సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా జెన్‌కో ఏర్పాటు కానుంది. తెలంగాణ జెన్‌కో కంపెనీని వెంటనే ఏర్పాటు చేయాలంటూ జెన్‌కో ఎండీ విజయానంద్‌ను ఇంధనశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర శుక్రవారం లేఖ రాశారు. తెలంగాణ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్, తెలంగాణ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్, పవర్ జనరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ పేర్లతో కంపెనీని రిజిస్టర్ చేయాలని సూచించారు. రిజిస్టర్ చేసిన తర్వాత ఏదో ఒక పేరును ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని ఇంధనశాఖ వర్గాలు తెలిపాయి. ప్రాథమికంగా తెలంగాణ జెన్‌కోలో నలుగురు డెరైక్టర్లు ఉంటారు.
ఇంధనశాఖ ప్రధాన కార్యదర్శి (అదనపు బాధ్యతలు)గా ఉన్న ఎస్‌కే జోషి, ఇంధనశాఖ ప్రత్యేక కార్యదర్శి మునీంద్ర, జెన్‌కో ఫైనాన్స్, థర్మల్ డెరైక్టర్లు సత్యమూర్తి, బలరాంలు ఈ పదవుల్లో ఉంటారు. కాగా సోమవారం కంపెనీ పేరును రిజిస్టర్ చేసేందకు చర్యలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.