మీ ‘బాబు’దే నయవంచన  | YS Jagan giving 9 hours continuous electricity for farmers | Sakshi
Sakshi News home page

మీ ‘బాబు’దే నయవంచన 

Published Tue, Dec 19 2023 4:54 AM | Last Updated on Tue, Dec 19 2023 4:51 PM

YS Jagan giving 9 hours continuous electricity for farmers - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలు ఉతికి ఆరేసిన పార్టీని తిరిగి అధికారంలోకి తేవడం కోసం ఈనాడు రాస్తు­న్న ఉన్మాద రాతలకు పరాకాష్టే రైతులకు ఉచిత విద్యుత్‌పై రాసిన కథనం. ప్రజలను తప్పుదోవ పట్టించి, దాని అనుకూల పార్టీకి రాజకీయ ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో అచ్చేసిన ఆ అబద్ధపు రాతల్లో అసలు నిజాలను రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు సోమవారం వెల్లడించాయి. ఆ వివరాలిలా ఉన్నాయి.

ఇదీ నయవంచన అంటే..
ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో చంద్రబాబు పాలనను పరిశీలిస్తే.. రైతులను నిలువునా వంచించిన చంద్రబాబు అసలు స్వరూపం కళ్ల ముందు కదలాడుతుంది. రైతు రుణ మాఫీ పేరుతో అన్నదాతలను నిలువునా  దగా చేయడంతో పాటు కనీసం పంట పండించుకోవడానికి కరెంటు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితి కనిపిస్తుంది. కరెంటు ఫ్రీగా ఇస్తే తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్య ఒక్కటి చాలు ఆయన నిజ స్వరూపానికి తార్కాణం. అటువంటి చంద్రబాబు కోసం రైతులకు ఉచిత విద్యుత్‌ వద్దని, దీనివల్ల విద్యుత్‌ సంస్థలు సంక్షోభంలోకి వెళ్లిపోతాయంటూ ఆనాడు పరోక్షంగా కథనాలు రాసింది ఈనాడు పత్రిక. టీడీపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక చర్యలకు పూర్తిగా మద్దతు పలికింది.

ఉచిత విద్యుత్‌ ఇస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనన్న చంద్రబాబు మాటలను గొప్పగా కీర్తించి, రైతుల ప్రయోజనాలను పూర్తిగా మంటగలిపేందుకు తన వంతు సాయం చేసింది. చంద్రబాబు హయాంలో పగటిపూట దేవుడెరుగు.. రాత్రి పూట కూడా కనీసం నాలుగు గంటలు నిరంతరాయంగా కరెంటు ఇచ్చిన పాపానపోలేదు. రాత్రి వేళ నీటి తడులు పెట్టడానికి పొలాలకు వెళ్లి అనేక మంది రైతులు పాము కాట్లకు, విద్యుదాఘాతాలకు మరణించిన ఘటనలు అనేకం. 2014లో చంద్రబాబు తిరిగి అధికారం చేపట్టిన తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పే లేదు. రైతులకు సరఫరా చేసిన విద్యుత్తు అరకొరే. అదికూడా రాత్రిపూటే. పైగా ఉచిత విద్యుత్‌ కోసం డిస్కంలకు చెల్లించాల్సిన సబ్సిడీ రూ.12వేల కోట్లు చెల్లించకపోవడంతో రైతులకు ఉచిత విద్యుత్‌ పథకం పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుంది. 

రాష్ట్ర విభజన నాటికి మొత్తం విద్యుత్‌ సంస్థల అప్పులు దాదాపు 29,700  కోట్లు ఉంటే చంద్రబాబు పదవి ముగిసిన 2019 మార్చి నాటికి 68,600 కోట్లకు (131 శాతం పెరుగుదల) చేరాయి. 2023 మార్చి నాటికి రూ.97,500 కోట్లకు (42 శాతం పెరుగుదల)  చేరాయి. విద్యుత్‌ సంస్థల అప్పుల భారం చంద్రబాబు హయాంలో 2014 – 2019 మధ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిందనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. వీటి గురించి ఈనాడు ఎక్కడా ప్రస్తావించదు.విద్యుత్‌ పంపిణీ సంస్థలు, డిస్కంల నికర విలువ 2014లో సుమారుగా మైనస్‌ 4,315 కోట్లు ఉంటే, 2019లో చంద్రబాబు  ప్రభుత్వం దిగిపోయేనాటికి డిస్కంల నికర విలువ దారుణంగా క్షీణించి మైనస్‌ 20 వేల కోట్లకు చేరింది. ఈ విషయాలు ఈనాడు చెప్పదు. చంద్రబాబు ఘనకార్యాల కారణంగా  రైతు అన్నవాడు పూర్తిగా సంక్షోభంలో చిక్కుకుపోయాడు. చంద్రబాబే నయవంచకుడని, ఆయన పాలన మరో చీకటి అధ్యాయమని రైతులే చెబుతున్నారు.

రైతులకు మేలు చేసిందే సీఎం వైఎస్‌ జగన్‌
వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు పక్షపాత ప్రభుత్వంగా అనేక చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ఉచిత్‌ విద్యుత్‌ పథకం దీర్ఘకాలంగా, స్థిరంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందడానికి గట్టి చర్యలు తీసుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ప్రారంభించారు. సీఎం జగన్‌ ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి రోజుకి తొమ్మిది గంటలపాటు అదీ పగటిపూటే ఏ ఇబ్బందీ లేకుండా విద్యుత్‌ సరఫరా  జరుగుతోంది. ఇప్పుడు రైతులు రాత్రి వేళ ప్రాణాలకు తెగించి పొలాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చాక రూ.1,760  కోట్లు ఖర్చు చేసి 6,663 ఫీడర్లకు అదనపు సామర్ధ్యం కల్పించి, అవసరమైన చోట కొత్తవి ఏర్పాటు చేయడం ద్వారా పగటిపూట నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు మార్గాన్ని సుగమం చేసింది.

రైతులకు ఉచిత విద్యుత్‌ కోసం పంపిణీ వ్యవస్థపై ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేసిన ప్రభుత్వం ఇదే. చంద్రబాబు ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌ సబ్సిడీ కింద చెల్లించాల్సిన రూ.12 వేల కోట్లు డిస్కంలకు ఎగ్గొట్టింది. దీంతో డిస్కంలు విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు చెల్లింపులు చేయలేక మొత్తం రైతులకు ఉచిత విద్యుత్‌ పథకాన్ని సంక్షోభంలో పడింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బకాయిలను చెల్లించడంతోపాటు, ఉచిత విద్యుత్‌ సబ్సిడీ కోసం రూ.46 వేల కోట్లు ఖర్చు చేసింది. దీంతో డిస్కంలు జెన్‌కోలకు సకాలంలో చెల్లింపులు చేస్తూ విద్యుత్‌ కొనుగోలు చేసి రైతులకు అందించగలుగుతున్నాయి.

కచ్చితంగా 9 గంటలు సరఫరా
రాష్ట్రంలో  ఇచ్చేదే  ఏడు  గంటలని, అందులోనూ సగటున 2 గంటలు కోతలేనని, లోడ్‌ రిలీఫ్‌ ఇతరత్రా పేరిట ఇష్టారాజ్యంగా నిలిపేస్తున్నారంటూ ఈనాడు రాసింది పూర్తిగా అవాస్తవం. రాష్ట్రంలో అన్ని రంగాలకు మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగానికి విద్యుత్‌ సరఫరాలో ఎటువంటి లోటు లేదు. వచ్చే వేసవి పూర్తయ్యేవరకు ఏ ఇబ్బందీ లేకుండా అందుబాటులో ఉన్న విద్యుత్‌ కేంద్రాలతో పాటు స్వల్పకాలిక  మార్కెట్‌ నుండి కొనుగోళ్లు ఖరారు చేసినట్లు డిస్కంలు తెలిపాయి. గ్రిడ్‌ నిర్వహణ నిమిత్తం ఎప్పుడైనా డిమాండ్‌కు సరిపడినంత విద్యుత్‌ అందుబాటులో లేనప్పుడు, గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ పరిమితికి మించి అదుపులో  లేనప్పుడు, పగటి పూట సౌర విద్యుత్‌ ఉత్పత్తి ఉన్న ప్రాంతాల్లో మేఘాలు కమ్మినప్పుడు మాత్రమే కొద్దిసేపు సరఫరా నియంత్రణ ఉంటుంది.

అలాగే దక్షిణాది విద్యుత్‌ గ్రిడ్‌లో సరఫరాకు  తీవ్ర కొరత  ఏర్పడినప్పుడు,  గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ తీవ్ర ఒడిదొడుకులకు లోనయినప్పుడు, దక్షిణ రీజియన్‌ లోడ్‌ డిస్పాచ్‌ – బెంగళూరు కేంద్ర విద్యుత్‌ గ్రిడ్‌ నుండి వచ్చే విద్యుత్‌ను రాష్ట్రాల వాటా ప్రకారం నియంత్రణ చేసే క్రమంలో ఒక్కోసారి కేంద్ర గ్రిడ్‌ కు అనుసంధానమైన అధిక కెపాసిటీ గ్రిడ్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ట్రిప్‌  చెయ్యడం ద్వారా పరిస్థితిని అదుపులోకి తెస్తుంటారు. అలాంటి సమయాల్లో కూడా కొన్ని చోట్ల విద్యుత్‌ సరఫరాకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడే  అవకాశం ఉంది. ఇది రాష్ట్ర లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ చేతుల్లో ఉండదు.

ఇలా చాలా అరుదుగా జరుగుతుందని డిస్కంలు తెలిపాయి. ఇలా ఎప్పుడైనా వ్యవసాయ రంగానికి విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే... మళ్లీ అదే రోజు వేరొక సమయంలో ఇచ్చి 9 గంటల సరఫరా  భర్తీ  చేస్తున్నట్లు డిస్కంలు వివరించాయి. ఏ సమస్యా లేకుండా రైతులకు ఉచిత విద్యత్‌ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ, ఈనాడు తప్పుడు రాతలు రాస్తోందని వివరించాయి. కేవలం ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలన్న దురుద్దేశంతోనే ఈనాడు అవాస్తక కథనాలు ప్రచురిస్తోందని తెలిపాయి. 

వ్యవసాయ విద్యుత్‌కు ఢోకా లేదు
సీఎం జగన్‌ సంకల్పంతో ఉచిత విద్యుత్‌ హామీకి అనుగుణంగా దీర్ఘకాలికంగా పగటి పూట వ్యవసాయ విద్యుత్‌ సరఫరా చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో డిస్కంలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ యూనిట్‌ కేవలం రూ.2.43 కే లభిస్తుంది. వచ్చే ఏడాది సెప్టెంబరు నుంచి 3 వేల మెగావాట్లు, 2025 సెప్టెంబరు నాటికి మరో 3 వేల మెగావాట్లు, ఆ మరుసటి ఏడాది వెయ్యి మెగావాట్లు అందుబాటులోకి వస్తుంది. గత ప్రభుత్వం పీపీఏల రూపంలో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచేలా నిర్ణయాలు తీసుకుంటేం.. ఈ ప్రభుత్వం రైతులకు మేలు చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంది.

సెకీతో జరిగిన ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంది. దాని ప్రకారం ఈ ఒప్పందం నిమిత్తం అయ్యే విద్యుత్‌ కొనుగోలు వ్యయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. రానున్న మూడు దశాబ్దాలపాటు ఎలాంటి అవాంతరాలు లేకుండా రైతులకు ఉచిత విద్యుత్‌ అందుతుంది. అలాగే గత ఆర్థిక సంవత్సరం (2022– 23)లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 1.25 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరు చేసింది.

2019–2023 మధ్య నాలుగున్నరేళ్లలో సుమారు 3.83 లక్షల వ్యవసాయ పంపు సెట్లు మంజూరు చేసింది. ఇదంతా రైతాంగం మేలు కోసమే. ఇటువంటివి ఒక్కటైనా చంద్రబాబు ప్రభుత్వంలో ఉంటే ఒట్టు. అసలు చంద్రబాబు హయాంలో జరిగిన విద్యుత్‌ ఒప్పందాలే ఓ అడ్డగోలు వ్యవహారం. విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు అత్యధిక ప్రయోజనం కలిగించడం కోసం ప్రజలపై మోయలేని భారం వేయడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం సంకోచించలేదు. అదే ఉద్దేశంతో అత్యధిక రేట్లు చెల్లించేలా ఒప్పందాలు చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement