priest Rangarajan
-
రాష్ట్రపతికి రంగరాజన్ లేఖ
సాక్షి, మొయినాబాద్ : కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం కేసు విషయమై చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్ భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్కు లేఖరాశారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే శబరిమల ఆలయం తీర్పును కోర్టు ధర్మానికి విరుద్ధంగా ఇచ్చిందని మండిపడ్డారు. అదేవిధంగా పూరీ జగన్నాథ్ రథయాత్ర నిర్వహించొద్దని తీర్పు ఇచ్చి.. తర్వాత ప్రజల ఆగ్రహాన్ని గమనించి పరిమిత సంఖ్యలో భక్తులతో రథయాత్ర తీయొచ్చని తన తీర్పును తానే మార్చుకుందన్నారు. ఇలాంటి వాటితో న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపారు. హిందూ దేవతల విషయంలో సుప్రీంకోర్టు వ్యవహారశైలి సరిగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం దేవాలయాల్లో కొలువుండే దైవుళ్లకు అధికారాలు ఏమీ లేవని ఉందని, అందుకే భగవంతుడు కోవిడ్–19 నుంచి భక్తులను కాపాడే అధికారాన్ని కోల్పోయాడేమో అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తన విశిష్ట అధికారాన్ని వినియోగించుకుని అనంత పద్మనాభ స్వామి దేవాలయం తీర్పును హిందువుల మనోభావాలకు అనుగుణంగా వెలువరించే విధంగా సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ లేఖ రాశానని వెల్లడించారు. -
చారిత్రాత్మక నిర్ణయం : రంగరాజన్
సాక్షి, హైదరాబాద్ : వంశపారంపర్య అర్చకత్వానికి ఆమోదం తెలుపుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవో విడుదల చేయడం పట్ల బ్రాహ్మణుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మాట మీద నిలబడిన వైఎస్ జగన్కు ఆజన్మాంతం రుణపడి ఉంటామని అర్చకులు వాగ్దానం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఎనిమిది లక్షల అర్చక కుటుంబాలు లబ్ది పొందుతాయని, జగన్ ప్రభుత్వం కలకాలం కొనసాగేలా పూజలు చేస్తామని వారు తమ మనోభావాలను వ్యక్తపరుస్తున్నారు. 76 జీవోను చంద్రబాబు నిర్లక్ష్యం చేసి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని దేవాలయ పరిరక్షణ వేదిక సంధానకర్త కస్తూరి రంగరాజన్ వ్యాఖ్యానించారు. తమ సంక్షేమానికి తండ్రి బాటలో నడుస్తున్న వైఎస్ జగన్కు ఆయన కృతజ్ఞతలకు తెలిపారు. అలాగే, అర్చకుల కలను నెరవేర్చారని సూర్యచంద్రులు ఉన్నంతవరకూ వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన మేలును మరిచిపోలేమని బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్ అనంతపురంలో తెలిపారు. -
ట్రంప్ మనసు మార్చవా..!
► వీసాల దేవుడికి వేడుకోలు ► చిలుకూరు బాలాజీని కోరుకుంటున్న అమెరికాలో ఉన్నవారి బంధువులు ► ప్రదక్షణలు చేసి మొక్కుతున్న వైనం మొయినాబాద్: వీసాల దేవుడా.. ట్రంప్ మనసు మార్చవా అంటూ చిలుకూరు బాలాజీకి భక్తులు మొరపెట్టుకుంటున్నారు. అమెరికాలో ఉన్న తమవారు క్షేమంగా ఉండాలని పూజలు నిర్వహిస్తున్నారు. అమెరికా వెళ్లినవారి కోసం వీసాల దేవుడు బాలాజీకి మొక్కుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడ తీసుకున్న నిర్ణయాలు, భారతీయులపై జరుగుతున్న దాడులతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదే సమయంలో అమెరికాలో ఉన్నవారి క్షేమం పట్ల ఇక్కడున్న బంధువులు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. బాలాజీ కృపతో వీసాలు పొంది అమెరికా వెళ్లినవారిని ఆ బాలాజీనే కాపాడాలని.. ట్రంప్ మనసు మారాలని నిత్యం భక్తులు చిలుకూరు బాలాజీ దేవాలయంలో భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు.భక్తుల కోర్కెలు తీర్చే ఇలవేల్పు చిలుకూరు బాలాజీకి వీసాల దేవుడిగా పేరొచ్చింది. వీసాలకోసం దరఖాస్తు చేసుకున్నవారు ప్రతిరోజు వందల మంది బాలాజీని దర్శించుకుంటారు. 20 ఏళ్లుగా చిలుకూరు బాలాజీ ఆశీస్సులతో ఎంతోమంది వీసాలు పొంది విదేశాలకు వెళ్లారు. అయితే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, వ్యవహరిస్తున్న తీరు, అక్కడ మనవారిపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీంతో అమెరికాలో నివాసం ఉంటున్న వారి బంధువులు, కుటుంబ సభ్యులు నిత్యం బాలాజీ దేవాలయానికి వచ్చి పూజలు చేస్తున్నారు. ట్రంప్ శాశ్వతం కాదు.. బాలాజీనే శాశ్వతం: ఆలయ అర్చకులు రంగరాజన్ భక్తుల కోర్కెలు తీర్చే చిలుకూరు బాలాజీ ఎప్పుడూ తన భక్తులకు అన్యాయం చేయరని చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకులు రంగరాజన్ భక్తులకు వివరిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాశ్వతం కాదని.. చిలుకూరు బాలాజీనే శాశ్వతమని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, అక్కడ మనవారిపై జరుగుతున్న దాడులతో చాలామంది భయపడుతున్నారని.. బాలాజీ దేవాలయానికి వచ్చి ప్రదక్షణలు చేసి పూజలు నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పుడు వీసాలు రావడం ఆగలేదని.. వీసాలు పొందినవారు అమెరికాకు వెళ్తూనే ఉన్నారని చెప్పారు. అమెరికాలో ఉన్నవారి కోసం ఆందోళన చెందుతున్నవారు బాలాజీ సన్నిధికి వచ్చి ట్రంపు మనసు మార్చి మంచి నిర్ణయాలు తీసుకునేలా చూడాలని బాలాజీని కోరుకుంటున్నారన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే బాలాజీ ఈ కోర్కెను కూడా తీరుస్తారని.. అందరికీ మంచి జరుగుతుందని తెలిపారు.