
పలాస కిడ్నీ అధ్యయన కేంద్రంపై అంతులేని నిర్లక్ష్యం
విద్యుత్ లేక నిలిచిపోయిన డయాలసిస్ సేవలు
ప్రాణాలు పోతున్నా పట్టించుకోని పాలకులు
ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోమంటున్న వైద్యులు
కాశీబుగ్గ: ఉద్దానానికి పెనుశాపంగా మారిన కిడ్నీ వ్యాధి.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడై మళ్లీ తిరగబెడుతోంది. దీంతో రోగుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఈ క్రమంలో టెక్కలి మండలం సన్యాసినీతాపురం గ్రామానికి చెందిన బెహరా సింహాద్రి (45) గురువారం మృతి చెందాడు. వేలమందికి ఆశాదీపంగా నిలవాల్సిన పలాస కిడ్నీ ఆస్పత్రిలో శుక్రవారం విద్యుత్తు సమస్యతో డయాలసిస్ యూనిట్లు పనిచేయలేదు.
నెఫ్రో ప్లస్ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనిట్‌లో 20 బెడ్లు ఉండగా.. శుక్రవారమంతా విద్యుత్తు సరఫరా ఇబ్బంది పెడుతూనే ఉంది. పొద్దున వచ్చిన రోగులు రాత్రి వరకు వేచి చూడాల్సి వచ్చిoది. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ వద్ద ప్రస్తావించగా ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదని, మరమ్మతులు చేసినా పలుసార్లు ట్రిప్ కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇకపై ఇలా జరగకుండా చూస్తామని బదులిచ్చారు.
తల్లడిల్లిన ఢిల్లమ్మ కుటుంబం
పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్ కోసం వెళ్తే జాప్యం చేస్తున్నారని, ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారని సోంపేటకు చెందిన మురపాల ఢిల్లమ్మ కుటుంబ సభ్యులు వాపోయారు. ఢిల్లమ్మను వారం క్రితం అత్యవసర సేవల విభాగంలో చేర్పించామని, శుక్రవారం ఆపరేషన్ చేస్తానని చెప్పారని తెలిపారు.
మళ్లీ ఇప్పుడు మూడు వారాలయ్యాక చేస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని అడిగితే ‘నేను చేయను. మీకు దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోండి..’ అని ఓ వైద్యుడు అన్నారని పేర్కొన్నారు. కాగా, వైద్యుడి తీరుపై ఢిల్లమ్మ కుటుంబ సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజకు ఫిర్యాదు చేశారు. ఆమె పిలిపించి మాట్లాడారు. వచ్చే వారానికి ఆపరేషన్ చేస్తామని సముదాయించి పంపించారు.
నాడు ఆదుకున్న జగన్ ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో పరిశోధన కేంద్రం ప్రారంభించారు. బాధితుల కష్టాలు తెలుసుకుని నెలకు రూ.10 వేలు పింఛన్ ఇచ్చారు. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధారను ఉద్దానం వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు పరిశోధన కేంద్రంలో సమస్యలు ముసురుకొన్నాయి.