ఎస్సీ, ఎస్టీలకు ‘షాక్‌’ ఉచిత విద్యుత్‌ కట్‌ | Free electricity cut for SCs and STs in TDP Govt | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలకు ‘షాక్‌’ ఉచిత విద్యుత్‌ కట్‌

Published Tue, Dec 3 2024 4:25 AM | Last Updated on Tue, Dec 3 2024 4:25 AM

Free electricity cut for SCs and STs in TDP Govt

ఏలూరు జిల్లా రెడ్డిగణపవరంలో విద్యుత్‌ కనెక్షన్లు కట్‌ చేయడంతో నిరసన వ్యక్తం చేస్తున్న దళితులు

నెలకు 200 యూనిట్లలోపు వాడినా బిల్లు కట్టాల్సిందే

పాత బకాయిల పేరుతో గుండెలదిరేలా బిల్లులు..

చెల్లించకుంటే నిర్దాక్షిణ్యంగా మీటర్ల తొలగింపు..

పైనుంచి ఆదేశాలు వచ్చాయి.. కట్టాలంటూ సిబ్బంది ఒత్తిళ్లు

కారు చీకట్లో దళిత కాలనీలు, గిరిజన గ్రామాలు 

ఉచిత విద్యుత్‌పై పేదల మొర ఆలకించని కూటమి సర్కారు

దళితులు, గిరిజనులకు ఉచిత విద్యుత్‌ అందించిన వైఎస్సార్‌సీపీ 

గత ప్రభుత్వ హయాంలో 19,86,603 కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల లబ్ధి

నెల రోజులుగా చీకట్లోనే.. 
200 యూనిట్లు లోపు విద్యుత్‌ వినియోగిస్తున్న మా ఇంటికి గత ప్రభుత్వంలో ఫ్రీగా కరెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు సబ్సిడీ లేదని, పాత బకాయిలు రూ.22 వేలు చెల్లించాలంటూ కనెక్షన్‌ తొలగించారు. నెల రోజులకుపైగా చీకట్లోనే మగ్గుతున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చాకే మాకీ దుస్థితి దాపురించింది.  
– కొల్లి విమల, రెడ్డిగణపవరం

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో నివసించే రోజువారీ కూలీ బంటుపల్లి మధు నివసిస్తున్న ఇంటికి రూ.35 వేలు కరెంట్‌ బిల్లు రావడంతో షాక్‌ తిన్నాడు. రోజంతా కష్టపడితే వచ్చే ఐదారొందలు ఇంటి ఖర్చులు, పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇంత డబ్బు కట్టమంటే ఎక్కడి నుంచి తేవాలని మధు వాపోతున్నాడు.

ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డి గణపవరంకి చెందిన గిరిజనులు కాక వెంకమ్మ, మారెయ్యలకు ఏ నెలలోనూ 200 యూనిట్లు దాటి కరెంట్‌ బిల్లు రాలేదు. రూ.40 వేలు పాత బకాయిలుగా చూపిస్తూ అక్టోబర్‌ నెలాఖరున అధికారులు వారి కరెంట్‌ కనెక్షన్‌ తొలగించారు. అప్పు చేసి ఆ మొత్తాన్ని చెల్లించి నాలుగు రోజులపాటు తిరిగితే ఎట్టకేలకు కనెక్షన్‌ ఇచ్చారు. నాలుగు రోజుల క్రితం మరోసారి వచ్చిన విద్యుత్తు సిబ్బంది మరో రూ.22 వేలు బకాయిలున్నాయని, అవి కూడా చెల్లించకుంటే కనెక్షన్‌ తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు.

సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్‌పై కూటమి సర్కారు మోసంతో రాష్ట్రవ్యాప్తంగా దళిత, గిరిజన నివాసాల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. గత ప్రభు­త్వం ఉచితంగా అందించిన విద్యుత్‌ను కూడా పాత బకాయిలుగా చూపిస్తూ ఎస్సీ, ఎస్టీల నుంచి బలవంతపు వసూళ్లకు దిగుతోంది. రూ.లక్షలు.. వేలల్లో బకా­యిలు చెల్లించాలంటూ ఆదేశిస్తోంది. అంత డబ్బు కట్టలేని పేదల కరెంట్‌ కనెక్షన్లను విద్యుత్‌ సిబ్బంది నిర్దాక్షిణ్యంగా కట్‌ చేస్తూ మీటర్లను తొలగిస్తున్నారు. 

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పలు గ్రామాల్లో గిరిజన, దళితులకు చెందిన విద్యుత్‌ కనెక్షన్లను అధికారులు కట్‌ చేశారు. పుట్లగట్లగూడెం, మైసన్నగూడెం, రెడ్డిగణపవరం, పాలకుంట, వీరభద్రపురం లాంటి గిరిజన గూడేలు, దళితపేటలు అంధకారంలో మగ్గిపోతున్నాయి. దాదాపు 250 కుటుంబాలు నివసించే అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం రాఘవరాజపురం దళితవాడలో బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్‌శాఖ సిబ్బంది బిల్లులు జారీ చేయడంతో స్థానికులు నిరసనకు దిగారు. 

పలువురికి రూ.4,000 నుంచి రూ.10,000 వరకు బిల్లులు జారీ అయ్యాయి. ఇంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలంటూ పేదలు ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్‌ కడప జిల్లా సింహాద్రిపురం మండలం హిమకుంట్ల ఎస్సీ కాలనీలో గత నెలాఖరున విద్యుత్‌ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో ఎస్సీ కాలనీ వాసులు రెండు రోజులపాటు  అంధకారంలో మగ్గిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి చొరవ చూపడంతో దళితవాడలో విద్యుత్తు వెలుగులు వచ్చాయి.  


200 యూనిట్ల వరకు ఉచితంగా ఇచ్చిన జగన్‌  
వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉండగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జన­వరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తుతో రూ.2,361.95 కోట్ల మేర లబ్ధి చేకూరగా 4,57,586 ఎస్టీ కుటుంబాలకు రూ.483.95 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తం 19,86,603 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.2,845.90 కోట్ల మేర ఉచిత విద్యుత్తు ద్వారా మేలు చేశారు.  


మీటర్ల తొలగింపు... 
దళితులు, గిరిజనులు నిబంధనల ప్రకారం నెలకు 200 యూనిట్లలోపు వినియోగించుకున్నప్పటికీ ఉచి­త విద్యుత్‌ను అందించకుండా కూటమి ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తోంది. 150 యూనిట్లు లోపు విని­యో­గించుకున్న వారికి సైతం రూ.వేలల్లో పాత బకాయిలు ఉన్నారని బిల్లులు జారీ అవుతున్నాయి. పాత బకాయిల పేరుతో విద్యుత్తు సిబ్బంది కరెంట్‌ మీ­టర్లు తొలగించి తీసుకుపోతున్నారు. 

బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్‌ను పునరుద్ధరిస్తామని తేల్చి చెబు­తుండటంతో పేదలు తీవ్ర షాక్‌కు గురవుతున్నారు. తాటాకు ఇళ్లు, రేకుల షెడ్లు, ప్రభుత్వ కాలనీల్లో నివసించే వారంతా చీకట్లోనే కాలం గడుపుతున్నారు. ఉ­చిత విద్యుత్‌పై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, తమకు పైనుంచి ఆదేశాలు వచ్చాయని, బిల్లు కట్టాల్సిందేనంటూ సిబ్బంది పేర్కొంటున్నారు.  

గ్రామాల్లో ఒత్తిడి చేస్తున్నారు.. 
కరెంట్‌ బిల్లులు చెల్లించాలంటూ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ ఒత్తిడి చేస్తున్నారు. ఇంట్లో తనిఖీ చేసి కట్టాల్సిందేనని దురుసుగా మాట్లాడారు. మేం ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు.  
– డోలా కాశమ్మ,     రాఘవరాజపురం దళితవాడ, అన్నమయ్య జిల్లా 

గత ఐదేళ్లు అడగలేదు.. 
గత ఐదేళ్ల పాటు మాకు ఉచిత విద్యుత్తు అందింది. ఎప్పుడూ బిల్లు కట్టమని అడగలేదు. 200 యూనిట్ల లోపే వినియోగిస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ బిల్లు కట్టాలంటూ విద్యుత్‌ సిబ్బంది ఒత్తిడి చేస్తున్నారు.      
– కన్నేపల్లి కుమారి, గాందీగ్రామం, చోడవరం, అనకాపల్లి జిల్లా 

బకాయిలు కడితేనే కనెక్షన్‌.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాకు ఉచిత విద్యుత్‌ అందించింది. గతంలో వినియోగించుకున్న ఉచిత విద్యుత్‌ను కూడా ఇప్పుడు బకాయిలుగా చూపిస్తూ బిల్లులు కట్టమంటున్నారు. అక్టోబర్‌ నెలాఖరున విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించారు. రూ.15 వేల బకాయిలు కడితేనే కనెక్షన్‌ ఇస్తామంటూ మీటర్‌ తీసుకెళ్లిపోయారు.  
– బల్లే రమాదేవి, రెడ్డిగణపవరం, బుట్టాయగూడెం మండలం. 

అంధకారంలో అవస్థలు.. 
పాత బకాయిల పేరుతో కరెంట్‌ కనెక్షన్లు తొలగించడం దారుణం. బుట్టాయగూడెం,  మైసన్నగూడెం, రెడ్డి గణపవరం, వీరభద్రపురం లాంటి ఆరు గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీల ఇళ్లలో కరెంట్‌ కనెక్షన్లు తొలగించారు. ఒక్కొక్కరు రూ.16 వేల నుంచి రూ.25 వేల వరకు బకాయిలు ఉన్నట్లు చూపిస్తున్నారు. డబ్బులు కట్టలేక నెల రోజులకు పైగా చీకట్లో అవస్థ పడుతున్నారు. దీనిపై డీఈ, విజయవాడలోని ఉన్నతాధికారులకు మొర పెట్టుకున్నా ఆలకించే నాథుడే లేడు.  
– అందుగుల ఫ్రాన్సిస్, బుట్టాయగూడెం మండల దళిత నేత 

స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం.. 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దళితులు, గిరిజనులకు నెలకు 200 యూనిట్లు చొప్పున ఉచితంగా విద్యుత్‌ అందించింది. కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ ఇవ్వకపోగా పాత బకాయిలు చెల్లించాలంటూ దళితులు, గిరిజనులను బెదిరిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ను కట్‌ చేసింది. దీనిపై విద్యుత్‌శాఖ మంత్రి రవికుమార్, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌కు వినతిపత్రం అందించాం. ఉచిత విద్యుత్‌ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుంటే ఉద్యమిస్తాం.      – అండ్ర మాల్యాద్రి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement