JENCO
-
భారం మోపి బురద!
సాక్షి, అమరావతి: గత సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో విద్యుత్ రంగం కుదేలైంది. బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అప్పుడు చేసిన తప్పిదాలే ట్రూ అప్ చార్జీల భారానికి కారణమయ్యాయని విద్యుత్తు రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చౌక విద్యుత్తు కొనుగోళ్లు, పొదుపు చర్యలతో విద్యుత్ రంగాన్ని బలోపేతం చేస్తూ పంపిణీ సంస్థలను ఆదుకుంటోంది. విద్యుత్తు రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అనవసర వ్యయాన్ని నియంత్రిస్తోంది. మరోవైపు ప్రజలపై పెనుభారం పడకుండా భారీగా రాయితీలను భరిస్తోంది. రైతులతో పాటు ఇతర వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను అందిస్తూనే కొనుగోళ్లు, పంపిణీలో నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. అయితే టీడీపీ నేతలు వాస్తవాలను మభ్యపుచ్చి తమ కారణంగా ప్రజలపై పడిన ట్రూ అప్ చార్జీలపై వారే ఆందోళనకు దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఆ ఐదేళ్లూ అప్పుల కొండ ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు గత సర్కారు తప్పుడు నివేదికలతో డిస్కంలను అప్పుల ఊబిలోకి గెంటేసింది. ఫలితంగా 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి ఏకంగా రూ.27,240 కోట్లకు చేరాయి. గత రెండున్నరేళ్లలో నష్టాలు రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం నష్టాలు రూ.27,551 కోట్లుగా ఉన్నాయి. టీడీపీ హయాంలో వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు చర్యలతో ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ఇక 2014 నుంచి 2019 వరకూ విద్యుత్ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. 2014 జూన్ 2 నాటికి విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలు, నిర్వహణ ఖర్చులు రూ.12,500 కోట్లు ఉండగా 2019 ఏప్రిల్ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరాయి. భారమైనా భరిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ విద్యుత్ వినియోగానికి సంబంధించి రూ.1,707.07 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ విద్యుత్ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.7297.08 కోట్ల ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడింది. తొలిసారిగా ఉచిత విద్యుత్ వర్గాలన్నీ సెక్షన్–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు ఏపీఈఆర్సీ తెచ్చింది. దీనివల్ల పడిన రూ.1,657.56 భారాన్ని కూడా భరించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఒకే విధంగా ధరలు అమలుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడింది. అప్పటిలా కనీస చార్జీలు లేవు గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత సర్కారు హయాంలో అమలైంది. దీనివల్ల నెలంతా విద్యుత్ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తొలగించి కిలోవాట్‌కు రూ.10 వసూలు చేసే విధానాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే నెలంతా విద్యుత్ వినియోగించకపోతే కనీస చార్జీ చెల్లించనవసరం లేదు. ఇక సగటు యూనిట్ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించింది. విద్యుత్ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధికభారం మోపే విధానాన్ని టీడీపీ సర్కారు ఐదేళ్లూ అమలు చేసింది. దాని నుంచి కాపాడటానికి ఏ నెలలో ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో టారిఫ్ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేసే విధంగా కంటిన్యూ బిల్లింగ్ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం తెచ్చింది. విద్యుత్ సంక్షేమ రంగంవైపు అడుగులు.. విద్యుత్తు రంగాన్ని ప్రగతిశీల, ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు, ఎంబీసీలు, చేనేత కార్మికులకు 100 యూనిట్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, సెలూన్లు, రోల్డ్ గోల్డ్ పనివారికి 100 యూనిట్లు ఉచితంగా అందజేస్తోంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2019–20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్‌కు రూ.7.23 చొప్పున ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.6.37కి తగ్గించగలిగింది. ఇటు డిస్కంలను ఆదుకుంటున్న ప్రభుత్వం.. విద్యుత్తు సంస్థలు 2019–21 మధ్య కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దీనిని తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో అందాలి. ఈ నేపథ్యంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్తు సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్తు సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు విడుదల చేసింది. ఇలా విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. వాస్తవ సర్దుబాటు వ్యయం రూ.20,572 కోట్లు విద్యుత్ పంపిణీ సంస్థలు 2014–19 కాలానికి దాదాపుగా రూ.20,572 కోట్ల వాస్తవ అదనపు వ్యయం సర్దుబాటు కోసం విద్యుత్ నియంత్రణ మండలికి 2019 చివరిలో విన్నవించాయి. ఇదే కాకుండా 2014–15 నుంచి 2018–19 వరకు సంస్థల నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణ, ఆదాయ అవసరాల వాస్తవ ఖర్చుల ఆధారంగా జరిపిన అదనపు వ్యయం సర్దుబాటు రూపంలో మరో రూ.7,224 కోట్లు అనుమతించాలని విద్యుత్ నియంత్రణ మండలిని కోరాయి. ఇందులో రూ.3,555 కోట్ల వసూలును ఏపీఈఆర్సీ తిరస్కరించింది. రూ.3,669 కోట్ల ట్రూ–అప్ చార్జీల వసూలు మాత్రం అనివార్యమైంది. నిజానికి ఇది కూడా ఆమోదించకపోతే విద్యుత్ పంపిణీ సంస్థల మనుగడ కష్టంగా మారే ప్రమాదం ఉంది. అది మంచిది కాదని విద్యుత్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. గత ప్రభుత్వ హయాం నాటివే ‘ప్రస్తుతం అమలవుతున్న ట్రూ అప్–సర్దుబాటు చార్జీలు గత ప్రభుత్వ హయాం నాటి విద్యుత్ పంపిణీ నెట్వర్క్ చార్జీలకు సంబంధించినవి. విద్యుత్ పంపిణీ సంస్థల వార్షిక ఖర్చులు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, విద్యుత్ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించని కారణంగా పంపిణీ సంస్థల అప్పులు పెరిగిపోయాయి. ఏపీఈఆర్సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదికలలో వాస్తవాలను వెల్లడించకుండా పరోక్షంగా భారాన్ని తగ్గించుకుని తప్పుల తడకలు నివేదికలతో సమయాన్ని వెళ్లదీశారు. అప్పుడు జరిగిన నష్టమంతా సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారులపై పడింది. 2014–15 నుంచి 2018–19 వరకు నెట్వర్క్ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణకు అనుమతించిన వ్యయం కన్నా వాస్తవ ఖర్చు అధికమవడం వల్లే ఈ సవరింపు చార్జీలు విధించాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలి’ –నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి -
ఇన్చార్జ్ సీఎండీల పాలనలో ట్రాన్స్‌కో, జెన్కో
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో ఇన్చార్జిల పాలనలోనే కొనసాగుతోంది. ట్రాన్స్‌కో సీఎండీగా ఆ సంస్థ జేఎండీ సి.శ్రీనివాస రావు, తెలంగాణ జెన్కో సీఎండీగా సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలను కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వీరు అదనపు బాధ్యతల్లో కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఎండీగా ప్రభాకర్‌రావు కొనసాగింపుపై అస్పష్టత...: ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలకు 2014 అక్టోబర్ నుంచి డి.ప్రభాకర్‌రావు ఉమ్మడి సీఎండీగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతితో గత ఆగస్టు 19 నుంచి 31 వరకు సెలవుపై వెళ్లారు. అనంతరం సెప్టెంబర్ 22 వరకు ప్రభాకర్‌రావు సెలవు పొడిగించుకున్నారు. అక్టోబర్ 1న విధుల్లో చేరి... ఆరు వరకు కొనసాగారు. ఆ తర్వాత నుంచి మళ్లీ ఆయన విధులకు హాజరు కాలేదు. సెలవు మంజూరు కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. దీంతో ట్రాన్స్‌కో, జెన్కో సంస్థలకు సీఎండీలుగా జె.శ్రీనివాసరావు, ఎన్.శ్రీధర్‌లను అదనపు బాధ్యతల్లో కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని రాష్ట్ర ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఉత్తర్వుల్లో ప్రభాకర్‌రావు సెలవుల పొడిగింపు అంశం ప్రస్తావించకపోవడంతో ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ పదవుల్లో ఆయన కొనసాగుతారా? లేదా? అన్నది విద్యుత్ సౌధలో చర్చనీయాంశంగా మారింది. ప్రభాకర్‌రావు సీఎండీ పదవికి రాజీనామా చేసి ఉండవచ్చని చర్చ జరుగుతుండగా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం వర్గాలు తోసిపుచ్చాయి. ఆయన కొనసాగుతారా? లేదా ? అన్న అంశంపై సీఎంఓ వర్గాలు కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. -
పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి..
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ ప్రమాద సంఘటనలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చిక్కుకున్న ఉన్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటులో పోలీసులు లోపలకు వెళ్లినా దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి రావడం జరిగింది. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా లోపలకి వెళ్లలేకపోతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు సింగరేణి సిబ్బంది సాయం కోరినట్లు ఆయన చెప్పారు. (విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటనను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు వివరించినట్లు జెన్కో సీఎండీ ప్రభాకార్‌రావు తెలిపారు. గురువారం రాత్రి 10.35 గంటలకు ప్రమాదం జరిగిందని, లోపలికి వెళ్లేందుకు వీలుకాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదని, 1200 కేవీ ఐసోలేట్ చేసినట్లు సీఎండీ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. వీరిలో ఏడుగురు జెన్కో ఉద్యోగులు కాగా ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఎమ్మెల్యే బాలరాజ్ మాట్లాడుతూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందన్నారు. విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగటం ఇది మొదటిసారి అని ఆయన అన్నారు. మంటల్లో చిక్కుకున్నవారు: డీఈ శ్రీనివాస్, ఏఈలు వెంకట్రావు ఫాతిమా బేగం, మోహన్, సుందర్, సుష్మ, కుమార్ ప్రైవేట్ ఉద్యోగులు కిరణ్, రాంబాబు -
గత నెల బిల్లే ఈ నెలకు..
సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: కరెంట్ బిల్లులనూ మూడు నెలల పాటు వాయిదా వేశారని, కట్టాల్సిన అవసరం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు గురువారం స్పష్టం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరినాథరావు తెలిపారు. విద్యుత్ బిల్లులను వినియోగదారులకు ఈనెల 4వ తేదీలోగా ఎస్ఎంఎస్ ద్వారా పంపుతామని ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్టీ ఆక్వా, హెచ్‌టీ మీటర్ సర్వీసులకు మాత్రం మీటర్ రీడింగ్ ప్రకారమే విద్యుత్ బిల్లులను జారీ చేస్తామన్నారు. ఈ మేరకు జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా, తెలంగాణలో కూడా గత నెల కరెంటు బిల్లులే ఈ నెలలోనూ చెల్లించాల్సి ఉంటుందని డిస్కమ్‌లు కోరనున్నాయి. లాక్డౌన్ షాక్ లేదు! సాక్షి, అమరావతి: లాక్డౌన్ కారణంగా విద్యుత్ సరాఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కీలకమైన అన్ని విభాగాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జెన్కో థర్మల్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రాజు తెలిపారు. కీలకమైన లోడ్ డిస్పాచ్, వాణిజ్య కొనుగోళ్లు, నెట్వర్కింగ్, ఉత్పత్తి సంస్థల్లో కొందరు ముఖ్యమైన ఉద్యోగులు లాక్డౌన్ నేపథ్యంలో లేనందున అందుబాటులో ఉన్నవారితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగంలో ముగ్గురితో బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. దేశంలోని గ్రిడ్, క్షేత్రస్థాయి డిస్కమ్‌లకు అనుసంధానం చేసే లోడ్ డిస్పాచ్ సెంటర్‌తో సమన్వయం కోసం ఐదు బృందాలను నియమించారు. థర్మల్ విద్యుదుత్పత్తిలో సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు మరికొన్ని టాస్క్‌ఫోర్స్ బృందాలను సిద్ధం చేశారు. -
నెలాఖరులోగా విద్యుత్ పీఆర్సీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు తీపికబురు. విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణపై ఈ నెలాఖరులోగా ప్రకటన చేసేందుకు తెలంగాణ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్‌కో జేఎండీ సి.శ్రీనివాసరావు నేతృత్వంలో నియమించిన విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంప్రదింపుల కమిటీ (పీఆర్సీ) గురువారం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్‌రావుకు నివేదిక సమ ర్పించింది. వేతన సవరణ ఫిట్ మెంట్ శాతం, వెయిటేజీ ఇంక్రి మెంట్ల సంఖ్య, వైద్య సదుపాయం తదితర అంశాలపై విద్యుత్ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులతో త్వరలో విద్యుత్ సంస్థల యాజ మాన్యాలు చర్చలు జరపను న్నాయి. అనంతరం ఈ నెల 26లోగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు పీఆర్సీ నివేదికను పంపిస్తామని, సీఎం ఆమోదిస్తే ఈ నెలాఖరులోగా పీఆర్సీపై ప్రకటన విడుదల చేస్తామని డి.ప్రభాకర్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. గత ఫిట్మెంట్కన్నాఎక్కువ ఇవ్వాలంటున్న ఉద్యోగులు ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్‌ఎన్పీడీసీఎల్‌లలో పని చేస్తున్న 25 వేల మంది విద్యుత్ ఉద్యోగులు కొత్త పీఆర్సీపై యాజమాన్యాల ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చివరిసారిగా నాలుగేళ్ల కింద విద్యుత్ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో కలిపి పీఅర్సీ ప్రకటించారు. అయితే ఇటీవల ఏపీలో విద్యుత్ ఉద్యోగులకు 25 శాతం ఫిట్మెంట్తోపాటు 3 వెయిటేజీ ఇంక్రిమెంట్లతో వేతన సవరణపై ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై విద్యుత్ సంస్థలు తీసుకునే నిర్ణయంపై విద్యుత్ ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. చివరిసారిగా ప్రకటించిన 30 శాతం ఫిట్మెంట్కన్నా ఎక్కువ మొత్తంలో ఫిట్మెంట్ ప్రకటించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఏపీలో 25 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంతకంటే కొద్దిగా ఎక్కువ శాతం ఫిట్‌మెంట్‌ను తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు ప్రకటించే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిట్మెంట్ శాతంపై సీఎం నిర్ణయం కీలకంగా మారనుంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను గాడినపెట్టి నిరంతర విద్యుత్ సరఫరాను అమలు చేసేందుకు విద్యుత్ ఉద్యోగులు బాగా పని చేశారని కేసీఆర్ పలుమార్లు ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ఫిట్మెంట్ శాతంపై ముఖ్యమంత్రి నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31తో గత పీఆర్సీ కాలపరిమితి ముగిసిపోగా ఏప్రిల్ 1 నుంచి కొత్త పీఆర్సీని వర్తింపజేయాల్సి ఉంది. ప్రస్తుత వైద్య సదుపాయానికి మెరుగులు... విద్యుత్ ఉద్యోగులకు అమలు చేస్తున్న ప్రస్తుత వైద్య పథకాన్ని మెరుగుపరిచి కొనసాగించాలని పీఆర్సీ కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసింది. ఎన్టీపీసీ తరహాలో అపరమిత నగదురహిత వైద్య సదుపాయం అందించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాన్ని మరింత సరళీకృతం చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. ఈఎన్టీ, దంత, కంటి వైద్యానికి ప్రస్తుత పథకంలో ఉన్న పరిమితులను తొలగించాలని కమిటీ కోరినట్లు చర్చ జరుగుతోంది. తక్షణమే సంప్రదింపులు: ఉద్యోగుల జేఏసీ డిమాండ్ కొత్త పీఆర్సీ అమలులో భాగంగా విద్యుత్ ఉద్యోగుల వేతన స్కేలు, అలవెన్సులు, ఈపీఎఫ్, జీపీఎఫ్, సమగ్ర వైద్య సదుపాయ పథకంపై తుది నిర్ణయం తీసుకునేందుకు తక్షణమే విద్యుత్ ఉద్యోగుల సంఘాలతో యాజమాన్యాలు సంప్రదింపులు ప్రారంభించాలని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. ఈ నెల 26లోగా పీఆర్సీపై ప్రకటన చేయాలని లేకుంటే 27న విద్యుత్ సౌధలో మహాధర్నా నిర్వహిస్తామని జేఏసీ ప్రతినిధుల బృందం గురువారం ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావుకు వినతిపత్రం అందజేసింది. -
విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలు, అలవెన్సులను సవరించేందుకు ఈ పీఆర్సీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సి.శ్రీనివాసరావును పీఆర్సీ చైర్మన్‌గా నియమించింది. ఆయనతో పాటు ఎన్పీడీసీఎల్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్), ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (హెచ్ఆర్) టీఎస్ జెన్కో డైరెక్టర్ (హెచ్ఆర్), డైరెక్టర్ (ఫైనాన్స్) పీఆర్సీ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ట్రాన్స్‌కో చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ కమిటీకి కన్వీనర్‌గా ఉంటారు. ఈ మేరకు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డి.ప్రభాకర్‌రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో పని చేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగులకు సంబంధించిన జీతాలపై అధ్యయనం చేయాలని, అన్ని యూనియన్లు, అసోసియేషన్లతో సంప్రదింపులు జరపాలని పీఆర్సీకి మార్గదర్శకాలను ఈ ఉత్తర్వుల్లో సూచించింది. విద్యుత్తు సంస్థల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్దేశించింది. జీతాల పెంపు భారం రాష్ట్రంలోని విద్యుత్తు వినియోగదారులపై భారం పడకుండా ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం విద్యుత్తు సంస్థల్లో నాలుగేళ్లకోసారి వేతన సవరణ అమలవుతోంది. ప్రస్తుత వేతన సవరణ సంఘం గడువు మార్చి 31వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో కొత్త పీఆర్సీ ఏర్పాటుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. విద్యుత్తు ఉద్యోగుల యూనియన్లు, అసోసియేషన్లతో సంప్రదింపుల మేరకు వేతన సవరణ ఒప్పందం జరుగుతుంది. పీఆర్సీ కమిటీ ఇచ్చే సిఫారసుల మేరకే ఉద్యోగుల వేతనాలను ఎంత మేరకు పెంచాలనేది ఖరారవుతుంది. ఈ సిఫారసులకు ఎప్పుడు ఆమోదించినా.. సవరించిన వేతనాలు 2018 ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వస్తాయి. -
ఏడో దశ కేటీపీ‘ఎస్’!
సాక్షి, హైదరాబాద్: భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రం (కేటీపీఎస్) ఏడో దశ ప్లాంట్ ట్రయల్ రన్ విజయవంతమైంది. విద్యుత్ ఉత్పత్తికి అత్యంత కీలకమైన బాయిలర్‌ను తెలంగాణ జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు బుధవారం ఉదయం 8.46 గంటలకు వెలిగించారు. ఉత్తరాంచల్ రాష్ట్రం హరిద్వార్‌లో బీహెచ్ఈఎల్ తయారు చేసిన భారీ జనరేటర్‌తో బాయిలర్‌ను అనుసంధానం చేశారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన తొలి విద్యుత్ ప్లాంట్‌గా కేటీపీఎస్ ఏడో దశ ప్రాజెక్టు నిలవనుంది. రూ.5,700 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 జనవరి 1న ప్రారంభించారు. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం నిర్మాణం ప్రారంభించిన 48 నెలల్లో పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి (సీఈఏ) నిబంధనలున్నాయి. అయితే కొత్తగూడెం ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే నిర్మాణం పూర్తి చేసుకుని కొత్త చరిత్ర సృష్టించడానికి సిద్ధమవుతోంది. దేశంలో మరెక్కడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కేటీపీఎస్ ఏడో దశ ఉత్పత్రి ప్రారంభించిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 15 వేల మెగావాట్లు దాటుతుంది. కార్యక్రమంలో జెన్కో డైరెక్టర్లు రాధాకృష్ణ, సచ్చిదానందం తదితరులు పాల్గొన్నారు. 17 వేల మెగావాట్లు: ప్రభాకర్ రావు 28 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులో ఉండేలా ప్రణాళిక రచించి, తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్దేశించిన లక్ష్యం మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుతున్నట్లు జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు వెల్లడించారు. కేటీపీఎస్ ఏడో దశ, భద్రాద్రి ప్లాంట్లను సందర్శించి.. పనుల పురోగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబర్ చివరి నాటికి రాష్ట్రానికి 17 వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 6,573 మెగావాట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండేదని, ఇప్పుడు దాన్ని 14,972 మెగావాట్లకు చేర్చగలిగామని, ఇందులో 3 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ కూడా ఉందన్నారు. మార్చి 31 నాటికి కేటీపీఎస్ నుంచి 800 మెగావాట్లు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. డిసెంబర్ 31 నాటికి 1,080 మెగావాట్ల సామర్థ్యం ఉన్న భద్రాద్రి ప్లాంటు నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పారు. డిసెంబర్ నాటికి మరింత సోలార్ విద్యుత్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ కేటీపీఎస్ ఏడో దశ నిర్మాణం లో భాగంగా బాయిలర్‌ను వెలిగించి, ట్రయల్ రన్ ప్రారంభించడంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభాకర్‌రావుకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. -
‘విద్యుత్’లో మరో 1,800 పోస్టులు
సాక్షి, హైదరాబాద్ వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)లో 1,800 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. సంస్థ పాలక మండలి సమావేశం అనంతరం మరో వారం పదిరోజుల్లో ఈ నియామక ప్రకటన జారీ చేయనున్నామని అధికారవర్గాలు తెలిపాయి. తెలంగాణ ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ), 174 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 1,100 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులు కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి ఇప్పటికే ప్రకటన జారీ కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 150 ఏఈ, 500 జూనియర్ అసిస్టెంట్, 100 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ (జేఏఓ) పోస్టులతో పాటు 2,000 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టుల భర్తీకి మరో వారంలో ప్రకటన రానున్న విçషయం తెలిసిందే. అయితే టీఎస్ఎన్పీడీసీఎల్లో జేఎల్ఎం పోస్టులు తప్ప మిగతా ఏఈ, సబ్ ఇంజనీర్, ఇతర కేటగిరీల పోస్టులను ప్రస్తుతానికి భర్తీ చేయడం లేదని అధికారవర్గాలు తెలిపాయి. -
త్వరలో 4,000 ‘విద్యుత్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో ఖాళీ పోస్టుల భర్తీకి యాజమాన్యాలు కసరత్తు చేస్తున్నాయి. ట్రాన్స్‌కో, జెన్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీసీఎల్ సంస్థల్లో అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్, జూనియర్ లైన్మెన్ తదితర పోస్టుల భర్తీకి వారం, పది రోజుల్లో సంస్థలు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నాయి. మొత్తంగా 4 వేల పోస్టుల భర్తీకి ప్రకటనలు రానున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. నాలుగు సంస్థల్లో కలిపి 1,000 వరకు అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నాయి. అలాగే ట్రాన్స్‌కోలో 330 అసిస్టెంట్ ఇంజనీర్, 174 సబ్ ఇంజనీర్.. 1,100 జూనియర్ లైన్మెన్ పోస్టులు భర్తీ చేయాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. మిగిలిన 3 విద్యుత్ సంస్థల్లో భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు తెలియాల్సి ఉంది. గురువారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో జరగనున్న విద్యుత్ సంస్థల బోర్డు సమావేశంలో నియామక ప్రకటనల జారీపై నిర్ణయం తీసుకోనున్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో.. గతంలో వేర్వేరు ప్రకటనలతో ఏఈ పోస్టుల భర్తీ చేపట్టగా వందల సంఖ్యలో అభ్యర్థులు రెండు కన్నా ఎక్కువ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో నియామక ప్రక్రియలో గందరగోళం ఏర్పడింది. తొలి మెరిట్ జాబితాతో పోస్టుల భర్తీ ముగిసిన తర్వాత మిగిలిన పోస్టులకు రెండో మెరిట్ జాబితా ప్రకటించడంతో నిరుద్యోగులు అభ్యంతరం తెలుపుతూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. చివరకు సుప్రీంకోర్టు నుంచి ప్రత్యేక అనుమతి పొంది రెండో జాబితాతో మిగిలిన పోస్టులను విద్యుత్ సంస్థలు భర్తీ చేశాయి. రెండో జాబితా తర్వాత కూడా పోస్టులు మిగలడంతో మూడు, నాలుగో జాబితానూ ప్రకటించాల్సి వచ్చింది. దీంతో పోస్టుల భర్తీకి ఉమ్మడిగానే ప్రకటన జారీ చేయాలని అప్పట్లో యాజమాన్యాలు నిర్ణయించాయి. కానీ రెండో జాబితాతో మిగిలిన పోస్టుల భర్తీకి సుప్రీం అనుమతించిన నేపథ్యంలో మళ్లీ పాత పద్ధతిలోనే వేర్వేరుగా ప్రకటనలు జారీ చేయాలని తాజాగా నిర్ణయానికొచ్చాయి. ఒకే కేటగిరీ పోస్టులు, విద్యార్హతలున్నా రాత పరీక్షలు వేర్వేరుగా ఉండనున్నాయి. -
జల విద్యుత్ కేంద్రం పనుల పరిశీలన
దేవీపట్నం : మండలంలోని అంగుళూరు గ్రా మం వద్ద జరుగుతున్న పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్ కేంద్రానికి చెందిన మట్టిపనులను ఏపీ జెన్కో డైరెక్టర్ సీహెచ్ నాగేశ్వరరావు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 960 మెగావాట్ల ఉత్పత్తి సామర్ధ్యం గల జల విద్యుత్తు కేంద్రం నిర్మాణాన్ని త్వరతగతిన పూర్తిచేయాలని సంకల్పించినట్టు తెలిపారు. ఆ దిశగా మట్టి పనులను వేగవంతం చేయాలని సైట్ అధికారులను ఆయన ఆదేశించారు. ఏపీ జెన్కో సల హాదారుడు ఆదిశేషు మాట్లాడుతూ ప్రస్తుతం రోజుకు 3,800 క్యూబిక్ మీటర్ల మట్టిపని మాత్రమే జరుగుతోందన్నారు. కానీ రోజుకు 30 వేల క్యూబిక్ మీటర్ల మట్టిపని చేస్తే తప్ప నిరే్ధశిత సమయానికి పనులు పూర్తికావన్నారు. ఇందుకనుగుణంగా యంత్రాలను పెంచి పనులు వేగంగా పూర్తిచేయాలని సంబంధిత కాంట్రాక్ట్ సంస్థ ట్రాన్స్ట్రాయ్ అధికారులను వారు ఆదేశించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఏపీ జెన్కో ఈఈ కొలగాని వీవీఎస్ మూర్తి వివరించారు. కార్యక్రమంలో జెన్కో ఇంజనీర్లు కె.రత్నబాబు, స్వామినాయుడు, కోటేశ్వరరావు, రాజ్‌కుమార్, రామకృష్ణ, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
భారీగా విద్యుదుత్పత్తి నిలుపుదల!
- ‘బ్యాకింగ్ డౌన్’కు ఈఆర్సీ ఆమోదముద్ర - 2016-17లో 6,926 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి తగ్గింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ ఏడాదీ భారీ ఎత్తున విద్యుదుత్పత్తి నిలుపుదలకు రంగం సిద్ధమైంది. డిమాండ్ లేకపోవడంతో 2016-17లో 6,926 మిలియన్ యూనిట్ల (ఎంయూ)లను బ్యాకింగ్ డౌన్ (అందుబాటులో ఉన్న విద్యుత్‌తో పోలిస్తే డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు బలవంతంగా ఉత్పత్తిని తగ్గించుకోవడం) చేయాల్సి రావచ్చని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదించాయి. విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థితికి పెరిగిన సమయాల్లో నిరంతర సరఫరా కొనసాగింపునకు అదనపు విద్యుత్ కొనుగోళ్లు చేయక తప్పదని, డిమాండ్ తగ్గిన సమయాల్లో ఈ విద్యుత్ అవసరం ఉండదని వివరణ ఇచ్చాయి. తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో) థర్మల్ ప్లాంట్లతోపాటు దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) కుదుర్చుకున్న ఇతర విద్యుత్ ప్లాంట్లలో చేపట్టాలనుకుంటున్న ఈ బ్యాకింగ్ డౌన్ వల్ల రూ. 692.61 కోట్ల అదనపు భారం పడనుందని నివేదించాయి. దీనిపై ఈఆర్సీ సానుకూలంగా స్పందించింది. అదనపు భారాన్ని నిర్ధారించాక ట్రూ అప్ చార్జీల రూపంలో వినియోగదారుల నుంచి వసూలు చేసేందుకు అనుమతిస్తామని పేర్కొంది. తాజాగా ప్రకటించిన రిటైల్ టారీఫ్ ఆర్డర్ 2016-17లో విద్యుత్ ప్లాంట్ల బ్యాకింగ్ డౌన్ అంశంపై డిస్కంలకు ఈఆర్సీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. విద్యుత్ విక్రయాలతో రూ.724 కోట్ల ఆదాయం... విద్యుత్ డిమాండ్ లేని సమయంలో 1,448 ఎంయూల విద్యుత్‌ను విక్రయించడం ద్వారా రూ. 724 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని డిస్కంలు అంచనా వేశాయి. కారిడార్ అందుబాటులో ఉన్న దక్షిణాది రాష్ట్రాలకు మిగులు విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.09 చొప్పున విక్రయించాలని ఈఆర్సీ ఆదేశించింది. అనుమతికి మించి కొంటున్నారు... డిమాండ్ పెరిగినప్పుడు తాము అనుమతిచ్చిన దానికన్నా అధిక విద్యుత్‌ను డిస్కంలు మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నాయని ఈఆర్సీ పేర్కొంది. ఈ కొనుగోళ్లతో పడే భారాన్ని ప్రభుత్వమే భరించాలంటూ బహిరంగ విచారణలో వచ్చిన సూచనలపై స్పందన తెలపాలని డిస్కంలను కోరింది. గతేడాది 2000 ఎంయూల బ్యాకింగ్ డౌన్ 2015-16లో జెన్కో థర్మల్ ప్లాంట్ల ద్వారా 17,076 ఎంయూల విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 15,123 ఎంయూల ఉత్పత్తే జరిగింది. లక్ష్యంతో పోల్చితే 2వేల మిలియన్ యూనిట్లను బ్యాకింగ్ డౌన్ చేశారు. దీంతో జెన్కో వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 12 ఏళ్లలో ఎన్నడూ లేనట్లుగా 73.21%కు పతనమైంది. జెన్కో ప్లాంట్లను బ్యాకింగ్ డౌన్ చేసి స్వల్పకాలిక ఒప్పందాలతో విద్యుత్ కొనుగోళ్లను కొనసాగించడంతో వినియోగదారులపై రూ. 600 కోట్ల భారం పడిందని నిపుణులు అంచనా వేశారు. ఇది కేవలం జెన్కో ప్లాంట్ల బ్యాకింగ్ డౌన్ వల్ల పడిన భారం మాత్రమే. గతేడాది ఆశించిన రీతిలో డిమాండ్ లేకపోవడంతో దీర్ఘకాలిక పీపీఏలు కుదుర్చుకున్న ఎన్టీపీసీ ప్లాంట్లను సైతం బ్యాకింగ్ డౌన్ చేశారు. -
శ్రీశైలం టెయిల్ పాండ్ డ్యాంకు భారీ గండి
శ్రీశైలం: తెలంగాణా జెన్కో ఆధ్వర్యంలో సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న శ్రీశైలం టెయిల్‌పాండ్ కాంక్రీట్ డ్యాంకు గండిపడింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన జరుగుతుండడంతో కొద్దిపాటి ప్రవాహానికి నిర్మాణంలో ఉన్న డ్యాం మధ్యభాగంలో సుమారు 30 అడుగుల వెడల్పు, ఎత్తులో కాంక్రీట్ డ్యాం కొట్టుకుపోయింది. నిల్వ ఉన్న నీరు దిగువ ప్రాంతానికి విడుదలవుతుంది. గురువారం రాత్రి 9గంటల సమయంలో కాంక్రీట్‌డ్యాంకు గండిపడిందని అక్కడి మత్సకారులు అంటున్నారు. శ్రీశైల జలాశయానికి 12 కి.మీ దూరంలో తెలంగాణా- ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలను కలుపుకుని టైల్‌పాండ్ డ్యాంను నిర్మిస్తున్నారు. నీటిలో వేయవల్సిన ట్రీమి కాంక్రీట్‌లో నాణ్యత లోపించడం వల్లే కాంక్రీట్ డ్యాంకు గండిపడినట్లు ఇంజనీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తి వివరాలను వెల్లడించేందుకు అక్కడి ఇంజనీర్లు నిరాకరిస్తున్నారు. అకస్మాత్తుగా కాంక్రీట్‌డ్యాంకు గండిపడడంతో మత్సకారుల వలలు, బుట్టలు, ప్రమాదానికి గురై దెబ్బతిన్నట్లు అక్కడి మత్సకారులు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి ప్రభుత్వ ధనం వృథా కాకుండా చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతంలోని ప్రజలు అంటున్నారు. -
అపాయింటెడ్ డే తర్వాతే ఆ సంస్థల విభజన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అపాయింటెడ్ డే నాటికి షెడ్యూల్ తొమ్మిదిలోని 20 సంస్థలను విభజించాలని ముందు నిర్ణయించినప్పటికీ.. ఇప్పుడది సాధ్యం కాదని, రెండు రాష్ట్రాల ఏర్పాటు తర్వాతే ఆ ప్రక్రియ చేపట్టాలని అధికారులు తాజాగా నిర్ణయించారు. ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి జెన్కో, ఆర్టీసీలో మాత్రమే విభజన ప్రక్రియ పూర్తయిందని.. బ్రూవరీస్ కార్పొరేషన్, పౌర సరఫరాల సంస్థ, సీడ్స్ కార్పొరేషన్, ఆయిల్‌ఫెడ్, మార్క్‌ఫెడ్, విద్యుత్ ఆర్థిక సంస్థ, రాష్ట్ర గిడ్డంగులు, పర్యాటకాభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ శాఖ, విత్తనాభివృద్ధి సంస్థ, వైద్య మౌలిక సదుపాయల సంస్థలను జూన్ రెండో తేదీకి విభజించాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని గవర్నర్ వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే వీటి విభజన అంత సులువు కాదని, అందుకు గడువు కావాలని ఆయా సంస్థల అధిపతులు కోరినట్లు సమాచారం. -
టీ జెన్కో సీఎండీగా ప్రభాకర్‌రావు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్కో చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా దేవులపల్లి ప్రభాకర్‌రావు నియమితులుకానున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే టీఆర్ఎస్ ఉన్నతస్థాయి వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మొన్నటివరకు ఆయన జెన్కో జేఎండీగా వ్యవహరించారు. రాష్ట్రంలోని వివిధ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించడంలో, ఆర్థిక వనరులు సమకూర్చడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. విద్యుత్‌రంగాన్ని పటిష్టపరిచే విషయంలో చంద్రబాబుతో భేదాభిప్రాయాలు తలెత్తితే తన పదవికే రాజీనామా చేసేందుకు ఆయన సిద్ధపడ్డారు. సంస్థను పటిష్టపరచడంలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరున్న ప్రభాకర్‌రావు... సకాలంలో ప్రాజెక్టులను పూర్తిచేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారనే అభిప్రాయం ఇంధనశాఖలో ఉంది. ఈ నేపథ్యంలో విభజన అనంతరం తెలంగాణలో విద్యుత్ సమస్య తలెత్తుతుందనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఇటువంటి అనుభవజ్ఞుడిని జెన్కో సీఎండీగా చేయడం వల్ల త్వరగా ప్రాజెక్టులు పూర్తి అవుతాయని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నట్టు సమాచారం. సుదీర్ఘకాలం ఫైనాన్స్ డెరైక్టర్‌గా పనిచేయడం వల్ల పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ)తో పాటు బ్యాంకర్లతో ఆయనకు విస్తృత పరిచయాలున్నాయి. అందువల్ల ప్రభాకర్‌రావు నియామకం వల్ల విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సమీకరణకు కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తదనే అభిప్రాయమూ ఉంది. విద్యుత్ బోర్డు విభజనకు ముందు ఆయన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డులో ఫైనాన్స్ మెంబర్‌గా పనిచేశారు. అలాగే ట్రాన్స్‌కో, జెన్కోలలో ఫైనాన్స్ డెరైక్టర్‌గా పనిచేశారు. జెన్కోకు చెందిన విద్యుత్ ప్రాజెక్టులకు ఆర్థిక వనరులను సమకూర్చడంలో ముఖ్యభూమిక పోషించారు. -
తెలంగాణ జెన్కో చైర్మన్‌గా ఎస్కే జోషి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్కో చైర్మన్‌గా సుశీల్ కుమార్ ఎస్కే జోషి ఎంపికయ్యారు. తెలంగాణ జెన్కో పాలకమండలి బుధవారం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు ప్రత్యేకంగా జెన్కోను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏర్పడిన మొదటి కంపెనీ ఇదే కావడం గమనార్హం. తెలంగాణ జెన్కోలో ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అదనపు బాధ్యతలు)గా ఉన్న ఎస్కే జోషితో పాటు ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర, బలరాం, సత్యమూర్తి డెరైక్టర్లుగా ఉన్నారు. హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధలో బుధవారం సమావేశమైన డెరైక్టర్లు జోషిని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. అదేవిధంగా తెలంగాణ జెన్కోలో 11 మందికి షేర్లను జారీ చేశారు. -
తెలంగాణ జెన్కోకు ఓకే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జెన్కో పేరుతో ప్రత్యేకంగా కంపెనీని రిజిస్టర్ చేసేందుకు జెన్కో పాలకమండలి ఆమోదముద్ర వేసింది. విద్యుత్ సౌధలో శనివారం జెన్కో పాలకమండలి(బోర్డు) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ జెన్కోకు ఆస్తుల పంపిణీకి కూడా బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏ ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్లు అదే ప్రాంతానికి చెందే విధంగా ఆస్తులను పంపిణీ చేయాలని బోర్డు నిర్ణయించింది. బోర్డు సమావేశంలో చైర్మన్ ఎస్కే జోషి, ఎండీ విజయానంద్‌తో పాటు డెరైక్టర్లు సత్యమూర్తి, బలరాం పాల్గొన్నారు. -
తెలంగాణ జెన్కో ఏర్పాటుకు చర్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా జెన్కో ఏర్పాటు కానుంది. తెలంగాణ జెన్కో కంపెనీని వెంటనే ఏర్పాటు చేయాలంటూ జెన్కో ఎండీ విజయానంద్‌ను ఇంధనశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్, పవర్ జనరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ పేర్లతో కంపెనీని రిజిస్టర్ చేయాలని సూచించారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఏదో ఒక పేరును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా తెలంగాణ జెన్కోలో నలుగురు డెరైక్టర్లు ఉంటారు. ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి (అదనపు బాధ్యతలు)గా ఉన్న ఎస్కే జోషి, ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర, జెన్కో ఫైనాన్స్, థర్మల్ డెరైక్టర్లు సత్యమూర్తి, బలరాంలు ఈ పదవుల్లో ఉంటారు. కాగా సోమవారం కంపెనీ పేరును రిజిస్టర్ చేసేందకు చర్యలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
‘పనితీరు’కు గ్యారంటీ కావాల్సిందే!
జెన్కోనూ వదలని విద్యుత్ పంపిణీ సంస్థలు ముందుకుసాగని సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియ సాక్షి, హైదరాబాద్: వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి సరఫరా చేస్తున్న జెన్కో పనితీరుకు గ్యారంటీ కావాల్సిందేనని విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు అంటున్నాయి. జెన్కో ఏర్పాటు చేయనున్న సోలార్ విద్యుత్ ప్లాంట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకోవాలంటే పెర్ఫార్మెన్స్ గ్యారంటీ చెల్లింపు తప్పనిసరి అని డిస్కంలు పేర్కొంటున్నాయి. అయితే, ప్రభుత్వరంగ సంస్థ అయిన తమకు గ్యారంటీ చెల్లింపు నుంచి మినహాయింపు ఇవ్వాలని జెన్కో కోరుతోంది. ఇందుకు డిస్కంలు ససేమిరా అంటున్నాయి. దీంతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటులో ఇప్పటి వరకు జెన్కో ముందడుగు వేయలేకపోతోంది. సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు జెన్కోకు మొదటి నుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ట్రాన్స్‌కో పిలిచిన 1,000 మెగావాట్ల సోలార్ బిడ్డింగ్‌లో జెన్కో పాల్గొనకుండా ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. బిడ్డింగ్‌తో సంబంధం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా 100 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు జెన్కో సమాయత్తమయ్యింది. అయితే, వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేసే సోలార్ ప్లాంటుకు విద్యుత్ సరఫరా లైన్లు (కారిడార్) ఏర్పాటు చేయలేమని ట్రాన్స్‌కో కొర్రీ వేసింది. దీనిపై సాక్షిలో వార్త ప్రచురితమయ్యింది. దీంతో కారిడార్ ఏర్పాటుకు ట్రాన్స్‌కో సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రైవేటు ప్లాంట్లతో సమానంగా పనితీరుకు గ్యారంటీ మొత్తం చెల్లించాలని అంటోంది. ఒకవైపు జెన్కోకు సుమారు రూ. 3 వేల కోట్ల మేరకు డిస్కంలు బకాయిపడ్డాయి. మరోవైపు గ్యారంటీకి జెన్కోను పట్టుబడుతుండటం విమర్శలకు తావిస్తోంది. మొత్తం 100 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్లను జెన్కో చేపట్టాలని భావిస్తోంది. ఈ లెక్కన ఒక్కో మెగావాట్‌కు రూ. 10 లక్షల చొప్పున రూ. 10 కోట్లు ముందస్తుగా జెన్కో చెల్లించాల్సి రానుంది. ఒకేసారి ఇంత మొత్తం చెల్లించడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆందోళన జెన్కోను వెంటాడుతోంది. -
బీపీఎల్ ప్రాజెక్టు జెన్కో పరం!
సాక్షి, హైదరాబాద్: బీపీఎల్ ప్రాజెక్టు జెన్కో పరం కానుంది. కరీంనగర్ జిల్లా రామగుండం సమీపంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో బీపీఎల్ విఫలమయ్యింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు జెన్కో సంసిద్ధత వ్యక్తం చేసింది.ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం పం పింది. బీపీఎల్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగో లు ఒప్పందాన్ని (పీపీఏ) రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయి తే పీపీఏ రద్దు చేస్తే వెంటనే ఈ ప్రాజెక్టుకు కేటాయిం చిన బొగ్గు సరఫరా ఒప్పందం (ఎఫ్ఎస్ఏ) కూడా రద్దు అవుతుంది. అందువల్ల బీపీఎల్‌తో పీపీ ఏ రద్దు చేసుకుంటున్నట్టు, జెన్కోకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను అప్పగిస్తూ ఒకేసారి ఉత్తర్వులు జారీ చేయాలని ఇంధనశాఖ నిర్ణయించినట్టు సమాచారం. 1990 నుంచీ బీపీఎల్ విఫలం..! 1990వ దశకంలో ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టు కింద 520 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం సమీపంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను బీపీఎల్ చేజిక్కించుకుంది. ఈ ప్లాంటుకు అవసరమైన భూమి, నీరు, బొగ్గు సరఫరాను అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ) సమకూర్చింది. అరుుతే బీపీఎల్ ఆ ప్రాజెక్టును చేపట్టలేదు. దీంతో 2004లో ఆ ప్రాజెక్టు పీపీఏను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, మళ్లీ మొదటికొచ్చిన బీపీఎల్ కంపెనీ 520 మెగావాట్లకు బదులుగా 600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని... ఇందుకు మెగావాట్‌కు రూ.5.1 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని 2009లో ప్రభుత్వానికి తెలిపింది. అయితే, మెగావాట్‌కు రూ.4.76 కోట్ల పెట్టుబడి వ్యయంతో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా 2009 అక్టోబరు 9వ తేదీన ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సవరించిన పీపీఏను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి కంపెనీ సమర్పించింది. -
జెన్కోకు ట్రాన్స్ కో షాక్!
సాక్షి, హైదరాబాద్: జెన్కోకు ట్రాన్స్‌కో మరోసారి షాక్ ఇచ్చింది. వైఎస్సార్ జిల్లా ముద్దనూరులో ఏర్పాటు చేయతలపెట్టిన 20 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంటుకు విద్యుత్ సరఫరా లైన్లను (నెట్వర్క్) సమకూర్చలేమని తేల్చి చెప్పింది. దీంతో సోలార్ విద్యుత్ ప్లాంటు ప్రతిపాదనను జెన్కో విరమించుకున్నట్టు సమాచారం. ఈ జిల్లాలో ప్రైవేట్ సంస్థలు ఏర్పాటు చేయనున్న పవన, సోలార్ విద్యుత్ ప్లాంట్లకు విద్యుత్ సరఫరా లైన్లను ఇచ్చేందుకే జెన్కోను పక్కన పెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నిజానికి సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో మొదటి నుంచీ జెన్కోను పక్కన పెడుతూనే ఉన్నారు. ట్రాన్స్‌కో నిర్వహించిన సోలార్ విద్యుత్ టెండర్లలో జెన్కోను పాల్గొనకుండా ప్రభుత్వ పెద్దలే ఒత్తిడి తెచ్చారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రాన్స్‌కో నిర్వహించిన సోలార్ టెండర్లలో ప్రైవేట్ సంస్థలు మాత్రమే పాల్గొన్నాయి. ఇప్పుడు వైఎస్సార్ జిల్లాలో సోలార్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటుకు ముందుకు వచ్చిన జెన్కోను నెట్వర్క్ సాకుతో మరోసారి పక్కన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముద్దనూరులో 1,050 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ ప్లాంటును జెన్కో ఇప్పటికే ఏర్పాటు చేసింది. అక్కడే 20 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నెట్వర్క్ లేదనే పేరుతో దీనికి కూడా ట్రాన్స్‌కో ద్వారా ప్రభుత్వ పెద్దలే మోకాలడ్డారని తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారం కేవలం ప్రైవేట్ సంస్థల లబ్ధి కోసమే నడుస్తోందని విద్యుత్‌రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
జెన్కో ఎండీకి ఇండియన్ పవర్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: జెన్కో మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ) కె.విజయానంద్‌కు ‘ఇండియన్ పవర్’ అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వ థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్వహణలో చూపిన ప్రతిభకుగాను ఆయన ‘2013 సంవత్సరానికి ఉత్తమ సీఈవో’గా ఎంపికయ్యారు. ‘ఇండియన్ పవర్’ అవార్డులను ఏటా కౌన్సిల్ ఆఫ్ పవర్ యుటిలిటీస్ సంస్థ ప్రకటిస్తుంది. ఇదిలా ఉండగా జెన్కో జేఎండీగా ఈ నెల 17 వరకూ సేవలందించిన డి.ప్రభాకర్‌రావుకు కూడా అవార్డు లభించింది. ఈయనకు ‘ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మేనేజ్మెంట్’ విభాగంలో అవార్డు లభించింది. నవంబర్ 22న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతులమీదుగా హైదరాబాద్‌లో జరిగే కార్యక్రమంలో వీరిద్దరూ అవార్డులను స్వీకరించనున్నారు. -
జెన్కోకు విభజన కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన జెన్కోకు కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. ఉద్యమాల నేపథ్యంలో కేబినెట్ సమావేశం కాకపోవడంతో 1,105 అదనపు పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి నిలిచిపోయింది. మరోవైపు అనుభవజ్ఞులైన నలుగురు ఉన్నతాధికారుల పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. రాష్ట్ర విభజన ప్రక్రియ నేపథ్యంలో ఇప్పటికే విద్యుత్ రంగంలో అనుభవజ్ఞులైన ఈ అధికారుల అవసరం ఉందని ఇంధనశాఖ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. జెన్కో జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ (జేఎండీ)గా ఉన్న ప్రభాకర్‌రావుతోపాటు హైడల్, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల డెరైక్టర్లు ఆదిశేషు, ఆంజనేయరావుల పదవీకాలం అక్టోబర్ నెలలో ముగియనుంది. మరో డెరైక్టర్ (టెక్నికల్) పదవీ కాలం కూడా అక్టోబర్ నెలలోనే ముగియనుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ పోస్టును రద్దు చేసింది. అయితే, విభజన ప్రక్రియ నేపథ్యంలో ఆస్తులు, అప్పులు, ప్రాజెక్టులను ఇరు ప్రాంతాలకు సక్రమంగా పంపిణీ చేయడంలో అనుభవజ్ఞులైన ఈ అధికారుల అవసరం ఎంతో ఉందని ఇంధనశాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం జేఎండీగా ఉన్న ప్రభాకర్‌రావుకు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్ఈబీ)ను మూడు ముక్కలుగా (జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కంలు) చేసిన సమయంలో ఆస్తుల పంపకంలో కీలకపాత్ర పోషించారు. అందువల్ల విభజన ప్రక్రియ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న వారినే మరికొద్ది కాలంపాటు పొడిగించాల్సిన అవసరం ఉందని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ పోస్టుల భర్తీకి ఇప్పటివరకూ నోటిఫికేషన్ ప్రక్రియకు ప్రభుత్వం ఆమోదం కూడా లభించలేదు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ భర్తీ చేసేందుకు రెండు నెలల సమయం సరిపోదని... ఒకవేళ హడావుడిగా భర్తీ చేసినప్పటికీ కొత్తవారు కావడంతో అనుభవలేమితో విభజన సమయంలో కొత్త ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత అధికారులను కొంతకాలం పొడిగించాలని ఉద్యోగ సంఘాలు కూడా కోరుతున్నాయి. -
తెలంగాణకే కరెంట్ కెపాసిటీ!
జెన్కో ఆస్తులు, ప్లాంట్ల సామర్థ్యం ఇక్కడే ఎక్కువ ఆస్తులతో పోలిస్తే.. అప్పులూ తక్కువే తెలంగాణలో విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు రూ.12,500 కోట్లు.. అప్పులు 6,800 కోట్లు ఆంధ్రాలో ఆస్తులు 6,800 కోట్లు, అప్పులు 4,539 కోట్లు జెన్కో ప్లాంట్ల సామర్థ్యంలో 54% తెలంగాణలో.. 46% ఆంధ్రలో.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం మొత్తమ్మీద జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఆస్తులతో పోలిస్తే.. అప్పులు తక్కువగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతంలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో జెన్కోకు చెందిన విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు రూ.12,500 కోట్లు. ఈ ప్లాంట్ల కోసం తెచ్చిన అప్పులు రూ.6,800 కోట్లు మాత్రమే. అంటే ఆస్తులు-అప్పుల నిష్పత్తి 100:54.4గా ఉందన్నమాట. అదే ఆంధ్రా ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్ల ఆస్తులు రూ.6,800 కోట్లు కాగా అప్పులు రూ.4,539 కోట్లు ఉన్నాయి. ఆస్తులు-అప్పుల నిష్పత్తి 100:66.75 శాతంగా ఉంది. అయితే, ఇరు ప్రాంతాలకు చెందిన విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల నిధులతో నిర్మించిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంటు(1,600 మెగావాట్లు) ఆస్తులు-అప్పులు రెండూ రూ.8 వేల కోట్లుగా ఉన్నాయి. ఇది ఇరు ప్రాంతాలకు చెందనుంది. ప్రతీ ప్రభుత్వ విభాగం నుంచి ఆస్తులు-అప్పుల వివరాలను రాష్ట్ర ప్రణాళిక శాఖ ఇప్పటికే సేకరించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇంధనశాఖ కూడా ఇరు ప్రాంతాల్లోని ఆస్తులు-అప్పుల వివరాలను సేకరిస్తోంది. రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి ఇంధనశాఖ నివేదిక సమర్పించనున్నట్టు సమాచారం. విభజన అనంతరం కూడా ఈ అప్పులను మరో 15 ఏళ్లపాటూ చెల్లించాల్సి ఉంటుందని ఇంధనశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం ఆధారంగా చూస్తే మాత్రం ఆంధ్రాలోనే అధిక విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2282.5 మెగావాట్లు కాగా.. ఆంధ్రా ప్రాంతంలో 2810 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అయితే, జల విద్యుత్ ప్లాంట్లు మాత్రం తెలంగాణలోనే ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో జల విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం 2541.8 మెగావాట్లు. ఆంధ్రా ప్రాంతంలో 1287.6 మెగావాట్లు మాత్రమే. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లను పరిగణనలోని తీసుకుంటే ఆంధ్రా ప్రాంతంలోని విద్యుత్ ప్లాంట్ల సామర్థ్యం ఎక్కువగా ఉంది. మొత్తమ్మీద రాష్ట్రవ్యాప్తంగా జెన్కోకు 8924.86 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. ఇందులో తెలంగాణ ప్రాంతంలో 4825.26 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. అంటే మొత్తం జెన్కో సామర్థ్యంలో 54 శాతం తెలంగాణలోనే ఉన్నాయి. ఇక ఆంధ్రా ప్రాంతంలో 4099.60 మెగావాట్ల ప్లాంట్లు... అంటే 46 శాతం ఉన్నాయి.