సాక్షి, హైదరాబాద్: బీపీఎల్ ప్రాజెక్టు జెన్‌కో పరం కానుంది. కరీంనగర్ జిల్లా రామగుండం సమీపంలో 600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో బీపీఎల్ విఫలమయ్యింది. దీంతో ఈ ప్రాజెక్టు నిర్మించేందుకు జెన్‌కో సంసిద్ధత వ్యక్తం చేసింది.ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం పం పింది. బీపీఎల్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగో లు ఒప్పందాన్ని (పీపీఏ) రద్దు చేసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయి తే పీపీఏ రద్దు చేస్తే వెంటనే ఈ ప్రాజెక్టుకు కేటాయిం చిన బొగ్గు సరఫరా ఒప్పందం (ఎఫ్‌ఎస్‌ఏ) కూడా రద్దు అవుతుంది. అందువల్ల బీపీఎల్‌తో పీపీ ఏ రద్దు చేసుకుంటున్నట్టు, జెన్‌కోకు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను అప్పగిస్తూ ఒకేసారి ఉత్తర్వులు జారీ చేయాలని ఇంధనశాఖ నిర్ణయించినట్టు సమాచారం.
1990 నుంచీ బీపీఎల్ విఫలం..!
1990వ దశకంలో ఫాస్ట్ ట్రాక్ ప్రాజెక్టు కింద 520 మెగావాట్ల సామర్థ్యంతో రామగుండం సమీపంలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను బీపీఎల్ చేజిక్కించుకుంది. ఈ ప్లాంటుకు అవసరమైన భూమి, నీరు, బొగ్గు సరఫరాను అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) సమకూర్చింది. అరుుతే బీపీఎల్ ఆ ప్రాజెక్టును చేపట్టలేదు. దీంతో 2004లో ఆ ప్రాజెక్టు పీపీఏను ప్రభుత్వం రద్దు చేసింది. అయితే, మళ్లీ మొదటికొచ్చిన బీపీఎల్ కంపెనీ 520 మెగావాట్లకు బదులుగా 600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తామని... ఇందుకు మెగావాట్‌కు రూ.5.1 కోట్ల మేరకు ఖర్చు అవుతుందని 2009లో ప్రభుత్వానికి తెలిపింది. అయితే, మెగావాట్‌కు రూ.4.76 కోట్ల పెట్టుబడి వ్యయంతో 600 మెగావాట్ల విద్యుత్ ప్లాంటుకు మంత్రివర్గ ఉపసంఘం పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా 2009 అక్టోబరు 9వ తేదీన ఇంధనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా సవరించిన పీపీఏను ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి కంపెనీ సమర్పించింది.