2021లో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సెకీ’ లేఖ
ఇందుకు 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖే తిరుగులేని నిదర్శనం
అది కూడా అత్యంత చౌకగా యూనిట్ రూ.2.49కే అందిస్తామని ఆ లేఖలో వెల్లడి
పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో ఏపీ కృషికి అభినందన
రైతులకు పగటి పూట సౌర విద్యుత్‌ను అందించాలనే వినూత్న నిర్ణయం నచ్చిందని వెల్లడి
అంతర్రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలకు కూడా 25 ఏళ్లు మినహాయింపు ఇస్తామని స్పష్టీకరణ
సెకీనే ప్రతిపాదించిన ఈ వ్యవహారంలో స్కామేమిటి? ముడుపులేమిటి?
‘‘చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అత్యధిక ధరలకు ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్నారు. అప్పటికి మార్కెట్‌లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ చార్జీలతో కలిపి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేశారు. ఒకపక్క మిగులు విద్యుత్ ఉన్నప్పటికీ చంద్రబాబు దాన్ని వృథా చేసి మరీ ఇంత ఎక్కువ ధరకు పీపీఏలు చేసుకోవడంలో ఆంతర్యమేమిటి? అది కదా అసలు సిసలైన కుంభకోణం..! దీన్ని ప్రశ్నించే సాహసం ఈనాడు ఏనాడైనా చేసిందా?’’
‘‘అసలు అదానీతో ఒప్పందం చేసుకోవాలనిగానీ, భారీగా లంచాలు పొందాలనిగానీ అప్పటి ప్రభుత్వం అనుకుంటే సంస్థలతోనే నేరుగా చేసుకునేవారు గానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఎందుకు చేసుకుంటారు? ముడుపులే కావాలనుకుంటే చంద్రబాబులా ప్రైవేట్ సంస్థలతోనే ఒప్పందం కుదుర్చుకునేవారు కదా? ఇంత చిన్న లాజిక్ కూడా తెలియదా?’’
రాష్ట్ర ప్రభుత్వం అప్పటికే టెండర్లు పిలిచినా వాటిపై చట్టపరంగా సమస్యలు వచ్చాయి. ఆ తరుణంలో కేంద్రం తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని లేఖ రాసింది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌పై ముందుచూపు, రైతులకు 25 ఏళ్ల పాటు మంచి చేయాలనే జగన్ సర్కారు సంకల్పాన్ని అభినందిస్తూ నాడు సెకీ లేఖ రాసింది. డిస్కమ్‌లపై ఆర్థిక భారం పడకుండా, రైతుల జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు ఇది దోహదం చేస్తుందని పేర్కొంది.
అదే సెకీ విద్యుత్ తీసుకోకపోతే అప్పటికే పిలిచిన టెండర్ల కేసు కోర్టులో ఎప్పటికి తేలుతుందో తెలియదు. అది తేలే నాటికి పరికరాల రేట్లు, విద్యుత్ ధరలు ఎంతగానో పెరిగేవి. అప్పుడు ఇదే ఈనాడు, ఇతర ఎల్లో మీడియా తక్కువకు ఇస్తామన్నా సెకీ విద్యుత్‌ను ఎందుకు తీసుకోలేదని బురద చల్లేవి కాదా?
సాక్షి, అమరావతి: పునరుత్పాదక ఇంధన వనరులను వినియోగించుకోవడంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవలంభిస్తున్న వినూత్న విధానాలు, చూపిస్తున్న చొరవకు స్పందిస్తూ తామే పాతికేళ్లపాటు రాష్ట్రానికి చవగ్గా సౌర విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) తనకు తానే ముందుగా ప్రతిపాదించింది. అందుకు 2021 సెపె్టంబర్ 15న సెకీ రాసిన లేఖే తిరుగులేని ఆధారం. వేరే ప్రయత్నాలు అవసరం లేదని, అతి తక్కువ ధరకు యూనిట్ రూ.2.49కి తామే అందిస్తామంటూ సెకీనే ఆరోజు రాష్ట్రానికి లేఖ రాసింది.
రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన పునరుత్పాదక విద్యుత్‌ను.. అదీ డిస్కంలపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అందించాలనే జగన్ వినూత్న ఆలోచనను కేంద్ర సంస్థ ఆ లేఖలో కొనియాడింది. సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ టెండర్లు పిలిచిందనే విషయం తమకు తెలిసిందని, అయితే తామే చౌక ధరకు సోలార్ విద్యుత్‌ను 25 ఏళ్ల పాటు సరఫరా చేస్తామని ఆ లేఖలో తెలిపింది.
2024 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2025 సెపె్టంబర్‌లో 3 వేల మెగావాట్లు, 2026 సెప్టెంబర్‌లో 3 వేల మెగావాట్లు చొప్పున మొత్తం 9 వేల మెగావాట్లు ఇస్తామని వివరించింది. 25 సంవత్సరాల పాటు ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ (ఐఎస్‌టీఎస్) చార్జీల నుంచి రాష్ట్రానికి మినహాయింపు కూడా ఇస్తామని చెప్పింది. తామిచ్చే టారిఫ్ యూనిట్ రూ.2.49 వల్ల వ్యవసాయ విద్యుత్‌కు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ భారం కూడా తగ్గుతుందని పేర్కొంది.
అదే విధంగా 9 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏపీలో ప్రాజెక్టు నిర్మిస్తే అయ్యే ఖర్చులు, భూమి కూడా మిగులుతాయని, వాటిని రాష్ట్రం ఇతర అభివృద్ధి, ప్రాజెక్టుల అవసరాలకు వినియోగించుకోవచ్చని వివరించింది. డిస్కంలకు కూడా విద్యుత్ కొనుగోలు ఖర్చులు తగ్గుతాయని వెల్లడించింది. తమ ప్రతిపాదనకు అంగీకరించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆత్మ నిర్భర్ భారత్’కు ఏపీ మద్దతు ఇచ్చినట్టవుతుందని కూడా చెప్పింది.
వెంటనే సానుకూల నిర్ణయాన్ని తెలపాలని రాష్ట్రాన్ని కోరింది. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీనే స్వయంగా విద్యుత్ ఇస్తామంటూ ముందుకు వచ్చిన ఈ వ్యవహారంలో స్కామ్‌కు ఆస్కారమే ఉండదన్నది స్పష్టం. ఇందులో ముడుపుల అన్న ప్రశ్నే ఉత్పన్నం కాదన్న విషయం ఎవరికైనా ఇట్టే అవగతమవుతుంది.
కేంద్రం ఇంతగా చెప్పాక ఎవరైనా కాదంటారా..!
చంద్రబాబు కుదుర్చుకున్న దీర్ఘకాలిక పీపీఏల వల్ల డిస్కమ్‌లపై తీవ్ర ఆర్ధిక భారం పడింది. దీనివల్ల ప్రభుత్వంపై రాయితీ భారం కూడా పెరిగింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్రంలో సోలార్ పార్క్‌లను అభివృద్ధి చేయాలని 2020లో గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ క్రమంలో 2020 నవంబర్‌లో 6,400 మెవాగాట్ల సామర్థ్యంతో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ జీఈసీఎల్) టెండర్లు పిలిచింది.
చదవండి: నిజాలకు పాతరేసి.. నిస్సిగ్గుగా నిందలా!
యూనిట్ రూ.2.49 నుంచి రూ.2.58 చొప్పున సరఫరా చేసేందుకు ముందుకొస్తూ 24 బిడ్లు దాఖలు అయ్యాయి. అయితే న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమవడం వల్ల ఆ టెండర్ ప్రక్రియ రద్దయింది. అదే సమయంలో అతి చౌకగా విద్యుత్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వమే ఇంత స్పష్టంగా చెప్పాక ఏ రాష్ట్రమైనా ఎందుకు వద్దంటుంది? పైగా, ఈ విద్యుత్ తీసుకొంటే ఆరి్థకంగా, ఇతరత్రా పలు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇంత మంచి అవకాశాన్ని ఏ రాష్ట్రమూ వదులుకోదు. ఒక వేళ వద్దంటే ప్రతిపక్షాలు ఊరుకుంటాయా?
తక్కువకు ఇస్తామని కేంద్రమే ముందుకు వస్తే ఎందుకు తీసుకోవడంలేదని, దాని వెనుక రాష్ట్ర ప్రయోజనాలకంటే వేరే కారణాలున్నాయంటూ గోల పెట్టేవి. ఇదే ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తప్పు బడుతూ కథనాలు రాసేది. అలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటనే కేంద్ర ప్రతిపాదనను మంత్రి మండలి సమావేశంలో ప్రవేశపెట్టారు. మంత్రులంతా ఏకగ్రీవంగా సెకీ ఒప్పందానికి అంగీకారం తెలిపారు.
చదవండి: చంద్రబాబుకు ఆ ఒప్పందాలను రద్దు చేసే దమ్ముందా?
అనంతరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ ప్రకారం సెకీతో ఒప్పందాలకు కేంద్ర, రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండళ్ల ఆమోదం కూడా లభించింది. ఈ ఒప్పందాల్లో ఎక్కడా అదానీ గ్రూపునకు చెందిన సంస్థలతోగానీ అనుబంధ కంపెనీలతోగానీ ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఇక అవినీతి ఎక్కడుంది? అసలు లంచాలకు ఆస్కారం ఏముంది?
Comments
Please login to add a commentAdd a comment