Srisailam Hydropower Station
-
శ్రీశైలంపై తెగని పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) చివరి సమావేశం సోమవారం రెండోరోజు కొనసాగగా.. తెలంగాణ అధికారుల గైర్హాజరుతో ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. గత శనివారం జలసౌధలో జరిగిన మొదటిరోజు సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరై.. ఆర్ఎంసీ ప్రతిపాదించిన ముసాయిదా నివేదికలోని పలు అంశాలపై ఏకాభిప్రాయం తెలపడంతో పాటు సమావేశాన్ని సోమవారం కూడా కొనసాగించి తుది నివేదికపై సంతకాలు చేయాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాశయం రూల్‌కర్వ్ (నిర్వహణ నిబంధనలు)లో స్వల్ప మార్పులకు రెండు రాష్ట్రాలు ఓకే అన్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు నష్టం కలగకుండా శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నియంత్రించాలనే మరో నిబంధనకు కూడా అంగీకారం తెలిపాయి. తీరా సోమవారం నాటి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్ఎంసీ కన్వీనర్ బి.రవికుమార్ పిళ్లై నేతృత్వంలో సోమవారం కమిటీ సమావేశం కాగా, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో పాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్‌తో పాటు ఇతర అధికారుల రాకకోసం దాదాపు అర్ధగంటకు పైగా నిరీక్షించారు. ఈ విషయాన్ని పిళ్లై తెలంగాణ ఈఎన్సీకి ఎస్ఎంఎస్ ద్వారా తెలపగా, తాము రావడం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో ఏపీ ఈఎన్సీ, ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) నుంచి తుది నివేదికపై సంతకాలను సేకరించిన ఆర్ఎంసీ కన్వీనర్ ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించారు. విఫలమైన ఆర్ఎంసీ ప్రయత్నాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఎంత మేరకు నిల్వలుంటే ఎంత మేర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తాగునీరు, సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు వాడుకోవాలి అన్న అంశం రూల్‌కర్వ్‌లో ఉంటుంది. రెండు జలాశయాల రూల్‌కర్వ్‌తో పాటు జలవిద్యుదుత్పత్తి, మిగులు జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి నివేదికను సిఫారసు చేసేందుకు ఆర్ఎంసీ కమిటీని..కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేసింది. ఆరుసార్లు సమావేశమైన ఆర్ఎంసీ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చివరి సమావేశం రెండో రోజు భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో ఆర్ఎంసీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్ఎంసీ తన తుది నివేదికలో చేయనున్న సాంకేతిక సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆర్ఎంసీ తుది నివేదికపై ఏపీ తరఫున తాము సంతకాలు చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. కనీస నిల్వ 830 అడుగులు చాలు శ్రీశైలంలో కనీస నిల్వ మట్టం 854 అడుగులుండాలని ప్రతిపాదించడాన్ని తాము అంగీకరించడం లేదని, 830 అడుగులుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే ఏపీ తరలించుకోవాలన్న నిబంధననను రూల్‌కర్వ్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. వరదల తర్వాత శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించుకోవడానికి ఏపీ అంగీకరిస్తేనే మిగులు జలాల వినియోగం విషయంలో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక బట్వాడా జరపాలని, వాడని కోటాను వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలని సూచించారు. ముసాయిదా నివేదికలో తెలంగాణకి ప్రయోజనం కలిగించే అంశాలేమీ లేవని, తమకు ఆమోదయోగ్యం కాని ఈ నివేదికను నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్‌ను కోరారు. పిళ్లై తప్పుడు వార్తలు రాయించారు మా వైఖరిలో మార్పు లేదు: తెలంగాణ ఆర్ఎంసీ నివేదికకు అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నట్టు ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై మీడియాలో తప్పుడు వార్తలు రాయించారంటూ తెలంగాణ తీవ్ర ఆరోపణలు చేసింది. సరైన వాస్తవాలను మీడియాకు తెలియజేయాలని ఆయన్ను ఆదేశించాలని కృష్ణా బోర్డును కోరింది. నీటి వాటాలు, విద్యుత్ వాటాలు, క్యారీ ఓవర్ నిల్వలు, వరద జలాల లెక్కింపుపై తమ రాష్ట్ర వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆర్ఎంసీ తుది సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్.. కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు. 50:50 నిష్పత్తిలో శ్రీశైలం విద్యుత్‌ను పంచుకోవాలంటూ తమకిచ్చిన ముసాయిదా నివేదికలో ఆర్ఎంసీ చేసిన సిఫారసును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి అవసరాలకే శ్రీశైలం జలాశయం ఉందని, జల విద్యుదుత్పత్తితో 240 టీఎంసీలను విడుదల చేయడం ద్వారా నాగార్జునసాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుందని తెలిపారు. -
‘శ్రీశైలం’ ఘటనకు ఏడాది
సాక్షి, నాగర్‌కర్నూల్/ దోమలపెంట(అచ్చంపేట): టీఎస్ జెన్కో పరిధిలోని శ్రీశైలం ఎడమగట్టు భూగర్భజల విద్యుత్తు కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని శుక్రవారం నాటికి ఏడాది పూర్తయింది. ఈ సంఘటన టీఎస్ జెన్కో చరిత్రలో మాయనిమచ్చగా మిగిలింది. 2020 ఆగస్టు 20న అర్ధరాత్రి ఇక్కడి నాలుగో యూనిట్‌లోని ప్యానల్‌బోర్డులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్ పేలుడుతో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనలో ఐదుగురు ఇంజినీర్లు, ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లు, మరో ఇద్దరు అమర్‌రాజ బ్యాటరీస్ కంపెనీకి చెందిన సిబ్బంది మరణించగా, మరో ఎనిమిది మంది సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఉక్కిరిబిక్కిరై మృత్యువాత శ్రీశైలం భూగర్భజల విద్యుత్ కేంద్రంలో నాడు అగ్రిప్రమాదం సంభవించి, దట్టమైన పొగలు వ్యాపించడంతో యూనిట్‌లోని ఉద్యోగులు, సిబ్బంది ఉక్కిరిబిక్కిరై తొమ్మిది మంది మరణించారు. వీరిలో డీఈ శ్రీనివాస్‌రావు (40), ఏఈ మర్సకట్ల పెద్ద వెంకట్రావ్ (46), ఏఈ మోహన్‌కుమార్ (33), ఏఈ ఉజ్మాఫాతిమా (27), ఏఈ సుందర్ (37), ప్లాంట్ అటెండర్ రాంబాబు (43), జూనియర్ ప్లాంట్ అంటెడర్ కిరణ్‌కుమార్ (30), అమరాన్ కంపెనీ ఉద్యోగులు వినేశ్‌కుమార్ (36), మహేశ్‌కుమార్ (38) మరణించారు. వీరంతా ఎస్కేప్ టన్నెల్ ద్వారా బయటకు వచ్చేందుకు యత్నించినా, దట్టమైన పొగతో ఊపిరి తీసుకునేందుకు వీలుపడని పరిస్థితి నెలకొనడంతో మరణించారు. పునరుద్ధరణ వైపు.. గతేడాది అక్టోబర్ 26న జలవిద్యుత్ కేంద్రంలోని 1, 2వ యూనిట్లలో పునరుద్ధరణ చేపట్టి విద్యుదుత్పత్తి ప్రారంభించారు. ఆ తర్వాత ఐదు నెలలకు 3, 5, 6వ యూనిట్లను సైతం పునరుద్ధరించి విద్యుదుత్పత్తి చేపట్టారు. ఈ కేంద్రంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు 646.56 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేశారు. కాగా 2021–22లో శ్రీశైలం భూగర్భ జలవిద్యుత్తు కేంద్రానికి టీఎస్ జెన్కో విధించిన లక్ష్యం 1,450 మిలియన్ యూనిట్లు. మొత్తం ఆరు యూనిట్లకుగాను ఒక్కో యూనిట్ 150 మెగావాట్ల చొప్పున మొత్తం విద్యుదుత్పత్తి సామర్థ్యం 900 మెగావాట్లు. కాగా అగ్నిప్రమాదం జరిగిన తర్వాత కేంద్రంలో ఇప్పటివరకు నాలుగు యూనిట్లను పునరుద్ధరించారు. 4వ యూనిట్ మాత్రమే పునరుద్ధరించాల్సి ఉంది. -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం ఫొటోలు
-
శ్రీశైలం అగ్ని ప్రమాదం: ఉదాసీనత వద్దు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో నిన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ఉద్యోగులు భూగర్భంలోనే చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించి ప్రమాదానికి గల కారణాలను అన్వేషించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు బండి సంజయ్. రాష్ట్ర సాగునీరు, విద్యుత్ అవసరాలు తీర్చే శ్రీశైలం జలాశయం లాంటి సున్నితమైన, అత్యంత ప్రాధాన్యమైన ప్రాంతాల భద్రతపై ఎలాంటి ఉదాసీనత దరి చేరనీయకూడదని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు బండి సంజయ్. -
ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఘటనపై మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు ఇచ్చారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో చిక్కుకుపోయిన తొమ్మిది మందిని బయటకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. (శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) మంటల్లో చిక్కుకున్నవారి వివరాలు 1.DE శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ 2.AE వెంకట్రావు, పాల్వంచ 3.AE మోహన్ కుమార్, హైదరాబాద్ 4.AE ఉజ్మ ఫాతిమా, హైదరాబాద్ 5.AE సుందర్, సూర్యాపేట 6. ప్లాంట్ అటెండెంట్ రాంబాబు, ఖమ్మం జిల్లా 7. జూనియర్ ప్లాంట్ అటెండెంట్ కిరణ్, పాల్వంచ 8,9 హైదరాబాద్‌కు చెందినా అమరన్ బ్యాటరీ కంపెనీ సిబ్బంది వినేష్ కుమార్, మహేష్ కుమార్ అయితే, ప్రమాద స్థలంలో పొగ తగ్గకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ టీం లోపలికి వెళ్లేందుకు యత్నించగా.. ఆక్సిజన్ అందక వెనక్కి వచ్చారు.. సొరంగంలో దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. శ్రీశైలం ఎడమ జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు. సహాయక చర్యలను మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. లోపల చిక్కుకున్న సిబ్బందిని కాపాడేందుకు అధికారులు సింగరేణి సహాయం కోరారు. ఇక ఈ ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారికి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారంతా బాగానే ఉన్నారని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. బాధితులను ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు. పొగ కారణంగా మరో ఆరుగురు అస్వస్థకు గురికావడంతో జెన్కో ఆస్పత్రికి తరలించారు. (గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు..) ఏపీ సీఎం జగన్ దిగ్భ్రాంతి: తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ విద్యుత్ శాఖ అధికారులు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్నారు. -
పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి..
సాక్షి, హైదరాబాద్ : శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ ప్రమాద సంఘటనలో చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. చిక్కుకున్న ఉన్నవారిని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బందితో పాటులో పోలీసులు లోపలకు వెళ్లినా దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోనికి వెళ్లి వెనక్కి రావడం జరిగింది. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా లోపలకి వెళ్లలేకపోతున్నారని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారని, మరోవైపు సింగరేణి సిబ్బంది సాయం కోరినట్లు ఆయన చెప్పారు. (విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..) శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో అగ్నిప్రమాదం ఘటనను ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావుకు వివరించినట్లు జెన్కో సీఎండీ ప్రభాకార్‌రావు తెలిపారు. గురువారం రాత్రి 10.35 గంటలకు ప్రమాదం జరిగిందని, లోపలికి వెళ్లేందుకు వీలుకాలేదని ఆయన పేర్కొన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదని, 1200 కేవీ ఐసోలేట్ చేసినట్లు సీఎండీ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటలో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 17 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 8 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. వీరిలో ఏడుగురు జెన్కో ఉద్యోగులు కాగా ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలించారు. ఎమ్మెల్యే బాలరాజ్ మాట్లాడుతూ.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పొగలు అలుముకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడిందన్నారు. విద్యుత్ కేంద్రంలో ప్రమాదం జరగటం ఇది మొదటిసారి అని ఆయన అన్నారు. మంటల్లో చిక్కుకున్నవారు: డీఈ శ్రీనివాస్, ఏఈలు వెంకట్రావు ఫాతిమా బేగం, మోహన్, సుందర్, సుష్మ, కుమార్ ప్రైవేట్ ఉద్యోగులు కిరణ్, రాంబాబు -
శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం..
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 15 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే మరీ కొంతమంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. డీఈ శ్రీనివాస్ గౌడ్, సుందర్,మోహన్ కుమార్, సుస్మా, ఫాతిమా, వెంకట్ రావ్, ఎట్టి రాంబాబు, కిరణ్, ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది గల్లంతు అయ్యినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం దురదృష్టకరం: మంత్రి జగదీష్‌రెడ్డి శ్రీశైలం లెఫ్ట్ పవర్‌హౌస్‌లో ప్రమాదం దురదృష్టకరమని మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. మొదటి యూనిట్లో అగ్నిప్రమాదం జరిగిందన్నారు. అగ్నిప్రమాదంలో నాలుగు ప్యానెల్స్ దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 10 మంది సురక్షితంగా బయటకొచ్చారు.. మరో 9 మంది చిక్కుకున్నారని వెల్లడించారు. ‘‘లోపల దట్టమైన పొగ ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. చిక్కుకున్నవారిని కాపాడేందుకు ఫైర్, పోలీస్ సిబ్బంది లోపలికి వెళ్లారు. దట్టంగా పొగ ఉండటంతో మూడుసార్లు లోపలికి వెళ్లి వెనక్కి వచ్చారు. ఆక్సిజన్ పెట్టుకుని వెళ్లినా లోపలికి వెళ్లలేకపోతున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సింగరేణి సిబ్బంది సహాయం కోరాం. లోపల చిక్కుకున్నవారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నామని’’ మంత్రి వెల్లడించారు.