ఉచిత విద్యుత్‌కు గంట కోత! | free Power One hour cut | Sakshi
Sakshi News home page

ఉచిత విద్యుత్‌కు గంట కోత!

Published Sun, Feb 2 2014 2:44 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

free Power One hour cut

 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ... వ్యవసాయూనికి
 ఏడు గంటల ఉచిత సర ఫరాకు ఎప్పుడో తిలోదకాలు
 రెండు లేదా మూడు గంటలకు మాత్రమే పరిమితం


 సాక్షి, హైదరాబాద్: వ్యవసాయూనికి ఉచిత విద్యుత్ పథకంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రోజురోజుకీ పెరిగిపోతోంది. పథకాన్ని ఎప్పటికప్పుడు ఆంక్షల చట్రంలో బిగిస్తూ రైతుల్ని ఇక్కట్ల పాలు చేస్తున్న ప్రస్తుత సర్కారు.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయూంలో ఇచ్చిన ఏడు గంటల ఉచిత విద్యుత్‌కు ఎప్పుడో తిలోదకాలిచ్చింది. ప్రస్తుతం రెండు, మూడు గంటలు మాత్రమే ఇస్తోంది. తాజాగా మరో గంటపాటు కోత కోస్తూ శనివారం ఇంధన శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక గంటా రెండు గంటలు కూడా ఉచిత విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

 జిల్లా యూనిట్‌గా వ్యవసాయ ఫీడర్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. 7 గంటలు వ్యవసాయ విద్యుత్ ఉన్న సమయంలో ‘ఎ’ గ్రూపునకు పగలు 3 గంటలు, రాత్రి 4 గంటలు ఇస్తే.. ‘బి’ గ్రూపునకు పగలు 4 గంటలు, రాత్రి 3  గంటలు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం పగలు గంట, రాత్రి గంట మాత్రమే ఇస్తున్నారు. తాజాగా అధికారిక ఉచిత విద్యుత్ సరఫరాను 6 గంటలకు కుదించారు. దీంతో వ్యవసాయానికి ఎప్పుడు విద్యుత్ సరఫరా ఉంటుందో.. ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి నెలకొంది. తాజా ఆదేశాల ప్రకారం ‘ఎ’ గ్రూపునకు రాత్రి 9 నుంచి 12 గంటల వరకు, పగలు 12 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇవ్వాలని ఆదేశించారు. ‘బి’ గ్రూపు ఫీడర్లకు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇవ్వాలని ఆదేశించారు. అయితే పగలు గ్రామాల్లో అసలుకే విద్యుత్ సరఫరా ఉండటం లేదు. ఈ నేపథ్యంలో రాత్రిపూట కేవలం ఒక గంట మాత్రమే వ్యవసాయానికి విద్యుత్ వచ్చే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 10 వేల వ్యవసాయ ఫీడర్లు ఉన్నాయి. ఇందులో సగం ఫీడర్లకు నిర్దేశిత 7 గంటలు విద్యుత్ సరఫరా చేయడం లేదని అధికారికంగా డిస్కంలే చెబుతున్నాయి. అయితే వాస్తవ పరిస్థితి మరింత దారుణంగా ఉందని, తాజాగా 7 గంటల విద్యుత్‌ను 6 గంటలకు కుదించిన నేపథ్యంలో ఇక పంటలు ఎండిపోక తప్పదని రైతులు అంటున్నారు.

 లాభ నష్టాలపైనే దృష్టి.. సంక్షేమం నాస్తి

 విద్యుత్ లోటు నేపథ్యంలో గ్రామాల్లో పగలు 12 గంటల పాటు విద్యుత్ కోతను అమలు చేస్తున్న ప్రభుత్వం వ్యవసాయానికి అరకొరగానే సరఫరా చేస్తోంది. గృహాలకు విద్యుత్ చార్జీలు తక్కువగా ఉండటం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కావడంతో ప్రభుత్వం ఈ రెండు కేటగిరీల విషయంలో కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తోందనే విమర్శలున్నారుు. భారీగా విద్యుత్ ఛార్జీలు ఉన్న పరిశ్రమలు, వాణిజ్య సంస్థల జోలికి ప్రభుత్వం వెళ్లకుండా కరెంటు సరఫరా చేయడం ఇందుకు నిదర్శనమని చెబుతున్నారు. లాభనష్టాల బేరీజు తప్ప ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం పట్టకపోవడమే విద్యుత్ కోతల్లో ఈ విధమైన వ్యత్యాసానికి కారణమన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 జనవరి 31న రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్, సరఫరా, లోటు వివరాలు..
 విద్యుత్ డిమాండ్: 282.32 మిలియన్ యూనిట్లు
 విద్యుత్ సరఫరా: 256.48 మిలియన్ యూనిట్లు
 లోటు : 25.84 మిలియన్ యూనిట్లు
 ఇవీ అధికారిక కోతలు..
 గ్రామాలు: 12 గంటలు
 మండల కేంద్రాలు: 6 నుంచి 8 గంటలు
 జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీలు: 2 నుంచి 4 గంటలు
 హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, వరంగల్: 1 నుంచి 2 గంటలు
 పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు: కోతలు లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement