
రంగరాజన్, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త
సాక్షి, మొయినాబాద్ : కేరళలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం కేసు విషయమై చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు, దేవాలయాల పరిరక్షణ ఉద్యమం సంధానకర్త రంగరాజన్ భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్‌కు లేఖరాశారు. సోమవారం ఈ విషయాన్ని ఆయన విలేకరులకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనంతపద్మనాభ స్వామి దేవాలయం కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును ఎందుకు వాయిదా వేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికే శబరిమల ఆలయం తీర్పును కోర్టు ధర్మానికి విరుద్ధంగా ఇచ్చిందని మండిపడ్డారు.
అదేవిధంగా పూరీ జగన్నాథ్ రథయాత్ర నిర్వహించొద్దని తీర్పు ఇచ్చి.. తర్వాత ప్రజల ఆగ్రహాన్ని గమనించి పరిమిత సంఖ్యలో భక్తులతో రథయాత్ర తీయొచ్చని తన తీర్పును తానే మార్చుకుందన్నారు. ఇలాంటి వాటితో న్యాయస్థానంపై ప్రజలకు నమ్మకం, విశ్వాసం సన్నగిల్లుతుందని తెలిపారు. హిందూ దేవతల విషయంలో సుప్రీంకోర్టు వ్యవహారశైలి సరిగా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం దేవాలయాల్లో కొలువుండే దైవుళ్లకు అధికారాలు ఏమీ లేవని ఉందని, అందుకే భగవంతుడు కోవిడ్–19 నుంచి భక్తులను కాపాడే అధికారాన్ని కోల్పోయాడేమో అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రపతి తన విశిష్ట అధికారాన్ని వినియోగించుకుని అనంత పద్మనాభ స్వామి దేవాలయం తీర్పును హిందువుల మనోభావాలకు అనుగుణంగా వెలువరించే విధంగా సుప్రీంకోర్టును ఆదేశించాలని కోరుతూ లేఖ రాశానని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment