సాక్షి, హైదరాబాద్: కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం అన్నదాతలకు ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) పరిధిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 59,689 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అందులో 905 దరఖాస్తులు ఐదేళ్లు, ఆపై కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.
రైతులు రూ.5వేలు డిపాజిట్ కట్టి దరఖాస్తు చేసుకుంటే, ఒక్కో కనెక్షన్‌పై డిస్కంలు రూ.70వేల వరకు ఖర్చు చేస్తాయి. పౌర సేవల పట్టిక ప్రకారం.. క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా సానుకూలతలుంటే, దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోగా కనెక్షన్ జారీచేయాలి. కొత్త విద్యుత్ లైన్‌తోపాటు కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి వస్తే, క్షేత్రస్థాయి ఏఈ ఆధ్వర్యంలో అంచనాలను రూపొందిస్తారు.
ఇందులో డిస్కంల వాటా రూ.70వేలు పోగా, దరఖాస్తుదారులు తమ వాటా మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలి. ఆ తర్వాత 30 రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వాలి. రైతులు డీడీలు కట్టకపోవడంతో 7,219 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, శాఖాపరమైన కారణాలతో ఏకంగా 59,689 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధిక శాతం రైతులు డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా కనెక్షన్లు జారీ కాకపోవడం గమనార్హం.
రైతులకు వేధింపులు
క్షేత్రస్థాయి అధికారుల అవినీతితో కనెక్షన్ల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో.. డిస్కంలు 2016 జనవరి నుంచి ‘ఫస్ట్ ఇన్– ఫస్ట్ అవుట్ (ఫిఫో)’ అనే విధానాన్ని తెచ్చాయి. దీని ప్రకారం కస్టమర్ సర్వీస్ సెంటర్లు, మీ–సేవా కేంద్రాల ద్వారానే దరఖాస్తులు స్వీకరించి, ముందు దరఖాస్తు చేసుకున్న ముందు కనెక్షన్లు జారీ చేయాలి. గ్రామాల వారీగా సీనియారిటీ జాబితాను రూపొందించి డిస్కంల కార్యాలయాలు, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించాలి.
కానీ ఎక్కడా చేయడం లేదు. పంటలను కాపాడటానికి అత్యవసరంగా విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని ప్రజాప్రతినిధులు సిఫారసు చేస్తేనే సీనియారిటీని పక్కనబెట్టాల్సి ఉంటుంది. చేతులు తడిపిన వారు, పైరవీలు చేసిన వారికే ముందు కనెక్షన్లు ఇస్తుండటంతో దరఖాస్తులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్నట్టు ఆరోపణలు న్నాయి. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది లంచాల కోసం రైతులను వేధిస్తున్నారని ఇటీవల విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణల్లో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దంపడుతోంది.
డీడీలు కట్టి మూడేళ్లనా...
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిట్టకంకల్ గ్రామానికి చెందిన రావుల కిష్టయ్య, ఎం.వెంకటయ్య, ఎం.పోచయ్య అనే రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం 2019 ఏప్రిల్ 1న డీడీలు కట్టారు. అయినా ఇప్పటివరకు అతీగతీ లేదు. దీంతో తక్షణమే లైన్‌వేయాలని ఈఆర్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా చాలామంది రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ ఈఆర్సీకి లేఖలు రాశారు.
విద్యుత్ మంత్రి ఇలాఖాలోనూ..
ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను విద్యుత్ సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా నల్లగొండలో 329, నాగర్‌కర్నూల్ జిల్లాలో 212, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సొంత ఇలాఖా సూర్యాపేటలో 203, గద్వాల్‌లో 89, యాదాద్రిలో 27, వనపర్తిలో 26, మేడ్చల్‌లో 19, మహబూబ్‌నగర్‌లో 15, సైబర్‌సిటీలో 10, వికా రాబాద్‌లో 6, సరూర్‌నగర్, సంగారెడ్డిలో చెరో 5, రాజేంద్రనగర్‌లో 4 పెండింగ్‌లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment