సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్ వాడుకునే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని, వారి సాధికారతకు దోహద పడుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నంబర్ 22, తేదీ: 01 – 09 – 2020) ప్రకారం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లపై ‘సాక్షి’ ప్రతినిధికి విజయానంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
♦ ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా అయ్యే మొత్తం విద్యుత్‌లో 18 నుంచి 20 శాతం వ్యవసాయ రంగం వినియోగించుకుంటోంది. ఈ విద్యుత్‌ను లెక్కించడం కష్టమవుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు మెరుగుదలకు, ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతోందో తెలుసుకోవడానికి, నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత చెల్లించాలనే లెక్కకు వ్యవసాయ సర్విసులకు స్మార్ట్ మీటర్లు బిగించాలి.
♦ స్మార్ట్ మీటర్లు బిగించడానికయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్ సంస్థలపైగానీ, రైతులపైగానీ ఒక్క రూపాయి భారం పడదు. ప్రతి నెలా వ్యవసాయ విద్యుత్ వినియోగదారుడు కూడా అందరిలాగే విద్యుత్ బిల్లు చెల్లించే వెసులుబాటు ఉండడంతో రైతుకు నాణ్యమైన, నమ్మకమైన అంతరాయాలు లేని విద్యుత్‌ను డిమాండ్ చేసే హక్కు లభిస్తుంది. డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుంది. ఇది రైతు సాధికారతకు దోహద పడుతుంది.
♦ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలను అనుసరించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం. స్మార్ట్ మీటర్ ధరను కేంద్రం ప్రాథమికంగా రూ.6 వేలుగా అంచనా వేసింది. అనుబంధ పరికరాలను అందులో కలపలేదు. స్మార్ట్ మీటరు సక్రమంగా పనిచేయడానికి సాంకేతికంగా అనుబంధ పరికరాలు అవసరం.
♦ స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్త్ వైరు, ఎర్త్ పైపు, మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తారు. మోటార్లను బాగా నడపడంలో, వోల్టేజి సమస్య రాకుండా చూడటంలో కెపాసిటర్లది కీలక పాత్ర. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌కు సరైన ఎర్తింగ్ ఉండాలి. ఎంసీబీ ద్వారా ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాలను తగ్గించడంతోపాటు విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు.
♦ స్మార్ట్ మీటర్ల ధర, అనుబంధ పరికరాల ధర వేర్వేరు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్విసుకు అనుబంధ పరికరాలకు రూ.12128.71, పన్నులతో కలిపి రూ.14,455ల ఖర్చవుతుంది. దీనిలో దాదాపు 60 శాతం కేంద్రం నుంచి గ్రాంటుగా పొందడానికి ప్రయతి్నస్తున్నాం.
♦ స్మార్ట్ మీటర్లు అమర్చడం వల్ల డిస్కంలకు ప్రయోజనం ఏమీ లేదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ఈ ప్రాజెక్టును మరింత పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయడం కోసం సూచనలు చేశాం.
♦ మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అంశాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. అనుబంధ పరికరాలు లేకుండా ఉత్తరప్రదేశ్ మినహా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ వ్యవసాయ విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడంలేదు.
♦ ఆర్డీఎస్‌ఎస్ పథకంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో గృహ విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో ఏపీలోనూ గృహాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచాం.
- ‘సాక్షి’తో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్
Comments
Please login to add a commentAdd a comment