
సాక్షి, హైదరాబాద్
వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)లో 1,800 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. సంస్థ పాలక మండలి సమావేశం అనంతరం మరో వారం పదిరోజుల్లో ఈ నియామక ప్రకటన జారీ చేయనున్నామని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టులు కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటన జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్)లో 150 ఏఈ, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) పోస్టులతో పాటు 2,000 జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి మరో వారంలో ప్రకటన రానున్న విçషయం తెలిసిందే. అయితే టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లో జేఎల్‌ఎం పోస్టులు తప్ప మిగతా ఏఈ, సబ్ ఇంజనీర్, ఇతర కేటగిరీల పోస్టులను ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి.