
సెకీ ఒప్పందంపై గతంలో మీడియాకు వివరణ ఇచ్చిన వైఎస్ జగన్
అడ్డగోలు వాదనలు చేయడంలో కొంతమంది రాజకీయ నేతలు సిద్దహస్తులుగా ఉంటారు. వారిలో మొదటి పేరు ఎవరిదైనా చెప్పవలసి వస్తే అది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదే అవుతుంది. అలాగే అడ్డగోలు చెత్త కథనాలు ప్రచారం చేయడంలో ఈనాడు, ఆధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియాకు మొదటి ర్యాంకు ఇవ్వవలసిందే. ఈ విషయం పలుమార్లు రుజువు అవుతూనే ఉంది. తాజాగా సోలార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సెకీ ) నుంచి ఏపీకి విద్యుత్ కొనుగోలు చేయడానికి గత జగన్ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై విషం చిమ్మడానికి టీడీపీతో పాటు, ఎల్లో మీడియా పోటీ పడ్డాయి.
సాధారణంగా.. నిజం నిలకడమీద తెలుస్తుందంటారు. కాకపోతే వాస్తవం బయటపడే లోపు అబద్దాలు లోకం అంతా చుట్టేస్తుంటాయి. సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి జగన్ తీరని నష్టం చేశారని ఎల్లో మీడియా అసత్యాన్ని ఒకటికి పదిసార్లు ప్రచారం చేసింది. లక్ష కోట్ల భారం ఏపీపై జగన్ వల్ల పడిందని కూడా ఆ మీడియా సంస్థలు ఆరోపించాయి. వాస్తవం ఏమిటంటే జగన్ చేసుకున్న ఒప్పందం వల్ల లక్షా పదివేల కోట్ల రూపాయల మేర ఏపీ ప్రజలకు ఆదా అయింది. ఒకరకంగా చెప్పాలంటే జగన్ వల్ల ఏపీకి లక్ష కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లన్నమాట.
👉సెకీ(SECI)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్ 2.49 రూపాయలకు ఏపీకి సరఫరా అవుతుంది. ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడూ ఒప్పందం జరగలేదు. అయినా అది చాలా ఎక్కువ ధర అని, దీనికి ట్రాన్సిమిషన్ చార్జీలు అదనంగా చెల్లించాలంటూ ఇష్టం వచ్చినట్లు ఆ మీడియా ప్రచారం చేయడం, దానిని చంద్రబాబు తలకు ఎత్తుకుని విమర్శలు చేయడం.. కొద్ది నెలల క్రితం నిత్యకృత్యంగా సాగింది. రాష్ట్రం ఏమైపోయినా ఫర్వాలేదు..పెట్టుబడులపై ప్రభావం చూపినా ఫర్వాలేదన్నట్లుగా జగన్ పై దుష్ప్రచారం చేశాయి.అర్ధరాత్రి టైమ్ లో ఫైల్ పై సంతకం పెట్టించారని జనసేనలోకి వెళ్లిన మాజీ విద్యుత్ శాఖ మంత్రితో చెప్పించారు. అయినా జగన్ చేసింది రాష్ట్రానికి మంచి అని ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వమే ఒప్పుకోక తప్పలేదు.

👉తాము ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు(Super Six Promises), ఎన్నికల ప్రణాళిక వాగ్దానాలనుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి అదాని,జగన్ మద్య లింక్ అని, అదాని నుంచి జగన్ లంచం తీసుకున్నారని, అమెరికాలో కేసు అయిందని విపరీతంగా పబ్లిసిటీ చేశారు. ఏపీ ప్రభుత్వంతో నేరుగా అదానీ ఒప్పందమే జరగనప్పుడు లంచాల ప్రస్తావన ఎలా వస్తుందని వైఎస్సార్‌సీపీ వారు చెప్పినా.. తమ దుర్మార్గపు మీడియాతో పదే పదే ప్రచారం చేయించారు. సరే.. వారు చెబుతున్నారు కదా! సెకీతో ఒప్పందం వల్ల ఏపీకి లక్ష కోట్ల భారం పడుతుందని అంటున్నారు కదా! దానిని రద్దు చేసుకోండని ఎవరైనా సవాల్ చేస్తే మాత్రం దానికి జవాబు చెప్పేవారు కారు.
వైఎస్ జగన్‌పై ఈ విద్యుత్ ఒప్పందంపై ఏసీబీతో విచారణ చేయిస్తున్నామని కూడా బిల్డప్ ఇచ్చారు. అవన్నీ ఉత్తిత్తివేనని అందరికి తెలుస్తూనే ఉంది. కాకపోతే జగన్ పై ప్రజలలో ఒక అపనమ్మకం కలిగించడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు నానా చెత్త అంతా ప్రచారం చేసేవి. దానికి అనుగుణంగా చంద్రబాబు మాట్లాడడమో,లీక్ ఇవ్వడమో చేస్తుండేవారు. విశేషం ఏమిటంటే దేశం బీజెపీయేతర రాజకీయ పక్షాలు అదానీపై, ప్రధాని మోదీపైన విమర్శలు చేస్తుంటే, చంద్రబాబు మాత్రం వారిని పల్లెత్తి అనకుండా, జగన్ పై మాత్రం ఆరోపణలు గుప్పిస్తుండేవారు. ఇలా ఉంటుంది చంద్రబాబు రాజకీయం.
ఇప్పుడు ఏపీలో విద్యుత్ నియంత్రణ మండలి(AP ERC) సెకీ ఒప్పందం సక్రమమని, దానివల్ల ఎపికి మేలు జరుగుతుందని, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి కూడా ఈ ఒప్పందానికి ఆమోదం తెలిపిందని స్పష్టం చేసింది. ఏపీఈఆర్సి లో చైర్మన్ ను చంద్రబాబు ప్రభుత్వమే నియమిస్తుంది. అంటే ప్రభుత్వ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ మండలి సాధారణంగా నిర్ణయాలు తీసుకోదు. మండలి ఒప్పుకున్నా.. కోకున్నా చంద్రబాబు ప్రభుత్వం తాము సెకీతో ఒప్పదం ప్రకారం విద్యుత్ సరఫరా చేసుకోబోమని కూడా చెప్పి ఉండవచ్చు. ఆ పని చేయలేదు. అంటే చంద్రబాబు అండ్ కో(Chandrababu & Co) ఎప్పటిమాదిరే డబుల్ గేమ్ ఆడారన్నమాట.
👉జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వచ్చే ప్రయోజనం వారు పొందాలి. అదే టైమ్ లో జగన్ ను బదనాం చేయాలి..ఇది వారి వ్యూహం. అదానీ వివాదం చెలరేగినప్పుడు చాలా స్పష్టంగా ఏ విచారణకు అయినా సిద్దం అని జగన్ చాలెంజ్ చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.4.50 నుంచి రూ.6 వరకు కొనుగోలు చేయడానికి చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తే.. దానిని టీడీపీ, ఎల్లో మీడియా వ్యతిరేకించి పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ప్రచారం చేశాయి. అదే జగన్ రూ.2.49 ఒప్పందం అయితే మాత్రం ఏదో ఘోరం జరిగినట్లు అబద్దాలు సృష్టించారు. ఇప్పుడు ఏపీఈఆర్సీ నిర్ణయంతో చంద్రబాబుకాని, ఎల్లో మీడియాకాని ఎంత తప్పుడు ప్రచారం చేసింది జనానికి పూర్తిగా అర్దం అవుతుంది.

👉ఈనాడు మీడియాలో వచ్చిన హెడింగ్‌లు చూస్తే.. జర్నలిజం ఇంత నీచంగా మారిందా? అనే బాధ కలుగుతుంది. అదానీ కేసులో జగన్ పేరు లేకపోయినా, పనికట్టుకుని ఒకటికి రెండుసార్లు ఆయన పేరు రాసేవారు. నేరుగా అదానీ నుంచి జగన్‌కు రూ. 1,750 కోట్ల లంచం అందిందని అచ్చేశారు. ఇప్పుడు అదే ఒప్పందాన్ని చంద్రబాబు కొనసాగిస్తున్నందున ఆయనకు రూ.2,750 కోట్ల ముడుపులు ముట్టాయా? అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది.
👉అబద్దాల ఆంధ్రజ్యోతి ఇప్పటికీ ఏదో రూపంలో వైఎస్సార్‌సీపీ బురదచల్లడానికి నిస్సిగ్గుగా యత్నిస్తోంది.
ఈనాడు పెట్టిన కొన్ని శీర్షికలు చూడండి..
⇒నిబంధనలు ఉల్లంఘించి అదానీకి అనుమతిచ్చేశారు
అసలు అదానీతో ఒప్పందమే లేదని ఈఆర్సీ నివేదిక ప్రకారం కూడా తెలుసుకోవచ్చు.
జగన్ ఈ అంశంపై తన వాదన తెలిపితే..
⇒అవినీతి ఒప్పందానికి అడ్డగోలు సమర్ధనా? అని ఈనాడు విషం కక్కింది.

ఇప్పుడు ఈనాడు ఎవరి నుంచి ముడుపులు తీసుకుని ఇలాంటి అవినీతి కధనాలు రాసిందో అని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది.
'రాష్ట్రానికి నష్టం..రాజస్తాన్ కు లాభం" అంటూ మరో వార్త ఇచ్చారు. రాజస్తాన్ కు ఇందులో ప్రత్యేకంగా వచ్చే లాభం ఏమి ఉండదు. అదానీ లేదంటే ఇతర పారిశ్రామికవేత్తలు ఆయా చోట్ల నెలకొప్పిన సౌర విద్యుత్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ విద్యుత్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తుంది. పైగా అక్కడ నుంచి ఏపీకి ట్రాన్సిమిషన్ చార్జీలు ఉండవని కేంద్రం స్పష్టం చేసినా.. జగన్ పై బురదచల్లుడు కధనాలు ఇచ్చి తన కుసంస్కారాన్ని ప్రదర్శించుకుంది.
అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ చంద్రబాబు ,ఈనాడు,ఆంధ్రజ్యోతి దారుణాతిదారుణంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకున్నది చంద్రబాబు, ఎల్లో మీడియా కాదా?. అదానీ స్కామ్ నిజంగా జరిగి ఉంటే.. అందులో చంద్రబాబు, ఎల్లో మీడియాకు వాటా ఉన్నట్లు అనుకోవాల్సిందేగా!
ఏది ఏమైనా ద్వేషంతో జర్నలిజం ప్రాధమిక సూత్రాలను విస్మరించి ఈనాడు చేస్తున్నది పచ్చి పాపం అని చెప్పాలి. అందుకే జగన్ ఈ మీడియాపై పరువు నష్టం దావా వేశారు.అది ఎప్పటికి తేలుతుందో కాని,కచ్చితంగా న్యాయం నిలబడి వారికి శిక్షపడడానికి ఇప్పుడు ఈఆర్సీ చేసిన నిర్ణయం ఒకటే సరిపోవచ్చు.

:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment