YSR free power scheme
-
స్మార్ట్ మీటర్లతో రైతుపై పైసా భారం పడదు
సాక్షి, అమరావతి: రైతులకు పగటి పూట 9 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేసిన పథకమే డాక్టర్ వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. ఈ పధకం క్రింద రైతులు వ్యవసాయ విద్యుత్‌కు చెల్లించాల్సి న బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ బిల్లు మొత్తాన్ని నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రత్యేక రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుందని ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మాజనార్థనరెడ్డి, కె.సంతోషరావు చెప్పారు. స్మార్ట్ మీటర్లపై అపోహలను తొలగిస్తూ వాటి వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలను సాంకేతిక అంశాల ఆధారంగా వారు ‘సాక్షి’ ప్రతి నిధికి వివరించారు. వారు తెలిపిన పూర్తి వివరాలు.. రైతులకు పైసా ఖర్చు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ ఎనర్జీ మీటర్లను అమర్చాలని ఆదేశించింది. వినియోగం ఆధారంగా వ్యవసాయ సబ్సిడీ మొత్తం రైతు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తుంది. ఆ తర్వాత అంతే మొత్తం డిస్కంలకు స్వయంచాలకంగా బదిలీ అవుతుంది. వ్యవసాయ సర్వీసులకు మీటర్ల ఖర్చును సబ్సిడీగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఈ పథకం ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న అందరు రైతులకు (వ్యవసాయ వినియోగదారులకి) వర్తిస్తుంది. రైతులు జేబు నుండి ఒక్క పైసా చెల్లించవలసిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారో, అదే విధంగా ఇక మీదట కూడా పొందుతారు. అలాగే తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ వినియోగానికి ఎటువంటి పరిమితి లేదు. వినియోగించిన యూనిట్ల బిల్లు మొ త్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే వినియోగదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. మీటరు బిగించడానికి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. మీటరు మరమ్మతు ఖర్చులు పూర్తిగా విద్యుత్ కంపెనీలే భరిస్తాయి. మీటర్లు కాలిపోయినా, పనిచేయకపోయినా లేదా దొంగతనానికి గురైనా, వాటికి అయ్యే ఖర్చును విద్యుత్ కంపెనీలు భరిస్తాయి. మొదటిసారైనా, తర్వాత అయినా మొత్తం ఖర్చు విద్యుత్ కంపెనీలదే. రైతులపై పైసా భారం ఉండదు. రక్షణ పరికరాలతో లాభాలు వ్యవసాయ విద్యుత్ మీటర్‌తో పాటు ఏర్పాటు చేస్తున్న భద్రతా ఉపకరణాలతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే కెపాసిటర్, వో ల్టేజి హెచ్చు తగ్గులను నివారించి వ్యవసాయ విద్యుత్ మోటారు జీవితకాలాన్ని పెంచుతుంది. మోటారు పనితనం మెరుగవుతుంది. వ్యవసాయ విద్యుత్ మోటారు స్టార్టర్, మోటారు వైండింగ్, అనుసంధానించిన వైర్లలో వచ్చిన లోపాలతో మోటారు కాలిపోవడం గాని, షార్ట్ సర్క్యూట్‌తో ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ కావడం గాని జరగకుండా కాన్ఫిగరేషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీబీ) కాపాడుతుంది. వర్షాలకు తడిసినప్పుడు ఇనుప బాక్స్‌ల ద్వారా కలిగే విద్యుత్ ప్రమాదాలను షీట్ మౌల్డింగ్ కాంపౌండ్ (ఎస్ఎంసీ) బాక్స్ నివారిస్తుంది. ఇది అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకుని ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది. పీవీసీ వైరు ఎండకు ఎండి త్వరగా పాడవడమే కాకుండా షార్ట్ సర్క్యూట్‌తో మోటారుకు, ట్రాన్స్ఫార్మర్కు ప్రమాదకారి అవుతుంది. డబ్ల్యూపీటీసీ (అల్యూమినియం) వైరుతో వీటిని నివారించవచ్చు. అల్యూమినియం ఎర్త్ వైరు, పైపులను ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాటు చేయడం, సరైన పద్ధతిలో అనుసంధానించడం వల్ల రైతులకు మోటారు స్టార్టర్, మీటరు బాక్సు తదితర ఉపకరణాల ద్వారా షాక్ తగలదు. తద్వారా ప్రాణాపాయాన్ని నివారించవచ్చు. పథకం వల్ల రైతులకు కలిగే ప్రయోజనాలు స్మార్ట్ మీటరు బిగించడం వలన రైతు ఎంత కరెంటు ఉపయోగిస్తున్నది కచ్చితంగా లెక్క తేలుతుంది. ప్రభుత్వం డబ్బులు అతనికి ఎంత వస్తున్నాయో తెలుస్తుంది. రైతు డబ్బులు చెల్లించడం వలన సరఫరా నాణ్యత, మంచి సేవలను విద్యుత్ సంస్థ నుంచి డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. మీటర్ పెట్టడం వలన జేఎల్ఎం, లైన్మెన్ నెలనెలా మీటర్ రీడింగ్ కోసం మోటారు దగ్గరకు రావడం వలన ఏదైనా సమస్య ఉన్నచో అతని ద్వారా పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. మీటర్ రీడింగ్ ను బట్టి పంపు, మోటారు పనిచేసే విధానాన్ని వారు తెలుసుకోగలరు. -
వ్యవసాయ మీటర్లు భారం కాదు.. భరోసా
సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను రైతన్నకు హక్కుగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ కొరత రాకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగంపై కచ్చితమైన లెక్కలు వచ్చేలా చర్యలు చేపట్టింది. అయితే ఉచిత విద్యుత్ పథకం కొందరికే అమలవుతుందని, రైతులే బిల్లులు చెల్లించాల్సి వస్తుందని కొందరిలో అపోహలు ఉన్నాయి. ఇవన్నీ అపోహలేనని, నిజాలు కావని అధికారులు చెబుతున్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల ఉపయోగాలే తప్ప రైతుకు ఎటువంటి భారం ఉండదని స్పష్టంచేస్తున్నారు. పైగా నాణ్యమైన విద్యుత్‌ను పొందేందుకు రైతుకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెబుతున్నారు. రైతుపై పైసా భారం ఉండదు స్మార్ట్ మీటర్లు బిగించినప్పటికీ రైతుకు పైసా భారం పడదు. ఇప్పుడు అమలవుతున్నట్లుగానే అర్హులైన రైతులందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ బిల్లు దగ్గర్నుంచి, మీటర్లు బిగించడానికి, వాటి మరమ్మతులకు అయ్యే ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది. వినియోగించిన విద్యుత్‌కు రైతులు చెల్లించాల్సిన బిల్లు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా జమ చేస్తుంది. రైతులు ఆ బిల్లు సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించాలి. దీనిద్వారా వారికి ఉచిత విద్యుత్‌ను హక్కుగా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. రైతుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డిస్కంలకు బకాయిలనేవి ఉండవు కాబట్టి కచ్చితంగా మెరుగైన సేవలు అందిస్తాయి. నాణ్యమైన విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా అవుతున్న విద్యుత్ నాణ్యత (లో వోల్టేజీ, అంతరాయాలు వంటివి లేకుండా) మెరుగుపడుతుంది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నా, సబ్ స్టేషన్లపై లోడ్ ఎక్కువై లో వోల్టేజీ సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఎవరెవరికి విద్యుత్ అందుతుందో, ఏ రైతుకు ఏ కారణంగా విద్యుత్ అందడం లేదో తెలియాలన్నా ఈ మీటర్లతోనే సాధ్యమవుతుందని డిస్కంలు, ఇంధన శాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు. అనధికార కనెక్షన్ల క్రమబద్ధీకరణ అనధికార, అదనపు లోడ్ విద్యుత్ కనెక్షన్లనూ కిలోవాట్‌కు రూ.1,200 చొప్పున డెవలప్మెంట్ చార్జీ, ప్రతి హెచ్‌పీకి రూ.40 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే వాటిని క్రమబద్ధీకరించి, మీటర్లు అందించి ఉచిత విద్యుత్ పరిధిలోకి తీసుకువస్తారు. ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్ పేరు మార్చుకోవాలంటే పట్టాదారు పాసు పుస్తకం, భూ యాజమాన్య హక్కుపత్రం ఆధారంగా మార్చుకోవచ్చు. అవి అందుబాటులో లేకపోతే గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది. వృథా ఉండదు 2020–21 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 26 వేల వ్యవసాయ కనెక్షన్లకు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారని డిస్కంలు అంచనా వేశాయి. దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీని చెల్లించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇదే జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 28 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించారు. తర్వాత 67.76 మినియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు వచ్చింది. అంటే.. 2 వేల వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ తక్కువగా వినియోగించినట్లు తేలింది. దీనివల్ల ఇప్పటివరకు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పేరుతో చేస్తున్న అదనపు చెల్లింపులకు అడ్డుకట్ట పడింది. ఇదే విధంగా రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు 6 నెలల్లో మీటర్లు పెడితే వ్యవసాయ విద్యుత్‌కు చెల్లిస్తున్న దాదాపు రూ.10 వేల కోట్ల సబ్సిడీలో మూడోవంతు మిగులుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈమేరకు చర్యలు వేగవంతం చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది.