సాక్షి, అమరావతి: అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ను హక్కుగా అందించాలని, 30 ఏళ్లయినా వ్యవసాయానికి ఎలాంటి కొరత లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. ఇందుకోసం ఖర్చుకు కూడా వెనుకాడకుండా రాష్ట్ర రైతాంగం కోసం ఏర్పాటు చేసిన పథకమే వైఎస్‌ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం. ఈ పథకం కింద వ్యవసాయానికి పగటిపూట 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్తు ఉచితంగా అందుతుంది.
ఇందుకోసం ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. వాడిన విద్యుత్‌కు రైతులు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. ఇంత మంచి పని చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు కొందరు. రైతుల హక్కును అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు.
అసత్య ప్రచారాలతో ప్రజలను, రైతులను అయోమయానికి గురిచేయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి తప్పుడు ప్రచారాలని నమ్మి ఆందోళనకు గురికావద్దని ఏపీ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల సీఎండీలు పృధ్వీతేజ్, పద్మాజనార్దనరెడ్డి, సంతోషరావు స్పష్టం చేశారు. వారు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి..
♦ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి వ్యవసాయదారులందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. నగదు బదిలీ పథకంలో చేరేందుకు రైతులందరూ అంగీకరించి దరఖాస్తు కూడా చేసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకానికి వ్యవసాయ విద్యుత్ బిల్లులను ప్రామాణికంగా తీసుకోవడంలేదు. మీటర్ల వల్ల సంక్షేమ పథకాల్లో కోత విధిస్తారనే భయాందోళనలు రైతులకు అవసరం లేదు.
♦రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన, సేవలు అందుతున్నాయి. రైతులకు అత్యంత తక్కువ సమయంలో వ్యవసాయ సర్విసులు విడుదలవుతున్నాయి. కాల్ సెంటర్లను ఆధునీకరించడంతో వినియోగదారుల సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తోంది. దీంతో ఫిర్యాదులు కూడా గణనీయంగా తగ్గాయి. డిస్కంలు కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బలోపేతం అవుతున్నాయి. దీంతో రైతులకు, ప్రజలకు ఇబ్బంది లేకుండా, వ్యవసాయ, గృహ, పారిశ్రామిక, వాణిజ్య విద్యుత్ కొరత లేకుండా అందిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో ఎలాంటి అపోహలకూ తావులేదు.
♦ వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు ఎలాంటి విద్యుత్ బిల్లుల భారం పడదు. పూర్తిగా ఉచితం. నగదు బదిలీ ద్వారా (డీబీటీ) రైతుకు చెందిన ప్రత్యేక బ్యాంకు ఖాతాలో ఆ బిల్లు మొత్తాన్ని ప్రతినెలా ప్రభుత్వమే వేస్తుంది. అది తిరిగి రైతుల ద్వారా విద్యుత్ సంస్థలకు చెల్లించడం జరుగుతుంది. రైతులు వారి జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారో, ఇక మీదట కూడా అలాగే పొందుతారు. ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
♦ ఉచిత విద్యుత్తుకు తూట్లు పొడిచేందుకే ప్రభుత్వం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతోందనే ప్రచారం పూర్తిగా అవాస్తవం. వచ్చే 30 ఏళ్ళ పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు సరఫరా జరుగుతుంది. దీని కోసమే రాష్ట్ర ప్రభుత్వం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్తు కొనుగోలుకు సెకీతో ఒప్పందం చేసుకుంది. అన్ని వ్యవసాయ సర్విసులకు వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని సంపూర్ణంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు కట్టుబడి ఉన్నాయి.
♦ స్మార్ట్ మీటర్ల వల్ల మొత్తం మోటారు లోడు తెలుస్తుంది. ఏ సమయంలో ఏ ప్రాంతాల్లో ఎంతెంత విద్యుత్ సరఫరా చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. దీనివల్ల లోడుకి సరిపడా ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్లు, సబ్‌స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయొచ్చు. అధిక లోడు కారణంగా మోటార్లు కాలిపోయే పరిస్థితి ఉండదు. వ్యవసాయానికి సరఫరా అయ్యే విద్యుత్ నాణ్యత (ఓల్టేజి, అంతరాయాలు) మెరుగుపడుతుంది. ట్రాన్స్‌ఫార్మర్లకి రక్షణ ఏర్పడుతుంది. మీటర్లు, వాటికి కావాల్సిన స్విచ్, ఎర్త్ వైరు వంటి నాణ్యమైన వస్తువులను విద్యుత్ కంపెనీనే అమరుస్తుంది. దీనివల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ప్రమాదాలను నివారించొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment