సెకీకి, అదానీకి మధ్య జరిగిన వ్యవహారాన్ని జగన్‌పై నెట్టేస్తున్నారు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు (బారకాసు): ప్రజల ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వ్యవసాయానికి 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో చేసుకున్న ఒప్పందం కేంద్ర ప్రభుత్వం సహా అందరి ప్రశంసలందుకుందని, ఇది చూసి ఓర్వలేకే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ జగన్ శ్రీకారం చుట్టిన గొప్ప ప్రాజెక్టు ఇది అని చెప్పారు. ఆయన సోమవారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అత్యంత చౌకగా సోలార్ విద్యుత్ సెకీ స్వయంగా ముందుకొచ్చి రాష్ట్రానికి లేఖ రాసిందన్నారు.
ఈ వాస్తవాన్ని దాచిపెట్టి అదానీతో వైఎస్ జగన్ రహస్య ఒప్పందం అంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సెకీకి, అదానికి మధ్య జరిగిన వ్యవహారాన్ని జగన్‌పై నెట్టేస్తున్నారని అన్నారు. అప్పట్లో కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌ను జైల్లో పెట్టించారని, మళ్లీ ఇప్పుడు అవే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 2014–19 మధ్య యూనిట్ రూ.6.90 చంద్రబాబు కొన్నారని, కానీ వైఎస్ జగన్ రూ.2.49కే సెకీతో ఒప్పందం చేసుకున్నారని వివరించారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థను నాశనం చేసింది చంద్రబాబేనని చెప్పారు. బాబు హయాంలో రూ.8,848 కోట్లు బకాయిలు పెట్టి విద్యుత్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేశారన్నారు. ఈనాడు వార్తలన్నీ టీడీపీ ఆఫీసు నుంచే వస్తున్నట్టున్నాయని చెప్పారు. వైఎస్ జగన్ వల్లే మంత్రి అయిన బాలినేని నేడు చంద్రబాబు, పవన్ మెప్పు కోసం అబద్ధాలాడుతున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment