స్మార్ట్‌ మీటర్లతో రైతుపై పైసా భారం పడదు | Smart meters will not burden the farmer | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ మీటర్లతో రైతుపై పైసా భారం పడదు

Published Sun, Sep 3 2023 5:04 AM | Last Updated on Sun, Sep 3 2023 5:04 AM

Smart meters will not burden the farmer - Sakshi

సాక్షి, అమరావతి:  రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన పథకమే డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం. ఈ పధకం క్రింద రైతులు వ్యవసాయ విద్యుత్‌కు చెల్లించాల్సి న బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ బిల్లు మొత్తాన్ని నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రత్యేక రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు  ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్థనరెడ్డి, కె.సంతోషరావు చెప్పారు. స్మార్ట్‌ మీటర్లపై అపోహలను తొలగిస్తూ వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను సాంకేతిక అంశాల ఆధారంగా వారు ‘సాక్షి’ ప్రతి నిధికి వివరించారు. వారు తెలిపిన పూర్తి వివరాలు..

రైతులకు పైసా ఖర్చు లేదు
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ ఉచిత వ్యవసాయ విద్యుత్‌ పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్‌ ఎనర్జీ మీటర్లను అమర్చాలని ఆదేశించింది. వినియోగం ఆధారంగా వ్యవసాయ సబ్సిడీ మొత్తం రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. ఆ తర్వాత అంతే మొత్తం డిస్కంలకు స్వయంచాలకంగా బదిలీ అవుతుంది. వ్యవసాయ సర్వీసులకు మీటర్ల ఖర్చును సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.

ఈ పథకం ప్రస్తుతం ఉచిత విద్యుత్‌ పొందుతున్న అందరు రైతులకు (వ్యవసాయ వినియోగదారులకి) వర్తిస్తుంది. రైతులు జేబు నుండి ఒక్క పైసా చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్‌ పొందుతున్నారో, అదే విధంగా ఇక మీదట కూడా పొందుతారు. అలాగే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ వినియోగానికి ఎటువంటి పరిమితి లేదు. వినియోగించిన యూనిట్ల బిల్లు మొ త్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.   మీటరు బిగించడానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది.

మీటరు మరమ్మతు ఖర్చులు పూర్తిగా విద్యుత్‌ కంపెనీలే భరిస్తాయి. మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా లేదా దొంగతనానికి గురైనా, వాటికి అయ్యే ఖర్చును విద్యుత్‌ కంపెనీలు భరిస్తాయి. మొదటిసారైనా, తర్వాత అయినా మొత్తం ఖర్చు విద్యుత్‌ కంపెనీలదే. రైతులపై పైసా భారం ఉండదు.

రక్షణ పరికరాలతో లాభాలు
వ్యవసాయ విద్యుత్‌ మీటర్‌తో పాటు ఏర్పాటు చేస్తున్న భద్రతా ఉపకరణాలతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కెపాసిటర్, వో ల్టేజి హెచ్చు తగ్గులను నివారించి వ్యవసాయ విద్యుత్‌ మోటారు జీవితకాలాన్ని పెంచుతుంది. మోటారు పనితనం మెరుగవుతుంది.

వ్యవసాయ విద్యుత్‌ మోటారు స్టార్టర్, మోటారు వైండింగ్, అనుసంధానించిన వైర్లలో వచ్చిన లోపాలతో మోటారు కాలిపోవడం గాని, షార్ట్‌ సర్క్యూట్‌తో ట్రాన్స్‌ఫార్మర్‌ ఫెయిల్‌ కావడం గాని జరగకుండా కాన్ఫిగరేషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీసీబీ) కాపాడుతుంది. వర్షాలకు తడిసినప్పుడు ఇనుప బాక్స్‌ల ద్వారా కలిగే విద్యుత్‌ ప్రమాదాలను షీట్‌ మౌల్డింగ్‌ కాంపౌండ్‌ (ఎస్‌ఎంసీ) బాక్స్‌ నివారిస్తుంది.

ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. పీవీసీ వైరు ఎండకు ఎండి త్వరగా పాడవడమే కాకుండా షార్ట్‌ సర్క్యూట్‌తో మోటారుకు, ట్రాన్స్‌ఫార్మర్‌కు ప్రమాదకారి అవుతుంది. డబ్ల్యూపీటీసీ (అల్యూమినియం) వైరుతో వీటిని నివారించవచ్చు. అల్యూమినియం ఎర్త్‌ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం, సరైన పద్ధతిలో అనుసంధానించడం వల్ల రైతులకు మోటారు స్టార్టర్, మీటరు బాక్సు తదితర ఉపకరణాల ద్వారా  షాక్‌ తగలదు. తద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు.

పథకం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు
స్మార్ట్‌ మీటరు బిగించడం వలన రైతు ఎంత కరెంటు ఉపయోగిస్తున్నది కచ్చితంగా లెక్క తేలుతుంది. ప్రభుత్వం డబ్బులు అతనికి ఎంత వస్తున్నాయో తెలుస్తుంది. రైతు డబ్బులు చెల్లించడం వలన సరఫరా నాణ్యత, మంచి సేవలను విద్యుత్‌ సంస్థ నుంచి డిమాండ్‌ చేసే అవకాశం ఉంటుంది. మీటర్‌ పెట్టడం వలన జేఎల్‌ఎం, లైన్‌మెన్‌ నెలనెలా మీటర్‌ రీడింగ్‌ కోసం మోటారు దగ్గరకు రావడం వలన ఏదైనా సమస్య ఉన్నచో అతని ద్వారా పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. మీటర్‌ రీడింగ్‌ ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని వారు తెలుసుకోగలరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement