పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి.. | Fire breaks out in Srisailam power Project : Rescue operation underway | Sakshi
Sakshi News home page

గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు..

Published Fri, Aug 21 2020 8:33 AM | Last Updated on Fri, Aug 21 2020 1:01 PM

Fire breaks out in Srisailam power Project : Rescue operation underway - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ ప్రమాద సంఘటనలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చిక్కుకున్న ఉన్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటులో పోలీసులు లోపలకు వెళ్లినా దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి రావడం జరిగింది. ఆక్సిజన్‌ పెట్టుకుని వెళ్లినా లోపలకి వెళ్లలేకపోతున్నారని మంత్రి జగదీష్‌ రెడ్డి తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు సింగరేణి సిబ్బంది సాయం కోరినట్లు ఆయన చెప్పారు. (విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..)

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటనను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు వివరించినట్లు జెన్‌కో  సీఎండీ ప్రభాకార్‌రావు తెలిపారు. గురువారం రాత్రి 10.35 గంటలకు ప్రమాదం జరిగిందని, లోపలికి వెళ్లేందుకు వీలుకాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదని, 1200 కేవీ ఐసోలేట్‌ చేసినట్లు సీఎండీ తెలిపారు.
 
నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో  శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. 

మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. వీరిలో ఏడుగురు జెన్‌కో ఉద్యోగులు కాగా ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఎమ్మెల్యే బాలరాజ్‌ మాట్లాడుతూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందన్నారు. విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరగటం ఇది మొదటిసారి అని ఆయన అన్నారు.

  • మంటల్లో చిక్కుకున్నవారు: డీఈ శ్రీనివాస్‌, ఏఈలు వెంకట్రావు
  • ఫాతిమా బేగం, మోహన్‌, సుందర్‌, సుష్మ, కుమార్
  • ప్రైవేట్ ఉద్యోగులు కిరణ్, రాంబాబు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement