- సెకీతో ఒప్పందాన్ని 7 గంటల్లోనే ఆమోదించారంటూ ఈనాడు వక్రీకరణ
- వాస్తవాలను దాచిపెట్టి విషం చిమ్మడమే అసలు లక్ష్యం
- సెకీ లేఖ – ఒప్పందానికి మధ్య దాదాపు రెండున్నర నెలల సుదీర్ఘ సమయం
- కమిటీ లోతైన అధ్యయనం తరువాతే కేబినెట్ ఆమోదం
- కారుచౌకగా సౌర విద్యుత్ సరఫరా చేస్తామని 2021 సెప్టెంబర్ 15న లేఖ రాసిన సెకీ
- సాధ్యమైనంత త్వరగా లేఖపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రాన్ని కోరిన సెకీ
- దీంతో మార్గనిర్దేశం (గైడెన్స్) కోసం సెపె్టంబర్ 16న కేబినెట్ ముందుకు టేబుల్ ఐటమ్‌గా సెకీ లేఖ.. దీనిపై లోతైన అధ్యయనం చేసి కేబినెట్‌కు నివేదిక ఇవ్వాలని కమిటీకి ఆదేశం
- క్షుణ్ణంగా అధ్యయనం తరువాత అక్టోబర్ 28న కేబినెట్ ముందుకు కమిటీ నివేదిక.. దాన్ని ఆమోదిస్తూ ఏపీఈఆర్‌సీ అనుమతి తీసుకోవాలని డిస్కమ్‌లకు నిర్దేశం
- ఏపీఈఆర్‌సీ కూడా ఆమోదించాక డిసెంబర్ 1న సెకీతో ప్రభుత్వం, డిస్కమ్‌ల ఒప్పందం
సాక్షి, అమరావతి: వక్రీకరణలే పరమావధిగా పచ్చి అబద్ధాలను కుమ్మరిస్తున్న ఈనాడు.. గత సర్కారు ఏడు గంటల్లోనే సెకీతో ఒప్పందాన్ని క్యాబినెట్ భేటీలో ఆమోదించుకుందంటూ మరోసారి బుకాయించింది. రాష్ట్ర రైతాంగానికి ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా ప్రయోజనం జరుగుతోంటే రూ.లక్ష కోట్లకుపైగా భారం అంటూ అసత్య ఆరోపణలు చేసింది. ఈ ఒప్పందానికి ఐఎస్‌టీఎస్ చార్జీలు వర్తించవని తెలిసినా పదేపదే విషం చిమ్ముతూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. నిజానికి రెండున్నర నెలల పాటు సుదీర్ఘ కసరత్తు.. లాభనష్టాల బేరీజు.. నిపుణుల కమిటీ పరిశీలన.. మంత్రివర్గంలో చర్చ.. చివరిగా విద్యుత్తు నియంత్రణ మండలి గ్రీన్ సిగ్నల్.. ఇన్ని దశలు దాటి ప్రక్రియలన్నీ పక్కాగా పాటించాకే సెకీతో ఒప్పందం కార్యరూపం దాల్చింది.
వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు ఢోకా లేకుండా పాతికేళ్ల పాటు అత్యంత చౌకగా సౌర విద్యుత్‌ను అందిస్తామని, అంతర్రాష్ట్ర ప్రసార చార్జీల నుంచి సైతం మినహాయింపు కల్పిస్తామని 2021 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ స్వయంగా ప్రతిపాదిస్తూ లేఖ రాసింది. దీనిపై సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని సెకీ కోరడంతో 2021 సెప్టెంబర్ 16న (అప్పటికి వారం ముందే కేబినెట్ భేటీ తేదీని నిర్ణయించారు) కేబినెట్ సమావేశంలో దీన్ని టేబుల్ ఐటమ్‌గా ప్రవేశపెట్టారు. అంతేగానీ సెకీ లేఖపై అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవటం కోసంగానీ.. ఆమోదించడం గానీ జరగలేదు. ముఖ్యమైన విషయాలు అత్యవసరంగా క్యాబినెట్ దృష్టికి వచ్చినప్పుడు టేబుల్ ఐటమ్ కింద ప్రవేశపెట్టడం పరిపాటి, ఆనవాయితీ.
అందులో ఏం తప్పు ఉంది? ఈ క్రమంలో దీనిపై లోతైన అధ్యయనానికి కమిటీని నియమించి క్యాబినెట్‌కు నివేదిక ఇవ్వాలని గత ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ దశలన్నీ పూర్తయ్యాకే 2021 అక్టోబర్ 28న క్యాబినెట్ సమావేశంలో ఒప్పందానికి ఆమోదం లభించింది. ఏపీఈఆర్‌సీ నుంచి కూడా అనుమతి తీసుకోవాలని డిస్కమ్‌లను నిర్దేశించారు. అంతేగానీ ఈనాడు చెబుతున్నట్లుగా హడావుడిగా ఒప్పందాన్ని ఆమోదించాలనుకుంటే అంతకుముందు జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించి ఉండాలి కదా? నెలల తరబడి ఎందుకు ఆగుతారు? ఇలా సుదీర్ఘంగా చర్చలు, పలు ప్రక్రియలు ముగిశాకే 2021 డిసెంబర్ 1న సెకీతో ఒప్పందం జరిగింది.
అర్థ రహిత ఆరోపణలు..
2021 సెప్టెంబర్ 15న సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ (సెకీ) యూనిట్ రూ.2.49కే సౌర విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పింది. నిజానికి ఈ ధర అప్పటి వరకు ఇతర మార్గాల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు వస్తున్న విద్యుత్ ధరల కంటే చాలా తక్కువ. పైగా కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రోత్సాహం కింద ‘అంతర్ రాష్ట్ర ప్రసార ఛార్జీల (ఐఎస్‌టీఎస్) నుంచి మినహాయింపు’ కూడా ఈ ఒప్పందానికి వర్తింపజేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సెకీ లేఖ రాసింది.
అయితే సెకీ నుంచి విద్యుత్‌ను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 7 గంటల వ్యవధిలోనే అంగీకరించిందని, రాష్ట్రానికి వచ్చే ప్రయోజనాలేమిటి? అంత విద్యుత్ వినియోగించగలమా? లాంటి అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు తగినంత సమయం కేటాయించలేదని ఈనాడు మొదటి ఆరోపణ చేసింది. సెకీ ప్రతిపాదన వల్ల ప్రజలపై రూ.1,10,000 కోట్ల మేర ఆర్ధిక భారం పడుతుందని ఆలోచించలేదనేది రెండో ఆరోపణ. కానీ ఈ రెండూ పచ్చి అబద్ధాలే. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అల్లుకున్న కట్టుకథలు మినహా ఇందులో ఏ ఒక్కటీ వాస్తవం కాదు.
రెండున్నర నెలలు.. విశ్లేషించాకే అనుమతి..
సౌర విద్యుత్తుకు సంబంధించి పలు ప్రయోజనాలను కల్పిస్తూ 2021 సెప్టెంబర్ 15న సెకీ నుంచి ప్రతిపాదన వచ్చింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ, రాష్ట్ర ప్రభుత్వం, డిస్కంల మధ్య విద్యుత్ విక్రయ ఒప్పందం (పవర్ సేల్ అగ్రిమెంట్) 2021 డిసెంబర్ 1న జరిగింది. అంటే ప్రతిపాదనకు – ఒప్పందానికి మధ్య రెండున్నర నెలల కంటే ఎక్కువ వ్యవధి ఉంది.
ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరితోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు. ఈ రెండున్నర నెలల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, సెకీ మధ్య పలు పర్యాయాలు సంప్రదింపులు జరిగాయి. సెకీ ప్రతిపాదనలో లోటుపాట్లను, ఒప్పందం వల్ల కలిగే లాభనష్టాలను లోతుగా విశ్లేషించారు. అంతేకాకుండా ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ) ఆమోదాన్ని 2021 నవంబర్ 8న కోరారు. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్‌సీ నుంచి దీనికి ఆమోదం లభించింది. సెకీ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన కసరత్తు, అందుకోసం తీసుకున్న సమయం రెండున్నర నెలలకంటే ఎక్కువ ఉన్నట్లు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా ఈనాడు మాత్రం 7 గంటల్లోనే ఆమోదం తెలిపేశారంటూ పచ్చి అబద్ధాలను ప్రచురించింది.
క్షుణ్నంగా సుదీర్ఘ కసరత్తు..
సెకీ ఒప్పందాన్ని అమలు చేయాలనే నిర్ణయాన్ని మంత్రి మండలి సెప్టెంబర్ 16వ తేదీన తీసుకుందని ఈనాడు మరో ఆరోపణ చేసింది. వాస్తవం ఏమిటంటే మంత్రి మండలి సమావేశాన్ని అప్పటికప్పుడు నిర్ణయించలేదు. అంతకుముందు వారం రోజుల క్రితమే ఆ సమావేశం షెడ్యూల్ ఖరారైంది. అంటే.. కేబినెట్ సమావేశం తేదీపై నిర్ణయం తీసుకునే నాటికి సెకీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి రాలేదు. సమావేశానికి ఒక రోజు ముందు మాత్రమే సెకీ లేఖ అందింది. తమ లేఖపై వీలైనంత త్వరగా స్పందన తెలియజేయాలని ఆ లేఖలో సెకీ కోరింది. అయితే మొత్తం ప్రక్రియకు కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందనే వాస్తవాన్ని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సెకీ కోరినట్లుగా ప్రక్రియను ఆలస్యం చేయకూడదని భావించి తగిన మార్గదర్శకాల కోసం 2021 సెప్టెంబర్ 16న మంత్రి మండలి సమావేశంలో ఈ అంశాన్ని టేబుల్ ఐటమ్‌గా ఉంచింది.
ఈ ప్రతిపాదనపై మరింత క్షుణ్నంగా అధ్యయనం చేయాలని రాష్ట్ర ఇంధన శాఖను నాటి సమావేశంలో మంత్రి మండలి ఆదేశించింది. సెకీ ప్రతిపాదనను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్ పవర్ కోఆర్డినేషన్ కమిటీ(ఏపీపీసీసీ) చైర్మన్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కమిటీ సభ్యులు పలుదఫాలు సెకీ అధికారులతో చర్చలు జరిపారు. అనంతరం 2021 అక్టోబర్ 25న సెకీ ప్రతిపాదనకు అనుకూలంగా కమిటీ తన సిఫార్సులను ప్రభుత్వానికి సమర్పించింది.
దీంతో అక్టోబర్ 28న జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆ సిఫార్సులను మంత్రి మండలి ముందు ఉంచారు. ఏపీఈఆర్‌సీ అనుమతికి లోబడి సెకీతో పీఎస్‌ఏ అమలును ఆమోదించాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. దీంతో 2021 నవంబర్ 8న ఏపీఈఆర్‌సీ ఆమోదం కోసం డిస్కంలు దరఖాస్తు చేశాయి. 2021 నవంబర్ 11న ఏపీఈఆర్‌సీ ఆమోదం పొందిన తర్వాతే 2021 డిసెంబర్ 1న ఒప్పందం జరిగింది. కాబట్టి టీడీపీ, ఈనాడు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దురుద్దేశపూర్వకంగా చేస్తున్నవని స్పష్టం అవుతోంది.
కరపత్రమా... కళ్లు తెరువు
⇒ ట్రాన్స్‌మిషన్ చార్జీలు పడతాయంటూ ఈనాడు నిస్సిగ్గుగా అబద్ధాలు
⇒పాతికేళ్ల పాటు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు వర్తించవని లేఖలోనే చెప్పిన ‘సెకీ’
‘సెకీ’ ఒప్పందంతో లాభాలివీ..
⇒ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) యూనిట్ రూ.2.49కే సోలార్ విద్యుత్తు అందచేస్తామంటూ తనకు తానుగా రాష్ట్ర
ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది.
⇒ ఈ ప్రతిపాదనకు ఏపీ అంగీకరించడం వల్ల 25 ఏళ్ల పాటు ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు లభిస్తుందని 2021 సెప్టెంబర్ 15న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో సెకీ స్పష్టం చేసింది.
⇒ ఈ చారిత్రక ఒప్పందం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.3,750 కోట్లు చొప్పున 25 ఏళ్ల పాటు దాదాపు రూ.లక్ష కోట్ల మేర విద్యుత్తు భారం నుంచి ఆర్ధిక ప్రయోజనం చేకూరుతుంది.
⇒ ఐఎస్‌టీఎస్ చార్జీల నుంచి మినహాయింపు అనేది మరే ఇతర ప్రాజెక్ట్‌కి దక్కని చాలా కీలకమైన ప్రయోజనం. ఇతర రాష్ట్రంలో ఉన్న సోలార్ పవర్ ఉత్పాదక కేంద్రం నుంచి విద్యుత్ సరఫరా కోసం మరే ఇతర సంస్థతో ఒప్పందం చేసుకుంటే మన రాష్ట్రం ఐఎస్‌టీఎస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. అప్పుడు అది చాలా భారంగా మారుతుంది. ప్రతి నెలా మెగావాట్‌కు సుమారు రూ.4 లక్షలు దానికే ఖర్చవుతుంది.
⇒ రాష్ట్ర డిస్కంలు మునుపెన్నడూ ఇంత తక్కువ ధరకు సౌర విద్యుత్‌ను కొనుగోలు చేసిన దాఖలాలు లేవు.
⇒ ఇది కేంద్ర సంస్థ సెకీతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం. ఇందులో మూడో వ్యక్తి ప్రమేయానికి తావే లేదు. అలాంటప్పుడు ఇక లంచాలకు ఆస్కారం ఎక్కడుంటుంది?
⇒ టీడీపీ హయాంలో కుదుర్చుకున్న అధిక ధరల పీపీఏలతో పోలిస్తే సెకీతో సగం కంటే తక్కువ ధరకే ఒప్పందం కుదిరింది.
Comments
Please login to add a commentAdd a comment