సాక్షి, అమరావతి/తిరుపతి రూరల్: కరెంట్ బిల్లులనూ మూడు నెలల పాటు వాయిదా వేశారని, కట్టాల్సిన అవసరం లేదంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు గురువారం స్పష్టం చేశారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సిబ్బంది ప్రతీ ఇంటికి వచ్చి మీటర్ రీడింగ్ తీసే అవకాశం లేదని, అందుకే మార్చిలో వచ్చిన బిల్లే ఈ నెలా చెల్లించాల్సి ఉంటుందని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.హరినాథరావు తెలిపారు. విద్యుత్ బిల్లులను వినియోగదారులకు ఈనెల 4వ తేదీలోగా ఎస్‌ఎంఎస్ ద్వారా పంపుతామని ఓ ప్రకటనలో తెలిపారు. ఎల్‌టీ ఆక్వా, హెచ్‌టీ మీటర్ సర్వీసులకు మాత్రం మీటర్ రీడింగ్ ప్రకారమే విద్యుత్ బిల్లులను జారీ చేస్తామన్నారు. ఈ మేరకు జిల్లాల సూపరింటెండింగ్ ఇంజనీర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కాగా, తెలంగాణలో కూడా గత నెల కరెంటు బిల్లులే ఈ నెలలోనూ చెల్లించాల్సి ఉంటుందని డిస్కమ్‌లు కోరనున్నాయి.
లాక్‌డౌన్ షాక్ లేదు!
సాక్షి, అమరావతి: లాక్‌డౌన్ కారణంగా విద్యుత్ సరాఫరా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కీలకమైన అన్ని విభాగాల్లో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినట్లు జెన్‌కో థర్మల్ డైరెక్టర్ చంద్రశేఖర్‌రాజు తెలిపారు. కీలకమైన లోడ్ డిస్పాచ్, వాణిజ్య కొనుగోళ్లు, నెట్‌వర్కింగ్, ఉత్పత్తి సంస్థల్లో కొందరు ముఖ్యమైన ఉద్యోగులు లాక్‌డౌన్ నేపథ్యంలో లేనందున అందుబాటులో ఉన్నవారితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఒక్కో విభాగంలో ముగ్గురితో బృందాలను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. దేశంలోని గ్రిడ్, క్షేత్రస్థాయి డిస్కమ్‌లకు అనుసంధానం చేసే లోడ్ డిస్పాచ్ సెంటర్‌తో సమన్వయం కోసం ఐదు బృందాలను నియమించారు. థర్మల్ విద్యుదుత్పత్తిలో సాంకేతిక సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు మరికొన్ని టాస్క్‌ఫోర్స్ బృందాలను సిద్ధం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment