Dialysis units
-
‘దయా’లసిస్ ఏదయా?
కాశీబుగ్గ: ఉద్దానానికి పెనుశాపంగా మారిన కిడ్నీ వ్యాధి.. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం తోడై మళ్లీ తిరగబెడుతోంది. దీంతో రోగుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ఈ క్రమంలో టెక్కలి మండలం సన్యాసినీతాపురం గ్రామానికి చెందిన బెహరా సింహాద్రి (45) గురువారం మృతి చెందాడు. వేలమందికి ఆశాదీపంగా నిలవాల్సిన పలాస కిడ్నీ ఆస్పత్రిలో శుక్రవారం విద్యుత్తు సమస్యతో డయాలసిస్ యూనిట్లు పనిచేయలేదు. నెఫ్రో ప్లస్ ఆధ్వర్యంలో నడుస్తున్న యూనిట్లో 20 బెడ్లు ఉండగా.. శుక్రవారమంతా విద్యుత్తు సరఫరా ఇబ్బంది పెడుతూనే ఉంది. పొద్దున వచ్చిన రోగులు రాత్రి వరకు వేచి చూడాల్సి వచ్చిoది. ఇదే విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ వద్ద ప్రస్తావించగా ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదని, మరమ్మతులు చేసినా పలుసార్లు ట్రిప్ కావడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ఇకపై ఇలా జరగకుండా చూస్తామని బదులిచ్చారు. తల్లడిల్లిన ఢిల్లమ్మ కుటుంబం పలాస కిడ్నీ పరిశోధన కేంద్రం, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అత్యవసర వైద్య సేవలు, ఆపరేషన్ కోసం వెళ్తే జాప్యం చేస్తున్నారని, ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకోమంటున్నారని సోంపేటకు చెందిన మురపాల ఢిల్లమ్మ కుటుంబ సభ్యులు వాపోయారు. ఢిల్లమ్మను వారం క్రితం అత్యవసర సేవల విభాగంలో చేర్పించామని, శుక్రవారం ఆపరేషన్ చేస్తానని చెప్పారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు మూడు వారాలయ్యాక చేస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేంటని అడిగితే ‘నేను చేయను. మీకు దిక్కున్న చోటకు వెళ్లి చెప్పుకోండి..’ అని ఓ వైద్యుడు అన్నారని పేర్కొన్నారు. కాగా, వైద్యుడి తీరుపై ఢిల్లమ్మ కుటుంబ సభ్యులు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజకు ఫిర్యాదు చేశారు. ఆమె పిలిపించి మాట్లాడారు. వచ్చే వారానికి ఆపరేషన్ చేస్తామని సముదాయించి పంపించారు. నాడు ఆదుకున్న జగన్ ప్రభుత్వం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం పలాసలో పరిశోధన కేంద్రం ప్రారంభించారు. బాధితుల కష్టాలు తెలుసుకుని నెలకు రూ.10 వేలు పింఛన్ ఇచ్చారు. వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న వంశధారను ఉద్దానం వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు పరిశోధన కేంద్రంలో సమస్యలు ముసురుకొన్నాయి. -
ప్రభుత్వాసుపత్రుల్లో 20 డయాలసిస్ యూనిట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని జిల్లా, ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 20 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ కేంద్రాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఆసుపత్రి ఆవరణలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలం, నీటిని ఉచితంగా ఇవ్వాల్సి ఉంటుంది. అందించిన విద్యుత్‌కు మాత్రం ప్రైవేటు సంస్థ చెల్లించాలి. ప్రభుత్వం ఒక్కో డయాలసిస్ ప్రక్రియకు చెల్లించే మొత్తం నుంచి ఏ సంస్థ ఎక్కువ మొత్తంలో ఆసుపత్రికి చెల్లించేందుకు టెండర్లో కోట్ చేస్తుందో ఆ సంస్థను ఎంపిక చేస్తారు. ప్రైవేటు సం స్థలతో ఒప్పందం కుదుర్చుకునే బాధ్యతను వైద్య విధాన పరిషత్ కమిషనర్‌కు, రిమ్స్ సంచాలకుడికి కట్టబెట్టారు. డయాలసిస్ కేంద్రాలివే.. 1) తాండూరు జిల్లా ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా; 2) వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి, రంగారెడ్డి జిల్లా; 3) సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి, మెదక్; 4) సిద్దిపేట ఏరియా ఆసుపత్రి, మెదక్; 5) ఏరియా ఆసుపత్రి, మెదక్; 6) మంచిర్యాల ఏరియా ఆసుపత్రి, ఆదిలాబాద్; 7) నిర్మల్ ఏరియా ఆసుపత్రి, ఆదిలాబాద్; 8) రిమ్స్, ఆదిలాబాద్; 9) ఉట్నూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఆదిలాబాద్; 10) నల్లగొండ జిల్లా ఆసుపత్రి; 11) సూర్యాపేట ఏరియా ఆసుపత్రి, నల్లగొండ జిల్లా; 12) భద్రాచలం ఏరియా ఆసుపత్రి, ఖమ్మం జిల్లా; 13) ఏటూరు నాగారం కమ్యూనిటీ హెల్త్‌సెంటర్, వరంగల్ జిల్లా; 14) మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రి, వరంగల్ జిల్లా; 15) కరీంనగర్ జిల్లా ఆసుపత్రి; 16) జగిత్యాల్ ఏరియా ఆసుపత్రి, కరీంనగర్ జిల్లా; 17) గద్వాల్ ఏరియా ఆసుపత్రి, మహబూబ్‌నగర్ జిల్లా; 18) నాగర్‌కర్నూల్ ఏరియా ఆసుపత్రి, మహబూబ్‌నగర్ జిల్లా; 19) వనపర్తి ఏరియా ఆసుపత్రి, మహబూబ్‌నగర్ జిల్లా; 20) కామారెడ్డి ఏరియా ఆసుపత్రి, నిజామాబాద్ జిల్లా.