న్యూఢిల్లీ: భారత్ గత ఏడాది బొగ్గు దిగుమతులపై రూ.3.85 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం.. గత ఐదేళ్లలో దేశం మొత్తం బొగ్గు వినియోగంలో దిగుమతి వాటా 26 శాతం నుండి 21 శాతానికి తగ్గింది. అయితే భారతదేశం ప్రతి సంవత్సరం 200 మిలియన్ టన్నుల (ఎంటీ) కంటే ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది. ఇది దేశం నుంచి భారీ విదేశీ మారకపు ద్రవ్య ప్రవాహానికి దారితీస్తోంది.
అడవుల సంరక్షణకు పెద్దపీట: బొగ్గు మంత్రిత్వశాఖ
ఇదిలా ఉండగా, అడవులను సంరక్షించే అంశానికి పెద్ద పీట వేస్తున్నట్లు బొగ్గు మంత్రిత్వశాఖ పేర్కొంది. పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచనలను పట్టించుకోకుండా బొగ్గు గనులను వేటినీ వేలం వేయలేదని కూడా స్పష్టం చేసింది. ఉదాహరణకు, లెమ్రు ఎలిఫెంట్ కారిడార్ పరిధిలోకి వచ్చే బొగ్గు గనులను డి–నోటిఫై చేయాలన్న ఛత్తీస్‌గఢ్ విజ్ఞప్తిని అంగీకరించినట్లు తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు లెమ్రు ఎలిఫెంట్ కారిడార్‌కు ఆవల ఉన్న ప్రాంతాలను కూడా మినహాయింపు కోసం పరిశీలించినట్లు పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌లో 10 శాతం నిల్వలు ఉన్న 40కి పైగా కొత్త బొగ్గు బ్లాకులను బొగ్గు తవ్వకాల నుంచి దూరంగా ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. దట్టమైన హాస్డియో–అరాండ్ బొగ్గు క్షేత్రం పరిధిలోని తొమ్మిది బొగ్గు గనులను కూడా బొగ్గు బ్లాకుల తదుపరి రౌండ్ వేలం నుంచి దూరంగా ఉంచిన్నట్లు తెలిపింది.
అదేవిధంగా, తదుపరి వేలం ప్రక్రియ నుండి మూడు లిగ్నైట్ గనులను మినహాయించాలన్న తమిళనాడు అభ్యర్థన కూడా అంగీకరించినట్లు పేర్కొంది. ‘‘బొగ్గు మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాలు... అటవీ ప్రాంతాలను వేలంలో పెట్టాలని పరిశ్రమ డిమాండ్‌లు ఉన్నప్పటికీ వాటిని రక్షించడం మా బాధ్యత అని మంత్రిత్వశాఖ స్పష్టంగా సూచిస్తోంది’’అని మంత్రిత్వ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment