
తిరుపతి జిల్లా: చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రా? టీడీపీకి ముఖ్యమంత్రా? అని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. సోమవారం సత్యవేడు సబ్ జైల్లో ఉన్న తడకుపేట దళితులను ఆమె పరామర్శించారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడారు.
‘ఆరేళ్ల క్రితం మాట్లాడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతున్నాయని పోసాని కృష్ణ మురళిని అరెస్ట్ చేయడం దారుణం. అక్రమంగా 111 కేసు పెట్టి ,అక్రమంగా ఇరికించారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడలేదా? వాళ్లపై ఇదే దేశద్రోహం సెక్షన్లు కింద కేసు నమోదు చేయగలరా? అని ప్రశ్నించారు.
వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులకు ఎటువంటి సహాయం చేయొద్దని చంద్రబాబు చెప్పడం హేయమైన చర్య. వైఎస్సార్‌సీపీ శ్రేణులు కట్టే పన్నులను ప్రభుత్వం తీసుకోవడం లేదా? వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారు. చంద్రబాబుకు ఎదురు మాట్లాడినా, ఆయన చేసిన తప్పును ఎత్తి చూపినా సహించలేకపోతున్నారు.
చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చలేదు. మంచి ప్రభుత్వమని స్టిక్కర్లేసుకోవడం తప్ప, మొన్న పెట్టిన బడ్జెట్‌తో ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వమని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. రెడ్‌బుక్ రాజ్యాంగంపై పెట్టిన శ్రద్ధ,మేనిఫెస్టో పైన ఎందుకు పెట్టడం లేదు? బటన్ నొక్కడానికి వైఎస్ జగన్ అవసరం లేదన్నారు. అదే బటన్‌ను చంద్రబాబు ఎందుకు నొక్కడం లేదు. చంద్రబాబు ఒక్క హామీని అమలు చేయలేదు. వైఎస్ జగన్ చేసిన ఏ ఒక్క హామీని ప్రజలకు చేరవేయడం లేదు
రెడ్‌బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్‌సీపీ వాళ్లపై దాడులు చేయడం, అక్రమ కేసులతో రాష్ట్రాన్ని పాలిస్తామనుకుంటే రేపు అదే రిపీట్ అవుతుంది. వైఎస్ జగన్ వడ్డీతో సహా తిరిగిచ్చేస్తారు. వైఎస్సార్‌సీపీకి సహాయం చేయొద్దన్నారంటే ఆయన ఎంత దారుణమైన స్థితిలో ఉన్నారు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రా? రాష్ట్రానికి ముఖ్యమంత్రా?

చంద్రబాబుకు నొప్పి వస్తే పరిగెత్తే ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేస్తుంటే నోరెందుకు మెదపలేదు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు చూడండి. వైఎస్సార్‌సీపీ హాయంలో 30 వేల మహిళలు మాయమయ్యారన్న పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరినైనా తీసుకొచ్చారా? దానికోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించి ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు కదా?’అని మాజీ మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment