
విద్యుత్ మీటర్‌రీడర్లకు మూడు నెలలుగా అందని వేతనాలు
స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
వేతనం కోసం గట్టిగా అడిగితే ఉద్యోగం తొలగిస్తారంట!
సమస్యను పట్టించుకోని విద్యుత్ శాఖ అధికారులు
అనంతపురంలో పని చేస్తున్న మీటర్ రీడర్(Meter reader) డేవిడ్‌కు(పేరు మార్చాం) మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదు. ఇలాగైతే కుటుంబ జీవనం సాగించేదెలా? ఇలాగే ఉంటే మరో రెండు నెలలు వేతనాలు కూడా ఇవ్వరు. దీనిపై కాంట్రాక్టర్లతో గట్టిగా మాట్లాడాలి అంటూ వారి వాట్సాప్ గ్రూప్‌లో తన అభిప్రాయాన్ని పోస్టు చేశాడు. వేతనాల కోసం గట్టిగా అడిగితే వారి ఖాతా క్లోజ్ చేసి ఇంటికి పంపేస్తామంటూ కాంట్రాక్టర్ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మీటర్ రీడర్స్(Meter readers) ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకుందాంలే.. ఉన్న ఉద్యోగం పోతే అంతే సంగతులు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
అనంతపురం టౌన్: విద్యుత్(Electricity) వినియోగదారులకు ప్రతి నెలా బిల్లును తీసి అందించే మీటర్ రీడర్ల బతుకు మీటర్ మాత్రం తిరగడం లేదు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో రెండు నెలలు, మరి కొన్ని ప్రాంతాల్లో మూడు నెలలు కావొస్తున్నా వేతనాలు మాత్రం అందడం లేదు. కాంట్రాక్టర్లు మాత్రం ప్రతి నెలా తమకు రావాల్సిన బిల్లులను విద్యుత్ సంస్థ నుంచి తీసుకుంటూ మీటర్ రీడర్లకు మాత్రం మొండిచేయి చూపుతున్నారు. వేతనాలపై జీవనం సాగిస్తున్న దాదాపు 220 మంది మీటర్ రీడర్ల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి.
వేతనాలు అడిగితే ఉద్యోగం తొలగిస్తారంట..
వేతనాల కోసం అడిగితే తమను ఉద్యోగం నుంచి తొలగిస్తారనే వాయిస్‌ను కాంట్రాక్టర్లు మీటర్ రీడర్లకు పంపారు. దీంతో వారు వేతనాలు ఇవ్వకపోయినా గట్టిగా అడగలేని పరిస్థితి. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి సైతం తీసుకెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆరు నెలల క్రితం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 24 ఏరియాలకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను విద్యుత్ శాఖ అధికారులు పిలిచారు. 250 మందికి పైగా కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ(electricity department) అధికారులు ఏక పక్షంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇద్దరు వ్యక్తులకే స్పాట్ బిల్లింగ్ టెండర్లను ఖరారు చేశారు. టెండర్లలో ఎవరు తక్కువకు కోట్ చేశారనే విషయాలను పరిశీలించకుండానే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారుల సూచనల మేరకు ఇద్దరు వ్యక్తులకు స్పాట్ బిల్లింగ్ టెండర్లను కట్టబెట్టారని అప్పట్లోనే అప్పటి ఎస్‌ఈపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంట్రాక్ట్ పొంది ఐదు నెలలు కాగా దాదాపు 3 నెలల వేతనం మీటర్ రీడర్స్‌కు పెండింగ్ పెట్టారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పట్టించుకునే వారేరీ?..
మీటర్ రీడర్లకు స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వలేదనే విషయాలు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు తెలిసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మీటర్ రీడర్ల అధికారికంగా ఫిర్యాదు చేస్తే అప్పుడు చూద్దాములే అంటూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలున్నాయి. వేతనాలపై లిఖిత పూర్వకంగా కాంట్రాక్టర్లపై ఫిర్యాదు చేస్తే ఉన్న ఉద్యోగం పోతుందనే భయంతో మీటర్ రీడర్లు ఉన్నారు. దీన్ని అసరాగా చేసుకున్న స్పాట్ బిల్లింగ్ కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు స్పందించి మీటర్ రీడర్ల వేతనాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
రెండు రోజుల్లో వేతనాలు అందేలా చర్యలు
మీటర్ రీడర్లకు మూడు నెలలుగా వేతనాలు అందలేదన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై కాంట్రాక్టర్లతో మాట్లాడి రెండు రోజుల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మీటర్ రీడర్లకు వేతనాలు అందించేలా చర్యలు తీసుకుంటాం. ఇక నుంచి ప్రతి నెలా వారి ఖాతాల్లో 5వ తేదీలోగా వేతనాలు జమ చేసేలా చూస్తాం – శేషాద్రి శేఖర్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, అనంతపురం
Comments
Please login to add a commentAdd a comment