంలో చాలా పెద్ద ప్రక్రియ ఉంటుందని అంటున్నాయి. శ్రావణపల్లి బ్లాక్‌లో జీ–10 గ్రేడ్ బొగ్గు 11.9 కోట్ల టన్నుల మేర ఉన్నట్టు అంచనా వేశారు. టన్నుకు ఇంత అనే లెక్కన కొంత సొమ్ము ముందే చెల్లించి వేలంలో పాల్గొనాలి. వేలంలో దక్కించుకున్నా.. నిర్దేశిత ప్రాంతం ప్రైవేట్ భూమా, అటవీ భూమినా అన్నది తేల్చుకోవాలి. సహాయ, పునరావాస ప్యాకేజీ చెల్లించాలి, ప్రజాభిప్రాయ సేకరణ సభలు నిర్వహించి ఇతర అనుమతులు తీసుకోవాలి. ఇదంతా సాఫీగా సాగకుంటే వేలంలో చెల్లించిన సొమ్ము తిరిగొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పటికే సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలపై రాయల్టీల పేరిట ఏటా రూ.వందల కోట్లు చెల్లిస్తోంది. వేలంలో పాల్గొని బొగ్గు బ్లాక్ దక్కించుకుంటే మరింత ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా కంపెనీకి వచ్చే లాభం తగ్గుతుంది. ఇప్పటికే వీకే–7 గని అనుమతుల ప్రక్రియ మూడేళ్లుగా కొనసాగుతుండటంతో.. శ్రావణపల్లి వేలం విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు సమాచారం. -
బీజేపీ, బీఆర్ఎస్ కలిసి సింగరేణిలో అతిపెద్ద కుట్ర
-
సింగరేణికి తాడిచెర్ల–2 బొగ్గు గని
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థకి తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గని కేటాయించేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి విజ్ఞప్తి చేయగా, ఈ మేరకు ఆయన సానుకూలంగా స్పందించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడానికి అన్ని అనుకూలతలున్నాయని భట్టి వివరించారు. త్వరలో సింగరేణికి బొగ్గు గని కేటాయింపులకు సంబంధించిన ముందస్తు అనుమతి లేఖను ఇస్తామని ప్రహ్లద్ జోషీ హామీ ఇచ్చారని భట్టి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బ్లాక్‌లోనూ ఉత్పత్తిని ప్రారంభించే నిమిత్తం అడ్డంకులను తొలగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడాలని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కోరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. అలాగే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో భాగంగా రాష్ట్రంలోని సబ్స్టేషన్ల పరిసరాల్లో సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు సహకరించాలని విద్యుత్ శాఖ మంత్రి రాజ్‌కుమార్ సింగ్‌ను కోరామన్నారు. ఈ అంశాలను పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారని భట్టి విక్రమార్క తెలిపారు. భట్టి వెంట ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సింగరేణి ఇన్చార్జీ సీఎండీ బలరామ్ ఉన్నారు. కాగా, తాడిచెర్ల బ్లాక్–2 గనిని సింగరేణికి కేటాయిస్తే సంస్థ వార్షిక బొగ్గు ఉత్పత్తి ఏటా 5మిలియన్ టన్నులకు పెరగనుంది. తాడిచర్ల బ్లాక్ 2 గని ద్వారా 30 ఏళ్లలో 182 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలను వెలికి తీసేందుకు అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. కేసీఆర్, కేటీఆర్ ఇంజనీర్లు కాదు మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను రిపేరు చేస్తే సరిపోతుందని చెప్పడానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఇంజనీర్లు కాదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఎవరికి వారే ఇంజనీర్లమని ఊహించుకుని చెప్పడంవల్లనే అవి కూలిపోయాయని ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ వాళ్తు ఆలోచనా జ్ఞానం కోల్పోయారని భట్టి మండిపడ్డారు. డ్యామ్ సేఫ్టీ, ఇంజనీరింగ్ అధికారులు చెప్పినట్లు చేయడానికి మాత్రమే అవకాశం ఉందన్నారు. లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం చర్చలు జరుపుతోందని, సమయం, సందర్భాన్ని బట్టి జాబితా ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఎవరో ముందుగా ప్రకటించారని తాము తొందరపడబోమని వ్యాఖ్యానించారు. -
కల్లర్ మ్యాజిక్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మన హీరోలు
కథ బొగ్గు గనుల్లో జరుగుతోంది.. అక్కడ పనిచేసేవాళ్లు ఎలా కనిపిస్తారు? ఫుల్ డార్క్‌గా.. కథ బంగారు గనుల్లో జరుగుతోంది.. కానీ తవ్వేవాళ్లు బంగారంలా మెరిసిపోరు.. కమలిపోయిన చర్మంతో ఉంటారు. ఇక మత్స్యకారులో... వాళ్లూ అంతే.. స్కిన్ ట్యాన్ అయిపోతుంది. ఇప్పుడు కొందరు హీరోలు ఇలా ఫుల్ బ్లాక్‌గా, ట్యాన్ అయిన స్కిన్‌తో కనిపిస్తున్నారు. పాత్రలకు తగ్గట్టు బ్లాక్ మేకప్ వేసుకుని, సిల్వర్ స్క్రీన్‌పై మేజిక్ చేయడానికి రెడీ అయ్యారు. ఆ హీరోలు చేస్తున్న చిత్రాల గురించి తెలుసుకుందాం. 31లో కొత్తగా... హీరో ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ల క్రేజీ కాంబినేషన్లో ‘ఎన్టీఆర్ 31’ (వర్కింగ్ టైటిల్) సినిమా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. ఈ కాంబినేషన్లో సినిమా అనగానే ఎలా ఉంటుందో? అనే ఆసక్తి ఇటు చిత్ర వర్గాల్లో అటు సినిమా లవర్స్‌లో నెలకొంది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్లో ఎన్టీఆర్ పూర్తి నలుపు రంగు మేకప్‌లో కనిపించారు. ప్రశాంత్ నీల్ గత చిత్రాలు ‘కేజీఎఫ్, కేజీఎఫ్ 2, సలార్’ల తరహాలో ఎన్టీఆర్ 31 బ్లాక్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని టాక్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్ ఈ ఏడాది లోనే ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందనుంది. ‘‘ఎన్టీఆర్ ఇప్పటి వరకు చేయని పాత్ర, కథతో ‘ఎన్టీఆర్ 31’ సినిమా చేయబోతున్నాను. ఇందులో మునుపెన్నడూ చూడని విధంగా ఎన్టీఆర్ కనిపిస్తారు’’ అంటూ ప్రశాంత్ నీల్ ఆ మధ్య చెప్పిన సంగతి తెలిసిందే. గోల్డ్ ఫీల్డ్స్‌లో తంగలాన్ పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తుంటారు విక్రమ్. దర్శకుడి విజన్ 100 శాతం అయితే విక్రమ్ 200 శాతం న్యాయం చేస్తారనడం అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో ప్రయోగాత్మక పాత్రల్లో నటించిన విక్రమ్ ‘తంగలాన్’ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 19వ శతాబ్దం బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ డ్రామాగా రూపొందింది. బ్రిటిష్ పరిపాలన కాలంలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ వద్ద ఆక్రమణదారులకు ఎదురెళ్లి పోరాడిన ఓ ఆదివాసి తెగ నేపథ్యంలో ఈ చిత్రకథ ఉంటుందట. ఇందులో విక్రమ్ ఆ తెగ నాయకుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన విక్రమ్ ఫస్ట్ లుక్ పూర్తి స్థాయి నలుపులో ఎంతో వైవిధ్యంగా ఉంది. మాళవికా మోహనన్, పార్వతి తిరువోతు, పశుపతి ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాని తొలుత సంక్రాంతికి, ఆ తర్వాత రిపబ్లిక్ డే సందర్భంగా ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఏప్రిల్‌లో రిలీజ్ చేయ నున్నట్లు ఇటీవల పేర్కొన్నారు. భ్రమయుగంలో... దాదాపు 50 ఏళ్ల కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు మమ్ముట్టి. అయితే ఇప్పటివరకూ పోషించనటువంటి సరికొత్త పాత్రని ‘భ్రమయుగం’ సినిమాలో పోషిస్తున్నారాయన. రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో మమ్ముట్టి లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘భ్రమయుగం’. హారర్ థ్రిల్లర్ జోనర్లో కేరళలోని కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి వాస్తవ ఘటనలతో ఈ చిత్రం రూపొందుతోంది. అక్కడి చీకటి యుగాల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మమ్ముట్టి పాత్ర పూర్తి నలుపు రంగులో ఉంటుంది. ఇటీవల విడుదలైన ‘భ్రమయుగం’ మలయాళ టీజర్ పూర్తిగా బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. ఆద్యంతం ఉత్కంఠతో సాగిన టీజర్లో సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు మమ్ముట్టి. రామచంద్ర చక్రవర్తి నిర్మిస్తున్న ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది. గొర్రెల కాపరి పృథ్వీరాజ్ సుకుమారన్ హ్యాండ్సమ్గా ఉంటారు. తన నటనతో ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన తొలిసారి ‘ది గోట్ లైఫ్’ (ఆడు జీవితం) సినిమా కోసం పూర్తి స్థాయిలో నల్లటి మనిషిగా మారిపోయారు. బెన్యామిన్ రాసిన ‘గోట్ డేస్’ అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బ్లెస్సీ. హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, అమలా పాల్, కేఆర్ గోకుల్, అరబ్ ఫేమస్ యాక్టర్స్ తాలిబ్ అల్ బలూషి, రిక్ ఆబే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 90వ దశకంలో జీవనోపాధి వెతుక్కుంటూ కేరళను వదిలి సౌదీ అరేబియాకు వలస వెళ్లిన నజీబ్ అనే యువకుడి జీవిత కథ ఆధారంగా వాస్తవ ఘటనలతో ఈ సినిమా రూపొందుతోంది. గొర్రెల కాపరి నజీబ్ పాత్రలో నటిస్తున్నారు పృథ్వీరాజ్. గుబురు గడ్డం,పొడవైన జుట్టుతో నలుపు రంగులో ఉన్న పృథ్వీరాజ్ లుక్ ఇటీవల విడుదలైంది. ఈ పాత్ర కోసం ఆయన బరువు తగ్గారు. పూర్తి స్థాయిలో ఎడారిలో రూపొందుతున్న తొలి భారతీయ సినిమా మాదేనంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఏప్రిల్ 10న విడుదల కానుంది. ∙హ్యాండ్సమ్గా, పక్కింటి కుర్రాడిలా కనిపించే నాగచైతన్య ‘తండేల్’ సినిమా కోసం పక్కా మాస్ అవతారంలోకి మారిపోయారు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం మత్య్సకారుల జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మత్స్యకారుని పాత్రలో నటిస్తున్నారు నాగచైతన్య. 2018లో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్’ అంటూ ‘మిర్చి’ సినిమాలో ప్రభాస్ ఓ డైలాగ్ చెబుతారు. నిజమే.. ఆయన కటౌట్ చూస్తే అలానే అనిపిస్తుంది. ‘బాహుబలి’ సినిమా నుంచి వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారాయన. ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘సలార్: పార్ట్ 1– సీజ్ఫైర్’ డిసెంబరు 22న విడుదలై హిట్‌గా నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ అంతా బ్లాక్‌గా ఉంటుంది. బొగ్గు గనుల్లో మెకానిక్ దేవ పాత్రలో ప్రభాస్ లుక్ కూడా బ్లాక్ షేడ్‌లో ఉంటుంది. రెండో భాగంలోనూ ప్రభాస్ ట్యాన్ లుక్‌లో కనిపిస్తారని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.. ప్రయోగాలు చేసే హీరోల్లో సూర్య ఒకరు. కమల్‌హాసన్ గత బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’ (2022)లో రోలెక్స్ పాత్రలో ట్యాన్ లుక్‌లో కనిపించారు సూర్య. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా క్లైమాక్స్‌లో ఈ పాత్ర వస్తుంది. రెండో భాగంలోనూ ఉంటుంది. సెకండ్ పార్ట్ చిత్రీకరణ ఇంకా ఆరంభం కాలేదు. అలాగే విడుదలకు సిద్ధమవుతున్న ‘కంగువా’ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో హీరో సూర్య ట్యాన్ లుక్‌లో కనిపిస్తారు. -
బొగ్గు ఉత్పత్తి పెంపునకు కృషి
న్యూఢిల్లీ: పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. 2070 నాటికి 50 శాతం విద్యుత్‌ను పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల విడుదల స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. ఎనిమిదో విడత వాణిజ్య స్థాయిలో బొగ్గు బ్లాకుల వేలాన్ని మంత్రి బుధవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ‘‘ఇంతకుముందెన్నడూ లేని స్థాయిలో విద్యుత్ వినియోగం నమోదవుతోంది. గరిష్ట విద్యుత్ డిమాండ్ ఇప్పటికే 240 గిగావాట్లకు చేరుకుంది. 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందన్న అంచనా ఉంది. ఇంధన వనరుల్లో బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి తగ్గొచ్చు. కానీ, మొత్తం మీద బొగ్గు విద్యుదుత్పత్తి ప్రస్తుత స్థాయి నుంచి పెరుగుతుంది’’అని వివరించారు. బొగ్గు మైనింగ్‌లో సుస్థిరతాభివృద్ధి సూత్రాలను అమలు చేయడంతోపాటు సంయుక్త కృషి ద్వారా పెరుగుతున్న డిమాండ్‌ను చేరుకోగలమన్నారు. 3 లక్షల మందికి ఉపాధి ప్రస్తుతం వేలం వేస్తున్న బొగ్గు గనులకు సంబంధించి రూ.33,000 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రకటించారు. ‘‘వాణిజ్య బొగ్గు మైనింగ్ ఎనిమిదో విడత వేలాన్ని ప్రారంభిస్తున్న నేడు ప్రత్యేకమైన రోజు. మొత్తం 39 బొగ్గు గనులను వేలానికి ఉంచాం. ఎందుకు ప్రత్యేకమైన రోజు అంటే నేడు గిరిజనుల గౌరవ దినోత్సవం’’అని మంత్రి ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. బొగ్గు రంగానికి, గిరిజనులకు లోతైన అనుబంధం ఉందన్నారు. వేలంలో ఉంచిన బొగ్గు గనుల్లో ఉత్పత్తి మొదలైతే గిరిజనులే ఎక్కువగా ప్రయోజనం పొందుతారని చెప్పారు. ఇప్పటి వరకు ఏడు విడతల వేలంలో మొత్తం 91 బొగ్గు గనులను వేలం వేసినట్టు గుర్తు చేశారు. -
బొగ్గు బ్లాకులను ఎవరూ వాపసు చేయలేదు..
న్యూఢిల్లీ: అనుమతుల్లో జాప్యం కారణంగా వాణిజ్య, క్యాప్టివ్ బొగ్గు గనులను కొన్ని సంస్థలు వాపసు చేస్తున్నాయన్న వార్తలను కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా ఖండించారు. బొగ్గు బ్లాకులను పొందిన సంస్థలేవీ తిరిగి ఇచ్చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఆయా బ్లాకుల్లో పనులు ప్రణాళికకు అనుగుణంగానే సాగుతున్నాయని, తదనుగుణంగా ఉత్పత్తి కూడా ఉంటుందని పేర్కొన్నారు. పలు పనులు చేపట్టాల్సి ఉంటుంది కాబట్టి సాధారణంగా బొగ్గు గని అందుబాటులోకి రావడానికి సుమారు 51 నెలలు పడుతుందని మీనా చెప్పారు. వేలంలో గనులు దక్కించుకున్న సంస్థలకు సత్వరం క్లియరెన్సులను ఇచ్చేందుకు రాష్ట్రాల ప్రభుత్వాలు, కేంద్ర పర్యావరణ శాఖతో బొగ్గు శాఖ కలిసి పని చేస్తోందని ఆయన వివరించారు. ప్రస్తుతం దేశీయంగా బొగ్గు ఉత్పత్తిలో.. కమర్షియల్, క్యాప్టివ్ (సంస్థలు తమ సొంత అవసరాలకు వినియోగించుకునేందుకు తీసుకునే గనులు) గనుల వాటా 14 శాతంగా ఉంటోందని చెప్పారు. 152 వాణిజ్య, క్యాప్టివ్ గనులు ఉండగా.. ప్రస్తుతం 51 గనుల్లో ఉత్పత్తి జరుగుతోందన్నారు. తదుపరి విడత కింద నవంబర్ 15కి కాస్త అటూ ఇటూగా మరో 40 కొత్త బ్లాకులను వేలం వేయనున్నట్లు మీనా పేర్కొన్నారు. అటు కోల్ ఇండియా రెండు అనుబంధ సంస్థల (బీసీసీఎల్, సీఎంపీడీఐ) లిస్టింగ్‌పై ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని మీనా చెప్పారు. కోల్ ఇండియా పనితీరు బాగుందని, గత ఏడాది వ్యవధిలో కంపెనీ మార్కెట్ క్యాప్ 26 శాతం పెరిగిందని వివరించారు. బీసీసీఎల్, సీఎంపీడీఐలను ఒకదాని తర్వాత ఒకటిగా లిస్టింగ్ చేయనున్నట్లు ఆగస్టులో షేర్‌హోల్డర్ల వార్షిక సమావేశంలో కంపెనీ ప్రకటించింది. -
బొగ్గు దిగుమతుల బిల్లు రూ.3.85 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: భారత్ గత ఏడాది బొగ్గు దిగుమతులపై రూ.3.85 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో దేశం మొత్తం బొగ్గు వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం నుండి 21 శాతానికి తగ్గింది. అయితే భారతదేశం ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల (ఎంటీ) కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశం నుంచి భారీ విదేశీ మారకపు ద్రవ్య ప్రవాహానికి దారితీస్తోంది. అడవుల సంరక్షణకు పెద్దపీట: బొగ్గు మంత్రిత్వశాఖ ఇదిలా ఉండగా, అడవులను సంరక్షించే అంశానికి పెద్ద పీట వేస్తున్నట్లు బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచనలను పట్టించుకోకుండా బొగ్గు గనులను వేటినీ వేలం వేయలేదని కూడా స్పష్టం చేసింది. ఉదాహరణకు, లెమ్రు ఎలిఫెంట్ కారిడార్ పరిధిలోకి వచ్చే బొగ్గు గనులను డి–నోటిఫై చేయాలన్న ఛత్తీస్‌గఢ్ విజ్ఞప్తిని అంగీకరించినట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు లెమ్రు ఎలిఫెంట్ కారిడార్‌కు ఆవల ఉన్న ప్రాంతాలను కూడా మినహాయింపు కోసం పరిశీలించినట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో 10 శాతం నిల్వలు ఉన్న 40కి పైగా కొత్త బొగ్గు బ్లాకులను బొగ్గు తవ్వకాల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. దట్టమైన హాస్డియో–అరాండ్ బొగ్గు క్షేత్రం పరిధిలోని తొమ్మిది బొగ్గు గనులను కూడా బొగ్గు బ్లాకుల తదుపరి రౌండ్ వేలం నుంచి దూరంగా ఉంచిన్నట్లు తెలిపింది. అదేవిధంగా, తదుపరి వేలం ప్రక్రియ నుండి మూడు లిగ్నైట్ గనులను మినహాయించాలన్న తమిళనాడు అభ్యర్థన కూడా అంగీకరించినట్లు పేర్కొంది. ‘‘బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు... అటవీ ప్రాంతాలను వేలంలో పెట్టాలని పరిశ్రమ డిమాండ్లు ఉన్నప్పటికీ వాటిని రక్షించడం మా బాధ్యత అని మంత్రిత్వశాఖ స్పష్టంగా సూచిస్తోంది’’అని మంత్రిత్వ శాఖ తెలిపింది. -
దీపావళి బోనస్ రూ.85 వేలు
సింగరేణి(కొత్తగూడెం): బొగ్గు గని కార్మికులకు ప్రొడక్షన్ లింక్ రివార్డ్ (పీఎల్ఆర్) దీపావళి బోనస్‌ను కోల్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. కోల్ ఇండియా పరిధిలోని సుమారు 3.50 లక్షల మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలో కార్మిక సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఒక్కో కార్మికుడికి రూ.85 వేల చొప్పున చెల్లించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. గతేడాది దీపావళి బోనస్ రూ.76,500 చెల్లించగా, ఈ సంవత్సరం రూ.1.20 లక్షలు ఇవ్వాలని కార్మిక సంఘాలు పట్టుబట్టాయి. చివరకు గతేడాది కంటే రూ.8,500 పెంచి రూ.85 వేల చొప్పున చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఈ పీఎల్ఆర్ బోనస్‌ను సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళికి వారం, పది రోజుల ముందు చెల్లిస్తుండగా, ఇతర ప్రాంతాలవారికి దసరా ముందు చెల్లిస్తున్నారు. -
చైనా బొగ్గు గనిలో అగ్నిప్రమాదం.. 16 మంది మృతి
బీజింగ్: దక్షిణ చైనాలోని పాంఝౌ నగరం గుయిజౌ ప్రావిన్స్‌లోని బొగ్గుగనిలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గని యజమాని గుయిజౌ పంజియాంగ్ షాంఘై స్టాక్ ఎక్స్చేంజ్కు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదంలో కనీసం 16 మంది కార్మికులు మరణించారన్నారు. పాంఝౌ నగర భద్రతాధికారుల ప్రాధమిక దర్యాప్తులో గుయిజో బొగ్గుగనిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని ఎంత ప్రయత్నించినా అదుపు కాలేదని చాలాసేపు ప్రయత్నించగా చివరకు ఎలాగో మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. కన్వేయర్ బెల్టుకు మంటలు అంటుకోవడం వల్లనే అగ్నిప్రమాదం జరిగిందని అక్కడున్నవారిలో కొందరు సురక్షితంగా బయటపడినా 16 మంది మాత్రం మంటల్లో చిక్కుకుని మరణించారని తెలిపారు. పంజియాంగ్ కంపెనీకి మొత్తం 7 బొగ్గు గనులని నిర్వహిస్తోందని మొత్తంగా 17.3 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుందని అన్నారు. అగ్నిప్రమాదం తర్వాత షాంఘైలోని కమొడిటీస్ కన్సల్టెన్సీ మిస్టీల్ ఒకరోజు పాటు పాంఝౌ నగరంలోని అన్ని బొగ్గు గనుల్లోనూ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. గుయిజౌకు చెందిన బొగ్గుగని భద్రతా విభాగం సంఘటన గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని తెలిపింది. మిస్టీల్ తెలిపిన వివరాలు ప్రకారం ప్రమాదం జరిగిన బొగ్గు గనిలో ఒక ఏడాదికి 52.5 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుందని ఇది చైనా మొత్తం బొగ్గు ఉత్పత్తిలో ఐదు శాతం అని తెలిపింది. ఇది కూడా చదవండి: ఖలిస్తానీ ఉగ్రవాదుల ఓసీఐ కార్డులు రద్దు? -
బొగ్గు గనుల వేలం అడ్డుకుంటాం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనులను వేలం పాట ద్వారా ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు కట్టబెట్టే చర్యలను గట్టిగా ఎదుర్కొంటున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఉన్నంత వరకు, అక్కడి గనులు సింగరేణికే దక్కేలా చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్పారు. శనివారం శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు భట్టి విక్రమార్క, దివాకరరావు, శ్రీధర్‌బాబు, బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలోనే ఇలా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం మొదలైందన్నారు. ఇటీవల ప్రస్తుత ప్రభుత్వం సవరణతో ముందుకొచ్చినా.. బహిరంగ వేలం అంశానికే ప్రాధాన్యమిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ గనులను స్థానిక ప్రభుత్వానికి అప్పగించే వెసులుబాటు చట్ట సవరణలో ఉన్నా దాన్ని పట్టించుకోవటం లేదన్నారు. ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకురాగా, సింగరేణి కూడా బహిరంగ వేలంలో పాల్గొని దక్కించుకోవచ్చని పేర్కొందన్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదని, ఎట్టి పరిస్థితుల్లో సింగరేణికి నష్టం జరిగే ఎలాంటి ప్రయత్నాన్ని జరగనీయమని మంత్రి తెలిపారు. ఇంకో 20 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, అప్పటి వరకు సింగరేణికి నష్టం జరగనీయమని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. తలసరి ఆదాయంలో మూడో స్థానం.. తలసరి ఆదాయం జాబితాలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెలిపారు. మన కంటే ముందు సిక్కిం, గోవాలాంటి చిన్న రాష్ట్రాలే ఉన్నందున తెలంగాణ అగ్రభాగంలో ఉన్నట్టుగానే భావించొచ్చన్నారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రాల జాబితాలో కింది నుంచి ఐదో స్థానంలో ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సబ్సిడీ విస్తీర్ణ పరిమితి పెంచే యోచన.. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, సబ్సిడీ పరిమితిని పన్నెండున్నర ఎకరాల నుంచి మరింత ఎక్కువ పరిధికి పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కేంద్రం అంగీకరించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా దాన్ని అమలు చేసే దిశగా యోచిస్తున్నట్టు శాసనసభ దృష్టికి తెచ్చారు. వాయిదా తీర్మానాల తిరస్కరణ.. సభలో పలువురు సభ్యులు అడిగిన వాయిదా తీర్మానాలను స్పీకర్ పోచారం తిరస్కరించారు. -
‘విచారణ పేరుతో జాప్యం సరికాదు’
శ్రీరాంపూర్(మంచిర్యాల): విచారణ పేరుతో సింగరేణి యజమాన్యం జాప్యం చేయడం సరికాదని కోల్‌మైన్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఎంవోఏఐ) ప్రతినిధులు పేర్కొన్నారు. మంగళవారం శ్రీరాంపూర్‌లోని ఇల్లందు క్లబ్లో బెల్లంపల్లి, రామగుండం రీజియన్ల పరిధిలోని ప్రతినిధుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. తమ సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సీఎంవోఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదిర్ మాట్లాడుతూ శ్రీరాంపూర్ ఓసీపీలో ఎలాంటి సంబంధం లేని 32 మంది అధికారులకు చార్జిషీట్లు ఇచ్చి ఎలాంటి చర్యలు లేకుండా నాలుగేళ్లుగా ఎంక్వయిరీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్నారు. దీంతో ఎలాంటి తప్పుచేయని అధికారులు తప్పుడు చార్జిషీట్ల కారణంగా శిక్ష అనుభవిస్తున్నారన్నారు. వెంటనే దీనిపై యజమాన్యం స్పందించి చార్జ్షీట్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏరియా జీఎం సంజీవరెడ్డికి దృష్టికి సమస్యలు తీసుకెళ్లగా ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో ఏరియా జీఎంలు చింతల శ్రీనివాస్(ఆర్జీ 1), మనోహర్(ఆర్జీ 2), అపెక్స్ కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు ఏవీ రెడ్డి, నాయకులు చిలక శ్రీనివాస్, జాయింట్ సెక్రెటరీ చంద్రమౌళి రమేశ్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. -
అలవెన్స్ చర్చలు సఫలం
గోదావరిఖని(రామగుండం): దేశవ్యాప్త బొగ్గు గని కార్మి కుల 11వ వేతన ఒప్పందం 10వ సమావేశం శుక్రవారం కోల్‌కతాలో జరిగింది. యాజమాన్యం జరిపిన చర్చలో అన్ని అలవెన్స్‌లపై 25శాతం పెంచేందుకు అంగీకారం కుదిరినట్లు జాతీయ కార్మి క సంఘాల నాయకులు తెలిపారు. అండర్ గ్రౌండ్ అలవెన్స్ 9 నుంచి 11.25 శాతం, స్పెషల్ అలవెన్స్ 4 నుంచి 5 శాతం, హెచ్ఆర్ఏ 2 నుంచి 2.5, ఎల్టీసీ రూ.8వేల నుంచి రూ.10వేలు, ఎల్ఎల్టీసీ రూ.12 వేల నుంచి రూ.15వేలు పెంచడానికి అంగీకారం కుదిరింది. సెలవులు, సిక్ లీవ్‌లు 120 నుంచి 150 అక్యుములేషన్ చేసుకోవడానికి, అంబేద్కర్ జయంతిని పెయిడ్ హాలిడేగా అంగీకరించారు. లైవ్ రోస్టర్‌లో ఉన్న అమ్మాయిలకు 18ఏళ్లు వచ్చే వరకు డిపెండెంట్ జాబ్ అవకాశం కల్పించనున్నారు. నైట్ షిఫ్ట్ అలవెన్స్ మస్టర్‌కు రూ.50 చెల్లించనున్నారు. నర్సింగ్ అలవెన్స్ నెలకు రూ.500 ఇవ్వనున్నారు. కార్మి కుడు..కార్మి కుని భార్య చనిపోయి పిల్లలు అనాథలైతే వారికి సగం జీతం, 18ఏళ్లు దాటితే ఉద్యోగం కల్పిస్తారు. గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం 19శాతం మినిమం గ్యారెంటెడ్ బెనిఫిట్, 3శాతం ఇంక్రిమెంట్‌తోపాటు ఒప్పుకున్న డిమాండ్లను శనివారం డ్రాఫ్ట్ రూపంలో పొందుపరుస్తారు. సమావేశాన్ని శనివారం కూడా కొనసాగించనున్నారు. సమావేశంలో కోలిండియా చైర్మన్ ప్రమోద్ అగర్వాల్, సింగరేణి డైరెక్టర్(పా) బలరాం, పర్సనల్ జీఎం కుమార్‌రెడ్డి, జేబీసీసీఐ వేజ్‌బోర్డు మెంబర్లు ఏఐటీయూసీ నుంచి వాసిరెడ్డి సీతారామయ్య, ఐఎన్టీయూసీ నుంచి జనక్‌ప్రసాద్ పాల్గొన్నారు. -
సింగరేణి ప్రైవేటీకరణపై ఉత్తర తెలంగాణలో జంగ్ సైరన్
సాక్షి, పెద్దపల్లి: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో కోల్ట్‌బెల్ట్ ప్రాంతంలో మహాధర్నాకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది. సింగరేణి బొగ్గుగనుల వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా కోల్‌బెల్టు ప్రాంతాల్లో ‘మహా ధర్నాలతో’ జంగ్ సైరన్ మోగించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బొగ్గు గనులకు నిలయమైన గోదావరిఖనిలో సింగరేణి కార్మికులు, కార్మికసంఘాల నేతలు, మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, పార్టీ శ్రేణులతో మహాధర్నా నిర్వహించనున్నారు. జెడ్పీ చైర్మన్ పుట్టమధు భూపాలపల్లి జిల్లాలో నిర్వహించే మహాధర్నాలో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం చెప్పేలా మహాధర్నా విజయవంతం చేసేందుకు శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. కోల్‌బెల్టు నేతలకు సీఎం ఫోన్..! సింగరేణి సమస్య కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, తెలంగాణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే బొగ్గు గనుల వేలంకు కేంద్రం యత్నిస్తుందని ఇప్పటికే బీఆర్ఎస్ అధిష్టానం పోరుబాటను ఎంచుకుంది. దీనిలో భాగంగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మహాధర్నాకు సంబంధించి కేటీఆర్ సింగరేణి పరిధిలోని పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో మాట్లాడగా, పార్టీ నిరసన కార్యక్రమాలపై సీఎంవో కార్యాలయం నుంచి సీఎం కేసీఆర్ ఫోన్లో దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. దీంతో గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కొరుకంటి చందర్ బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమై మార్గనిర్దేశం చేశారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించే మహాధర్నాకు కార్మికులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. -
సింగరేణి ప్రైవేటీకరణపై బీఆర్ఎస్ యుద్ధభేరి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 8న ‘మహాధర్నా’నిర్వహించాలని అధికార బీఆర్ఎస్ నిర్ణయించింది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం, కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రాల్లో ఈ మహధర్నాలు నిర్వహించనుంది. ప్రధాని మోదీ ఈ నెల 8న హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులతో కలసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు పిలుపునిచ్చారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమంటూ గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడంపై నిరసన తెలుపుతూ ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకే మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహాధర్నాకు సంబంధించి సింగరేణి పరిధిలోని జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో గురువారం కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండంలో ప్రకటించిన ప్రధాని మోదీ మాట తప్పారు. వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని అటు కార్మికులు, ఇటు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కోరినా పట్టించుకోవట్లేదు. తాజాగా సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోమారు నోటిఫికేషన్ ఇచ్చింది. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియ నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ కుట్రలపై జంగ్ సైరన్ ‘తెలంగాణను దెబ్బకొట్టాలనే దురుద్దేశంతో కేంద్రం చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని సీఎం కేసీఆర్ గతంలో కేంద్రానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కూడా గనులు కేటాయించకుండా కేంద్రం దివాలా తీయించింది. అదే విషప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తే అడ్డుకొని తీరుతాం. గుజరాత్ ఖానిజాభివృద్ధి సంస్థకు నామినేషన్ పద్ధతిలో లిగ్నైట్ గనులను కేటాయించిన రీతిలోనే సింగరేణికి గనులు కేటాయించాలి. సింగరేణి సంక్షోభంలోకి వెళ్తే దక్షిణాది థర్మల్ విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుంది. సింగరేణి ప్రైవేటీకరణ కేవలం 6 జిల్లాల సమస్య కాదు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే జరుగుతోంది. సింగరేణి ప్రైవేటీకరణతో తెలంగాణలో అంధకారంతోపాటు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు. వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల బోనస్‌లు, అలవెన్సులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దవుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జంగ్ సైరన్ పూరించాం’అని కేటీఆర్ తెలిపారు. 10న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మికులతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు భేటీ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపైనా పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. స్టీల్ ప్లాంటును కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందంటూ ఈ నెల 2న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఈ నెల 10న వైజాగ్ స్టీల్‌ప్లాంట్ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
అమ్మకానికి బొగ్గు గనులు.. మరి సింగరేణి పరిస్థితి ఏంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: కేంద్ర బొగ్గు, గనుల శాఖ సింగరేణి పరిధిలోని గనులను మరోసారి అమ్మకానికి పెట్టింది. బుధవారం బొగ్గు మంత్రిత్వ శాఖ అధికారికంగా ఏడో రౌండ్‌కు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి దేశంలోని తెలంగాణతో సహా మరో 8 రాష్ట్రాల్లో ఉన్న 106 బొగ్గు బ్లాకులను వేలం వేయనుంది. ఇందులో సింగరేణికి చెందిన కొత్తగూడెం ఏరియాలోని పెనగడప, మందమర్రి ఏరియాలోని శ్రావణపల్లి బ్లాక్ ఉన్నాయి. గతంలో ఈ బ్లాక్‌ను వేలంలో చేర్చగా పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పటివరకు అన్ని రౌండ్లలోనూ సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనకుండా దూరంగా ఉంటూ వస్తోంది. తాజా రౌండ్లో పాల్గొంటుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది. -
వందల ఏళ్లుగా భూగర్భంలో ‘సేఫ్టీ ల్యాంప్’.. అసలు దీని కథేంటి?
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: భూగర్భంలో పనిచేసే గని కార్మికులకు ప్రాణదీపంగా వందల ఏళ్ల నుంచి సేప్టీల్యాంప్ రక్షణ వెలుగులను పంచుతోంది. బొగ్గు గనుల్లో కాలక్రమేణా అనేక ఆధునిక యంత్రాలు, పరికరాలు అందుబాటులోకి వచ్చినా ఈ బత్తిదీపం ప్రాధాన్యత నేటికీ తగ్గడం లేదు. ఈ దీపం ఆవిష్కరణకు ముందు పలువురు భూగర్భంలోనే విషవాయువులు పీల్చి మృత్యువాత పడ్డారు. ఈ దీపం రాకతో గనుల్లో రక్షణ ప్రమాణాలు మెరుగయ్యాయని సింగరేణి అధికారులు చెబుతున్నారు. బొగ్గు గాలితో నిత్యం ఆక్సిడేషన్ జరిపి స్వయంగా నిప్పు రాజేస్తుంది. అలా బొగ్గు మండినప్పుడు మీథేన్, కార్బన్ మోనాక్సైడ్, ఇతర విషవాయువులు వెలువడుతాయి. ఆ సమయంలో కార్మి కులు పనిచేస్తే శ్వాస సమస్య ఏర్పడి నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతారు. అలాంటి ప్రమాద పరిస్థితులను ముందే గుర్తించేందుకు పూర్వం కెనరీ పక్షులను పంజరాల్లో భూగర్భంలోకి తీసుకెళ్లేవారు. పక్షిరెక్కలు కొట్టుకోవడం, కదలికల ఆధారంగా వాయువులను గుర్తించేవారు. ప్రతిసారీ పక్షులను బంధించి గనిలోకి తీసుకెళ్లడం, రావడంతో అవి అస్వస్థతకు గురై అనారోగ్యంతో చనిపోయేవి. బ్రిటన్ కు చెందిన హంప్రి డేవీ 1815లో బొగ్గు గనుల్లో రక్షణ కోసం సేఫ్టీ ల్యాంప్‌ను కనుగొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా బొగ్గు గనుల్లో విషవాయువులను గుర్తించడంలో సమర్థంగా పనిచేయడంతో ఈ ల్యాంప్ ప్రామాణికంగా మారింది. ఎలా పని చేస్తుందంటే.. ‘వైర్ గాజేస్’సూత్రంతో పనిచేసే ఈ సేప్టీ ల్యాంప్ 2.5 కిలోల బరువు, 10 సెం.మీ. పొడవు ఉంటుంది. మంట వెలిగేందుకు కిరోసిన్/పెట్రోల్‌ను వాడతారు. ఇది బానేట్, ఇనుప జాలీలు, వాషర్, గ్లాసు, చెక్నట్, నూనె బుడ్డితో నిర్మితమై ఉంటుంది. ఈ ల్యాంప్‌ను గనిలోకి ఓవర్‌మెన్, మైనింగ్ సర్దార్లు తీసుకెళ్లి బొగ్గు తీసే ముందు అక్కడి వాయువుల శాతాన్ని పరీక్షిస్తారు. మీ«థేన్, ఆక్సిజన్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల శాతాన్ని తెలుసుకుంటారు. పనిచేసేందుకు అనువుగా ఉంటే ఉత్పత్తి మొదలుపెడతారు. మొదట గనుల్లోకి సాధారణ స్థాయిలో మంట వెలుగుతూ ఉంటుంది. వెలుగుతున్న దీపాన్ని వాయువులు తాకగానే మంటలో మార్పు మొదలవుతుంది. ఉదాహరణకు మీథేన్ ఒక శాతం ఉంటే 0.10 అంగుళాల ఎత్తుతో మంట పక్కవైపులకు వెలుగుతూ కనిపిస్తుంది. 1.5 శాతం ఉంటే 0.15 ఇంచు ఎత్తులో మంట టోపీ ఆకారంలో కనిపిస్తుంది. ఇలా ఎరుపు, నీలిరంగు మంటల కదలికలు, కనిపించే ఆకారాలను బట్టి అక్కడ మీథేన్ గ్యాస్ ఏ మోతాదులో ఉందో గుర్తిస్తారు. ఒకవేళ ఆక్సిజన్ అందకపోతే మంట ఆరిపోతుంది. ఇలా ఆ వాతావరణంలో పైన, కింద, వివిధ ఎత్తుల్లో దీపంతో పరిశీలిస్తారు. ప్రస్తుతం గనుల్లో 1.25 శాతం మీథేన్ ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే కార్మి కులను అలర్ట్ చేసి బయటకు పంపుతున్నారు. సింగరేణివ్యాప్తంగా జీఎల్–50, జీఎల్–60 రకం ల్యాంప్‌లను వాడుతున్నారు. జీఎల్–60లో ఒకవేళ మంట ఆరిపోతే తనంతట తానే వెలుగించుకొనే సాంకేతికత ఉంది. వాయువులను గుర్తించేందుకు డిజిటల్ పరికరాలైన మీౖథెనోమీటర్, ఆక్సీమీటర్, మల్టీడిటెక్టర్ వంటివి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఒక్కోసారి ఈ పరికరాలు భూగర్భంలో సాంకేతిక సమస్యలతో పని చేయకపోవచ్చు. కానీ సేఫ్టీ ల్యాంప్ మాత్రం 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తోంది. దీంతో నేటికీ ఈ దీపం వాడకాన్ని కొనసాగిస్తున్నారు. ఇందుకోసం అధికారులు, కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ల్యాంప్ నిర్వహణ, మరమ్మతులకు ఓ ఇన్చార్జి ఉంటారు. రక్షణలో ఇప్పటికీ ఇదే కీలకం.. బొగ్గుగనుల్లో రక్షణ విషయంలో సేఫ్టీల్యాంప్ కీలకంగా పనిచేస్తోంది. ప్రాణనష్టం జరగకుండా విషవాయువులను గుర్తించేందుకు బాగా ఉపయోగపడుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా పలు డిజిటల్ పరికాలు వచ్చినా, సేఫ్టీల్యాంప్ వాడకం మాత్రం కొనసాగుతోంది. –సీహెచ్.సమ్మయ్య, హెడ్ ఓవర్‌మెన్, వీటీసీ, శిక్షకుడు ఇలా మంటలో మార్పుని బట్టి గ్యాస్ మోతాదును గుర్తిస్తారు. సింగరేణిలో ఒక్కో భూగర్భ గనిలో సగటున 12 నుంచి 14 వరకు దీపాలు అవసరమవుతాయి. -
బొగ్గు గనుల్లో డ్రోన్ వినియోగం
న్యూఢిల్లీ: బొగ్గు ఉత్పత్తిలో ఉన్న కోల్ ఇండియా అనుబంధ కంపెనీ మహానది కోల్‌ఫీల్డ్స్ డ్రోన్ టెక్నాలజీని వినియోగిస్తోంది. పర్యావరణ పర్యవేక్షణ, నిల్వల స్థాయి తెలుసుకోవడానికి, గనుల చిత్రీకరణకు డ్రోన్‌ను ఉపయోగిస్తున్నట్టు కోల్ ఇండియా తెలిపింది. ఇందుకోసం విహంగం పేరుతో బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. అధీకృత వ్యక్తులు ఈ పోర్టల్ ద్వారా ఎక్కడి నుంచైనా డ్రోన్‌ను ఆపరేట్ చేయవచ్చు. ఒడిషాలోని తాల్చేర్ బొగ్గు గనుల్లో భువనేశ్వరి, లింగరాజ్ ఓపెన్‌కాస్ట్ మైన్స్‌లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో మహానది కోల్‌ఫీల్డ్స్ వాటా 20 శాతంపైమాటే. చదవండి: Google Layoffs: రోడ్డెక్కిన అమెరికాలోని గూగుల్ ఉద్యోగులు.. -
ఆర్టీసీ ‘సింగరేణి దర్శన్’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ, సింగరేణి కార్పొరేషన్లు సంయుక్తంగా చేపట్టిన ‘సింగరేణి దర్శన్’ప్రారంభమైంది. గనుల్లో బొగ్గును తీయడం నుంచి బొగ్గుతో విద్యుత్తును ఉత్పత్తి చేసే వరకు అన్ని ప్రక్రియలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పించటమే దీని ఉద్దేశం. ప్రతి శనివారం సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ప్రారంభమయ్యే ప్రత్యేక బస్సును మంగళవారం బస్‌భవన్‌లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ జెండా ఊపి ప్రారంభించారు. సింగరేణి దర్శన్ యాత్ర కు వెళ్లాలనుకునేవారు వారం ముందుగా సీట్లు రిజర్వ్ చేసుకోవాలని బాజిరెడ్డి చెప్పారు. రానున్న రోజుల్లో కాళేశ్వరం ఆలయంతోపాటు కాళేశ్వరం బ్యారేజీని తిలకించేందుకు మరో ప్యాకేజీ టూర్‌ను కూడా రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. సింగరేణి దర్శన్ యాత్రకు వెళ్లాలనుకునేవారు రూ.1600 చార్జి చెల్లించాల్సి ఉంటుందని సజ్జనార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, వెంకటేశ్వర్లు, పురుషోత్తం, యాదగిరి, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
నాలుగో రౌండ్లో 8 బొగ్గు గనులే వేలం!
న్యూఢిల్లీ: నాలుగో రౌండ్ వేలంలో 99 బొగ్గు గనులను వేలంలో ఉంచగా, కేవలం ఎనిమిది బ్లాకులను మాత్రమే విజయవంతంగా వేలం వేసినట్లు బుధవారం ఆ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్‌సభకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ గనులు ఉన్నాయని తెలిపారు. కాగా, వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వశాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ లోక్‌సభకు ఒక లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ, 2019 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు దేశవ్యాప్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించినట్లు అనుమానిస్తున్న 281 కేసులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు స్వీకరించినట్లు తెలిపారు. చదవండి: యూజర్లకు భారీ షాక్, మోత మొదలైంది..మళ్లీ పెరగనున్న ఫోన్ బిల్! -
సింగరేణి ప్రైవేటీకరణ అవాస్తవం..
సాక్షి.హైదరాబాద్: సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణ పూర్తిగా అవాస్తవమని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. బొగ్గు గనుల వేలంపై ప్రజలను తప్పుదారి పట్టించేందుకు కల్వకుంట్ల కుటుంబం అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణ వద్దంటున్న రాష్ట్ర సర్కారు.. జెన్కోకు కేటాయించిన తాడిచర్ల గనిని ఏఎంఆర్‌కు ఎందుకు కేటాయించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ నేతలు వివేక్ వెంకటస్వామి, కాసం వెంకటేశ్వర్లు, డా.ఎస్.ప్రకాష్‌రెడ్డిలతో కలిసి కిషన్‌రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. సింగరేణిని కల్వకుంట్ల అధికారిక ప్రైవేట్ కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మల్టీ స్పెషల్ హాస్పిటల్స్ ఏర్పాటు, కార్మి కుల బిడ్డలకు ఉద్యోగాలు, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్ వంటి హామీల అమలును గాలికి వదిలేసిందన్నారు. రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి అభద్రతా భావంతో కేంద్రాన్ని, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కిషన్‌రెడ్ది ధ్వజమెత్తారు. ‘గుజరాత్‌కు ఒక నీతి.. మాకో నీతా’అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారని, ‘మీ సిద్దిపేటకు ఒక నీతి, దుబ్బాకకు ఒక నీతా? సిరిసిల్లకు ఒకనీతి, కల్వకుర్తికి ఒక నీతా? గజ్వేల్‌కు ఒక నీతి, హుజూరాబాద్‌కు ఒక నీతా?’అని ప్రశ్నించారు. బొగ్గు కొరతతో పాటు విద్యుత్ కోతలను అధిగమించేందుకు బొగ్గుగనులను ప్రైవేటు లేదా పబ్లిక్ సెక్టార్‌కు బహిరంగ వేలంలోనే కేంద్రం కేటాయిస్తోందని తెలిపారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... ‘2015లో తెలంగాణకు మూడు కోల్ బ్లాకులను కేటాయిస్తే.. అందులో పెలగడప్ప, న్యూ పట్రపార కోల్బ్లాకును సింగరేణి సంస్థనే వెనక్కి ఇచ్చేసింది. నైని గనిలో తవ్వకాల అనుమతులకు కేంద్రం సాయం చేసింది. తాడిచర్ల బ్లాక్ 1ను సింగరేణి, జెన్కోలకు ఇస్తే.. సింగరేణితో తప్పుడు రిపోర్టులిచ్చి, ఆ బ్లాక్‌ను ఏఎంఆర్ ప్రైవేటు కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వమే కట్టబెట్టింది. అందులోని ఒక కంపెనీలో కల్వకుంట్ల కుటుంబానికి షేర్ ఉంది. దీనిపై విచారణ జరగాలి’అని డిమాండ్ చేశారు. -
బొగ్గు కొరత రానివ్వొద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఇంధన, గనులు, ఖనిజాభివృద్ధి శాఖల అధికారులతో మంగళవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్కేంద్రాలకు దేశీయంగా లభిస్తున్న బొగ్గుతో పాటు విదేశాల నుంచి కూడా దిగుమతులు చేసుకుంటున్నామన్నారు. ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) వంటి ప్రభుత్వరంగ సంస్థలు బొగ్గు రంగంలోకి ప్రవేశించిన నేపథ్యంలో దేశీయంగా లభించే బొగ్గును మన రాష్ట్రంలోని థర్మల్ కేంద్రాలు వినియోగించుకునేందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని మంత్రి ఆదేశించారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనుల నిర్వహణకు ఏపీఎండీసీ సిద్ధంగా ఉందని, ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో సుల్యారీ గనిని నిర్వహిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల్లో మరికొన్ని గనులను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గును అందించేందుకు ఉన్న అన్ని మార్గాలను పరిశీలించాలని.. ఇందుకు ఇంధన, గనుల శాఖాధికారులు సమన్వయం చేసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ఇంధన శాఖ పునర్వ్యవస్థీకరణ ఇక ఇంధన శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేయడంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ట్రాన్స్‌కో, జెన్కో, డిస్కంల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్రంలో పెరిగిన జిల్లాలకు అనుగుణంగా ఇంధన శాఖను కూడా పునర్వ్యవస్థీకరించాలని ఆయన సూచించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులకు వ్యవసాయ కనెక్షన్లను ఇవ్వడంలో జాప్యం చేయకూడదని సీఎం జగన్ ఆదేశాలిచ్చారని.. దానికి అనుగుణంగా అధికారులు పనిచేయాలన్నారు. అలాగే, వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించే కార్యక్రమాన్ని కూడా నిర్ణీత లక్ష్యంలోగా పూర్తిచేయాలని సూచించారు. పెండింగ్ కేసులపై దృష్టి ఇంధనశాఖ పరిధిలో వివిధ విభాగాలకు సంబంధించిన కోర్టు కేసులను సత్వరం పరిష్కరించే విషయంలో అధికారులు దృష్టిసారించాలని కూడా మంత్రి పెద్దిరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా నెడ్‌క్యాప్ (ఎన్ఆర్ఈడీసీఏపీ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రాజెక్టులపై రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే విజయానంద్, గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, నెడ్‌క్యాప్ వీసీ–ఎండీ ఎస్.రమణారెడ్డి, ఏపీఎండీసీ వీసీ–ఎండీ వీజీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
షూటింగ్ స్పాట్‌గా మారుతోన్న సింగరేణి.. ప్రభాస్ సలార్, నాని దసరా..ఇంకెన్నో
సాక్షి, పెద్దపల్లి/గోదావరిఖని: నల్లబంగారు నేల సింగరేణి షూటింగ్ స్పాట్‌గా మారుతోంది. ఎప్పుడూ ఎక్స్ప్లోజివ్ల మోతలు.. డంపర్ల హారన్లు.. అప్రమత్తత సైరన్లు వినిపించే గనులపై యాక్షన్.. కట్.. ప్యాకప్ మాటలు వినిపిస్తున్నాయి. సింగరేణి కార్మికులు, అధికారులతో బిజీగా ఉండే గనులు.. సినీ ప్రముఖులతో సందడిగా మారుతున్నాయి. మసి, బొగ్గు, దుమ్ముతో నిండిపోయిన మైనింగ్ ప్రాంతాలు మాస్ సినిమాలకు అందమైన లోకేషన్లుగా మారాయి. ఉద్యమ సినిమాల నుంచి కామెడీ.. ప్రేమకథ.. మాస్ సినిమాలు సైతం ప్రస్తుతం సింగరేణి ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ‘సలార్’ యూనిట్ సందడి చేయగా.. ఇటీవల ‘దసరా’ టీం షూటింగ్ పూర్తిచేసుకుని వెళ్లింది. సింగరేణి గనులపై సినిమా షూటింగ్‌లపై సండే స్పెషల్. లొకేషన్స్‌కు ప్రత్యేకం కోల్‌బెల్ట్.. సినిమా షూటింగ్‌ల లొకేషన్‌కు కోల్‌బెల్ట్ ప్రాంతం పెట్టింది పేరు. సింగరేణి కార్మికుల ఇతి వృత్తాలతో పాటు పలు సినిమా షూటింగ్లో ఈప్రాంతంలో ఎక్కువగా జరిగాయి. భారీ బడ్జెట్ మొదలు కొన్ని చిన్న సినిమాల వరకు ఈప్రాంతం ఆదరిస్తూనే ఉంది. కళాకారులను అక్కున చేర్చుకుంటోంది. గోదావరిఖని పట్టణాన్ని ఆనుకుని ఉన్న జనగామ, సుందిళ్ల గ్రామాల్లో ఆర్.నారాయణమూర్తి అనేక సినిమా షూటింగ్‌లు చేశారు. ప్రధానంగా పదేళ్ల క్రితం సుందిళ్లలో పోరు తెలంగాణా చిత్ర సినిమా షూటింగ్ ఎక్కువ రోజులు జరిగింది. అలాగే కోవిడ్‌కు ముందు బిత్తిరి సత్తి నటించిన తుపాకీ రాముడు సినిమా షూటింగ్ జనగామలో చాలా రోజుల పాటు జరిగింది. ఆర్.నారాయణమూర్తి నటించి నిర్మించిన నిర్భయభారతం, దండకారణ్యం సినిమా షూటింగ్‌లు ఇక్కడే జరిగాయి. పిట్టగోడ సినిమా షూటింగ్ కూడా ఖని పారిశ్రామిక ప్రాంతంలో జరిగింది. స్థానికులే కళాకారులుగా నిర్మించిన అగ్లీఫేసెస్ చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. గోదావరిఖని ప్రాంతంలోనే చిత్ర షూటింగ్ జరిగింది. ఓసీపీ–2 బేస్‌వర్క్ షాప్‌లో ‘సలార్’ షూటింగ్ (ఫైల్) సలార్.. దసరా సందడి సింగరేణి ప్రాంతంలో గత పదిహేనేళ్లుగా చాలా సినిమాలు, షార్ట్‌ఫిల్మ్‌లు చిత్రీకరిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత తెలుగు సినిమాల్లో తెలంగాణ యాసకు ప్రాముఖ్యం, దర్శకుల సంఖ్య పెరిగింది. ప్రభాస్‌తో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న “సలార్’ మొదటి షెడ్యూల్‌ను రామగిరిలోని ఆండ్రియాలా ప్రాజెక్టులో చిత్రీకరించారు. రామగిరి వాస్తవ్యుడు దర్శకుడిగా, నాని హీరోగా దసరా సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. కొద్దిరోజుల క్రితం కొంత షూటింగ్ పూర్తికాగా.. తదుపరి సినిమా షూటింగ్ కూడా ఇక్కడే తీసేందుకు షెడ్యూల్ రూపొందించారు. విజయ్‌దేవరకొండ తన తదుపరి చిత్రం షూటింగ్ గోదావరిఖని ప్రాంతంలోనే తీసేందుకు లోకేషన్స్ వెతుకుతున్నారు. చిత్ర బృందం ఇటీవల సింగరేణి ప్రాంతంలో పర్యటించి వెళ్లారు. ఎన్టీపీసీ, సింగరేణి గెస్టు హౌస్‌లో ఆధునిక సౌకర్యాలతో వసతి సౌకర్యాలు ఉండటంతో చిత్రీకరణ కోసం వచ్చిన నటినటులు సైతం ఆసక్తి చూపుతున్నారు. సలార్ సినిమా షూటింగ్ కోసం డమ్మీ ఆయుధాలను తయారు చేస్తున్న సిబ్బంది (ఫైల్) ప్రీవెడ్డింగ్ షూట్స్ మాస్ సినిమాల్లో వచ్చే ఫైట్స్, పాటలకు సింగరేణి గొగ్గు గనులు దర్శకులకు మొదటి చాయిస్‌గా కనిపిస్తున్నాయి. జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల, పార్వతీ బ్యారేజీ, శ్రీపాద ఎల్లంపల్లిలో జలకళ సంతరించుకుంది. ఈ ప్రాంతాల్లో పెళ్లిళ్లకు సంబంధించిన ప్రీవెడ్డింగ్ షూట్స్, సాంగ్స్, పుట్టినరోజు వేడుకలకు చెందిన పాటలను చిత్రీకరిస్తున్నారు. -
సిరులు కురిపిస్తున్న సింగరేణి
సాక్షి, మంచిర్యాల: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) తవ్వేది బొగ్గు గనులే అయినా.. ఇది రాష్ట్రం పాలిట బంగారు గని. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏటా వందల కోట్ల రూపాయలు అందిస్తోంది. బొగ్గు ఉత్పత్తి, అమ్మకాలు పెరిగే కొద్దీ సంస్థ టర్నోవర్ పెరుగుతోంది. దీంతో సర్కారుకు రాయల్టీ, జీఎస్టీ, డివిడెంట్లు, కస్టమ్స్ డ్యూటీ, స్వచ్ఛభారత్, కృషి కల్యాణ్, క్లీన్ ఎనర్జీ సెస్‌లు తదితర రూపాల్లో సింగరేణి చెల్లింపులు చేస్తోంది. ఎనిమిదేళ్లలో రూ.40వేల కోట్ల ఆదాయం.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత గడిచిన ఎనిమిదేళ్లలో సింగరేణి సంస్థ గణనీయంగా అభివృద్ధి సాధించింది. ఈ ఎనిమిదేళ్లలో సుమారు రూ.40 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని కేంద్ర, రాష్ట్రాలకు అందించింది. ఇందులో రాష్ట్రానికి రూ.17 వేల కోట్లకుపైనే రాగా, కేంద్రానికి రూ.22 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. గతేడాది నుంచి ఒడిశాలోని నైనీ బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావడంతో అక్కడ కూడా పన్నులు చెల్లిస్తోంది. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఉన్న సింగరేణి సంస్థ, కోల్ ఇండియాతో పోటీ పడుతోంది. 2014కు ముందు ఏటా 504 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, ప్రస్తుతం 680 లక్షల టన్నులకు చేరింది. నికర లాభం రూ.419 కోట్ల నుంచి రూ.1,500 కోట్లకు చేరింది. 2029–30 నాటికి వంద మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా ఉంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు ముందు మరింత ఆదాయం రానుంది. ఆరు జిల్లాల్లో నిధుల వరద.. కుమ్రంభీం, మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అభివృద్ధిలో సింగరేణి భాగం పంచుకుంటోంది. కరోనా సమయంలో ప్రభుత్వ నిధులు నిలిచిపోయినప్పటికీ ఈ జిల్లాల్లో మాత్రం సింగరేణి నిధులతో అభివృద్ధి కొనసాగింది. గతేడాది డిసెంబర్ నాటికి వివిధ రూపాల్లో ఈ ఆరు జిల్లాలకు సింగరేణి రూ.3,248 కోట్లు సమకూర్చింది. సింగరేణి గనులు విస్తరించిన ప్రాంతాల్లో విద్య, వైద్యం, రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తోంది. ఆపత్కాలంలో ఆదుకుంటూ.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి నిధులు అందించి అండగా నిలిచింది. ఒడిశాలోనూ ఉత్పత్తి చేస్తున్నందున ఫెని తుఫాన్ వచ్చినప్పుడు రూ.కోటి సాయం చేసింది. వీటికి తోడు కోల్‌బెల్ట్ పరిధిలోని ప్రజాప్రతినిధుల సిఫారసు మేరకు కొన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. -
ఆ గనులు మాకిచ్చేయండి.. వాడనప్పుడు మీ దగ్గర ఎందుకు - కేంద్రం
తమకు కేటాయించిన గనుల్లో ఇప్పటి వరకు కార్యకలాపాలు ప్రారంభినట్టయితే ఎటువంటి జరిమానా లేకుండా వాటిని తిరిగి ఇవ్వాలంటే కేంద్రం కోరింది. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడుస్తున్న బొగ్గు ఉత్పత్తి సంస్థలకు తెలిపింది. శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కెబినేట్ కమిటీ ఆన్ ఎకామికల్ ఎఫైర్స్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అనేక సంస్థలు బొగ్గును ఉత్పత్తి చేస్తున్నాయి. ఇందులో కోలిండియా పరిధిలో 9 సంస్థలు ఉండగా దక్షిణ భారత దేశంలో సింగరేణితో పాటు నైవేలీ కోల్‌ఫీల్డ్స్ వంటి సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలకు గతంలో కేంద్రం పలు బ్లాకులను బొగ్గు ఉత్పత్తి కోసం కేటాయించింది. వివిధ కారణాల వల్ల చాలా సంస్థలు తమకు కేటాయించిన బ్లాకులలో బొగ్గును ఉత్పత్తి చేయడం లేదు. కొన్ని బ్లాకులకు ఫీజుబులిటీ లేకపోవడం వంటి సమస్యలు ఉండగా మరికొన్ని బ్లాకులకు ఫారెస్ట్ అనుమతులు, నిధుల కొరత, భూసేకరణ తదితర సమస్యలు ఉన్నాయి. ఇలా మొత్తం 73 బ్లాకులు కేటాయించగా ఇందులో 45 బ్లాకులతో ఉత్పత్తి జరగడం లేదు. ప్రస్తుతం బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా థర్మల్ పవర్ ప్లాంట్లలో కరెంటు ఉత్పత్తి తగ్గిపోయింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు నిరుపయోగంగా ఉన్న బొగ్గు బ్లాకులను తిరిగి తమకు సరెండర్ చేయాలని కేంద్రం కోరింది. ఇలా సరెండర్‌లో వచ్చిన బ్లాకులను ప్రైవేటు బొగ్గు ఉత్పత్తి సంస్థలకు కేటాయించనున్నారు. ఈ స్వచ్చంధ సరెండ్ పథకం కింద బొగ్గు బ్లాకులు కేటాయించే సంస్థలకు పెనాల్టీ, వివరణల నుంచి మినహాయింపు ఇచ్చారు. చదవండి: కియాకు మరిన్ని మెరుగులు.. కొత్త ఫీచర్లు ఇవే! -
సింగరేణిని అమ్మేందుకు కేంద్రం కుట్ర
సాక్షి, మంచిర్యాల/సాక్షి, ఆసిఫాబాద్: దేశానికి వెలుగులు పంచుతున్న సింగరేణిని అమ్మేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. రాష్ట్రంలో 135 శాతం లాభాలతో ఉన్న సింగరేణికి చెందిన 4 బొగ్గు గనులు ప్రైవేటుకు అమ్మాలని ప్రధాని మోదీ చూస్తున్నారని తెలిపారు. బీఎస్ఎన్ఎల్, రైళ్లు, విమానాలు, బ్యాం కులు.. ఇలా అన్నీ కేంద్రం అమ్మే స్తోందని ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలసి కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లో పర్యటించారు. ఆయా జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసి సభల్లో మాట్లాడారు. పావలా వడ్డీ ఈ నెలాఖరులో జమ చేస్తామని చెప్పారు. వైద్యానికి పెద్దపీట రాష్ట్రంలో గడిచిన 60 ఏళ్లలో మూడు వైద్య కళాశాలలు మాత్రమే మంజూరు కాగా.. సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఏడేళ్లలో 17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి వైద్యానికి పెద్దపీట వేశారని మంత్రి హరీశ్ చెప్పారు. ఒకనాడు మారుమూల ప్రాంతమైన ఆసిఫాబాద్‌లో వైద్యం అందుబాటులో ఉండేది కాదని, నేడు రూ.60 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో 340 పడకల జిల్లా ఆస్పత్రిని నిర్మించి అన్ని రకాల వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఇక్కడ మెడికల్ కాలేజీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ యోచిస్తున్నారని, త్వరలోనే శుభవార్త వింటారని అన్నారు. టీఎస్‌ఎంఎస్‌ఐ డీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎంపీ వెం కటేశ్ నేత, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే లు,జెడ్పీ చైర్పర్సన్లు, కలెక్టర్లు పాల్గొన్నారు. -
కేంద్రవాటానూ రాష్ట్రం కొనాలి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ సంస్థ కార్మికులు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. 132 ఏళ్లుగా దేశానికి నిబద్ధతతో కూడిన సేవలందిస్తోన్న సింగరేణి ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కు సెస్, డివిడెండ్ల రూపంలో వేల కోట్ల రూపాయలు సమకూరుతుందన్నారు. అలాంటి సంస్థలోని నాలుగు బొగ్గు బ్లాకులను వేలం వేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించడం ఆ సంస్థకు ఉరి వేయడమేనని శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన అభిప్రాయపడ్డారు. అపార బొగ్గు నిల్వలు ఉన్నప్పటికీ దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడంలో కానీ, పన్ను చెల్లింపుల్లో రాయితీలు ఇవ్వడంలో కానీ కేంద్రాన్ని ఏనాడూ సీఎం కేసీఆర్ ప్రశ్నించిన పాపాన పోలేదని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లో మోదీతో ఒప్పందం కుదుర్చుకుని సభ జరగకుండా అడ్డుపడటానికి బదులు సింగరేణి సమస్య గురించి కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. గనుల వేలం సమీపించడంతో మొక్కుబడిగా కార్మికుల పక్షాన కేంద్రానికి లేఖ రాసిన కేసీఆర్ సింగరేణి కార్మికులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సింగరేణిలో కేంద్రానికి ఉన్న 49 శాతం వాటాను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, సింగరేణికి బకాయి పడ్డ రూ.13వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. సింగరేణి సమ్మెకు సీపీఎం మద్దతు: తమ్మినేని సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను రద్దు చేసి, కార్మికుల సమ్మెను ఉపసంహరించేలా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన జారీచేశారు. సంస్థ పరిరక్షణ కోసం కార్మికులు చేస్తున్న సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు. సమ్మెలో బీజేపీ అనుబంధ కార్మిక సంస్థ బీఎంఎస్ కూడా పాల్గొందంటే ఈ ప్రైవేటీకరణ ఎంత ప్రమాదకరమో అర్థమవుతోందన్నారు. -
సింగరేణిలో సమ్మె సైరన్..!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో చాలా కాలం తరువాత సమ్మె సైరన్ మోగనుంది. ఈ మేరకు గుర్తింపు సంఘం సమ్మెకు సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 88 బొగ్గు బ్లాకులను ప్రైవేటీకరించేందుకు నిర్ణయం తీసుకున్న కేంద్రం టెండర్ల తేదీలను ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సింగరేణిలో గుర్తింపు యూనియన్‌గా ఉన్న టీబీజీకేఏస్ అప్రమత్తమైంది. కేంద్రం ప్రైవేటీకరిస్తున్న బొగ్గుబ్లాకుల్లో నాలుగు సింగరేణి సంస్థ పరిధిలోవే ఉన్నాయి. బొగ్గు గనుల ప్రయివేటీకరణపై ఇప్పటికే జాతీయ కార్మిక సంఘాలు ఉద్యమానికి సమాయత్తమవుతుండగా, టీబీజీకేఏస్ మరో అడుగు ముందుకేసి సింగరేణిలో సమ్మె పిలుపు ఇవ్వాలని నిర్ణయించింది. దీనిపై గురువారం రామగుండం ఏరియాలో నిర్వహించే సెంట్రల్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్‌పరం అయితే రాబోయే రోజుల్లో కార్మికుల ఉనికికే ప్రమాదంగా మారనుందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి. వ్యూహాత్మకంగా ముందుకు... టీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్ సింగరేణిలో గుర్తింపు ఎన్నికల నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. సమ్మె నిర్వహించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించినప్పటికీ సెంట్రల్ కమిటీ సమావేశంలో అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకెళ్లాలని భావిస్తోంది. కాగా, టీబీజీకేఏస్ సెంట్రల్ కమిటీ సమావేశం గురు వారం యైటింక్లయిన్‌కాలనీలో నిర్వహిస్తున్నట్లు టీబీజీకేఏస్ అధ్యక్షుడు బి.వెంకట్రావ్ తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, మాజీ అధ్యక్షుడు కెంగర్ల మల్లయ్య పాల్గొంటున్నట్లు వెల్లడించారు. -
NTPC: భారత విద్యుత్తేజం ఎన్టీపీసీ
జ్యోతినగర్ (రామగుండం): భారతావనికి వెలుగులు అందిస్తూ విద్యుత్తేజంగా విరాజిల్లుతున్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ నేటికి 46 వసంతాలు పూర్తి చేసుకుంటోంది. ప్రస్తుతం దేశంలో ఎన్టీపీసీ 74 విద్యుత్ కేంద్రాల ద్వారా 67,657.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. 2032 నాటికి 1,28,000 మెగావాట్ల లక్ష్యంతో నూతన ప్రాజెక్టులకు అంకురార్పణ చేస్తూ ముందుకు సాగుతోంది. నవంబర్ 7న ‘రైజింగ్ డే’.. స్వాతంత్య్రం అనంతరం దేశం తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంది. కేంద్రం పరిధిలో ఒక విద్యుత్ కేంద్రం ఉండాలని అప్పటి ప్రభుత్వం భావించింది. ఆ విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రానికి ఎక్కువ శాతం విద్యుత్ కేటాయించి, మిగతా విద్యుత్‌ను ప్రాంతాల వారీగా పంపిణీ చేయాలని తీర్మానం చేశారు. అప్పటికప్పుడు నిర్మించాలంటే సమయం పడుతుందనే ఉద్దేశంతో ఢిల్లీ ఎలక్ట్రిసిటీ బోర్డుకు చెందిన బదర్పూర్ థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని టేకోవర్ చేసింది. 1975 నవంబర్ 7న ఎన్టీపీసీని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్‌గా నమోదు చేసి, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంగా నామకరణం చేసి, ఎన్టీపీసీగా గుర్తించారు. దీంతో ఈ రోజును సంస్థ ‘రైజింగ్ డే’గా నిర్వహిస్తోంది. 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం ఎన్టీపీసీ దేశంలో బొగ్గు గనులు, గ్యాస్, నీరు, స్థలం ప్రాంతాలను గుర్తించి, విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఇలా దినదినాభివృద్ధి చెందుతూ అతిపెద్ద విద్యుత్ కేంద్రంగా ఎదిగింది. ప్రపంచస్థాయి విద్యుత్ సంస్థలతో పోటీ పడుతూ భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పవర్ ప్లాంట్ సామర్థ్యం, పీఎల్ఎఫ్, మెయింటెనెన్స్, రక్షణ, విద్యుత్ పొదుపు, పర్యావరణ సమతౌల్యం, మేనేజ్మెంట్ విధానాలతో మొదటి స్థానంలో నిలిచింది. అలా నవరత్న కంపెనీగా ఉన్న ఎన్టీపీసీ 2010లో మహారత్న కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్టీపీసీ విద్యుదుత్పత్తి కేంద్రాలు ఎన్టీపీసీ సొంతంగా బొగ్గు, గ్యాస్, హైడ్రో, సోలార్, ఫ్లోటింగ్ సోలార్, జాయింట్ వెంచర్స్‌తో పాటు మొత్తంగా 74 విద్యుదుత్పత్తి కేంద్రాలను కలిగి ఉంది. ప్రస్తుతం సూపర్ క్రిటికల్ మెగా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. ఎన్టీపీసీ తన ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి కన్సల్టెన్సీ, పవర్ ట్రేడింగ్, విద్యుత్ నిపుణుల శిక్షణ, బొగ్గు తవ్వకాల రంగాల్లో ముందుకు సాగుతోంది. మైనింగ్‌లో ఎన్టీపీసీ వేగవంతమైన ప్రగతిని సాధించింది. ప్రపంచంలోని ప్రముఖ విద్యుత్ సంస్థగా అవతరించే దిశగా పయనిస్తోంది. కరోనా సమయంలోనూ నిరంతర విద్యుత్ సరఫరా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ దేశానికి ఎన్టీపీసీ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసింది. కోవిడ్–19కు వ్యతిరేకంగా పోరాడటంలో ప్రభుత్వానికి మద్దతుగా పీఎం కేర్ ఫండ్‌కు రూ.257.5 కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తంలో రూ.250 కోట్లు కంపెనీవి కాగా, సంస్థ ఉద్యోగులు తమ వేతనాల నుంచి రూ.7.5 కోట్లు అందించారు. ఎన్టీపీసీ ప్రాజెక్టుల్లోని వివిధ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు నిర్మించారు. కరోనా ఉధృతిలో కాంట్రాక్టు, వలస కార్మికులకు నిత్యావసరాలు, వైద్యసేవలు అందించారు. సంస్థ ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ భౌతిక దూరం పాటిస్తున్నారు. ఎన్టీపీసీ ప్రపంచంలో నంబర్ వన్ స్థాయిలో నిలిచేందుకు సమన్వయంతో ముం దుసాగాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు ఒకప్పుడు విద్యుదుత్పత్తి మాత్రమే చేసిన ఎన్టీపీసీ భవిష్యత్ పోటీని ఎదుర్కొని ఉత్పత్తి, పంపిణీ, విద్యుత్ కొనుగోలు, అమ్మకాలు, సొంతంగా బొగ్గు గనుల ఏర్పాటు, జాయింట్ వెంచర్లు తదితర ఎన్నో రంగాల్లో ఇతర సంస్థలతో కలసి వ్యాపారాలు చేస్తోంది. జాయింట్ వెంచర్ల పేరిట బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక దేశాల్లో వాటి భాగస్వామ్యంతో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మి స్తోంది. భవిష్యత్‌లో అణు విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుదుత్పత్తి చేయాల్సి వస్తే మొదట ఎన్టీపీసీకే అవకాశం దక్కనుంది. -
7 నెలల్లో రూ.868 కోట్ల లాభం
సాక్షి, హైదరాబాద్: సింగరేణి మళ్లీ సిరుల రాణిగా మారింది. బొగ్గు గనుల్లో లాభాల పంట పండింది. కోవిడ్–19 మహమ్మారి కారణంగా గతేడాది ఏర్పడిన నష్టాల ఊబి నుంచి గట్టెక్కింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థ 2021–22లో గత ఏడు నెలల్లో రూ.868 కోట్ల లాభాలను ఆర్జించింది. 2020–21 తొలి ఏడు నెలల్లో రూ.8,537 కోట్ల అమ్మకాలు జరపగా, ఈ ఏడాది అదే కాలానికి 65 శాతం వృద్ధితో రూ.14,067 కోట్ల విక్రయాలు జరిపింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలవ్యవధిలో కరోనా విపత్కర పరిస్థితుల వల్ల బొగ్గు అమ్మకాలు, రవాణా తగ్గి రూ.1,129 కోట్ల నష్టాలు వచ్చాయి. కరోనా తగ్గుముఖం పట్టాక ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి, రవాణాతోపాటు విద్యుత్ అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో 177 శాతం వృద్ధితో రూ.868 కోట్ల లాభాలను సింగరేణి సమకూర్చుకుంది. గతేడాది తొలి ఏడునెలల్లో రూ.6,678 కోట్ల బొగ్గు అమ్మకాలు జరపగా, ఈ ఏడాది 78 శాతం వృద్ధితో రూ.11,855 కోట్ల అమ్మకాలు నిర్వహించింది. గతేడాది తొలి ఏడునెలల్లో రూ.1,860 కోట్ల విద్యుత్ అమ్మకాలు జరగగా, ఈ ఏడాది 18 శాతం వృద్ధితో రూ.2,182 కోట్ల మేర విద్యుత్ విక్రయించింది. బొగ్గు, విద్యుత్ అమ్మకాలు కలిపి గతేడాదితో పోల్చితే గడిచిన ఏడునెలల్లో 65 శాతం అభివృద్ధిని కనబరిచింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డుస్థాయిలో టర్నోవర్, లాభాలు ఆర్జిస్తామని సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంస్థ పురోగతిపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించి గత ఏడు నెలల్లో సాధించిన ఫలితాలను వెల్లడించారు. పెరిగిన బొగ్గు, విద్యుదుత్పత్తి... గతేడాదితో పోల్చితే ఈ ఏడాది తొలి 7నెలల్లో బొగ్గు ఉత్పత్తి 220 లక్షల టన్నుల నుంచి 60% వృద్ధితో 352 లక్షల టన్నులకు పెరిగింది. బొగ్గు రవాణా 218 లక్షలటన్నుల నుంచి 68% వృద్ధితో 367 లక్షల టన్నులకు పెరిగింది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా గతేడాది అక్టోబర్ వరకు 3,819 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి 39 శాతం వృద్ధితో 5,291 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఫలితంగా టర్నోవర్, లాభాలు గణనీయంగా పెరిగాయి. -
సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం
సాక్షి, పెద్దపల్లి : సింగరేణి బొగ్గు గనిలో ప్రమాదం చోటుచేసుకుంది. రామగుండం డివిజన్ పరిధిలోని వకీల్‌పల్లి భూగర్భ బొగ్గు గనిలో జంక్షన్ కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. గురువారం సాయంత్రం 66 లెవెల్లో 41 డీప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గల్లంతు అయ్యారు. సమాచారం అందుకున్న సింగరేణి యాజమాన్యం సహాయక చర్యలు చేపట్టింది. అయితే స్థానిక అధికారుల ద్వారా ప్రమాదం నుంచి ముగ్గురు కార్మికులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. -
సింగరేణిలో రెండు పాత గనులు మూత
సాక్షి, హైదరాబాద్ : సింగరేణిలో రెండు ఓపెన్ కాస్ట్(ఓసీ) గనులను మూసి వేసేందుకు సింగరేణి బొగ్గు గనుల సంస్థ సిద్ధమైంది. ప్రత్యామ్నాయంగా మరో 3 కొత్త ఓసీ గనులను ప్రారంభించాలని నిర్ణయించింది. బొగ్గు నిల్వలు తరిగిపోవడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డోర్లి, మేడిపల్లి ఓసీ గనులను మూసివేయనుంది. అలాగే కొత్తగా కిష్టా రం, కేటీకే ఓసీ–3, ఇందారం ఓసీ గనులను ప్రారం భించేందుకు సన్నాహాలు చేస్తోంది. పాత గనుల మూత, కొత్త గనుల ప్రారంభంపై సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ గురువారం ఇక్కడి సింగరేణి భవన్లో ఆయా ఏరియాల జనరల్ మేనేజర్లతో సమీక్ష నిర్వహించారు. కొత్త గనులను సత్వరమే ప్రారంభించడానికి సన్నాహాలు పూర్తి చేయా లని ఆదేశించారు. ఈ ఏడాది ప్రారంభించనున్న ఇతర ఓసీ గనులకు సంబంధించిన పర్యావరణ, అటవీ శాఖ అనుమతులను సత్వరం పొందేలాæ చొరవ చూపాలని కోరారు. ఒడిశాలోని నైనీ బ్లాకు పురోగతిని కూడా సమీక్షించారు. వచ్చే ఏడాది చివరికల్లా ఈ గనిని ప్రారంభించే అవకాశం ఉన్నందు న పలు సమస్యలపై చర్చించేందుకు త్వరలోనే తాను ఒడిశా సీఎంను కలవనున్నట్లు వివరించారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా విషయంలో రానున్న 3 నెలల కాలం చాలా క్లిష్టమైందని అన్నారు. వర్షాలు లేని, తెరిపిగా ఉన్న కాలంలోనే బొగ్గు ఉత్పత్తి పెంచి తగినన్ని నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. వినియోగ దారులకు బొగ్గు రవాణా తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో బొగ్గు ఉత్పత్తి, రవాణా, గతే డాది ఇదేకాలంలో సాధించిన దానికన్నా కొంత మేర మెరుగు పడినా.. రానున్న 3 నెలల వర్షాకాలంలో ఉత్పత్తి తగ్గకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. వర్షాకాలంలోనూ గనులు పనిచేయడానికి అవసరమైన పంపింగ్ తదితర వ్యవస్థను సంసిద్ధ పరుచుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్, బలరాం, ఈడీ కోల్ మూమెంట్ ఆల్విన్, అడ్వయిజర్ మైనింగ్ డీఎన్ ప్రసాద్ పాల్గొన్నారు. -
‘సింగరేణి ముందు కొత్త సవాళ్లు’
సాక్షి, హైదరాబాద్: సమీప భవిష్యత్తులో కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ శ్రీధర్ సింగరేణీయులకు పిలుపునిచ్చారు. దేశంలో ఉన్న 80 బొగ్గు బ్లాకులు మంచి లాభదాయకత కలిగి ఉన్నాయని, త్వరలో వీటి నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కానున్నదని పేర్కొన్నారు. ఈ బొగ్గు ధర తక్కువగా ఉండనుందని, దీంతో దేశీయంగా సింగరేణి వంటి సంస్థలు వీటితో గట్టి పోటీని ఎదుర్కోక తప్పదన్నారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ నుంచి గురువారం ఆయన సంస్థ డెరైక్టర్లు, జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. -
అదానీలకు ప్రేమతో...
ఎన్నికల ముంగిట సీఎం చంద్రబాబు అవినీతి తవ్వకాలు తారస్థాయికి చేరిపోయాయి.అధికారం ఆఖరి క్షణాల్లో రూ.24 వేల కోట్లకుపైగా విలువైన బొగ్గు గనుల్ని నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టేస్తున్నారు. అది కూడా వేరెవరికో కాదు! తానిప్పుడు పోరాడుతున్నట్లు బిల్డప్ ఇస్తున్న ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితులైన అదానీ, ఎస్సెల్ గ్రూపులకి!. చిత్రమేంటంటే మోదీకి అత్యంత సన్నిహితుడిగా అందరికీ తెలిసిన ఇదే అదానీకి భావనపాడు పోర్టు నిర్మాణాన్ని చంద్రబాబు అప్పగించారు. విశాఖలో సోలార్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామంటే 500 ఎకరాలు ధారాదత్తం చేసి పది రోజుల కిందటే ఎంవోయూ కూడా చేసుకున్నారు. అదానీతో బొగ్గు బ్లాకుల చీకటి ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుని... దాని ప్రకారం స్క్రీన్‌ప్లే నడిపిస్తున్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఏపీఎండీసీకి ఉన్న విలువైన గనుల్ని అదానీ, ఎస్సెల్ గ్రూపులకు దక్కేలా అనుకూలమైన నిబంధనల్ని విధించడమే కాకుండా... వారికి పోటీ లేకుండా చేసి మరీ రివర్స్ వేలంలో అధిక ధరకు అప్పగిస్తున్నారు. అంటే ఆ బ్లాకుల్ని అప్పగించటమే కాకుండా అవి తవ్వి తీసే ప్రతి టన్నుకూ ఏపీఎండీసీ అత్యధిక ధర చెల్లించి కొంటుందన్న మాట. పనిగట్టుకుని పక్క రాష్ట్రాలు తిరిగి మరీ మోదీని విమర్శిస్తున్న చంద్రబాబు... ఆయన సన్నిహితులకు ఇంత భారీ ప్రాజెక్టులు అప్పగించటం వెనక అర్థమేంటి? రాష్ట్రాన్ని గుజరాత్‌లా మార్చటమంటే నిబంధనల్ని కాలరాసి మరీ ప్రాజెక్టులన్నీ అదానీకి అప్పగించటమా? మరి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన మోదీతో చంద్రబాబుకు తెరచాటు బంధం లేదంటే నమ్మగలమా? ఎస్సెల్‌కు.. రూ. 12,609.60 కోట్లు టన్ను బొగ్గు తవ్వకానికి ఎస్సెల్ రూ. 888 చొప్పున ధర కోట్ చేసింది.దీంతో మదన్‌పూర్ గని ఎండీవోగా ‘ఎస్సెల్’ను ఖరారు చేయనున్నారు. ఈ గనిలో సుమారు 187 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇందులో 142 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వవచ్చని అంచనా. టన్నుకు రూ. 888 ప్రకారం 142 మిలియన్ టన్నులు తవ్వినందుకు ఏపీఎండీసీ ఈ సంస్థకు రూ. 12,609.60 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకంటే ఎక్కువగా ఖనిజం తవ్వితే ఆ మేరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అదానీకి.. రూ. 11,542 కోట్లు సులియారీలోని గనిలో 147 మిలియన్ టన్నుల ఖనిజం ఉండగా 116 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వవచ్చని అంచనా. టెండర్లలో దీనిని దక్కించుకున్న అదానీ గ్రూపునకు టన్నుకు రూ. 995 చొప్పున 116 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వినందుకు ఏపీఎండీసీ రూ. 11,542 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సాక్షి, అమరావతి: ఎన్నికలు శరవేగంగా సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు డబ్బులు వెదజల్లే అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నారు. కమీషన్ల కోసం, అందుకు సహకరించే కాంట్రాక్టర్లను ఎంపిక చేసుకుని వారితో రాయబారాలు నడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన బొగ్గు గనుల నిర్వహణ కోసం నిర్వహించిన టెండర్ల ప్రక్రియ దీనికి ఉదాహరణ. ఎప్పుడో ఏడాది క్రితం మొదలైన ఈ ప్రక్రియ ఎన్నికల సమయంలో క్లైమాక్స్‌కి చేరింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ‘టెయిలర్ మేడ్’ నిబంధనలు రూపొందించి తమకు కమీషన్లు చెల్లించేవారివైపు మొగ్గు చూపుతున్నారు. ఈ బొగ్గు గనుల నిర్వహణ టెండర్ల వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతను ఓ సీనియర్ అధికారికి అప్పగించినట్లు తెలిసింది. అనంతరం రెండు సంస్థలతో మాట్లాడుకుని రివర్స్ టెండర్ల ద్వారా గనులు అప్పగించేందుకు సిద్ధపడ్డారు. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఇటీవల అమరావతిలో పర్యటించిన అనంతరం ఆ గ్రూప్‌నకు సులియారి బొగ్గు గని అభివృద్ధి నిర్వహణ (ఎండీవో) కట్టబెట్టేలా రంగం సిద్ధం కావడం గమనార్హం. నిజానికి ఈ టెండర్లు ఏడాది క్రితమే పిలిచారు. ఐదు సంస్థలు ఇందులో ఎంపిక కాగా తమకు నచ్చినవారికి అప్పగించేందుకే ఇంతకాలం సాగదీసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక నేడే రేపో ఈ వ్యవహారాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికల వ్యయం కోసం డబ్బులు ముందుగానే ముట్టజెప్పే సంస్థలతో ఒప్పందాలు చేసుకుని తమకు అనుకూలమైన నిబంధనలు పొందుపరిచినట్లు మైనింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమరావతి పర్యటన వెనుక మతలబు? ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థకు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని సులియారి, సౌత్ మదనపూర్‌లో బొగ్గు బ్లాకులున్నాయి. బంగారు బాతుల్లాంటి వీటిని తనకు అనుకూలమైన సంస్థలకు కట్టబెట్టి వాటాలు పొందాలని ఎత్తుగడ వేసిన ముఖ్యనేత ఏపీఎండీసీని పావుగా మార్చుకుని తనకు అనుకూలమైన పెద్ద సంస్థలు మాత్రమే బిడ్డింగులో పొల్గొనేలా నిబంధనలు రూపొందించారు. టెండర్లలో పాల్గొనేందుకు ఆసక్తి చూపిన సంస్థలను కలసిన ఓ కీలక అధికారి ముఖ్యనేత ఆంతర్యాన్ని వివరించారు. అనంతరం బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణ (ఎండీవో) ఎంపిక కాంట్రాక్టు కోసం టెండర్లు పిలిచారు. మౌఖిక సంప్రదింపుల ద్వారా మరికొన్ని సంస్థలను టెండర్ల నుంచి తప్పించడంలో ఆ కీలక అధికారి పాత్ర పోషించారు. సాంకేతిక టెండర్లలో అర్హత సాధించిన రెండు సంస్థల యాజమాన్యాలతో ఇటీవల సమావేశమైన ‘ముఖ్య’నేత వాటాలపై సంప్రదింపులు జరిపారు. పది రోజుల క్రితం అమరావతిలో అదానీ గ్రూపు చైర్మన్ గౌతమ్ అదానీ పర్యటన అనంతరం సులియారి ఎండీఓ కాంట్రాక్టు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌కు కట్టబెట్టేలా రివర్స్ వేలంలో మంత్రాంగం నడిచినట్లు పారిశ్రామిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ సమీపంలో సోలార్ డేటా సెంటర్ ఏర్పాటు పేరుతో ఇదే గ్రూపు కోసం 500 ఎకరాలను ప్రభుత్వం అప్పగించడం గమనార్హం. టెండర్ ప్రమాణాలకు విరుద్ధంగా... దేశంలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇదే తరహా పనుల కోసం నిర్వహించిన టెండర్లలో అనుసరించిన నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎండీసీ వ్యవహరించడం విమర్శలకు బలం చేకూరుస్తోంది. ఎక్కువ సంస్థలు పోటీపడే అవకాశం కల్పించాలంటూ చేసిన విజ్ఞప్తులను ఏపీఎండీసీ పెడచెవిన పెట్టింది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ చేసిన కేటాయింపుల్లో మదన్‌పూర్ దక్షిణ, సులియారి బొగ్గు గనులు ఏపీఎండీసీకి లభించాయి. వీటి అభివృద్ధి, నిర్వహణ సంస్థను ఎంపిక చేసేందుకు మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) ద్వారా ఏపీఎండీసీ ఇ– టెండర్లు (ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు) ఆహ్వానించింది. ఈమేరకు గత ఏడాది మార్చి 19వ తేదీన టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలను ‘సాక్షి’ ముందుగానే బహిర్గతం చేసింది. ఈమేరకు 2018 మే 2వ తేదీన ‘సాక్షి’ ప్రధాన సంచికలో ‘బొగ్గు గనుల్లో మేత’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. అది నిజమేనని ఈరోజు తేలింది. రివర్స్ వేలం ఇదీ.. మొదటి దశ టెండర్లలో అర్హమైనవిగా నిర్ణయించిన సంస్థలకు మాత్రమే తాజాగా రివర్స్ వేలం నిర్వహించారు. ఒక రేటు నిర్ణయించి దాని నుంచి ఏ సంస్థ తక్కువకు కోట్ చేస్తే దానికి టెండరు అప్పగించే విధానాన్ని రివర్స్ వేలం అంటారు. రివర్స్ వేలంలో రెండు గనులను దక్కించుకున్న సంస్థలకు బొగ్గు తవ్వినందుకుగానూ ఏపీఎండీసీ కనీసం రూ. 24,151.60 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. రూ. 24 వేల కోట్లకు పైగా విలువైన ఈ కాంట్రాక్టు పనులను ఎన్నికల ముందు హడావుడిగా రెండు సంస్థలకు కట్టబెట్టినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకింత రహస్యం? సాధారణంగా టెండరు నోటిఫికేషన్‌ను ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని అర్హతలు, నిబంధనలు, పనుల వివరాలు తెలుసుకోవచ్చు. అయితే ఏపీఎండీసీ బొగ్గు గనుల ఎండీవో ఎంపిక టెండర్ల విషయంలో ఈ నిబంధనలను గాలికొదిలేసింది. సంస్థ వెబ్సైట్ టెండరు ప్రకటనలో కేవలం ఎండీఓ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాత్రమే పేర్కొంది. ఆసక్తి కలిగినవారు ఎంఎస్టీసీలో పేర్లు నమోదు చేసుకుని రూ. 50 వేల దరఖాస్తు రుసుము చెల్లించి నిబంధనలు తెలుసుకోవచ్చని పేర్కొంది. నిబంధనలు, పనుల వివరాలు తెలుసుకోవడానికి అంత డబ్బు కట్టాలని షరతు విధించడాన్ని బట్టే ఈ వ్యవహారాన్ని రహస్యంగా ఉంచాలనే ఉద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏపీఎండీసీ గతంలో బెరైటీస్ ఖనిజ తవ్వకాలకు ఎంఎస్టీసీ ద్వారానే ఇ– టెండర్లు పిలిచింది. అయితే అప్పుడు నిబంధనలన్నీ టెండరు నోటిఫికేషన్లోనే పేర్కొంది. ఇతర సంస్థలకు భిన్నంగా.... నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) తలైపల్లి, మదన్‌పూర్ సౌత్ బొగ్గు గనులు, పశ్చిమ బెంగాల్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (డబ్ల్యూబీపీడీసీఎల్) పచ్వారా కోల్‌బ్లాకు, తెలంగాణ స్టేట్ జెన్కో తాడిచెర్ల –1 కోల్బ్లాకుకు ఎండీఓల ఎంపిక కోసం ఇ– టెండర్లు పిలిచాయి. అయితే ఈ సంస్థలు పేర్కొన్న సాంకేతిక అర్హతలకు భిన్నంగా ఏపీఎండీసీ షరతులు విధించింది. అధిక పరిమాణంలో బొగ్గు తవ్విన అనుభవం ఉన్న సంస్థలే టెండర్లలో పాల్గొనేలా షరతులు పెట్టింది. స్పందించని ఏపీఎండీసీ అధికారులు రివర్స్ వేలంలో అదానీ, ఎస్సెల్ తక్కువ మొత్తం కోట్ చేసి ఎల్–1గా నిలిచాయని, వీటికే ఆయా గనుల ఎండీవో కాంట్రాక్టును అప్పగించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. అయితే ఏపీఎండీసీకి ఈ కాంట్రాక్టును ఖరారు చేసే అధికారంతోపాటు రద్దు చేసే అధికారం కూడా ఉంది. వివరాలు లీక్ అయ్యాయని భావిస్తే కాంట్రాక్టును రద్దు చేసే అధికారం కూడా ఉందని సమాచారం. ఈ విషయంపై ఏపీఎండీసీ అధికారులను వివరణ కోరడానికి ‘సాక్షి’ ప్రయత్నించగా స్పందించలేదు. ఎండీవో అంటే....? ఎండీవో అంటే మైన్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ అని అర్థం. ఓ బొగ్గు గని అభివృద్ధి, నిర్వహణ అధికారం మొత్తం ఎండీవోకే ఉంటుంది. నిర్దేశిత ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను పూర్తిగా వెలికితీసే వరకూ ఆ ప్రాంతంపై పూర్తి హక్కులు ఎండీఓకే ఉంటాయి. అంటే ఇది జీవితకాల కాంట్రాక్టు. ఉదాహరణకు ఏపీఎండీకి చెందిన మదన్‌పూర్ గనిలో సుమారు 187 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. ఇందులో 142 మిలియన్ టన్నుల దాకా బొగ్గు తవ్వవచ్చని అంచనా. (భద్రతా ప్రమాణాల దృష్ట్యా కొంత ఖనిజాన్ని తవ్వరు). ఇక సులియారీలోని గనిలో 147 మిలియన్ టన్నుల ఖనిజం ఉండగా 115 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వవచ్చని అంచనా. నిబంధనల ప్రకారం గని నిర్వహణతోపాటు తవ్వకాలు జరిపి ఓవర్ బర్డన్ (వృథా మట్టి)ని తొలగించి విక్రయానికి పనికొచ్చే బొగ్గును ఏపీఎండీసీకి అప్పగించాల్సిన బాధ్యత ఎండీవోదే. ఈ రెండు గనుల ఎండీవోల ఎంపిక కోసం ఏపీఎండీసీ వేర్వేరుగా ఇ –టెండర్లు నిర్వహించినా దాదాపుగా అవే సంస్థలు బిడ్లు వేశాయి. వీటిలో అదానీ ఎంటర్ప్రైజెస్, సైనిక్ మైనింగ్, ఎస్సెల్ మైనింగ్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బీజీఆర్ – ఎస్ఐసీఏఎల్ కన్సార్టియం బిడ్‌లో అర్హత పొందాయి. -
ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కమిటీ
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఎండీసీ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర గనులు, ఖనిజాల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ చైర్మెన్‌గా రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కన్వీనర్‌గా గనులు, ఖనిజాలు, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి, సభ్యులుగా సింగరేణి సంస్థ సీఎండీ, టీఎస్ఎండీసీ వైస్ చైర్మెన్, ఎండీ, గనుల శాఖ డైరెక్టర్లను నియమించారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటు విషయంలో నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎండీసీ), ఎంఈసీఓఎన్, రైల్ వికాస్ నిగమ్ సంస్థలకు చెందిన అధికారులు, నిపుణులతో సంప్రదింపులు జరపాలని ఈ కమిటీకి సూచించారు. కర్మాగారం డిజైన్, అంచనా వ్యయం, నిధుల లభ్యత, ఉద్యోగావకాశాలు తదితర అంశాలపై అధ్యయనం జరిపి నెలలోగా నివేదిక సమర్పించాలని ఈ కమిటీని ఆదేశించారు. ఛత్తీస్‌గఢ్ నుంచి ముడి ఉక్కు ఖనిజం ఖమ్మం జిల్లా బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ అమలు సాధ్యం కాదని కేంద్రం ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో స్వయంగా తామే ఈ పరిశ్రమ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు ఖమ్మం జిల్లా అనువైన ప్రాంతమని, ఇక్కడికి సమీపంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో నాణ్యత కలిగిన ముడి ఇనుము లభ్యత ఉందని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. -
రేపు సింగరేణి ఉద్యోగుల బకాయిల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి బొగ్గు గనుల సంస్థ కార్మికులు, ఉద్యోగులకు 10వ వేతన సవరణ బకాయిల్లో 70 శాతాన్ని ఈ నెల 14న చెల్లించనున్నామని సంస్థ యాజమాన్యం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. 10వ వేతన సవరణ 2016 జూలై 1 నుంచి అమల్లోకి రాగా, సంస్థ నవంబర్ 2017 నుంచి కొత్త వేతనాలు చెల్లిస్తోంది. దీంతో జూలై 2016 నుంచి అక్టోబర్ 2017 మధ్య గల 16 నెలల బకాయిలను చెల్లించాల్సి ఉంది. కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 10వ వేతన సవరణ బకాయిల్లో 70% చెల్లించాలని తాజాగా సంస్థ నిర్ణయించింది. ఈ మొత్తం నుంచి గతంలో చెల్లించిన రూ.51 వేలు, పీఎఫ్, ఆదాయ పన్నులను మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మి కుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామని తెలిపింది. మిగతా 30 శాతం బకాయిలను కోల్ ఇండియా స్థాయిలో తీసుకునే నిర్ణయం ప్రకారం చెల్లిస్తామని వెల్లడించింది. -
బొగ్గు గనుల్లో మేత!
సాక్షి, అమరావతి: ఒక పని కోసం టెండర్లు ఆహ్వానించే ఏ సంస్థ అయినా ఎక్కువమంది పోటీదారులు పాల్గొనాలని, తక్కువ మొత్తానికే బిడ్లు దాఖలవ్వాలని కోరుకుంటుంది. ఈ లక్ష్యంతోనే అత్యధికులు టెండర్లలో పాల్గొనేందుకు వీలుగా అర్హత నిబంధనలు నిర్దేశిస్తుంది. బహిరంగ (ఓపెన్) టెండర్ల నిర్వహణ ప్రాథమిక ఉద్దేశం కూడా ఇదే. అయితే బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణ(ఎండీవో) కాంట్రాక్టర్ ఎంపిక కోసం ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ(ఏపీఎండీసీ) రూపొందించిన నిబంధనలు ఈ ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా ఉన్నాయి. పోటీని పరిమితం చేసి, ప్రభుత్వ పెద్దలకు నచ్చిన సంస్థకే కాంట్రాక్టు కట్టబెట్టాలనే రహస్య ఎజెండాతోనే ఇలాంటి షరతులు పెట్టిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు ఇదే తరహా పనుల నిర్వహణ కోసం నిర్వహించిన టెండర్లలో అనుసరించిన నిబంధనలకు భిన్నంగా ఏపీఎండీసీ టెండర్ షరతులు ఉండడం గమనార్హం. ఈ షరతుల్లో మార్పులు చేయాలని, తమకు ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించాలని పలు సంస్థలు కోరుతున్నా ఏపీఎండీసీ లెక్కచేయడం లేదు. గోల్మాల్ నిబంధనలు ఛత్తీస్‌గఢ్‌లోని మదన్‌పూర్ దక్షిణం, మధ్యప్రదేశ్‌లోని సులియారీ బొగ్గు గనుల అభివృద్ధి, నిర్వహణకు సంస్థను ఎంపిక చేసేందుకు మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ (ఎంఎస్టీసీ) ద్వారా ఏపీఎండీసీ ఈ–టెండర్లు(ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు) ఆహ్వానించింది. మార్చి 19న టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. బొగ్గు గనుల అభివృద్ధి, తవ్వకం, నిర్వహణలో అనుభవం ఉన్న సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు పేర్కొంది. గని అభివృద్ధి, నిర్వహణకు సొంత ఆర్థిక వనరులతో ప్రణాళిక రూపొందించుకుని అవసరమైన నిర్మాణాలు, ఇంజనీరింగ్ కార్యక్రమాలతో సహా మొత్తం వ్యవహారాలు ఎండీవో కాంట్రాక్టరే చూసుకోవాల్సి ఉంటుందని టెండర్ నోటిషికేషన్లో వివరించింది. ఈ నెల 18వ తేదీ వరకూ దరఖాస్తుల సమర్పణకు గడువు ఇచ్చింది. ఇంతవరకూ బాగానే ఉన్నా టెండర్ నిబంధనలే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొత్తం ఖనిజాన్ని వెలికితీసే వరకూ ఈ గనులు ఎండీవో కాంట్రాక్టర్ నిర్వహణలోనే ఉంటాయి. ఏపీఎండీకి చెందిన మదన్‌పూర్ గనిలో దాదాపు 187 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. ఇందులో 137 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వొచ్చని అంచనా. సులియారీలోని గనిలో 147 మిలియన్ టన్నుల ఖనిజం ఉండగా, ఇందులో 109 మిలియన్ టన్నుల బొగ్గు తవ్వొచ్చని అంచనా. గని నిర్వహణతోపాటు తవ్వకాలు జరిపి ఓవర్ బర్డెన్(వృథా మట్టి)ని తొలగించి, అమ్మకానికి పనికొచ్చే బొగ్గును ఏపీఎండీసీకి అప్పగించాల్సి ఉంటుంది. ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులట! ఏ సంస్థ అయినా టెండర్ నోటిషికేషన్ జారీ చేస్తే దాన్ని ఎవరైనా ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని అందులో పాల్గొనేందుకు అర్హతలు, నిబంధనలు, చేయాల్సిన పనులు లాంటి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. అయితే, ఏపీఎండీసీ ఈ బొగ్గు గనుల ఎండీవో కాంట్రాక్టర్ ఎంపిక టెండర్ల విషయంలో ఈ నిబంధనలను గాలికొదిలేసింది. సంస్థ వెబ్సైట్లో పెట్టిన టెండర్ ప్రకటనలో కేవలం ఎండీవో కాంట్రాక్టర్ ఎంపిక కోసం ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మాత్రమే ఉంది. ఇతర అంశాలేమీ లేవు. ఆసక్తిగల వారు ఎంఎస్టీసీలో పేర్లు నమోదు చేసుకుని, దరఖాస్తు రుసుం రూ.50 వేలు చెల్లించి, నిబంధనలు తెలుసుకోవచ్చని పేర్కొంది. నిబంధనలు, పని వివరాలు తెలుసుకోవడానికే రూ.50 వేలు చెల్లించాలనడం గమనార్హం. ఏపీఎండీసీ గతంలో బెరైటీస్ ఖనిజం తవ్వకాలకు ఎంఎస్టీసీ ద్వారానే ఈ–టెండర్లు పిలిచింది. అప్పుడు టెండర్ నోటిఫికేషన్లోనే అన్ని నిబంధనలను పేర్కొంది. బొగ్గు గనుల ఎండీవో కాంట్రాక్టర్ ఎంపిక టెండర్ల విషయంలో మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరించింది. ప్రభుత్వ పెద్దలకు వాటాలు ఒక ఆర్థిక సంవత్సరంలో 20 మిలియన్ టన్నుల బొగ్గు తవ్విన అనుభవం ఉన్న సంస్థలకే ఈ టెండర్లలో పొల్గొనేందుకు అర్హత ఉంటుందని ఏపీఎండీసీ స్పష్టం చేసింది. ఎక్కువ సంస్థలు పోటీకి రాకుండా నివారించడంతోపాటు నచ్చిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టడం కోసమే ఇలాంటి షరతులు పెట్టినట్లు స్పష్టమవుతోంది. ‘‘టైలర్ మేడ్ నిబంధనలు పెడితే తక్కువ సంస్థలు పోటీలో ఉంటాయి. వాటి మధ్య రాజీ కుదిర్చి నచ్చిన సంస్థకు బొగ్గు గనులను కట్టబెట్టవచ్చు. తద్వారా ప్రభుత్వ పెద్దలు భారీగా వాటాలు పంచుకోవచ్చు. ఈ ఉద్దేశంతోనే ఏపీఎండీసీతో ఈ తరహా షరతులు విధించింది’’ అని ప్రముఖ కాంట్రాక్టర్ ఒకరు చెప్పారు. గతంలో ఏపీఎండీసీ మంగంపేటలోని గనుల్లో బెరైటీస్ తవ్వకం కాంట్రాక్టును కూడా ఇలాగే టైలర్ మేడ్ నిబంధనల ద్వారా చెన్నైకి చెందిన సంస్థకు కట్టబెట్టింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు భారీగా లబ్ధి పొందిన వైనాన్ని ‘సాక్షి’ బయటపెట్టింది. - మదన్‌పూర్ దక్షిణ బ్లాకులో ఏటా 38.12 మిలియన్ టన్నుల (బొగ్గు, ఓవర్ బర్డెన్) తవ్వకం కోసం ఎండీవో కాంట్రాక్టర్ ఎంపికకు ఏపీఎండీసీ ప్రస్తుతం టెండర్లు స్వీకరిస్తోంది. ఇందులో పాల్గొనాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో సింగల్ ఓపెన్‌కాస్ట్ మైన్‌లో 20 మిలియన్ టన్నుల బీసీఎం తవ్వి ఉండాలని, ఇందులో 2.70 మిలియన్ టన్నుల బొగ్గు/ లిగ్నైట్ ఉండాలని పేర్కొంది. - సులియారీ బ్లాక్‌లో ఏటా 41.8 టన్నుల బొగ్గు, ఓవర్ బర్డెన్ తవ్వకం కోసం ఎండీవో కాంట్రాక్టర్ ఎంపికకు ఏపీఎండీసీ బిడ్లు స్వీకరిస్తోంది. ఇందులో పాల్గొనాలంటే ఒక ఆర్థిక సంవత్సరంలో ఏదైనా ఓపెన్‌కాస్ట్ మైన్‌లో 20 మిలియన్ టన్నుల బీసీఎం తవ్వి ఉండాలని, ఇందులో 2.70 టన్నుల బొగ్గు, లిగ్నైట్ ఉండాలని షరతు విధించింది. - తలైపల్లి బొగ్గు బ్లాకులో ఏటా 104 మిలియన్ టన్నుల తవ్వకానికి గతంలో ఎన్టీపీసీ టెండర్లు ఆహ్వానించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో 15 మిలియన్ బీసీఎం తవ్విన సంస్థకు టెండర్లలో పాల్గొనేందుకు అర్హత కల్పించింది. ఏపీఎండీసీ మాత్రం ఏటా కేవలం 38.12 టన్నుల తవ్వకం కోసం 20 బీసీఎంను అర్హతగా నిర్దేశించడం గమనార్హం. రివర్స్ వేలం ద్వారా తుది నిర్ణయం బొగ్గు గనుల తవ్వకం విషయంలో ఇలాంటి షరతులు పెట్టడానికి కారణం ఏమిటని ఏపీఎండీసీ అధికారులను ప్రశ్నించగా... తమ బొగ్గు గనుల్లో స్ట్రైకింగ్ రేషియో ఎక్కువగా ఉన్నందున ఇలా పెట్టాల్సి వచ్చిందని చెప్పారు. స్ట్రైకింగ్ రేషియోను గతంలో టెండర్లు నిర్వహించిన సంస్థలు కూడా పరిగణనలోకి తీసుకున్నాయి. ‘‘రెండు గనులకు ఎండీవో కాంట్రాక్టర్ల ఎంపిక కోసం మొదట ఈ నెల 18న ఈ–వేలం నిర్వహిస్తాం. ఇందులో తక్కువ మొత్తానికి వచ్చిన బిడ్ ఆధారంగా రివర్స్ వేలం నిర్వహిస్తాం. ఈ–టెండర్లలో వచ్చిన బిడ్ కంటే తక్కువ మొత్తానికే రివర్స్ వేలంలో కోట్ చేయాల్సి ఉంటుంది. అయితే, ఈ–టెండర్లలో పాల్గొన్న సంస్థలకే రివర్స్ వేలంలో పాల్గొనడానికి అర్హత ఉంటుంది’’ అని అధికార వర్గాలు తెలిపాయి. -
కోల్‌మైనింగ్‌లో కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. బొగ్గుగనుల తవ్వకాల్లో ప్రయివేటు కంపెనీల ఎంట్రీకి ఆమోదం తెలుపుతూ నాలుగుదశాబ్దాల్లో మొదటిసారి నిర్ణయం తీసుకుంది. దేశంలో బొగ్గు గనుల తవ్వకాల వేలంలో పాల్గొనేందుకు ప్రయివేటు సంస్థలకు అనుమతినికి కేంద్ర క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మైనింగ్ అండ్ మినరల్స్ (డెవెలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్, 1957ను ఆమోదిచినట్టు కేంద్ర, రైల్వే, బొగ్గు శాఖ మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు. తద్వారా తక్కువ ధరకే విద్యుత్ లభించనుందని చెప్పారు. తద్వారా బొగ్గు తవ్వకాల్లో కమర్షియల్ మైనింగ్‌కు గేట్లు తెరిచింది క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియాకు భారీ ప్రయోజనం కలగనుందన్నారు. అలాగే కోల్ ఇండియాలో పనితీరును, సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి ప్రైవేటు రంగాల పోటీ దోహదపడుతుందని చెప్పారు. ఒడిషా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్గడ్ వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో అనేక ఉద్యోగాల కల్పనతోపాటు ఆదాయం పెరగనుందన్నారు. ఈ నిర్ణయం క్లీన్ కోల్ ఉత్పత్తికి కూడా దోహదపడుతుందన్నారు. పారదర్శకంగా ఇ-బిడ్డింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. బొగ్గు గనుల వేలం వాణిజ్య మైనింగ్‌కు అనుమతినివ్వడం చాలామంచి, ప్రోత్సాహకరమైన చర్యగా వేదాంత ప్రతినిది అనిల్ అగర్వాల్ అభివర్ణించారు. ఇది అసాధారణ అవకాశమని పేర్కొన్నారు. మరోవైపు అసోసియేషన్ ఆఫ్ పవర్ ప్రొడ్యూసర్స్ ఈ విధానాన్ని స్వాగతించింది. అయితే ప్రభుత్వం కఠినమైన నిబంధనలను రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కాగా భారతదేశ విద్యుత్ ఉత్పాదనలో 70శాతం బొగ్గుదే. ఈ నేపథ్యంలో దేశంలో 2022 నాటికి 1 బిలియన్ టన్నుల ఉత్పత్తిని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంది. మరోవైపు ఈ ప్రకటనతో స్టాక్మార్కెట్లో కోల్ ఇండియా, వేదాంత తదితర షేర్లు భారీ లాభాల నార్జిస్తున్నాయి. -
నల్లబంగారు నేల.. మంచిర్యాల
ఘన చరిత్ర.. ఈ ప్రాంతం సొంతం ఖనిజ సంపద, బొగ్గు నిక్షేపాలకు నెలవు పారిశ్రామికంగానూ ఎంతో అభివృద్ధి రెండో అన్నవరంగా కొలువైన గూడెం సత్తన్న గుడి.. సిరుల వేణి సింగరేణి నెలవైన బొగ్గు గని... ఎల్లంపల్లి జలసిరి.. ఎల్‌మడుగు అందాల ఝరి.. జైపూర్ విద్యుత్ వెలుగులు.. దట్టమైన కవ్వాల్ అడవులు.. ఇవీ... మంచిర్యాల జిల్లాలో అలరారే అద్భుతాలు. ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉన్న మంచిర్యాల నేటి నుంచి స్వయం ప్రతిపత్తిని పొంది, మంచిర్యాల జిల్లాగా ఆవిర్భవిస్తోంది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా విశేషాల సమాహారం. - మంచిర్యాల టౌన్ ఈ పేరెలా వచ్చిందంటే.. మంచిర్యాల అనే పేరు వెనక పెద్దగా కథలేమీ లేకపోయినా, ప్రాచుర్యంలో మాత్రం ఇక్కడ కొన్ని కథలు వినిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా రాముడు సీత కోసం వెతుక్కుంటూ ఇక్కడి ప్రాంతంలోని గోదావరి తీరానికి వచ్చాడని, ఇక్కడే సేద తీరగా, రాత్రి సమయంలో ఎన్నడూ లేని విధంగా బాగా నిద్రపోయాడని, అనంతరం ఇక్కడి నుంచి వెళ్లే సమయంలో ఇక్కడ మంచి నిద్ర వచ్చింది, ఈ నేల మంచిదని అంటూ వెళ్లాడని ఓ కథనం ఉంది. మంచి నేల అనేది వాడుకలోకి వచ్చేసరికి మంచిర్యాల అనే పేరు వచ్చిందని చెబుతారు. దీంతో పాటు మరో కథనం ఉంది. బ్రిటీషు వారి కాలంలో నిజాం నవాబులు ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు రైల్వే లైను వేశారు. ఆ సమయంలో మధ్యలో ఎక్కడా స్టేషన్ లేకపోగా, సేద తీరేందుకు ఇక్కడే ఓ గెస్ట్ హౌజ్‌ను కట్టారని, ఇక్కడి వాతావరణం నచ్చడంతో, మరో మాంచెస్టర్గా దీన్ని తయారు చేయాలని అప్పుడు నిర్ణయించినట్లు చెబుతారు. అందుకే మంచిర్యాలలో ఇనుము ఫ్యాక్టరీని సైతం ఏర్పాటు చేశారు. కానీ కాలక్రమేణా అది మూతపడింది. మరో మాంచెస్టర్ సిటీగా చేయాలనుకోవడంతోనే దీనికి ఆ పేరు వచ్చిందని, ఆ పేరు వాడుకలో మారుతూ మంచిర్యాలగా నిలిచిందన్నది మరో కథనం. గోదావరి తీరాన ఉండడం, ఇక్కడికి రకరకాల రాళ్లు కొట్టుకు వస్తుండడంతో, ఇతర ప్రాంతాల నుంచి చాలా మంది రాళ్ల సేకరణకు వచ్చేవారని, అందుకే దీనిని మంచి రాళ్లు దొరికే స్థలంగా పిలుస్తూ, మంచిర్యాల అన్నారనే కోణమూ ఉంది. వెలుగు తెచ్చిన నేతలు మంచిర్యాల నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం సంపాదించింది ఇక్కడి రాజకీయవేత్తలే. 1967-72లో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జేవీ నర్సింగరావుది దండేపల్లి మండలం ధర్మరావుపేట్. శాసనసభ్యుడిగా, మంత్రిగా, విద్యుత్ శాఖ బోర్డు చైర్మన్‌గా, ఉప ముఖ్యమంత్రిగా తన సేవలను అందించారు. న్యాయశాస్త్రం చదివిన జేవీ విద్యార్థి దశ నుంచే సేవపై తన అభిరుచిని పెంచుకున్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి, 1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆదిలాబాద్ ఎంపీగా పోటీ చేసి అపజయం పొందారు. 1955లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవిని స్వీకరించి, ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ఏర్పడిన నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో జేవీ రోడ్లు, భవనాలు, నీటి పారుదల, విద్యుత్ శాఖలను నిర్వహించారు. 1963 నుంచి 1967లో అప్పటి లక్సెట్టిపేట నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఎన్నికై, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. నెన్నెల మండలం జోగాపూర్‌కి చెందిన ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్‌గా తెలంగాణ ఉద్యమంలో తిరుగులేని పాత్ర పోషించారు. హైకోర్టు జడ్జిగా పనిచేసి రిటైర్ట్ అయిన చంద్రయ్యది జన్నారం మండలం తిమ్మాపూర్. జిల్లాకే తలమానికం బొగ్గు గనులు మొదట బొగ్గు గని ఖమ్మం జిల్లాలో ఏర్పాటవగా ఆ తర్వాత 1927లో మన బెల్లంపల్లిలోనే తవ్వారు. అప్పటి నుంచి బెల్లంపల్లిలో సౌత్‌క్రాస్‌కట్. నెం.2 ఇంక్లయిన్, 24 డిప్, 84, 85 డిప్ గనులు, 68 డిప్ గని, శాంతిఖని, 1961లో మందమర్రి, రామకృష్ణాపూర్‌లలో, 1971లో శ్రీరాంపూర్, 1991లో చెన్నూరు ప్రాంతాల్లో బొగ్గు గనులు ఆవిర్భవించాయి. తూర్పు ప్రాంతంలో వెలసిన భూగర్భ బొగ్గు గనులు, ఓపెన్‌కాస్టు గనులతో మంచిర్యాల జిల్లాలో సుమారు 14 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. దీంతో పాటు మరో ఏడు వేల మంది కాంట్రాక్టు కార్మికులు, సింగరేణిపై ఆధారపడి మరో 15 వేల మంది ఉపాధిని పొందుతున్నారు. జైపూర్‌లో 1200ల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. గోదావరి, ప్రాణహిత నదుల ప్రవాహాలు, ఖనిజ, వృక్ష సంపద, ఎల్లంపల్లి ప్రాజెక్టు, గూడెం సత్యనారాయణస్వామి ఆలయం ఇక్కడి మరిన్ని విశేషాలు. ఏసీసీ ప్రాంతంలో సిమెంట్ తయూరీ కంపెనీ ఉంది. -
సమావేశంలో సమస్యలపై చర్చ
శ్రీరాంపూర్ : గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, యాజమాన్యం మధ్య శనివారం ఏరియా స్థాయి స్ట్రక్చరల్ సమావేశం జరిగింది. ఇన్చార్జి జీఎం జేవీఎల్ గణపతి అధ్యక్షత జరిగిన సమావేశంలో టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి ఇతర ప్రతినిధులు సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎస్సార్పీ 3 గని నుంచి ఎస్సార్పీ 1 గని మ్యాగ్జిన్ వరకు వెళ్లే దారి బురదమయం అయిందని తెలిపారు. మైనింగ్ రూల్స్‌కు వ్యతిరేకంగా మైనింగ్ సిబ్బందితో రెండు పనులు చేయిస్తున్నారని, సర్దార్, షాట్‌ఫైరర్ పనులు ఏక కాలంలో చేయిచండం మానుకోవాలని పేర్కొన్నారు. ఐకే 1ఏ గనిలో జనరల్ షిఫ్ట్, షిఫ్ట్ కోల్కట్టర్లు, టింబర్‌మెన్‌లు, లైన్మెన్లు, ట్రామర్లు, సర్వే సిబ్బందికి రెస్టు రూంలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎస్ఓటు జీఎం పీవీ సత్యనారాయణ, డీజీఎంలు శర్మ, జె.కిరణ్, శ్రీనివాస్‌రావు, టీబీజీకేఎస్ ప్రతినిధులు పానుగంటి సత్తయ్య, నెల్కి మల్లేశ్, సంజీవ్, లెక్కల విజయ్ పాల్గొన్నారు. -
శేష జీవితం ప్రశాంతంగా గడపాలి
డీవైజీఎం కేవీ.సీతారామారావు గనులపై రిటైర్డు కార్మికులకు సన్మానం బెల్లంపల్లి : సింగరేణిలో ఉద్యోగ విరమణ పొందుతున్న కార్మికులు శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని బెల్లంపల్లి సింగరేణి డీవైజీఎం(ఎక్స్‌ప్లోరేషన్) కేవీ.సీతారామారావు అన్నారు. శనివారం ఎక్స్‌ప్లోరేషన్ విభాగంలో గంధం గట్టయ్య(టర్నర్), ఖాజామొహినోద్దీన్(డ్రైవర్) ఉద్యోగ విరమణ పొందారు. వీరికి డీవైజీఎం పూలమాల వేసి శాలువాతో సత్కరించారు. ఎస్ఈ రమేశ్చందర్, శివనారాయణ, డీవైఎస్ఈ శ్రీనివాస్‌రావు, ఆఫీస్ ఇన్చార్జి పి.రాజమలు పాల్గొన్నారు. కాసిపేటగనిపై కాసిపేట : మందమర్రి ఏరియా కాసిపేటగనిపై ట్రామర్ కోడి పెద్దులు, కోల్‌కట్టర్ రాంటెంకి రాజయ్య, జనరల్ మజ్దూర్ కార్మికుడు వేల్పుల గంగయ్య దంపతులను గని మైనేజర్ సైదులు, కార్మిక సంఘాల నాయకులు సన్మానించారు. రక్షణాధికారి అల్లావుద్దీన్, డెప్యూటీ మేనేజర్ సునిల్‌కుమార్, సంక్షేమాధికారి మైత్రేయ బందు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. రామకృష్ణాపూర్లో.. రామకృష్ణాపూర్ : మందమర్రి ఏరియాలోని ఆర్కే1ఏ గనిలో హాలర్ ఆపరేటర్లు ఎండీ.అంకూస్, సుంచు రాజయ్య, టెండాల్ సూపర్వైజర్ ఇర్రంకి రాము, ట్రామర్ ఓదెలు, డిప్యూటీ సూపర్వైజర్ అప్పారావు, కోల్‌ఫిల్లర్ రావుల సాంబయ్య, టింబర్‌మెన్ కార్మికుడు అప్పాల చంద్రయ్యలను శాలువాలతో సన్మానించి జ్ఞాపికను అందజేశారు. గని మేనేజర్ కృష్ణారావు, రక్షణాధికారి రాంబరోస్ మహతా, సంక్షేమాధికారి భేతిరాజు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో.. శ్రీరాంపూర్ : శ్రీరాంపూర్ ఏరియాలోని పలు గనులపై రిటైర్డ్ కార్మికులను ఘనంగా సన్మానించారు. శ్రీరాంపూర్ ఓసీపీలో పి.తిరుపతిరాజు(హెడ్‌ఓవర్‌మెన్)ను గని మేనేజర్ ఎం.నరేందర్ శాలువాతో సత్కరించారు. టీబీజీకేఎస్ బ్రాంచి ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, గని రక్షణాధికారి వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రాజెక్టు అధికారి సీహెచ్.రవీందర్ పాల్గొన్నారు. ఆర్కే 6గనిపై.. ఆర్కే 6 గనిపై జె.రామారావు(కోల్‌కట్టర్), యస్.దశరయ్య(ట్రామర్), గాజుల నర్సయ్య(జనరల్ మజ్ధూర్), ఏకుల రాజయ్య(జనరల్ మజ్ధూర్), అప్పాల లచ్చన్న(కోల్‌ఫిల్లర్), డి.వెంకటయ్య(కోల్‌ఫిల్లర్)లను గని మేనేజర్ ఎన్.సత్యనారాయణ శాలువాతో సత్కరించారు. గని రక్షణాధికారి సీహెచ్.శ్రీనివాస్‌రావు, ఫిట్ ఇంజినీర్ వీపీజే వెంకటేశ్, సంక్షేమ అధికారి శ్యాంప్రసాద్, గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ బ్రాంచి సెక్రెటరీ పానుగంటి సత్తయ్య, ఫిట్ సెక్రెటరీ మేడారపు సత్తయ్య పాల్గొన్నారు. ఆర్కే 5 గనిలో.. ఆర్కే 5 గనిలో రజ్జల వెంకటయ్య(జనరల్ మజ్ధూర్)ను గని మేనేజర్ జి.మల్లేశ్ శాలువాతో సత్కరించారు. గని డెప్యూటీ మేనేజర్ యస్కే సిన్హా, ఫిట్ ఇంజినీర్ రాధాకృష్ణ పాల్గొన్నారు. ఎస్సార్పీ 3, 3ఏ గనిలో.. ఎస్సార్పీ 3, 3ఏ గనిలో వేముల శంకర్(కోల్‌కట్టర్), ఎండీ ఖాజాపాషా(ఎలక్ట్రీషియన్), పళ్ల రామస్వామి(ట్రామర్), రావుల రాయలింగు(హాలర్ ఆపరేటర్), దూలం చంద్రయ్య(కోల్‌కట్టర్)లను గని మేనేజర్ యన్.రమేశ్ శాలువాతో సత్కరించారు. గని మేనేజర్ డి.సతీశ్ పాల్గొన్నారు. రిటైర్డ్ అధికారికి సన్మానం.. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో డెప్యూటీ సూపరిండెంట్ ఐ.సనత్‌కుమార్‌ను డీజీఎం(పర్సనల్) శర్మ, డీజీఎం జె.కిరణ్ శాలువాతో సత్కరించారు. డీవైపీఎం ఆజ్మీరాతుకారాం, టీబీజీకేఎస్ ఫిట్ సెక్రెటరీ రాళ్లబండి రాజన్న పాల్గొన్నారు. మందమర్రి ఏరియాలో.. మందమర్రి : మందమర్రి ఏరియాలోని వివిధ గనులు, డిపార్టుమెంట్లలో శనివారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను ఆయా గని ఆవరణలో ఏర్పాటు సన్మానించారు. కేకే–5 గనిలో డిప్యూటీ సూపరింటెండెంట్ చింతల శరత్ చంద్ర, కోల్‌కట్టర్ కూరపు కోంరయ్యలను శాలువాతో సన్మానించారు. గని మేనేజర్ రాంమోహన్ పాల్గొన్నారు. ఖైరిగూడ ఓసీపీలో.. రెబ్బెన : ఖైరిగూడ ఓసీపీలో ఓసీపీలో జనరల్ మజ్దూర్ పవిసెట్టి సారయ్య దంపతులను ఓసీ మేనేజర్ శ్రీరమేష్ పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఫిట్ ఇంజనీరు అహ్మద్ అలీ, వెల్ఫేర్ అధికారి సాదన్, సేఫ్టీ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. గోలేటి–1ఏలో.. తాండూర్ : ఏరియా గోలేటీ–1ఏ గనిలో బంధం రాజన్న(మైనింగ్ సర్దార్), ఎం.రామపోశం(ఫోర్‌మెన్), మురళయ్య(క్లర్క్), దుర్గం ఇస్తారి(సపోర్టు మజ్దూర్), మేడం శంకరయ్య(టింబర్‌మెన్), పల్లె పోశం(జనరల్ మజ్దూర్), జుమ్మిడి చంద్రయ్య(లైన్మెన్), నలివేలి రాయమల్లు(కోల్‌కట్టర్)లను గోలేటీ గ్రూ‹ఫ్ ఆఫ్ మైన్స్ ఏజెంట్ దేవేందర్, మేనేజర్ మహేశ్ సన్మానించారు. వెంటిలేషన్ ఆఫీసర్ గుప్తా, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ శంకర్, వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీకాంత్, టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్రాజ్ శ్రీనివాస్‌రావు, ఏరియా కార్యదర్శి బైరి శంకర్, ఫిట్ కార్యదర్శి సంపత్, ఏఐటీయూసీ బ్రాంచి ఉపాధ్యక్షుడు బయ్య మొగిళి పాల్గొన్నారు. -
కొత్తగా ఐదు బొగ్గు గనులు
ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం మరో ఆరు గనులకు ప్రతిపాదనలు అదనంగా 11 మిలియన్ టన్నుల ఉత్పత్తి æ నల్లబంగారం ఉత్పత్తిలో సింగరేణి ముందంజ సాక్షి, హన్మకొండ : వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా సింగరేణి సంస్థ అడుగులు వేస్తోంది. భారీ స్థాయిలో గనులను విస్తరించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది ఐదు కొత్త గనుల నుంచి బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే మరో ఆరు గనులు ప్రారంభించేందుకు అవసరమైన అనుమతుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దక్షిణ భారతదేశంలోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా పేరుగాంచిన సింగరేణి వరుసగా వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటు పోతోంది. ఈ ఏడాది 63 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలో ఐదు నూతన గనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. తొలి ఏడాదిలో ఈ గనుల నుంచి 4 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రెండో ఏడాది నుంచి ఈ ఐదు గనులు ద్వారా ఏటా 11.50 మిలియన్ టన్నులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా రాబోయే గను ల్లో ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో శాంతిఖని(కంటిన్యూస్ మైనర్), వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏరియాలోని కాకతీయఖని ఓపెన్ కాస్ట్–02, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలో పీవీకే–5, జేవీఆర్ ఓపెన్‌కాస్ట్–02 గనులు, మణుగూరులో ఓపెన్‌కాస్ట్–2లను ప్రారంభించనున్నారు. వేగంగా విస్తరణ గత దశాబ్దకాలంగా చేపట్టిన సంస్కరణ ఫలితంగా సింగరేణిలో గనులు, కార్మికుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. 2000 ప్రారంభంలో లక్ష మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు సింగరేణి సంస్థలో పనిచేశారు. ప్రస్తుతం ఆ సంఖ్య 59వేల దగ్గర ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున «థర్మల్ పవర్ ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అందుకు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండటంతో సింగరేణి సంస్థ విస్తరణపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. ప్రస్తుతం 34 భూగర్భ, 15 ఉపరితల గనులు ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి 60 మిలియన్ టన్నులుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభించడంతో పాటు రాబోయే మూడేళ్లలో మరో ఆరు గనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. దీంతో సింగరేణి వార్షిక బొగ్గు ఉత్పత్తి సామర్థ్యం 70 మిలియన్ టన్నులు దాటనుంది. కొత్త గనులు ప్రారంభమైతే తెలంగాణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అనుమతుల కోసం.. సింగరేణి సంస్థ రాబోయే రెండు మూడేళ్లలో ఆరు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. వరంగల్ జిల్లా భూపాలపల్లి ఏరియాలో కేటీకే(కాకతీయఖని) 3 భూగర్భగని, కేటీకే 5లో లాంగ్వాల్ ప్రాజెక్టు, ఆదిలాబాద్ జిల్లాలో శాంతిఖని, శ్రీరాంపూర్ ఓసీపీ–2, ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఏరియాలో రాంపూర్ భూగర్భగని, జేవీఆర్(జలగం వెంగళరావు) ఓసీపీ–2లకు అనుమతులు ఇవ్వాలని సింగరేణి కార్పొరేట్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్టు విభాగం నిర్ణయించింది. వీటిలో రాంపూర్ భూగర్భగని, జేవీఆర్ ఓసీపీ–2లకు ఇటీవల టెక్నికల్ బోర్డు ఆమోదముద్ర వేసింది. వీటికి సంబంధించి పర్యావరణ అనుమతులు కోసం కేంద్ర పరిశీలనకు పంపనున్నారు. విడతల వారీగా మిగిలిన నాలుగు గనులకు టెక్నికల్ బోర్డు అనుమతి ఇవ్వనుంది. రాంపూర్ భూగర్భగని నుంచి ప్రతి ఏటా 1.4 మిలియన్ టన్నులు, జేవీఆర్ ఓసీపీ–2 నుంచి 10 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. -
టీబీజీకేఎస్ వర్సెస్ ఏఐటీయూసీ
► ఆత్మగౌరవ సభల పేరుతో గుర్తింపు సంఘం ► కార్మిక విముక్తి దినం పాటించాలని ఏఐటీయూసీ ► నేడు బొగ్గుగనులపై పోటాపోటీ కార్యక్రమాలు గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో ప్రధాన కార్మిక సంఘాలు నిమగ్నమయ్యాయి. కొన్ని యూనియన్లు ఆయా గనులు, ఓసీపీలపై పర్యటిస్తూ కార్మికులను కలుసుకుని సమస్యల పరిష్కారం కోసం ముందుంటామని హామీలు గుప్పిస్తున్నాయి. అయితే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్, ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీ మాత్రం మరో అడుగు ముందుకు వేసి పరస్పర విమర్శల దాడికి దిగుతున్నాయి. ప్రస్తుత గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న టీబీజీకేఎస్ నాలుగేళ్ల కాలపరిమితి నేటి(జూన్ 28)తో ముగియనున్నందున ఆ సంఘం గుర్తింపు హోదాను రద్దు చేయాలని, కార్మికుల జీతాల నుంచి కోత విధిస్తున్న సభ్యత్వ రుసుమును వెంటనే నిలిపివేయాలని, వారసత్వ ఉద్యోగాలతోపాటు గత ఎన్నికల మెనిఫెస్టోలో పేర్కొన్న 72 హామీల్లో చాలా వరకు నెరవేర్చలేదని ఏఐటీయూసీ విమర్శలు గుప్పిస్తోంది. అలాగే ఈనెల 28న(మంగళవారం) అన్ని గనులు డిపార్ట్మెం ట్లలో కార్మిక విముక్తి దినం పాటించాలని నాయకత్వం కార్మికులకు పిలుపునిచ్చింది. అయితే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ కూడా ఏఐటీయూసీని గట్టిగా ఎదుర్కొనే పనిలో నిమగ్నమైంది. సింగరేణిలో 1998 నుంచి 2012 వరకు 14 సంవత్సరాల కాలంలో ఏఐటీయూసీ గుర్తిం పు సంఘంగా పనిచేసింది ఎనిమిదేళ్లే అరుునా పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిందని, సభ్యత్వం డబ్బు 19 నెలలు అదనంగా వసూలు చేసుకొని కార్మిక హక్కులను తాకట్టుపెట్టిందని టీబీజీకేఎస్ పేర్కొంటోంది. నాడు అధికారంతోపాటు కార్మికుల సొమ్మును అదనంగా పొంది నేడు ఎన్నికల్లో లబ్ధిపొందడానికి లేనిపోని ఆరోపణలు చేస్తోందని, వాటిని నమ్మవద్దని కార్మికులను కోరుతోంది. 2012 ఎన్నికల్లో బుద్ధిచెప్పినప్పటికీ మళ్లీ కుట్రలు పన్నుతున్న ఏఐటీయూసీకి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నారు. ఈ క్రమంలో నేడు అన్ని గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లపై ఆత్మగౌరవ సభలు నిర్వహించడానికి టీబీజీకేఎస్ సమాయత్తమైంది. దీంతో గనులపై రెండు సంఘాల మధ్య పోటాపోటీ కార్యక్రమాలు వేడిపుట్టించనున్నారుు. -
సింగరేణిలో ఖాళీలు భర్తీ చేయాలి
► అర్హులైన ఉద్యోగులకు పదోన్నతి కల్పించాలి ► వారసత్వ హక్క పునరుద్ధరించాలి ► ఓపెన్‌కాస్టులతో పర్యావరణానికి విఘాతం ► సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) అధ్యక్షుడు చింతల సూర్యనారాయణ. రామగుండం : సింగరేణి సంస్థలో ఉద్యోగ విరమణ చేస్తున్న కార్మికుల స్థానంలో కొత్త వారిని నియమించాలని, వారసత్వ ఉద్యోగావకాశాలు ఇవ్వాలని సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ (బీఎంఎస్) జాతీయ అధ్యక్షుడు చింతల సూర్యనారాయణ అన్నారు. కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామగుండం పట్టణానికి చెందిన కౌశిక హరిని ఎంపిక చేసి నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవడంతో ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నా ఉద్యోగులు, కార్మికులు ఉద్యోగ విరమణ పొందుతున్న వారి స్థానంలో ఖాళీల ను మాత్రం భర్తీ చేయడంలేదని పేర్కొన్నారు. దీంతో ఉన్నవారిపై భారం పడుతోందని తెలి పారు. సింగరేణిలో 50-60 మెట్రిక్ టన్నులకు మాత్రం ఉత్పత్తి పెరిగిందని, కార్మికుల సంఖ్య 1.25 లక్షల నుంచి 57 వేలకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని, అధికారి కార్మిక సంఘం వారసత్వ ఉద్యోగాలను మరిచిందని ఎద్దేవా చేశారు. ఓపెన్‌కాస్టుల ఏర్పాటుకు కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ వ్యతి రేకమని, ఓపెన్‌కాస్టులతో పర్యావరణానికి విఘాతం కలుగుతోందన్నారు. సింగరేణి సం స్థలో ఉన్నత స్థానంలో ఉద్యోగాల కల్పనకు కో ల్ ఇండియా మాదిరిగా నోటిఫికేషన్ జారీ చేయకుండా అత్యధిక విద్యావంతులైన కార్మికులలో నే అర్హులైన వారిని ఎంపిక చేయాలని, వారి స్థానంలో వారసులకు ఉద్యోగావకాశాల ను కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తొమ్మి దో వేజ్‌బోర్డు ఒప్పందంలో కార్మికులకు అన్యా యం జరిగిందని, కార్మిక హక్కుల సాధనతోపాటు జూలై నుంచి అమలుకానున్న పదో వేజ్‌బోర్డులో కార్మికులకు సంపూర్ణ న్యాయం జరి గే విధంగా గోదావరిఖని నుంచి గోలేటి వరకు ఈనెల 3 నుంచి భరోసా యాత్ర చేపడుతున్న ట్లు తెలిపారు. సమావేశంలో కేంద్ర నిర్వాహక కార్యదర్శి టంగుటూరి కొమురయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ కౌశిక హరి, ఉపాధ్యక్షుడు పూల నాగరాజు, రాష్ట్ర కోకన్వీనర్ బూర్ల లక్ష్మీనారాయణ, వడ్డెపల్లి రాంచందర్, పెద్దపల్లి రవీం దర్, సుల్వ లక్ష్మీనర్సయ్య, కోమళ్ల మహేశ్, బాలరాజ్‌కుమార్, గాలిపెల్లి తిరుపతి, బోడకుంట జనార్దన్, శివరాత్రి సారయ్య, నాయని రాజేశం, తీగుట్ల లింగయ్య, కండె మధు పాల్గొన్నారు. -
చింతలపూడి, నూజివీడులో బొగ్గు నిక్షేపాలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో బొగ్గునిక్షేపాలపై అన్వేషణకు రాష్ట్రప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కేజీ బేసిన్ పరిధిలోని పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, కృష్ణాజిల్లా నూజివీడు పరిసర ప్రాంతాల్లో అపార బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు కొంత కాలం క్రితం అధ్యయనాల్లో తేలిన విషయం విదితమే. బొగ్గు ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉందో అన్వేషించటానికి ప్రభుత్వం మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎంఇసిఎల్), నేషనల్ మైనింగ్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్(ఎన్ఎంఇటి) ప్రతినిధులతో త్రైపాక్షిక ప్రాథమిక అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ముఖ్యమంత్రి కార్యాలయంలోని చీఫ్ సెక్రెటరీ శ్రీ ఎస్పీ టక్కర్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎంఓయూ చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సున్నపురాయి వేలం, బంగారు ఖనిజాన్వేషణలో ఈ సంస్థలు సహకారం అందిస్తాయి. 2017 నాటికి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు పనులు వేగవంతం చేయాలని తమ శాఖ కార్యకలాపాల ప్రగతిని సమీక్షించామని మంత్రి పీతల సుజాత చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌కు ఖనిజాన్వేషణ పూర్తవుతుందని ఆమె అన్నారు. ఎంఓయూ ప్రకారం రాష్ట్రంలో పెద్దతరహా ఖనిజాలపై ఎన్ఎంఇటీకి 2% రాయల్టీ లభిస్తుంది. ఈ రాయల్టీ సొమ్మును ఎన్ఎంఇటి రాష్ట్రంలో ఖనిజాన్వేషణ చేపట్టనున్న ఎంఇసిఎల్కు చెల్లిస్తుంది. కొత్త ఖనిజ నిక్షేపాలను గుర్తించిన తర్వాత వాటిని బ్లాకులుగా చేసి వేలం వేస్తారు. ఎన్ఎంఇటి, ఎంఇసిఎల్ల సహకారంతో జరిగే ఖనిజాన్వేషణ నిరంతర ప్రక్రియ అవుతుంది. ఒప్పంద పత్రాల మార్పిడి కార్యక్రమంలో మంత్రి పీతల సుజాత, శ్రీ ఎస్పీ టక్కర్, గనుల శాఖ కార్యదర్శి శ్రీ గిరిజా శంకర్, ఎన్ఎంఇటి పక్షాన కోషిఖాన్, ఎంఇసిఎల్ తరపున శ్రీ యోగేష్ శర్మ పాల్గొన్నారు. -
లాభాల గని మూసివేత..!
కేటీకే-2 యూజీ స్థానంలో ఓసీపీ-2 ఇతర గనులకు కార్మికుల తరలింపు ప్రక్రియ ముమ్మరం చేసిన యాజమాన్యం కోల్‌బెల్ట్ : లాభాల బాటలో పయనిస్తున్న వరంగల్ జిల్లా భూపాలపల్లి కేటీకే-2 భూగర్భగని మూతపడనుంది. ఈ గనిని ఓపెన్‌కాస్టు-2 గా మార్చేందుకు యూ జమాన్యం రంగం సిద్ధం చేసింది. కంపెనీ విజ్ఞప్తి మేరకు తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఓపెన్‌కాస్ట్ చేపట్టే ఏరియాలో గత ఏడాది ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రావలసి ఉంది. సింగరేణి యాజమాన్యం, తెలంగాణ జెన్కో మధ్య 30 ఏళ్లపాటు జరిగిన కోల్ లింకే జీ ఒప్పందంతో గణపురం మండలం చెల్పూర్లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ)లోని 500 మెగావాట్ల ప్లాంట్‌కు ప్రతి ఏటా 2.50 మిలియన్ టన్నుల బొగ్గు సరఫరా చేయా ల్సి ఉంది. ఏరియాలోని భూగర్భగనుల నుంచి ప్రతి ఏటా 14 లక్షల టన్నులు, కేటీకే ఓసీ సెక్టార్-1 నుంచి 15 లక్షల టన్నుల బొగ్గు వెలికితీస్తున్నారు. ఒప్పందం ప్రకారం యూజమాన్యం భూపాలపల్లి, రామగుండం ఏరియాల నుంచి బొగ్గు సరఫరా చేస్తున్నది. ఓసీపీ-2 ఆవశ్యకత కేటీపీపీ విద్యుత్ ప్లాంట్‌కు సరిపడా బొగ్గు అం దించడానికి భూపాలపల్లిలోని కేటీకే-3 భూగర్భగనిని 2008లో ఓపెన్‌కాస్టు సెక్టర్-1గా మార్చారు. కేవలం 9.33 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీయడానికి చేపట్టిన ప్రాజెక్టులో ఇప్పటి వరకు 6.62 మిలియన్ టన్నులు తీశా రు. మిగిలిన 17 లక్షల టన్నుల బొగ్గును ఈ ఏడాది డిసెంబర్ వరకు ఉత్పత్తి చేసే అవకాశముంది. ఆ తర్వాత విద్యుత్ ప్లాంట్‌కు బొగ్గు అందించడానికి కేటీకే-2 గనిని ఓసీపీగా మార్చేందుకు ప్లానింగ్ చేశారు. ఇప్పటివరకు కేటీకే-2 గనిలో 3 సీంలో 10 ఎస్డీఎల్ యం త్రాల ద్వారా 3.1 మిలియన్ టన్నుల బొగ్గు వెలికి తీశారు. డిసెంబర్ నాటికి మరో 3 లక్షల టన్నులు తీయనున్నారు. గనిలోని 1, 2 సీంల లో ఉన్న 17 మిలియన్ టన్నుల బొగ్గును 11 సంవత్సరాలపాటు ఏటా 1.5 మిలియన్ టన్ను ల చొప్పున ఉత్పత్తి చేయడానికి ఓసీపీగా మార్చుతున్నారు. కార్మికుల తరలింపు కేటీకే-2 గనిలో 10 ఎస్డీఎల్ యంత్రాల ద్వారా 1300 మంది కార్మికులతో 3 సీంలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. యాజమాన్యం తీసుకున్న నిర్ణయంతో ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. డిసెంబర్ వరకు మాత్రమే గనిలో కార్మికులు పనిచేసే అవకాశాలున్నాయి. ఓసీపీ-2ను జనవరి 2017 నాటికి చేపట్టేందుకు అధికారులు చర్య ముమ్మరం చేశారు. ఇక్కడ పని చేస్తున్న కార్మికులతోపాటు ఎస్డీఎల్ యంత్రాలను కేటీకే-5, కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టుకు పంపించనున్నారు. రెండేళ్లుగా లాభాలు 2013-14 ఆర్థిక సంవత్సరం గనిలోని 1 సీంలో బొగ్గు ఉత్పత్తి చేపట్టారు. జి-5గ్రేడ్ బొగ్గు వెలికితీయడంతో సంస్థకు లాభాలు రాలేదు. పైగా నిర్దేశిత లక్ష్యం చేరుకోలేదు. 2014-15లో సింగరేణి వ్యాప్తంగా రెండు గనులు మాత్రమే లాభాల బాట పట్టారుు. అందులో కేటీకే-2 గని స్థానం దక్కించుకుంది. సుమారు రూ.2కోట్ల లాభాలు వచ్చారుు. భూపాలపల్లి ఏరియాకు 2015-16 ఆర్థిక సంవత్సరం రూ.98 కోట్ల నష్టాలు వచ్చారుు. అండర్‌గ్రౌండ్ గనుల జాబితాలో కేటీకే-2 గని మాత్రమే రూ.రెండు కోట్ల లాభాలతో నిలిచింది. ఉత్పత్తి వ్యయం సైతం టన్నుకు రూ.227 తగ్గించుకుంది. అలాంటి గనిని ఓసీగా మార్చటం పట్ల కార్మకులు, కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం గనిలో ఉన్న 1340 మంది కార్మికులలో సుమారు 1000 మందిని ఇతర గనులకు బదిలీ చేస్తే ఓసీలో 340 మంది మాత్రమే పనిచేయనున్నారు. 2017 నాటికి ఓసీపీ-2 కేటీపీపీకి బొగ్గు సరఫరా చేయడంలో భాగంగా 2017 జనవరి నుంచి కేటీకే ఓసీపీ-2ను సిద్ధం చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాం. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేశాం. అనుమతుల కోసం వేచి చూస్తున్నాం. గనిలోని కార్మికులను ఏరియాలోని ఇతర గనులకు బదిలీ చేస్తాం. - పాలకుర్తి సత్తయ్య, ఏరియూ జీఎం -
బొగ్గు గనుల్లో నీరు.. ఉత్పత్తికి అంతరాయం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. రాంపుర్, రామకృష్ణాపూర్, గోలేటి ఓపోన్ బొగ్గు గనుల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దండేపల్లి, మంచిర్యాల, చెన్నూరు, లక్సెట్టిపేట ప్రాంతాల్లో ఆరు బయట ఉంచిన ధాన్యం తడిసిపోయింది. -
నేడు ఓపెన్ కాస్ట్ గనుల అధ్యయన యాత్ర
ప్రారంభించనున్న ప్రొ. కోదండరాం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల అధ్యయన యాత్రను జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లోని అల్వాల్ జేఏసీ దీక్షా శిబిరం నుంచి ఈ యాత్ర మొదలుకానుంది. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జెండా ఊపి యాత్రను ప్రారంభిస్తారు. జేఏసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు, పలు ప్రజాసంఘాల నాయకులు కాన్వాయ్‌గా ఇక్కడి నుంచి బయల్దేరి ఉదయం 9 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌కు చేరుకుంటారు. వివిధ జిల్లాలకు చెందిన బాధ్యులతో కలసి ఆర్కే-ఓసీపీని సందర్శిస్తారు. అనంతరం మందమర్రి సమీపంలోని ఎర్రగుంటపల్లిలో భూ నిర్వాసితులు, సింగరేణి ప్రభావిత ప్రాంతాల ప్రజలు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల బాధితులు, వారసత్వ ఉద్యోగాల కోసం ఎన్నో ఏళ్లుగా ఆందోళన చేస్తున్న వారిని కలసి అభిప్రాయాలు సేకరిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు గోదావరిఖనిలో జరిగే సదస్సులో పాల్గొంటారు. -
‘ఔట్‌సోర్సింగ్‌ను అడ్డుకోవాలి’
బెల్లంపల్లి : సింగరేణి యాజమాన్యం ఐదు బొగ్గు గనుల ఔట్‌సోర్సింగ్‌కు రంగం సిద్ధం చేసిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధానకార్యదర్శి వి.సీతారామయ్య తె లిపారు. గురువారం మందమర్రి ఏరియా శాం తిఖని గనిపై నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేయాలనే కుతూహలం యాజ మాన్యంలో పెరిగిందన్నారు. గనుల ప్రైవేటీకరణతో భవిష్యత్‌లో సింగరేణికి, కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులుంటాయని తెలిపారు. గనుల ఔట్‌సోర్సింగ్‌ను కార్మికులు తీ వ్రంగా ప్రతిఘటించాలని పేర్కొన్నారు. గుర్తిం పు సంఘం టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలను తీర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. టీబీజీకేఎస్‌లో గ్రూపుల ఆధిపత్యం పెరగడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సమ్మె చేసిన కార్మికులకు ఇంతవరకు బకాయిలు చెల్లించిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. పదో వేజ్‌బోర్డు కోసం కోల్ ఇండియా యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన వేతన ఒప్పందం కోసం ఏఐటీయూసీ కృషి చేస్తోందన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి ఎం.వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు దాగం మల్లేశ్, సహాయ కార్యదర్శి తిరుపతిగౌడ్, ఫిట్ సెక్రెటరీ ఎస్.మల్లేశ్, నాయకులు చిలుక రాజనర్సు, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
భూగర్భ గనులకు తెర
బెల్లంపల్లి(ఆదిలాబాద్) : సింగరేణి చరిత్రలో రెండో బొగ్గుట్టగా ప్రసిద్ధిగాంచిన బెల్లంపల్లి ఏరియాలో భూగర్భ గనుల ప్రస్థానానికి తెరపడింది. బొగ్గు ఉత్పత్తి యాగంలో తొమ్మిది దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్న ఏరియాలో పూర్తిగా భూగర్భ గనులు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అపారమైన బొగ్గు నిక్షేపాలు కలిగిన ఏరియాలో భూగర్భ గనుల ఉనికి లేకుండా పోవడంతో కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తాండూర్ కోల్‌మైన్స్ పేరుతో.. జిల్లాలో ప్రథమంగా బెల్లంపల్లి ప్రాంతంలోనే బొగ్గు గనుల తవ్వకాలు ఆరంభమయ్యాయి. తాండూర్ కోల్‌మైన్స్ పేరుతో బొగ్గు గనుల తవ్వకాలు చేపట్టారు. బెల్లంపల్లిలో 1927లో బొగ్గు గనుల తవ్వకాలకు అంకురార్పణ జరిగింది. ‘మార్గన్స్‌ఫిట్’పేరుతో తొలి భూగర్భ గనిని ప్రారంభించి బొగ్గు ఉత్పత్తికి శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత 44 డీప్, 24 డీప్, సౌత్క్రాస్ కట్, నం.2 ఇంక్లైన్, శాంతిఖని గనులను బెల్లంపల్లి కేంద్రంగా ప్రారంభించారు. ఆ తదుపరి తాండూర్ మండలంలో బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6 గనులను తర్వాత గోలేటి-1,1ఎ భూగర్భ గనుల విస్తరణ చేపట్టారు. సింగరేణి కాలరీలోనే అత్యధిక భూగర్భ గనులు కలిగి ఉన్న ఏరియాగా బెల్లంపల్లి అప్పట్లోప్రసిద్ధిగాంచింది. ఆయా గనుల ఏర్పాటుతో 1975 నుంచి 1995 వరకు రెండు దశాబ్దాలపాటు బెల్లంపల్లి ఏరియా సింగరేణికి మకుటాయమానంగా విలసిల్లింది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బొగ్గుతో వచ్చిన లాభాల నుంచి ఇతర ప్రాంతాలలో గనుల ఏర్పాటుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. కొత్త ప్రాంతాలలో బొగ్గు గనుల విస్తరణకు బెల్లంపల్లి ఏరియా మార్గదర్శకంగా నిలిచింది. అంతటి విశిష్టత, మరెంతో ఖ్యాతి గడించిన బెల్లంపల్లి ఏరియా యాజమాన్యం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ప్రస్తుతం పతనావస్థకు చేరుకుంది. బొగ్గు నిక్షేపాలు ఉన్నా.. ఏరియాలో మూతపడిన ప్రతి భూగర్భ గనిలోనూ బొగ్గు నిక్షేపాలు ఉన్నప్పటికీ మూసివేతకే అధికారులు ఆసక్తి చూపారనే ఆరోపణలు ఉన్నాయి. గని ప్రమాదాన్ని సాకుగా చూపి సౌత్క్రాస్ కట్ గనిని, నీటి ప్రవాహం, సైడ్ పాల్స్తో బోయపల్లి గనిని, విచ్ఛలవిడిగా సమ్మెలు చేస్తున్నారనే కారణంతో ఎంవీకే-3ని, భూగర్భ గనుల భౌగోళిక పరిస్థితులు ప్రతికూలంగా మారాయనే నెపంతో మార్గన్స్‌ఫిట్, ఎంవీకే-1, 2, 5, 6, గోలేటి-1, 1ఎ గనులను ఏకపక్షంగా మూసివేశారనే ఆరోపణలు ఉన్నాయి. అనాలోచిత విధానాలతో.. ఏరియాలో ఉన్న భూగర్భ గనులు నాలుగు దశాబ్దాల నుంచి మూసివేతకు గురవుతూ వస్తున్నాయి. సింగరేణి అధికారులు కొందరు తీసుకున్న అనాలోచిత వి ధానాలు, భూగర్భ గనుల భౌగోళిక ప్రతికూల పరిస్థితులు, సాంకేతిక సమస్యలను సాకుగా చూపి ఒక్కొక్కటిగా మూసివేస్తూ వస్తున్నారు. తొలుత సౌత్క్రాస్ కట్ గని, ఆ తర్వాత బోయపల్లి, ఎంవీకే-1, 2, 3, 5, 6 గనులు మూతపడ్డాయి. అంతకుముందు నం.2 ఇంక్లైన్, 24 డీప్, 44 డీప్ ఏరియా గనులను మూసివేశారు. పదకొండేళ్ల క్రితం గోలేటీ-1 గనిని, తాజాగా ఏరియాలో ఉన్న ఏకైక భూగర్భ గని గోలేటి-1ఎ 2015-16 ఆర్థిక సంవత్సరం ముగింపు రోజైన మా ర్చి 31వ తేదీన మూసివేశారు. ఆ గనినీ మూసివేయడంతో బెల్లంపల్లి ఏరియాలో భూగర్భ గనుల ఉనికి లేకుండా పోయింది. ప్రస్తుతం కైరిగూడ, డోర్లి-1,2 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులతో ఏరియాలో బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులపై ఉన్న మక్కువతో ఏరియాలోని భూగర్భ గనుల జీవిత కాలాన్ని అర్ధంతరంగా, అనాలోచితంగా చిదిమివేశారు. -
బొగ్గుపైనా అమెరికా పెత్తనమే..!
గోదావరిఖని : ప్రపంచ వ్యాప్తంగా ఆయా దేశాలలోని బొగ్గు గనుల్లో 220 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, ఆయా దేశాల్లోని బొగ్గురంగంపై కూడా అమెరికా పెత్తనం చేస్తోందని జర్మనీకి చెందిన బొగ్గుగని కార్మికుడు, ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ గ్రూపు ఆఫ్ మైనింగ్ ఆర్గనైజేషన్స్ కమిటీ చైర్మన్ అండ్రియాస్ పేర్కొన్నారు. 2017 ఫిబ్రవరి 2 నుంచి 5వ తేదీ వరకు కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ రెండవ మహాసభలు గోదావరిఖనిలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేసేందుకు ఆండ్రియాస్తోపాటు ఇతరదేశాల ప్రతినిధులు గోదావరిఖనికి వచ్చారు. ఈ సందర్భంగా కమిటీ కోఆర్డినేటర్, మన దేశానికి చెందిన ప్రదీప్ సహకారంతో ఆండ్రియాస్ ప్రపంచవ్యాప్తంగా బొగ్గురంగంలో నెలకొన్న విషయాలపై ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... సహజసంపదను గుప్పిట్లో పెట్టుకునేందుకు యత్నం భూగర్భంలో ఉన్న ఖనిజ సంపదను తన గుప్పిట్లో పెట్టుకునేందుకు అమెరికా ప్రయత్నాలు చేసింది.. ఇంకా చేస్తోంది. ఏ పరిశ్రమకు బొగ్గు పంపాలన్నా అమెరికాకు చెందిన బహుళజాతి కంపెనీలు ఆమోదం తెలుపాల్సిందే. లేకపోతే దాని ప్రభావం కనిపించేలా ఆ దేశం అవసరమైన చర్యలకు దిగుతుంది. పెరూ, కొలంబియా, ఇండోనేషియా దేశాల్లో కూడా బొగ్గు సంస్థలలో అమెరికా పెత్తనమే ఎక్కువగా కనిపిస్తుంది. పెరుగుతున్న కాంట్రాక్టీకరణ... వివిధ దేశాల్లోని బొగ్గు సంస్థలు పర్మినెంట్ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ కాంట్రాక్టు కార్మికుల సంఖ్యను పెంచుతూ పోతున్నాయి. ఇప్పటి వరకు మొత్తం కార్మికుల్లో 25 శాతం మేర కాంట్రాక్టీకరణ చేశారు. భారతదేశంలో మినహా బొగ్గుగనులు ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లోనే ఉన్నాయి. జర్మనీ విషయానికి వస్తే భూగర్భంలో పనిచేసే పర్మినెంట్ కార్మికుడికి నెలకు 1500 యూరోలు, భూ ఉపరితలంలో పనిచేసే పర్మినెంట్ కార్మికుడికి నెలకు 1200 యూరోలు, కాంట్రాక్టు కార్మికుడికి 900 యూరోలు చెల్లిస్తారు. శాశ్వత పనిస్థలాల్లో పనిచేసే కాంట్రాక్టు కార్మికుడికి కూడా ఇక్కడ వేతనాల చెల్లింపులో వ్యత్యాసం ఉంది. కార్మికసంఘాలపై కర్రపెత్తనం... ఆయా దేశాలలో కార్మిక సంఘాలు తమ కార్యకలాపాలను కూడా సాఫీగా సాగించలేని పరిస్థితి ఏర్పడింది. లాటిన్ అమెరికాలో సాధారణ కార్యక్రమాలు కూడా కొనసాగించలేకుండా మారింది. ఫిలిప్పైన్‌లో చట్టపరంగా కార్యక్రమాలు కొనసాగించినందుకు అక్కడి మిలిటరీ కార్మిక నాయకులను చంపివేసి కనిపించకుండా చేస్తోంది. మొత్తంగా ఆయా దేశాలలో ప్రైవేటు పెట్టుబడిదారుల చేతుల్లో ఖనిజ సంపద ఉండడంతో కార్మిక సంఘాల కార్యకలాపాలు సాగించకుండా యజమానుల కర్రపెత్తనం చేస్తున్నారు. సింగరేణిలో కూడా కోడ్‌ఆఫ్ డిసిప్లీన్ పేరుతో గెలిచిన సంఘాలను మినహా మరే ఇతర కార్మిక సంఘాలను గనులపై రానివ్వకుండా ఆంక్షలు విధించారు. ఇది సరైందికాదు. బొగ్గుగనుల మూసివేతకు కుట్ర జర్మనీ దేశంలో 1960 ప్రాంతంలో మొత్తం 36 బొగ్గుగనులు ఉండేవి. దాదాపు మూడు లక్షల మంది వరకు పనిచేసేవారు. ప్రస్తుతం మూడు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య పది వేలే. 2018 నాటికి ఈ మూడు గనులను కూడా వేసివేయాలనే కుట్ర చేస్తున్నారు. ఈ చర్యకు నిరసనగా తాము జర్మనీలో పోరాటాలు నిర్వహిస్తున్నాం. ప్రపంచ వ్యాప్త మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాం. ఇక యూరప్ దేశంలోని బొగ్గు గనులను మూసివేసి భూఉపరితలం నుంచే భూగర్భంలోకి పైపులను పంపించి లోపల బొగ్గును మండించి గ్యాస్‌ను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల అక్కడి పంటపొలాలు నాశనమై పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి. సింగరేణి సంస్థలో కూడా భూగర్భ గనులను మూసివేసి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ చర్య కూడా పర్యావరణానికి హాని చేస్తుంది. గోదావరిఖనిలో మహాసభలకు నిర్ణయం... 2013లో పెరూ దేశంలో కమిటీ ఆధ్వర్యంలో మొదటి మహాసభలను నిర్వహించాం. ఆనాడే రెండో మహాసభలను 2017లో భారతదేశంలో నిర్వహించాలని నిర్ణయించాం. బొగ్గుగనుల ప్రాంతంలో కార్మిక పోరాట స్వభావం కలిగిన సింగరేణి ప్రాంతాన్ని మహాసభల నిర్వహణకు ఎంచుకున్నాము. 2017 ఫిబ్రవరి 2,3,4,5 తేదీలలో ఈ అంతర్జాతీయ మహాసభలు గోదావరిఖనిలో నిర్వహిస్తాం. 50 దేశాల నుంచి ఆయా బొగ్గు సంస్థలలో పనిచేస్తున్న వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరవుతారు. -
’మన్మోహనే జిందాల్‌కు బొగ్గు గనులను కేటాయించారు’
-
జీవీకే ఆస్ట్రేలియా గనులకు కోర్టు అనుమతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జీవీకే గ్రూపు ఆస్ట్రేలియా దేశంలో అభివృద్ధి చేయనున్న బొగ్గు గనులకు ప్రధాన అడ్డంకి తొలగింది. జీవీకే- హ్యాంకాక్ సంయుక్తంగా చేపట్టిన బొగ్గు గనుల పర్యావరణ అనుమతులపై తలెత్తిన అభ్యంతరాలను ఆస్ట్రేలియా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆల్ఫా కోల్ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులపై స్థానిక పర్యావరణ వేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంపై జీవీకే హర్షం వ్యక్తం చేసింది. -
సింగరేణి... కొత్త బాణీ
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో బొగ్గు గనులను చేజిక్కించుకోవడానికి సింగరేణి సంస్థ చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఆస్ట్రేలియా, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, మెజాంబిక్ తదితర దేశాల్లోని బొగ్గు గనుల కోసం అక్కడి కంపెనీల నుంచి గత నెలలో సింగరేణి ఆసక్తి వ్యక్తీకరణ (ఈఓఐ)ను కోరగా, 13 విదేశీ బొగ్గు గనులనుంచి ఆఫర్లు వచ్చాయి. వీటిలో ఇండోనేసియా, ఆస్ట్రేలియాల్లోని చెరో మూడు గనులతో పాటు మోజాంబిక్, బోత్సవానల్లోని చెరో రెండు గనులు, నమిబియా, అమెరికా, దక్షిణాఫ్రికాల్లో ఒక్కో బొగ్గు గని వుంది. వాటిని సింగరేణికి కేటాయించేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తూ సంబంధిత యాజమాన్య కంపెనీలు దాఖలు చేసిన బిడ్లపై ప్రస్తుతం సింగరేణి అధ్యయనం చేస్తోంది. ప్రతిపాదిత గనుల్లో బొగ్గు నాణ్యత, లభ్యత, దిగుమతికి రవాణా సౌకర్యాలు వంటి వాటిని సింగరేణి యాజమాన్యం నియమించిన నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. పై అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన అనంతరం ఆమోదయోగ్యమైన గనులను నిపుణుల కమిటీ షార్ట్‌లిస్ట్ చేయనుంది. ఈ కమిటీ ఎంపిక చేసిన గనులను సింగరేణి నిపుణులు సందర్శించనున్నారు. ఆయా దేశాల చట్టాలు, గనుల తవ్వకాలకు స్థానికంగా ఉన్న అనుమతులు, బిడ్లు వేసిన కంపెనీలకు గనులపై ఉన్న న్యాయపర హక్కులు తదితర కీలక విషయాలను ఆరా తీయనున్నారు. అన్నీ సవ్యంగా వుంటే వాటితో గనుల నిర్వహణ కోసం సింగరేణి యాజమాన్యం ఒప్పందం చేసుకోనుంది. కనీసం 51 శాతం యాజమాన్య హక్కులను సింగరేణి చేజిక్కించుకోనుంది. ఒక్కో గని నుంచి ఏడాదికి కనీసం రెండు మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాలని, ఒక మిలియన్ టన్నును దేశానికి దిగుమతి చేసుకోవాలనే లక్ష్యంతో సింగరేణి ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూరై్త ఒప్పందాలు జరుపుకోడానికి ఏడాదికాలం పట్టనుంది. ఈ 13 గనుల్లో ఐదారు విదేశీ బొగ్గు గనులను చేజిక్కించుకోవాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. దక్షిణాఫ్రికా, మోజాంబిక్ గనులపై ఆసక్తి అమెరికా, బోత్సవాన నుంచి వచ్చిన బొగ్గు గనుల ఆఫర్లను తిరస్కరించాలని సింగరేణి ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రాంతాల నుంచి బొగ్గును దిగుమతి చేసుకుంటే రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయని, ఆర్థికంగా నష్టదాయకమని అధికారులు తేల్చారు. మిగతా ఆఫర్లతో పోల్చితే కొంత దగ్గరగా ఉన్న ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, మోజాంబిక్లలోని గనులను పరిశీలించాలని భావిస్తున్నారు. మోజాంబిక్‌లో కేవీఎల్ కంపెనీకి చెందిన గనితో పాటు దక్షిణాఫ్రికాలోని కాంటినెంటల్ కంపెనీకి సంబంధించిన గనిని సందర్శించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. త్వరలో సింగరేణి బోర్డు ఈ విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. కొత్తగా మరో మూడు గనుల్లో ఉత్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిని 60 మిలియన్ టన్ను(ఎంటీ)లకు పెంచాలని సింగరేణి లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 2013-14లో 50 ఎంటీలు, 2014-15లో 52 ఎంటీలను ఉత్పత్తి చేయగా, ఈ సారి 8 ఎంటీల ఉత్పత్తిని పెంచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అండ్రియాల గని నుంచి ఉత్పత్తి పునః ప్రారంభంతో పాటు ఈ ఏడాది చివరి నాటికి కొండాపూర్(భూగర్భ), బెల్లంపల్లి ఓసీ-2లో ఉత్పత్తి ప్రారంభించడం, రామగుండం-03ని విస్తరించేందుకు ప్రణాళికలు తయారు చేసుకుంది. -
అక్కడి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలపైమాటే..?
హైదరాబాద్: సింగరేణి వ్యాప్తంగా ఉన్న గనుల వద్ద ఎండ తీవ్రత కార్మికులకు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. గత మూడు రోజులుగా ఓపెన్ కాస్ట్ గనుల వద్ద 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాస్తవానికి అంతకంటే ఎక్కువగానే 50 డిగ్రీల దాకా ఉంటుందని కార్మికులు చెబుతున్నారు. సాధారణంగా 50 డిగ్రీలు దాటితే లేఆఫ్ ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, ఉత్పత్తి ఆగిపోతుందనే భయంతోనే సింగరేణి యాజమాన్యం 50 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు చూపుతోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎండ తీవ్రతలను దృష్టిలో ఉంచుకుని కనీసం పని వేళలైనా మార్చాలనే డిమాండ్‌తో ఆందోళనలకు దిగుతున్నాయి. మధ్యాహ్నం వేళల్లో తవ్వకాలను నిలిపివేయాలని కోరుతున్నాయి. తెలంగాణలోని ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో సింగరేణి సంస్థ బొగ్గు తవ్వకాలు సాగిస్తున్న విషయం విదితమే. -
బొగ్గు బిల్లుకు మార్గం సుగమం..!
ఎలాంటి మార్పులూ అవసరం లేదన్న స్థాయీసంఘం గిరిజన హక్కులను పట్టించుకోలేదని దిగ్విజయ్ సింగ్ ఆక్షేపణ గనులు, ఖనిజాల బిల్లుకు ఒక సవరణ ప్రతిపాదించిన కమిటీ న్యూఢిల్లీ: బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించే విధానానికి ఉద్దేశించిన కీలక బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడానికి మార్గం సుగమమైంది. పార్లమెంటరీ కమిటీకి నివేదించిన బొగ్గు గనుల(ప్రత్యేక నిబంధనల) బిల్లును అధ్యయనం చేసిన స్థాయీ సంఘం అందులో ఎలాంటి మార్పు, చేర్పులు అవసరం లేదంటూ నివేదికను బుధవారం రాజ్యసభ ముందుంచింది. అయితే, ఈ సంఘ సభ్యులైన దిగ్విజయ్ సింగ్ సహా ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, డీఎంకే, సీపీఎంలకు చెందిన మరో ఇద్దరు ఎంపీలు బిల్లుపై తమ అభ్యంతరాలను నివేదికలో పొందుపర్చారు. సెలెక్ట్ కమిటీ ముందుకు వెళ్లిన మరో బిల్లు.. ‘గనులు, ఖనిజాల(అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు’లో ఒక సవరణను కమిటీ సూచించింది. దాంతో ఆ సవరణను బిల్లులో చేర్చాలని ప్రభుత్వం భావిస్తే.. ఆ బిల్లు మరోసారి లోక్‌సభ ఆమోదం కోరాల్సి ఉంటుంది. ఈ బిల్లులు లోక్‌సభ ఆమోదం పొందడం తెలిసిందే. ఆర్డినెన్స్‌ల స్థానంలో వచ్చిన ఇవి ఏప్రిల్ 5లోగా పార్లమెంట్ ఆమోదం పొందాల్సి ఉంది. బొగ్గు బిల్లు.. రాజ్యసభలో బీజేపీ సభ్యుడు అనిల్ మాధవ్ దవే నేతృత్వంలోని 19 మంది సభ్యుల స్థాయీ సంఘం బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అధ్యయనం చేసి నివేదికను అందజేసింది. అయితే, సెలెక్ట్ కమిటీలోని కాంగ్రెస్ సభ్యులు దిగ్విజయ్, పీ భట్టాచార్య, రాజీవ్ శుక్లా(కాంగ్రెస్), కేఎన్ బాలగోపాల్(సీపీఎం), తిరుచి శివ(డీఎంకే) నివేదికలో తమ అభ్యంతరాలను వ్యక్తపరిచారు. బిల్లులో గిరిజనుల హక్కుల పరిరక్షణకు ఎలాంటి ప్రతిపాదనలు లేవని దిగ్విజయ్ పేర్కొన్నారు. దీనిపై తమ సవరణలకు కమిటీ ఆమోదం తెలపలేదన్నారు. ‘బిల్లును అధ్యయనం చేసేందుకు కమిటీకి ఇచ్చిన వారం రోజుల సమయం ఏమాత్రం సరిపోలేదు’ అని వివరించారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన మిగతా సభ్యులు కూడా దాదాపు ఇవే అభ్యంతరాలను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిరసన.. ఈ రెండు బిల్లులను సభలో ప్రవేశపెట్టగానే రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ పార్టీ తరఫున తన నిరసనను వెల్లడించారు. ఏ ఉద్దేశంతో ఈ బిల్లులను స్థాయీ సంఘాలకు నివేదించారో ఆ ఉద్దేశం నెరవేరలేదని ఆక్షేంపించారు. కాగా, బొగ్గు, ఖనిజాల బిల్లును ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుంది. ఎగువ సభలో వాటి ఆమోదం తరువాతే భూ సేకరణ బిల్లుపై ముందుకు వెళ్లాలని భావిస్తోంది. గనులు, ఖనిజాల బిల్లులో రెండు సవరణలను ప్రభుత్వం చేర్చనుందని సమాచారం. గనులు, ఖనిజాల బిల్లు ఈ బిల్లులో సెలక్ట్ కమిటీ ఒక సవరణను సూచించింది. మైనింగ్ హక్కులు పొందిన సంస్థ రాయల్టీలో కొంత శాతాన్ని స్థానికుల సంక్షేమం కోసం వినియోగించేలా డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్‌కు చెల్లించడం తప్పనిసరి చేస్తూ ఒక నిబంధనను పునర్లిఖించాలని బీజేపీ సభ్యుడు భూపేంద్ర యాదవ్ నేతృత్వంలోని ఈ కమిటీ సూచించింది. వాతావరణంపై గనుల తవ్వకం ప్రభావం, లాభాల్లో స్థానికులు, గిరిజనులకు వాటా.. తదితర అంశాలను భవిష్యత్తులో సరైన సమయం వచ్చినప్పుడు చట్టంలో చేర్చే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరింది. సెలెక్ట్ కమిటీలో ఈ బిల్లుపై సీపీఎంకు చెందిన టీకే రంగరాజన్ మాత్రమే భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. -
సిరుల మాగాణి.. సింగరేణి
నేడు 126 ఏళ్ల సంబరాలు తట్టాచెమ్మస్ నుంచి ఆధునిక యంత్రాల దాకా సింగరేణి.. నిలువెల్లా నల్లబంగారంతో తులతూగుతోంది. కార్మికులకు వరప్రదాయినిగా వర్ధిల్లుతోంది. యావత్తు తెలంగాణకు కల్పవల్లిగా భాసిల్లుతోంది. నాలుగు జిల్లాల్లో విస్తరించిన బొగ్గు గనులతో సిరుల పంట పండిస్తోంది. తట్టాచెమ్మస్ వాడక ం నుంచి.. అధునాతన అడ్రియాల గని ప్రారంభించే దాక ఎదిగిందీ సంస్థ. బ్రిటిష్ కాలంలో పురుడుపోసుకున్న సింగరేణి.. నూటాపాతిక వసంతాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ర్టంలో ఇవి తొలి వార్షికోత్సవాలు. ఈ 126వ వార్షికోత్సవాల సందర్భంగా ప్రత్యేక కథనం.. - భూపాలపల్లిరూరల్ కాకతీయ రాజుల ప్రతీకగా కేటీకే అతివేగంగా పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి సింగరేణి గనులు జిల్లాకు తలమానికంగా నిలుస్తున్నాయి. కాకతీయ రాజుల వీరత్వానికి ప్రతీకగా భూపాలపల్లిలో కాకతీయ గనుల పేరుతో కేటీకే 1వ గనిని 1988 జూలై 15న అప్పటి సీఎం ఎన్టీ రామారావు ప్రారంబించారు. 1991-1992లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది. కేటీకే 2, 5, 6, లాంగ్వాల్ ప్రాజెక్ట్, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్ట్‌లు విస్తరింంచారు. 7008 మంది కార్మికులు పనిచేస్తూ రోజుకు 10వేల టన్నుల బొగ్గు వెలికి తీస్తున్నారు. ఏరియాలోని కేటీకే 2వ గనిలో పూర్తి స్థాయిలో యాంత్రీకరణతో బొగ్గు వెలికి తీస్తుండగా కేటీకే 1, 5, 6 గనుల్లో కొన్ని ప్రదేశాల్లో నేటికి కోల్ ఫిల్లర్లతో బొగ్గు వెలికి తీస్తున్నారు. భూపాలపల్లి పక్కనే ఉన్న తాడిచర్లలో రెండు ఉపరితల గనులు రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల పరిధిలోని గోదావరినది లోయ పరీవాహక ప్రాంతంలో విస్తరించింది సింగరేణి. వేలాది మందికి ప్రత్యక్షంగా.. లక్షలాది మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిలో భాగస్వామ్యమవుతోంది. సంస్థ ప్రస్థానం.. 1871లో ఖమ్మం జిల్లా భద్రాచలం అ టవీ ప్రాంతంలో దొరికిన బొగ్గురాళ్లపై కింగ్ జార్జ్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యంలో ఇంగ్లండ్‌లో పరిశోధనలు జరిపారు. 1886లోబొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. 1889 నుంచి ఇల్లందు సమీపంలోని సింగరేణి గ్రామంలో బొగ్గుగని తవ్వి ఉత్పత్తి పనులు ప్రారంభించారు. పై నాలుగు జిల్లాల్లో 16 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులు, 32 భూగర్భ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి కొనసాగుతోంది. 1920 డిసెంబర్ 23న హైదరాబాద్ డక్కన్ కంపెనీని ‘సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్’గా లండన్ స్టాక్ ఎక్ఛ్సేంజ్‌లో పేరు మార్పు చేశారు. 1945లో హైదరాబాద్ సంస్థాన పాల కుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ సింగరేణి కాలరీస్ షేర్లను కొనుగోలు చేయగా సింగరేణి సంస్థ దేశంలోనే తొలి ప్రభుత్వ కంపెనీగా ఆవిర్భవించింది. 1949లో సింగరేణికాలరీస్ సంస్థ పూర్తి గా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. కేంద్రరాష్ట్రాల వాటా 49: 51 శాతం. సింగరేణికి ప్రతిబంధకాలు.. {పతీ టన్ను బొగ్గుకు ఉత్పత్తి వ్యయం పెరి గింది. కనీసంగా రూ. 650 నష్టం వస్తోంది.ఇండోనేషియా, ఆస్ట్రేలియా, అమెరికా, మొజాంబిక్, పోలండ్ తదితర దేశాల నుంచి వచ్చే బొగ్గు.. సింగరేణి నిర్ణయించే ధరకన్నా చౌక. విదేశీ బొగ్గుకే గిరాకీ ఉంది. పలు ప్రాజెక్టుల ప్రారంభానికి అటవీ, పర్యావరణ శాఖల నుంచి అనుమతులు లభించడం లేదు. భూసేకరణకు ప్రజా సహకారం అందట్లేదు. ఆర్అండ్ఆర్ పథ కం వర్తింపు కూడా సమస్యగా మారింది.భూగర్భగనులు, లాంగ్వాల్, బ్లాస్టింగ్ గ్యాలరీల్లో ఉత్పత్తికి అనుమతులందట్లేదు. గనులు, ఓసీపీల్లో యంత్రాల జీవిత కాలం పూర్తయి.. ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. సంస్కరణలతో వచ్చిన మార్పులు... 1991లో వచ్చిన సంస్కరణలు సింగరేణిపై తీవ్ర ప్రభావం చూపాయి. కార్మికుడు రిటైర్డయితే ఆయన వారసుడికి ఉద్యోగం ఇవ్వాలనే నిబంధన తొలగించారు. భూగర్భ గనుల్లో తట్టాచెమ్మస్ ద్వారా బొగ్గు ఉత్పత్తి నిలిపివేస్తూ యాంత్రీకరణను వేగవంతం చేశారు. 2000-01లో 32 వేల మంది కోల్‌ఫిల్లర్ కార్మికులండగా... నేడు వారి సంఖ్య 5 వేలకు పడిపోయింది. ఐఏఎస్ అధికారి ఏపీవీఎన్ శర్మ సింగరేణి సంస్థ సీఎండీగా ఉన్నప్పుడు సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేశారు. వాలంటరీ రిటైర్డ్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్)ను తెచ్చి కొంత మొత్తాన్ని వారికి అందిస్తూ కార్మికుల సంఖ్య కుదించారు. సింగరేణికి కలికితురాయి ‘అడ్రియాల’ సింగరేణి ప్రతిష్టాత్మకంగా రామగుండం ఏరియాలో అడ్రియాల వద్ద పంచ్‌ఎంట్రీ గనిని ప్రారంభించింది. సుమారు రూ. 1400 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు.జర్మనీకి చెందిన క్యాటర్‌పిల్లర్ సంస్థ సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భంలో 400 మీటర్ల లోతులో బొగ్గును సర్ఫెర్ కంట్రోల్ రూం నుంచి పర్యవేక్షిస్తూ వెలికితీస్తారు. ఏటా 2 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీత ఈ గని లక్ష్యం. విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి... సింగరేణి సంస్థ కొత్తగూడెం, గోదావరిఖనిలో 18 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్న సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద 1200 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించింది.దీనిని 2016లో ప్రారంభించి తెలంగాణ రాష్ట్రానికి 85 శాతం విద్యుత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. -
బొగ్గు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఇక పారదర్శక ప్రక్రియ బొగ్గు క్షేత్రాలున్న రాష్ట్రాలకు ఊహించని ఆదాయం న్యూఢిల్లీ: సెప్టెంబర్ నెలలో సుప్రీంకోర్టు రద్దు చేసిన 204 బొగ్గు క్షేత్రాల పునః కేటాయింపునకు అవకాశం కల్పించే ‘బొగ్గు గనుల(ప్రత్యేక విధి, విధానాల)బిల్లు’కు శుక్రవారం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. అక్టోబర్ నెలలో జారీ అయిన సంబంధిత ఆర్డినెన్స్ స్థానంలో ఈ బిల్లును రెండు రోజుల క్రితం బొగ్గు శాఖమంత్రి పీయూష్ గోయల్ సభలో ప్రవేశపెట్టారు. బిల్లులో పలు లోపాలున్నాయని, కార్మికుల సంక్షేమం, భూసేకరణ తదితర అంశాల్లో తమకు కొన్ని ఆందోళనలున్నాయన్న విపక్షం.. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే బొగ్గు రంగం ప్రైవేటీకరణకు దారి తీస్తుందని విమర్శించింది. బిల్లును పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపించాలని డిమాండ్ చేసింది. విపక్ష డిమాండ్‌ను తోసిపుచ్చిన గోయల్.. బొగ్గు క్షేత్రాల కేటాయింపు, బొగ్గు వెలికితీత, అమ్మకం తదితరాల్లో మరింత పారదర్శకత లక్ష్యంగా బిల్లును రూపొందించామని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్ వేలంపాట(ఈ ఆక్షన్) పద్ధతిలో కేటాయింపులు జరుపుతామని, గనులు పొందిన సంస్థలకు అక్కడి భూమి, మైనింగ్ వసతులపై పూర్తి హక్కులు ఉంటాయని వివరించారు. బొగ్గుక్షేత్రాలున్న బిహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలు ఈ బిల్లుతో లక్షల కోట్ల రూపాయాలు ఆర్జిస్తాయన్నాయని, నిధులే నేరుగా వాటికే అందుతాయని అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభిస్తూ.. బొగ్గురంగ పునర్వ్యవస్థీకరణకు వచ్చిన అవకాశాన్ని ప్రభుత్వం కోల్పోతోందన్నారు. త్వరలో 74 బొగ్గు క్షేత్రాలకు వేలం వేయనున్నారు. కాగా, బిల్లు ఆమోదం నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి బొగ్గు కార్మిక సంఘాలు ఈ నెల 15న సమావేశం కానున్నాయి. -
బొగ్గు గనుల ప్రైవేటీకరణ తగదు
లోక్‌సభలో ఎంపీ కల్వకుంట్ల కవిత సాక్షి, న్యూఢిల్లీ : బొగ్గు గనుల ప్రైవేటీకరణ వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారనీ, కార్మికుల సంక్షేమం ఎవరూ పట్టించుకోరని టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత లోక్‌సభలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. కోల్‌మైన్స్(స్పెషల్ ప్రావి జన్స్) బిల్లు -2014పై శుక్రవారం లోక్‌సభలో జరిగిన చర్చలో కవిత మాట్లాడుతూ ‘గడిచిన కొన్నేళ్లలో బొగ్గు రంగం పలు వివాదాలతో అనేక ప్రశ్నలను మిగిల్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత బిల్లు ఆహ్వానించదగ్గదే. దేశంలోనే అన్ని స్కాములకు మాతృస్కాము వంటిద న్న అపఖ్యాతి తెచ్చింది ‘కోల్’ స్కాము మనందరికీ తెలుసు. సుప్రీం కోర్టు జోక్యం, ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న చర్యల వల్ల ఈ చెడ్డపేరును చెరిపేసే అవకాశం వచ్చింది. దేశంలో ఉన్న విద్యుత్తు సంక్షోభానికి ఇది సమాధానం కానుంది. బొగ్గు రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారన్న భయం వెంటాడుతోంది. సుప్రీం రద్దుచేసిన బ్లాకులను తిరిగి సద్వినియోగంలోకి తేవాలంటే కోల్‌మైన్స్ యాక్ట్‌ను గానీ, మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్‌ను గానీ సవరించకుండానే మనం నేరుగా కేటాయించుకోవచ్చు. కార్మికుల సంక్షేమం గురించి ఈ బిల్లులో లేదు. ఈ మైన్లను ప్రైవేటీకరిస్తే.. వారి సంక్షేమం ఎలా? ప్రయివేటు రంగం కార్మికుల సంక్షేమం చూడదు. కనీసం కోల్ ఇండియా వేతన స్కేళ్లను గానీ వేజ్‌బోర్డును గానీ వాళ్లు పట్టించుకునే పరిస్థితి ఉండదు. సంబంధిత మంత్రి దీనికి సమాధానం చెప్పాలి..’ అని కోరారు. -
విదేశీ గనులతో ‘బొగ్గే’!
విదేశాల్లో బొగ్గు గనుల నిర్వహణపై సింగరేణి బృందం అభిప్రాయం ఖర్చు తడిసి మోపెడు.. లాభం మాట దేవుడెరుగు ప్రైవేటుసంస్థలకే తప్పని ఇబ్బందులు.. సింగరేణికైతే మరిన్ని తిప్పలు! ఇప్పటికే ‘కోల్ విదేశ్’తో కోల్ ఇండియా ప్రయోగం విఫలం సాక్షి, హైదరాబాద్: ‘సింగరేణి ద్వారా విదేశాల్లో ఉన్న బొగ్గు గనులను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తున్నాం...’.. ఇటీవల ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశమిది. రాష్ట్రంలో విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు కొత్త థర్మల్ ప్లాంట్ల నిర్మాణం అవసరం.. వాటి కోసం బొగ్గు కూడా అవసరం.. కానీ, సింగరేణి సంస్థతో విదేశాల్లో బొగ్గు గనుల నిర్వహణ చేపట్టడం సాధ్యమేనా? అసలు అలా విదేశాల్లో గనుల నిర్వహణ లాభమేనా? అనే ప్రశ్నలకు మాత్రం ‘కాదు..’ అనే సమాధానమే వినిపిస్తోంది. విదేశాల్లో బొగ్గు బ్లాక్‌లను తీసుకునే అవకాశాలను పరిశీలించాలని.. వీలైతే అక్కడి బొగ్గు గనుల నిర్వహణ చేపట్టాలని ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తొలి రోజుల్లోనే సీఎం కేసీఆర్ సింగరేణి అధికారులను పురమాయించారు. అందులో భాగంగా సింగరేణి నుంచి 11 మంది సభ్యుల బృందం ఇటీవల దక్షిణాఫ్రికా, పోలాం డ్, మొజాంబిక్ తదితర దేశాలలో పర్యటించి వచ్చింది. ఖర్చులు తడిసిమోపెడు.. ఆయా దేశాల్లో సంక్లిష్టమైన నిబంధనలు, నిర్వహణ భారం, అధిక పెట్టుబడి వ్యయంతో పాటు గనుల నుంచి ప్లాంట్లకు, పోర్టులకు రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయని సింగరేణి బృందం ప్రాథమికంగా అంచనా వేసింది. అసలు విదేశీ గనుల జోలికి వెళ్లకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. ప్రస్తుతం విదేశాల్లో బొగ్గు గనులు నిర్వహిస్తున్న ప్రైవేటు కంపెనీలు ప్రతిబంధకాలను ఇప్పటికీ అధిగమించలేకపోతున్నాయని.. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో సింగరేణికి మరిన్ని ఇబ్బందులు ఉంటాయని కూడా ఆ బృందం పేర్కొంటోంది. ఈ మేరకు తమ పర్యటనలో తేలిన వివరాలు.. అక్కడ బొగ్గు గనుల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఎక్కడైనా తిప్పలు తప్పవు! విదేశాల పర్యటనలో సింగరేణి బృందం పలు అంశాలను గమనించింది. దాని ప్రకారం.. పోలాండ్‌లో 14 భూగర్భగనులు, 4 ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులుండగా.. అవన్నీ పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఉన్నాయి. భూగర్భ గనుల్లో కంటిన్యూయస్ మైనర్, లాంగ్ వాల్ విధానాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలోనూ సాంకేతికంగా ఆధునిక యంత్రాలను ఉపయోగించి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. ఇలా చేయడానికి సింగరేణికి ఆర్థికపరంగా భారం ఎక్కువ అవుతుంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పని కాదు. ఇక ఆటవిక దేశంగా పేరొందిన మొజాంబిక్‌లో బొగ్గు నిల్వలున్నప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. చిన్న దేశమైనప్పటికీ మొత్తం ఉత్పత్తి ప్రైవేటు కంపెనీల ఆధ్వర్యంలోనే జరుగుతోంది. అక్కడ విద్యుత్ ప్లాంట్లు అసలే లేవు. మన దేశానికి చెందిన జిందాల్ కంపెనీ అక్కడ ఒక ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టును నిర్వహిస్తోంది. కానీ, వారికి రవాణా భారం తడిసి మోపెడవుతోంది. ఆ కంపెనీ వారే 400 కిలోమీటర్ల దూరం రోడ్డు మార్గంలో ట్రక్కులలో బొగ్గును రవాణా చేసి, అక్కడి నుంచి మరో 300 కిలోమీటర్ల దూరం వరకు ట్రాక్ లైన్ నిర్మాణం చేసుకోవాల్సి వచ్చింది. అక్కడి ఓపెన్ కాస్ట్‌ల్లో ఒక్క భారతీయుడిని ఉద్యోగంలోకి తీసుకుంటే.. మొజాంబిక్ దేశస్తులు 10 మందిని ఉద్యోగాల్లో నియమించుకోవాలనే నిబంధన ఉంది. దీంతో బొగ్గు ఉత్పత్తి వ్యయం అంచనాలను దాటిపోతుందని పర్యటనలో అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇండోనేిసియా దేశాల్లో జీవీకే, అదానీ, ఎన్ఆర్ఐ ఇండియా సంస్థలు, అమెరికాలో జిందాల్ సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాయి. ఇంకా ఆస్ట్రేలియా నుంచి బొగ్గు దిగుమతి ప్రారంభం కాలేదు. ఇండోనేిసియా నుంచి కోకింగ్ కోల్‌ను కాకినాడ పోర్టు ద్వారా దిగుమతి చేసుకున్నా లాభం లేని పనే. ఉత్పత్తి వ్యయం, దిగుమతి భారం కలిపితే.. అక్కడి బొగ్గు రేటు కన్నా భారత్‌లో లభించే బొగ్గు రేటు తక్కువగా ఉంటున్నది. ‘కోల్ విదేశ్’కు దెబ్బ విదేశాల్లో బొగ్గు గనుల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్‌కు ఇప్పటికే అనుభవం ఉంది. మన దేశంలో బొగ్గు ఉత్పత్తిలో కోల్ ఇండియాదే మొదటి స్థానం. ఈ సంస్థ ఇప్పటికే ‘కోల్ విదేశ్’ పేరుతో మొజాంబిక్ దేశంలో రెండు బొగ్గు బ్లాక్‌లను సొంతం చేసుకుంది. ఒక ఓపెన్ కాస్ట్ తవ్వకాన్ని ప్రారంభించింది. అక్కడ ఇప్పటికీ ఉత్పత్తి ప్రారంభించలేకపోయింది. మరోదానిలో పరిస్థితి కూడా ఏమంత ప్రయోజనకరంగా లేదు. భారీగా పెట్టుబడులు పెట్టాల్సి వచ్చింది.. ఉత్పత్తి మొదలుపెట్టే స్థాయిలోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో నికర లాభాల్లేని సింగరేణి సంస్థ విదేశాల్లో గనుల నిర్వహణకు దూరంగా ఉండటమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెరుగుతున్న కొరత.. మన దేశంలో ప్రస్తుతం 200 మిలియన్ టన్నుల బొగ్గు కొరత ఉంది. ఏటా విదేశాల నుంచి 140 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకుంటున్నారు కూడా. కానీ మరో ఐదేళ్ల వ్యవధిలో బొగ్గు కొరత 260 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని కేంద్ర ఇంధన శాఖ అంచనా. ఈ కొరతను అధిగమించే కసరత్తులో భాగంగా విదేశాల్లో బొగ్గు గనులు దక్కించుకునే ప్రయత్నాలు మొదలయ్యాయి. -
బొగ్గు గనులకు పరిహారం అంచనాకు కమిటీ
న్యూఢిల్లీ: ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న, ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న బొగ్గు గనులకు చెల్లించాల్సిన నష్ట పరిహారాన్ని అంచనా వేసేందుకు మాజీ సీవీసీ ప్రత్యూష్ సిన్హా నేతృత్వంలో కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. బొగ్గు, ఇంధన, ఆర్థిక, న్యాయశాఖ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. నవంబర్ 10 కల్లా కమిటీ తన సిఫారసులను సమర్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బొగ్గు గనుల కేటారుుంపుల కుంభకోణంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత సెప్టెంబర్ 24న.. 1993-2009 మధ్యకాలంలో వివిధ కంపెనీలకు కేటారుుంచిన 204 బొగ్గు గనులను రద్దు చేస్తూ తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. ఇందులో 37 ఇప్పటికే తవ్వకాలు జరుగుతున్న గనులు కాగా, మరో 5 వచ్చే ఏప్రిల్ నాటికల్లా ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నారుు. ఈ 42 గనులకు సంబంధించిన ఆస్తుల విలువను విడివిడిగా అంచనా వేయూల్సిందిగా కమిటీని ప్రభుత్వం ఆదేశించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. -
లెవీ చెల్లించి ‘ఈ-ఆక్షన్’కు రావచ్చు
గనులు కోల్పోయిన కంపెనీలపై కోల్ ఆర్డినెన్స్ స్పష్టీకరణ న్యూఢిల్లీ:అవకతవకల అభియోగాలతో సుప్రీంకోర్టు కేటాయింపులను రద్దుచేయడంతో బొగ్గు గనులను కోల్పోయిన కంపెనీలు తాజాగా జరగబోయే ఈ-ఆక్షన్‌లో పాల్గొనవచ్చని, అయితే సదరు కంపెనీలు అదనంగా లెవీ ఫీజు చెల్లించి బిడ్లు సమర్పించవచ్చని బొగ్గు గనులపై రాష్ట్రపతి జారీ చేసిన ఆర్డినెన్స్ స్పష్టంచేసింది. కేటాయింపుల్లో అవకతవకలలో ప్రమేయం ఉన్నట్టు నిర్ధారణ జరిగిన సంస్థలు మాత్రం ఈ-ఆక్షన్‌లో పాల్గొనడానికి వీల్లేదని ఆర్డినెన్స్ పేర్కొంది. ఉక్కు, సిమెంట్, విద్యుత్ ఉత్పాదనలోని కంపెనీలకు, బొగ్గు గనులతో అనుసంధానమైన సంస్థలకు ఈ-ఆక్షన్‌లో పాల్గొనేందుకు అర్హత ఉందని ఆర్డినెన్స్ తెలిపింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బొగ్గు గనుల కేటాయింపు విధివిధానాలపై రాష్ట్రపతి బుధవారం ఆర్డినెన్స్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆర్డినెన్స్ సరికాదు: సీపీఎం ఇదిలా ఉండగా,.. బొగ్గు బ్లాకుల ఈ-ఆక్షన్ ప్రక్రియులో ప్రైవేటు కంపెనీలకు అనుమతిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్, 1973వ సంవత్సరపు బొగ్గు గనుల జాతీయాకరణ చట్టాన్ని ఉల్లంఘించేదిగా ఉందని సీపీఎం బుధవారం విమర్శించింది. విలువైన జాతీయు ఆస్తి అయిన బొగ్గుపై పార్లమెంటు ఆమోదం కూడా లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదని సీపీఎం పోలిట్ బ్యూరో ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. -
బొగ్గు క్షేత్రాల 'ఈ ఆక్షన్' కు ఆర్డినెన్స్!
న్యూఢిల్లీ: బొగ్గు క్షేత్రాలపై కేంద్ర ప్రభుత్వం ఆర్టినెన్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేపడుతోంది. సుప్రీం కోర్టు రద్దు చేసిన బొగ్గు క్షేత్రాల భూమిని కేంద్రం సేకరించనుంది. పీఎస్ యూ, రాష్ట్రాలకు ప్రత్యేక్షంగా భూకేటాయింపులు చేయడానికి ఈ-ఆక్షన్ నిర్వహించడానికి ఆర్డినెన్స్ తేవాలని కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. 1993 నుంచి చేసిన 214 బొగ్గు క్షేత్రాల కేటాయింపులను సుప్రీం కోర్టు రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈశాన్య రాష్ట్రాలు, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, చత్తీస్ ఘఢ్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలకు లబ్ది చేకూరనుంది. -
తర‘గని’ సిరి
కొత్తగూడెం, న్యూస్‌లైన్: దక్షిణ భారత దేశానికి తలమానికంగా నిలుస్తూ రాష్ట్రానికి విద్యుత్ వెలుగులు అందించడంలో కీలకంగా మారిన సింగరేణి ప్రస్థానం జిల్లా నుంచి మొదలైంది. తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో జిల్లాలోని మూడు ఏరియాలే అత్యంత కీలకంగా మారాయి. సింగరేణి సంస్థ పది ఏరియాల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా దానిలో 45 శాతం జిల్లాలోనే మూడు ఏరియాల నుంచే ఉత్పత్తి అవుతోంది. సిరులొలికే సింగరేణిని ఆటుపోట్ల నుంచి గట్టెక్కించడంలోనూ జిల్లాలోని మూడు ఏరియాలే ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. పుట్టుపూర్వోత్తరాలు.. 1860 ప్రాంతంలో జిల్లాలోని భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకునేందుకు ఓ భక్తబృందం కాలినడకన వెళ్తోంది. వంట చేసుకునేందుకు నల్లరాళ్లను సేకరించింది. పోయ్యి మంట చేస్తుండగా కర్రలతోపాటు రాళ్లు కూడా కాలడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విషయం తెలిసి నాటి బ్రిటిష్ ప్రభుత్వం జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా సర్వే చేయించింది. డాక్టర్ విలియం కింగ్ ఆధ్వర్యంలో 1871లో ఇల్లెందు ప్రాంతంలో నిక్షేపాల కోసం వెతికారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. అప్పట్లో ఈ ప్రాంతం నైజాం నవాబు ఏలుబడిలో ఉండటంతో 1886లో దక్కన్ హైదరాబాద్ కంపెనీ పేరుతో బొగ్గు వెలికితీత ప్రక్రియను ప్రారంభించారు. మొదటిసారిగా జిల్లాలోని ఇల్లెందు భూగర్భగనిని ప్రారంభించారు. పాలనా సౌలభ్యం కోసం 1937లో కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాలను ఏర్పాటు చేశారు. నాణ్యమైన బొగ్గుకు నిలయం... సింగరేణి వ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో నాణ్యమైన ‘సి’ గ్రేడ్ ప్రస్తుతం జిల్లాలోని మూడు ఏరియాల నుంచే ఉత్పత్తి అవుతుంది. జిల్లాలోని మూడు ఏరియాల్లో ఏడు ఓపెన్‌కాస్టులు, నాలుగు భూగర్భ గనులున్నాయి. వీటి ద్వారా ప్రతి రోజు 70 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. కొత్తగూడెం ఏరియాలో గౌతంఖని ఓపెన్‌కాస్టు, సత్తుపల్లి జలగం వెంగళరావు ఓపెన్‌కాస్టు, భూగర్భగనులైన 7 ఇంక్లైన్, 5 షాప్టు గనులు ఉన్నాయి. ఇల్లెందులో జేకే -5, జేకే -2 ఓపెన్‌కాస్టులు, టేకులపల్లి కోయగూడెం ఓపెన్‌కాస్టు, 21 ఇంక్లైన్ భూగర్భ గని, మణుగూరు ఏరియాలో ప్రకాశం ఖని ఓపెన్‌కాస్టు -2, పీకే ఓపెన్‌కాస్టు -4, ప్రకాశం ఖని ఇంక్లైన్ భూగర్భగనులు ఉన్నాయి. మిగిలిన ఏరియాలో తక్కువ గ్రేడ్ల బొగ్గు సరఫరా అవుతుండగా కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు ఏరియాల నుంచి ప్రతి రోజు సరాసరి 70 వేల టన్నుల నాణ్యమైన ‘సి’ గ్రేడ్ బొగ్గును సరఫరా చేస్తున్నారు. జెన్కోతోపాటు ఇతర విద్యుత్‌రంగ సంస్థలు జిల్లాలో ఉత్పత్తి అయ్యే బొగ్గుపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉత్పత్తి అవుతున్న ‘సి’ గ్రేడ్ బొగ్గుకు మార్కెట్లో టన్నుకు రూ.2,300ల వరకు ధర పలుకుతుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బొగ్గుకు మండే శక్తి (జీసీవీ) ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆపదలో ఆసరాగా.. ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్య సాధనలో తీవ్ర వెనుకంజలో ఉన్న సింగరేణి సంస్థకు ప్రధాన ఉత్పత్తి కేంద్రంగా జిల్లాలోని మూడు ఏరియాలు తయారయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా 32.25 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. జిల్లాలోని మూడు ఏరియాల్లోనే 13.54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశారు. తెలంగాణలోని మూడు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి ఏడు ఏరియాల నుంచి 18.71 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగగా.. కేవలం మూడు ఏరియాల నుంచి 13.54 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అయింది. అంటే సరాసరి 45 శాతం సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి జిల్లా నుంచే ఉత్పత్తి అవుతుండటం గమనార్హం. మరో 491.15 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు... జిల్లాలోని గుండాల, పునుకుడుచెలక, రాంపురం, అనిశెట్టిపల్లి, చర్ల ప్రాంతాల్లో మరో 491.15 మిలియన్ టన్నుల బొగ్గు ఉన్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు గుర్తించారు. ఇందులో రాంపురంలో 122 మిలియన్ టన్నులు, పునుకుడుచెలకలో 38 మిలియన్ టన్నులు, అనిశెట్టిపల్లిలో 27 మిలియన్ టన్నులు, చర్లలో 28.12 మిలియన్ టన్నులుండగా, అత్యధికంగా గుండాల మండలంలో 276 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. గుండాలలో మొత్తం నాలుగు బ్లాక్‌లు ఉండగా ఫస్ట్ బ్లాక్‌లో 96.3 మిలియన్ టన్నులు, సెకండ్ బ్లాక్‌లో 75 మిలియన్ టన్నులు, థర్డ్ బ్లాక్‌లో 59 మిలియన్ టన్నులు, ఫోర్త్ బ్లాక్‌లో 46 మిలియన్ టన్నుల బొగ్గు ఉంది. ఇక్కడ మిగిలిన అన్ని ప్రాంతాల్లో కన్నా నాణ్యమైన బొగ్గు నిక్షేపాలున్నట్లు సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలో భూగర్భ గనులు ఏర్పాటు చేస్తే సుమారు మూడు దశాబ్దాలకు పైగా బొగ్గు ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రస్తుతం కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, టేకులపల్లి, సత్తుపల్లి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి అవుతోంది. గుండాల, అనిశెట్టిపల్లి, చర్ల, పునుకుడుచెలక, రాంపురం ప్రాంతాల్లో కూడా బొగ్గు గనులు ఏర్పాటు చేస్తే మళ్లీ జిల్లా అత్యధిక బొగ్గు గనులున్న ప్రాంతంగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. -
తప్పుల తడకగా భూ సర్వే