భారం మోపి బురద! | Power Sector Facing Problems Due To TDP Govt Tenure Absurd Policies | Sakshi
Sakshi News home page

భారం మోపి బురద!

Published Mon, Oct 25 2021 11:14 PM | Last Updated on Tue, Oct 26 2021 12:56 PM

Power Sector Facing Problems Due To TDP Govt Tenure Absurd Policies - Sakshi

సాక్షి, అమరావతి: గత సర్కారు అనాలోచిత నిర్ణయాలు, అసంబద్ధ విధానాలతో విద్యుత్‌ రంగం కుదేలైంది. బకాయిలు చెల్లించకపోవడంతో డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. అప్పుడు చేసిన తప్పిదాలే ట్రూ అప్‌ చార్జీల భారానికి కారణమయ్యాయని విద్యుత్తు రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి చౌక విద్యుత్తు కొనుగోళ్లు, పొదుపు చర్యలతో విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేస్తూ పంపిణీ సంస్థలను ఆదుకుంటోంది.

విద్యుత్తు రంగంలో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అనవసర వ్యయాన్ని నియంత్రిస్తోంది. మరోవైపు ప్రజలపై పెనుభారం పడకుండా భారీగా రాయితీలను భరిస్తోంది. రైతులతో పాటు ఇతర వర్గాలకు ఉచిత, రాయితీ విద్యుత్‌ను అందిస్తూనే కొనుగోళ్లు, పంపిణీలో నష్టాలను తగ్గించుకునేందుకు చర్యలు చేపడుతోంది. అయితే టీడీపీ నేతలు వాస్తవాలను మభ్యపుచ్చి తమ కారణంగా ప్రజలపై పడిన ట్రూ అప్‌ చార్జీలపై వారే ఆందోళనకు దిగడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  

ఆ ఐదేళ్లూ అప్పుల కొండ 
ఆర్ధిక భారం నుంచి తప్పించుకునేందుకు గత సర్కారు తప్పుడు నివేదికలతో డిస్కంలను అప్పుల ఊబిలోకి గెంటేసింది. ఫలితంగా 2014 నుంచి 2019 వరకూ విద్యుత్‌ పంపిణీ సంస్థల నష్టాలు రూ.4,110 కోట్ల నుంచి ఏకంగా రూ.27,240 కోట్లకు చేరాయి. గత రెండున్నరేళ్లలో నష్టాలు రూ.311 కోట్లు మాత్రమే పెరిగాయి. ప్రస్తుతం నష్టాలు రూ.27,551 కోట్లుగా ఉన్నాయి.

టీడీపీ హయాంలో వార్షిక సరఫరా ఖర్చు రూ.24,211 కోట్ల నుంచి రూ.46,404 కోట్లకు చేరుకుంది. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పొదుపు చర్యలతో ఇది తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం రూ.39,324 కోట్లుగా ఉంది. ఇక 2014 నుంచి 2019 వరకూ విద్యుత్‌ రంగం అప్పులు రూ.31,648 కోట్ల నుంచి రెట్టింపై రూ.62,463 కోట్లకి ఎగబాకాయి. 2014 జూన్‌ 2 నాటికి విద్యుత్తు కొనుగోళ్ల బకాయిలు, నిర్వహణ ఖర్చులు రూ.12,500 కోట్లు ఉండగా 2019 ఏప్రిల్‌ 1 నాటికి రూ.32,000 కోట్లకు చేరాయి. 

భారమైనా భరిస్తున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా గృహ విద్యుత్‌ వినియోగానికి సంబంధించి రూ.1,707.07 కోట్ల సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలు, గృహ విద్యుత్‌ వినియోగదారులతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, రైతులు, పౌల్ట్రీ వర్గాల భారాన్ని ప్రభుత్వమే మోస్తోంది. వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.7297.08 కోట్ల ఆర్ధిక భారం ప్రభుత్వంపై పడింది.

తొలిసారిగా ఉచిత విద్యుత్‌ వర్గాలన్నీ సెక్షన్‌–65 కింద ప్రత్యక్ష రాయితీ పొందేలా ఒకే గొడుగు కిందకు ఏపీఈఆర్‌సీ తెచ్చింది. దీనివల్ల పడిన రూ.1,657.56 భారాన్ని కూడా భరించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు పంపిణీ సంస్థల పరిధిలోనూ ఒకే విధంగా ధరలు అమలుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీనివల్ల ప్రభుత్వంపై రూ.136.72 కోట్ల భారం పడింది.  

అప్పటిలా కనీస చార్జీలు లేవు 
గృహ విద్యుత్‌ వినియోగదారుల నుంచి రూ.50 చొప్పున కనీస చార్జీలు వసూలు చేసే విధానం గత సర్కారు హయాంలో అమలైంది. దీనివల్ల నెలంతా విద్యుత్‌ వినియోగించకపోయినా కనీస చార్జీ రూ.50 చెల్లించాల్సి వచ్చేది. దీన్ని తొలగించి కిలోవాట్‌కు రూ.10 వసూలు చేసే విధానాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అంటే నెలంతా విద్యుత్‌ వినియోగించకపోతే కనీస చార్జీ చెల్లించనవసరం లేదు.

ఇక సగటు యూనిట్‌ సేవా వ్యయం రూ.7.17 నుంచి రూ.6.37కి తగ్గించింది. విద్యుత్‌ వినియోగాన్ని బట్టి శ్లాబులను మార్చి అధికభారం మోపే విధానాన్ని టీడీపీ సర్కారు ఐదేళ్లూ అమలు చేసింది. దాని నుంచి కాపాడటానికి ఏ నెలలో ఎంత విద్యుత్‌ వినియోగిస్తున్నారో టారిఫ్‌ ప్రకారం ఆ నెలలోనే బిల్లు వేసే విధంగా కంటిన్యూ బిల్లింగ్‌ విధానాన్ని ఇప్పుడు ప్రభుత్వం తెచ్చింది.  

విద్యుత్‌ సంక్షేమ రంగంవైపు అడుగులు.. 
విద్యుత్తు రంగాన్ని ప్రగతిశీల, ప్రజా సంక్షేమ రంగంగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు 200 యూనిట్లు, ఎంబీసీలు, చేనేత కార్మికులకు 100 యూనిట్లు, దోబీఘాట్లు, లాండ్రీలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, సెలూన్లు, రోల్డ్‌ గోల్డ్‌ పనివారికి 100 యూనిట్లు ఉచితంగా అందజేస్తోంది. విద్యుత్తు సరఫరాలో అంతరాయాలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. 2019–20లో 3 లక్షలుగా ఉన్న అంతరాయాలను 2020–21 నాటికి 1.77 లక్షలకు తగ్గించింది. 2019–20లో యూనిట్‌కు రూ.7.23 చొప్పున ఉన్న సగటు సర్వీసు వ్యయాన్ని 2020–21 నాటికి రూ.6.37కి తగ్గించగలిగింది. 

ఇటు డిస్కంలను ఆదుకుంటున్న ప్రభుత్వం.. 
విద్యుత్తు సంస్థలు 2019–21 మధ్య కొనుగోళ్ల కోసం విద్యుదుత్పత్తి సంస్థలకు రూ.64,007 కోట్లు చెల్లించాయి. దీనిని తట్టుకోవాలంటే ప్రభుత్వం నుంచి సబ్సిడీలు సకాలంలో అందాలి. ఈ నేపథ్యంలో 2019 మార్చి 31 నాటికి విద్యుత్తు సబ్సిడీ బకాయిలు రూ.13,388 కోట్లు ఉండగా ప్రభుత్వం రూ.11,442 కోట్లు ఇచ్చింది. 2019–21 సంవత్సరానికి విద్యుత్తు సబ్సిడీ, ఇతర ఛార్జీల కింద మరో రూ.16,724 కోట్లు విడుదల చేసింది. ఇలా విద్యుత్తు సంస్థలను ఆదుకునేందుకు రూ.28,166 కోట్లు విడుదల చేసింది. 

వాస్తవ సర్దుబాటు వ్యయం రూ.20,572 కోట్లు 
విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2014–19 కాలానికి దాదాపుగా రూ.20,572 కోట్ల వాస్తవ అదనపు వ్యయం సర్దుబాటు కోసం విద్యుత్‌ నియంత్రణ మండలికి 2019 చివరిలో విన్నవించాయి. ఇదే కాకుండా 2014–15 నుంచి 2018–19 వరకు సంస్థల నెట్‌వర్క్‌ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణ, ఆదాయ అవసరాల వాస్తవ ఖర్చుల ఆధారంగా జరిపిన అదనపు వ్యయం సర్దుబాటు రూపంలో మరో రూ.7,224 కోట్లు అనుమతించాలని విద్యుత్‌ నియంత్రణ మండలిని కోరాయి. ఇందులో రూ.3,555 కోట్ల వసూలును ఏపీఈఆర్‌సీ తిరస్కరించింది. రూ.3,669 కోట్ల ట్రూ–అప్‌ చార్జీల వసూలు మాత్రం అనివార్యమైంది. నిజానికి ఇది కూడా ఆమోదించకపోతే విద్యుత్‌ పంపిణీ సంస్థల మనుగడ కష్టంగా మారే ప్రమాదం ఉంది. అది మంచిది కాదని విద్యుత్‌ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.

గత ప్రభుత్వ హయాం నాటివే 
‘ప్రస్తుతం అమలవుతున్న ట్రూ అప్‌–సర్దుబాటు చార్జీలు గత ప్రభుత్వ హయాం నాటి విద్యుత్‌ పంపిణీ  నెట్‌వర్క్‌ చార్జీలకు సంబంధించినవి. విద్యుత్‌ పంపిణీ సంస్థల వార్షిక ఖర్చులు, ఆదాయ అవసరాలకు అనుగుణంగా గత ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం, విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్దేశించిన సబ్సిడీని భరించని కారణంగా పంపిణీ సంస్థల అప్పులు పెరిగిపోయాయి.

ఏపీఈఆర్‌సీకి సమర్పించే వార్షిక ఆదాయ అవసరాల నివేదికలలో వాస్తవాలను వెల్లడించకుండా పరోక్షంగా భారాన్ని తగ్గించుకుని తప్పుల తడకలు నివేదికలతో సమయాన్ని వెళ్లదీశారు. అప్పుడు జరిగిన నష్టమంతా సర్దుబాటు చార్జీల రూపంలో వినియోగదారులపై పడింది. 2014–15 నుంచి 2018–19 వరకు నెట్‌వర్క్‌ (పంపిణీ వ్యవస్థ) నిర్వహణకు అనుమతించిన వ్యయం కన్నా వాస్తవ ఖర్చు అధికమవడం వల్లే ఈ సవరింపు చార్జీలు విధించాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలి’ –నాగులాపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement