Electricity Connections
-
కొత్తగా ‘లైన్’ చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కనెక్షన్ల జారీ, అదనపు లోడ్ సామర్థ్యం మంజూరీకి ఇకపై సర్వీసు లైన్ చార్జీల పేరుతో కొత్త చార్జీలను వసూలు చే యనున్నారు. కనెక్షన్ లోడ్ సామర్థ్యం ఆధారంగా ప్రతి కిలోవాట్‌కి ఈ చార్జీ లను చెల్లించాల్సి ఉంటుంది. కోరిన వారికి కొత్త విద్యుత్ కనెక్షన్ జారీ విద్యు త్ పంపిణీ సంస్థ (డిస్కం)ల బాధ్యత కాగా, అందుకు అవసరమైన విద్యుత్ లైన్ లేదా ప్లాంట్ ఏర్పాటుకు చేసే వ్యయాన్ని తిరిగి రాబట్టుకునేందుకు ఈ లైన్ చార్జీలను వసూలు చేయనున్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఈ మేరకు ముసాయిదా నిబంధనలను ప్రకటించి ఈ నె ల 24లోగా సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరింది. లోడ్ సామర్థ్యం, కనెక్ష న్ కేటగిరీ, కనెక్షన్ జారీకి డిస్కంలు చేసే సగటు వ్యయం ఆధారంగా కొత్త కనెక్షన్ల చార్జీలను నిర్ణయించాలని రాష్ట్రాల ఈఆర్సీలకు గతంలో కేంద్రం సూచన చేసింది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ (రైట్స్ ఆఫ్ కన్జ్యూమర్స్) రూల్స్ 2020ను ప్రకటించింది. ప్రతి కనెక్షన్ కోసం సైట్‌ను సందర్శించి డిమాండ్ చార్జీలను అంచనా వేయడానికి బదులుగా ఈ పద్ధతిని పాటించాలని కోరింది. కేంద్రం సూచనల మేరకు లైన్ చార్జీల వసూళ్లకు అనుమతించాలని డి స్కంలు విజ్ఞప్తి చేయగా, ఈఆర్సీ ఈ మేరకు ముసాయిదాను ప్రకటించింది. కనెక్షన్ లోడ్ సామర్థ్యంలోని ప్రతి కిలోవాట్ లోడ్‌కి కొంత మొత్తం చొప్పున ఈ చార్జీలను విధిస్తారు. కొత్త కనెక్షన్ జారీకి ప్రత్యేకంగా విద్యుత్ లైన్ వే యాల్సిన అవసరం ఉన్నా, లేకున్నా ఈ కింద పేర్కొన్న మేరకు సర్వీసు లైన్ చార్జీలను వసూలు చేయాలని ఈఆర్సీ ప్రతిపాదించింది. అభ్యంతరాలు, సలహాలు తీసుకున్న తర్వాత ఈఆర్సీ తుది ఆదేశాలు జారీ చేయనుంది. ప్రస్తుత చార్జీలకు అదనంగా కొత్త చార్జీలుకొత్త విద్యుత్ కనెక్షన్ కోసం భూగర్భ కేబుల్ లైన్ వేయాల్సిన అవసరం వస్తే పైన పేర్కొన్న సంబంధిత కేటగిరీ చార్జీలతో పోలిస్తే దరఖాస్తుదారుల నుంచి 2.5 రెట్ల రుసుమును అధికంగా వసూలు చేస్తారు. కొత్త కనెక్షన్ల జారీకి ఇప్పటికే వసూలు చేస్తున్న దరఖాస్తు ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ చార్జీలకు అదనంగా ఈ సర్వీసు లైన్చార్జీలను వసూలు చేయనున్నారు. హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ కోసం కొత్త లైన్లను వేయాల్సి వస్తే అందుకు కానున్న వ్యయాన్ని డిస్కంలు అంచనా వేసి దరఖాస్తుదారుల నుంచి వసూలు చేయాలని ఈఆర్సీ సూచించింది. -
విద్యుత్ కనెక్షన్ మూడు రోజుల్లోనే..
సాక్షి, అమరావతి : కొత్త ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇకపై మరింత వేగంగా రానుంది. ఇప్పటి వరకూ అమల్లో ఉన్న నిబంధనల మేరకు ఉన్న గడువును కేంద్రం తగ్గించింది. సగానికి పైగా రోజులను కుదిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. ఇందు కోసం విద్యుత్ చట్టం, 2003లోని సెక్షన్ 176 ప్రకారం విద్యుత్ (వినియోగదారుల హక్కులు) రూల్స్, 2020లో సవరణలు చేసింది. కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ కొత్త నిబంధన ప్రకారం.. మహా నగరాల్లో(మెట్రోపాలిటన్) నివసించే వారు మూడు రోజుల నుంచి గరిష్టంగా ఏడు రోజుల్లోనే విద్యుత్ కనెక్షన్లు పొందొచ్చు. మున్సిపల్ పట్టణ ప్రాంతాల్లో 15 రోజుల నుంచి ఏడు రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజుల నుంచి 15 రోజులకు గడువు తగ్గిస్తూ మార్పులు చేశారు. ఇక కొండ ప్రాంతాలున్న గ్రామీణ ప్రాంతాలు కొత్త కనెక్షన్లు గానీ, ఇప్పటికే ఉన్న కనెక్షన్లలో మార్పులుగానీ చేసుకోవడానికి కనీస వ్యవధి 30 రోజులుగా నిర్ణయించారు. తాజా నిబంధనల మేరకు ఎలక్ట్రిక్ వాహనాలకు(ఈవీ) ఇంటి వద్దే చార్జింగ్ పెట్టుకోవడానికి ప్రత్యేక విద్యుత్ కనెక్షన్ పొందొచ్చు. పీఎం సూర్య ఘర్ పథకంలో భాగంగా ఏడాదిలో కోటి గృహాలకు రూఫ్‌టాప్ సోలార్‌ను ఏర్పాటు చేస్తామని, ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని కేంద్రం ఇటీవల ప్రకటించింది. దీనికి తోడ్పాటుగా భవనాలపై రూఫ్‌టాప్ సోలార్ పీవీ సిస్టంల ఏర్పాటుకు డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీ కాల పరిమితినీ 30 నుంచి 15 రోజులకు తగ్గించారు. నాణ్యమైన సేవలు.. వినియోగదారుల హక్కు కనెక్షన్ కోసం దరఖాస్తు చేసిన వారికి విద్యుత్ సరఫరా చేయడం ప్రతి డిస్కం ప్రాథమిక విధిగా కొత్త నిబంధనలో స్పష్టం చేశారు. అలాగే డిస్కంల నుంచి నాణ్యమైన సేవలను పొందడం వినియోగదారుల హక్కుగా నిబంధనల్లో పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులొస్తే ఫిర్యాదు అందిన తేదీ నుంచి ఐదు రోజుల్లోపు అదనపు మీటర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్రం ఇచ్చిన నిబంధనల్లో స్పష్టం చేశారు. కో–ఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ సొసైటీలు, బహుళ అంతస్థుల భవనాలు, కాలనీల్లో నివసిస్తున్న వారు విద్యుత్ పంపిణీ సంస్థ నుంచి వ్యక్తిగత విద్యుత్ సర్విసులు పొందొచ్చు.. లేదా మొత్తం ప్రాంగణానికి సింగిల్ పాయింట్ కనెక్షన్ తీసుకోవచ్చు. అయితే మీటర్ లేకుండా కనెక్షన్ ఇవ్వకూడదని షరతు విధించారు. సాధ్యమైనంత వరకూ స్మార్ట్ ప్రీ పెయిడ్ మీటర్లు పెట్టాలని, బిల్లులు ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ముందుగా కూడా చెల్లించొచ్చని పేర్కొన్నారు. -
3 రోజుల్లో కొత్త కరెంట్ కనెక్షన్
సాక్షి, హైదరాబాద్: మెట్రోపాలి టన్ నగరాల్లో వినియోగదారులు అవసరమైన పత్రాలన్నీ పొందుపరిచి, కొత్త కరెంట్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే మూడు రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వా లని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే పాత కనెక్షన్లో మార్పుల విషయంలో కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఎలక్ట్రిసిటీ(వినియోగదారుల హక్కులు) రూల్స్–2020ని సవరిస్తూ రూల్స్–2024ను శుక్రవారం జారీ చేసింది. అదేవిధంగా మున్సిపల్ ప్రాంతాల్లో వారంరోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లోగా కనెక్షన్ జారీ చేయాలని నిర్దేశించింది. రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల్లోని కొండ ప్రదేశాల్లో అయితే 30 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని స్పష్టం చేసింది. పంపిణీ వ్యవస్థల విస్తరణ, కొత్త సబ్‌స్టేషన్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటే.. 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకొని, విద్యుత్ సరఫరా చేయాలని నిర్దేశించింది. ఇక గ్రూప్ హౌసింగ్ సొసైటీ కింద అన్ని ఇళ్లకు అవకాశం ఉంటే.. సింగిల్ పాయింట్ కనెక్షన్ (ఒకే కనెక్షన్) ఇవ్వాలని పేర్కొంది. సొసైటీలో 50 శాతం దాకా యాజమానులు వ్యక్తిగత కనెక్షన్ కోరితే.. వారందరికీ వ్యక్తిగత కనెక్షన్ ఇవ్వాలని స్పష్టం చేసింది. సింగిల్ పాయింట్ కనెక్షన్ టారిఫ్ కూడా సగటు గృహ కనెక్షన్ టారిఫ్‌ను దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది. సొసైటీల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కోసం ప్రత్యేకంగా కనెక్షన్ కావాలంటే జారీ చేయాలని నిర్దేశించింది. మీటర్లలో లోపాలు లేదా దెబ్బతినడం.. కాలిపోవడం వంటి అంశాలపై దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోపు కొత్త మీటర్ బిగించాలని, మీటర్ రీడింగ్‌లో లోపాలు ఉన్నట్లు గుర్తించి ఫిర్యాదు చేస్తే కొత్త మీటర్‌ను ఐదురోజుల్లోగా బిగించడమే కాకుండా తప్పుడు బిల్లింగ్‌పై ఫిర్యాదును మూడు నెలల్లోపు పరిష్కరించాలని పేర్కొంది. సోలార్ విద్యుత్ కోసం పెట్టుకున్న దరఖాస్తును పరిశీలించి, సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదికను 15 రోజుల్లోగా అందించాలన్నారు. 10 కిలోవాట్ల దాకా రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ కోసం వచి్చన దరఖాస్తును సాంకేతిక సాధ్యాసాధ్యాల నివేదిక అవసరం లేకుండా అనుమతించాలని ఆదేశించింది. రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థ బిగించిన తర్వాత సరి్టఫికెట్‌ను వినియోగదారుడు దాఖలు చేస్తే కనెక్షన్ అగ్రిమెంట్, కొత్త మీటర్‌ను 15 రోజుల్లోగా అందించాలని స్పష్టం చేసింది. -
చకచకా కరెంటు.. కుళాయి
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిర్మిస్తున్న పేదల ఇళ్లకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా విద్యుత్, కుళాయి కనెక్షన్లను ఇస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రాష్ట్రంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహయోగం కల్పించేందుకు 30.75లక్షల మంది మహిళల పేరిట విలువైన ఇంటి స్థలాలను ఉచితంగా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా 21.75 లక్షల (19.13 లక్షల సాధారణ, 2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గత నెల 12వ తేదీ నాటికి 7.42 లక్షల (5.85 లక్షల సాధారణ, 1.57 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు నిర్మిస్తున్న 17వేల కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఏకంగా రూ.32 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. 6,655 కాలనీల్లో విద్యుత్ పనులు పూర్తి పేదల ఇళ్ల నిర్మాణాలు కొనసాగుతున్న 9,414 వైఎస్సార్–జగనన్న కాలనీల్లో విద్యుత్ ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు 6,655 కాలనీల్లో విద్యుత్ స్తంభాలు నాటడం, వైర్లు లాగడం, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు పూర్తయింది. ఇక నిర్మాణం పూర్తయినవాటిలో 5,02,654 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు కనెక్షన్లు ఇస్తున్నారు. అదే విధంగా నిర్మాణం పూర్తయిన ఇళ్లన్నింటికీ తాగునీటి సదుపాయం కల్పించారు. 1.15 లక్షల ఇళ్లకు ఇంకుడు గుంతలు కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలైన డ్రెయిన్లు, రోడ్లు, సైడ్ కాలువలు నిర్మించాలంటే ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తికావాల్సి ఉంది. అలా కాకుండా ముందుగానే సదుపాయాలు కల్పిస్తే ఇళ్ల నిర్మాణ సమయంలో భారీ వాహనాల రాకపోకలు, ఇతర సందర్భాల్లో డ్రెయిన్లు, కాలువలు ధ్వంసమవుతాయి. అందువల్ల ప్రస్తుతం నిర్మాణం పూర్తయిన ఇళ్లకు తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 1,15,973 ఇళ్లకు ఇంకుడు గుంతలను నిర్మించారు. అదేవిధంగా వైఎస్సార్, జగనన్న కాలనీలకు స్వాగత ఆర్చ్‌లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 2,394 కాలనీలకు ఆర్చ్ నిర్మాణ పనులకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం 510 చోట్ల పనులను ప్రారంభించగా, 28 చోట్ల ఆర్చ్‌ల నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. మరోవైపు నిర్మించిన ఇళ్లు అన్నింటికీ విద్యుత్, నీటి ఇంకుడు గుంతల ఏర్పాటు చేశారా.. లేదా.. అని ఆడిట్ నిర్వహించాలని ఇటీవల గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. -
‘బోరు’మంటున్న సాగర్ ఆయకట్టు
నల్లగొండ జిల్లా త్రిపురారం గ్రామంలో నాగిరెడ్డికి 18 ఎకరాలు ఉంది. నాగార్జున సాగర్ నీటిపై ఆశలు సన్న గిల్లడంతో ఒక్కొక్కటిగా 8 బోర్లు వేయించారు. రూ.3 లక్షలు ఖర్చు చేశారు. ఎడమ కాలువ ద్వారా నీరు వస్తే బోర్లు వేయకుండా సాగు చేసుకునే వాడినని, అదనపు ఖర్చుతో సాగు చేయాల్సి వస్తోందని నిట్టూరుస్తున్నాడు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం వేపలమాధారం గ్రామానికి చెందిన రైతు మర్ల మల్లయ్య. తనకున్న రెండెకరాల పొలంలో బోరు ఉండటంతో వరి వేశారు. ఇటీవల బోరు ఎండిపోయింది. సాగర్ కాలువలో నీరు లేదు. పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ ఆరు చోట్ల బోరు వేయించారు. అయినా చుక్క నీరు పడలేదు. బోర్లు వేయించేందుకు రూ. 1.80 లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో వాన నీటి కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. ► నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులో కరువు ఛాయలు అలముకున్నాయి. ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజీకి దగ్గరలో ఉండటంతో నీటి విడుదల లేదు. కాలువల ద్వారా నీరు రాకపోవడంతో చాలా వరకు భూమినే సాగు చేయకపోగా, జూన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షాలకు కొన్ని చోట్ల సాగు చేసిన వరి పొలాలు ఇప్పుడు ఎండిపోతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున బోర్లు వేస్తున్నారు. ఈ మూడు నెలల్లో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల్లో వేల సంఖ్యలో బోర్లు వేశారు. మరికొంత మంది ఏళ్లతరబడి వాడకుండా వదిలేసిన పాత బావుల్లో పూడిక తీయిస్తున్నారు. పంటలను కాపాడుకునేందుకు సాగునీటి కోసం జిల్లా రైతులు భగీరథ ప్రయత్నం చేయాల్సి వస్తోంది. 20 ఏళ్ల నాటి పరిస్థితులు పునరావృతం? సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు పరిధిలో 2001లో తీవ్ర కరువు నెలకొంది. ప్రాజెక్టులో నీళ్లు లేకపోవడంతో ఎడమ కాలువకు నీటిని విడుదల చేయలేదు. ఆ సమయంలో ఆయకట్టు ప్రాంతంలోని రైతులు అనేక బావులను తవ్వించారు. బోర్లను వేశారు. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టులో నీరు డెడ్‌స్టోరేజ్‌కి దగ్గరగా ఉంది. నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా ప్రస్తుతం 524 అడుగుల నీరుంది. దానిని సాగునీటికి ఇచ్చే పరిస్థితి లేదు. పైనుంచి చుక్క నీరు రావడం లేదు. ఇప్పట్లో కాలువలకు నీటిని వదిలే పరిస్థితి లేదు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సాగర్ ఆయకట్టు కింద 3,81,022 ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉన్నా, లక్షన్నర ఎకరాలే సాగైంది. ప్రస్తుతం వాటిని కాపాడుకునేందుకు రైతులు బావులు, బోర్లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాత కనెక్షన్లు.. కొత్త బోర్లు నల్లగొండ జిల్లాలోని త్రిపురారం, నిడమనూరు, పెద్దవూర, తిరుమలగిరి(సాగర్), అనుముల, మిర్యాలగూడ, మాడ్గులపల్లి, వేములపల్లి, గరిడేపల్లి, హుజూర్నగర్, చిలుకూరు, కోదాడ, అనంతగిరి మండలాల్లో రైతులు పాత బావుల పూడిక తీయిస్తుండగా మరికొందరు, పాత బోర్లను బాగు చేసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ఇంకొంతమంది కొత్తగా బోర్లు వేస్తున్నారు. వాటితోపాటు కొత్తగా విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటూ బోర్లు వేయిస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో 5 వేలకు పైగా బోర్లు వేయించినట్లు అంచనా. ఒక్కో బోరు వేయించేందుకు, విద్యుత్తు కనెక్షన్ తీసుకునేందుకు రూ. 60 వేల నుంచి రూ. లక్ష వరకు అదనంగా వెచ్చిస్తున్నారు. ఈ కనెక్షన్లన్నీ బోర్ల కోసమే! ► పంటలను కాపాడుకునేందుకు బోర్లను వేయిస్తున్న రైతులు అధిక సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు తీసుకుంటున్నారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఈ ఏడాది 8131 మంది రైతులు కొత్తగా విద్యుత్తు కనెక్షన్లకు దరఖాస్తు చేశారు. నల్లగొండ డివిజన్లో ఏప్రిల్ నుంచి ఆగస్టు నెలాఖరు వరకే 1737 మంది రైతులు కొత్తగా కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోగా, విద్యుత్ శాఖ 1556 మందికి కనెక్షన్లు జారీ చేసింది. దేవరకొండ డివిజన్లో 1003 మంది దరఖాస్తు చేసుకుంటే 725 మందికి కనెక్షన్లు ఇచ్చింది. మిర్యాలగూడ డివిజన్లో 1533 మంది దరఖాస్తు చేసుకుంటే 1101 మందికి, సూర్యాపేట డివిజన్లో ఈ ఏడాది కొత్త విద్యుత్తు కనెక్షన్ల కోసం 1974 దరఖాస్తులు రాగా, 1502 జారీ చేశారు. హుజూర్నగర్ డివిజన్లో 1884 దరఖాస్తులు రాగా, 1817 కనెక్షన్లు ఇచ్చారు. -
స్మార్ట్ మీటర్లతో రైతు సాధికారత
సాక్షి, అమరావతి: ఉచిత విద్యుత్ వాడుకునే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల వల్ల రైతులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందని, వారి సాధికారతకు దోహద పడుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వ ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నంబర్ 22, తేదీ: 01 – 09 – 2020) ప్రకారం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడంతోపాటు విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపు, పారదర్శకత కోసమే స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లపై ‘సాక్షి’ ప్రతినిధికి విజయానంద్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ♦ ప్రస్తుతం రాష్ట్రంలో సరఫరా అయ్యే మొత్తం విద్యుత్‌లో 18 నుంచి 20 శాతం వ్యవసాయ రంగం వినియోగించుకుంటోంది. ఈ విద్యుత్‌ను లెక్కించడం కష్టమవుతోంది. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు మెరుగుదలకు, ఉచిత విద్యుత్ పథకం ద్వారా ఎంత వినియోగం జరుగుతోందో తెలుసుకోవడానికి, నగదు బదిలీ కింద ప్రతి నెలా సబ్సిడీ రూపంలో ఎంత చెల్లించాలనే లెక్కకు వ్యవసాయ సర్విసులకు స్మార్ట్ మీటర్లు బిగించాలి. ♦ స్మార్ట్ మీటర్లు బిగించడానికయ్యే ఖర్చు మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. విద్యుత్ సంస్థలపైగానీ, రైతులపైగానీ ఒక్క రూపాయి భారం పడదు. ప్రతి నెలా వ్యవసాయ విద్యుత్ వినియోగదారుడు కూడా అందరిలాగే విద్యుత్ బిల్లు చెల్లించే వెసులుబాటు ఉండడంతో రైతుకు నాణ్యమైన, నమ్మకమైన అంతరాయాలు లేని విద్యుత్‌ను డిమాండ్ చేసే హక్కు లభిస్తుంది. డిస్కంలకు జవాబుదారీతనం పెరుగుతుంది. ఇది రైతు సాధికారతకు దోహద పడుతుంది. ♦ కేంద్ర ప్రభుత్వ అధీనంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ కఠిన నిబంధనలను అనుసరించి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నాం. స్మార్ట్ మీటర్ ధరను కేంద్రం ప్రాథమికంగా రూ.6 వేలుగా అంచనా వేసింది. అనుబంధ పరికరాలను అందులో కలపలేదు. స్మార్ట్ మీటరు సక్రమంగా పనిచేయడానికి సాంకేతికంగా అనుబంధ పరికరాలు అవసరం. ♦ స్మార్ట్ మీటర్లతో పాటు అనుబంధ పరికరాలైన పీవీసీ వైరు, ఎంసీబీ, కెపాసిటర్, ఎర్త్ వైరు, ఎర్త్ పైపు, మీటరు బాక్సులను ఏర్పాటు చేస్తారు. మోటార్లను బాగా నడపడంలో, వోల్టేజి సమస్య రాకుండా చూడటంలో కెపాసిటర్లది కీలక పాత్ర. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు సరైన ఎర్తింగ్ ఉండాలి. ఎంసీబీ ద్వారా ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ జరుగుతుంది. తద్వారా ట్రాన్స్ఫార్మర్ వైఫల్యాలను తగ్గించడంతోపాటు విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు. ♦ స్మార్ట్ మీటర్ల ధర, అనుబంధ పరికరాల ధర వేర్వేరు. ఒక్కో వ్యవసాయ విద్యుత్ సర్విసుకు అనుబంధ పరికరాలకు రూ.12128.71, పన్నులతో కలిపి రూ.14,455ల ఖర్చవుతుంది. దీనిలో దాదాపు 60 శాతం కేంద్రం నుంచి గ్రాంటుగా పొందడానికి ప్రయతి్నస్తున్నాం. ♦ స్మార్ట్ మీటర్లు అమర్చడం వల్ల డిస్కంలకు ప్రయోజనం ఏమీ లేదని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారని జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదు. ఈ ప్రాజెక్టును మరింత పకడ్బందీగా, పారదర్శకంగా అమలు చేయడం కోసం సూచనలు చేశాం. ♦ మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల అంశాన్ని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. అనుబంధ పరికరాలు లేకుండా ఉత్తరప్రదేశ్ మినహా ఇతర ఏ రాష్ట్రాల్లోనూ వ్యవసాయ విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడంలేదు. ♦ ఆర్డీఎస్ఎస్ పథకంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌లో గృహ విద్యుత్ సర్విసులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అదే తరహాలో ఏపీలోనూ గృహాలకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టెండర్లు పిలిచాం. - ‘సాక్షి’తో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ -
విద్యుత్ కనెక్షన్ల మంజూరులో ఏపీ నెం.1
-
అట్టడుగు వర్గాలకు సాయంలో.. 'ఏపీ అద్వితీయం'
సాక్షి, అమరావతి: ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రం అమలుచేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఏపీ అమలు చేసినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. 2022–23 మూడో త్రైమాసికం వరకు(ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ పథకాల అమలు పురోగతిపై నివేదికను ఆ శాఖ శనివారం విడుదల చేసింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఆ కుటుంబాలకు సాయం అందించడం, రైతుల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, పట్టణ పేదలకు సాయం అందించడంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘చాలామంచి’ పనితీరు కనబరించిందని ఆ నివేదిక కితాబిచ్చింది. లక్ష్యాల్లో 90 శాతానికి పైగా అమలుచేసిన రాష్ట్రాలను చాలామంచి పనితీరు కనబరిచినట్లు, 80–90 శాతం మేర అమలుచేసిన రాష్ట్రాలు ‘మంచి పనితీరు’ కనబరిచినట్లు.. అలాగే 80 శాతం లోపల అమలుచేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేని రాష్ట్రాలుగా నివేదిక వర్గీకరించింది. ఏపీలో 33.57 లక్షల కుటుంబాలకు సాయం.. ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 34,68,986 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే.. అందులో ఒక్క ఏపీలోనే ఏకంగా 33,57,052 కుటుంబాలకు సహాయం అందించారు. అలాగే, గతంలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా 29,10,944 కుటుంబాలకు సాయం అందించగా.. అదే ఇప్పుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్య 33,57,052కు పెరిగింది. అంటే.. మూడునెలల వ్యవధిలో అదనంగా 4,46,108 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించింది. మిగతా మరే ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం చేయలేదని నివేదిక స్పష్టంచేసింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే 22,884 కుటుంబాలకు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా సాయం అందించగా మిగతా రాష్ట్రాలు అంతకన్నా తక్కువగా వేల, వందల సంఖ్యలోనే సహాయం అందించాయి. పట్టణ పేదలకు సాయంలో కూడా.. అలాగే, గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణాల్లోని 5,98,194 పట్టణ పేద కుటుంబాలకు సాయం అందించగా అందులో ఒక్క ఏపీలోనే 5,05,962 పేద కుటుంబాలకు సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. ఇదే గతంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలోని 3.47 లక్షల మందికి సాయం అందించినట్లు పేర్కొనగా ఇప్పుడు డిసెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో ఆ సంఖ్య 5,05,962కు పెరిగినట్లు పేర్కొంది. అంటే మూడు నెలల వ్యవధిలో పట్టణాల్లోని 1.58 లక్షల పేద కుటుంబాలకు అదనంగా సాయం అందించినట్లు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు సాయం అందించడంలోనూ ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ‘వ్యవసాయ’ విద్యుత్ కనెక్షన్లలోనూ అగ్రగామి.. అంతేకాక.. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ ‘చాలామంచి’ పనితీరు కనబరిచినట్లు నివేదిక తెలిపింది. 2022–23లో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా మూడో త్రైమాసికం నాటికి (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) లక్ష్యానికి మించి 98,447 వ్యవసాయ పంపు సెట్లకు ఏపీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదిక తెలిపింది. మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయలేదు. ఉపాధి హామీ కింద రాష్ట్రంలో గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 1,78,182 మందికి కొత్తగా జాబ్‌కార్డులను మంజూరు చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, ఆ సమయంలో కూలీలకు వేతనాల రూపంలో రూ.3,898.20 కోట్లు చెల్లించినట్లు నివేదిక వెల్లడించింది. ఏపీలోని 55,607 అంగన్వాడీలతో పాటు 257 ఐసీడీఎస్‌లు నూటికి నూరు శాతం పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టంచేసింది. -
Fact Check: సత్వరమే కొత్త వ్యవసాయ కనెక్షన్లు
సాక్షి, అమరావతి: ఇది రైతు ప్రభుత్వం.. రైతే రాజనే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు రైతుల సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తున్నాయి. అయితే దీన్ని తట్టుకోలేని పచ్చ పత్రిక ఈనాడు కట్టుకథ అల్లింది. వైఎస్సార్సీపీ 2019లో అధికారంలోకి రాగానే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై పరిమితిని ఎత్తివేసింది. ఈ నిజాన్ని దాని పెట్టి ‘కొత్త కనెక్షన్లు గగనమే’ శీర్షికతో ఈనాడు దినపత్రిక బుధవారం తప్పుడు వార్తను ప్రచురించింది. ఈ వార్తలో వాస్తవం లేదని ఆంధ్రప్రదేశ్ మద్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీ ఎల్) సీఎండీ జె.పద్మజనార్దనరెడ్డి స్పష్టం చేశారు. సీఎండీ వెల్లడించిన వాస్తవాలిలా ఉన్నాయి.. ఆరోపణ: మైలవరం పంచాయతీకి చెందిన రైతు వెంకటరెడ్డి తన చేనుకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం మూడేళ్ల క్రితం ఒకసారి, ఆరేడు నెలల క్రితం మరోసారి దరఖాస్తు చేశాడు. అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తామన్నా చేయలేదు. ఆరు నెలలుగా ఆన్లైన్ సేవలను నిలిపివేశారు. వాస్తవం: ప్రతిపాదనలు రూపొందించడంలో జాప్యం వల్ల విద్యుత్ సర్వీసు మంజూరు కాలేదన్నది పచ్చి అబద్ధం. ప్రాధాన్యతా క్రమంలో అంచనా వ్యయాన్ని రూపొందిస్తున్నారు. ఆన్లైన్లో నమోదు ప్రక్రియను కొద్ది రోజులు నిలిపేయడం సర్వసాధారణం. నిజానికి ఫిబ్రవరి వరకూ అంచనా వ్యయం చెల్లించిన వాటన్నిటికీ విద్యుత్ సర్వీసులు మంజూరు చేశారు. మరో వారంలో కొత్తగా ఆన్లైన్ నమోదు మళ్లీ మొదలవుతుంది. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ. ఆరోపణ: దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ లైను, ట్రాన్స్ఫార్మర్లు యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు గతేడాది ప్రకటించారు. చాలావరకు గత అర్జీలను పరిష్కరించి అంతకుముందు వరకూ ఆమోదంలో ఉన్న వారికి సర్వీసులు మంజూరు చేశారు. కొత్తగా దరఖాస్తులు పెట్టుకోవచ్చని పేర్కొన్నా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. వాస్తవం: చెప్పినట్లుగానే దరఖాస్తుదారులకు సర్వీసులు మంజూరు చేశారని ఈనాడే రాసింది. 2019 వరకు ప్రతి జిల్లాలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు పరిమితికి మించి మంజూరు చేసుకునే అవకాశం ఉండేది కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ పరిమితిని సవరించి దరఖాస్తుదారులందరికీ సత్వరమే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయాలని ఆదేశించింది. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని తదనుగుణంగా అంచనా వ్యయం చెల్లించే అవకాశం ఉంది. విద్యుత్ నియంత్రికలు, స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసి ఎప్పటి కనెక్షన్లను అప్పుడే మంజూరు చేసి విద్యుత్ సరఫరా అందిస్తున్నారు. ఆరోపణ: ఏడాది వయసున్న మామిడి మొక్కలను కాపాడుకోవడానికి మోటారు తప్పనిసరి కావడంతో ప్రభుత్వ దయాదాక్షిణ్యాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇది ఆ ఒక్క రైతు పరిస్థితే కాదు. జిల్లావ్యాప్తంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాది కర్షకుల దుస్థితి. వాస్తవం: ఏపీసీపీడీసీఎల్ 2019లో ఏర్పాటై నప్పటికీ.. 2014 నుంచి ఇప్పటివరకు అంచనా వ్యయం చెల్లించినవారందరికీ పరిమితి లేకుండా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసింది. ఇలా పెండింగ్‌లో ఉన్న 84,085 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను ఇచ్చింది. కనెక్షన్లకు సంబంధించి విద్యుత్ స్తంభాలు, వైర్లు, విద్యుత్ నియంత్రికలను కూడా ఏర్పాటు చేసి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు పగటిపూటే తొమ్మిది గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది. దీనికి అనుగుణంగా వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు హై ఓల్టేజ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం (హెచ్‌వీడీఎస్) పథకం కింద 16 కేవీఏ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో 25 కేవీఏ సామర్థ్యం గల కొత్త ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది. 101 కొత్త 33/11 కేవీఏ సబ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా వ్యవసాయ విద్యుత్ వినియోగదా రులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయడంతో వ్యవసాయ మోటార్లు కాలిపోవడం, రైతులు విద్యుత్ ప్రమాదాల బారిన పడటం వంటివి తగ్గిపోయాయి. -
10,783 కనెక్షన్లకు ‘జీరో’ బిల్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను కొందరు అధికారులు, సిబ్బంది మరింతగా ముంచుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో ఏకంగా 10,783 విద్యుత్ కనెక్షన్లకు జీరో యూనిట్ల వినియోగంతో బిల్లులు జారీ చేస్తున్నట్లు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో సంస్థ ప్రతి నెలా రూ. లక్షల్లో ఆదాయాన్ని నష్టపోయినట్లు వెల్లడైంది. అయితే ఆయా బిల్లుల వాస్తవ మొత్తాలను వినియోగదారుల నుంచి కొందరు అధికారులు, సిబ్బంది వసూలు చేసుకొని జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు జి.సత్యనారాయణ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు ఒక మీటర్, ఆ మీటర్‌కు ఒక విశిష్ట సంఖ్య ఉంటుంది. కానీ ఒకే మీటర్ నంబర్‌తో 10,783 సర్విసు కనెక్షన్లు ఉన్నట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. 2,788 కనెక్షన్లపైనే విచారణ.. ఈఆర్సీ సూచనలతో టీఎస్ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించింది. 10,783 సర్వీసు కనెక్షన్లలో 2,788 కనెక్షన్లను మాత్రమే విజిలెన్స్ విభాగం తనఖీ చేయగలిగింది. సిబ్బంది కొరతతో మిగిలిన కనెక్షన్లను తనిఖీ చేయలేకపోయింది. తనఖీ చేసిన 2,788 కనెక్షన్లలో కేవలం 687 కనెక్షన్లకే మీటర్లున్నాయని, మిగిలిన 2101 కనెక్షన్లకు మీటర్లు లేవని గుర్తించింది. తనిఖీ చేసిన కనెక్షన్లకు సంబంధించి తప్పుడు మీటర్ రీడింగ్‌ను నమోదు చేసి బిల్లులు జారీ చేయడంతో సంస్థ రూ. 9.32 లక్షల ఆదాయాన్ని నష్టపోయినట్టు నిర్ధారించింది. 10,783 కనెక్షన్లలో ఏకంగా 4,842 కనెక్షన్లకు మీటర్లే లేవని నాగర్‌కర్నూల్ డీఈ మరో నివేదికలో టీఎస్ఎస్పీడీసీఎల్కు తెలియజేశారు. ఒక్క నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలోనే ఈ పరిస్థితి బయటపడగా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా అవకతవకతలతో డిస్కంలు రూ. వందల కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోతున్నాయని ఆరోపణలున్నాయి. 41 మందిపై చర్యలకు ఆదేశం.. నాగర్‌కర్నూల్ డివిజన్లో వెలుగు చూసిన భారీ అక్రమాల్లో స్థానికంగా పనిచేసే 41 మంది ఓఅండ్ఎం విభాగం అధికారులు, సిబ్బంది, మరో ముగ్గురు అకౌంట్స్ విభాగం అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా 14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, మరొక డీఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశించారు. వారి బాధ్యతారాహిత్యం, విధుల్లో నిర్లక్ష్యంతోనే మీటర్ రీడర్లు అక్రమాలకు పాల్పడ్డారని, వారితోపాటు ప్రైవేటు మీటర్ రీడింగ్ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరినీ సస్పెండ్ చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. -
స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్లకి ఆ గ్రామానికి ‘కరెంట్’ కనెక్షన్
శ్రీనగర్: భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ల పూర్తవుతున్నా ఇంకా చాలా గ్రామాలు కనీస సౌకర్యాలకు ఆమడ దూరంలోనే ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మారుమూల ప్రాంతాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే కోవకు చెందుతుంది జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా డూరు బ్లాక్ పరిధిలోని టెథాన్ గ్రామం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పథకంలో భాగంగా ఆ ఊరికి విద్యుత్తు సరఫరా ఏర్పాటు చేశారు అధికారులు. అనంతనాగ్ నగరానికి 45 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి 75 ఏళ్ల తర్వాత కరెంట్ సరఫరా జరుగుతోంది. అనంతనాగ్ కొండ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామం టెథాన్‌లో సుమారు 200 మంది ప్రజలు నివసిస్తున్నారు. మారుమూల ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీఎం డెవలప్మెంట్ ప్యాకేజీ స్కీమ్‌లో విద్యుత్తు సరఫరాను అందించారు అధికారులు. గ్రామంలో 75 ఏళ్ల తర్వాత తొలి విద్యుత్తు దీపం వెలిగింది. తమ ఇళ్లల్లో విద్యుత్తు కాంతులు చూసి అక్కడి ప్రజలు మురిసిపోతున్నారు. ఇప్పటి వరకు తమ అవసరాల కోసం సాంప్రదాయ కలప, దీపాలను వాడేవారు. ‘ఈరోజు తొలిసారి విద్యుత్తు కాంతులను చూస్తున్నాం. ఇకపై మా పిల్లలు విద్యుత్తు దీపాల కింద చదువుకుంటారు. వారు చాలా సంతోషంగా ఉంటారు. కరెంట్ లేకపోవడంతో చాలా కష్టాలు పడ్డాము. ఇప్పటి వరకు మా అవసరాల కోసం సంప్రదాయ కలపను ఉపయోగించాం. ఇప్పుడు మా సమస్యలకు ఓ పరిష్కారం లభించింది. ప్రభుత్వానికి, విద్యుత్తు విభాగానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.’ అని ఫాజుల్ ఉదిన్ ఖాన్ అనే గ్రామస్థుడు సంతోషం వ్యక్తం చేశారు. గ్రామంలో విద్యుత్తు కాంతులను చూసి నృత్యాలు చేస్తున్నారని చెప్పారు. ఇదీ చదవండి: ‘కశ్మీర్లో భాగం కావడమే మంచిది’.. విలీనానికే లద్దాఖ్ నేతల మొగ్గు! -
విద్యుత్ శాఖకు వరద నష్టం రూ.1.53 కోట్లు
సాక్షి, అమరావతి: గోదావరి వరద ప్రభావానికి గురైన అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, జిల్లాల్లో విద్యుత్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావడానికి ఏపీ ఈపీడీసీఎల్ చేపట్టిన పునరుద్ధరణ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆ జిల్లాల్లోని 12 మండలాల పరిధిలో 415 గ్రామాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్లు, 250 కిలోమీటర్ల మేర 33 కేవీ లైన్లు, 11 కేవీ ఫీడర్లు 46, 4,022 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 5,453 వ్యవసాయ, 71,443 వ్యవసాయేతర సర్వీసులపై వరద ప్రభావం పడింది. ఈ కారణంగా డిస్కంకు ఏర్పడిన నష్టం ఇప్పటివరకు రూ.1.53 కోట్లుగా అంచనా వేశారు. కష్టంగా మారిన పునరుద్ధరణ గడచిన మూడు రోజుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో 35,936 కంటే ఎక్కువ గృహ కనెక్షన్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. పూర్తిగా నీట మునిగిన చింతూరు, వీఆర్ పురం, కూనవరం, ఏఎస్ఆర్ జిల్లాలోని ఎటపాక, ఏలూరు జిల్లాలోని కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో దాదాపు 35,507 గృహ సర్వీసులకు నేటికీ విద్యుత్ ఇచ్చే అవకాశం లభించడం లేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ను పునరుద్ధరించడానికి ప్రతి డివిజన్‌కు ఏపీ ఈపీడీసీఎల్ 24 గంటలూ అందుబాటులో ఉండేలా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఐదు జిల్లాల్లో దెబ్బతిన్న 33 కేవీ ఫీడర్లన్నిటినీ తిరిగి ప్రారంభించారు. వరద ప్రభావిత గ్రామాల్లో నీరు తగ్గిన 24 గంటల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అన్ని సమయాల్లో అధికారులు, సిబ్బందిని సిద్ధం చేయడంతో పాటు, పనుల అమలుకు అవసరమైన మనుషులు, సామగ్రిని అందుబాటులో ఉంచారు. రంపచోడవరం, జంగారెడ్డిగూడెం డివిజన్లలో ముంపు ఎక్కువగా ఉన్న చోట్ల మినహా నీటిమట్టం తగ్గిన అన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పూర్తయింది. బోట్లపై వెళ్లి పోల్ టు పోల్ సర్వే, లైన్ క్లియరింగ్ నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల లైన్లు దాదాపు 12 అడుగుల మేర నీటిలో మునిగిపోయాయి. వాటిపై చెట్ల కొమ్మలు, చెత్త, బురద మేట వేయడంతో పునరుద్ధరణ కష్టంగా మారింది. 800 మందికి పైగా సిబ్బంది 65 బ్యాచ్‌లుగా పగలు రాత్రి అనే తేడా లేకుండా వాటిని తొలగించే పని చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయండి వీలైనంత త్వరగా విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తిచేయాలని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఏపీ ఈపీడీసీఎల్‌కు ఆదేశాలిచ్చారు. డిస్కమ్ సీఎండీ కె.సంతోషరావు, ఇతర అధికారులతో విజయానంద్ బుధవారం సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రత తగ్గడంతో నీటిమట్టం తగ్గుముఖం పట్టిందని, వీలైనంత త్వరగా విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ వివరించారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించడానికి ఆపరేషన్ వింగ్ ఇంజనీర్లతో పాటు ఇతర విభాగాల నుండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను, స్థానిక అధికారులను పంపించాలని డిస్కమ్‌లను విజయానంద్ ఆదేశించారు. సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ బీ శ్రీధర్, డిస్కమ్‌ల సీఎండీలు జె.పద్మా జనార్దనరెడ్డి, హెచ్.హరనాథరావు పాల్గొన్నారు. ఇదీ చదవండి: శాంతించిన గోదావరి -
Telangana Electricity Bill: ఒక్క రోజు ఆలస్యమైనా కనెక్షన్ కట్!
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ బిల్లు చెల్లింపులో ఒక్క రోజు ఆలస్యమైనా ఎడాపెడా విద్యుత్ కనెక్షన్‌ను కట్ చేస్తున్నారు. విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఎడాపెడా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారు. వ్యక్తిగత, వృత్తిపర జీవితాల్లో బిజీగా ఉండడం, ఇంకా సమయముంది కదా.. తర్వాత చెల్లిద్దామనుకుని మరిచిపోవడం వంటి కారణాలతో చాలామంది వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించకలేకపోతున్నారు. ఇంతకుముందు నెల, రెండు నెలలు ఆలస్యమైతే క్షేత్రస్థాయిలో పనిచేసే లైన్మెన్, ఇతర సిబ్బంది ఇళ్ల వద్దకు వచ్చి బిల్లు కట్టమని గుర్తు చేసేవారు. గత రెండు మూడు నెలలుగా ఒక్కరోజు ఆలస్యమైనా కరెంటు కనెక్షన్లను తొలగిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. బిల్లు చెల్లిస్తాం.. గంటసేపు ఆగమని కోరినా ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈఆర్సీ మార్గదర్శకాల వక్రీకరణ గడువులోగా బిల్లు చెల్లింపులో విఫలమైతే ఏడు రోజుల గడువుతో నోటీసు జారీ చేసి, ఆ తర్వాత కూడా చెల్లించకపోతేనే విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని ఈఆర్సీ మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. ‘విద్యుత్ బిల్లుల చెల్లింపు, గడువులోగా బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ తొలగింపునకు మార్గదర్శకాలు’ పేరుతో ఈఆర్సీ 2002 అక్టోబర్ 16న ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కనెక్షన్ తొలగింపునకు ముందు వినియోగదారులకు ఏడు రోజుల సమయం ఇవ్వడమే నోటీసు ఉద్దేశం. ఒకవేళ బిల్లు చెల్లించినా సాంకేతిక/సిబ్బంది తప్పిదాలతో చెల్లించలేదని రికార్డుల్లో నమోదైతే సంజాయిషీ ఇచ్చుకోవడానికి వినియోగదారులకు తగిన సమయం లభిస్తుంది. అత్యవసర సేవల కింద వచ్చే విద్యుత్ సరఫరాను నిలుపుదల చేస్తే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి నోటీసు ఇవ్వకుండా కనెక్షన్ తొలగించడం సరైంది కాదని ఈ నిబంధనలను ఈఆర్సీ పెట్టింది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు మాత్రం ఈ మార్గదర్శకాలను వక్రీకరించి వినియోగదారులకు ‘బిల్ కమ్ నోటీసు’పేరుతో ప్రతి నెలా జారీ చేసే బిల్లులోనే ముందస్తుగా నోటీసును సైతం పొందుపరుస్తున్నాయి. బిల్లులోనే నోటీసు ఉందన్న విషయం సాధారణ వినియోగదారులకు అర్థం కాదు. కేవలం ఈఆర్సీ మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్టు చూపడానికే డిస్కంలు ‘బిల్ కమ్ నోటీసు’పద్ధతిని అవలంబిస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిల్లు బకాయిలు, డిస్కనెక్షన్, రీకనెక్షన్ చార్జీలను చెల్లించిన తర్వాత పట్టణాల్లో 4 గంటల్లోగా, గ్రామాల్లో 12 గంటల్లోగా సరఫరాను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే, బిల్లు కట్టిన తర్వాత సకాలంలో సరఫరాను పునరుద్ధరించడం లేదని అంటున్నారు. అయితే, కనెక్షన్ తొలగించడంపై తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదని ఓ అధికారి తెలిపారు. స్థానికంగా కొందరు సిబ్బందికి, వినియోగదారులతో ఏదైనా ఘర్షణ వాతావరణం ఎదురైతే తొందరపాటుతో ఇలాంటి చర్యలు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. బిల్లుల వసూళ్ల కోసం తీవ్ర ఒత్తిడి భారీగా విద్యుత్ చార్జీలను పెంచినా డిస్కంలు నష్టాల నుంచి బయటపడలేకపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నాలుగు నెలలుగా విద్యుత్ ఉద్యోగులకు జీతాలను ఆలస్యంగా చెల్లిస్తున్నారు. 100శాతం కనెక్షన్లకు మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేయాలని, 100శాతం బిల్లులు వసూలు చేయాలని విద్యుత్ సంస్థల యాజమాన్యాలు క్షేత్రస్థాయిలో డీఈలకు లక్ష్యాలను నిర్దేశించాయి. ప్రతి నెలా 100శాతం బిల్లులు జారీచేసినట్టు ధ్రువీకరణ పత్రం సమర్పిస్తేనే జీతాలు చెల్లిస్తామని లింకు పెట్టాయి. దీంతో ఒత్తిడి పెరగడంతో వసూళ్లను పెంచేందుకు ఎడాపెడా కనెక్షన్లను తొలగిస్తున్నారని విమర్శలున్నాయి. బిల్లు వసూళ్ల కోసం ఇళ్లకు వస్తున్న కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది వ్యవహార తీరు అవమానకరంగా ఉంటోందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఐదేళ్లయినా కరెంట్ ఇయ్యలే!
సాక్షి, హైదరాబాద్: కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం అన్నదాతలకు ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 59,689 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అందులో 905 దరఖాస్తులు ఐదేళ్లు, ఆపై కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. రైతులు రూ.5వేలు డిపాజిట్ కట్టి దరఖాస్తు చేసుకుంటే, ఒక్కో కనెక్షన్‌పై డిస్కంలు రూ.70వేల వరకు ఖర్చు చేస్తాయి. పౌర సేవల పట్టిక ప్రకారం.. క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా సానుకూలతలుంటే, దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోగా కనెక్షన్ జారీచేయాలి. కొత్త విద్యుత్ లైన్‌తోపాటు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి వస్తే, క్షేత్రస్థాయి ఏఈ ఆధ్వర్యంలో అంచనాలను రూపొందిస్తారు. ఇందులో డిస్కంల వాటా రూ.70వేలు పోగా, దరఖాస్తుదారులు తమ వాటా మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలి. ఆ తర్వాత 30 రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వాలి. రైతులు డీడీలు కట్టకపోవడంతో 7,219 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, శాఖాపరమైన కారణాలతో ఏకంగా 59,689 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధిక శాతం రైతులు డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా కనెక్షన్లు జారీ కాకపోవడం గమనార్హం. రైతులకు వేధింపులు క్షేత్రస్థాయి అధికారుల అవినీతితో కనెక్షన్ల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో.. డిస్కంలు 2016 జనవరి నుంచి ‘ఫస్ట్ ఇన్– ఫస్ట్ అవుట్ (ఫిఫో)’ అనే విధానాన్ని తెచ్చాయి. దీని ప్రకారం కస్టమర్ సర్వీస్ సెంటర్లు, మీ–సేవా కేంద్రాల ద్వారానే దరఖాస్తులు స్వీకరించి, ముందు దరఖాస్తు చేసుకున్న ముందు కనెక్షన్లు జారీ చేయాలి. గ్రామాల వారీగా సీనియారిటీ జాబితాను రూపొందించి డిస్కంల కార్యాలయాలు, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించాలి. కానీ ఎక్కడా చేయడం లేదు. పంటలను కాపాడటానికి అత్యవసరంగా విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని ప్రజాప్రతినిధులు సిఫారసు చేస్తేనే సీనియారిటీని పక్కనబెట్టాల్సి ఉంటుంది. చేతులు తడిపిన వారు, పైరవీలు చేసిన వారికే ముందు కనెక్షన్లు ఇస్తుండటంతో దరఖాస్తులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్నట్టు ఆరోపణలు న్నాయి. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది లంచాల కోసం రైతులను వేధిస్తున్నారని ఇటీవల విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణల్లో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దంపడుతోంది. డీడీలు కట్టి మూడేళ్లనా... వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిట్టకంకల్ గ్రామానికి చెందిన రావుల కిష్టయ్య, ఎం.వెంకటయ్య, ఎం.పోచయ్య అనే రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం 2019 ఏప్రిల్ 1న డీడీలు కట్టారు. అయినా ఇప్పటివరకు అతీగతీ లేదు. దీంతో తక్షణమే లైన్‌వేయాలని ఈఆర్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా చాలామంది రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ ఈఆర్సీకి లేఖలు రాశారు. విద్యుత్ మంత్రి ఇలాఖాలోనూ.. ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను విద్యుత్ సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా నల్లగొండలో 329, నాగర్‌కర్నూల్ జిల్లాలో 212, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సొంత ఇలాఖా సూర్యాపేటలో 203, గద్వాల్లో 89, యాదాద్రిలో 27, వనపర్తిలో 26, మేడ్చల్‌లో 19, మహబూబ్‌నగర్‌లో 15, సైబర్సిటీలో 10, వికా రాబాద్‌లో 6, సరూర్‌నగర్, సంగారెడ్డిలో చెరో 5, రాజేంద్రనగర్‌లో 4 పెండింగ్‌లో ఉన్నాయి. -
ఊరట: సాగు విద్యుత్‌కు మీటర్లపై కేంద్రం వెనక్కి
రాష్ట్రంలోని 25 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కింద పంటలు సాగు చేస్తున్న అన్నదాతలకు కేంద్రం నిర్ణయంతో ఊరట కలగనుంది. రైతులు మినహా ఇతర అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ నిర్దేశిత గడువుల్లోగా పూర్తయ్యేలా కేంద్రం నిరంతరం సమీక్షించనుంది. సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు బిగించాలన్న షరతులపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. ప్రత్యామ్నాయంగా వ్యవసాయ విద్యుత్ సరఫరా ఫీడర్లకు మీటర్లు ఏర్పాటు చేయాలని స్పష్టతనిచ్చింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మారుమూల ప్రాంతాల్లో ఉండటంతోపాటు వాటి స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వ్యవసాయ ఫీడర్లను వేరు చేసి ‘కుసుం’పథకం కింద వాటిని సౌర విద్యుదీకరించాలని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ‘కుసుం’కింద రైతులు తమ పంట పొలా ల్లో సౌర విద్యుత్ యూనిట్లను ఏర్పాటు చేసుకొని గ్రిడ్‌తో అనుసంధానిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ ఇవ్వనున్నా యి. వ్యవసాయ ఫీడర్ల సోలరైజేషన్ ద్వారా రైతులకు పగటిపూట ఉచిత/చౌక విద్యుత్ లభించనుందని, దీంతో వారి ఆదాయం పెరుగుతుందని కేంద్రం పేర్కొంటోంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం రూ.3.03 లక్షల కోట్ల ఆర్థిక సహాయంతో కొత్త పథకాన్ని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 10 వేల వ్యవసాయ ఫీడర్లను వేరు చేయడానికి రూ. 20 వేల కోట్లు కేటా యించింది. వ్యవసాయ ఫీడర్లను వేరు చేసి కేంద్రం సూచనల మేరకు వాటికి మీటర్లను బిగించడానికి ఇప్పటికే రాష్ట్ర డిస్కంలు కసరత్తు ప్రారంభించాయి. 100% స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు.. వ్యవసాయ వినియోగదారులు మినహా ఇతర అన్ని కేటగిరీల విద్యుత్ వినియోగదారులందరికీ పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 25 కోట్ల వినియోగదారులను ఈ కొత్త పథకం అమలు కాలంలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరింగ్ పరిధిలోకి తీసుకురావాలని లక్ష్యం పెట్టుకోగా తొలి విడతలో 10 కోట్ల ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను 2023 డిసెంబర్‌లోగా ఏర్పాటు చేయాలని రాష్ట్రాలకు లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి విడతగా అన్ని అమృత్ నగరాలు, 15 శాతం, ఆపై విద్యుత్ నష్టాలున్న ప్రాంతాలు, ఎంఎస్ఎంఈలు, ఇతర పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీ వినియోగదారులు, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లు బిగించాల్సి ఉండనుంది. వినియోగదారులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు తోడుగా ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయిల్లో ‘కమ్యూనికబుల్ ఏఎంఐ మీటర్ల’ను ఏర్పాటు చేయాలని కోరింది. ప్రీపెయిడ్ స్మార్ట్‌మీటర్లు, గ్రిడ్, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయిల్లో ఏఎంఐ మీటర్లను ఏర్పాటు చేయడం ద్వారా కచ్చితమైన విద్యుత్ ఆడిటింగ్‌కు అవకాశం లభించనుంది. దీంతో ఎక్కడెక్కడ విద్యుత్ నష్టాలు వస్తున్నాయో గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు ఉంటుందని కేంద్రం పేర్కొంటోంది. ప్రతి నెలా నివేదికలు తయారు చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగించాలని సూచించింది. అన్ని పట్టణాల్లో ‘స్కాడా’... ప్రస్తుతం రాష్ట్రంలో సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) కేంద్రం ఒక్కటే ఉంది. హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న స్కాడా కేంద్రం నుంచి జీహెచ్ఎంసీ పరిధిలో నిరంతర విద్యుత్ సరఫరాను సమీక్షిస్తుంటారు. ఇకపై అన్ని పట్టణాల్లో ఇలాంటి స్కాడా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం పేర్కొంది. కొత్త స్కీం లక్ష్యాలు.. ► డిస్కంల సాంకేతిక, వాణిజ్యపర నష్టాల (ఏటీ అండ్ సీ లాసెస్) ప్రస్తుత జాతీయ సగటు శాతం 12–15 వరకు ఉండగా, 2024–25 నాటికి అన్ని డిస్కంల నష్టాలు ఈ మేర తగ్గాలి. ► డిస్కంల వార్షిక విద్యుత్ సరఫరా వ్యయం (ఏసీఎస్)– వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్ఆర్) మధ్య వ్యత్యాసం 2024–25 నాటికి సున్నాకు చేరాలి. -
కరెంటు కోతల్లేని పల్లె
సాక్షి, అమరావతి: పల్లెల్లో ఏడాదిగా విద్యుత్ కోతల్లేవు. లోవోల్టేజీ మాటే వినిపించడం లేదు. ఫ్యూజుపోతే చీకట్లో మగ్గే దుస్థితి కనుమరుగైంది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందంటే సిబ్బంది వెంటనే వాలిపోతున్నారు. 48 గంటల్లోనే కొత్తది బిగిస్తున్నారు. రైతన్నకు తొమ్మిది గంటల పగటి విద్యుత్ నాణ్యంగా ఉంటోంది. విద్యుత్ కనెక్షన్ల కోసం పైరవీలు చేయాల్సిన పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పార్టీలు, వర్గాలతో పనిలేకుండానే దరఖాస్తు చేసుకున్నవారికి కొత్త కనెక్షన్లు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామీణ విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన మార్పులివి. ఏడాదిలోనే 37 శాతం తగ్గిన అంతరాయాలు కరెంట్ పోతే.. గ్రామ సచివాలయానికి సమాచారం ఇస్తే సరిపోతుంది. ప్రతి గ్రామంలోను దీనిపై విస్తృత అవగాహన ఏర్పడింది. ఫలితంగా గడచిన ఏడాది కాలంలోనే విద్యుత్ అంతరాయాలు 37 శాతం తగ్గాయి. గతంలో మూడూళ్లకు ఒక కరెంట్ లైన్మెన్ ఉండేవారు. ఇప్పుడు ప్రతి గ్రామ సచివాలయంలోను ఎనర్జీ అసిస్టెంట్ ఉన్నారు. అతడికి అన్ని విధాల శిక్షణ ఇచ్చారు. దీనికి తోడు విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేశారు. ట్రాన్స్‌కో రూ.382.18 కోట్లతో.. 400 కేవీ, 200 కేవీ, 132 కేవీ సబ్స్టేషన్లు నిర్మించింది. ఇందుకోసం రూ.85.40 కోట్లు వెచ్చించి 389.75 కిలోమీటర్ల మేర కొత్తగా విద్యుత్ లైన్లు వేశారు. దీనికితోడు పల్లెపల్లెకు నాణ్యమైన విద్యుత్ అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న విద్యుత్ సంస్థలు 77 కొత్త సబ్స్టేషన్లు నిర్మించాయి. 19,502.57 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు వేశాయి. ఇందుకోసం రూ.524.11 కోట్లు ఖర్చు పెట్టాయి. ఫలితంగా విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమైంది. దీంతో విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గాయి. ఊరూరా ఆధునిక పరిజ్ఞానం పల్లెకు అందించే విద్యుత్ వ్యవస్థను అత్యాధునిక టెక్నాలజీతో అనుసంధానం చేశారు. విద్యుత్ లోడ్‌ను ఇట్టే పసిగట్టి, అవసరమైన విద్యుత్‌ను కొనైనా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రక్రియలో రాష్ట్ర లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్ఎల్డీసీ) కీలకపాత్ర పోషిస్తుంది. ఈ విభాగంలోను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్ డిమాండ్‌ను ముందే గుర్తించి, అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి కేంద్రాలకు, పంపిణీ సంస్థలకు సరైన సమయంలో ఆదేశాలిస్తున్నారు. దీనివల్ల గ్రిడ్‌పై లోడ్‌ను అదుపులో ఉంచడం సాధ్యమవుతోంది. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం వల్ల ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల నష్టాలు తగ్గాయి. 2018–19తో పోలిస్తే 2019–20లో ట్రాన్స్‌కో నష్టాలు 2.91 శాతానికి, డిస్కమ్‌ల నష్టాలు 6.21 శాతానికి తగ్గాయి. -
నెలకో బిల్లు గుండె గుబిల్లు
సాక్షి, హైదరాబాద్: ఇలా చాలా మంది వినియోగదారులకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ అధికారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇష్టారాజ్యంగా మీటర్ చూడకుండానే బిల్లు వేయడం లేదా రోజులు పెంచి బిల్లు తీసి వేలకు వేలు వసూలు చేస్తున్నారు. కొన్నిచోట్ల వినియోగదారుడు ఖర్చు చేయని విద్యుత్‌కు కూడా ముందే బిల్లు వసూలు చేస్తున్నారు. దీనిపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. జాప్యంతో మారుతున్న స్లాబ్‌రేట్ ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 44,60,150 పైగా గృహ, 6,95,803పైగా వాణిజ్య కనెక్షన్లు ఉన్నాయి. వీటికి ప్రతినెలా నిర్దిష్ట తేదీకే (30 రోజులకు) మీటర్ రీడింగ్ నమోదు చేయాలి. కానీ అధికారుల పర్యవేక్షణాలోపం, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల రెండుమూడు రోజులు ఆలస్యంగా మీటర్ రీడింగ్ నమోదు చేస్తు న్నారు. స్లాబ్‌రేట్ మారిపోయి విద్యుత్ బిల్లులు రెట్టింపు స్థాయిలో జారీ అవుతుండటంతో వినియోగదారులు నష్టపోవాల్సి వస్తోంది. కాగా, విద్యుత్ చౌర్యం, లైన్‌లాస్, ఇతర నష్టాలను నెలవారి బిల్లులు చెల్లించే వినియోగదారులపై రుద్దుతున్నట్లు ఆరోపణలున్నాయి. స్లాబ్‌రేట్ మార్చి బిల్లులు రెట్టింపుస్థాయిలో జారీ చేసి వందశాతం రెవెన్యూ కలెక్షన్ నమోదైనట్లు రికార్డుల్లో చూపిస్తుండటం కొసమెరుపు. - సైదాబాద్ వినయ్‌నగర్ కాలనీకి చెందిన ముచ్చా విజయకి సంబంధించిన గృహ విద్యుత్ కనెక్షన్ నెలవారీ బిల్లును జూన్ 7న జారీ చేశారు. బిల్లుపై ఉన్న ప్రీవియస్ కాలంలో (జూన్) 30,649 యూనిట్లు రికార్డ్ కాగా... జూలై 7న కూడా 30,649 యూనిట్లే రికార్డయింది. నెలలో వాడిన మొత్తం యూనిట్ల సంఖ్య జీరోగా చూపించి, మినిమం బిల్లు రూ.175 వేశారు. - ఇక ఆగస్టు 7న అదే సర్వీసు నంబర్‌పై మీటర్ రీడింగ్ తీసి, బిల్లు జారీ చేశారు. ప్రీవియస్, ప్రజెంట్ రీడింగ్‌లో మార్పు లేదు. కానీ 206 యూనిట్లు వాడినట్లు చూపించి, రూ.1,116 బిల్లు వేశారు. విజయకి అనుమానం వచ్చి మీటర్‌ను పరిశీలిస్తే.. అసలు విషయం బయటపడింది. మీటర్లో ప్రస్తుతం 30,507 యూనిట్లు మాత్రమే నమోదైనట్లు ఉంది. - ఇక ఇబ్రహీంపట్నంలో సరస్వతికి సంబంధించి బిల్లులో అన్నీ తప్పులే. ప్రీవియస్ బిల్లు 8419 ఉంటే, ప్రజెంట్ బిల్లు 91 గా చూపించారు. అలాగే 34 రోజులకు బిల్లు తీసి వంద యూనిట్లు దాటేలా చేశారు. దీంతో స్లాబ్ మారి బిల్లు అమాంతం పెరిగింది. -
కొందరికే కనెక్షన్!
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు షాక్ ఇవ్వనుంది. బోరుబావులకు నూతన విద్యుత్ కనెక్షన్ల మంజూరులో కొత్త మెలిక పెట్టింది. విద్యుత్ స్తంభాలు అవసరం లేని వారికే కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఎలా అనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకుని కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్న వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను భారంగా భావిస్తోంది. వీలైనంత వరకు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందనే అనుమానాలు కలుగుతున్నాయి. అందులో భాగంగానే 2017 సెప్టెంబర్ నుంచి కొత్త కనెక్షన్ల మంజూరుపై నిషేధం విధించింది. 2015–16, 2016–17 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం 17 వేల మంది రైతులకు మాత్రమే కనెక్షన్లు ఇచ్చింది. రైతుల ఒత్తిడి అధికమవడంతో... ఉచిత విద్యుత్ కనెక్షన్ కోసం జిల్లాలో 12856 మంది రైతులు రూ.5500 డీడీ కట్టి దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రెండు, మూడేళ్లు కిత్రం దరఖాస్తు చేసుకున్న వారూ ఉన్నారు. చాలామంది బోరు బావి, ఇతర ఖర్చుల కోసం రూ.1.50 లక్ష వరకు ఖర్చు చేసి విద్యుత్ కనెక్షన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒక పక్క బోరు వేయించేందుకు చేసిన అప్పులకు వడ్డీల మీద వడ్డీ పెరిగిపోతోంది. అయినా, సర్కారు పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో రైతుల్లో అసహనం అధికమైంది. ఈ పరిస్థితుల్లో నూతన విద్యుత్ కనెక్షన్లపై ఉన్న బ్యాన్‌ను ఎత్తివేయకపోతే మరింత ప్రమాదంలో పడతామని భావించిన సర్కారు కొత్త ఎత్తుగడ వేసింది. విద్యుత్ స్తంభాలు అవసరం లేనివి, తప్పనిసరి అయితే ఒకటి, రెండు, మూడు స్తంభాలు అవసరం ఉన్న బోరుబావులకు మాత్రమే కనెక్షన్లను మంజూరు చేయనుంది. అందులో భాగంగా జిల్లాలో స్తంభాలు అవసరంలేని కనెక్షన్లు 2199, ఒకటి, రెండు, మూడు పోళ్లు అవసరం ఉన్నవి 1021 ఉన్నట్లు గుర్తించారు. వాటికి మత్రమే కొత్త కనెక్షన్లను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మిగిలిన 9636 మంది రైతుల పరిస్థితి ఏమిటనేది అర్థం కావడం లేదు. 3220 కనెక్షన్లకు ప్రతిపాదనలు పంపాం ఇటీవల రాష్ట్రం ప్రభుత్వం విద్యుత్ స్తంభాలు అవసరం లేనివి, ఒకటి, రెండు పోళ్లు అవసరం ఉన్న కనెక్షన్ల వివరాలు పంపాం. ఒకటి, రెండు నెలల్లో మంజూరయ్యే అవకాశం ఉంది. జిల్లాకు మొత్తం 3220 మంది రైతులకు కొత్త కనెక్షన్లు వస్తాయి. మిగిలిన రైతుల పరిస్థితిపై ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాలి. – భార్గవ రాముడు, ఎస్ఈ కనెక్షన్‌కు దరఖాస్తు చేసి ఏడాదైంది ఏడాది క్రితం నా పొలంలో మూడు బోర్లు వేయించా. ఒకదానిలో మాత్రమే మంచి నీళ్లు పడ్డాయి. దాదాపు లక్షన్నర ఖర్చు అయింది. అప్పుడే కరెంట్ కోసం రూ.7వేలు ఖర్చు చేసి దరఖాస్తు చేశా. అప్పటి నుంచి కరెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అధికారులెవరూ స్పందించడంలేదు. ఒకవైపు అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. – నాగరాజు, పొట్లపాడు -
ట్రాన్స్ఫార్మర్ల మాఫియా!
అయ్యా... చేను చేసుకుందామనుకుంటున్నా.. నీళ్లకు ఇబ్బంది అయ్యింది.. బోరులో బాగానే నీళ్లు పడ్డాయి కానీ ట్రాన్స్ఫార్మర్ లేదయ్యా... అదేదో డీడీలు కట్టాలంట కదా కడుదునా... ఆ ఏం డీడీలు రా... ఇప్పుడు కడితే ఎప్పుడు వస్తుందో ఏమో... అప్పట్లోగా నీ పంట ఎండిపోతది.. మరెట్ల అయ్యా... ఏమి లేదు ఎట్లోలాగా నేను తెప్పిస్తాను, కొంత ఖర్చు అయితది... తెచ్చిన తర్వాత ఎట్లయినా సరే కరెంటోళ్లకు చెప్పి అధికారికంగా చేయిద్దాం.. – ఇది ఐదేళ్లుగా నడిగడ్డ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ల మాఫియా ఆడుతున్న ఆట. ఒక్కోటి రూ.50వేల నుంచి రూ.70వేల వరకు వెచ్చించి తెచ్చిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అనేది మాఫియాకు సంబంధం లేదు. దీంతో రైతుల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా తయారైంది. సాక్షి, గద్వాల/ గద్వాల అర్బన్: రైతుల అవసరం.. ట్రాన్స్ఫార్మర్ల మంజూరులో అధికారుల నిర్లక్ష్యం వెరసి ట్రాన్స్ఫార్మర్ల మాఫియాకు అదనుగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫార్మర్లు తెప్పించి రైతులకు కట్టబెడుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు మాత్రం కనెక్షన్‌కు, చెడిపోతే మరమ్మతు చేయించేందుకు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొం ది. అధికారులకు తెలియకుండా విద్యుత్ కనెక్షన్ తీసుకోవడం అసాధ్యం. ఒకవేళ ఏదైనా రిపేరు వస్తే అంతే సంగతులు.. కాస్తా కూస్తో అవగాహన ఉన్న మరికొందరు రైతులు గత్యంతరం లేక కర్నూలులోని ప్రైవేటు వ్యక్తుల వద్దకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసి మరమ్మతు చేయించుకుంటున్నారు. జిల్లాలో జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టులతోపాటు ఏడు రిజర్వాయర్లు చేపట్టారు. సాగునీరు సమృద్ధిగా ఉండటంతో ఐదేళ్లుగా పంటల విస్తీర్ణం పెరిగింది. ముఖ్యంగా గద్వాల, ధరూరు, మల్దకల్, గట్టు మండలాల్లో వేలాది ఎకరాలు వరి, వేరుశనగ, పత్తి, మిరప, పండ్లతోటల సాగు చేస్తున్నారు. కాల్వలు, బోర్ల కింద పంటలు సాగు చేసుకునేందుకు విద్యుత్ అవసరం ఉంటుంది. ఇదే అదనుగా రైతుల అవసరాన్ని ఆసరగా చేసుకుని మాఫియా తెరపైకి వచ్చింది. ఇతర జిల్లాల నుంచి తక్కువ ధర, నాణ్యత లేని ట్రాన్స్ఫార్మర్లు తెచ్చి మూడు రెట్లు ఎక్కువకు విక్రయిస్తున్నారు. అయితే డబ్బులు పోయినా పంట కాపాడుకుందామనే సంతోషం రైతుల్లో లేకుండాపోయింది. వేల రూపాయలు ఖర్చు చేసి తెచ్చిన ట్రాన్స్ఫార్మర్లకు కనెక్షన్ ఇచ్చేందుకు అధికారుల నుంచి సమస్యలు ఎదురుకావడం, ఒకవేళ ఎలాగో ఇప్పించినా అవి పనిచేయకపోవడం, మరమ్మతుకు మళ్లీ వేల రూపాయలు ధారపోయడం రైతులకు పరిపాటిగా మారింది. అంతేకాదు తనతో కాకుండా ఇతరుల వద్ద ట్రాన్స్ఫార్మర్లు కొనుగోలు చేస్తే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చి పట్టిస్తున్నారు. ఈ విషయమై ‘సాక్షి’ క్షేత్రస్థాయిలో పరిశీలించగా పలు అంశాలు వెలుగు చూశాయి. నలుగురు వ్యక్తులతో కూడిన ఈ మాఫియా ఇప్పటికే కోట్ల రూపాయలు ఆర్జించినట్లు సమాచారం. గట్టు మండలం రాయపురంలో రైతులకు ప్రైవేట్ వ్యక్తులు అంటగట్టిన పనిచేయని ట్రాన్స్ఫార్మర్..., మల్దకల్ మండలం దాసరిపల్లిలో అధికారులు గుర్తించిన అనధికారిక ట్రాన్స్ఫార్మర్ ఇదే.. 25కేవీ ట్రాన్స్ఫార్మర్ తప్పనిసరి వ్యవసాయ రంగంలో ప్రతి 20ఎకరాలకు ఒక 25కేవీట్రాన్స్ఫార్మర్ అవసరం ఉంటుంది. సాధారణంగా డీడీ రూ.ఐదు వేలు ఉండగా ముగ్గురు, నలుగురు రైతులు కలసి దీనికోసం ఆన్లైన్లో నమోదు చేసుకుని ట్రాన్స్‌కో అధికారులకు దరఖాస్తులు ఇవ్వాలి. సీనియారిటీ ప్రకారం ట్రాన్స్ఫార్మర్ మంజూరవుతుంది. అనంతరం నాలుగు డీడీలు రూ.20వేల కలిపి 25కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌తోపాటు విద్యుత్ వైర్లు ఏబీ స్విచ్, ఏజ్ ఫ్యూజ్ సెట్, ఎల్టీ ప్యూజ్ సెట్, హెచ్‌టీ లైన్, ఎల్టీ లైన్‌తోపాటు వచ్చిన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దిమ్మె కోసం సుమారు రూ.30వేల వరకు వెచ్చించాల్సిందే. అయితే డీడీ తీసిన తర్వాతా ఏళ్లతరబడి దానికోసం రైతులు ఎదురుచూడాల్సిందే. తప్పని పరిస్థితుల్లో చేనును కాపాడుకునేందుకు రైతులు ప్రైవేటు ట్రాన్స్ఫార్మర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా మాఫియా 25కేవీ ట్రాన్స్ఫార్మర్ను రూ.50వేల నుంచి రూ.70వేల వరకు విక్రయిస్తున్నారు. వైర్లు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఖర్చులు సరేసరి. నిబంధనల ప్రకారం దీనిని రూ.20వేలకే ఇవ్వాల్సి ఉంటుంది. సరిహద్దులు దాటి.. సుమారు ఐదేళ్ల క్రితం బిజ్వారానికి చెందిన ఒకరు, ఇద్దరు సీడ్ ఆర్గనైజర్లు, ధరూరు మండలంలోని మరో వ్యక్తి కలసి ట్రాన్స్ఫార్మర్ల మాఫియాగా ఏర్పడ్డారు. వీరి వద్ద మరికొందరు పని చేస్తుంటారు. వీరు ఇతర జిల్లాల్లో నాణ్యత లేనివి, తక్కువ ధరకు లభించేవి, సక్రమంగా పనిచేయని ట్రాన్స్ఫార్మర్లను జిల్లాలోకి తీసుకొచ్చి అమ్ముతున్నట్లు సమాచారం. మల్దకల్ మండలంలోని దాసరపల్లి, బిజ్వారం, మల్లెందొడ్డి, ధరూరు మండలంలోని మార్లబీడులో సుమారు 80అనధికారిక ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా ఇలాంటి 200 వరకు ఉండవచ్చని చెబుతున్నారు. ఇక తమ వద్దే, చెప్పిన ధరకే కొనుగోలు చేయాలి, ఇతరుల దగ్గర కొనుగోలు చేస్తే అనుచరులతో అధికారులకు వారే సమాచారం ఇప్పిస్తారు. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంతోపాటు తెలంగాణలోని సంగారెడ్డి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ట్రాన్స్ఫార్మర్ల తెప్పిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు మంజూరు చేస్తే ట్రాన్స్ఫార్మర్కు దాని సామర్థ్యం, కంపెనీ పేరు, ఉత్పత్తి చేసిన సంవత్సరం తదితర వివరాలు ఉంటాయి. కానీ మాఫియా సరఫరా చేసే దానిని అవేవి ఉండవు. బయట చెబితే అంతే సంగతులు అనధికారిక ట్రాన్స్ఫార్మర్లతో పడుతున్న ఇబ్బందులు రైతులు పూర్తి సమాచారం ఇచ్చేందుకు భయపడుతున్నారు. ‘సార్... మా వద్దకు వచ్చినట్లు తెలిస్తే కూడా ఇబ్బందే.. మేమేమీ చెప్పలేం..’ అంటూ ముఖం చాటేసి వెళ్తున్నారు. దీనిని బట్టే చూస్తే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మల్దకల్ మండలం దాసరిపల్లిలో నలుగురు రైతులు కలసి ఓ వ్యక్తితో ట్రాన్స్ఫార్మర్ను కొనుగోలు చేయగా ఇటీవల అధికారులు తనిఖీ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దానిని ఎవరి వద్ద కొనుగోలు చేశారో అతనికే మళ్లీ తిరిగి ఇవ్వాలని బాధిత రైతులు అతడిని ఆశ్రయిస్తే నెల రోజుల వ్యవధిలోనే రూ.పది వేలు తగ్గించి తీసుకుంటానని చెప్పినట్లు సమాచారం. అసలు ఎలాంటి కనెక్షన్ ఇవ్వక ముందే తిరిగి తీసుకోవడానికి ఇలా డిమాండ్ చేస్తున్నారంటే వారు రైతులను ముంచి ఎంత సంపాదిస్తున్నారనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే గట్టు మండలంలోని రాయపురానికి చెందిన కొందరు రైతులు ఇటీవలే ఓ వ్యక్తి నుంచి రూ.45వేలకు ట్రాన్స్ఫార్మర్ కొనుగోలు చేశారు. తీరా తెచ్చుకున్న తర్వాతా పనిచేయకపోవడంతో తిరిగి అతనికే ఇచ్చేందుకు యత్నించగా తీసుకోవడానికి ఇష్టపడనట్టు తెలిసింది. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్ల సమస్య ఏదైనా ఉత్పన్నమైతే రైతులు, వినియోగదారులు సంబంధిత లైన్‌మన్, ఏఈలకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు గురైతే జిల్లాలోని గద్వాల, అయిజ, అలంపూర్ మరమ్మతు కేంద్రాలకు తరలిస్తే ఉచితంగా చేస్తారు. అలాగే విద్యుత్ సమస్య ఏర్పడితే లైన్‌మన్, సంబంధిత అధికారులు వచ్చి సరిచేస్తారు. అయితే అనధికారిక ట్రాన్స్ఫార్మర్లు కావడంతో రైతులు మరమ్మతుకు కర్నూలుకు తీసుకెళుతున్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో సమస్య ఏర్పడితే సొంతంగా చేసుకుంటున్నారు. దీంతో కొంత అవగాహన లేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో జరిగే ప్రమాదాల్లో సుమారు 50శాతం అనధికార ట్రాన్స్ఫార్మర్ల వద్దే చోటు చేసుకుంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీçసుకుంటాం 24గంటల విద్యుత్ సరఫరా నిమిత్తం ఆటోస్టార్టర్ల తొలగింపునకు గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగా పర్యటిస్తుంటే ఈ అనధికారిక ట్రాన్స్ఫార్మర్ల బాగోతం బయట పడింది. ఇవి మల్దకల్, ధరూరు, గద్వాల మండలాల్లో అత్యధికంగా ఉన్నట్టు సమాచారం. అయితే రైతులు ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్య తీసుకుంటాం. రైతులు డీడీలు కడితే త్వరలోనే ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేస్తాం. ట్రాన్స్ఫార్మర్లు ప్రైవేట్‌గా కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరం. – సీహెచ్ చక్రపాణి, ట్రాన్స్‌కో ఎస్ఈ, గద్వాల వరి చేను ఎండుతుందని.. నలుగురు రైతులం కలసి మూడు బోర్ల కింద వరినాటు వేశాం. ప్రస్తుతం కాల్వ నీళ్లు వస్తున్నాయి. ఆ తర్వాత ఇబ్బంది అవుతుందని రూ.40వేలు వెచ్చించి మార్లబీడులోని ఓ వ్యక్తితో ట్రాన్స్ఫార్మర్ కొన్నాం. అయితే కొన్న తర్వాత తెలిసింది ఇది అనధికారిక ట్రాన్స్ఫార్మర్ అని. గ్రామంలో గిట్టని వారు కొందరు ట్రాన్స్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వచ్చి పరిశీలించారు. వారి సూచన మేరకు కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు తీసి ఇవ్వగా త్వరలోనే మంజూరు చేస్తామన్నారు. అది రాకపోతే పంట ఎండిపోతది. రెంటికీ చెడ్డ రేవడిలా మా పరిస్థితి తయారైంది. – నర్సింహులు, దాసరిపల్లి, మల్దకల్ మండలం తప్పని పరిస్థితుల్లోనే.. ట్రాన్స్ఫార్మర్ కోసం డీడీలు కట్టి అధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. ఆలస్యమవుతుందని పం టను కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రైవేటు వ్యక్తులతో చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ను రూ.25వేలకు కొనుగోలు చేశాను. రిపేరు, విద్యుత్ స్తంభాలు, ఇతర ఖర్చులకు మరో రూ.50వేల దాకా వెచ్చించాను. మరమ్మతు చేయించుకోవాలంటే కర్నూలుకు తీసుకుపోవాల్సి వస్తుంది. దీనినే రెగ్యులరైజ్ చేస్తామనడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నా. – చింత కిష్టన్న, అమరవాయి, మల్దకల్ మండలం -
‘కేటగిరీ’ మార్పులతో చార్జీలు పెరగవు
డిస్కంలకు అదనపు ఆదాయం రాదు: టీఎస్ఎస్పీడీసీఎల్ సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కనెక్షన్ల కేటగిరీ నిర్వచనంలో ప్రతిపాదించిన మార్పులతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లకు ఎలాంటి అదనపు ఆదాయం రాదని, చార్జీలు కూడా పెరగవని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్ చార్జీల పెంపు లేకుండానే రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి టారీఫ్ ప్రతిపాదనలను ప్రతి పాదించామని పేర్కొంది. విద్యుత్ కనెక్షన్ల కేటగిరీల్లో డిస్కంలు ప్రతిపాదించిన మార్పులపై సోమవారం ‘సాక్షి’లో ‘లేదు లేదంటూనే బాదుడు’శీర్షికతో ప్రచురితమైన కథనంపై సంస్థ యాజమాన్యం స్పందించి ఈ మేరకు వివరణ ఇచ్చింది. కనెక్షన్ల కేటగిరీల్లో మరింత స్పష్టత ఇచ్చేందుకు, న్యాయపరమైన చిక్కులను అధిగమించేందు కే కేటగిరీ నిర్వచనంలో మార్పులు ప్రతిపాదించినట్లు తెలిపింది. ఎల్టీ–2 కమర్షియల్ విద్యుత్ కనెక్షన్లు, హెచ్‌టీ–2(ఇతర) కేటగిరీల నిర్వచనం పరిధిలోకి కొత్తగా అన్ని రకాల సర్వీసింగ్ స్టేషన్లు, రిపేరింగ్ సెంటర్లు, బస్ డిపోలు, లాండ్రీలు, డ్రై క్లీనింగ్ యూని ట్లు, గ్యాస్/ఆయిల్ స్టోరేజీ/ట్రాన్స్ఫర్ స్టేష న్లు, గోదాములు/స్టోరేజీ యూనిట్లను చేర్చాలని ప్రతిపాదించామని, వాస్తవానికి ఈ రకా ల కనెక్షన్లకు ఇప్పటికే కమర్షియల్, హెచ్‌టీ–2 (ఇతర) కేటగిరీల కిందే చార్జీలు విధిస్తున్నామ ని వెల్లడించింది. ఐటీ పరిశ్రమల పరిధిలోని ఐటీయేతర వ్యాపారాలనూ ఇప్పటివరకు ఐటీ యూనిట్ల కిందే పరిగణించి అనుమతులిచ్చేవారని పేర్కొంది. ఇప్పుడు ఐటీయేతర కార్యకలాపాలను మినహాయించాకే ఐటీ పరిశ్రమలకు అనుమతులిస్తున్నారని తెలి పింది. ఇప్పటివరకు ఎల్టీ, హెచ్‌టీ పరిశ్రమల కేటగిరీల పరిధిలో ఉన్న ఐటీ సంస్థల సముదాయంలోని కేఫ్టేరియా, హోటళ్లు, ఏటీఎంలు, బ్యాంకులు, ఆడిటోరియంలు, ఇతర సదుపాయాలను ఎల్టీ–2 కమర్షియల్, హెచ్‌టీ–3(ఇతర) కేటగిరీల నిర్వచనం పరిధిలోకి చేర్చాలని ప్రతిపాదించామని తెలిపింది. -
ఛేంజ్ ఇస్తేనే మీటర్ ఎక్స్ఛేంజ్
♦ పాత విద్యుత్ మీటర్ మార్చేందుకు రూ.200 డిమాండ్ ♦ అధికారులు, ఏజెన్సీ నిర్వాహకుల చేతివాటం ♦ ఆందోళన వ్యక్తం చేస్తున్న వినియోగదారులు నెల్లూరు (టౌన్): వెంకటాచలం మండలం కాకుటూరులో రాపూరు హరిబాబు నివాసం ఉంటున్నారు. ఇంటికి విద్యుత్ పాత మీటరు ఉండటంతో కొత్తగా వచ్చిన ఐఆర్డీఏ పోర్డ్ మీటరను అమర్చేందుకు ఏజెన్సీ నిర్వాహకులు గురు వారం ఇంటికి వచ్చారు. అయితే రూ. 200లు ఇస్తేనే కొత్త మీటరు బిగిస్తామని స్పష్టం చేశారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించడంతో మీటరు మార్చకుండానే అక్కడ నుంచి వెళ్లి పోయారు. ఈ సమస్య ఒక హరిబాబుకే కాదు.. జిల్లాలోని ప్రతి విద్యుత్ వినియోగదారుడికీ ఉంది. రీడింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు విద్యుత్ శాఖ పాత మీటర్ల స్థానంలో కొత్త మీటర్లను బిగించాలని నిర్ణయించింది. రీడింగ్‌ను పరికరం సహాయంతో స్కానింగ్ చేయడంతో కచ్చితమైన రీడింగ్ వస్తుందని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో పాత మీటర్ల స్థానంలో కొత్తగా ఐఆర్డీఏ పోర్డ్ మీటర్లును విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు జిల్లాకు పంపిణీ చేశారు. జిల్లాలోని గృహ సర్వీసులకు సంబంధించి చెడిపోయిన మీటర్లతో పాటు పని చేస్తున్న మీటర్ల స్థానంలో కొత్తగా వచ్చిన ఐఆర్డీఏ పోర్డ్ మీటర్లును మార్చే ప్రక్రియను చేపట్టారు. జిల్లాలో 9 లక్షల 60 వేలకు పైగా గృహ సర్వీసులు ఉన్నాయి. జిల్లాలో మీటర్లను మార్చే బాధ్యతను ఒక్కో డివిజన్లో ఒక్కో ఏజెన్సీకి అప్పగించారు. తొలుత ఒక మీటరు మార్పునకు రూ.20లు సంబంధిత కాంట్రాక్టర్లుకు విద్యుత్‌శాఖ చెల్లించే విధంగా ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ధర సరిపోదని చెప్పడంతో మీటరు మార్పునకు రూ.70లను పెంచి ఆధర ప్రకారం చెల్లిస్తున్నారు. మార్పునకు రూ.200లు చెడిపోయినా, పాత మీటర్లు ఉన్నా వాటి స్థానంలో వినియోగదారుల నుంచి ఎలాంటి పైసా తీసుకోకుండా ఉచితంగా ఐఆర్డీఏ పోర్డ్ మీటరును మార్చాల్సి ఉంది. అయితే సంబంధిత ఏజెన్సీ కాంట్రాక్టర్లు మీటరు మార్పునకు వినియోగదారుడి నుంచి రూ.200లు వసూలు చేస్తుండటంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చెల్లించే రూ.70లతో పాటు అదనంగా వినియోగదారుడు నుంచి రూ. 200లు వసూలు చేసి రెండు చేతులతో దోచుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు, కాంట్రాక్టర్లు కమ్మక్కు మీటరు మార్పు విషయంలో కాంట్రాక్టర్లు వినియోగదారుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్న నగదులో అధికారులుకు కూడా వాటా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వసూళ్లపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. ఇంటికి వచ్చి నేరుగా డబ్బులు వసూలు చేసే ధైర్యం ఉందంటే వారికి అధికారుల అండ కూడా కచ్చితంగా ఉంటుందంటున్నారు. ప్రధానంగా మీటరు మార్పునకు గ్రామీణ ప్రాంతాలను ఎంచుకుని డిమాండ్ చేసి మరీ వసూళ్లు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వినియోగదారులు అడిగినంత డబ్బులు ఇచ్చి మీటరును మార్చుకుంటే డబ్బులు ఇవ్వని వినియోగదారులు మీటర్లు మాత్రం యథాతథంగానే ఉన్నా యని చెబుతున్నారు. జిల్లాలో గృహాలకు ఉన్న 9 లక్షల 60వేలు మీటర్లకు సగం మంది దగ్గర రూ. 200లు వసూలు చేసినా రూ. 8 కోట్లుకు పైగానే వసూలవుతుందని విద్యుత్‌శాఖ అధికారులే చెప్పడం గమనార్హం. ఇప్పటికే జిల్లాలో ముమ్మరంగా మీటర్లు మార్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మీటరు మార్పునకు డబ్బు వసూలు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవా లని వినియోగదారులు కోరుతున్నారు. మీటరు మార్పునకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు మీటర్లను మార్చేందుకు ఆయా డివిజన్లు వారీగా కాంట్రాక్టర్లకు అప్పగించాం. మీటరు మార్చినందుకు ఒక పైసా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డబ్బు వసూలు చేస్తున్నారన్న విషయం తెలియదు. ఈ విషయంపై విచారణ జరిపి వసూలు చేస్తున్నారని తేలితే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటాం. – కళాధరరావు, ఎస్ఈ ట్రాన్స్‌కో -
వారికి వాయిదాల్లో విద్యుత్ కనెక్షన్లు!
న్యూఢిల్లీ: దారిద్య్ర రేఖకు ఎగువ(ఏపీఎల్) ఉన్న కుటుంబాలకు డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ కనెక్షన్లను నెలసరి వాయిదా(ఈఎంఐ) పద్ధతిలో ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి గోయల్ రాష్ట్రాలను కోరారు. దీనికోసం అవసరమైన నిధులను ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ల ద్వారా అందజేస్తామన్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరా సమాచారాన్ని తెలుసుకోవడంతో సాయపడే జీఏఆర్వీ–2 యాప్‌ను ఆయన ప్రారంభించారు. 2019 నాటికి అందరికీ నిరంతరాయ విద్యుత్ సరఫరా లక్ష్య సాధనలో భాగంగా కేంద్రం పై విధానానికి శ్రీకారం చుట్టింది. -
తెలంగాణలో రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు
-
రైతులందరికీ విద్యుత్ కనెక్షన్లు
► ఏడు నెలల్లో అందజేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం ► 97 వేల పెండింగ్ దరఖాస్తులకు త్వరలో మోక్షం ► పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కనెక్షన్లు ► రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరగొద్దు ► కనెక్షన్ ఎప్పుడిస్తారనే దానిపై రైతులకే లేఖలు ► మంజూరులో అవినీతి, అక్రమాలను సహించబోం ► రూపాయి లంచం తీసుకున్నా ఊరుకోబోమని హెచ్చరిక ► విద్యుత్, కొత్త జిల్లాల పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్ష ► జిల్లాల్లో యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలివ్వాలని సూచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వచ్చే ఏడు నెలల్లోగా, పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతోనే కనెక్షన్లు ఇవ్వాలని విద్యుత్ అధికారులకు సూచించారు. దాదాపు ఐదేళ్లుగా రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం ఎదురుచూస్తున్నారని సీఎం పేర్కొన్నారు. ఆ ఎదురుచూపులకు స్వస్తి పలికేందుకు.. కనెక్షన్ల మంజూరులో అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ విద్యుత్ అంశంపై కేసీఆర్ సమీక్ష జరిపారు. జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం రాష్ట్రంలో 97 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఐదేళ్ల నుంచి అవి పేరుకుపోతున్నాయని అధికారులు ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు నివేదించారు. అందరికీ కనెక్షన్లు ఇవ్వాలంటే దాదాపు రూ.600 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం... డిమాండ్‌కు అనుగుణంగా కనెక్షన్లు ఇవ్వకపోవడంతో ఎవరు డబ్బులిస్తే వారికే కనెక్షన్లు ఇచ్చే దందా నడుస్తోందని మండిపడ్డారు. దీనిని సహించబోమని హెచ్చరించారు. ఒక్క రూపాయీ లంచం లేకుండా, రైతులు విద్యుత్ కార్యాలయాల చుట్టూ తిరక్కుండా, ప్రజాప్రతినిధుల సిఫారసులేవీ లేకుండానే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు అందితే ఈ అక్రమాలకు తెరపడుతుందన్నారు. పెండింగ్‌లో ఉన్న 97 వేల దరఖాస్తులతో పాటు రాబోయే నెలల్లో వచ్చే అవకాశమున్న మరో 20–30 వేల దరఖాస్తులను కూడా కలుపుకొని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏడు నెలల వ్యవధిలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. కొత్త కనెక్షన్లకు షెడ్యూల్.. రైతుకు లేఖలు ఎవరికి ఎప్పుడు కనెక్షన్ వస్తుందో తెలియని అనిశ్చితిని తొలగించే చర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. మండలాల వారీగా కనెక్షన్లు ఎప్పుడు ఇస్తారో షెడ్యూల్ రూపొందించాలని, ఆ వివరాలను గ్రామ పంచాయతీ నోటీసు బోర్డులపై పెట్టాలని చెప్పారు. అంతేగాకుండా నిర్ణీత సమాచారంతో రైతులకు లేఖలు రాయాలని సూచించారు. షెడ్యూల్ రూపొందించిన తర్వాత కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలన్నారు. విద్యుత్‌కు ఢోకా లేదు రాష్ట్రంలో రైతులతో సహా ఏ వర్గం కూడా కరెంటు కోసం ఇబ్బందులు పడవద్దని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎండాకాలంలో కూడా కరెంటు కోత లేకుండా ఇప్పట్నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు. రబీలో రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. పది వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉన్నా తట్టుకునేలా రూ.2,450 కోట్లతో కొత్త సబ్‌స్టేçÙన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే బోర్ల వినియోగం తగ్గుతుందని.. ప్రాజెక్టుల లిఫ్ట్‌లకు విద్యుత్ అవసరం పెరుగుతుందని సీఎం పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. చెడిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో వెంటనే మరో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలో 5.46 లక్షల వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయని.. దానికి 4 శాతం అదనంగా రోలింగ్ స్టాక్ పెడుతున్నామని వెల్లడించారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సూచించారు. కొత్త జిల్లాల్లో కార్యాలయాలపై ప్రణాళిక కొత్త జిల్లాల్లో తప్పనిసరిగా ఏయే ప్రభుత్వ కార్యాలయాలుండాలి, ఏయే యూనిట్లను నెలకొల్పాలనేది నిర్ణయించి.. ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. దాంతోపాటు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు సంబంధించి ఏమేం ఉండాలో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. కొత్త జిల్లాల్లో పరిస్థితిపై మంగళవారం కేసీఆర్ సమీక్షించారు. ప్రతి జిల్లాలో నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, కృషి విజ్ఞాన కేంద్రం ఉండాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రం నుంచి జిల్లా యూనిట్‌గా ఏమేం సాధించుకోవచ్చో ప్రత్యేకంగా ప్రతిపాదనలు తయారు చేయాలని, సంబంధిత వివరాలతో కేంద్రానికి నివేదిక పంపించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా యూనిట్‌గా అమలు చేసే పథకాలను గుర్తించాలన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ పూర్తయినందున అధికారులు పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల, లక్ష్మారెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీలు కేశవరావు, జితేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
'మీ సేవ' నుంచే విద్యుత్ కనెక్షన్ల మంజూరు
తిరుపతి రూరల్: దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ( సదరన్ డిస్కం) పరిధిలోని ఎనిమిది జిల్లాలో కొత్తగా ఎల్టీ, హెచ్‌టీ కేటగిరీలకు సంబంధించి కొత్త కనెక్షన్లను ఇకపై మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సదరన్ డిస్కం చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌వై.దొర కోరారు. శనివారం తిరుపతిలోని డిస్కం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. డిస్కం పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల పరిధిలో కొత్త విద్యుత్ కనెక్షన్లను పొందేందుకు నిబంధనలను సరళతరం చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి ఎల్టీ కేటగిరిలో గృహ విద్యుత్తు, వాణిజ్యం, పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, వ్యవసాయం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా, సాధారణ, దేవాలయాలకు విద్యుత్ కనెక్షన్లు, హెటీ కేటగిరిలో పరిశ్రమలు(సాధారణం), ఇతర సర్వీసులు, మౌళిక, పర్యాటకం, ప్రభుత్వ, ప్రైవేటు ఎత్తిపోతలు, వ్యవసాయం, సిపిడబ్ల్యుఎస్, రైల్వే ట్రాక్షన్, టౌన్‌షిప్స్, రెసిడెన్షియల్ కాలనీస్, గ్రీన్ పవర్, తాత్కలిక సర్వీసులను పొందడానికి మీ-సేవా కేంద్రం నుంచే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేరు మార్చుకోవాలన్నా.. ఎల్టీ కేటగిరికి సంబంధించి పేరు, కేటగిరి, లోడ్ మార్పు అంశాలకు సంబంధించిన దరఖాస్తులను కూడా మీ-సేవా ద్వారానే బుక్ చేసుకోవాలని సీఎండీ హెచ్‌వై దొర సూచించారు. ప్రస్తుత విద్యుత్ లైన్ల నుంచి కనెక్షన్‌ను మంజూరు చేసే సందర్భాల్లో డెవలప్మెంట్ చార్జీలను కూడా మీ-సేవా కేంద్రం ద్వారానే చెల్లించాల్సి ఉంటుందన్నారు. విద్యుత్ స్తంభాలు, లైన్లు ఏర్పాటు చేసి సర్వీసును మంజూరు చేసే సందర్భాల్లో మాత్రమే సంబంధిత డెవలప్మెంట్ చార్జీలను ఏపీఎస్పీడీసీయల్ సబ్-డివిజన్ కార్యాలయాల్లో చెల్లించడానికి అవకాశం ఉంటుందన్నారు. కల్యాణ మండపాలు, ఎన్టీయార్ సుజల పథకం, తాత్కాలిక సర్వీసులు, ఎన్టీయార్ జలసిరి సర్వీసులకు సంబంధించి మాత్రమే ఏపీఎస్పీడీసీయల్ కాల్ సెంటర్ల నుంచి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. -
ఎమ్మార్వో కార్యాలయానికి కరెంట్ కట్
చిన్నశంకరంపేట: మెదక్ జిల్లాలో ఎమ్మార్వో కార్యాలయానికి విద్యుత్ శాఖాధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. చిన్నశంకరంపేట తహశీల్దార్ కార్యాలయానికి విద్యుత్ బిల్లులు బకాయి ఉండటంతో.. అధికారులు బుధవారం కరెంట్ సరఫరాను ఆపేశారు. దీంతో కంప్యూటర్లు పని చేయక ధృవీకరణ పత్రాల కోసం వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కరెంటు బకాయిలు చెల్లించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కరెంటు మీటర్ల సీల్స్ చోరీ ముఠా అరెస్ట్
బంజారాహిల్స్: కరెంటు మీటర్లకు వేసే సీల్స్‌ను దొంగి లించి వాటిని విద్యుత్ చౌర్యానికి పాల్పడేవారికి విక్రయిస్తున్న ముఠాను జూబ్లీహిల్స్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బంజారాహిల్స్ డివి జన్ ఏసీపీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జూబ్లీహిల్స్ సీఐ సామల వెంకట్‌రెడ్డి, డీఐ ముత్తు ఈ ఘట న వివరాలు వెల్లడించారు. జవహర్‌నగర్ జీటీఎస్ కాలనీలో ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్స్ గోడౌన్ లో మహ్మద్ నయీం(27) మీటర్ సీల్స్ పను లు చేస్తున్నాడు. ఇతడు కొంతకాలంగా కరెంటు మీటర్లకు వేసే సీల్స్‌ను దొంగిలిస్తున్నాడు. వీటిని ఎలక్ట్రీషియన్లు అయిన మహ్మద్ బాసిత్‌ఖాన్(39), మహ్మద్ నిసార్(32), గులాం సాం దాని(42), మహ్మద్ సాదిక్ హుస్సేన్(43)కు విక్రయించేవాడు. వీరు ఫ్యాక్టరీలు, బడా గోదాములకు ఈ మీటర్ సీళ్లను విక్రయిస్తున్నారు. ఇలా ఓ ఐస్ ఫ్యాక్టరీ యజమాని తనకు నెలనెలా లక్షల్లో కరెంటు బిల్లు వస్తుండటంతో మీటర్ సీల్ తొలగించి ముంబయి నుంచి ప్రత్యేకంగా ఎలక్టీషియన్ను రప్పించి మీటర్ ను ట్యాంపరింగ్ చేయించి దొంగిలించిన మీట ర్ సీల్‌ను వేశాడు. ఇదిలా ఉండగా, తన కార్యాలయంలో 130 మీటర్ సీళ్లు చోరీకి గురయ్యాయని ఇటీవల ఏఈ మురళీధర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సదరు ఏఈ కిందనే పని చేస్తున్న నయీం ఈ పని చేసినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నయీం వద్ద 59 సీల్ బిట్స్ లభించాయి. వాటి ని స్వాధీనం చేసుకుని నయీంతో పాటు ముగ్గురు ఎలక్టీషియన్లు, ఐస్ ఫ్యాక్టరీ మేనేజర్‌ను అరెస్టు చేశారు. ఎలా పని చేస్తుందంటే: జీటీఎస్కాలనీలోని మీటర్ సీల్స్ గోదాంనుంచి నయీం సీళ్లను చోరీచేసి ఒక్కొక్కటి రూ. 500 కు బాసిత్ అనే ఎలక్ట్రీషియన్‌కు విక్రయించేవాడు. బాసిత్ ఐస్ ఫ్యాక్టరీ యజమానికి రూ. 15 వేలకు సీల్ బిట్స్ విక్రయించాడు. ముం బయి నుంచి మీటర్ ట్యాంపరింగ్ చేసే వ్యక్తిని రప్పించి ఒరిజినల్ మీటర్ సీల్ తొలగించి దొం గిలించిన సీల్‌ను వేశారు. తర్వాత ఎప్పుడంటే అప్పుడు మీటర్ తిరిగేలా దానికి ఎలక్ట్రిక్ రిమో ట్ కంట్రోల్‌ను కూడా బిగించారు. మొత్తం 130 సీళ్లు చోరీ కాగా, వాటిలో 59 మాత్రమే పోలీసులకు చిక్కాయి. మిగతావి ఎక్కడ బిగించారో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. -
ఇక రీచార్జ్ చేసుకుంటేనే కరెంటు!
తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు ఆ తర్వాత ఇతర కనెక్షన్లుకు విస్తరించే యోచన మార్చి 31లోగా బిగించాలని ఆదేశాలు జారీ ఇంట్లో కరెంటు పోయిందా.. రీచార్జ్ చేసుకోలేదేమో.. కరెంటుకు రీచార్జేంటి అనుకుంటున్నారా.. త్వరలో ఈ విధానం నగరంలో అమలుకాబోతోంది. మొబైల్ రీచార్జ్ చేసుకున్నట్లు కరెంటుకు కూడా రీచార్జ్ చేసుకోవాలి భవిష్యత్తులో.. సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): విద్యుత్ దుబారాను అరికట్టడంతో పాటు ప్రతి యూనిట్‌ను పక్కగా లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న మెకానికల్ విద్యుత్ మీటర్ల స్థానంలో ఇకపై ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను అమర్చేందుకు రంగం సిద్ధమైంది. తొలి విడతగా ప్రభుత్వ కార్యాలయాలకు వీటిని బిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జీఓ కూడా జారీ చేసింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. వీధిలైట్లకు మినహా అన్ని ప్రభుత్వ సంస్థలన్నింటికీ ఈ మీటర్లను బిగించాలని సూచించింది. ఇందుకోసం ఇప్పటికే ఐదు వేల మీటర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఈ తరహా మీటర్లను గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు అమర్చడం ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, గృహాల్లో చోటు చేసుకుంటున్న విద్యుత్ దుబారాకు కళ్లెం వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా సంస్థకు వస్తున్న నష్టాలను కూడా నివారించవచ్చని అధికారులు యోచిస్తున్నారు. నగరంలో చాలామంది తమ ఇళ్లను అద్దెకు ఇస్తున్నారు. చాలా మంది విద్యుత్ వినియోగంపై ఆంక్ష లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇటు యజమానులకు, అటు అద్దెవాసులకు మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రీపెయిడ్ మీటర్లను అమర్చడం వల్ల విద్యుత్ వృథాను అరికట్టవచ్చని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క ‘గ్రేటర్’ పరిధిలోనే సుమారు 39 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో రెండు వేలకుపైగా ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీటి నుంచి నెలకు అరకోటికిపైగా విద్యుత్ బిల్లులు రావాల్సి ఉంది. ప్రభుత్వం తమకు నిర్వహణ ఖర్చులు ఇవ్వడం లేదనే సాకుతో చాలా మంది అధికారులు తమ ఆఫీసుకు సంబంధించిన కరెంట్ బిల్లులు చెల్లించడం లేదు. ఫలితంగా డిస్కం రూ.కోట్లు నష్టపోవాల్సి వస్తుంది. ఇలా పనిచేస్తాయి... ప్రస్తుతం ఉన్న పాత మెకానికల్ మీటర్లను తొలగించి, దాని స్థానంలో ప్రీపెయిడ్ కార్డుతో అనుసంధానించిన ప్రత్యేక మీటర్‌ను (సెల్‌ఫోన్ రీచార్జ్ తరహా) అమర్చుతారు. దీనికి ఓ సిమ్‌కార్డును అనుసంధానిస్తారు. విని యోగదారుడు ప్రతినెలా తన చేతిలోని సెల్ ఫోన్ రీచార్జీ చేసుకున్నట్లుగానే ఇకపై ఇంట్లోని విద్యుత్ మీటర్‌ను రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కార్డులో బ్యాలెన్స్ ఉన్నంత వరకే ఇంట్లో విద్యుత్ లైట్లు వెలుగుతాయి. లేదంటే కార్డును రీచార్జీ చేసుకునే వరకు చీకట్లు తప్పవు. ఇందు కోసం ఆయా కార్యాలయాలు, సంస్థలు ఎలాంటి అదనపు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికయ్యే పూర్తి ఖర్చును డిస్కమే భరిస్తుంది. మొదటి దశలో ప్రభుత్వ కార్యాలయాల్లో అమలు చేసి, ఆ తర్వాత గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్లకు కూడా ఈ తరహా సేవలను వ ర్తింపజేయాలని అధికారులు భావిస్తున్నారు. -
విద్యుత్ సౌధలో ఆంక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు నిలువెత్తు ప్రతిరూపం విద్యుత్ సౌధ.. ఉద్యమ రోజుల్లో తెలంగాణకు వ్యతిరేకంగా ఎక్కడ ఏం జరిగినా విద్యుత్ సౌధ నుంచి తక్షణమే ప్రతిస్పందన వినిపించేది. సమైక్య రాష్ట్ర పాలకులు సైతం విద్యుత్ ఉద్యోగులను నియంత్రించే సాహసం చేయలేకపోయారు. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చి రెండేళ్లయినా కాకముందే విద్యుత్ సౌధలో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. మీడియాతో ఉద్యోగులెవరూ మాట్లాడొద్దని ఆదేశిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సర్క్యులర్ జారీ చేశారు. దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే ‘దుష్ర్పవర్తన’ కింద పరిగణించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు ఉద్యోగుల ప్రవర్తనా నియమావళి చట్టంలోని 43వ నిబంధనను అడాప్ట్ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీన జారీ చేసినట్లు పేర్కొంటున్న ఈ సర్క్యులర్‌ను గురువారం ట్రాన్స్‌కో అధికారిక వెబ్సైట్లో ఉంచడంతో వెలుగు చూసింది. అనధికారికంగా పత్రికలకు ఏదైనా ప్రకటన చేసినా, పత్రికలు, మేగజైన్లలో ఏదైనా వార్త కథనానికి సహకరించినా, ముందస్తు అనుమతి లేకుండా రేడియోలో మాట్లాడినా, మీడియా లేక కరపత్రాల ద్వారా విన్నపాలు వినిపించినా... సదరు ఉద్యోగులపై క్రమ శిక్షణ చర్యలు తప్పవని అందులో హెచ్చరించారు. ఇక విద్యుత్ సౌధలో ఇటీవల అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సందర్శకుల రాకపోకలపై నిఘా ఉంచుతున్నారు. దీంతో విలేకరులను కలిసేందుకు కొందరు అధికారులు నిరాకరిస్తున్నారు. ఈఆర్సీకి వెళ్లొద్దు.. విద్యుత్ రంగానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)లో వ్యాజ్యాలు వేయవద్దని విద్యుత్ ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. సాధారణంగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, చార్జీల పెంపు వంటి వాటికి ఈఆర్సీ ఆమోదం తప్పనిసరి. ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించే ముందు ఈఆర్సీ ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలను ఆహ్వానిస్తుంది. సాంకేతికంగా క్లిష్టంగా ఉండే విద్యుత్ చట్టాలు, అంశాలపై పట్టున్న విద్యుత్ రంగ నిపుణులు మాత్రమే వీటిపై స్పందించగలుగుతారు. విద్యుత్ రంగ నిపుణులు కె.రఘు, తిమ్మారెడ్డి వంటి కొందరు మాత్రమే ప్రజల తరఫున ఈఆర్సీకి వెళుతున్నారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందంపై తీవ్ర అభ్యంతరాలతో కె.రఘు వేసిన వ్యాజ్యం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ ఉద్యోగులు ఎవరూ ఈఆర్సీకి వెళ్లవద్దనే ఆదేశాలు జారీ అయ్యాయి. అలాంటి హక్కు ఎవరికీ లేదు ‘పత్రికలకు సమాచారం ఇవ్వవద్దని సర్క్యులర్ జారీ చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే. అలాంటి హక్కు ఎవరికీ లేదు. దీనిని ఖండిస్తున్నాం..’ - దేవులపల్లి అమర్, ఐజేయూ సెక్రటరీ జనరల్ -
పవర్ షాక్!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: విద్యుత్ వినియోగదారులకు త్వరలో చార్జీల షాక్ కొట్టనుంది. చార్జీలను పెంచుతూ విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాయి. త్వరలో ఈ చార్జీల పెంపునకు సర్కారు సైతం అధికారికంగా ఆమోదముద్ర వేయనుంది. దీంతో జిల్లాలోని వినియోగదారులపై రూ.185.07కోట్ల భారం పడనుంది. చార్జీల పెంపు ప్రక్రియను పలు శ్లాబులుగా విభజించి పంపిణీ సంస్థలు వాత పెట్టనున్నాయి. అయితే 100 యూనిట్లు వాడే వినియోగదారులకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. మిగతా అన్ని కేటగిరీలపైనా చార్జీల భారం పడనుంది. పెంచిన చార్జీలు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతంలో 21,52,737 విద్యుత్ కనెక్షన్లున్నాయి. ఇందుకు ప్రతిరోజు 23.5 మిలియన్ యూనిట్ల విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందు లో గృహావసరాలకు 6.11 మిలియన్ యూనిట్లు, పరిశ్రమలకు 5.17 మిలియన్ యూనిట్లు, వ్యవసాయానికి 7.05 మిలియన్ యూనిట్లు, ఇతర అవసరాలకు 5.17 యూనిట్లు సరఫరా చేస్తున్నారు. విద్యుత్ పంపిణీ ద్వారా జిల్లా నుంచి పంపిణీ సంస్థకు వార్షికాదాయం రూ.3,214.36 కోట్లు సమకూరుతుంది. తాజాగా చార్జీలను పెంచనుండడంతో జిల్లా నుంచి అదనంగా రూ.185.07 కోట్ల ఆదాయం డిస్కంలకు పెరగనుంది. ఈ లెక్కన పంపిణీ సంస్థ జిల్లా నుంచి ఆరు శాతం ఆదాయం అధికం కానుంది. విభజించి.. వడ్డించి.. తాజాగా విద్యుత్ చార్జీల పెంపులో వంద యూనిట్లలోపు వాడే వినియోగదారులకు చార్జీలో పెంపు లేదు. కానీ అంతకు ఒక్క యూనిట్ ఎక్కువ వాడినా చార్జీలు పెరగనున్నాయి. పంపిణీ సంస్థలు ప్రతిపాదించిన గణాంకాల ప్రకారం.. నెలకు 150 యూనిట్లు వాడే వినియోగదారుడికి ప్రస్తుతం రూ.440 బిల్లు వస్తుంది. తాజా పెంపుతో ఈ బిల్లు రూ.457.50కు పెరగనుంది. 200 యూనిట్లు వినియోగిస్తున్న వారికి ప్రస్తుత బిల్లు రూ.620 వస్తుండగా.. పెంపు ప్రక్రియతో ఈ బిల్లు రూ.645కు చేరనుంది. నెలకు 200 యూనిట్లు దాటితే నెలబిల్లులో రూ.50, అదేవిధంగా 250 యూనిట్లు దాటితే నెల వారీ బిల్లులో రూ.70 పెరుగుతుంది. ఇలా కేటగిరీల వారీగా విభజించి వినియోగదారులకు వాతలు పెట్టింది. -
ఖరారు కాని ఉచిత విద్యుత్ కోటా!
* కనెక్షన్ల కోసం రెండు రాష్ట్రాల్లో 2 లక్షల మంది రైతుల నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఏ జిల్లాకు ఎన్ని కనెక్షన్లు మంజూరు చేయాలనే విషయంలో ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా కొత్త ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం ఇప్పటికే డీడీలు చెల్లించిన రైతులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విధంగా 31 మార్చి 2014 నాటికి రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు లక్షా 70 వేల మంది రైతులు కొత్త కనెక్షన్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. మార్చి తర్వాత దరఖాస్తు చేసుకున్న వారినికూడా కలుపుకుంటే ఈ సంఖ్య ఏకంగా 2 లక్షలకు చేరుకుందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొత్త కనెక్షన్లు మంజూరు కాకపోవడంతో రైతులు పక్కదార్లవైపు చూస్తున్నారు. రైతులు ఈ విధంగా కొక్కేల ద్వారా అనధికారికంగా కరెంటును వాడుకోవడంతో ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో పదే పదే ట్రిప్ అవుతున్నాయి. అదేవిధంగా లో ఓల్టేజీ సమస్య కారణంగా మోటార్లు కూడా కాలిపోతున్నాయి. ఇది రైతులకు అదనపు భారంగా మారుతోంది. దీనిని నివారించేందుకు వ్యవసాయ సీజను కంటే ముందుగానే కోటా నిర్ణయిస్తే మంచిదని రైతులు అభిప్రాయపడుతున్నారు. -
త్వరలో వ్యవసాయ కనెక్షన్ల క్రమబద్ధీకరణ
మంత్రి డి.కె.శివకుమార్ పహణిలో మార్పులు చేసే అధికారం తహశీల్దార్లకు : సీఎం సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్ అక్రమ కనెక్షన్లను క్రమబద్ధీకరించడానికి త్వరలోనే సర్క్యులర్‌ను జారీ చేయనున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివ కుమార్ తెలిపారు. శాసన సభలో సోమవారం జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ర్టంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న విద్యుత్‌ను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయానికి దశలవారీ ఏడు గంటల పాటు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. కాగా రైతుల భూములకు సంబంధించి పహణిలో మార్పులు చేసే అధికారాన్ని తహసిల్దార్లకు అప్పగిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ వెంటనే ఈ అధికారాన్ని తహసిల్దార్లకు దఖలు పడేలా ఆదేశాలను జారీ చేస్తామన్నారు. అంతకు ముందు జేడీఎస్ సభ్యుడు బాలకృష్ణ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, పహణిలో మార్పులు, చేర్పుల అధికారం ప్రస్తుతం సహాయ కమిషనర్లకు మాత్రమే ఉన్నందున, రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతంలో మాదిరి తహసిల్దార్లే ఈ మార్పులు చేసి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
45 రోజుల్లో సమస్య పరిష్కారం
విజయనగరం మున్సిపాలిటీ:విద్యుత్ వినియోగదారుల సమస్యలను 45 రోజుల్లో పరిష్కరిస్తామని విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక చైర్మన్ పి.నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇందు కోసం 180042555333 టోల్‌ఫ్రీ నంబరుకు కాల్ చేయూలని సూచించారు. వినియోగదారులు తెల్లకాగితంపై తమ సమస్యను నేరుగాగానీ, పోస్టులోగానీ ఫిర్యాదు చేసినా స్వీకరించి తగు న్యాయం చేస్తామని చెప్పారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్వర సేవలు పొందాలని సూచించారు. దాసన్నపేట విద్యుత్ భవన్లో విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదిక బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వినియోగదారులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, అంతరాయం, మీటర్ సమస్యలు, బిల్లులు అధికంగా రావటం, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి తదితర అంశాలపై ఫిర్యాదు చేసే హక్కు ఉందన్నారు. వినియోగదారులు తమ సమస్యను వేదికలో విన్నవించుకున్న 45 రోజుల్లో పరిష్కరిస్తుందన్నారు. స్థానికంగా ఉన్న అధికారులకు ఇదే తరహాలో ఫిర్యాదు చేయవచ్చని గుర్తు చేశారు. సమీపంలో ఉన్న కాల్‌సెంటర్‌కు వెళ్లి తమ సమస్యను నమోదు చేయించుకుంటే ఏఈ, ఏఓలు సమస్యను పరిష్కరిస్తారన్నారు. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సంస్థ పరిధిలో ఐదు జిల్లాల్లో మొత్తం 582 ఫిర్యాదులు రాగా అందులో 503 ఫిర్యాదులను పరిష్కరించామని మిగిలిన 73 ఫిర్యాదులను త్వరలో పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఇందులో విజయనగరం జిల్లా నుంచి 72 ఫిర్యాదులు రాగా 7 ఫిర్యాదులు పెండింగ్ ఉన్నాయన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 63 ఫిర్యాదులు రాగా 11, విశాఖపట్టణం జిల్లా లో 168 ఫిర్యాదులు రాగా 14, రాజమండ్రిలో 130 ఫిర్యాదులు రాగా 12, ఏలూరులో 149 ఫిర్యాదులు రాగా 29 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నట్లు వివరించారు. వీటన్నిం టినీ వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వేదిక సభ్యులు పీఎస్ కుమార్, యు.కె.వి.రామకృష్ణరాజు, ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ విజయనగరం డీఈ నాగి రెడ్డి కృష్ణమూర్తి, ఎస్ఏఓ వెంకటరాజు, పట్టణ ఏడీఈ బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. పరిష్కార వేదికకు 11 ఫిర్యాదులు... వినియోగదారుల సమస్యలను పరిష్కరించటంలో భాగం గా దాసన్నపేట విద్యుత్ భవన్లో నిర్వహించిన విద్యుత్ వినియోగదారుల పరిష్కార వేదికకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా నలుమూలల నుంచి 11 ఫిర్యాదులు అందాయి. ఇందులో ప్రధానంగా నెల్లిమర్ల, జామి ప్రాంతాల నుంచి వచ్చిన వినియోగదారులు తమకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరైనప్పటకీ సర్వీస్ నంబర్లు ఇవ్వటం లేదని ఫిర్యాదు చేశారు. వీటీ అగ్రహరంలో ఓల్టేజీ సమస్య తీవ్రంగా వేధిస్తోందని, కామాక్షి నగర్లో రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభం ఉండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుందని ఫిర్యాదులు వచ్చాయి. పేర్లు మార్పు, మీటర్ రీడింగ్ సమస్యలపై ఫిర్యాదులు రాగా రెండు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. వీటిని వేదిక చైర్మన్ పి.నాగేశ్వరరావు, సభ్యులు పీఎస్ కుమార్, యు.కె.వి.రామకృష్ణ స్వీకరించారు. -
మరో సర్దుపోటు
శ్రీకాకుళం, న్యూస్‌లైన్: విద్యుత్ వినియోగదారులపై మరో భారం పడింది. ఉరుము లేని పిడుగులా వరుసపెట్టి సర్దుబాటు చార్జీలతో విద్యుత్ సంస్థలు బాదేస్తున్నాయి. గత నెల నుంచే బిల్లులు ఎక్కువగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా దానికి సమాధానం చెప్పే నాథుడే లేకుండా పోయాడు. ఈ నెలలో కూడా అదే రీతిలో బిల్లు మొత్తాలు ఎక్కువగా ఉండటంతో ఆరా తీయగా సర్దుబాటు చార్జీల పేరిట అదనంగా వసూలు చేస్తున్నట్లు తేలింది. ఇప్పటికే స్పాట్ బిల్లింగ్ సిబ్బంది రీడింగులు తీయడంలో జాప్యం చేయడం వల్ల శ్లాబ్‌లు మారిపోయి, పెద్ద మొత్తంలో బిల్లులు రాగా, అది చాలదన్నట్లు సర్దుబాటు చార్జీలు వచ్చి చేరాయి. దీంతో పేద, మధ్య తరగతి వినియోగదారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. 2011-12 ఆర్థిక సంవత్సరంలోని సెప్టెంబర్ నుంచి వినియోగించిన విద్యుత్‌కు ఇప్పుడు సర్దుబాటు పేరిట ఇప్పుడు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇంతకుముందు యూనిట్‌కు 50 పైసల లోపే సర్దుబాటు చార్జీలు ఉండేవి. ఇప్పుడు అంతకంటే ఎక్కువే వడిస్తున్నారు. గత మూడేళ్లుగా సర్దుబాటు పేరిట అదనపు వసూళ్లు చేస్తున్నారు. 2010-11, 2012-13 సంవత్సరాలకు సంబంధించిన వసూల్లు ఇప్పటికే జరిగిపోయాయి. ప్రస్తుతం 2011-12 సంవత్సరానికి సంబంధించిన సర్దుబాటు చార్జీలను ఎనిమిది నెలల పాటు వసూలు చేస్తారు. ఇది కూడా 2014 సెప్టెంబర్‌లోగా పూర్తి చేయాలని ఈఆర్సీ ఆదేశాలు జారీ చేయడంతో ఆ మేరకు ఏర్పాట్లు చేసుకున్నారు. వైఎస్సార్ హయాంలో యూనిట్ చార్జీ ఓ పైసా కూడా పెరగకపోగా, అటు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చార్జీలను పెంచడమే కాకుండా, సర్దుబాటు పేరిట సంవత్సరాల తరబడి అదనపు భారం మోపుతుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా ఇటువంటి అక్రమ వసూళ్లను ఆపివేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. విషయాన్ని ట్రాన్స్‌కో ఎస్ఐ పి.వి.వి.సత్యనారాయణ వద్ద ప్రస్తావించగా సర్దుబాటు ఛార్జీలు వసూలు చేస్తుండడమే నిజమేనని చెప్పారు.