ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రుల సమ్మెతో పేదల పరిస్థితి దయనీయం
గాలిలో దీపంలా గుండె జబ్బు బాధితుల ప్రాణాలు
ఆస్పత్రుల్లో బైపాస్ సర్జరీలు చేయక పోవడంతో మందులతో నెట్టుకొస్తున్న వైనం
నేడు విజయవాడలో నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానుల ధర్నా
రూ.250 కోట్లు ఇస్తామంటూ ప్రభుత్వం బేరసారాలు
రూ.3,000 కోట్ల బకాయిలుంటే ఆస్పత్రులు ఎలా నడపాలి..
బిల్లులన్నీ క్లియర్ చేయాల్సిందే అంటున్న యాజమాన్యాలు
ధర్నాకు రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వస్తున్న యజమానులు, వైద్యులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది నిరుపేదల గుండె ఘోష చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టడం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి చికిత్సలు అందక గుండె, కిడ్నీ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల పరిస్థితి దిన దిన గండంగా మారింది. ఆస్పత్రుల్లో ఉచిత చికిత్సలు అందక, చేతి నుంచి డబ్బు కట్టి వైద్యం చేయించుకునే స్తోమత లేక బాధితులు మందులతో కాలం వెళ్లదీస్తున్నారు. రూ.3 వేల కోట్లకు పైగా బిల్లులను ప్రభుత్వం బకాయి పెట్టడంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు ఈ నెల 10వ తేదీ నుంచి సేవలు పూర్తి స్థాయిలో నిలిపేసిన విషయం తెలిసిందే.
గుండె జబ్బు బాధితులకు బైపాస్ సర్జరీలు, స్టెంట్‌లు, కిడ్నీ బాధితులకు డయాలసిస్, క్యాన్సర్ రోగులకు కీమో, రేడియేషన్ థెరపీలు నిలిపేశారు. డబ్బు కడితేనే వైద్యం చేస్తాం.. లేదంటే ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిపోండని తరిమేస్తున్నారు. ఈ క్రమంలో నిరుపేద, మధ్యతరగతి ప్రజల పరిస్థితి కడు దయనీయంగా మారింది. ఇక ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమైన ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ (ఆశ) గురువారం విజయవాడలో ధర్నా చేపట్టనుంది. ఈ ధర్నాకు రాష్ట్ర వ్యాప్తంగా నెట్‌వర్క్ ఆస్పత్రుల యజమానులు, వైద్యులు, ఇతర సిబ్బంది హాజరుకానున్నారు. ఏపీ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్, ఐఎంఏ, ఏపీ జూడా, ప్రభుత్వ వైద్యుల సంఘాలు సైతం ఆశ ధర్నాకు సంఘీభావం ప్రకటించినట్టు తెలిసింది.
బేరసారాలతో మభ్యపెట్టే యత్నం!
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టినప్పటి నుంచి నెట్‌వర్క్ ఆస్పత్రులు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగిన దాఖలాలు ఇదివరకు లేవు. చంద్రబాబు గద్దెనెక్కిన 17 నెలల కాలంలో రెండు పర్యాయాలు నెట్‌వర్క్ ఆస్పత్రులు సేవలు నిలిపేసి సమ్మెబాట పట్టాయి. అంతేకాకుండా దేశంలోని ఏ రాష్ట్ర చరిత్రలో లేనట్టుగా ప్రభుత్వం నుంచి బకాయిలు రాబట్టడం కోసం ఇప్పుడు ఏకంగా ధర్నాకు దిగుతున్నారు. దీంతో జాతీయ స్థాయిలో పరువు పోతుందని గ్రహించిన ప్రభుత్వం ‘ఆశ’ ప్రతినిధులతో బేరసారాలకు దిగింది.
మంగళవారం రాత్రి వైద్య శాఖ ఉన్నతాధికారులు ‘ఆశ’ ప్రతినిధులతో వర్చువల్ సమావేశం నిర్వహించి బకాయిల చెల్లింపుపై బేరసారాలు ఆడారు. ‘ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్లు ఇప్పుడు ఇస్తాం. నవంబర్ నెలలో మరికొంత మొత్తం ఇస్తాం’ అంటూ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే ప్రభుత్వం చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘ఇప్పటికే రూ.3 వేల కోట్ల పైబడి బకాయి పెట్టారు. అందులో రూ.250 కోట్లు మాత్రమే ఇస్తాం అంటున్నారు. క్లెయిమ్‌లు ప్రాసెస్ చేసి, ఆస్పత్రులకు జమ చేయడం కోసం సీఎఫ్‌ఎంఎస్‌లో సిద్ధంగా ఉన్న బిల్లులన్నీ వెంటనే విడుదల చేయండి. మిగిలిన బిల్లులు ఎప్పటిలోగా క్లియర్ చేస్తారో చెప్పండి. అప్పుడే మేం వెనక్కు తగ్గుతాం’ అని ‘ఆశ’ ప్రతినిధులు తేల్చి చెప్పినట్టు తెలిసింది.
మా గోడు ప్రభుత్వం వింటుందని ఆశిస్తున్నాం
నెల రోజుల పైబడి మేము సమ్మె చేస్తున్నాం. పూర్తి స్థాయిలో వైద్య సేవలు నిలిపేసి రెండు వారాలు అయింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో ధర్నాకు సిద్ధం అయ్యాం. ధర్నా అనంతరం అయినా ప్రభుత్వానికి మా గోడు వినిపిస్తుందని ఆశిస్తున్నాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వీలైనంత వేగంగా మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. – డాక్టర్ విజయ్‌కుమార్, అధ్యక్షుడు, ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్


