Fact Check: ‘ఓట్లాటమీ ఓటి కుండదే’ | Eenadu false writings to hide the facts | Sakshi
Sakshi News home page

Fact Check: ‘ఓట్లాటమీ ఓటి కుండదే’

Published Mon, Apr 1 2024 3:32 AM | Last Updated on Mon, Apr 1 2024 5:36 AM

Eenadu false writings to hide the facts - Sakshi

రైతులపై కపట ప్రేమతో రామోజీ మొసలి కన్నీరు 

చంద్రబాబు భజనలో దిగజారిన పచ్చ పత్రిక 

సేద్యానికి 9 గంటలు విద్యుత్‌ ఇచ్చినా నాలిక మడతలే 

కొన్ని ప్రాంతాల్లో రైతుల విజ్ఞప్తి మేరకు రెండు విడతలు 

చంద్రబాబు హయాంలో రోజుకి  నాలుగు గంటలు ఇవ్వడమే గగనం 

వాస్తవాలను దాచిపెట్టి ఈనాడు తప్పుడు రాతలు  

సాక్షి, అమరావతి: ‘ఉచిత విద్యుత్‌ ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందే’ అంటూ ఎద్దేవా చేసి..తాను అధికారంలో ఉన్నన్నాళ్లూ కనీసం రోజుకి మూడు,నాలుగు గంటలు కూడా వ్యవసాయానికి  విద్యుత్‌ ఇవ్వకుండా..రైతులను అష్టకష్టాలు పెట్టారు చంద్రబాబు. అలాంటి నయవంచకుడిని భుజానకెత్తుకుని..ఆయన ప్రాపకం కోసం భజన వార్తలు రాస్తూ రామోజీ రోజురోజుకీ దిగజారిపోతున్నారు.

ప్రతి రోజూ అవాస్తవాలను అచ్చేస్తూ  అడుగడుగునా అబద్దాలు చెప్పుకొస్తూ నిస్సిగ్గుగా ప్రస్తుత ప్రభుత్వంపైనా, సీఎం వైఎస్‌ జగన్‌పైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘జగన్‌ ఓట్లాటలో ఓడిన రైతు!’ శీర్షికతో ఓ నిరాధార వార్తా కథనాన్ని గురువారం అచ్చేశారు డ్రామోజీ. ఆ కథనం వెనుక వాస్తవాలను పరిశీలిస్తే..అసలు నిజాలు ఇలా ఉన్నాయి. 

ఆరోపణ:   అనంతపురం జిల్లా కణేకల్‌ మండలం ఉద్దేహాళ్‌ గ్రామంలో లోకన్న అనే రైతు విద్యుత్‌ సమస్య కారణంగా మూడెకరాల్లో పైరు పశువుల మేత కింద వదిలేశారు. ఇదే గ్రామంలో మరో రైతు ఎర్రిస్వామికి చెందిన పదెకరాల్లో నాలుగెకరాల పైరు ఎండిపోయింది. రాయదుర్గం నియోజకవర్గం పరిధిలో 1200 ఎకరాల్లో వివిధ పంటలు ఎండిపోయాయని అంచనా. 
వాస్తవం:  లోకన్న, అనే రైతుకు ఆరెకరాల పొలం ఉంటే దానికి నీరందించడానికి ఒకే బోరు ఉంది. కానీ ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు తక్కువగా ఉండటం వల్ల ఆ బోరు నుంచి నీరు సరిగ్గా రావడం లేదు. దీని వల్ల అన్ని ఎకరాలకు సరిపడా నీరు అందించలేకపోతున్నారు. ఇదే పరిస్ధితి ఎర్రిస్వామిది కూడా. ఈ కారణంగానే కొంత పొలాన్ని వారు వదిలేయాల్సి వచ్చింది. అంతే తప్ప కరెంటు అందక కాదు. కానీ ఈనాడు మాత్రం వాస్తవాన్ని వక్రీకరించి తమకు అనుకూలంగా అచ్చేసుకుంది. అలాగే 1,200 ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని అధికారిక ధృవీకరణలేమీ లేకుండా కాకి లెక్కలు రాసేసుకుంది. 

ఆరోపణ:  కర్నూలు జిల్లా తుగ్గలికి చెందిన కౌలు రైతు గుండాల ఆంజనేయులు సాగు­నీరు పూర్తిగా అందదని ముందే గ్రహించి నాలుగెకరాల్లో రెండెకరాలు బీడుపెట్టారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు, ఉదయం పది గంటలకు రెండు విడతల్లో విద్యుత్‌ ఇవ్వడం వల్ల నీరు చాలక దిగుబడి దెబ్బతిందని ఆయన వాపోతున్నారు. 
వాస్తవం: నాలుగెకరాలు కౌలుకి తీసుకున్న రైతుకి రెండెకరాలకే నీరందుతుందని ముందే తెలిసిందంటే దానికి కారణం బోరు నుంచి వచ్చే తక్కువ నీరని ఏ రైతుకైనా ఇట్టే అర్ధం అవుతుంది. ఇక రెండు విడతల్లో విద్యుత్‌ కూడా రైతుల విజ్ఞప్తి మేరకే అధికారులు ఇస్తున్నారు. అయినా ఈనాడు చెప్పినట్లు తెల్లవారు జామున నాలుగు గంటలకు, ఉదయం పది గంటలకు విద్యుత్‌ ఇవ్వడం అంటే రైతులకు అనుకూలంగా ఉండే సమయాల్లో ఇస్తున్నట్టే.

గ్రామాల్లో ఏ రైతైనా నాలుగు గంటలకే నిద్రలేచి పొలానికెళ్లి పశువులను, పంట పనులను చూసుకోవడం పరిపాటి. చంద్రబాబు హయాంలో అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారు జామున 3 గంటల మధ్య ఇచ్చేవారు.అది కూడా ఎప్పుడు వస్తుందో, ఎప్పడు పోతుందో తెలిసేది కాదు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదని ఈ రాతలతో ఈనాడే ఒప్పుకుంది. కాదంటారా డ్రామోజీ. 

ఆరోపణ:  థర్మల్‌ ప్లాంట్లు పరిగెత్తుతూనే ఉన్నాయి. ఒత్తిడి పెట్టి ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఏముంది. 
వాస్తవం:రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు గతంతో పోల్చితే అత్యంత భారీగా సామరŠాధ్యన్ని పెంచుకున్నాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కష్ణపట్నంలోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలో గతేడాది మార్చిలో 800 మెగావాట్ల యూనిట్‌ వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. ఎన్‌టీటీపీఎస్‌లో ఎనిమిదో యూనిట్‌  సీఓడీ డిసెంబర్‌లో జరిగింది. దీంతో జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పాదన సామర్థ్యం 5,810 మెగావాట్ల నుంచి 6,610 మెగావాట్లకు పెరిగింది. అలాగే డాక్టర్‌ ఎన్‌టీటీపీఎస్‌  ఆపరేషన్, మెయింటెనెన్స్‌ యూనిట్ల లభ్యత శాతం 2022–23 ఆర్థిక సంవత్సరంలో 69.90 శాతం ఉంటే,  2023–24లో 75.83 శాతానికి పెరిగింది. డాక్టర్‌ ఎన్‌టీటీపీఎస్‌ స్టేజ్‌–4  యూనిట్‌  హీట్‌ రేట్‌ 2,517 కిలో వాట్‌ అవర్‌ నుంచి 2,436 తగ్గింది. అదే విధంగా డాక్టర్‌ ఎంవీర్‌ ఆర్టీపీపీ స్టేషన్‌ యూనిట్ల లభ్యత 67.85 శాతం నుంచి 75.68 శాతానికి మెరుగుపడింది. ఫలితంగా సామర్థ్యాన్ని మించి దాదాపు 10 మె­గావాట్ల అధిక విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. దీం­తో ఏపీ మొత్తం విద్యుత్‌ డిమాండులో ఏపీజెన్‌కో 45  నుంచి 50  శాతం వరకూ  సమకూర్చుతోంది.  

ఆరోపణ:  ఎన్నికల ఏడాది కావడంతో గృహ విద్యుత్‌ వినియోగదారులకు కోతలు పెడితే ఓట్లకు నష్టం కలుగుతుందని సీఎం ఆలోచన. పీక్‌ డిమాండ్‌ సమయంలో అధిక ధరకు విద్యుత్‌ కొనాలన్నా దొరికే పరిస్థితి లేదు.ప్రత్యామ్నాయంగా సేద్యానికిచ్చే విద్యుత్‌లో రోజుకు రెండు గంటలు కోతలు పెట్టారు. వ్యవసాయ విద్యుత్‌ కోసం రూ.10058 కోట్లు వెచ్చించినా ఫలితం లేదు. 
వాస్తవం: మధ్యాహ్నం పీక్‌ డిమాండ్‌ 12476 మెగావాట్లుగా ఉంది. ఇది గతేడాది ఇదే సమయానికి 10643 మెగావాట్లు మాత్రమే ఉండేది. అంటే 17.22 శాతం పెరిగింది. సాయంత్రం పీక్‌ డిమాండ్‌ కూడా 8965 మెగావాట్లుగా ఉంది. దీనికి తగ్గట్లు రోజుకి 39.687 మిలియన్‌ యూనిట్లను యూనిట్‌ సుమారు రూ.9 చొప్పున వెచ్చించి రూ.34.116 కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. విద్యుత్‌ దొరకడం లేదు.. కొనడం లేదనడం అవాస్తవమని ఇక్కడే తేలిపోయింది కదా రామోజీ. అలాగే రాష్ట్రంలో ఎక్కడా సేద్యానికి విద్యుత్‌ కోత లేదు.

నిజానికి ఇది గత ప్రభుత్వ హయాంలో ఉండేది. ప్రస్తుతం వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు విద్యుత్‌ అందుతోంది. భవిష్యత్తులోనూ వ్యవసాయ ఉచిత విద్యుత్‌ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో 7 వేల మెగావాట్ల విద్యుత్‌ యూనిట్‌ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. ఈ విద్యుత్‌ కొనుగోలుకు అయ్యే ఖర్చు కూడా  రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.

అలాగే నాణ్యమైన వ్యవసాయ విద్యుత్‌ సరఫరా కోసం రూ.10058 కోట్లు వెచ్చించడం వల్ల ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోవడం, లో, హై ఓల్టేజీతో మోటార్లు దెబ్బతినడం వంటి సమస్యలు తగ్గాయి. రైతుల బాగుకోసం, వ్యవసాయాన్ని పండుగ చేయడం కోసం అలోచించే నాయకుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది.  

ఆరోపణ: కృత్రిమ మేధనూ ఏమార్చిన ప్రభుత్వం.. డిమాండ్‌ తగ్గిందని తప్పుడు లెక్కలు. 
వాస్తవం: విద్యుత్‌ డిమాండ్, సరఫరాకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలను విద్యుత్‌ సంస్థలు ఏ రోజుకారోజు సిద్ధం చేస్తున్నాయి. ఇందులో ఎలాంటి దాపరికం లేదు. ప్రస్తుతం (గురువారం నాటి బులిటెన్‌ ప్రకారం) రాష్ట్రంలో రోజువారీ డిమాండ్‌ 234.406 మిలియన్‌ యూనిట్లుగా నమోదవుతోంది. ఇది గతేడాది ఇదే సమయానికి జరిగిన వినియోగం 218.322 కంటే 7.37 శాతం ఎక్కువ. దాచాలనుకుంటే గతేడాది కంటే డిమాండ్‌ ఇప్పుడు ఇంత ఎక్కువగా ఉందని చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్లు రోజువారీ పవర్‌ బులిటెన్‌లో స్పష్టంగా ఇస్తున్నారంటే అంతకన్నా పారదర్శకత ఇంకేముంది.

మరోవైపు ఇంత డిమాండ్‌ ఉన్నప్పటికీ విద్యుత్‌ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్‌ సంస్థలు వినియోగదారులకు కరెంట్‌ సరఫరా చేస్తున్నాయి. కృత్రిమ మేధను ఉపయోగించి పవర్‌ ఫోర్‌కాస్ట్‌ ద్వారా డిమాండ్‌ను అంచనా వేసి షార్ట్‌టెర్మ్‌ టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రజలకు విద్యుత్‌ లోటు రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. దీనివల్లనే ప్రతిరోజూ బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోలు చేయగలుగుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement