సామాన్య పౌరులను వేధిస్తున్న జనసేన పార్టీ కార్యకర్తలు
‘ఎక్స్’లో ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్సార్‌సీపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా ఉల్లంఘన జరుగుతోందని వైఎస్సార్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం పార్టీ ‘ఎక్స్’ ఖాతాలో ఈ మేరకు పోస్టు చేసింది. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన రహస్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడమే కాకుండా.. ఆ డేటాను అడ్డంపెట్టుకొని సామాన్య పౌరులను జనసేన కార్యకర్తలు వేధిస్తున్నారని ఆరోపించింది. ఇది పాలనా పతనాన్ని బట్టబయలు చేస్తోందని పేర్కొంది.
కూటమి ప్రభుత్వ ఒత్తిళ్లతో పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల రాష్ట్రంలో రాజకీయ గూండాయిజం రాజ్యమేలుతోందని, ఫలితంగా ప్రజల భద్రత ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణ కల్పిస్తామని చెబుతున్న జనసేన పార్టీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ప్రజల సున్నితమైన డేటా నిమిషాల్లోనే జనసేన కార్యకర్తలకు ఎలా చేరుతోందని ప్రశ్నించింది.
పోలీసులు, కూటమి కార్యకర్తలు కుమ్మక్కై పని చేస్తున్నారా లేక పోలీసులే తమ వద్ద ఉండాల్సిన పరికరాలను వారి చేతికే ఇచ్చేసి వాడుకోమని చెప్పారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొంది. డేటా ఉల్లంఘన విషయంలో పరిశోధించడానికి పోలీసులను జవాబుదారీగా ఉంచడానికి, బెదిరింపులను అరికట్టడానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment