సాక్షి, అమరావతి: స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ నష్టాలను అరికట్టవచ్చని.. సరఫరా వ్యయాన్ని తగ్గించవచ్చని కేంద్ర విద్యుత్ శాఖ తాజాగా వెల్లడించింది. ఈ మీటర్లను పెట్టడం వల్ల ఎనర్జీ ఆడిటింగ్, అకౌంటింగ్‌కు అవకాశం ఉంటుందని తెలిపింది. అందుకే వ్యవసాయ, వాణిజ్య, గృహ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
2025 మార్చి నాటికి దేశమంతటా..
కేంద్ర విద్యుత్ శాఖ ప్రతిపాదిత పంపిణీ వ్యవస్థ పునరుద్దీకరణ పథకం(ఆర్డీఎస్‌ఎస్)లో భాగంగా విద్యుత్ స్మార్ట్‌మీటర్ల బిగింపు ప్రక్రియ దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ జరుగుతోంది. ఇప్పుడు ఉన్న దాదాపు 1.80 కోట్ల మంది (వ్యవసాయేతర) వినియోగదారులలో నెలకు 200 యూనిట్ల వరకు వినియోగించేవారిని మినహాయించి మిగిలిన వారికి స్మార్ట్ మీటర్లు బిగించాలని డిస్కంలు ప్రతిపాదించాయి.
అలాగే ‘ఆర్డీఎస్‌ఎస్’లో భాగంగా 2025 మార్చి నాటికి దేశమంతటా అన్ని రాష్ట్రాలూ స్మార్ట్ విద్యుత్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు 2019లోనే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ ఇచ్చింది. దాని ప్రకారం ఏపీలో 18.56 లక్షల వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం 2020వ సంవత్సరంలో ఆదేశాలిచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్ మీటర్ల ప్రక్రియ 50 శాతం నుంచి 100 శాతం వరకు పూర్తయ్యింది. అయితే స్మార్ట్ మీటర్లపై అనేక అపోహలు, విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా వివరణ ఇచ్చింది.
రైతులపై పైసా కూడా భారం పడదు..
ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఇచ్చే విద్యుత్‌ను కచ్చితత్వంతో లెక్కించలేకపోవడం వల్ల ఇంధన ఆడిట్ కష్టమవుతోంది. వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతుందో తెలుసుకోవడానికి, లబ్ధిదారులకు నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత మొత్తం చెల్లించాలనే సమాచారం కోసం.. వ్యవసాయ కనెక్షన్లకు బిగించే స్మార్ట్ మీటర్లు ఉపయోగపడతాయి.
అలాగే విద్యుత్ ప్రమాదాల నుంచి రైతులను రక్షించేందుకు అలైడ్ మెటీరియల్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగదారులపై గానీ, విద్యుత్ సంస్థలపై గానీ ఒక్క పైసా కూడా భారం పడదు. ‘ఆర్డీఎస్‌ఎస్’కు ఏపీ డిస్కంలు ఎంపికైనట్టు కేంద్రం ప్రకటించింది. తద్వారా మీటరుకు రూ.1,350 వరకు గ్రాంట్ పొందే అవకాశం ఏర్పడింది. స్మార్ట్ మీటర్ల సరఫరా, నిర్వహణ, ఆపరేషన్ బాధ్యత మొత్తం సర్వీస్ ప్రొవైడర్లదేనని కేంద్రం వివరించింది.
స్మార్ట్‌మీటర్లతో ఉపయోగాలు..
మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, వాణిజ్య భవనాలు, పరిశ్రమలతో పాటు విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు, 11కేవి ఫీడర్లకు అన్నింటికీ కలిపి 42 లక్షల స్మార్ట్ మీటర్లను బిగించేందుకు డిస్కంలు చర్యలు చేపట్టాయి. గృహాలకు స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం వల్ల సమయానుసార(టైం ఆఫ్ డే) టారిఫ్ విధానంలో పాల్గొనే అవకాశం వస్తుంది. విద్యుత్ కొనుగోలు ధరలు తక్కువగా ఉండే సమయంలో వారి వినియోగాన్ని పెంచుకుని టారిఫ్ లాభం పొందే అవకాశం ఉంది. అలాగే బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఆ బిల్లు మొత్తాన్ని ఒకేసారి కాకుండా అవసరాలకు అనుగుణంగా చెల్లించవచ్చు. విద్యుత్ సరఫరా చేసే సమయం, విద్యుత్ నాణ్యత తెలుసుకోవచ్చు. విద్యుత్ చౌర్యాన్ని అరికట్టవచ్చు. ఈ మీటర్ల పెట్టుబడిలో దాదాపు 40 శాతం వరకు రాయితీ లభిస్తుంది.
రైతులకు అభ్యంతరం లేదు
స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల వ్యవసాయ బోరు పనితీరు మెరుగుపడుతుంది. మోటార్ కాలిపోకుండా ఉంటుంది. ఇప్పటికంటే మెరుగైన విద్యుత్ వస్తుందని విద్యుత్ శాఖ సిబ్బంది మాకు వివరించారు. దీంతో మీటర్ పెట్టడానికి మా లాంటి రైతులందరూ ముందుకు వస్తున్నారు. మీటర్‌తో పాటు రక్షణ పరికరాలు అందించడం బాగుంది. మాకు 8 బోర్లు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ వల్ల ఏ సర్వీసునూ తొలగించలేదు. – బొల్లారెడ్డి రామకృష్ణారెడ్డి, రైతు, వీరంపాలెం, పశ్చిమగోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment