
సాక్షి, తాడేపల్లి: చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఇటీవల దాడికి గురైన నేపథ్యంలో ఘటన వివరాలన అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్ యోగక్షేమాలు తెలుసుకున్న వైఎస్ జగన్.. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ.. భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ.. ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమన్నారు. ఈ సందర్భంగా రంగరాజన్ మాట్లాడుతూ.. వైఎస్ జగన్ పరామర్శ తమకు కొండంత బలమన్నారు.
కాగా, చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన కొవ్వురి వీర రాఘవరెడ్డి 2022లో ఫేస్‌బుక్ వేదికగా రామరాజ్యం సంస్థను ప్రారంభించాడు. హిందూ ధర్మాన్ని రక్షించుకోవడానికి రామరాజ్యం సైన్యంలో చేరేలా ప్రజలను ప్రేరేపించాడు. రిజిస్టర్ చేసుకున్నవారికి రూ.20 వేలు వేతనం ఇస్తామని ప్రకటించాడు. ఈ ప్రకటనకు 25 మంది స్పందించి రామరాజ్యం సైన్యంలో చేరారు.
ఈ నెల 7న మూడు వాహనాల్లో, 25 మంది సభ్యులతో కలిసి వీర రాఘవరెడ్డి చిలుకూరు దేవాలయం వద్దకు వచ్చాడు. అర్చకుడు రంగరాజన్ ఇంట్లోకి వెళ్లి రామరాజ్యం సైన్యానికి వ్యక్తులను పంపాలని, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దానికి రంగరాజన్ అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. దీనిపై రంగరాజన్ ఈ నెల 8న మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment