సాక్షి, అమరావతి : వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి, అన్నదాతకు వెన్నుదన్నుగా నిలుస్తోంది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఇందులో భాగంగానే వ్యవసాయ యాంత్రీకరణకు పెద్ద పీట వేస్తోంది. గ్రామ స్థాయిలోయంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి సన్న, చిన్నకారు రైతులకు ఆధునిక యంత్ర పరికరాలను అందుబాటులోకి తెస్తోంది. అయినా లేనిపోని అభాండాలు వేయడం, ప్రభుత్వంపై బురద జల్లడమే ఈనాడు పనిగా పెట్టుకుంది. యంత్ర పరికరాలపై మరో అబద్ధాల కథనాన్ని అచ్చేసింది.
చంద్రబాబు ప్రభుత్వంలో వ్యవసాయ యాంత్రీకరణ కొన్ని ప్రాంతాలకు, కొంత మంది రైతులకు మాత్రమే పరిమితమయ్యేది. అందులోనూ అనేక అవకతవకలు, అవినీతి. చంద్రబాబు ప్రభుత్వం 2014 – 2019 మధ్య కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు (సీహెచ్‌సీలు) పరిమిత సంఖ్యలో మాత్రమే ఏర్పాటు చేసింది. రుణ సహాయానికి రైతులే బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. ఎక్కడా పారదర్శకత లేదు.
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో ఈ పథకం నడిచింది. ట్రాక్టర్లు, ఇతర యంత్రాల కొనుగోలులో రైతులకు ఏ సంబంధం ఉండేది కాదు. ఎక్కడ ఏది కొనాలో టీడీపీ ప్రభుత్వ పెద్దలో, ఆ పార్టీ నాయకులో, వారి అనుయాయులో చెప్పేవారు. రేట్లు కూడా వారే నిర్ణయించేవారు. రైతులు దీనికి కట్టుబడి ఉండాల్సిందే. సబ్సిడీని నేరుగా డీలర్లకే అందజేసేవారు. దీనివల్ల పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని, తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని జేబుల్లో వేసుకొన్నారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి.
వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చు తగ్గించి, దిగుబడి పెంచి తద్వారా నికర ఆదాయం పెంచడానికి వ్యవసాయ యాంత్రీకరణ అవసరం అని గుర్తించింది. గ్రామ స్థాయిలోనే రైతులందరికీ యంత్ర సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రామాల్లో ఆర్బీకేలకు అనుబంధంగా ఐదారుగురు రైతులతో ఏర్పాటు చేసిన రైతు సంఘాల ద్వారా వైఎస్సార్ యంత్ర సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 10,444 గ్రామ స్థాయి, 492 క్లస్టర్ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది.
ఈ కేంద్రాల్లో రూ. 1052.42 కోట్ల విలువైన యంత్ర పరికరాలను సమకూర్చింది. వీటికి సబ్సిడీ రూ. 366.25 కోట్లు ప్రభుత్వమే భరించింది. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 6,362 ట్రాక్టర్లు, 492 కంబైన్డ్ హార్వెస్టర్లు, 31,356 ఇతర యంత్ర పరికరాలను తక్కువ అద్దెకు రైతులకు అందుబాటులోకి తెచ్చింది. 2021 జనవరి నుండి ఇప్పటివరకు 26 జిల్లాల్లో 3.5 లక్షల మంది రైతులు ఈ కేంద్రాల ద్వారా యంత్ర సేవలు పొందారు. వీరు 9.5 లక్షల ఎకరాల్లో యంత్రాలను వినియోగించారు.
యంత్ర సేవ పథకం కింద రైతు సంఘాలకే పరికరాల ఎంపిక, కొనుగోలు బాధ్యతలను అప్పగించింది. అంతా పారదర్శకంగా జరుగుతోంది. గ్రామాల్లో పంటలకు కావలసిన, బాడుగకు డిమాండ్ ఉన్న పరికరాలు ఈ సంఘాలే ఎంపిక చేసుకొంటాయి. అంతే కాదు.. నచ్చిన కంపెనీల నుంచి యంత్రాలను కొనుక్కొనే స్వేచ్ఛ కూడా సంఘాలకు ఇచ్చారు. వీరికి డీసీసీబీ, జాతీయ బ్యాంకుల ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా 50 శాతం రుణం మంజూరు చేశారు. అవగాహన, జవాబుదారీతనం పెంచడానికి, పథకం అమలులో పారదర్శకత కోసం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా సీహెచ్‌సీ రైతు సంఘాల ఖాతాలకు జమ చేశారు. దీనివల్ల రైతులు వారికి అవసరమైన యంత్రాలను నాణ్యత, మన్నికను పరిశీలించి మరీ కొనుక్కొంటున్నారు.
ఈ యంత్ర సేవా కేంద్రాల సేవలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఆర్బీకేల్లో కూడా ప్రదర్శిస్తున్నారు. ఇందుకోసం రైతాంగాన్ని ఆర్బీకేల ద్వారా రైతు సంఘాలకు అనుసంధానిస్తున్నారు. స్థానికంగా ప్రైవేటుగా యంత్ర పరికరాలకు వసూలు చేస్తున్న అద్దెకంటే తక్కువ ధరకే గ్రామ వ్యవసాయ సలహా మండలి ద్వారా అద్దె నిర్ణయిస్తున్నారు. రైతులు వారి గ్రామంలోనే కాకుండా, మండలంలో ఏ కేంద్రాల నుంచైనా వారికి కావల్సిన యంత్రాలను బాడుగపై పొందడానికి వైఎస్సార్ యంత్ర సేవా యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా రైతులు ఆన్‌లైన్లో 15 రోజుల ముందుగానే మండలం పరిధిలోని యంత్ర సేవా కేంద్రాల నుండి వారికి కావలసిన యంత్ర పరికరాలను బుక్ చేసుకొని, సమకూర్చుకొనేలా ఏర్పాటు చేశారు.
అంతేకాదు ఈ యాప్ ద్వారా రైతు సంఘాల బ్యాంకు రుణాల చెల్లింపును కూడా పర్యవేక్షిస్తున్నారు. మరొకవైపు పెట్టుబడులను తగ్గించడమే లక్ష్యంగా ఆర్బీకే స్థాయిలో వ్యవసాయ డ్రోన్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలి విడతగా 2000 గ్రామాల్లో యంత్ర సేవా కేంద్రాల ద్వారా 40 శాతం రాయితీతో (రూ.80 కోట్లు) డ్రోన్లు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం రాయితీపై స్ప్రేయర్లు, టార్పాలిన్లు కూడా అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఈనాడు ఆరోపణలు సత్యదూరం
ఈ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ యాంత్రీకరణ పథకం నిలిపివేసారంటూ ఈనాడు పత్రిక సత్యదూరమైన ఆరోపణలు చేయడం సరికాదని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ ఓ ప్రకటనలో ఖండించారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని అన్ని ప్రాంతాల్లోని అందరు రైతులకు అందుబాటులో ఉంచిందని చెప్పారు. రైతులకు లబ్ధి చేకూరే విధంగా ప్రతిష్టాత్మకంగా, పారదర్శకంగా అమలు చేస్తోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment