సాక్షి, అమరావతి: వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ద్వారా 30 ఏళ్ల పాటు వ్యవసాయానికి నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను రైతన్నకు హక్కుగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విద్యుత్ కొరత రాకుండా సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వ్యవసాయ సర్వీసులకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగంపై కచ్చితమైన లెక్కలు వచ్చేలా చర్యలు చేపట్టింది. అయితే ఉచిత విద్యుత్ పథకం కొందరికే అమలవుతుందని, రైతులే బిల్లులు చెల్లించాల్సి వస్తుందని కొందరిలో అపోహలు ఉన్నాయి. ఇవన్నీ అపోహలేనని, నిజాలు కావని అధికారులు చెబుతున్నారు. మీటర్ల ఏర్పాటు వల్ల ఉపయోగాలే తప్ప రైతుకు ఎటువంటి భారం ఉండదని స్పష్టంచేస్తున్నారు. పైగా నాణ్యమైన విద్యుత్‌ను పొందేందుకు రైతుకు భరోసా ఇచ్చినట్లవుతుందని చెబుతున్నారు.
రైతుపై పైసా భారం ఉండదు
స్మార్ట్ మీటర్లు బిగించినప్పటికీ రైతుకు పైసా భారం పడదు. ఇప్పుడు అమలవుతున్నట్లుగానే అర్హులైన రైతులందరికీ ఉచిత విద్యుత్ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ బిల్లు దగ్గర్నుంచి, మీటర్లు బిగించడానికి, వాటి మరమ్మతులకు అయ్యే ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది.
వినియోగించిన విద్యుత్‌కు రైతులు చెల్లించాల్సిన బిల్లు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకు డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్‌ఫర్ (డీబీటీ) ద్వారా జమ చేస్తుంది. రైతులు ఆ బిల్లు సొమ్మును విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లకు చెల్లించాలి. దీనిద్వారా వారికి ఉచిత విద్యుత్‌ను హక్కుగా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. రైతుల నుంచి బిల్లులు వసూలు చేస్తున్న డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే డిస్కంలకు బకాయిలనేవి ఉండవు కాబట్టి కచ్చితంగా మెరుగైన సేవలు అందిస్తాయి.
నాణ్యమైన విద్యుత్
మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయ పంపుసెట్లకు సరఫరా అవుతున్న విద్యుత్ నాణ్యత (లో వోల్టేజీ, అంతరాయాలు వంటివి లేకుండా) మెరుగుపడుతుంది. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోకుండా ఉండాలన్నా, సబ్ స్టేషన్లపై లోడ్ ఎక్కువై లో వోల్టేజీ సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఎవరెవరికి విద్యుత్ అందుతుందో, ఏ రైతుకు ఏ కారణంగా విద్యుత్ అందడం లేదో తెలియాలన్నా ఈ మీటర్లతోనే సాధ్యమవుతుందని డిస్కంలు, ఇంధన శాఖ అధికారులు స్పష్టంచేస్తున్నారు.
అనధికార కనెక్షన్ల క్రమబద్ధీకరణ
అనధికార, అదనపు లోడ్ విద్యుత్ కనెక్షన్లనూ కిలోవాట్‌కు రూ.1,200 చొప్పున డెవలప్‌మెంట్ చార్జీ, ప్రతి హెచ్‌పీకి రూ.40 చొప్పున సెక్యూరిటీ డిపాజిట్ చెల్లిస్తే వాటిని క్రమబద్ధీకరించి, మీటర్లు అందించి ఉచిత విద్యుత్ పరిధిలోకి తీసుకువస్తారు. ప్రస్తుత యజమాని పేరిట సర్వీసు కనెక్షన్ పేరు మార్చుకోవాలంటే పట్టాదారు పాసు పుస్తకం, భూ యాజమాన్య హక్కుపత్రం ఆధారంగా మార్చుకోవచ్చు. అవి అందుబాటులో లేకపోతే గ్రామ రెవెన్యూ అధికారి ధ్రువీకరించాల్సి ఉంటుంది.
వృథా ఉండదు
2020–21 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 26 వేల వ్యవసాయ కనెక్షన్లకు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగించారని డిస్కంలు అంచనా వేశాయి. దాని ప్రకారం ప్రభుత్వం సబ్సిడీని చెల్లించింది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఇదే జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 28 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించారు. తర్వాత 67.76 మినియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించినట్లు వచ్చింది. అంటే.. 2 వేల వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉన్నప్పటికీ 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ తక్కువగా వినియోగించినట్లు తేలింది. దీనివల్ల ఇప్పటివరకు వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ పేరుతో చేస్తున్న అదనపు చెల్లింపులకు అడ్డుకట్ట పడింది. ఇదే విధంగా రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ సర్వీసులకు 6 నెలల్లో మీటర్లు పెడితే వ్యవసాయ విద్యుత్‌కు చెల్లిస్తున్న దాదాపు రూ.10 వేల కోట్ల సబ్సిడీలో మూడోవంతు మిగులుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈమేరకు చర్యలు వేగవంతం చేయాలని విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment