అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే ఇక్కడ వైఎస్ జగన్‌పై విషప్రచారమా?
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘సెకీ’తో గత ప్రభుత్వం ఒప్పందం.. అదానీతో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం?
ఆ ఒప్పందంలో ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం
పైగా సెకీ తనకు తానుగా యూనిట్ రూ.2.49కే సరఫరా చేస్తామని లేఖ రాస్తూ ముందుకొచ్చింది
సెకీ ధరతో ఏటా రూ.3,750 కోట్లు ఆదా
సెకీతో ఒప్పందం వల్ల ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ చార్జీల నుంచి మినహాయింపు
గతంలో ఏ ప్రభుత్వం, ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా.. ఇంత కారుచౌకగా 7 వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం జరిగిందా?
యూనిట్‌కు 2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్ సరఫరా చేస్తామంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా?
ఈ ఒప్పందం కేంద్రం–రాష్ట్రం మధ్య జరిగితే లంచాలకు అవకాశముంటుందా?
కేంద్రం ఎక్కడైనా రాష్ట్రాలకు లంచం ఇస్తుందా?
ఈ ప్రక్రియలో లంచాలిచ్చేందుకు ఆస్కారం ఏముంది?
అసలు అధిక ధరలకు పీపీఏలు చేసి అడ్డగోలు స్కామ్‌లకు పాల్పడిందే చంద్రబాబు
యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసింది ఈ పెద్దమనిషే
దీర్ఘకాలిక ఒప్పందాలతో రూ.35 వేల కోట్ల భారం బాబు నిర్వాకం కాదా?
రెట్టింపు ధరలతో జరిగిన ఆ ఒప్పందాలు ముడుపుల కోసం కాక మరెందుకంటున్న విద్యుత్తు రంగ నిపుణులు
డిస్కమ్‌లకు 2019–24 మధ్య జగన్ అందించిన సబ్సిడీ మొత్తం రూ.47,800.92 కోట్లు
రైతులకు బాబు ఎగ్గొట్టిన రూ.8,845 కోట్ల ఉచిత విద్యుత్తు బకాయిలను చెల్లించిందీ గత ప్రభుత్వమే
‘‘రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలో, ఏ సీఎం హయాంలోనూ జరగలేదు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా?’’
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలోనే ఇంత కారుచౌకగా సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం.. అది కూడా అత్యధికంగా 7 వేల మెగావాట్ల కొనుగోలు కోసం ఒప్పందం గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వంలోనూ జరగలేదు. ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ జరిగిన దాఖలాలు లేవు. డిస్కమ్‌లు కూడా ఇలాంటి ఒప్పందాన్ని ఎన్నడూ కుదుర్చుకోలేదు. అందులోనూ కేంద్రమే స్వయంగా లేఖ రాసి మరీ యూనిట్ రూ.2.49 చొప్పున 25 ఏళ్లపాటు నిరాటంకంగా విద్యుత్తు సరఫరా చేస్తామని ముందుకొస్తే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కాదంటుందా? రైతులకు ఉచిత విద్యుత్తుపై గత సర్కారు దూరదృష్టి, సోలార్‌పై మన విధానాలను అభినందిస్తూ స్వయంగా సెకీ నాడు లేఖ రాసింది.
సరఫరా చార్జీల భారం లేకుండా అత్యంత చౌకగా కరెంట్ అందిస్తామని సంసిద్ధత తెలిపింది. ఎవరు మాత్రం దీన్ని కాదంటారు? అంతేకాకుండా అప్పటికి యూనిట్ రూ.5.10 చొప్పున కొంటున్నారు. సెకీ విద్యుత్ తీసుకోకపోతే ఏటా రూ.3,750 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ తీసుకోకుంటే ఎల్లో మీడియా ఎంత దుష్ప్రచారం చేసేది? అసలు ఈ ఒప్పందం ఓ రాష్ట్ర ప్రభుత్వం – కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగింది. అలాంటప్పుడు లంచాలెలా వస్తాయి? కేంద్రం ఎక్కడైనా రాష్ట్రానికి లంచం ఇస్తుందా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే కేంద్రం రాసిన లేఖకు ఎందుకు స్పందిస్తారు? అలాంటి ఉద్దేశం ఉంటే నేరుగా అదానీతోనే ఒప్పందం చేసుకోవాలి కదా?
కేంద్రంతో ఒప్పందం చేసుకున్నప్పుడు ఇందులో మూడో వ్యక్తి అనే ప్రస్తావన ఎందుకు ఉంటుంది? అదానీతో దీనికి ఏం సంబంధం? ఇక సెకీ రాసిన లేఖకు కేంద్ర విద్యుత్తు నియంత్రణ మండలి, రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి సైతం ఆమోదం తెలిపాయి. ఇవి రెండూ కేంద్ర సంస్థలే. ఆ ఒప్పందంలో ఎలాంటి తప్పు లేదు కాబట్టే అనుమతిచ్చాయి. ఇంత గగ్గోలు పెడుతున్న ఎల్లో మీడియా చంద్రబాబు అత్యధిక ధరలతో విద్యుత్తు కొనుగోళ్ల ఒప్పందాలు (పీపీఏలు) చేసుకుంటే ఏనాడైనా కనీసం ఒక్క కథనమైనా రాసిందా?
అమెరికాలో అదానీ సంస్థపై అభియోగాలు నమోదైతే దాన్ని జగన్‌కు ముడిపెట్టి విషప్రచారం చేస్తూ.. టీడీపీ అనుబంధ పత్రిక ఈనాడు పుంఖాను పుంఖాలుగా అసత్యాలను వండి వార్చింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికున్న అశేష జనాదరణను తగ్గించకపోతే చంద్రబాబుకు మళ్లీ వానప్రస్థం తప్పదని బెంబేలెత్తుతున్న ఈనాడు ఎక్కడో అమెరికాలో నమోదైన కేసులో జగన్ పేరు లేకపోయినా ఉందంటూ పచ్చి అబద్ధాన్ని అచ్చేసింది.
వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థ..
సెకీ ‘ట్రిపుల్ ఏ’ రేటింగ్ కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఆ సంస్థ నుంచి నేరుగా 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ తీసుకునేలా ఒప్పందం చేసుకుంటేనే ఇన్ని నిందలేస్తున్న ఈనాడు ఇక చంద్రబాబులా ఏ ప్రైవేట్ కంపెనీలతోనో డీల్ కుదుర్చుకుంటే ఇంకెంత శివాలెత్తిపోయేదో! గత ప్రభుత్వం ఇలాంటి వాటికి ఎక్కడా ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంది. నేరుగా సెకీతో ఒప్పందం చేసుకుంది.
దీంతో బురద జల్లడానికి రంధ్రాన్వేషణ మొదలెట్టిన ఈనాడు... గత ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంటే అది అదానీతో కుదుర్చుకున్నట్లు, అందుకోసమే ఆ కంపెనీ జగన్‌కు లంచాలిచ్చినట్లు దిగజారుడు రాతలకు తెగబడింది. ఇంతకన్నా దివాలాకోరుతనం ఇంకేమైనా ఉంటుందా? దాదాపు 18 లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్తు అందటమే మహాపరాధంగా పరిగణిస్తూ.. దానికి అహర్నిశం పాటుపడిన జగన్‌పై బురద జల్లుతున్న ఎల్లో మీడియా విషపూరిత కథనాలను ఏమనుకోవాలి? తప్పయితే ‘సీఈఆర్‌సీ, ఏపీఈఆర్‌సీ’ ఎందుకు అనుమతిస్తాయి?
2003 విద్యుత్ చట్టం ప్రకారం సెకీతో ఒప్పందాలకు ఏపీఈఆర్‌సీ అనుమతినిచ్చింది. దీంతో సెకీ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే విద్యుత్ కొనుగోలు మొదలు కావాల్సి ఉంది. అన్నీ పరిశీలించాక కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా దీన్ని ఆమోదించింది. సెకీ విద్యుత్‌కు అంతర్ రాష్ట్ర విద్యుత్ సరఫరా చార్జీలు ఉండవని ఈ ఏడాది ఆగస్టు 13న ఏపీఈఆర్‌సీ కూడా స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ అంతకు ముందే అంటే 2021 జనవరి 15నే వెల్లడించింది. మరి ఇప్పుడు కేంద్రం, రాష్ట్రాల్లో అత్యున్నత న్యాయ సంస్థలు అనుమతించిన ఒప్పందం తప్పంటారా? ఏదైనా అవినీతి జరిగి ఉంటే అక్కడే తేలిపోయేది కదా?
చదవండి: సౌర విద్యుత్ ఇస్తామని చెప్పింది సెకీనే
ఏటా రూ.3,750 కోట్లు ఆదా అవుతుంటే నష్టమంటారా? ప్రస్తుతం రాష్ట్రం కొనుగోలు చేస్తున్న విద్యుత్ యూనిట్‌కు సగటున రూ.5.10 చొప్పున అవుతోంది. సెకీ విద్యుత్ మాత్రం యూనిట్ రూ.2.49కే వస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి ఎన్‌టీపీసీ ఇస్తున్న సౌర విద్యుత్ ధర కూడా ట్రేడింగ్ మార్జిన్ కలిపి యూనిట్‌కు రూ.2.79 అవుతోంది. ఎలా చూసినా సెకీ విద్యుత్ తక్కువకే వస్తోంది. ఈ లెక్కన ఏటా దాదాపు రూ.3,750 కోట్ల మేరకు ఆదా అవుతోంది. కానీ ఈనాడు మాత్రం పాతికేళ్లలో రూ.1.10 లక్షల కోట్లు నష్టమంటూ నోటికొచ్చిన లెక్కలు రాసుకొచ్చింది. ఆ తప్పుడు లెక్కల వెనుక అసలు ఆంతర్యాన్ని ప్రజలు గ్రహించలేరనుకుంటోంది.
ప్రయోజనాలు ఎక్కువ గనుకే ఒప్పందం..
సెకీ నుంచి విద్యుత్ తీసుకోవడం వల్ల పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ట్రాన్స్‌మిషన్ చార్జీల నుంచి కేంద్రం మినహాయింపు ఇస్తుంది. అదే రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే పాతికేళ్లు సెంట్రల్ గ్రిడ్ చార్జీలను చెల్లించాలి. రాష్ట్రంలో అంతర్గతంగా సౌర ప్రాజెక్టులను నెలకొల్పితే వాటికి కావాల్సిన విద్యుత్ లైన్లు, అంతర్గతంగా విద్యుత్ ప్రసార వ్యవస్థను బలోపేతం చేయటం తప్పనిసరి.
రాష్ట్రంలో ఉన్న విద్యుత్ ప్రసార వ్యవస్థలపై దీనికోసం పెట్టాల్సిన ఖర్చును బేరీజు వేసుకుంటే బయటి రాష్ట్రాల నుంచి సౌర విద్యుత్ తీసుకున్నప్పుడే తక్కువ వ్యయం అవుతోంది. అందుకే తొలుత రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్రాజెక్టు పెట్టాలనుకున్నప్పటికీ పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత సెకీ ప్రతిపాదనకు గత మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
సెకీ ధర కన్నా ఇతర రాష్ట్రాల్లో తక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయంటూ ఈనాడు రాసుకొచ్చింది. రాజస్థాన్‌లో ఉర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ ద్వారా ఇస్తున్న విద్యుత్ యూనిట్ రూ.2.01. కానీ అక్కడ ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్‌ఎఫ్) 23.5 శాతం. ఏపీలో ఇది 17.5 శాతమే. మరి ధరలో మార్పులుండవా?
యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది
టీడీపీ హయాంలో మార్కెట్‌లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.44కే లభిస్తున్నా (బ్యాక్‌డౌన్ ఛార్జీలతో కలిసి రూ.3.54) ఏకంగా యూనిట్ రూ.6.99 చొప్పున కొనుగోలు చేసిన చరిత్ర చంద్రబాబుది! అయినా సరే ఈనాడుకు అది ఏనాడూ కనపడకపోవడం విచిత్రం! ఇక పవన విద్యుత్తుకైతే యూనిట్‌కు రూ.4.84 వరకు అదనంగా పెట్టి నామినేషన్ పద్ధతిలో పీపీఏలు చేసుకున్నారు. పోటీ బిడ్డింగ్ లేనేలేదు. 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగింది.
ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 17,731 మెగావాట్ల విద్యుదుత్పత్తి స్థాపిత సామర్ధ్యం ఉంది. అందులో 12,190 మెగావాట్లు థర్మల్, 275.78 మెగావాట్లు ఇతర విద్యుత్ కాగా మిగిలింది పునరుత్పాదక విద్యుత్. 2014 జూన్‌లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి మొత్తం గరిష్ట డిమాండ్ 13,404 మెగావాట్లు మాత్రమే. అయినా సరే టీడీపీ ప్రభుత్వం నాడు హడావుడిగా 8 వేల మెగావాట్ల పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ)లను అధిక ధరలకు కుదుర్చుకుంది. ‘ఈనాడు’కు ఇదంతా దోచిపెట్టినట్లుగా కనిపించకపోవటం చిత్రమే!
చంద్రబాబు స్వప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా విద్యుత్ పంపిణీ సంస్థలపై ఏటా రూ.3,500 కోట్ల భారం పడుతోంది. అది కూడా దశాబ్దాల పాటు భరించాలి. ప్రస్తుత విలువ ప్రకారం డిస్కంలు రూ.35 వేల కోట్లకు పైనే చెల్లించాలి. రాష్ట్ర విద్యుత్ సంస్థలపై ప్రత్యక్షంగా, ప్రజలపై పరోక్షంగా ఇంత పెద్ద భారాన్ని మోపడానికి చంద్రబాబు సిద్ధపడ్డారంటే దాన్ని మించిన కుంభకోణం ఇంకేముంటుంది?
Comments
Please login to add a commentAdd a comment