సాక్షి, అమరావతి: అసత్య కథనాలతో సర్కారుపై బురద చల్లడమే ఈనాడు, పచ్చపత్రికల పనైపోయింది. విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై ఆ పత్రికలు ప్రచురించిన అవాస్తవాలతో కూడిన కథనాలను ఇంధన శాఖ ఖండించింది. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కొనసాగుతుందని, ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని స్పష్టం చేసింది. స్మార్ట్ మీటర్ల కారణంగా రైతులపై ఒక్క పైసా భారం పడదని తేటతెల్లం చేసింది.
విద్యుత్ బిల్లులు రైతులు ముందుగా చెల్లించాల్సిన అవసరం కూడా లేదని, బిల్లుల మొత్తం నెల ముందుగానే రైతుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపింది. ఆ తర్వాత రైతు ఖాతా నుంచి డిస్కంలకు వెళ్తాయని వెల్లడించింది. ఇందులో రైతులు ముందస్తుగా చెల్లించడం లేదా సొంత డబ్బు చెల్లించడం వంటివి ఉండవని స్పష్టం చేసింది. మొత్తం ఖర్చంతా ప్రభత్వమే భరిస్తుందని తెలిపింది.
అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటు తర్వాత కూడా వివిధ వర్గాలకు ప్రభుత్వం ఇస్తున్న విద్యుత్ రాయితీలు యథాతథంగా అమలవుతాయని తెలిపింది. ఈ మేరకు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వాస్తవాలను వెల్లడించారు. నిజాలను మరుగనపెట్టి పేదలు, రైతుల్లో అపోహలు కలి్పంచేలా కథనాలు ప్రచురించవద్దని ఆ పత్రికలను హెచ్చరించారు.
అంశాలవారీగా ఆయన వెల్లడించిన వాస్తవాలిలా ఉన్నాయి...
ఆరోపణ: ఇకపై నేరుగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందదు
వాస్తవం: వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ యథాతథంగా కొనసాగుతుంది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడం వల్ల ఉచిత విద్యుత్ ఉండదని ఎవరూ అపోహ పడాల్సిన పనిలేదు. రానున్న 30 ఏళ్ల పాటు వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ కొనసాగిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలుమార్లు విస్పష్టంగా చెప్పారు.
ఆరోపణ: రైతులు ముందుగానే బిల్లులు చెల్లించాలి
వాస్తవం: రైతులు ముందస్తుగా బిల్లులు చెల్లించాల్సిన పనిలేదు. వ్యవసాయానికి విద్యుత్ వినియోగించుకున్నందుకు రైతులు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. దాని నుంచే డిస్కంలకు వెళుతుంది. అంతేకాదు.. ఈ నగదును ప్రభుత్వం ముందుగానే రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది.
అందువల్ల రైతులు డిస్కంలకు ముందుగా బిల్లులు చెల్లించాల్సిన అగత్యం ఉండదు. రైతులకు అందించే విద్యుత్ అంతా ఉచితమే. రైతులు జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారో, అదే విధంగా ఇక మీదట కూడా పొందుతారు. ఉచిత విద్యుత్తుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
ఆరోపణ: వ్యవసాయ రంగంతో పాటు ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తున్న అన్ని వర్గాలకు సంబంధించిన బిల్లులకు ఇకపై ఇదే విధానం అవలంబించాలి
వాస్తవం: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు అయ్యే మొత్తంతో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీల మొత్తాన్ని కూడా ప్రభుత్వమే డిస్కంలకు చెల్లిస్తుంది. ఆయా వర్గాల సబ్సిడీలకు ఎలాంటి ఢోకా ఉండదు.
ఆరోపణ: కేంద్రం చెప్పిన వాటిని అంగీకరిస్తే రాష్ట్రానికి మరో రూ.7 వేల కోట్ల అదనపు అప్పు తీసుకోవడానికి ఆస్కారం లభిస్తుంది
వాస్తవం: విద్యుత్ రంగం బలోపేతానికి సంస్కరణలు అమలు చేయాలని రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితమే నిర్ణయం జరిగింది. అప్పటి నుంచి వీటిని దశలవారీగా అమలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యుత్ లైన్ల ఏర్పాటు వంటి అనేక కార్యక్రమాల ద్వారా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభు త్వం రుణాలను సద్వినియోగం చేసుకుంటోంది.
ఆరోపణ: ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలి.
వాస్తవం: ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు ఎంత విద్యుత్ వినియోగించుకుంటాయో ఆ మేరకు బిల్లులను అవి చెల్లిస్తాయి. స్థానిక సంస్థలు వాటి నిధులతోనే బిల్లులు చెల్లిస్తాయి.
ఆరోపణ: పంపిణీ నష్టాలు తగ్గించుకోవాలి.
వాస్తవం: ఇందులో తప్పేముంది? విద్యుత్ వృథాను తగ్గించుకోవద్దా? వృథా చేయాలా? ఏయే రంగాలు ఎంతెంత విద్యుత్ వాడుకుంటున్నాయో కచ్చితమైన లెక్కలు తేలితేనే పంపిణీ నష్టాల లెక్కలు తేలతాయి. సంస్కరణల ద్వారా పంపిణీ నష్టాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే చెబుతోంది. పంపిణీ నష్టాలను తగ్గించేందుకు డిస్కంలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. పంపిణీ నష్టాలు తగ్గించడమంటే విద్యుత్ వృథాను తగ్గించడమనే అర్థం.
ఆరోపణ: విద్యుత్ సరఫరాకు, వస్తున్న ఆదాయానికి మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాలి.
వాస్తవం: పంపిణీ నష్టాలను (విద్యుత్ వృ«థా/లైన్ లాసెస్) తగ్గించడం ద్వారా చాలా వరకు ఇది సాధ్యమవుతుంది. ఆదాయ, వ్యయాల మధ్య అంతరం లేకుండా చేయడమంటే నష్టాలు లేకుండా చేయడమే. డిస్కంల లక్ష్యం కూడా ఇదే.
ఆరోపణ: ఒకే లబ్దిదారు విద్యుత్ రంగంలో రెండు రకాల సబ్సిడీలు పొందకుండా చూడాలి.
వాస్తవం: సబ్సిడీల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తున్నందున దీనివల్ల డిస్కంలపై ఎలాంటి ప్రభావం ఉండదు. సబ్సిడీలు ఎలా ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం.
ఆరోపణ: విద్యుత్ రంగంలో ఆర్థిక అంశాలన్నీ పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాలు ఎంత సబ్సిడీ భరిస్తున్నాయి? డిస్క ంలకు ఎంత బాకీ పడ్డాయనేది స్పష్టంగా వెల్లడించాలన్నవి కేంద్ర ప్రభుత్వ షరతులు
వాస్తవం: ఇవి మంచివే కదా. వీటిని అమలు చేయడంలో తప్పేముంది? పూర్తి పారదర్శకంగా ఉంచాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. ప్రస్తుత ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పక్కాగా సబ్సిడీ మొత్తాలను డిస్కంలకు విడుదల చేస్తోంది.
ఆరోపణ: వ్యవసాయ రంగంతోపాటు ఏయే రంగాలు ఎక్కడెక్కడ ఎంతెంత విద్యుత్ వినియోగిస్తున్నాయో మీ టర్ల ద్వారా స్పష్టంగా లెక్కలు తేల్చాలి. మొత్తం విద్యుత్ వినియోగంలో ఎంత శాతానికి మీటర్ల వ్యవస్థ ఏర్పాటైందో కూడా కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుంది.
వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కూడా అదే. ఏయే రంగాలు ఎంతెంత విద్యుత్ వినియోగిస్తున్నాయో స్పష్టమైన లెక్కలు తేల్చాలనే ఉద్దేశంతోనే అన్ని చోట్లా స్మార్ట్ మీటర్లు అమర్చాలని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) నిర్ణయించాయి. ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు మీటరు ఉంటుంది.
ఎన్నో ఉపయోగాలు
స్మార్ట్ మీటర్లతో అనేక లాభాలు ఉన్నాయని, అందువల్లే వీటి ఏర్పాటుకు అంగీకరించామని విజయానంద్ వివరించారు. ‘ఈ మీటర్లతో ఏ సమయంలో ఎక్కడ ఎంత విద్యుత్ వినియోగం అవుతోందో తెలుస్తుంది. తద్వారా ఎంత లోడ్ అవసరమో కచ్చితమైన లెక్క ఉంటుంది. ఆ మేరకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. లోడ్‌కి సరిపడా ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, సబ్‌స్టేషన్లు, ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయొచ్చు.
ఎంత విద్యుత్ అవసరమో అంత సరఫరా కావడం వల్ల మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవు. లోవోల్టేజి, హైవోల్టేజి, ఇతర అంతరాయాలు ఉండవు. మీటర్లు, స్విచ్, ఎర్త్ వైరు వంటి వస్తువులన్నీ నాణ్యమైన వాటినే విద్యుత్ కంపెనీనే అమరుస్తుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలూ ఉండవు. వీటన్నిటి ద్వారా నాణ్యమైన విద్యుత్ వినియోగదారులకు అందుతుంది.
ఒకవేళ ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో లోపాలున్నా, నాణ్యత లోపించినా వెంటనే సంబంధిత శాఖలను నిలదీసే అవకాశం ఉంటుంది. తద్వారా విద్యుత్ సంస్థల్లో జవాబుదారీ తనం కూడా మెరుగవుతుంది’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment