TSSPDCL
-
ఫోన్ పే, జీపే, పేటీఎం.. ద్వారా విద్యుత్తు బిల్లు చెల్లించకూడదు
ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం..వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా ఎలాంటి విద్యుత్తు బిల్లులు చెల్లించకూడదని టీజీఎస్పీడీసీఎల్ తెలిపింది. జులై 1 నుంచి ఈ నిబంధన అమలులోకి వచ్చిందని చెప్పింది. భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. భవిష్యత్తులో టీజీఎస్పీడీసీఎల్ లేదా ఎస్పీడీసీఎల్ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మాత్రమే విద్యుత్తు బిల్లులు చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో వివరాలు వెల్లడించింది.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..‘ఎస్పీడీసీఎల్ పరిధిలో 85 శాతానికి పైగా పవర్ బిల్లు చెల్లింపులు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ల (టీపీఏపీ) ద్వారానే జరుగుతున్నాయి. ఇందుకోసం కొన్ని యూపీఐ ఆధారిత యాప్‌లను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం..బ్యాంకు యాప్‌లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్)లో నమోదవ్వాలి. కానీ చాలా థర్డ్ పార్టీ యాప్‌లకు సేవలందిస్తున్న బ్యాంకులు ఇంకా ఈ సిస్టమ్‌ను యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో సదరు చెల్లింపులను నిలిపేస్తున్నాం’ అని తెలిపారు.Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024ఆర్బీఐ నిబంధనలు..జులై 1 నుంచి ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఆధ్వర్యంలోని భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (బీబీపీఎస్) ద్వారానే చెల్లింపులు చేయాలని పేర్కొంది. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇందులో భాగంగా యూపీఐ సేవలందించే బ్యాంకులు బీబీపీఎస్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. కానీ ఇప్పటివరకు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రధాన బ్యాంకులు ఈ సిస్టమ్‌ను ఎనేబుల్ చేసుకోలేదు. దానివల్ల ఫోన్‌పే, గూగుల్ పే, అమెజాన్ పే.. వంటి థర్డ్‌పార్టీ యాప్‌ల్లో బిల్లులు చెల్లించలేరు. ఆ యాప్‌ల ద్వారా క్రెడిట్ కార్డుల నుంచి కూడా బిల్లు పేమెంట్ చేయలేరు.ఇదీ చదవండి: హెచ్డీఎఫ్సీ యూపీఐ సేవలు నిలిపివేత.. ఎప్పుడంటే..ఇదిలాఉండగా ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ బ్యాంకులు బీబీపీఎస్ ప్లాట్ఫామ్లో నమోదయ్యాయి. కాబట్టి పైన తెలిపిన బ్యాంక్ కస్టమర్లు థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపులను కొనసాగించవచ్చు. -
TGSPDCL: ఫోన్‌పే, పేటీఎంలో కరెంటు బిల్లులు చెల్లించకండి
సాక్షి,హైదరాబాద్: ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే లాంటి యూపీఐ పేమెంట్ యాప్‌ల ద్వారా ఈజీగా విద్యుత్ బిల్లులు చెల్లించే ఛాన్సు ఇక లేదు. ఈ నెల నుంచి విద్యుత్ బిల్లులు యూపీఐ యాపుల్లో పే చేయడం కుదరదు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే యూపీఐ పేమెంట్ యాప్స్ ఈ సేవలను నిలిపి వేశాయి. ఈ నేపథ్యంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తమ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ రెండింటి ద్వారానే ఈ నెల కరెంటు బిల్లులు చెల్లించాలని వినియోగదారులను కోరింది. ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి జులై 1 నుంచి ఆయా చెల్లింపు సంస్థలు టీజీఎస్పీడీసీఎల్ విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేశాయని ఆ సంస్థ ఎక్స్(ట్విటర్) ద్వారా తెలిపింది. ఒక్క దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థే కాకుండా ఉత్తర తెలంగాణకు సంబంధించిన టీజీఎన్పీడీసీఎల్ విద్యుత్ పంపిణీ సంస్థది అదే పరిస్థితని తెలుస్తోంది. Dear Consumers, As per the RBI directions, the Service Providers viz., PhonePe, Paytm, Amazon Pay, Google Pay and Banks have stopped to accept the electricity bills of TGSPDCL w.e.f. 01/07/2024. Hence, all the consumers are requested to make the monthly current bill payments…— TGSPDCL (@tgspdcl) July 1, 2024 -
HCA: రూ. కోటికి పైగా బిల్లు చెల్లింపు.. వివాదానికి ముగింపు
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీఎస్ఎస్పీడీసీఎల్)తో నడుస్తున్న విద్యుత్ వివాదానికి హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ముగింపు పలికింది. హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవ్‌రాజ్ నేతృత్వంలోని కార్యవర్గం ఇందుకు శుభం కార్డు వేసింది. ఈ క్రమంలో 2015లో మొదలైన ఈ విద్యుత్ జగడానికి తాము స్వస్తి పలికినట్లు జగన్మోహన్ రావు వెల్లడించారు. సుమారు రూ. ఒక కోటీ 64 లక్షల విద్యుత్ బిల్లు బకాయిగా ఉండగా, ఐపీఎల్ సమయంలో తొలుత రూ.15 లక్షలు చెల్లించామని ఆయన చెప్పారు. మిగిలిన మొత్తం 45 వాయిదాల్లో చెల్లించాలని అనుకున్నామన్నారు. అయితే హెచ్‌సీఏ పేరు ప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి అంతా చెల్లించామని ఆయన వివరించారు.ఈ మేరకు మంగళవారం టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషా రఫ్ అలీ ఫరూఖీకి జగన్మోహన్ రావు రూ.1 కోటి 48 లక్షల 94 వేల 521ల మొత్తాన్ని చెక్ రూపంలో అందించారు. విద్యుత్ బిల్లు పెండింగ్‌లో ఉందనే కారణంతో ఐపీఎల్ సందర్భంగా క్రికెటర్లు ప్రాక్టీసు చేస్తుండగా కరెంట్ తీసేసి, హైదరాబాద్, తెలంగాణ ఇమేజ్ను దెబ్బతీసే విధంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫరూఖీని జగన్ ఈ సందర్భంగా కోరారు.చదవండి: ఇంటర్వ్యూకు హాజరైన గంభీర్ -
HYD: మహిళా అధికారికి వేధింపులు.. సీఐడీ ఎస్పీపై కేసు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. TSSPDCLలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహిళా అధికారిని సీఐడీ ఎస్పీ వేధింపులకు గురిచేశాడు. తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వివరాల ప్రకారం.. తెలంగాణలో సీఐడీ విభాగంలో ఎస్పీ ర్యాంకులో పనిచేస్తున్న కిషన్ సింగ్‌పై కేసు నమోదైంది. దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో టీఎస్ఎస్పీడీసీఎల్ విభాగంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి సీఐడీ ఎస్పీపై ఫిర్యాదు చేసింది. తన ఫోన్‌కు సీఐడీ ఎస్పీ అసభ్యకరమైన మేసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు పంపుతున్నారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అంతకుముందు.. తాను స్పెషల్ క్లాసులు నిర్వహిస్తున్నానని వాటిలో పాల్గొనాలని మహిళా ఉద్యోగినికి చెప్పిన కిషన్ సింగ్.. ఆమె వద్ద నుంచి ఫోన్ నంబర్ తీసుకున్నట్టు తెలిపారు. కాగా, ఆమె ఫిర్యాదుతో కిషన్ సింగ్‌పై కేసు నమోదు చేసినట్టు చైతన్యపు పోలీసులు వెల్లడించారు. విచారణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ట్యాంక్ బండ్‌పై కారు బీభత్సం.. హుస్సేన్ సాగర్‌లోకి దూసుకెళ్లి.. -
10,783 కనెక్షన్లకు ‘జీరో’ బిల్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసలే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లను కొందరు అధికారులు, సిబ్బంది మరింతగా ముంచుతున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలో ఏకంగా 10,783 విద్యుత్ కనెక్షన్లకు జీరో యూనిట్ల వినియోగంతో బిల్లులు జారీ చేస్తున్నట్లు సంస్థ విజిలెన్స్ విభాగం విచారణలో తేలింది. దీంతో సంస్థ ప్రతి నెలా రూ. లక్షల్లో ఆదాయాన్ని నష్టపోయినట్లు వెల్లడైంది. అయితే ఆయా బిల్లుల వాస్తవ మొత్తాలను వినియోగదారుల నుంచి కొందరు అధికారులు, సిబ్బంది వసూలు చేసుకొని జేబులో వేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావుకు జి.సత్యనారాయణ అనే న్యాయవాది చేసిన ఫిర్యాదుతో ఈ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. సాధారణంగా ప్రతి విద్యుత్ కనెక్షన్‌కు ఒక మీటర్, ఆ మీటర్‌కు ఒక విశిష్ట సంఖ్య ఉంటుంది. కానీ ఒకే మీటర్ నంబర్‌తో 10,783 సర్విసు కనెక్షన్లు ఉన్నట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. 2,788 కనెక్షన్లపైనే విచారణ.. ఈఆర్సీ సూచనలతో టీఎస్ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగంతో విచారణ జరిపించింది. 10,783 సర్వీసు కనెక్షన్లలో 2,788 కనెక్షన్లను మాత్రమే విజిలెన్స్ విభాగం తనఖీ చేయగలిగింది. సిబ్బంది కొరతతో మిగిలిన కనెక్షన్లను తనిఖీ చేయలేకపోయింది. తనఖీ చేసిన 2,788 కనెక్షన్లలో కేవలం 687 కనెక్షన్లకే మీటర్లున్నాయని, మిగిలిన 2101 కనెక్షన్లకు మీటర్లు లేవని గుర్తించింది. తనిఖీ చేసిన కనెక్షన్లకు సంబంధించి తప్పుడు మీటర్ రీడింగ్‌ను నమోదు చేసి బిల్లులు జారీ చేయడంతో సంస్థ రూ. 9.32 లక్షల ఆదాయాన్ని నష్టపోయినట్టు నిర్ధారించింది. 10,783 కనెక్షన్లలో ఏకంగా 4,842 కనెక్షన్లకు మీటర్లే లేవని నాగర్‌కర్నూల్ డీఈ మరో నివేదికలో టీఎస్ఎస్పీడీసీఎల్కు తెలియజేశారు. ఒక్క నాగర్‌కర్నూల్ డివిజన్ పరిధిలోనే ఈ పరిస్థితి బయటపడగా రాష్ట్రవ్యాప్తంగా ఈ తరహా అవకతవకతలతో డిస్కంలు రూ. వందల కోట్ల మేర ఆదాయాన్ని నష్టపోతున్నాయని ఆరోపణలున్నాయి. 41 మందిపై చర్యలకు ఆదేశం.. నాగర్‌కర్నూల్ డివిజన్లో వెలుగు చూసిన భారీ అక్రమాల్లో స్థానికంగా పనిచేసే 41 మంది ఓఅండ్ఎం విభాగం అధికారులు, సిబ్బంది, మరో ముగ్గురు అకౌంట్స్ విభాగం అధికారులను బాధ్యులుగా విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా 14 మంది ఏఈలు, నలుగురు ఏడీఈలు, మరొక డీఈపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎండీ జి.రఘుమారెడ్డి ఆదేశించారు. వారి బాధ్యతారాహిత్యం, విధుల్లో నిర్లక్ష్యంతోనే మీటర్ రీడర్లు అక్రమాలకు పాల్పడ్డారని, వారితోపాటు ప్రైవేటు మీటర్ రీడింగ్ ఏజెన్సీపైనా చర్యలు తీసుకోవాలన్నారు. అయితే ఈ వ్యవహారంలో ఇంకా ఎవరినీ సస్పెండ్ చేయలేదని అధికార వర్గాలు తెలిపాయి. -
టీఎస్ ఎస్పీడీసీఎల్లో 1,661 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,553 జూనియర్ లైన్‌మన్ పోస్టుల భర్తీకి గురువారం సమగ్ర నియామక ప్రకటనలు జారీ అయ్యాయి. ఏఈ పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే నెల 15వరకు.. జేఎల్ఎం పోస్టులకు వచ్చే నెల 8 నుంచి 28 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రెండు పరీక్షలకు కూడా ఏప్రిల్ 24 నుంచి ఆన్లైన్లో హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30న రాతపరీక్ష నిర్వహించనున్నారు. గరిష్ట వయోపరిమితి జేఎల్ఎం పోస్టులకు 35 ఏళ్లు, ఏఈ పోస్టులకు 44 ఏళ్లు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు అర్హులు. జూనియర్ లైన్‌మన్ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్మన్ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. పూర్తి వివరాలకు సంస్థ వెబ్సైట్ (https://tssouthernpower.cgg.gov.in) ను సందర్శించవచ్చని టీఎస్ ఎస్పీడీసీఎల్ ప్రకటించింది. -
షాకింగ్ ఘటన: చనిపోయిన ఉద్యోగికి పదోన్నత కల్పిస్తూ పోస్టింగ్!
సాక్షి, హైదరాబాద్: పదవీ విరమణ చేసిన ఓ ఇంజనీర్‌కు ఏకంగా ఎనిమిదేళ్ల పాటు డబుల్ శాలరీ ఇచ్చిన అంశాన్ని ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే...తాజాగా చనిపోయిన మరో ఇంజనీర్‌కు ఏకంగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్ కూడా ఇచ్చిన ఉదంతం వెలుగు చూసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ హెచ్ఆర్ విభాగంలోని అధికారుల తప్పిదాలకు సంస్థ ఆర్థికంగా నష్టపోవడంతో పాటు ప్రజల్లో అభాసుపాలవుతోంది. రెండేళ్ల క్రితమే చనిపోయిన మల్లయ్య.. పి.మల్లయ్య (ఐడీ నంబర్ 1077222) మొదట్లో మెట్రోజోన్ పరిధిలోని డీఈ కేబుల్ ఆఫీసులో సబ్ ఇంజనీర్‌గా పనిచేశారు. అటు నుంచి బంజారాహిల్స్‌కు సబ్‌ఇంజనీర్‌గా బదిలీపై వెళ్లారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన సుమారు రెండేళ్ల క్రితమే మృతి చెందారు. డిస్కం ఉన్నతాధికారులు చనిపోయిన మల్లయ్య స్థానంలో కారుణ్య నియామకం కింద ఆయన కుమార్తెకు సబ్ ఇంజనీర్‌గా ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం ఆమె సైబర్‌సిటీ సర్కిల్ ఆఫీసులోని కమర్షియల్ సబ్ ఇంజనీర్‌గా పని చేస్తోంది. రెండు రోజుల క్రితం పదోన్నతి రెండు రోజుల క్రితం 49 మంది సబ్ ఇంజనీర్లకు డిస్కం ఏఈలుగా పదోన్నతులు కల్పించింది. వీరిలో ఆ మేరకు పదోన్నతులు పొందిన వారి పేర్లతో సహా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే డిస్కం జారీ చేసిన ఈ జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటమే కాకుండా ఆయనకు సబ్ ఇంజనీర్ నుంచి ఏఈగా పదోన్నతి కల్పించారు. ఏకంగా ఆయనకు వికారాబాద్‌లో పోస్టింగ్ కూడా ఇచ్చేశారు. ఏఈల జాబితాలో చనిపోయిన మల్లయ్య పేరు ఉండటాన్ని చూసి తోటి ఇంజనీర్లు ఆశ్చర్యపోయారు. అదేమిటని సంబంధిత సెక్షన్ అధికారులను, హెచ్ఆర్ డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో చేసిన తప్పిదాన్ని ఆ తర్వాత సరిదిద్దుకున్నారు. (చదవండి: ఖాతాలు, మనుషులే.. పారసైట్లు!) -
టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,601 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 48 అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), 1,553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి గురువారం వేర్వేరు నియామక ప్రకటనలు జారీ చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తుల స్వీకరణ తదితర వివరాలతో ఈ నెల 15 లేదా ఆ తర్వాత పూర్తి స్థాయి నియామక ప్రకటనను సంస్థ వెబ్సైట్ల(www.tssouthernpower.com లేదా tssouthern-power.cgg.gov.in)) లో పొందుపరచనున్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు కలిగిన వారు ఏఈ(ఎలక్ట్రికల్) పోస్టులకు అర్హులు కానున్నారు. జూనియర్ లైన్మెన్ పోస్టులకు పదో తరగతితోపాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్లలో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. గతేడాది 1,000 జేఎల్ఎం పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి నిర్వహించిన రాతపరీక్షలో అక్రమాలు జరిగినట్టు గుర్తించడంతో ఆ నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దుచేశారు. కొత్తగా మళ్లీ నోటిఫికేషన్ జారీ చేస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు పోస్టుల సంఖ్యను 1,553కి పెంచి తాజాగా సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసింది. -
టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,661 పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న 1,553 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 48 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు కలిపి మొత్తం 1,661 పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ జారీ చేయాలని విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాపై మంగళవారం ఆయన మింట్ కాంపౌండ్ లోని తన కార్యాలయంలో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డితో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏడాదికేడాది విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోందని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 6,666 మెగావాట్లు ఉన్న గరిష్ట విద్యుత్ డిమాండ్ గతేడాది యాసంగిలో 14,160 మెగావాట్లకు పెరిగిందన్నారు. వచ్చే వేసవిలో 15,500 మెగావాట్లకు మించనుందని, అందుకు తగ్గట్టు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎండీలను ఆదేశించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, గృహ వినియోగదారుల పెరుగుదల, వ్యవ సాయ రంగానికి ఉచితవిద్యుత్ సరఫరాతో డిమాండ్ గణనీయంగా పెరిగిందన్నారు. -
లోన్ వస్తే ట్రాన్స్‘ఫార్మర్ల’కు మీటర్లు! వివరణ ఇచ్చిన టీఎస్ఎస్పీడీసీఎల్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు మీటర్ల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈ ఆర్సీ)కి దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) వివరణ ఇచ్చింది. మీటర్ల ఏర్పాటు కోసం రూ.93 కోట్ల రుణమివ్వాలని గతేడాది జూలై 22న గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్ఈసీ)కు ప్రతిపాదనలు పంపామ ని.. ఆ రుణం మంజూరయ్యాక మీటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపింది. అయితే దీనిపై ఆర్ఈసీ నుంచి ఇంకా స్పందన రాలేదని పేర్కొంది. రాష్ట్రంలో అన్ని వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు నిర్దేశిత గడువులోగా మీటర్లు బిగించి, వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని కచ్చితంగా లెక్కించాలని గతంలో రాష్ట్ర ఈఆర్సీ ఆదేశించింది. ఈ అంశంలో పురోగతిని తెలియజేయాలని ఇటీవల ఈఆర్సీ కోరగా.. తాజాగా టీఎస్ఎస్పీడీసీఎల్ బదులిచ్చింది. తగ్గిన వ్యవసాయ విద్యుత్ వినియోగం రాష్ట్రంలో భారీ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన నేపథ్యంలో కాల్వల కింద సాగు పెరిగి బోరుబావుల కింద వ్యవసాయ విద్యుత్ వినియోగం క్రమంగా తగ్గుతోందని రాష్ట్ర డిస్కంలు వెల్లడించాయి. ఇదే సమయంలో ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందని వివరించాయి. ►దక్షిణ తెలంగాణలోని 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2021–22 తొలి అర్ధవార్షికంలో 5,410 మిలియన్ యూనిట్ల (ఎంయూ) వ్యవసాయ విద్యుత్ వినియోగం జరగ గా.. 2022–23తొలి అర్ధవార్షికంలో 5,105 ఎంయూల వినియోగం జరిగిందని టీఎస్ఎస్పీడీసీఎల్ తెలిపింది. తమ సంస్థ పరిధిలో దాదాపు 6% వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని తెలిపింది. 2023– 24లో ఎత్తిపోతల పథకాల వినియోగం 105% పెరగనుందని అంచనా వేసింది. ►ఉత్తర తెలంగాణలోని ఐదు ఉమ్మడి జిల్లాల పరిధిలో 2021–22 తొలి అర్ధ వార్షికంలో 2,938 ఎంయూల వ్యవసాయ విద్యుత్ వినియోగం జరగగా.. 2022–23 తొలి అర్ధ వార్షికంలో 2,809 ఎంయూల వినియోగం మాత్రమే జరిగిందని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎన్పీడీసీఎల్) తెలిపింది. తమ సంస్థ పరి ధిలో దాదాపు 4% వ్యవసాయ విద్యుత్ వినియోగం తగ్గిందని ఈఆర్సీకి నివేదించింది. ఉత్తర తెలంగాణలో 2023–24లో ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం 287% పెరగనుందని అంచనా వేసింది. ►2023–24కి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)లో వ్యవసాయ విద్యుత్ అవసరాల అంచనాలను తగ్గించడంపై ఈఆర్సీ వివరణ కోరగా.. డిస్కంలు ఈ వివరాలు ఇచ్చాయి. -
‘అన్మ్యాన్డ్’.. సబ్స్టేషన్లు!.. టీఎస్ఎస్పీడీసీఎల్ ‘హైటెక్’ బాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా 15 జిల్లాల పరిధిలో విద్యుత్ సేవలు అందిస్తున్న దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సాంకేతికత వినియోగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే మీటర్ రీడింగ్, కరెంట్ బిల్లుల వసూళ్లు, ఫిర్యాదుల స్వీకరణకు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న సంస్థ తాజాగా విద్యుత్ సరఫరాలోని కీలకమైన సబ్స్టేషన్లపై దృష్టి సారించింది. అంతర్గత నిర్వహణ ఖర్చులు, మానవ ప్రమేయాన్ని తగ్గించేందుకు కొత్తగా ఆటోమేటెడ్ సబ్స్టేషన్లను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని కల్యాణ్‌నగర్, ముఫకంజా, శిల్పారామం, కృష్ణానగర్, నాగోల్‌లలో సబ్స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభించింది. కొత్త ఏడాదిలో మరిన్ని ప్రాంతాల్లోనూ నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యేకత ఏమిటి? సాధారణంగా ప్రతి సబ్‌స్టేషన్‌లో నాలుగు నుంచి ఆరుగురు విద్యుత్ సిబ్బంది పనిచేస్తుంటారు. సబ్‌స్టేషన్‌కు అందుతున్న, మిగతా 2వ పేజీలో u దాని నుంచి సరఫరా అవుతున్న విద్యుత్ తీరును నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. ఒకవేళ ఏదైనా ఫీడర్ ట్రిప్ అయితే వెంటనే సరిచేస్తుంటారు. అయితే ఒక్కో స్టేసన్‌లోని సిబ్బంది జీతాలన్నీ కలిపి రూ. లక్షల్లో ఉండటం, జీహెచ్ఎంసీ పరిధిలో వందలాది సబ్స్టేషన్లు ఉండటంతో ఈ లెక్కన టీఎస్ఎస్పీడీసీఎల్పై ప్రతి నెలా రూ. కోట్లలో ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో అందుబాటులోకి తెస్తున్న అన్మ్యాన్డ్ సబ్స్టేషన్లలో సిబ్బంది అవసరం ఉండదు. పూర్తిగా సాఫ్ట్వేర్ సాయంతో ఇవి పనిచేయనున్నాయి. విద్యుత్ సరఫరా రీడింగ్ వివరాలను ఎప్పటికప్పుడు ఆటోమేటిక్‌గా నమోదు చేసుకోనున్నాయి. అలాగే ఫీడర్ పరిధిలో ఎక్కడ సమస్య వచ్చినా వాటంతట అవే పరిష్కరించనున్నాయి. ప్రతి 10–15 సబ్స్టేషన్ల పనితీరును ఒక అసిస్టెంట్ ఇంజనీర్ పర్యవేక్షిస్తే సరిపోనుంది. దీనివల్ల సంస్థపై ఆర్థికభారంగణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే సాంకేతిక సంస్కరణల బాట... – విద్యుత్ సమస్య తలెత్తినప్పుడు కాల్‌సెంటర్ నంబర్ 1912 ద్వారా అందే ఫిర్యాదును సంబంధిత సెక్షన్ అధికారికి పంపేందుకు ‘సాసా’ యాప్ వినియోగం. గతంలో కాల్ సెంటర్ ద్వారా ఒకే సమయంలో 30 కాల్స్ మాత్రమే రిసీవ్ చేసుకొనే అవకాశం ఉండగా ప్రస్తుతం ఏకకాలంలో 300 ఫిర్యాదుల స్వీకరణకు అవకాశం. – 11 కేవీ, 33 కేవీ ఫీడర్లలో విద్యుత్ అంతరాయ పనరుద్ధరణకు కంప్యూటర్ ఆధారిత అవుటేజ్ మేనేజ్మెంట్ సిస్టం (ఓఎంఎస్) వాడకం. దీని సాయంతో విద్యుత్ పునరుద్ధరణకు ఎక్కడికి, ఎందరు సిబ్బందిని పంపాలో ముందే గుర్తించే వీలు. – సెల్ఫ్ మీటర్ రీడింగ్ యాప్ ద్వారా వినియోగదారుడే స్వయంగా ఇంట్లోని మీటర్లో నమోదైన రీడింగ్‌ను తీసి బిల్లు పొందే వెసులుబాటు. – జీహెచ్ఎంసీ పరిధిలోని 226 సబ్స్టేషన్లు, 167 ఫీడర్లలో రియల్‌టైమ్‌లో విద్యుత్ గణాంకాల విశ్లేషణకు సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా అక్విజిషన్ (స్కాడా) సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి. క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు రాకపోయినా ఆటోమేటిక్‌గా సరఫరాను పర్యవేక్షించే వీలు. కరెంట్ పోయిన ప్రాంతాల వివరాల గుర్తింపు, క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేయడం ప్రత్యేకత. జీహెచ్ఎంసీ పరిధికే పరిమితమైన ఈ సేవలను 2023లో గ్రేటర్ శివారు ప్రాంతాలకు, ఆ తర్వాత ఇతర జిల్లాలకు ఈ సేవలను విస్తరించాలని సంస్థ నిర్ణయం. ఎనిమిదేళ్లలో 34 అవార్డులు.. తెలంగాణ ఏర్పాటుకు ముందు పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ఉండేవి. గృహాలకు తొమ్మిది గంటలు, రైతులకు ఆరు గంటలే విద్యుత్ అందేది. ప్రస్తుతం గృహ వినియోగదారులకే కాకుండా వ్యాపారులకు, రైతులకు, పరిశ్రమలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. వినియోగదారులకు విద్యుత్ సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో మార్కెట్లోకి కొత్తగా వచ్చే సాంకేతికతను వినియోగిస్తున్నాం. ఫలితంగా ఈ ఎనిమిదేళ్లలో 34 జాతీయ అవార్డులు డిస్కంకు లభించాయి. ఇది గొప్ప అచీవ్మెంట్. – రఘుమారెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
వెయ్యి జేఎల్ఎం పోస్టుల భర్తీకి.. మళ్లీ నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 1,000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ కానుంది. సబ్ ఇంజనీర్ పోస్టులకు ఎంపిౖకైన అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలను అందజేయడంతో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ దాదాపుగా ముగిసింది. దీంతో జేఎల్ఎం నోటిఫికేషన్ జారీపై సంస్థ యాజమాన్యం కసరత్తు ప్రారంభించనుందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులోగా లేదా వచ్చే నెల తొలివారంలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వాస్తవానికి వెయ్యి జేఎల్ఎం పోస్టుల భర్తీకి గత మే 9న సంస్థ యాజమాన్యం నోటిఫికేషన్ జారీ చేసి, జూలై 17న రాతపరీక్ష నిర్వహించింది. అయితే రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు గత ఆగస్టు 25న సంస్థ యాజమాన్యం ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు ఏకంగా 181 మంది అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు నిర్ధారణ కావడంతో యాజమాన్యం పరీక్ష రద్దుకు నిర్ణయం తీసుకుంది. ఈ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించింది. ఇదిలా ఉండగా, కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అభ్యర్థులు మళ్లీ ఫీజులు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. -
కరెంట్ నష్టాల్లో... కుమురం భీం టాప్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ నష్టాల్లో కుమురం భీం ఆసిఫాబాద్ డివిజన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీ అండ్ సీ లాసె స్) 51.08 శాతంగా నమోదైంది. విద్యుత్ ట్రాన్స్మిషన్, డి స్ట్రిబ్యూషన్ నష్టాలు 11.41శాతమే ఉన్నప్పటికీ, విద్యుత్ బిల్లులు వసూళ్లు 55శాతమే జరగడంతో ఆసిఫాబాద్ ఏటీ అండ్ సీ నష్టాల్లో అగ్ర స్థానంలో నిలిచింది. సాంకేతిక లోపా లు, విద్యుత్ చౌర్యంతో జరిగే విద్యుత్ నష్టాలతో పాటు విద్యుత్ బిల్లుల జారీ/వసూల్లో జరిగే లోపాలు, వసూలు కాని మొండి బకాయిలతో జరిగే నష్టాల మొత్తాన్ని కలిపి విద్యుత్ రంగ పరిభాషలో ‘ఏటీ అండ్ సీ లాసెస్’గా పేర్కొంటారు. హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్, ఆస్మాన్‌గఢ్, బేగం బజార్‌తో పాటు గజ్వేల్, సిద్దిపేట డివిజన్లలో ఎప్పటిలాగే భారీ విద్యుత్ నష్టాలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో 32– 35 శాతం వరకు ‘ఏటీ అండ్ సీ’నష్టాలుండడం గమనార్హం. 2022 జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య కాలానికి సంబంధించి దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్)లు కేంద్రానికి సమర్పించిన త్రైమా సిక విద్యుత్ ఆడిట్ నివేదికల్లో ఈ విషయాన్ని వెల్లడించాయి. ప్రతి మూడు నెలలకు ఎనర్జీ ఆడిట్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ(బీఈఈ) ఆదేశాల మేరకు సబ్ స్టేషన్లు, ఫీడర్లు, ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లను బిగించి ప్రతి మూడు నెలలకోసారి ఎనర్జీ ఆడిట్‌ని రాష్ట్ర డిస్కంలు నిర్వహిస్తున్నాయి. విద్యుత్ డివిజన్లు/సర్కిళ్ల వారీగా ఎంత విద్యుత్ సరఫరా చేశారు? ఎంత చౌర్యం/సాంకేతిక నష్టాలు జరిగాయి ? ఎంత మేర విద్యుత్‌కు ఎంత మేర బిల్లులు జారీ చేశారు? ఎంత వసూలయ్యాయి? అన్న వివరాలతో త్రైమాసిక, వార్షిక ఆడిట్ నివేదికలను డిస్కంలు సమర్పించాల్సి ఉంటుంది. చార్మినార్ డివిజన్ పరిధిలో 35.73 శాతం ఏటీ అండ్ సీ నష్టాలు నమోదయ్యాయి. ఇక్కడ 198.78 మిలియన్ యూనిట్ల (ఎంయూల) విద్యుత్‌ను సరఫరా చేయగా.. 122.73 ఎంయూల మీటర్డ్ సేల్స్ (వినియోగదారులు వాడినట్టుగా మీటర్లలో నమోదైన లెక్క) మాత్రమే జరిగాయి. మిగతా 76.04ఎంయూ (38శాతం) ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్(టీ అండ్ డీ) నష్టాలు వచ్చాయి. సాంకేతిక లోపాలు, విద్యుత్ చౌర్యంతో జరిగే నష్టాలను కలిపి విద్యుత్ రంగ పరిభాషలో ‘ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ (టీ అండ్ డీ) నష్టాలు’అంటారు. ఇక రూ.85.19 కోట్ల బిల్లులకుగాను రూ.88.68 కోట్లు (104 శాతం) వసూలయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయిపడడంతో గజ్వేల్, సిద్దిపేట డివిజన్లు ప్రతి సారి ఏటీఅండ్‌సీ నష్టాల్లో టాప్‌లో ఉంటున్నాయి. ఆడిట్ నివేదికలో తప్పుడు లెక్కలు.. కాగజ్‌నగర్ డివిజన్ పరిధిలో 98.56శాతం ఏటీఅండ్‌సీ నష్టాలున్నట్టు టీఎస్ఎన్పీడీసీఎల్ యాజమాన్యం తప్పుడు గణాంకాలను కేంద్రానికి సమర్పించిన నివేదికలో పొందుపర్చింది. టీఅండ్‌సీ నష్టాలు 8.29శాతమే ఉండగా, బిల్లుల వసూళ్లు 99శాతం ఉండడంతో ఈ ప్రాంతంలో ఏటీఅండ్‌సీ నష్టాలు తక్కువ మొత్తంలో ఉండే అవకాశముంది. -
విద్యుత్ ఏఈ రాత పరీక్ష ఫలితాలు వెల్లడి
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 70 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి జూలై 17న నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను గురువారం సంస్థ యాజమాన్యం ప్రకటించింది. వివరాల కోసం సంస్థ వెబ్సైట్ (https:// www.tssouthernpower.com)ను చూడాలని అభ్యర్థులకు సూచించింది. -
సిబ్బంది ద్వారానే కరెంట్ తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి సందర్భంగా గణేశ్ మండపాలకు కరెంట్ కనెక్షన్ కోసం సామాన్యులు విద్యుత్ స్తంభాలు ఎక్కరాదని, విద్యుత్ సిబ్బంది ద్వారానే కనెక్షన్ పొందాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి విజ్ఞప్తి చేశారు. గణేశ్ మండపాలకు నిరంతర విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. మండపాల వద్ద తీసుకో వాల్సిన భద్రతాచర్యలపై సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. మండపాల వద్ద జాగ్రత్తలు పాటించాలని నిర్వాహకులను కోరారు. ముఖ్యమైన జాగ్రత్తలు..: మండపాల్లో ఉపయోగించే విద్యుత్ పరికరాల లోడ్‌కు తగ్గట్టు నాణ్యమైన కేబుల్స్‌ను వాడాలి. అతుకులు ఉన్న, ఇన్సులేషన్ లేని వైర్లను వాడటం ప్రమాదకరం. ∙మండపాల్లో లోడ్‌కు తగ్గ సామర్థ్యం కలిగిన ఎంసీబీ (మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్) లను తప్పనిసరిగా వాడాలి. ఒక వేళ ఎంసీబీలు ఓవర్ లోడ్‌కు గురైతే షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంటుంది. ∙విద్యుత్ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద గణేశ్ మండపాలను ఏర్పాటు చేయరాదు. ∙విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల దిమ్మెలను మండపాలకు సపోర్ట్ కోసం వాడరాదు. – విద్యుత్ వైర్లు, స్తంభాలు, ఇతర ప్రమాదకర పరికరాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. ∙ఒక వేళ ఎవరికై నా కరెంట్ షాక్ తగిలితే వెంటనే వైద్య సహాయం అందించి, ఆ ప్రమాదం గురించి దగ్గరలోని విద్యు త్ సిబ్బందికి తెలియజేయాలి. ∙విద్యుత్ వైర్లు ఎక్కడైనా తెగిపడ్డా, ఇతర అత్యవసర పరిస్థితులు ఏర్పడినా వెంటనే 1912 లేదా 100 లేదా సమీపంలోని ఫ్యుజ్ ఆఫ్ కాల్ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. -
నిరుద్యోగులకు షాక్.. జేఎల్ఎం నోటిఫికేషన్ రద్దు!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో వెయ్యి జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసినట్టు సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి గురువారం ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి త్వరలో మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీకి గత జూలై 17న నిర్వహించిన రాత పరీక్షలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాష్ట్ర విద్యుత్ సంస్థలకు చెందిన కొందరు ఉద్యోగులు, మరికొంత మంది దళారులతో కలిసి పలువురు అభ్యర్థుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరీక్షా కేంద్రాల్లో వారికి సమాధానాలు చేరవేసినట్టు ఆరోపణలు వచ్చాయి. అప్పటికప్పుడు కొందరు విద్యు త్ అధికారులు, సిబ్బందిని రాచకొండ కమిషనరేట్ పోలీసులు విచారించి అరెస్టు చేశారు. మొత్తం 181 అభ్యర్థులకు సమాధానాలు చేరవేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. మరింత మంది అభ్యర్థులకు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉండే అవకాశాలున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొంత మంది అభ్యర్థులు హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న సంస్థ కార్యాలయం ఎదుట అప్పట్లో ధర్నాలు నిర్వహించారు. అభ్యర్థుల నుంచి వ చ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుంటూ జేఎల్ఎం పోస్టుల భర్తీకి గత మే 9న జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. నోటిఫికేషన్ రద్దుపై అభ్యర్థుల్లో అసంతృప్తి జేఎల్ఎం రాత పరీక్షను రద్దు చేసి మళ్లీ కొత్తగా నిర్వహించాలని తాము కోరితే ఏకంగా నోటిఫికేషన్ రద్దు చేయడం సరికాదని కొందరు జేఎల్ఎం అభ్యర్థులు పేర్కొంటున్నారు. మళ్లీ కొత్తగా నోటిఫికేషన్ జారీ చేస్తే నియామక ప్రక్రియలో తీవ్ర జా ప్యం జరుగుతుందని, మళ్లీ ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ‘గాంధీ’లో అరుదైన శస్త్రచికిత్స: సినిమా చూపిస్తూ సర్జరీ చేసేశారు! -
జేఎల్ఎం ప్రశ్నాపత్రం లీక్ కేసులో పోలీసుల దూకుడు.. పలువురి అరెస్ట్!
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ శాఖ జూనియర్ లైన్ మెన్ ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తులో వేగం పెంచారు పోలీసులు. దర్యాప్తు చేపట్టేందుకు టాస్క్‌ఫోర్స్, ఎస్వోటీ పోలీసులు రంగంలోకి దిగారు. ప్రశ్నాపత్రం లీక్ వెనుక విద్యుత్ శాఖ ఉద్యోగులే కీలక సూత్రదారులుగా గుర్తించారు. ఇప్పటికే.. ఏడీఈ ఫిరోజ్ ఖాన్, లైన్మెన్ శ్రీనివాస్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. హైదరాబాద్, రాచకొండలో నమోదైన కేసుల్లో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. ఒక్కో ఉద్యోగానికి రూ.5లక్షలు.. ఒక్కో ఉద్యోగానికి రూ.5 లక్షల చొప్పున ఒప్పందం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అడ్వాన్స్‌గా ఒక్కొక్కరి నుంచి నిందితులు లక్ష రూపాయలు వసూలు చేశారని వెల్లడించారు. పరీక్షల్లో మైక్రోఫోన్ సహాయంతో సమాధానాలు అభ్యర్థులకు చేరవేసినట్లు చెప్పారు. ఇప్పటికే పోలీసుల అదుపులో పలువురు నిందితులు, అభ్యర్థులు ఉండగా.. వారిని విచారిస్తున్నారు. అయితే.. కీలక నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: నేరగాళ్లుకు కలిసోచ్చే వెబ్... పట్టు కోసం కసరత్తులు చేస్తున్న పోలీసులు -
అంగట్లో జూనియర్ లైన్‌మన్ పోస్టులు రూ.5 లక్షలకు బేరం!
సాక్షిప్రతినిధి, వరంగల్: విద్యుత్‌శాఖలో జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం) పోస్టులు దళారులకు వరంగా మారాయి. నిరుద్యోగులను నమ్మించి డబ్బులు గుంజేందుకు గ్రూపులుగా ఏర్పడిన కొందరు వేలం పెట్టారు. టీఎస్ఎస్పీడీసీఎల్లో 1,000 జేఎల్ఎం పోస్టుల భర్తీకి వెలువడిన నోటిఫికేషన్‌ను ఆసరాగా చేసుకుని.. అందులో పనిచేస్తున్న కొందరు.. ఉన్నతాధికారుల పేర్లు చెప్పి వసూళ్లకు శ్రీకారం చుట్టారు. ఈ దళారులకు కొందరు అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు తోడయ్యారు. దరఖాస్తు చేయడం మొదలు పరీక్ష రాసి ఉద్యోగం వచ్చే వరకు అంతా తామే చూసుకుంటామని అందినకాడికి దండుకున్నారు. ఈనెల 17న జరిగిన రాత పరీక్ష సందర్భంగా పలు అవకతవకలు వెలుగుచూడగా... ఉమ్మడి వరంగల్‌కు చెందిన పలువురు బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) రంగంలోకి వరంగల్‌లో ఆరా తీస్తుండడం కలకలం రేపుతోంది. చదవండి👉🏻పెద్దరాతియుగం నాటి చిత్రాల తావు గుర్తింపు దళారులకు వరంగా నోటిఫికేషన్.. ఎస్పీడీసీఎల్లో 70 అసిస్టెంట్ ఇంజనీర్లు, 201 సబ్ ఇంజనీర్లు, 1,000 లైన్‌మన్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో జేఎల్ఎం కోసం మే 19 నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 35 ఏళ్లలోపు ఉన్న ఉన్నవారు దరఖాస్తు చేసుకునే అర్హత ఉండగా, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఐదేళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. వెయ్యి జేఎల్ఎం పోస్టుల కోసం 35,312 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్‌లోని హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలతో పాటు, హనుమకొండలో నివాసం ఉండే కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, సైదాపూర్, జమ్మికుంట ప్రాంతాలకు చెందిన పలువురు కూడా ఇందులో ఉన్నారు. ఎస్పీడీసీఎల్ హైదరాబాద్‌లో పని చేస్తున్న హనుమకొండకు చెందిన కొందరు ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నాయకులు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు బేరం పెట్టారు. కొందరు మొత్తం.. ఇంకొందరు అడ్వాన్స్‌గా చెల్లించి.. ఈ నెల 17న రాత పరీక్షకు హాజరయ్యారు. డబ్బులు తీçసుకున్న వారు ఒప్పందం ప్రకారం రాత పరీక్షకు సహకరించకపోగా, కనిపించకుండా పోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. చదవండి👉🏻తీరొక్క భూములు.. చూడచక్కని అడవులు ఎస్ఓటీ అదుపులో ఐదుగురు.. వరంగల్‌లో ఆరా.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలానికి చెందిన ఏసోబు (పేరు మార్చాం) అనే వ్యక్తి కాజీపేటకు చెందిన ఎస్పీడీసీఎల్కు చెందిన వ్యక్తి ద్వారా హైదరాబాద్‌లో ఓ దళారికి రూ.1.50 లక్షలు చెల్లించాడు. ఇదంతా బోగస్ అని తెలియడంతో రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. వరంగల్, జనగామ జిల్లాలకు చెందిన పలువురు కూడా విద్యుత్‌శాఖలో విధులు నిర్వహిస్తున్న కొందరు అధికారులు దందాకు తెరతీశారంటూ పేర్లతో సైబరాబాద్ కమిషనరేట్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. జేఎల్ఎం పోస్టుల కోసం 35,312 మందిలో.. ఉమ్మడి జిల్లా నుంచి నాన్‌లోకల్ కోటా కింద దరఖాస్తు చేసుకున్నవారు సుమారు నాలుగు వేల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ఇందులో దళారులను నమ్మి మోసపోయిన చాలా మంది పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఇదే కేసులో మలక్‌పేట ఏడీలు సైదులు, ఫిరోజ్, నిత్యలు, లైన్మన్లు శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు శనివారం ఉమ్మడి వరంగల్లోనూ ఆరా తీశారు. హనుమకొండ, జనగామ, హుజూరాబాద్ ప్రాంతాల నుంచి ఫిర్యాదు చేసిన వారిని పిలిచి మాట్లాడి వివరాలు సేకరించడం చర్చనీయాంశమవుతోంది. చదవండి👉🏻క్లౌడ్ బరస్ట్, పోలవరం ఎత్తు టీఆర్ఎస్కు కొత్త ఆయుధాలా! -
అర్ధరాత్రి కరెంట్ కట్ చేస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్ బిల్లులు చెల్లించాలి, లేకుంటే రాత్రిపూట విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని’ పేర్కొంటూ వినియోగదారులకు కొందరు వ్యక్తులు ఎస్ఎంఎస్లు/ఫోన్ కాల్స్ చేస్తున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు, డిబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల సమాచారం, ఓటీపీలను తెలపవద్దని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ఎవరైనా ఈ సమాచారం అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సైబర్ మోసగాళ్లు వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను డ్రా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు/ చెల్లింపుల కోసం తమ సిబ్బంది వినియోగదారుల బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వివరాలు అడగరని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించిన రసీదు మాత్రమే అడుగుతారని, బిల్లు చెల్లింపులు జరపడానికి ఎలాంటి వెబ్సైట్ లింకులను ఎస్ఎంఎస్ ద్వారా తాము పంపమని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించినా, విద్యుత్ బిల్లు పెండింగ్ ఉందని ఎవరైనా వ్యక్తులు ఫోన్/మెసేజ్ చేస్తే.. బిల్లుల చెల్లింపు వివరాలను సంస్థ వెబ్ సైట్ www. tssouthernpower. com లేదా టీఎస్ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో చెక్‌చేసుకోవచ్చని సూచించారు. ఏమైనా తేడాలుంటే ఆన్లైన్ ద్వారా సంస్థను లేదా సంబంధిత సెక్షన్ ఆఫీసర్(అఉ)ని సంప్రదించి సరిచూసుకోవాలని కోరారు. -
ఎస్ఎస్ఆర్ రేట్లు పెంచిన దక్షిణ డిస్కం
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ,మరమ్మతు పనులకు సంబంధించిన ప్రామాణిక ధరల పట్టిక(ఎస్ఎస్ఆర్) రేట్లను పట్టణ ప్రాంతాల్లో 30%, గ్రామీణ ప్రాంతాల్లో 25% పెం చుతున్నట్లు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ప్రకటించింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి కృషి తో ఎస్ఎస్ఆర్ రేట్లు పెరిగాయని తెలంగాణ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆయన కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేరకు పెద్ద సం ఖ్యలో విద్యుత్ కాంట్రాక్టర్లు శనివారం మంత్రి నివాసానికి చేరుకుని ఆయన్ను సన్మానించారు. ఐదేళ్ల నుంచి రేట్ల పెంపుదల కోసం నిరీక్షిస్తున్నామని, సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, ఎస్కే మాజిద్ తెలిపారు. -
విద్యుత్ కొలువులు 1,201
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో 1000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 201 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రి కల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. జిల్లా (విద్యుత్ సర్కిల్) పోస్టులుగా భర్తీ చేయనున్నారు. కొత్త జోనల్ విధానం ప్రకారం దక్షిణ తెలంగాణలోని 5 ఉమ్మడి జిల్లాల అభ్యర్థులకు 95% ఉద్యోగాలను రిజర్వ్ చేశారు. ► జేఎల్ఎం అభ్యర్థుల వయోపరిమితి 2022, జనవరి 1 నాటికి 18–35 ఏళ్లు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు మరో ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తించనుంది. గరిష్ట వయోపరిమితిని 10 ఏళ్లకు సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం జేఎల్ఎం పోస్టులకు వర్తింపజేయలేదు. ట్రాన్స్‌కో/ టీఎస్ఎస్పీడీసీఎల్/ టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో ఆర్టిజన్లు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రత్యేక వయోసడలింపు కల్పించారు. వారు ఆయా సంస్థల్లో చేరినప్పుడున్న వయసును పరిగణనలోకి తీసుకోనున్నారు. ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో రెండేళ్ల ఇంటర్ వొకేషనల్ కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులు జేఎల్ఎం పోస్టులకు అర్హులు. అప్రెంటిస్ అవసరం లేదు. ► సబ్ ఇంజనీర్ అభ్యర్థులు 2022, జనవరి 1 నాటికి 18–44 ఏళ్లు వయోపరిమితి కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు లభించనుంది. ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో డిప్లమో చేసిన వాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. డిప్లమా తర్వాత ఇవే విభాగాల్లో ఇంజనీరింగ్ డిగ్రీలు చేసిన వాళ్లు కూడా అర్హులే. -
TSSPDCL: జేఎల్‌ఎంల పోస్టులకు పదేళ్ల ‘వయో’ సడలింపు లేదు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) భర్తీ చేయనున్న జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయడం లేదు. విద్యుత్ స్తంభాలను ఎక్కి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో విధులు నిర్వహించే జూనియర్ లైన్మెన్కు శారీరక దారుఢ్యం అత్యంత ఆవశ్యకమని, అందువల్ల ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి సడలింపు ఇవ్వరాదని టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. 1,000 జేఎల్ఎం, 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 70 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి సంస్థ ఈ నెల 9న సంక్షిప్త ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టుల కు మాత్రం 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయనున్నట్టు సంస్థ ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ జిల్లా స్థాయి పోస్టులే కొత్త జోనల్ విధానం ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా వర్గీకరించి భర్తీ చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల స్థానికత గల అభ్యర్థులకే 95 శాతం పోస్టులు దక్కనున్నాయి. ఐటీఐ (ఎలక్ట్రికల్)తో పాటు అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు జేఎల్ఎం పోస్టులకు అర్హులు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు కానున్నారు. డిస్కం స్థాయి పోస్టులుగా ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికే షన్ వెలువడింది. గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు దరఖాస్తులను స్వీకరించను న్నారు. జూలై 17న రాత పరీక్ష జరగనుంది. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీర క వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తించనుంది. ఏఈ పోస్టుల ను కొత్త జోనల్ విధా నం కింద టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని పోస్టులుగా విభ జించారు. సంస్థ పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు 95% పోస్టుల కోసం పోటీపడడానికి అర్హులు. ఏఈ పోస్టుల నోటిఫికేషన్‌ను సంస్థ వెబ్సైట్ https://tssouthernpower.cgg.gov.in లో చూడవచ్చు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. -
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. నోటిఫికేషన్ రిలీజ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ శాఖ (TSSPDCL)లో పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విద్యుత్ శాఖలో 70 ఏఈ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల ఆహ్వానం కోరింది. ఈనెల 12వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్టు ప్రభుత్వం నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా, రాత పరీక్ష జూలై 17వ తేదీన జరుగనుంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
తెలంగాణలో మరో నోటిఫికేషన్.. ఈసారి 1,271 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 1,271 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్ ప్రకటించింది. ఇందులో 70 అసిస్టెంట్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), 201 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్), వెయ్యి జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, వయోపరిమితి, కేటగిరీలవారీగా ఖాళీల వివరాలతో సమగ్ర నియామక ప్రకటనను ఈ నెల 11న సంస్థ వెబ్సైట్ https://tssouthernpower.cgg.gov.in లేదా https://www.tssouthernpower.comలో పొందుపరచనున్నట్టు యాజమాన్యం తెలిపింది. త్వరలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్), తెలంగాణ జెన్కో సంస్థల నుంచి సైతం ఏఈతోపాటు ఇతర కేటగిరీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్ల నిర్వహణకు తెలంగాణ జెన్కో దాదాపు 200 ఏఈ పోస్టులను భర్తీ చేసే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి. ఓ మూడు, నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. టీఎస్ఎన్పీడీసీఎల్ దాదాపు 50 ఏఈ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. -
టీఎస్ఎస్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలు, సవరించిన ర్యాంకులను జిల్లా/సర్కిళ్ల వారీగా ప్రకటించినట్లు సంస్థ యాజమాన్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాలను సంస్థ వెబ్సైట్ www. tssouthernpower. cgg. gov. in లేదా www. tssouthernpower. com చూసుకోవాలని అభ్యర్థులకు సూచించింది. నోటిఫికేషన్ నిబంధనల మేరకు ఆర్టిజన్లు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీ మార్కులను ఇచ్చినట్లు తెలిపింది. -
ఐదేళ్లయినా కరెంట్ ఇయ్యలే!
సాక్షి, హైదరాబాద్: కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం అన్నదాతలకు ఏళ్ల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 59,689 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, అందులో 905 దరఖాస్తులు ఐదేళ్లు, ఆపై కాలం నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. రైతులు రూ.5వేలు డిపాజిట్ కట్టి దరఖాస్తు చేసుకుంటే, ఒక్కో కనెక్షన్‌పై డిస్కంలు రూ.70వేల వరకు ఖర్చు చేస్తాయి. పౌర సేవల పట్టిక ప్రకారం.. క్షేత్రస్థాయిలో అన్ని విధాలుగా సానుకూలతలుంటే, దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లోగా కనెక్షన్ జారీచేయాలి. కొత్త విద్యుత్ లైన్‌తోపాటు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాల్సి వస్తే, క్షేత్రస్థాయి ఏఈ ఆధ్వర్యంలో అంచనాలను రూపొందిస్తారు. ఇందులో డిస్కంల వాటా రూ.70వేలు పోగా, దరఖాస్తుదారులు తమ వాటా మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించాలి. ఆ తర్వాత 30 రోజుల్లోగా కనెక్షన్ ఇవ్వాలి. రైతులు డీడీలు కట్టకపోవడంతో 7,219 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, శాఖాపరమైన కారణాలతో ఏకంగా 59,689 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధిక శాతం రైతులు డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా కనెక్షన్లు జారీ కాకపోవడం గమనార్హం. రైతులకు వేధింపులు క్షేత్రస్థాయి అధికారుల అవినీతితో కనెక్షన్ల జారీ ప్రక్రియ ప్రహసనంగా మారడంతో.. డిస్కంలు 2016 జనవరి నుంచి ‘ఫస్ట్ ఇన్– ఫస్ట్ అవుట్ (ఫిఫో)’ అనే విధానాన్ని తెచ్చాయి. దీని ప్రకారం కస్టమర్ సర్వీస్ సెంటర్లు, మీ–సేవా కేంద్రాల ద్వారానే దరఖాస్తులు స్వీకరించి, ముందు దరఖాస్తు చేసుకున్న ముందు కనెక్షన్లు జారీ చేయాలి. గ్రామాల వారీగా సీనియారిటీ జాబితాను రూపొందించి డిస్కంల కార్యాలయాలు, సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రదర్శించాలి. కానీ ఎక్కడా చేయడం లేదు. పంటలను కాపాడటానికి అత్యవసరంగా విద్యుత్ కనెక్షన్ జారీ చేయాలని ప్రజాప్రతినిధులు సిఫారసు చేస్తేనే సీనియారిటీని పక్కనబెట్టాల్సి ఉంటుంది. చేతులు తడిపిన వారు, పైరవీలు చేసిన వారికే ముందు కనెక్షన్లు ఇస్తుండటంతో దరఖాస్తులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉంటున్నట్టు ఆరోపణలు న్నాయి. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది లంచాల కోసం రైతులను వేధిస్తున్నారని ఇటీవల విద్యుత్ చార్జీల పెంపుపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణల్లో పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేయడం పరిస్థితికి అద్దంపడుతోంది. డీడీలు కట్టి మూడేళ్లనా... వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మిట్టకంకల్ గ్రామానికి చెందిన రావుల కిష్టయ్య, ఎం.వెంకటయ్య, ఎం.పోచయ్య అనే రైతులు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం 2019 ఏప్రిల్ 1న డీడీలు కట్టారు. అయినా ఇప్పటివరకు అతీగతీ లేదు. దీంతో తక్షణమే లైన్‌వేయాలని ఈఆర్సీకి దరఖాస్తు చేసుకున్నారు. ఇలా చాలామంది రైతులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ ఈఆర్సీకి లేఖలు రాశారు. విద్యుత్ మంత్రి ఇలాఖాలోనూ.. ఐదేళ్లకు పైగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను విద్యుత్ సర్కిళ్ల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా నల్లగొండలో 329, నాగర్‌కర్నూల్ జిల్లాలో 212, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి సొంత ఇలాఖా సూర్యాపేటలో 203, గద్వాల్లో 89, యాదాద్రిలో 27, వనపర్తిలో 26, మేడ్చల్‌లో 19, మహబూబ్‌నగర్‌లో 15, సైబర్సిటీలో 10, వికా రాబాద్‌లో 6, సరూర్‌నగర్, సంగారెడ్డిలో చెరో 5, రాజేంద్రనగర్‌లో 4 పెండింగ్‌లో ఉన్నాయి. -
దేశంలోనే తొలి జీఐ సబ్‌స్టేషన్..తెలంగాణలో..!
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి గ్యాస్ ఇన్సులేటెడ్ ఆధారిత సబ్‌స్టేషన్ (జీఐఎస్) ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఇప్పటికే సబ్‌స్టేషన్‌లోని పవర్ ట్రాన్స్ఫార్మర్ల చార్జింగ్ ప్రక్రియ పూర్తయింది. సీఎం కేసీఆర్ టైమ్ ఇవ్వడమే ఆలస్యం.. రాయదుర్గంలోని ఈ అత్యాధునిక సబ్‌స్టేషన్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల హైదరాబాద్ నగరవాసులకు మరో 30 ఏళ్ల వరకు విద్యుత్ సరఫరా విషయంలో ఎలాంటి ఢోకా ఉండదు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి బుధవారం ఈ సబ్‌స్టేషన్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఐటీ, అనుబంధ సంస్థల అవసరాలను గుర్తించి.. రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్, నానక్‌రాంగూడ, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్ పరిసరాల్లో కొత్తగా అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. ఐటీ, అనుబంధ కంపెనీలు, హోటళ్లు, ఆస్పత్రులు, ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు వెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం ఇక్కడ అవసరమైన సబ్స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మూడేళ్ల క్రితం ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలోని రాయదుర్గంలో టీఎస్ ట్రాన్స్‌కో రూ.1,400 కోట్లతో దేశంలోనే తొలిసారిగా గ్యాస్ ఇన్సులేటెడ్ ఆధారిత సబ్స్టేషన్ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసింది. ఒకే చోట నాలుగు సబ్స్టేషన్లు సాధారణంగా సంప్రదాయ విధానంలో 400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలంటే 20 ఎకరాల భూమి అవసరమవుతుంది. గచ్చిబౌలి వంటి ఖరీదైన ప్రదేశంలో అంతభూమి దొరికే పరిస్థితి లేదు. దీంతో తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకునే అత్యాధునిక గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేవలం ఐదెకరాల విస్తీర్ణంలో 400 కేవీ సబ్‌స్టేషన్‌తో పాటు 220 కేవీ, 130 కేవీ, 33 కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయడం గమనార్హం. ఇందులో ప్రధానమైంది 400 కేవీ సబ్‌స్టేషన్ కాగా మిగ తావి కూడా సిద్ధమయ్యాయి. అలాగే ఇక్కడ 500 మెగావాట్ల సామర్థ్యం గల రెండు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నగరానికి వెయ్యి మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్‌ను సరఫరా చేసే వీలుంది. ఒక్క క్షణం కూడా కరెంట్ పోదు: జగదీశ్‌రెడ్డి మూడేళ్ల క్రితం పనులు మొదలు పెట్టాం. కరోనా వల్ల వరుస లాక్డౌన్లకు తోడు ఆర్థిక సంక్షోభం వంటి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. అయినా ఏ ఒక్క రోజు కూడా పనులు ఆపలేదు. హైదరాబాద్‌లో రానున్న 30 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఆ సామర్థ్యం మేరకు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఒక్క క్షణం కూడా కరెంట్ పోకుండా ఏర్పాట్లు చేశాం. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తాం. -
విద్యుత్ బిల్లుల ఎత్తి‘మోత’లు
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ వంటి ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లులు ఏటేటా భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఎత్తిపోతల పథకాల విద్యుత్ వినియోగం 2020–21లో 3,575 మిలియన్ యూనిట్లు ఉండగా, 2021–22లో 4,282 ఎంయూలకు పెరిగింది. 2022–23లో వీటికి ఏకంగా 13,826 ఎంయూల విద్యుత్ అవసరం కానుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యుత్ సరఫరా చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.7,660 కోట్ల విద్యుత్ బిల్లులను చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్సీ)కి సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్ఆర్) నివేదిక–2022–23లో స్పష్టం చేశాయి. మరోవైపు రూ.5,652 కోట్ల వ్యవసాయ విద్యుత్ సబ్సిడీలను ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సి ఉంది. ఈ సబ్సిడీ, ఎత్తిపోతల పథకాల బిల్లులు కలిపి 2022–23లో డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.13,312 కోట్లను చెల్లించాల్సి ఉండనుంది. దక్షిణ డిస్కంలో ఇలా.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,617 ఎంయూల విద్యుత్ వినియోగించగా, 2021–22లో 13 శాతం అదనంగా 1,830 ఎంయూలను వినియోగించాయి. కాగా 2022–23లో ఏకంగా 190 శాతం అదనంగా 5,325 ఎంయూల విద్యుత్ వినియోగించనున్నాయని దక్షిణ డిస్కం అంచనా వేసింది. 2021–22లో ఎత్తిపోతల పథకాల బిల్లుల ద్వారా రూ.1,211.89 కోట్లను సంస్థ ఆర్జించగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.21,820.56 కోట్లలో ఇది 5 శాతం ఉంటుందని అంచనా. 2022–23లో రూ. 2,505.05 కోట్లను ఆర్జించనుండగా, సంస్థ మొత్తం వార్షిక ఆదాయం రూ.24,610.33 కోట్లలో ఎత్తిపోతల బిల్లుల వాటా 10 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఉత్తర డిస్కం పరిస్థితి ఇదీ.. ఇక ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు 2020–21లో 1,958 ఎంయూల విద్యుత్‌ను వాడగా, 2021–22లో 25 శాతం వృద్ధితో 2,452 ఎంయూలు వినియోగించాయి. 2022–23లో ఏకంగా 246 శాతం వృద్ధితో 8,501 ఎంయూల విద్యుత్ అవసరం కానుందని ఉత్తర డిస్కం అంచనా వేసింది. సంస్థకు 2021–22లో రూ.7,175 కోట్ల వార్షిక ఆదాయం అంచనా కాగా, అందులో రూ.1,646 కోట్ల (23 శాతం)ను ఎత్తిపోతల విద్యుత్ బిల్లుల రూపంలో ఆర్జించనుంది. 2022–23లో సంస్థకు రూ.10,703 కోట్ల వార్షిక ఆదాయం రానుందని అంచనాలుండగా, అందులో ఏకంగా రూ.5,155 కోట్లు (48శాతం) ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల రూపంలో రానున్నాయి. -
ఎస్పీడీసీఎల్కు ఆరు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్పీడీసీఎల్)కు జాతీయస్థాయిలో ఆరు అవార్డులు లభించాయి. దేశంలోని అన్ని విద్యుత్ పంపిణీ సంస్థలలో సమష్టి ప్రతిభ కనబర్చినందుకు ఎస్పీడీసీఎల్కు మొదటి ర్యాంకు లభించింది. ఢిల్లీ పవర్ సంస్థకు రెండో ర్యాంకు రాగా, ఏపీ విద్యుత్ సంస్థకు మూడో ర్యాంకు లభించింది. సామర్థ్య నిర్వహణ, వినియోగదారుల సేవలు, నూతన సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, పనితీరు సామర్థ్యంలో కూడా జాతీ యస్థాయిలో మొదటి, గ్రీన్ ఎనర్జీ విభాగంలో మూడో ర్యాంకు లభించింది. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 15వ ఇండియా ఎనర్జీ సమ్మిట్‌లో భాగంగా ఆన్లైన్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో వివిధ రాష్ట్రాల డిస్కంల యాజమాన్యాలు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో అవార్డులను ప్రదానం చేశారు. వివిధ రాష్ట్రాల ప్రతినిధులు మాట్లాడుతూ నిరంతర, రైతాంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందిస్తోన్న తెలంగాణ విద్యుత్ సంస్థలను, ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి మాట్లాడు తూ తెలంగాణ ఫ్రభుత్వం విద్యుత్ సంస్థల అభివృద్ధి కోసం అన్ని రకాల తోడ్పాటునందిస్తోంద న్నారు. ఎస్పీడీసీఎల్కు అవార్డులు రావడానికి కారణమైన సీఎం కేసీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంధన శాఖ కార్యదర్శి సునీల్ శర్మ, ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావులకు ధన్యవాదాలు తెలిపారు. -
కావలి మేఘనకు కేటీఆర్ అభినందనలు, శాలువాతో సత్కారం
సాక్షి, హైదరాబాద్: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్–2020 తుది పరీక్ష ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 83వ ర్యాంక్ సాధించిన కావలి మేఘనను ఐటీ శాఖమంత్రి కేటీ రామారావు అభినందించారు. వికారాబాద్ జిల్లా, తాండూరు నియోజకవర్గానికి చెందిన మేఘన తన తండ్రి టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (కమర్షియల్) కె.రాములుతో శుక్రవారం ప్రగతిభవన్‌కు వెళ్లి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా మేఘనను మంత్రి శాలువాతో సత్కరించారు.నేటి యువతరం మేఘనను ఆ దర్శంగా తీసుకోవాలని సూచించారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో కార్మిక శాఖమంత్రి సీహెచ్ మల్లారెడ్డి, తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ భాస్కర్ తదితరులున్నారు. -
విద్యుత్ చార్జీల పెంపుతో మరో పిడుగు
-
TSSPDCL: ఒత్తిళ్లకు తలొగ్గి.. వివాదంలో ఇంజినీర్ల బదిలీలు
సాక్షి, సిటీబ్యరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఇంజినీర్ల బదిలీల అంశం వివాదాస్పదంగా మారింది. ఇప్పటికే ఫోకల్ పోస్టులో పనిచేస్తున్న వారిని నాన్ ఫోకల్‌కు కాకుండా మళ్లీ అదే ఫోకల్ పోస్టులకు బదిలీ చేయడమే ఇందుకు కారణం. అంతేకాదు ఏడు నెలల క్రితం ఏఈ నుంచి ఏడీఈగా పదోన్నతి పొంది.. ఇప్పటి వరకు ఆ బాధ్యతలు స్వీకరించకుండా విధులకు దూరంగా ఉంటున్న ముగ్గురు ఇంజినీర్లకు కీలక ఫోకల్ పోస్టుల్లో ఏడీఈలుగా అధికారాలు కట్టబెట్టేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పరిపాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రతి మూడేళ్లకోసారి ఒక చోట నుంచి మరో చోటికి బదిలీ చేస్తుంటారు. ఇందులో భాగంగా డిస్కం పరిధిలో 65 మంది సీనియర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు సహా 304 మంది ఏఈలు, 135 మంది ఏడీఈలు, 65 మంది డీఈలను బదిలీ చేసింది. ఆ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ బదిలీల్లో అనేక అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్ల పాటు ఫోకల్ (ఆపరేషన్ విభాగం)పోస్టులో పని చేసిన వారికి ఆ తర్వాత నాన్‌ఫోకల్ పోస్టులో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. కానీ.. నేతలు, ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గిన యాజవన్యం ఒక్క గ్రేటర్‌లోనే 15 మంది డీఈలకు ఫోకల్ టు ఫోకల్ పోస్టులను కట్టబెట్టిందని తెలుస్తోంది. ఫోకల్ పోస్టుల కోసం పోటాపోటీ.. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఫోకల్, నాన్ ఫోకల్ అంటూ ప్రత్యేక విభాగాలు అంటూ ఏమీ ఉండవు. కానీ విద్యుత్ శాఖలో కొత్త కనెక్షన్లు, పరిశ్రమలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భారీ భవన నిర్మాణాలు, సంస్థకు రెవిన్యూ ఎక్కువగా (ఆపరేషన్ విభాగం)వచ్చే ప్రాంతాలను ఫోకల్ పోస్టులుగా, నష్టాలు ఎక్కువగా ఉండే పాతబస్తీ సహా మారుమూల జిల్లాలను నాన్ ఫోకల్ పోస్టులుగా విభజించారు. గ్రేటర్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు, 22 డివిజన్లు ఉన్నాయి. వీటిలో శివారు ప్రాంతాల్లోని కొండాపూర్, గచ్చిబౌలి, మేడ్చల్, రాజేంద్రనగర్, చంపాపేట్, సరర్నగర్, హబ్సిగూడ, కూకట్పల్లి, సైబర్‌సిటీ, బంజారాహిల్స్, జీడిమెట్ల, శంషాబాద్, కీసర సహా శివారు ప్రాంతాల్లో సిటీకి ఆనుకుని ఉన్న చౌటుప్పల్, యాదాద్రి, షాద్‌నగర్ డివిజన్లను ఫోకల్ పోస్టులు భావిస్తారు. పాతబస్తీ సహా మారుమూల జిల్లాల్లోని డివిజన్లను నాన్‌ఫోకల్‌గా విభజించారు. వీటిలో కొత్తగా అనేక రియల్ ఎస్టేట్ వెంచర్లు, బహుళ అంతస్తుల భవనాలు, ఐటీ అనుబంధ కంపెనీలు, పరిశ్రమలు, ఇతర పెట్టుబడి సంస్థలే కాదు కొత్త విద్యుత్ లైన్లు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ కనెక్షన్లు ఎక్కువ. ఇవి ఆయా ప్రాంతాల్లో పని చేస్తున్న ఇంజినీర్ల పాలిట కామధేనువుల్లా మారుతున్నాయి. పదోన్నతులు పొందినా విధుల్లో చేరని వైనం సంస్థ పరిధిలో పని చేస్తున్న పలువురు ఏఈలకు ఇటీవల సీనియార్టీ ప్రతిపాదికన పదోన్నతులు కల్పింంది. ఈ మేరకు జనవరి 10వ తేదీన 153 మంది ఏ ఈలకు ఏడీఈలుగా పదోన్నతి కల్పించడంతో పాటు పోస్టింగ్‌లు కూడా ఇ్చంది. 15 రోజుల్లోగా విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వారెవర కొత్త పోస్టుల్లో చేరలేదు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు ఏడీఈగా బాధ్యతలు స్వీకరించని ముగ్గురు ఇంజనీర్లకు యాజవన్యం ప్రస్తుత బదిలీల్లో కీలకమైన ఫోకల్ పోస్టులను కట్టబెట్టేందుకు యత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై డిస్కం మానవ వనరుల విభాగం(హెచ్ఆర్) డైరెక్టర్ పర్వతంను వివరణ కోరగా..అంతా పారదర్శకంగానే జరిగినట్లు చెప్పడం విశేషం. ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి అక్రమాలు, అవినీతి చోటు చేసుకోలేదని, సీనియార్టీ ఆధారంగానే బదిలీల ప్రక్రియను పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. చదవండి: అమ్మాయివి నీకెందుకమ్మా? నన్ను చూసి నవ్వుకున్నారు.. -
తెలంగాణ డిస్కంల పనితీరు అధ్వానం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల పనితీరు, ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉన్నట్లు వెల్లడైంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 41 డిస్కంల పనితీరును కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ పరిశీలించి రేటింగ్స్ నిర్ధారించింది. తాజాగా ప్రకటించిన 9వ వార్షిక సమగ్ర రేటింగ్స్‌లో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు ‘బీ -గ్రేడ్’, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు ‘సీ -గ్రేడ్’దక్కాయి. ఉత్తర తెలంగాణ డిస్కం బీహార్ లాంటి రాష్ట్రాల డిస్కంల సరసన నిలవడం గమనార్హం. అత్యుత్తమ పనితీరుతో గుజరాత్‌లోని నాలుగు డిస్కంలతోపాటు హర్యానాలోని ఒక డిస్కం ‘ఏ+’ గ్రేడ్‌ను సాధించి జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలవగా హర్యానా, పంజాబ్, మహారాష్ట్రలకు చెందిన ఒక్కో డిస్కం ‘ఏ’ గ్రేడ్‌ను దక్కించుకున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్లో లోపాలు నిర్దేశితం కన్నా అధిక వ్యయంతో విద్యుత్ కొనుగోళ్లు చేయడం గడువులోగా 2019–20, 2020–21 ఆర్థిక సంవత్సరాల టారిఫ్ ప్రతిపాదనల (ఏఆర్ఆర్)ను ఈఆర్సీకి సమర్పించకపోవడం సంస్థకు వరుసగా మూడేళ్లు నష్టాలు రావడం విద్యుత్ బిల్లుల వసూళ్లతోపాటు కొనుగోళ్లకు జరిపే చెల్లింపుల్లో తీవ్ర జాప్యం పెరుగుతున్న ఇంధన వ్యయానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా టారిఫ్‌ను పెంచే వ్యవస్థ లేకపోవడం సాంకేతిక, వాణిజ్య(ఏటీ అండ్ సీ) విద్యుత్ నష్టాలను తగ్గించుకోకపోవడం టీఎస్ఎన్పీడీసీఎల్లోని కీలక లోపాలు 2018-19లో 26.66 శాతం ఉన్న విద్యుత్ నష్టాలు 2019-20లో 34.49 శాతానికి పెరిగిపోవడం 2019-20లో యూనిట్‌కు రూ.5.26 చొప్పున అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు చేయడం 2020-21, 2021-22ల టారిఫ్ ప్రతిపాదనలను నిర్దేశిత గడువులోగా ఈఆర్సీకి సమర్పించకపోవడం 2019-20లో అధిక ధరతో విద్యుత్ కొనుగోళ్లు జరపడం, ప్రభుత్వం నుంచి సకాలంలో సబ్సిడీలు రాకపోవడంతో సంస్థ చేసిన వ్యయం తిరిగి రాబట్టుకోలేకపోవడం పెరుగుతున్న ఇంధన వ్యయానికి తగ్గట్టు ఆటోమెటిక్‌గా టారిఫ్‌ను పెంచే వ్యవస్థ లేకపోవడం విద్యుత్ బిల్లుల వసూళ్లు, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం -
అమ్మాయివి నీకెందుకమ్మా? నన్ను చూసి నవ్వుకున్నారు..
లైన్ ఉమెన్ నియామకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే రాతపరీక్ష సహా స్తంభాలు ఎక్కే పరీక్షల్లో (పోల్ క్లైంబింగ్ టెస్టు) విజయం సాధించి అన్ని విధాలుగా సమర్థతను నిరూపించుకున్నప్పటికీ..వారికి ఇప్పటికీ పోస్టింగ్ దక్కలేదు. ఒక వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన పోలీసు, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవి వంటి రక్షణ రంగాల్లో పెద్దపీట వేస్తూ మహిళాభ్యున్నతికి పాటుపడుతుంటే..మరో వైపు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)మాత్రం ఇప్పటికీ మహిళల పట్ల వివక్షతను ప్రదర్శిస్తూనే ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అధికారుల తీరు వల్ల లైన్‌ఉమెన్‌గా ఇప్పటికే అన్ని అర్హతలు సాధించిన వాంకుడోతు భారతి, బి.శిరీషలకు ఏడాది కాలంగా నిరీక్షణ తప్పలేదు. సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 2019 సెప్టెంబర్ 28న 2500 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిస్కం చట్టం ప్రకారం దరఖాస్తు ఫాంలో మహిళలకు ఆప్షన్ ఇవ్వలేదు. అయితే అప్పటికే ఐటీఐ ఎలక్ట్రికల్ కోర్సు పూర్తి చేసిన మహబూబ్‌బాద్‌కు చెందిన భారతి, సిద్ధిపేటకు చెందిన శిరీష సహా మరో 30 మంది మహిళలు తమ భవితవ్యంపై ఆందోళన చెందారు. న్యాయం కోసం కోర్టును ఆశ్రయించారు. తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు ఆదేశాల మేరకు 34 మంది ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పురుష అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించినప్పటికీ.. మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించకపోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో 2019 డిసెంబర్ 15 వీరికి రాత పరీక్ష నిర్వహించారు. ఈ రాత పరీక్షలో ఇద్దరు మాత్రమే (భారతి, శిరీష)అర్హత సాధించారు. అప్పటికే పురుష అభ్యర్థులకు పోల్ క్లైంబింగ్ టెస్టు నిర్వహించి.. మహిళా అభ్యర్థులకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు 2020 డిసెంబర్ 23న వీరికి ఎర్రగడ్డలోని సెంట్రల్ పవర్ ఇనిస్టిట్యూట్‌లో పోల్ క్లైంబింగ్ పరీక్ష నిర్వహించారు. వీరిద్దరూ ఎనిమిది మీటర్ల ఎత్తున్న విద్యుత్ స్తంభాన్ని ఈజీగా ఎక్కి, పురుషులకు తామేమాత్రం తీసిపోబోమని నిరూపించారు. అంతేకాదు సంస్థలో లైన్ ఉమెన్ ఉద్యోగానికి అర్హత సాధించిన తొలి మహిళలుగా చరిత్ర సృష్టించారు. అయితే వీరికి ఇంకా పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వక పోవడంతో మళ్లీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులోని తొమ్మిదో నెంబర్ సింగిల్ బెంచి వద్ద పెండింగ్‌లో ఉండిపోవడంతో వారికి నిరీక్షణ తప్పలేదు. అయితే డిస్కం మాత్రం కోర్టు ఆదేశాలు వచి్చన తర్వాతే ఆర్డర్స్ ఇస్తామని చెబుతోంది. ఇంకెన్నాళ్లు ఎదురుచూడాలి? మాది సిద్ధిపేట జిల్లా మర్కుకు మండలం గణేష్‌పల్లి గ్రామం. మా అమ్మానాన్నలు వ్యవసాయ కూలీలే. 2015లో అల్వాల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఎల్రక్టీషియన్ ట్రేడ్‌లో చేరాను. అప్పటికే కాలేజీ ప్రిన్సిపాల్ అభ్యంతరం కూడా చెప్పారు. అమ్మాయివి ఈ కోర్సు ఎందుకమ్మా...? మరేదైనా కోర్సు తీసుకోవచ్చు కదా! అని సూచించారు. కానీ నేను వినలేదు. పట్టుబట్టి అదే కోర్సులో చేరి పాసయ్యాను. 2019లో జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దరఖాస్తు చేసేందుకు వెళ్లితే అందు లో ఫీమేల్ ఆఫ్షన్ లేకపోవడం ఆందోళన కలిగింది. కొంత మంది యువతులం కలిసి హైకోర్టును ఆశ్రయించాం. కోర్టు అనుమతి ఇవ్వడంతో రాతపరీక్ష సహా పోల్ క్లైంబింగ్ కూడా పూర్తి చేశాం. అయినా మాకు ఉద్యోగం రాలేదు. ఇంకా ఎన్నాళ్లు ఎదురు చూడాలో?. – బి.శిరీష, సిద్ధిపేట వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి మాది జనగాం జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామ సపీమంలోని సుకారిగడ్డ తండా. అమ్మానాన్నలు వ్యవసాయం చేస్తారు. టెన్త్ వరకు అక్కడే చదువుకున్నా. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో 2015లో ఇల్లందు ఐటీఐ కాలేజీలో ఎలక్ట్రికల్ కోర్సులో చేరాను. నాన్ లోకల్ కేటగిరిలో డిస్కంకు దరఖాస్తు చేశాను. రాత పరీక్ష కోసం వరంగల్‌లోని ఓ కేంద్రంలో శిక్షణ తీసుకున్నా. 90 మంది పురుష అభ్యర్థుల మధ్య నేను ఒక్కతినే. వారంతా నన్ను చూసి నవ్వుకున్నారు. అయినా నిరుత్సాహ పడలేదు. చివరకు కోర్టు ఆదేశాలతో రాత పరీక్ష, స్తంభం ఎక్కడం వంటి పరీక్షల్లోనూ నెగ్గాను. ఇప్పటికే మూడేళ్లైంది. అయినా ఎదురు చూపులు తప్పడం లేదు. వెంటనే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చి మాకు న్యాయం చేయాలి. – వాంకుడోతు భారతి, జనగాం జిల్లా -
కరెంట్‌కు కరోనా షాక్!
సాక్షి, హైదరాబాద్: కరోనా కేవలం ఆరోగ్య రంగంపైనే కాదు.. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)పైనా ప్రభావం చూపింది. కోవిడ్ కారణంగా గత రెండేళ్ల నుంచి అనేక పరిశ్రమలు, హోటళ్లు, సినిమాహాళ్లు, ఐటీ అనుబంధ సంస్థలు, విద్యా సంస్థలు, హాస్టళ్లు మూతపడ్డాయి. విదేశాలకు ఎగుమతి, దిగుమతులు నిలిచిపోవడంతో ఉన్నవి కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించాయి. పరిశ్రమలో పది యూనిట్లు ఉంటే.. అయిదు యూనిట్లతో సరిపెట్టుకున్నాయి. ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. 2019 మే నెల సగటు విద్యుత్ వినియోగం 70 ఎంయూ ఉండగా, 2020లో ఇది 60 ఎంయూకు తగ్గింది. తాజాగా ఈ ఏడాది ఏప్రిల్, మే నెలలో రోజు సగటు కరెంట్ వినియోగం 55 ఎంయూకి పడిపోయింది. ఫలితంగా సంస్థ నెలకు సగటున రూ.25 నుంచి రూ.30 కోట్ల చొప్పున అదనపు రెవెన్యూను కోల్పోవాల్సి వచ్చింది. ఈ రెండు వేసవి కాలాల్లో డిస్కం రూ.400 కోట్ల వరకు నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. కనెక్షన్లు పెరిగినా.. గ్రేటర్లో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఏడు లక్షల వాణిజ్య కనెక్షన్లు, 50 వేల పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. 45 లక్షలకుపైగా గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. నగరంలో నెలకు కొత్తగా రెండు వేల గృహ విద్యుత్ కనెక్షన్లు వచ్చి చేరుతుంటాయి. గృహ వినియోగదారుల కన్నా.. వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారులే సంస్థకు కీలకం. గృహ విద్యుత్ చార్జీలతో పోలిస్తే.. వాణిజ్య సంస్థలు వాడే కరెంట్ యూనిట్ చార్జీ ఎక్కువ. లాక్ డౌన్ కారణంగా ఐటీ అనుబంధ కంపెనీలు సహా సినిమా హాళ్లు, హోటళ్లు, ఇతర వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. ఎగుమతి దిగుమతులు నిలిచి పోవడంతో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఉత్పత్తి సామర్థ్యాన్ని కూడా తగ్గించుకున్నాయి. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం ఇవ్వడంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు పని చేయకపోవడంతో విద్యుత్ వినియోగం తగ్గిపోయింది. వినియోగదారుల నుంచి రావాల్సిన రెవెన్యూ తగ్గిపోయి సంస్థ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అంచనాలు తలకిందులు సాధారణంగా వర్షాకాలం, శీతాకాలంతో పోలిస్తే వేసవిలో విద్యుత్ వినియోగం ఎక్కువగా నమోదవుతుంది. గృహాల్లోనే కాకుండా వాణిజ్య సంస్థల్లోనూ ఏసీల వినియోగం పెరిగి కరెంట్ ఎక్కువ వినియోగం అవుతుంది. జులై నుంచి ఫిబ్రవరి వరకు నెలకు 150 నుంచి 200 యూనిట్లు వాడే సగటు వినియోగదారులు మార్చి నుంచి జూన్ చివరి వరకు 300 నుంచి 350 యూనిట్ల వరకు ఖర్చు చేస్తుంటారు. ఈ మేరకు డిస్కం ఈ వేసవిలోనూ భారీగా కరెంట్ వినియోగం జరుగుతుందని అంచనా వేసింది. రోజు సగటు వినియోగం 75 ఎంయూలకు చేరుకుంటుందని భావించింది. సెకండ్‌వేవ్ ఉద్ధృతి కారణంగా ప్రభుత్వం ఈ వేసవిలోనూ లాక్డౌన్ ప్రకటించింది. 2020 మే నెలలో రోజు సగటు వినియోగం 60 ఎంయూలు ఉండగా, 2021 మేలో 55 ఎంయూలే నమోదైంది. లాక్డౌన్ కారణంగా గృహ వినియోగం పెరిగినప్పటికీ.. వాణిజ్య వినియోగం తగ్గడంతో సంస్థకు నష్టాలు తప్పలేదు. వినియోగం తగ్గింది.. ఈ వేసవిలో రోజు సగటు వినియోగం 75 ఎంయులకు చేరుకుంటుందని అంచనా వేశాం. కానీ లాక్‌డౌన్‌కు తోడు గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంది. ఉక్కపోత అధికంగా లేకపోవడంతో వినియోగదారులు ఏసీల వినియోగాన్ని తగ్గించడంతో ఆదాయం రాలేదు. – శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్, టీఎస్ఎస్పీడీసీఎల్ మినిమం చార్జీ చెల్లిస్తున్నాం కోవిడ్ కారణంగా గత ఏడాది మార్చిలో థియేటర్లు మూతపడ్డాయి. ప్రదర్శనలున్నప్పుడు నెలకు సగటున రూ.60 వేలు కరెంట్ బిల్లు చెల్లించేవాళ్లం. ప్రస్తుతం సినిమాలు లేకపోవడంతో నెలకు మినిమం చార్జీ కింద రూ.30 వేల వరకు చెల్లిస్తున్నాం. – శ్రీనివాసరెడ్డి, మేనేజర్, సుదర్శన్ థియేటర్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ -
విద్యుత్‌లో తెలంగాణ నయా రికార్డు!
సాక్షి ప్రతినిధి, వరంగల్: విద్యుత్ సరఫరాలో తెలంగాణ మరోసారి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఉమ్మడి ఏపీలో సైతం ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో ఈ సీజన్లో అత్యధిక వినియోగం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో 2014 మార్చి చివరి వారం (23న) అత్యధికంగా 13,162 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగ్గా ఈ నెల మొదటి వారంలో ఒక్క తెలంగాణలోనే 13,141 మెగావాట్ల వినియోగం జరగడం రికార్డుగా విద్యుత్ సరఫరా సంస్థలు ప్రకటించాయి. వాతావరణం చల్లబడి, వరి కోతలు చేపడుతున్న సమయంలో శుక్రవారం కూడా భారీగా విద్యుత్ వినియోగం అయినట్లు నమోదైంది. ఈ సీజన్లో ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ ఏర్పడినా ఎలాంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ రాష్ట్ర ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్), దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) విద్యుత్ సరఫరా చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగం టీఎస్ ఎన్పీడీసీఎల్, టీఎస్ఎస్పీడీఎల్ పరిధిలో ఏటేటా విద్యుత్ వినియోగం పెరుగుతోంది. 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన విద్యుత్ వినియోగం వివరాలను విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ‘తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే–2021’ద్వారా ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదవగా 2017-18లో అది 10,284 మెగావాట్లకు చేరింది. అలాగే 2018-19లో 10,818 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదుకాగా 2019–20లో డిమాండ్ 11,703 మెగావాట్లకు చేరింది. దేశ సగటు వృద్ధి శాతం 3.44గా నమోదవగా తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 8.18 శాతంగా నమోదైంది. పంపుసెట్లకు నిరంతర ఉచిత విద్యుత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో కీలకమైనది వ్యవసాయానికి ఉచిత, నాణ్యమైన విద్యుత్ సరఫరా. 2018 జనవరి 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 19 లక్షలకుపైగా పంపు సెట్లు ఉంటే ఇప్పుడు 24 లక్షలకుపైగా కనెక్షన్లు ఉన్నాయి. అనధికారికంగా మరో 4.20 లక్షల వరకు ఉంటాయని అధికారుల అంచనా. అలాగే రాష్ట్రం ఏర్పడే నాటికి 1.10 కోట్ల వరకు వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా ఈ ఏడాది మార్చి 31 నాటికి వాటి సంఖ్య 1.55 కోట్లు దాటింది. ఈ లెక్కన విద్యుత్ కనెక్షన్లలో 38.62 శాతం వృద్ధి నమోదైనట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. ఇదే స్థాయిలో సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు కూడా పెరిగాయి. కాగా వీటితో పాటు 2014 వరకు 680 మెగావాట్ల విద్యుత్ ఎత్తిపోతల పథకాలకు వినియోగించగా, కాళేశ్వరం లాంటి భారీ పథకాలు తోడవడంతో ప్రస్తుతం 2,100 మెగావాట్లకు చేరినట్లు అధికరుల గణాంకాలు చెబుతున్నాయి. వచ్చే రెండేళ్లలో మరిన్ని ఎత్తిపోతల పథకాలు పూర్తి కానుండగా, వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్లో భారీగా యాసంగి పంటలు కోతకు వచ్చినా విద్యుత్ వినియోగం ఆగడం లేదు. గురు, శుక్రవారాల్లోనూ గతేడాది ఇదే సమయంతో పోలిస్తే విద్యుత్ గణనీయంగా వినియోగమైంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో గత ఏడాది 2,584 మెగావాట్లు కాగా, ఇప్పుడు 3,081 మెగావాట్లుగా, ఎస్పీడీసీఎల్ పరిధిలో గతేడాది ఇదే సమయంలో 4,575 మెగావాట్లు కాగా, శుక్రవారం 6,665 మెగావాట్లు విద్యుత్ వినియోగం నమోదైంది. ఈ రెండు విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలోని పూర్వ కరీంనగర్ జిల్లాలో 1,029 మెగావాట్లు వినియోగం కాగా, ఎస్పీడీసీఎల్ పరిధిలోని మెదక్‌లో 1,443, మహబూబ్‌నగర్‌లో 1,126 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. -
కోటేశ్వరాస్త్రంపై కదలిక
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో బినామీలకు నామినేషన్లపై పనులు కట్టబెట్టడానికి సంబంధించి సంస్థ అదనపు డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) డి.కోటేశ్వరరావు బహిర్గతం చేసిన అవినీతి భాగోతంపై దృష్టి సారించిన సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సదరు సర్వీస్ కోడ్‌ను సాఫ్ట్వేర్ నుంచి తొలగించడంతో పాటు అవినీతికి ఆస్కారం లేకుండా వ్యయ పరిమితులు విధించింది. ఫేస్బుక్ లైవ్‌లో ఆధారాలతో సహా.. కోటేశ్వరరావు 2020 ఫిబ్రవరి 4న ఫేస్బుక్ లైవ్ నిర్వహించి.. సంస్థలో ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు, చెట్ల కొమ్మలు నరికివేత పనుల్లో రూ.వందల కోట్ల అవినీతి జరిగిందని ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకొచ్చారు. దోపిడీకి పాల్పడుతున్న కొందరు విద్యుత్ ఇంజనీర్ల పేర్లను సైతం బహిర్గతం చేశారు. దీనిపై ‘సాక్షి’అప్పట్లోనే కథనం ప్రచురించింది. ఈ అవినీతి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో కోటేశ్వరరావుపై యాజమాన్యం సస్పెన్షన్ వేటు వేసింది. అయితే జాతీయ ఎస్టీ కమిషన్ జోక్యంతో సస్పెన్షన్ తొలిగింది. అదే సమయంలో ఆయన బహిర్గతం చేసిన అవినీతి సంస్థ యాజమాన్యంలో కదలికను తీసుకొచ్చింది. అవినీతి ఇలా జరిగింది.. ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ కంచె ఏర్పాటు కోసం ’సాప్’సాఫ్ట్‌వేర్‌లో ఒకే సరీ్వస్ కోడ్ (ఎస్డబ్ల్యూఆర్ 21693) ద్వారా ఒకే రకమైన పనికి వేర్వేరు రేట్లతో అడ్డగోలుగా ఎలా అంచనాలు పెంచి దోపిడీకి పాల్పడ్డారన్న అంశాన్ని కోటేశ్వరరావు ఆధారాలతో సహా బహిర్గతం చేశారు. వందలాది పనుల అంచనాలను బయటపెట్టారు. గాల్వనైజ్డ్ ఐరన్ మెష్ (ఇనుప కంచె)తో ఫెన్సింగ్ ఏర్పాటు కోసం ఒక ప్రాంతంలోని డివిజనల్ ఇంజనీర్ (డీఈ) చదరపు అడుగుకు రూ.54 (100 శాతం)తో అంచనాలు తయారుచేస్తే, మరో ప్రాంతంలోని డీఈ రూ.125 (231 శాతం అధికం), ఇంకో ప్రాంతంలోని డీఈ రూ.284 (526 శాతం అదనం), మరో ప్రాంతంలోని డీఈ రూ.384 (711 శాతం అదనం) చొప్పున అంచనాలు రూపొందించారని బయటపెట్టారు. ఒక ట్రాన్స్ఫార్మర్కు 120–130 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు రూ.20 వేలలోపు ఖర్చు కావాల్సి ఉండగా, కొందరు ఇంజనీర్లు ఈ రకంగా రూ.60 వేల వరకు అంచనాలను పెంచేశారు. ఇలా అడ్డగోలుగా అంచనాలు పెంచి 48 మంది కాంట్రాక్టర్లకు రూ.1,344 కోట్లు చెల్లించారని వివరించారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో జరిగిన పని విలువ రూ.144 కోట్లు మాత్రమే అని తెలిపారు. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు పేరుతో రూ.1,200 కోట్ల అవినీతి జరిగిందని ఆయన సీఎం కేసీఆర్, సీఎస్, ఇంధన శాఖలకు లేఖలు సైతం రాశారు. అయితే, ఈ అవినీతిలో బాధ్యులైన ఇంజనీర్లలో కొందరికి మాత్రమే షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంస్థ యాజమాన్యం తూతూమంత్రంగా విచారణ నిర్వహించి సంస్థకు ఎలాంటి నష్టం జరగలేదని తేలి్చందనే విమర్శలున్నాయి. అయితే అడ్డగోలు అంచనాలు బయటపడిన నేపథ్యంలో జాగ్రత్తపడిన సంస్థ యాజమాన్యం సదరు సరీ్వస్ కోడ్‌ను సాఫ్ట్వేర్ నుంచి తొలగించింది. దీంతోపాటు ఒక ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు వ్యయంపై రూ.20 వేల గరిష్ట పరిమితి విధించింది. చెట్ల కొమ్మల్లోనూ కొట్టేశారు! వర్షాకాలంలో గాలివానలకు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తుంటాయి. దీంతో ఏటా రెండు మూడుసార్లు 11 కేవీ విద్యుత్ లైన్లపై నుంచి వెళ్లే చెట్ల కొమ్మలను సంస్థ యాజమాన్యం కొట్టి వేయిస్తుంటుంది. అయితే చెట్ల కొమ్మలు కొట్టడం పేరుతో కొందరు విద్యుత్ ఇంజనీర్లు అడ్డగోలుగా ఏటా రూ.కోట్లలో బిల్లులు చేసుకుంటున్నారని కూడా కోటేశ్వరరావు బయటపెట్టారు. దీంతో ఒక ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు నరకడానికి ఏడాదికి గరిష్టంగా రూ.20 వేలలోపు మాత్రమే ఖర్చు చేసేలా సంస్థ యాజమాన్యం మరో వ్యయ పరిమితి విధించింది. దీంతో ఏడాదిలో ఎన్నిసార్లు చెట్ల కొమ్మలు నరికినా ఒక ఫీడర్ పరిధిలో ఇకపై రూ.20 వేలు మాత్రమే బిల్లు రానుంది. గతంలో ఒక ఫీడర్ పరిధిలో రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు అడ్డగోలుగా బిల్లులు చేసుకునేవారు. రాజేంద్రనగర్ డివిజన్లో పనిచేసిన ఒక డీఈ ఏకంగా రూ.4 కోట్లను చెట్ల కొమ్మలు నరికివేత పేరుతో ఒక ఏడాదిలో బిల్లులు చేసుకున్నారు. ప్రస్తుతం వ్యయ పరిమితి విధించడంతో ఒక్కో ఫీడర్ పరిధిలో కనీసం రూ.50 వేలు ఆదా కానున్నాయి. టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలో 7,440 పీడర్లు ఉండగా, కొమ్మల నరికివేత పనుల్లో ఏటా సంస్థకు రూ.37.20 కోట్లు ఆదా కానున్నాయి. అక్రమాలు జరిగినందుకే దిద్దుబాటు.. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు, చెట్ల కొమ్మలు నరికివేత పనుల్లో అవినీతిని తాను బయటపెట్టడం వల్లే డిస్కం చర్యలు చేపట్టిందని, మార్పులు సాధ్యమయ్యాయని కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ విషయాన్ని తన సరీ్వస్ బుక్‌లో ఎంట్రీ చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకెళ్లాలని ఇటీవల సంస్థ యాజమాన్యానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు ఈ మార్పులు చేశారంటే, గతంలో చెల్లించిన బిల్లులు అక్రమమైనవేనని తేలినట్టేనని ఆయన దరఖాస్తులో పేర్కొనడం గమనార్హం. ఇదీ అవినీతి ఒక ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటుకు రూ.20 వేల లోపు ఖర్చు కావాల్సి ఉండగా రూ.60 వేల వరకు అంచనాలు పెంచేసిన ఇంజనీర్లు. ఈ విధంగా 48 మంది కాంట్రాక్టర్లకు ఏకంగా రూ.1,200 కోట్ల సంస్థ సొమ్మును దోచిపెట్టేశారు. ఇలా దిద్దుబాటు సదరు సరీ్వస్ కోడ్‌ను సాఫ్ట్వేర్ నుంచి సంస్థ తొలగించింది. దీంతోపాటు ఒక ట్రాన్స్ఫార్మర్కు కంచె ఏర్పాటు వ్యయంపై రూ.20 వేల గరిష్ట పరిమితి విధించింది. అంటే ఎక్కడా రూ.20 వేలకు మించి ఖర్చు పెట్టడానికి వీల్లేదన్నమాట. ఇదీ అవినీతి వర్షాకాలంలో విద్యుత్ తీగలపై చెట్ల కొమ్మలు పడకుండా ఏటా రెండుసార్లు కొమ్మలు కొట్టేసే పనుల్లో కూడా కోట్లు కొట్టేశారు. గతంలో ఒక్క ఫీడర్ పరిధిలోనే రూ.80 వేల నుంచి రూ.90 వేల వరకు అడ్డగోలుగా బిల్లులు చేసుకునేవారు. ఇలా దిద్దుబాటు ఒక ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మలు నరకడానికి ఏడాదికి గరిష్టంగా రూ.20 వేల లోపే ఖర్చు చేసేలా సంస్థ వ్యయ పరిమితి విధించింది. ఇకపై ఏడాదిలో ఎన్నిసార్లు చెట్ల కొమ్మలు నరికినా ఫీడర్ పరిధిలో రూ.20 వేలే బిల్లు రానుంది. 2020 ఫిబ్రవరి 4వ తేదీన ఫేస్బుక్ లైవ్‌లో మాట్లాడుతున్న ఏడీఈ కోటేశ్వరరావు -
డిస్కంల నష్టాలు రూ.36,231 కోట్లు
హైదరాబాద్: డిస్కంలు నష్టాలతో డిష్యుం డిష్యుం అంటున్నాయి. ఏటేటా నష్టాలు ఎట్లెట్లా ఎగబాకుతున్నాయో నివేదికలు తాజాగా వెల్లడించాయి. 2018–19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నష్టాలు ఏకంగా రూ.36,231.47 కోట్లకు చేరాయి. 2017–18 ముగిసే నాటికి రూ.28,209.26 కోట్లు నష్టాల్లో ఉండగా, 2018–19లో కొత్తగా మరో రూ.8,022.21 కోట్ల నష్టాలు జతయ్యాయి. దక్షిణ/ ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ ఎస్పీడీసీఎల్/ టీఎస్ఎన్పీడీసీఎల్)లు ఇటీవల రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టిన వార్షిక నివేదికలు ఈ సంచలన విషయాలను బహిర్గతం చేశాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీ డీసీఎల్) నష్టాలు 2017–18 ముగిసేలోగా రూ.19,395.03 కోట్లుండగా, 2018–19 నాటికి 24,362.30 కోట్లకు పెరిగాయి. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్పీడీసీఎల్) నష్టాలు 2017–18 ముగిసేనాటికి రూ.8,814.23 కోట్లుండగా, 2018–19 నాటికి రూ.11,869.17 కోట్లకు ఎగబాకాయి. ఆ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం రూ.5,764.95 కోట్ల విద్యుత్ సబ్సిడీలను మంజూరు చేసింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.వేల కోట్ల సబ్సిడీలు ఇస్తున్నా, డిస్కంల నష్టాలు శరవేగంగా పెరిగిపోతుండటం గమనార్హం. ఎన్పీడీసీఎల్ ఆదాయంలో 40% సబ్సిడీలే.. టీఎస్ఎన్పీడీసీఎల్ 2018–19లో 19,119.78 మిలియన్ యూనిట్ల(ఎంయూ) విద్యుత్‌ను సమీకరించగా, అందులో 17,226.28 ఎంయూల విద్యుత్‌ను వినియోగదారులకు విక్రయించింది. మిగిలిన 1,893.50 ఎంయూల విద్యుత్ పంపిణీ నష్టాల రూపంలో వృథా అయింది. విద్యుత్ కొనుగోళ్లకు రూ.10,461.63 కోట్లు, ట్రాన్స్మిషన్, ఎస్ఎల్డీసీ చార్జీల కోసం రూ.459.49 కోట్లు కలిపి మొత్తం రూ.10,291.13 కోట్లను ఖర్చుచేసింది. విద్యుత్ అమ్మకాలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ, దానిపై వడ్డీలు, జరిమానాలు, విద్యుత్ చౌర్యం/అక్రమాల రికవరీలు, వినియోగదారుల నుంచి ఇతర చార్జీల వసూళ్ల ద్వారా ఎన్పీడీసీఎల్ రూ.6,027.55 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.4,254.15 కోట్ల విద్యుత్ సబ్సిడీలు, రూ.113.30 కోట్ల అదనపు సబ్సిడీలను మంజూరు చేసింది. దీంతో 2018–19లో ఎన్పీడీసీఎల్ రూ.10,395 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఎన్పీడీసీఎల్ మొత్తం ఆదాయంలో ప్రభుత్వ సబ్సిడీల వాటే 41 శాతానికిపైగా ఉండటం గమనార్హం. అధికధరకు కొని తక్కువధరకు విక్రయం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 2018–19లో 44,997.11 ఎంయూల విద్యుత్‌ను కొనుగోలు చేయగా, 40,342.50 ఎంయూల విద్యుత్‌ను వినియోగదారులకు విక్రయించింది. మిగిలిన 4,654.61 ఎంయూల విద్యుత్ పంపిణీ నష్టాల రూపంలో వృథా అయింది. ఈ మేరకు విద్యుత్ కొనుగోళ్లు, ట్రాన్స్మిషన్, ఇతర చార్జీలు కలిపి సంస్థ రూ.24,837.33 కోట్లు వ్యయం చేసింది. ఉద్యోగుల జీతభత్యాల కోసం మరో రూ.2,134.85 కోట్లు వెచ్చించింది. వినియోగదారులకు విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.23,899.76 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఇందులో రూ.1,397.50 కోట్ల సబ్సిడీలున్నాయి. జీతభత్యాల వ్యయం తడిసిమోపెడు విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ, పెన్షనర్లకు అదనంగా మరో 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను 2018 ఏప్రిల్ నుంచి అమలు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కన్నా అధికంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల జీతాలు పీఆర్సీ అమలుతో మరింత భారీగా పెరిగిపోయాయి. 2017–18లో రూ.2,541.27 కోట్లున్న రెండు డిస్కంల ఉద్యోగుల జీతభత్యాల వ్యయం 2018–19లో రూ.4,059.69 కోట్లకు పెరిగిపోయింది. టీఎస్ఎస్పీడీసీఎల్ జీతభత్యాల వ్యయం రూ.1,876.93 కోట్ల నుంచి రూ.2,134.85 కోట్లకు, టీఎస్ఎన్పీడీసీఎల్ జీతభత్యాల వ్యయం రూ.664.34 కోట్ల నుంచి రూ.1,624.84 కోట్లకు పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగులకు 35 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీకి అనుమతి ఇచ్చిందని, ప్రభుత్వ అనుమతి లేకుండా పెన్షనర్లకు అదనంగా 7.5 శాతం ఫిట్మెంట్ వర్తింపజేశారని కాగ్ అభ్యంతరం తెలిపింది. ట్రాన్స్‌కో సంస్థ జారీ చేసే ఉత్తర్వులను డిస్కంలు కూడా అమలు చేసుకోవడం ఆనవాయితీగా వస్తోందని, పెన్షనర్ల విషయంలో సైతం ఇదే చేశామని, ఇందులో ఉల్లంఘనలేమి లేవని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం కాగ్‌కు వివరణ ఇచ్చింది. -
ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ కాలితే.. బీపీ పెరగడం ఖాయం!
సాక్షి, హైదరాబాద్: ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు కాలిపోతే వినియోగదారుల నుంచే వాటి విలువను ఆరేళ్ల కింద ఉన్న అధిక ధరలతో వసూలు చేయాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నిర్ణయం తీసుకుంది. మీటర్ వ్యయాన్ని వినియోగదారుల నెలవారీ విద్యుత్ బిల్లులో కలిపి వసూలు చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్ ప్రీపెయిడ్ మీటర్‌కు రూ.11,279 వ్యయాన్ని జీఎస్టీతో కలిపి వసూలు చేయాలని అన్ని సర్కిళ్ల పర్యవేక్షక ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేసింది. 4 రెట్లు అధిక వ్యయం గత కొంతకాలంగా బహిరంగ మార్కెట్లో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా తగ్గిపోయాయి. 2017 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) నిర్వహించిన టెండర్లలో రూ.2,503కే సింగిల్ ఫేజ్ ప్రీపెయిడ్ మీటర్ విక్రయించడానికి ఐటీఐ లిమిటెడ్ అనే కంపెనీ ముందుకు వచ్చింది. అంతకుముందు టెండర్లలో రూ.2,722కే ఈ మీటర్‌ను విక్రయించడానికి ఎల్అండ్టీ సంస్థ బిడ్ దాఖలు చేసింది. దేశంలోని విద్యుత్ వినియోగదారులందరికీ దశలవారీగా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంతో వీటికి డిమాండ్ భారీగా పెరిగిపోయి ధరలు ఇంకా పతనం అవుతున్నాయి. మరోవైపు కాలిపోయిన మీటర్ల వ్యయాన్ని వినియోగదారుల నుంచి 6 ఏళ్ల కింద ఉన్న నాలుగైదు రెట్ల అధిక ధరలతో వసూలు చేయాలని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం నిర్ణయించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పరిశ్రమలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ మీటర్లను టీఎస్ఎస్పీడీసీఎల్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం దాదాపు 20 వేల మీటర్లను సింగిల్ ఫేజ్ మీటర్‌కు రూ.8,687, త్రీఫేజ్ మీటర్‌కు రూ.11,279 చెల్లించి ఆరేళ్ల కింద టెండర్ల ద్వారా కొనుగోలు చేసింది. వీటిలో కొన్ని రిజర్వులో ఉన్నాయి. ఎక్కడైనా స్మార్ట్‌మీటర్ పాడైతే... గతంలో అధిక ధరలకు కొన్నవాటినే బిగి స్తున్నామని, సంస్థ నిబంధనల ప్రకారం ఈ ధరలనే వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నట్టు ఓ అధికారి వివరించారు. కొత్తగా ప్రీపెయిడ్ మీటర్లు కొనుగోలు చేసే వరకు ఈ పాత ధరలే కొనసాగుతాయని పేర్కొంటున్నారు. ఈ అంశంపై టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి వివరణ కోసం ‘సాక్షి’ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. చదవండి: హైదరాబాద్ ఐఎస్బీ.. మరో ఘనత కేటుగాళ్లు.. సీసీ కెమెరాలపైకి పొగను పంపి.. -
అడిగినంత ఇస్తే సరి.. లేదంటే..!
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అవినీతికి నిలయంగా మారింది. పైసా విదల్చనిదే ఫైలు కదలని పరిస్థితి నెలకొంది. ట్రాన్స్ఫార్మర్, కొత్త వెంచర్లో లైన్ల ఏర్పాటు, లైన్ల మార్పిడి, ప్యానల్ బోర్డు, కరెంట్ మీటర్....ఇలా ప్రతి పనికీ ఓ రేట్ ఫిక్స్ చేశారు. అడిగినంత ఇస్తే సరి..లేదంటే వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నారు. ఇంజనీర్ల తీరుతో విసిగిపోయిన వినియోగదారులు, విద్యుత్ కాంట్రాక్టర్లు చివరకు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తుండటంతో అవినీతి తిమింగళాలను వలపన్ని పట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఒక సారి ఏసీబీ కేసులో అరెస్టై కేసు విచారణలో ఉన్న అధికారులు ఏడాది తిరగక ముందే అంత కంటే మంచి పోస్టులో చేరిపోతుండటంపై విశేషం. నిజానికి ఏసీబీ కేసులున్న అధికారులను పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో వేయాలి. కానీ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఇందుకు విరుద్ధంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి పెద్దపీట వేస్తుండటం కొసమెరుపు. చదవండి: ప్రైవేటీకరణ మాటే లేదు వారి రూటే సపరేటు..ప్రతి పనికీ ఓ రేటు గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కొత్తగా అనేక వెంచర్లు వెలుస్తున్నాయి. బహుళ అంతస్తుల భవనాలు, వ్యక్తిగత గృహాలు అనేకం నిర్మాణం అవుతున్నాయి. కొత్తలైన్లు, మీటర్లు కరెంటోళ్లకు కామధేనువులా మారాయి. నిజానికి నాలుగు మీటర్లకు మించితే ప్యానల్ బోర్డు ఏర్పాటు చేసుకోవాలి. చాలా మంది వినియోగదారులు జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతుంటారు. ఒక వేళ అనుమతి తీసుకున్నా..సెట్‌బ్యాక్, పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ వంటి నిబంధనలు పాటించరు. దీంతో వీటికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవ్వరు. ప్రభుత్వ, నోటరీ స్థలాల్లో నిర్మాణాలకు ఎలాంటి ధృవపత్రాలు ఉండవు. నిర్మాణంలో ఉన్న ఈ లోపాలను ఇంజనీర్లు అవకాశంగా తీసుకుంటున్నారు. నిజానికి ఏదైనా వెంచర్‌కు కరెంట్‌లైన్ మంజూరు చేయాలంటే హెచ్ఎండీఏ అనుమతి ఉండాలి. కానీ ప్రస్తుతం శివారు ప్రాంతాల్లోని వెంచర్లలో చాలా వాటికి అనుమతి లేదు. అప్పట్లో గ్రామ పంచాయితీ అనుమతితో ఆయా వెంచర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటికి లైన్లు మంజూరు కోసం రూ.2 లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. అన్ని అనుమతులు ఉన్నా హెచ్ఎండీఏ వెంచర్ నిర్వాహకులు కూడా రూ.లక్షకు పైగా ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఇక శివార్లలో కొత్తగా నిర్మించే అపార్ట్‌మెంట్‌కు ప్యానల్‌బోర్డు, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలంటే సదరు యజమాని కనీసం రూ.లక్షన్నరపైగా కప్పం కట్టాల్సిందే. చదవండి: కరెంట్ బిల్లు తగ్గాలా.. ఇలా చేయండి! ఏసీబీని ఆశ్రయిస్తుండటంతో.. శివారు ప్రాంతాల్లోని కీసర, మేడ్చల్, హబ్సీగూడ, సైనిక్‌పురి, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, చంపాపేట్, హబ్సీగూడ, డివిజన్లు అవినీతికి నిలయంగా మారాయి. ఇక్కడ పని చేస్తున్న కొంత మంది ఉన్నతాధికారులు కిందిస్థాయిలో పని చేస్తున్న సిబ్బందిని ఏజెంట్లుగా పెట్టుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారికంగా ఎలాంటి ఎస్టిమేషన్లు లేకుండానే కొత్తలైన్లు, ప్యానల్‌బోర్డులు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేన్నారు. నిజానికి భవనం, వెంచర్ యజమానులు కొత్త లైన్లు, కనెక్షన్ల కోసం ఆయా డివిజన్ల పరిధిలోని వినియోగదారుల సేవాకేంద్రంలో దరఖాస్తు చేసుకుంటారు. ఈ కేంద్రం నుంచి దరఖాస్తు సంబంధిత సెక్షన్ ఏఈ, ఏడీఈ, డీఈ,ఎస్ఈకి వెళ్లుంది. వర్క్ఎస్టిమేషన్ దగ్గరి నుంచి మెటీరియల్ సరఫరా, వర్క్ పూర్తైన తర్వాత తనిఖీ చేసే వరకు సెక్షన్‌కు ఇంత అంటూ ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత సమర్పించుకోవాల్సిందే. లేదంటే రోజుల తరబడి తిరిగినా ఫైలు ముందుకు కదలదు. -
విద్యుత్ బిల్లులపై సందేహాలు తీరుస్తాం
సాక్షి, హైదరాబాద్: గత మూడు నెలలకు సం బంధించి ఒకేసారి రీడింగ్ తీయడం వల్ల బిల్లులు అధికంగా వచ్చాయని కొంతమంది విద్యుత్ వినియోగదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సందేహాలు తీర్చడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జీ రఘుమారెడ్డి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. సంస్థ పరిధిలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తమ బిల్లుకు సంబంధించిన సందేహాలను తీర్చుకోవచ్చని స్పష్టంచేశారు. సంస్థ మెయిల్ ఐడీ customerservice@tssouthernpower.com, ట్విట్టర్ ఖాతా TsspdclCorporat@twitter, ఫేస్బుక్ ఖాతా gmcsc.tsspdcl@facebook. com లకు అందుకున్న ఫిర్యాదులను 2 పని దినములలో పరిష్కరించి బిల్లింగ్ వర్క్ షీట్ ద్వారా వినియోగదారునికి జవాబు పంపాలని క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలియజేశారు. వినియోగదారులు తమ విద్యుత్ వాడకం బిల్లులపై ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్న యెడల తమ బిల్ పైభాగంలో ముద్రించిన ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ (ఉఖౖ)ను సంప్రదించి గాని (లేదా) పైన పేర్కొన్న సంస్థ ఈ మెయిల్/ట్విట్టర్/ పేస్బుక్ పేజీకి పంపి తమ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. -
‘అందుకే కరెంటు బిల్లులు పెరిగాయి’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో విద్యుత్ చార్జీలు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు పెంచలేదని, ఉన్న బిల్లుల ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నామని టీఎస్ఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమారెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ నగరంలో మొత్తం 95 లక్షల మంది వినియోగదారులు ఉన్నారు. ఏప్రిల్, మే నెల వరకు లాక్డౌన్ కారణంగా పాత బిల్లు ప్రకారం వసూలు చేశాం. ఈ నెల ఇంటింటికి వెళ్లి రీడింగ్ తీసి బిల్లులు ఇస్తున్నాం. ఈ సమ్మర్లో విద్యుత్ వినియోగం పెరిగిన కారణంగా వినియోగదారులకు స్లాబులు మారాయి. 13 శాతం అదనంగా స్లాబులు పెరిగాయి. గృహ వినియోగం పెరిగింది కాబట్టే బిల్లులు పెరిగాయి. అందుకు అనుగుణంగానే చార్జీలు వచ్చాయి. ఏప్రిల్‌లో 40 శాతం, మే నెలలో 60 శాతం బిల్లులు మాత్రమే వినియోగదారులు చెల్లించారు. ( టెన్త్ పరీక్షలు హైకోర్టు గ్రీన్ సిగ్నల్) అయితే గతంలో రీడింగ్ ఈ నెల రీడింగ్ తీసిన తరువాత మధ్యలో వాడిన కరెంట్ మొత్తానికి మీరు కట్టిన బిల్లులో తీసివేసి మాత్రమే బిల్లు వచ్చింది. రీడింగ్‌లో గానీ, బిల్లులో గానీ ఎక్కడా తప్పిదాలు జరగలేదు. న్యూస్ పేపర్లో.. వాట్సాప్‌లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవి వాస్తవం కాదు. గత ఏడాది కంటే ఈ ఏడాది కరెంట్ వినియోగం 15 శాతం పెరిగింది. ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకే యావరేజ్‌గా బిల్లులు వసూలు చేశాం. ఎక్కడా తప్పిదాలు జరగలేదు. ఒకవేళ జరిగితే దాన్ని మేము పరిష్కరిస్తాం’’ అని అన్నారు. -
గతేడాది మార్చి బిల్లునే చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లుల డిమాండ్ నోటీసులు జారీ చేయడానికి బదులు ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయం తీసుకున్నాయి. 2019 మార్చిలో జరిపిన వినియోగానికి సంబంధించి చెల్లించిన విద్యుత్ బిల్లులనే 2020 మార్చిలో జరిపి న వినియోగానికి సైతం చెల్లించాలని వినియోగదారులను కోరనున్నా యి. కొత్త వినియోగదారులైతే ఫిబ్రవరి 2020 నెలకు సంబం ధించి చెల్లించిన బిల్లు మొత్తాన్నే మార్చి నెల వినియోగానికి సైతం చెల్లించాలని కోరనున్నాయి. దీనికి సంబంధించిన అనుమతుల కోసం శుక్రవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మీటర్ రీడింగ్ తీసి వినియోగదారులు చెల్లించిన బిల్లులను సర్దుబాటు చేస్తామని ఈఆర్సీకి తెలిపాయి. వినియోగంతో పోల్చితే ఎవరైనా అధికంగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత మీటర్ రీ డింగ్ తీసినప్పుడు వారికి సంబంధించిన తదుపరి నెల బిల్లును ఆ మేరకు తగ్గించి సర్దుబాటు చేస్తారు. ఇదే తరహాలో అధిక వినియోగం ఉండి తక్కువ బిల్లులు చెల్లించిన వారి నుంచి తదు పరి నెల బిల్లులో ఆ మేరకు మిగిలిన మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తామని ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి శనివారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. -
దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ ఏడీఈ సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్)లో కాంట్రాక్టు పనుల అప్పగింత తీరును ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్బుక్’తో పాటు పత్రికలో ప్రకటనలు చేసిన ఏడీఈ డి.కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తున్న ట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ సీఎండీ రఘుమారెడ్డి తరపున రెండు రోజుల క్రితం జారీ చేసిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి.వాటిలో పేర్కొన్న వివరాల ప్రకారం టీఎస్ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం హెచ్ఆర్ విభాగం ఏడీఈ డి.కోటేశ్వర్రావు ఇటీవల సంస్థ ద్వారా రూ.30 కోట్లు విలువ చేసే 4,769 ట్రాన్స్ఫార్మర్ కంచె పనులకు ప్రదీప్ ఎలక్ట్రానిక్స్ అనే కాంట్రాక్టరుకు అప్పగించడాన్ని ప్రశ్నించారు. రేట్లను పెంచుతూ వాటిని అప్పగించడంపై సామాజిక మాధ్యమ వేదిక ‘ఫేస్బుక్’లో సుదీర్ఘ ప్రసం గాన్ని పోస్ట్ చేస్తూ, సంస్థకు చెందిన కొందరు ఇంజనీర్లపై ఆరోపణలు చేశారు. దీనిపై సంస్థ యాజమాన్యం మౌనం వహించడాన్ని ప్రశ్ని స్తూ చేసిన ప్రకటన ప్రచురితమైంది. ఇలా సంస్థ నియమావళిని ఉల్లంఘించారని భావి స్తూ కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ అభియోగాలు అమల్లో ఉన్నంత కాలం ఏడీఈ కోటేశ్వర్రావు హెడ్‌క్వార్టర్‌ను అనుమతి లేకుండా విడిచి వెళ్లరాదని ఆదేశించారు. నేను నష్టపోయినా పరవాలేదు : ఏడీఈ కాంట్రాక్టు పనులను నామినేషన్ పద్ధతిలో ఒకే కాంట్రాక్టరుకు అప్పగించడాన్ని ప్రశ్నించిన తనపై సస్పెన్షన్ వేటు వేయడంపై కోటేశ్వర్రావు స్పందించారు. వ్యక్తిగతంగా నష్టపోయినా సంస్థను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. గతంలో తన పనితీరుకు మెచ్చి సంస్థ విజిలెన్స్ విభాగం అవార్డు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్న తాను, ప్రస్తుతం బాధపడుతున్నానని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు వాస్తవాలు చేరేలా చూడాలని ఓ ప్రకటనలో కోటేశ్వర్రావు కోరారు. కాగా అక్రమాలను వెలుగులోకి తెచ్చే విజిల్ బ్లోయర్స్‌కు రక్షణ కల్పిస్తూ గతంలో టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం తెచ్చిన ‘విజిల్ మెకానిజమ్ పాలసీ’ని ఉల్లంఘిస్తూ కోటేశ్వర్‌రావును సస్పెండ్ చేశారని ‘విజల్ బ్లోయర్’సంస్థ విమర్శించింది. -
ఒకే కాంట్రాక్టర్‌కు 4,769 పనులు!
►మెదక్ జిల్లా తూప్రాన్‌లోని 2 ట్రాన్స్ఫార్మర్లకు 1,458 చ.అ. కంచె ఏర్పాటు కోసం 2018 మార్చిలో చదరపు గజానికి రూ.56 ధర తో రూ. 81,648 బిల్లులను కాంట్రాక్టర్‌కు చెల్లించారు. ►మహబూబ్‌నగర్ జిల్లా ఐజలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 జూలైలో చదరపు అడుగుకు రూ. 125 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 71,750 చెల్లించారు. ►సిద్దిపేటలోని కల్వకుంట్ల కాలనీలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 290 చదరపు అడుగుల కంచె ఏర్పాటు కోసం 2017 నవంబర్‌లో చదరపు అడుగుకు రూ. 284 ధర చొప్పున కాంట్రాక్టర్‌కు రూ. 82,360 చెల్లించారు. ►పరిగిలోని గొండుగొనపల్లి, డి.ఎంకెపల్లిలో రెండు ట్రాన్స్ఫార్మర్లకు 220 చదరపు అడుగుల కంచె కోసం 2018 ఫిబ్రవరిలో చదరపు అడుగుకు రూ. 384 ధరతో కాంట్రాక్టర్‌కు రూ. 84,840 చెల్లించారు. ►నామినేషన్ విధానంలో ఈ నాలుగు పనులన్నింటినీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ అనే కాంట్రాక్టు సంస్థ దక్కించుకోవడం గమనార్హం. 2010–20 మధ్య ఈ ఒక్క సంస్థకే టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు రూ. 30.69 కోట్లకుపైగా విలువజేసే 4,769 పనులు అప్పగించారు. సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఎవరూ ప్రమాదాల బారిన పడకుండా ఏర్పాటు చేసే రక్షణ కంచెల పనుల్లో జరుగుతున్న దోపిడీ బట్టబయలైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) అధికారులు కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లకు యథేచ్ఛగా దోచిపెడుతున్న వైనం ఫేస్బుక్ లైవ్ వేదికగా వెలుగులోకి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్ల వద్ద కంచెల ఏర్పాటుకు ఒక్కో ప్రాం తంలో ఒక్కో ధరతోపాటు ఒక్కో పని పరిమాణం తో టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారులు అంచనాలు తయారు చేసి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారంటూ టీఎస్ఎస్పీడీసీఎల్ అదనపు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఏడీఈ) కోటేశ్వర్రావు బహిర్గతం చేశారు. జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ సర్కిల్ ఏడీఈగా డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఆయన మంగళవారం ఫేస్బుక్ లైవ్ నిర్వహించి టీఎస్ఎస్పీడీసీఎల్లో జరుగుతున్న అక్రమాలను అధికారిక పత్రాలతో సహా ప్రజల ముందుంచారు. బుధవారం రాత్రి వరకు దాదాపు 2లక్షల మంది ఈ వీడియోను వీక్షిం చడంతోపాటు వేల మంది షేర్ చేయడంతో ఇది ఫేస్బుక్లో వైరల్‌గా మారింది. యాజమాన్యం అండదండలతోనే... వికారాబాద్, మెదక్, జోగిపేట, సిదిపేట, సంగా రెడ్డి డివిజన్ల పరిధిలో ప్రదీప్ ఎలక్ట్రికల్స్ ఏజెన్సీకి నామినేషన్ల విధానంలో 4,769 పనులు అప్పగించా రని అధికారిక సాక్ష్యాలతో కోటేశ్వర్రావు బయటపెట్టారు. ఎస్ఈగా రిటైరైన ఓ అధికారి, మరో నలు గురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కలిసి ఈ అక్రమాలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్లకు కంచె ఏర్పాటు వంటి పనులకు తప్పనిసరిగా టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. అయితే సంస్థ యాజమాన్యం అండదండలతోనే ఈ అక్రమాలు జరిగా యన్నారు. రూ.లక్షలోపు అంచనాలు కలిగిన పను లుచేసే ఒక చిన్న కాంట్రాక్టర్ ఒకే డివిజన్ పరిధిలో పనిచేయడం సాధ్యమని, అతడికి నాలుగు డివిజన్ల పరిధిలో పనులెలా అప్పగించారని ఆయన ప్రశి్నస్తున్నారు. ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రబ్యూషన్ బడ్జెట్ పేరుతో కేటాయించే అత్యవసర వినియోగం నిధు ల్లో సింహభాగం అధికారులు, కాంట్రాక్టర్ల జేబు ల్లోకి చేరుతున్నాయని అన్నారు. పనులు ఏమాత్రం చేయకున్నా, పాక్షికంగా చేసినా పూర్తిగా బిల్లులు చెల్లించినట్లు తన వద్ద ఆధారాలున్నాయన్నారు. విద్యుత్ సంస్థలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో తాను ఫేస్బుక్ లైవ్ నిర్వహించానని వెల్లడించారు. అక్రమాలను నిరోధించడంలో యాజమాన్యం విఫ లంకావడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యం గా మారి పేదలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. 700 శాతం వరకు రేట్ల పెంపు... కోటేశ్వర్రావు సాక్ష్యాలతో చూపిన ఆధారాల్లో అత్య ల్పరేటు అయిన రూ. 56తో పోలిస్తే 700 శాతం అధిక రేటు అయిన రూ. 384తో అంచనాలు అధికారులు రూపొందించారు. ఇలా 100% నుంచి 700% వరకు రేట్లను అడ్డగోలుగా పెంచారు. అంచనాల తయారీలో ప్రామాణిక ధరల పట్టిక (ఎస్ఎస్ఆర్) రేట్లను పరిగణనలోకి తీసుకోకుండా అడ్డగోలుగా వ్యవహరించారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ చుట్టూ మహా అయితే 120 చ.అ. కంచె ఏర్పాటు చేస్తారు. కానీ ప్రదీప్ ఎలక్రి్టకల్స్ చేపట్టిన పనులను పరిశీ లిస్తే 2 ట్రాన్స్ఫార్మర్లకు కలిపి ఒకచోట 1,458 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు, మరోచోట 574 చదరపు అడుగుల కంచె ఏర్పాటుకు అధికారులు బిల్లులు చెల్లించినట్లు స్పష్టమవుతోంది. హైకోర్టులో కేసు... టీఎస్ఎస్పీడీసీఎల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్రపతి, ప్రధాని, సీబీఐ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, సీఎంకు ఫిర్యాదు చేయడంతోపాటు రాష్ట్ర హైకోర్టులో సైతం కోటేశ్వర్రావు కేసులు వేశారు. ఇవి త్వరలో విచారణకు రానున్నాయని ఆయన చెప్పారు. కాగా, కోటేశ్వర్రావు సీఎంవోకు చేసిన ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరుగుతోందని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రజా సంబంధాల విభాగం వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. -
25 పోస్టులు.. 36,557 దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: పోస్టులు ఇరవై ఐదే.. వచ్చిన దరఖాస్తుల సంఖ్య మాత్రం 36,557. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) చేపట్టిన జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో) పోస్టుల భర్తీకి నిరుద్యోగుల నుంచి వచ్చిన అనూహ్య స్పందన ఇది. 2,500 జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం), 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కలిపి మొత్తం 3,025 పోస్టుల భర్తీకి టీఎస్ఎస్పీడీసీఎల్ గత నెలలో నోటిఫికేషన్లు జారీ చేసింది. ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. జేపీవో, జేఎల్ఎం పోస్టులకు దరఖాస్తుల గడువు ఈ నెల 10తో ముగియగా, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగిసింది. 25 జేపీవో పోస్టులకు గాను 36,557 మంది, 2,500 జేఎల్ఎం పోస్టులకు గాను 58,531 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు లక్షా 10 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్ఎస్పీడీసీఎల్ అధికారవర్గాలు తెలిపాయి. జూనియర్ అసిస్టెంట్ దరఖాస్తుల గడువు ఈ నెల 20తో ముగియడంతో ఇంకా వచ్చిన మొత్తం దరఖాస్తుల సంఖ్యను నిర్ధారించలేదని అధికారవర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 3,025 జేఎల్ఎం, జేపీవో, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకుగాను 2 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. దరఖాస్తుల పరిశీలన ముగిసిన అనంతరం అర్హులైన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రానుంది. ఇదిలావుండగా జూనియర్ లైన్‌మన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు డిసెంబర్ 15న, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు డిసెంబర్ 22న రాత పరీక్ష నిర్వహించనున్నారు. -
బిల్లులు కట్టాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం దృష్ట్యా నిధుల కొరతతో సాగునీటి పథకాలకు పెండింగ్ బిల్లులను చెల్లించలేక ఆ శాఖ సతమతమవుతోంది. మరో వైపు ప్రధాన ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేస్తున్నందున బిల్లులు చెల్లించాల్సిందేనని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) నీటి పారుదల శాఖపై ఒత్తిడి పెంచుతోంది. తమ ఆర్థిక నిర్వహణ, విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా తక్షణమే రూ.2,728 కోట్లు కట్టాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ బిల్లుల చెల్లింపు ఎలా చేయాలన్న దానిపై నీటి పారుదల శాఖ తలలు పట్టుకుంటోంది. నిధులకు కటకట.. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రధాన ఎత్తిపోతల పథకాలైన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, దేవాదుల, ఎల్లంపల్లి, అలీసాగర్, ఏఎంఆర్ ఎస్‌ఎల్‌బీసీల ద్వారా మోటార్లను నడిపి నీటిని తాగు, సాగు అవసరాలకు మళ్లిస్తున్నారు. దీనికయ్యే విద్యుత్ సరఫరాను టీఎస్ఎస్పీడీసీఎల్ చేస్తోంది. వీటి బిల్లులను నీటి పారుదల శాఖ చెల్లించాల్సి ఉంటుంది.ఆర్థిక పరిస్థితి సరిగా లేక కాళేశ్వరం, దేవాదుల, సీతారామ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులకు సరిపడినన్ని నిధులు లేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని పనులు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో విద్యుత్ బిల్లులు చెల్లించే అవకాశం కనిపించడమే లేదు. దీంతో మొత్తంగా ఎత్తిపోతల పథకాల పరిధిలో రూ.3,237.39 కోట్ల మేర బిల్లులు బకాయి పడింది.వీటిని తీర్చే మార్గాలే లేని దుస్థితిలో నీటిపారుదలశాఖ ఉంటే.. బకాయిలు కట్టాల్సిందేనని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ లేఖ రాసింది. బకాయిలు పెరిగాయి.. ‘ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల బకాయిలు గత ఆగస్టు 31 నాటికి రూ.2,728.73 కోట్లకు ఎగబాకాయి. దీర్ఘకాలికంగా ఈ బిల్లులు చెల్లించకపోవడంతో టీఎస్ఎస్పీడీసీఎల్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. టీఎస్ఎస్పీడీసీఎల్ వివిధ రకాల విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ బిల్లులు చెల్లించేందుకు టీఎస్ఎస్పీడీసీఎల్ ఎత్తిపోతల పథకాల వంటి బల్క్ విద్యుత్ కొనుగోలుదారులు చెల్లించే బిల్లులపైనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఈ బిల్లులను నీటి పారుదల శాఖ 2019–20 బడ్జెట్ కేటాయింపుల నుంచి చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దీనిపై కదిలిన నీటి పారుదల శాఖ ఈ బకాయిల చెల్లింపునకు వీలుగా ప్రతి నెలా కనిష్టంగా రూ.100 కోట్లయినా తమకు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మొత్తం బకాయిలు 2728,కల్వకుర్తి ఎత్తిపోతల బకాయిలు 1,433,ఎస్ఎల్బీసీ బకాయిలు 637 ,భీమా బకాయిలు 110 ,మిగిలిన బకాయిలు 548(అంకెలు రూ.కోట్లలో) -
‘కరెంట్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) 2,500 జూనియర్ లైన్మెన్, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కలిపి మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. సంస్థ వెబ్సైట్లు https://www.tssouthernpower.com లేదా https:// tssouthernpower.cgg.gov.inలో ఈ నోటిఫికేషన్లను పొందుపరిచింది. ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీని చేపట్టింది. జిల్లా, రిజర్వేషన్ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అర్హత వివరాలు.. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు బీఏ/బీకాం/బీఎస్సీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు 18–34 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, శారీరక వికలాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు. జూనియర్ లైన్మెన్ పోస్టులకు 18–35 ఏళ్ల వయసుతో పాటు పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ: 30.10.2019 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 31.10.2019 ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ: 20.11.2019 (సాయంత్రం 5 వరకు) ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 20.11.2019 (రాత్రి 11.59 వరకు) హాల్ టికెట్ల డౌన్లోడింగ్ ప్రారంభం: 11.12.2019 పరీక్ష తేదీ: 22.12.2019 జూనియర్ లైన్మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ: 21.10.2019 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 22.10.2019 ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ: 10.11.2019 (సాయంత్రం 5 వరకు) ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 10.11.2019 (రాత్రి 11.59 వరకు) హాల్ టికెట్ల డౌన్లోడింగ్ ప్రారంభం: 05.12.2019 పరీక్ష తేదీ: 15.12.2019 -
తెలంగాణలో 2,939 పోస్టుల భర్తీకి ప్రకటన
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) 2,939 పోస్టుల భర్తీకి శనివారం నియామక ప్రకటన విడుదల చేయనుంది. 2,438 జూనియర్ లైన్మెన్, 24 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 477 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. నియామక ప్రకటన పూర్తి వివరాలను అక్టోబర్ 10న https://www.tssouthernpower.com లేదా https://tssouthernpower.cgg.gov.in వెబ్సైట్లలో పొందపర్చనుంది. పోస్టుల వారీగా రిజర్వేషన్లు, విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం, ఫీజు చెల్లింపు గడువు, పరీక్ష తేదీ తదితర వివరాలు ప్రకటనలో వెల్లడించనున్నారు. భారీసంఖ్యలో జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నియామకాలు చేపట్టుతుండటంతో నిరుద్యోగుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చే అవకాశముంది. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి చేపట్టడం ఇదే తొలిసారని అధికార వర్గాలు తెలిపాయి. జూనియర్ లైన్మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియను తెలంగాణ ట్రాన్స్‌కో ఇటీవలే పూర్తి చేసింది. టీఎస్ఎస్పీడీసీఎల్ నియామక ప్రకటనలో సైతం ఇవే రకమైన విద్యార్హతలు ఉండే అవకాశాలున్నాయి. ట్రాన్స్‌కో ప్రకటన ప్రకారం.. జూనియర్ లైన్మెన్ పోస్టులకు టెన్త్‌తో పాటు ఎలక్ట్రికల్/ వైర్‌మెన్ ట్రేడ్స్‌లో ఐటీఐ, ఎలక్ట్రికల్‌లో రెండేళ్ల ఇంటర్ వొకేషనల్ కోర్సు చేసి ఉండాలి. జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టుకు బీఏ, బీకాం, బీఎస్సీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా డిగ్రీతోపాటు పీజీడీసీఏ కోర్సు లేదా తత్సమాన విద్యార్హతలు కలిగి ఉండాలి. -
‘విద్యుత్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్ : భారీ ఉద్యోగ నియామక జారీ ప్రకటనకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) సిద్ధమవుతోంది. 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, 2,000 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆగస్టు 3 లేదా 23న నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించింది. 3న నోటిఫికేషన్ ఇస్తే.. జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఆగస్టు 6 నుంచి, జేపీఓలకు 14 నుంచి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు 21 నుంచి దరఖాస్తులను స్వీకరించనుంది. 23న నోటిఫికేషన్ ఇస్తే 26 నుంచి జేఎల్ఎం పోస్టులకు, 27 నుంచి జేపీఓ పోస్టులకు, 28 నుంచి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనుంది. అక్టోబర్ 13 ఉదయం జేపీఓ, మధ్యాహ్నం జేఎల్ఎం, అక్టోబర్ 20న ఉదయం జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 95ః5 స్థానిక, స్థానికేతర కోటాను అమలు చేయనున్నారు. -
‘విద్యుత్’ సీఎండీల పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల సీఎండీలు, డైరెక్టర్ల పదవీ కాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జెన్కో, ట్రాన్స్‌కో సంస్థల సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) సీఎండీ ఎ.గోపాల్‌రావు, టీఎస్ రెడ్కో వైస్ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.జానయ్యతో పాటు మరో 21 మంది డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా బుధవారం ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి ఆదేశాలిచ్చే వరకు వారంతా తమ పదవుల్లో కొనసాగుతారని పేర్కొన్నారు. ప్రభాకర్‌రావు పదవీకాలం వచ్చేనెల 4న ముగియనుండగా.. మిగిలిన సీఎండీలు, డైరెక్టర్ల పదవీకాలం ఈ నెల 31తో పూర్తికానుండటంతో ప్రభుత్వం వారి పదవీకాలాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. జెన్కో డైరెక్టర్లు పీహెచ్ వెంకటరాజం (హైడల్), ఎం.సచ్చిదానందం (ప్రాజెక్ట్స్), ఎ.అశోక్‌కుమార్ (హెచ్ఆర్), బి.లక్ష్మయ్య (థర్మల్), ఎ.అజయ్ (సివిల్), ట్రాన్స్‌కో డైరెక్టర్లు జి.నర్సింగ్‌రావు (ప్రాజెక్ట్స్), టి.జగత్‌రెడ్డి(ట్రాన్స్మిషన్), జె.సూర్యప్రకాశ్ (ఎత్తిపోతల), బి.నర్సింగ్‌రావు (గ్రిడ్ ఆపరేషన్), టీఎస్ఎస్పీడీసీఎల్ డైరెక్టర్లు జె.శ్రీనివాస్ రెడ్డి (ఆపరేషన్స్), టి.శ్రీనివాస్ (ప్రాజెక్ట్స్), కె.రాములు (కమర్షియల్), జి.పర్వతం (హెచ్ఆర్), సీహెచ్ మదన్మోహన్రావు (పీఅండ్ఎంఎం), ఎస్.స్వామిరెడ్డి (ఐపీసీ), టీఎస్ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు బి.వెంకటేశ్వరరావు (హెచ్ఆర్), పి.మోహన్‌రెడ్డి (ప్రాజెక్ట్స్), పి.సంధ్యారాణి (కమర్షియల్), పి.గణపతి (ఐపీసీ, పీఏసీ), డి.నర్సింగ్‌రావు (ఆపరేషన్స్) పదవీకాలం పొడిగింపు పొందిన వారిలో ఉన్నారు. -
పనీ మాదే.. పైసా మాదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో కొందరు అధికారులు బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తారు! కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితుల పేర్లతో కాంట్రాక్టర్ లైసెన్సులు పొంది లక్షలు కొల్లగొడుతున్నారు. నామినేషన్ పద్ధతిలో పనులను చేజిక్కించుకొని సర్కారు సొమ్మును జేబులో వేసుకుంటున్నారు. కొందరు అధికారులైతే తమ బినామీల కోసమే అడ్డగోలుగా పనులకు అంచనాలు రూపొందించి తూతూమంత్రంగా పనులు చేసి బిల్లులు స్వాహా చేస్తున్నారు. పనుల అంచనాల తయారీ, ఓపెన్ టెండర్ల నిర్వహణ, నామినేషన్ల కింద పనుల కేటాయింపు, పనుల నిర్వహణ, పర్యవేక్షణ, బిల్లుల జారీ అధికారం.. ఇలా అంతా తమ చేతుల్లోనే ఉండటంతో ఈ అధికారుల అవినీతి, అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. తల్లి, భార్య, బావమరిది, సోదరుడు, కుమారుడు, కోడలు, కుమార్తె, అల్లుడు, మనవడు, అమ్మమ్మ, నాయనమ్మ, తాత, మేనకోడలు, ఇతర సమీప బంధువుల పేర్లతో కాంట్రాక్టర్ లైసెన్స్‌లు పొంది అడ్డదారిలో రూ.లక్షల విలువైన పనులను దక్కించుకుంటున్నారు. బినామీ కాంట్రాక్టర్లను అడ్డం పెట్టుకుని కొందరు పనుల అంచనాలను అడ్డగోలుగా పెంచేస్తున్నారని, మరికొందరు పనులు చేయకుండానే బిల్లులు కాజేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా అధికారులే బినామీ కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నా సంస్థ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఉన్నతాధికారులు సైతం.. తెలంగాణ ట్రాన్స్‌కో, దక్షిణ/ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్)లో పని చేస్తున్న ఓ డైరెక్టర్ స్థాయి అధికారితోపాటు పలువురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు(ఎస్ఈ), అదనపు డివిజినల్ ఇంజనీర్లు(ఏడీఈ), డివిజినల్ ఇంజనీర్లు(డీఈ), అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ)లు, ఇతర స్థాయిల ఉద్యోగులు సొంత కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల పేర్లతో బినామీ కాంట్రాక్టర్లుగా చక్రం తిప్పుతున్నారు. కొందరు అధికారులు స్వయంగా కాంట్రాక్టు పనులు చేస్తుండగా, మరికొందరు అమ్యామ్యాలు తీసుకుని బంధువులకు పనులు అప్పగిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. తమ కుటుంబ సభ్యులు, బంధువులెవరూ విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా లేరని ప్రతి పనికి సంబంధించిన టెండరు దాఖలు సందర్భంగా కాంట్రాక్టర్లు రాత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ల కుటుంబ సభ్యులెవరైనా విద్యుత్ సంస్థల్లో ఉద్యోగులుగా తేలితే కాంట్రాక్టును రద్దు చేయడంతో పాటు సంస్థకు జరిగిన నష్టాన్ని తిరిగి వసూలు చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. ఎస్ఈ, డీఈ స్థాయి అధికారులకు రూ.5 లక్షలలోపు పనులకు పరిపాలన అనుమతులు జారీ చేసే అధికారం ఉంది. దీంతో వారే కాంట్రాక్టులు దక్కించుకుంటూ, పనులు మంజూరు చేసుకుంటున్నారు. అలాగే కింది స్థాయి అధికారుల బినామీలకు సైతం పనులు అప్పగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బహిరంగ ప్రకటన లేకుండానే నామినేషన్లు రూ.5 లక్షల లోపు అంచనా వ్యయం కలిగిన పనులకు ఆన్లైన్ టెండర్ల నిర్వహణ నుంచి ప్రభుత్వం మినహాయింపు కల్పించింది. రూ.5 లక్షలలోపు అంచనా వ్యయం కలిగిన పనులను ఓపెన్ టెండర్ల విధానంలో నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు అనుమతిచ్చింది. అత్యవసరంగా నిర్వహించాల్సిన పనులకు ఆన్లైన్ ద్వారా టెండర్లు నిర్వహిస్తే తీవ్ర జాప్యం జరుగుతుందనే ఆలోచనతో ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ నిబంధనను ఆసరాగా చేసుకునే కొందరు విద్యుత్ అధికారులు బినామీ కాంట్రాక్టర్ల దందాకు తెరలేపారు. నామినేషన్ల విధానంలో చేపట్టే పనులకు తొలుత ఓపెన్ టెండరు ప్రకటనను విడుదల చేయాలి. ఆ తర్వాత కనీసం ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లను స్వీకరించాలి. అందులో తక్కువ రేటు సూచించిన వ్యక్తికి అర్హతల ప్రకారం పనులు అప్పగించాలి. అయితే నామినేషన్ల కింద చేపట్టే పనులకు చాలాచోట్ల బహిరంగ టెండరు ప్రకటన జారీ చేయడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా పనులను బినామీలకు కేటాయించుకుంటున్నారు. తెలిసిన ముగ్గురు కాంట్రాక్టర్ల నుంచి కొటేషన్లు తెప్పించుకుని, వాటిలో తమ బినామీ కాంట్రాక్టర్‌కు వర్క్ ఆర్డర్ దక్కేలా కొందరు అధికారులు చక్రం తిప్పుతున్నారు. మిగిలిన ఇద్దరు కాంట్రాక్టర్లతో పోలిస్తే బినామీ కాంట్రాక్టర్‌కు సంబంధించిన కొటేషన్లో రేటును క్తాస తగ్గించి పనులను చేజిక్కించుకుంటున్నారు. చాలా కార్యాలయాల నోటీసు బోర్డుల్లో నామినేషన్ల కింద పనుల కేటాయింపు ప్రక్రియ పూర్తయిన 15 రోజుల తర్వాత ఓపెన్ టెండరు ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ్ జ్యోతి యోజన(డీడీయూజీజేవై), ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్మెంట్ స్కీం(ఐపీడీఎస్) పథకాల కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, పంపిణీకి సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల నిధులు కేటాయించాయి. వీటితోపాటు ఇతర పథకాల కింద రూ.5 లక్షల లోపు అంచనా వ్యయంతో నామినేషన్‌పై కేటాయిస్తున్న పనుల్లో ఎక్కువ శాతం అధికారుల బినామీ కాంట్రాక్టర్లే చేజిక్కించుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో తమకు పనులు దక్కడం లేదని ఇతర కాంట్రాక్టర్లు వాపోతున్నారు. -
3,010 ‘విద్యుత్’ పోస్టులు!
సాక్షి, హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 3,010 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. 2,440 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 500 లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), 70 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో జారీ చేసిన ప్రకటనలో 90 శాతం పోస్టులను లోకల్ కోటా అభ్యర్థులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోరును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు తీర్పు కోసం టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం ఎదురుచూస్తోంది. ఈ తీర్పుకు వచ్చిన తర్వాత 3,010 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తామని సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. నెల రోజుల్లో తీర్పు రావచ్చని ఆశిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 318 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 133 సబ్ ఇంజనీర్, 112 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 19 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. -
2 వేల జేఎల్ఎం కొలువులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో ఖాళీగా ఉన్న 2 వేల జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులను రెండు విడతల్లో భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. తొలి విడతగా వచ్చే నెల తొలి వారంలో 1,000 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయనుంది. పోస్టుల భర్తీ ప్రతిపాదనలను ఈ నెలాఖరులో నిర్వహించే బోర్డు సమావేశంలో ఆమోదించాక వచ్చే నెల తొలి వారంలో నియామక ప్రకటన జారీ చేస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మహిళా అభ్యర్థులకు అవకాశం! జేఎల్ఎం పోస్టుల భర్తీలో తొలిసారిగా మహిళా కోటా అమలుచేసే అంశాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ పరిశీలిస్తోంది. విధి నిర్వహణలో భాగంగా జేఎల్ఎంలు విద్యుత్ స్తంభాలు ఎక్కి పని చేయాల్సి ఉండనుండటంతో ఇప్పటివరకు ఈ పోస్టుల భర్తీలో మహిళలకు అవకాశం కల్పించలేదు. అయితే జేఎల్ఎం పోస్టుల భర్తీలో సైతం మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని మహిళా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) జేఎల్ఎం పోస్టుల భర్తీకి ప్రకటన జారీచేయగా గణనీయ సంఖ్య లో మహిళలు దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను సంస్థ యాజమాన్యం తిరస్కరించడంతో కొందరు మహిళా అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించి తమకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని రాత పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో త్వరలో జారీ చేయనున్న జేఎల్ఎం పోస్టుల నియామకాల్లో మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించే అంశాన్ని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం పరిశీలిస్తోంది. ఈ విషయంలో న్యాయ నిపుణుల సలహాను కోరింది. మహిళా అభ్యర్థులకు అవకాశం కల్పించే అంశంపై సంస్థ యాజమాన్యం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎంపిక ప్రక్రియలో భాగమైన విద్యుత్ స్తంభాలు ఎక్కడంలో నైపుణ్యాన్ని పరిశీలించే పరీక్షను మహిళా అభ్యర్థులు సైతం నెగ్గాల్సి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. విద్యుత్ స్తంభాలు ఎక్కి మరమ్మతు పనులు చేయడం జేఎల్ఎం విధుల్లో అత్యంత ప్రధానమైన విధిగా అధికారులు తెలిపారు. -
‘విద్యుత్’లో మరో 1,800 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లో 1,800 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. సంస్థ పాలక మండలి సమావేశం అనంతరం మరో వారం పదిరోజుల్లో ఈ నియామక ప్రకటన జారీ చేయనున్నామని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులు కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటన జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 150 ఏఈ, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) పోస్టులతో పాటు 2,000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి మరో వారంలో ప్రకటన రానున్న విçషయం తెలిసిందే. అయితే టీఎస్ఎన్పీడీసీఎల్లో జేఎల్ఎం పోస్టులు తప్ప మిగతా ఏఈ, సబ్ ఇంజనీర్, ఇతర కేటగిరీల పోస్టులను ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. -
నిరుద్యోగులకు మరో శుభవార్త...
సాక్షి, హైదరాబాద్ : నిరుద్యోగులకు మరో శుభవార్త. తెలంగాణ విద్యుత్ సరఫరా సంస్థ (ట్రాన్స్‌కో)లో 1604 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్)లో మరో 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో నియామక ప్రకటనలు జారీ కానున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(జేఏఓ) పోస్టులతో పాటు 2000 జూనియర్ లైన్మెన్(జేఎల్ఎం) పోస్టులు ఇందులో ఉండనున్నాయి. 150 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల్లో 130 ఎలక్ట్రికల్, 20 సివిల్ విభాగాలకు చెందిన పోస్టులుండనున్నాయి. ఈ పోస్టుల సంఖ్య స్వల్పంగా మారవచ్చని, మొత్తానికి 3 వేలకు పైగా పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తెలిపారు. త్వరలో సంస్థ పాలక మండలి సమావేశం నిర్వహించి ఈ పోస్టుల నియామకాలకు ఆమోదం తెలుపుతామన్నారు. అనంతరం ఈ పోస్టులకు వేర్వేరుగా ప్రకటనలు జారీ చేస్తామన్నారు. మరో 10 రోజుల్లో ఈ ప్రకటనలు జారీ కావచ్చు అన్నారు. -
త్వరలో 4,000 ‘విద్యుత్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్ తదితర పోస్టుల భర్తీకి వారం, పది రోజుల్లో సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. మొత్తంగా 4 వేల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. నాలుగు సంస్థల్లో కలిపి 1,000 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్, 174 సబ్ ఇంజనీర్.. 1,100 జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. మిగిలిన 3 విద్యుత్ సంస్థల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో జరగనున్న విద్యుత్ సంస్థల బోర్డు సమావేశంలో నియామక ప్రకటనల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. గతంలో వేర్వేరు ప్రకటనలతో ఏఈ పోస్టుల భర్తీ చేపట్టగా వందల సంఖ్యలో అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో నియామక ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. తొలి మెరిట్ జాబితాతో పోస్టుల భర్తీ ముగిసిన తర్వాత మిగిలిన పోస్టులకు రెండో మెరిట్ జాబితా ప్రకటించడంతో నిరుద్యోగులు అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది రెండో జాబితాతో మిగిలిన పోస్టులను విద్యుత్ సంస్థలు భర్తీ చేశాయి. రెండో జాబితా తర్వాత కూడా పోస్టులు మిగలడంతో మూడు, నాలుగో జాబితానూ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో పోస్టుల భర్తీకి ఉమ్మడిగానే ప్రకటన జారీ చేయాలని అప్పట్లో యాజమాన్యాలు నిర్ణయించాయి. కానీ రెండో జాబితాతో మిగిలిన పోస్టుల భర్తీకి సుప్రీం అనుమతించిన నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతిలోనే వేర్వేరుగా ప్రకటనలు జారీ చేయాలని తాజాగా నిర్ణయానికొచ్చాయి. ఒకే కేటగిరీ పోస్టులు, విద్యార్హతలున్నా రాత పరీక్షలు వేర్వేరుగా ఉండనున్నాయి. -
టీఎస్ఎస్పీడీసీఎల్కు ఐపీపీఐ పురస్కారం
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐపీపీఐ) పురస్కారం లభించినట్లు సంస్థ యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. సౌర విద్యుదుత్పత్తి, వ్యవసాయ విద్యుత్ సరఫరాలో యాజమాన్య పద్ధతుల అమలు, ఎల్ఈడీ లైట్ల పంపిణీ, పంపిణీ వ్యవస్థలో హెచ్‌వీడీఎస్ పద్ధతి అమలు, పంపిణీ నష్టాల తగ్గింపునకు తీసుకున్న చర్యలకుగాను ఈ పురస్కారం లభించినట్లు పేర్కొంది. ఈ నెల 28న కర్ణాటకలోని బెల్గాంలో జరిగే ఓ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి ఈ పురస్కారాన్ని అందుకుంటారని తెలిపింది. -
విద్యుత్ సబ్ ఇంజినీర్ల పోస్టులకు నోటిఫికేషన్
హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) 153 సబ్ ఇంజనీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి శుక్రవారం ఆన్లైన్లో ప్రకటన విడుదల చేసింది. ఉత్తర హైదరాబాద్, దక్షిణ హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్, ఉత్తర రంగారెడ్డి, దక్షిణ రంగారెడ్డి, తూర్పు రంగారెడ్డి, నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్ సర్కిళ్ల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిప్లమా చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 6వ తేదీ లోపు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 2016లో రాత పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షా తేదీని త్వరలో వెల్లడిస్తామని టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం పేర్కొంది. ఈ మేరకు తమ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. -
ప్రతి పనికి పైసలే!
హైదరాబాద్: విద్యుత్ సిబ్బంది లంచగొండితనం, ఏటా వందల మంది రైతులు, కాంట్రాక్టు ఉద్యోగుల మృతికి కారణమవుతున్న విద్యుదాఘాతాలు, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులో తీవ్ర జాప్యం.. వేళాపాల లేని విద్యుత్ సరఫరా.. ప్రభుత్వ రాయితీల్లో కోత.. తదితర అంశాలపై రైతు సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు, వినియోగదారులు సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(టీఎస్ఎస్పీడీసీఎల్)పై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా సంస్థ పనితీరులో ఏ మాత్రం మార్పు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015-16 సంవత్సరంలో విద్యుత్ చార్జీల పెంపు కోసం ఎస్పీడీసీఎల్ సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్ఆర్)పై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) శుక్రవారం ఆర్టీసీ కళాభవన్‌లో నిర్వహించిన బహిరంగ విచారణలో డిస్కంల పనితీరుపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్కంల పద్ధతిలో మార్పు రాకుంటే ఈ విచారణలు ఎందుకని, వచ్చే ఏడాది నుంచి మానుకోవాలని ఈఆర్సీ చెర్మైన్ ఇస్మాయిల్ అలీ ఖాన్, సభ్యులు హెచ్ శ్రీనివాసులు, ఎల్.మనోహర్‌రెడ్డి ఎదుట వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. -
పెరుగుతున్న కోతలు
వికారాబాద్:: విద్యుత్ కోతలు విధిస్తూ ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ సీఅండ్ఎండీ ఆదేశాలు జారీ చేశారు.గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే మున్సిపాలిటీలు,మండల కేంద్రాల(సబ్ స్టేషన్ హెడ్‌క్వార్టర్)లో 8 గంటలు, కార్పొరేషన్లలో 6 గంటలు,గ్రామాల్లో 12 గంటల కోత ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.ప్రస్తుతం వ్యవసాయానికి 7 గంటల సరఫరా జరుగుతుండగా పెరిగిన డిమాండ్ కారణంగా అయిదు గంటలు మాత్రమే సరఫరా ఆయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కోతలు ఇలా ఉన్నాయి.... మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు(సబ్ స్టేషన్ హెడ్ క్వార్టర్)... ఉదయం 7 నుంచి 11 గంటల వరకు...మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు... కార్పొరేషన్లు.... ఉదయం 5 నుంచి 8 గంటల వరకు ...మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు . గ్రామాల్లో.... ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు (12 గంటల కోత) త్రీఫేజ్ విద్యుత్ సరఫరా వివరాలు ఇలా ఉన్నాయి. ఏ- గ్రూప్‌లో ఉదయం 3 నుంచి 8 గంటల వరకు,రాత్రి 10 నుంచి 12 గంటల వరకు. బీ- గ్రూప్‌లో ఉదయం 8 నుంచి ఒంటి గంట వరకు, రాత్రి 12 నుంచి 2 గంటల వరకు. సీ- గ్రూప్‌లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 వరకు, రాత్రి 2 నుంచి 4 గంటల వరకు. డీ-గ్రూప్‌లో రాత్రి 10 నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు.