Current bills
-
బట్టాపూర్ గుట్ట మింగివేతపై పిల్
బట్టాపూర్ గుట్ట వద్ద 9,280 క్యూబిక్ మీటర్లకు అనుమతులు ఉండగా ఇప్పటి వరకు ఏకంగా 15 లక్షల క్యూబిక్ మీటర్ల మేర స్వాహా చేసినట్లు అధికార వర్గాల అంచనా. జియోట్యాగింగ్ ద్వారా పరిమితికి మించి గుట్టను తవ్వేసినట్లు అధికారులు గుర్తించారు. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలోని ఏర్గట్ల మండలం బట్టాపూర్ వద్ద నిబంధనలు అతిక్రమించి గుట్టను తవ్వుతున్న విషయమై గురువారం రాష్ట్ర హైకోర్టులో పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖ లైంది. కేవలం 9,280 క్యూబిక్ మీటర్లకు మాత్రమే అనుమతులు ఉన్నప్పటికీ ఏకంగా ఇప్పటివరకు 15 లక్షల క్యూబిక్ మీటర్ల మేర స్వాహా చేసినట్లు అ ధికార వర్గాల అంచనా. ఈ విషయమై గత డిసెంబ ర్ 9న ‘సాక్షి’లో ‘గుట్టలు గుల్ల’ అనే కథనం ప్రచురి తమైంది. 195/1 సర్వే నంబర్లో 3.85 హెక్టార్లలో ఉన్న ఈ గుట్ట లీజును 2016లో తీసుకున్నప్పటికీ, రక్షిత అటవీ ప్రాంతం ఆనుకుని ఉంది. అయితే కా లుష్య నియంత్రణ మండలి అనుమతులు లేకుండా నే ఈ గుట్టను తవ్వడం మొదలుపెట్టారు. జియో ట్యాగింగ్ ద్వారా పరిమితికి మించి పూర్తిగా తవ్వేసి గుట్టను మింగేసినట్లు అధికారులు గుర్తించారు. పరిమిత అనుమతులు మాత్రమే ఉన్న దీనికి అనుబంధంగా నెలకొల్పిన క్రషర్కు అధికారికంగానే ఇప్పటి వరకు ఏకంగా రూ.2.5 కోట్ల విద్యుత్ బిల్లు చెల్లించారు. ఇలాంటి నేపథ్యంలో అనధికారికంగా ఎంత మాయాజాలం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అ యితే ఈ స్వాహా పర్వం వెనుక జిల్లాకు చెందిన ప్ర ధాన ప్రజాప్రతినిధి ఉండడంతో అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. గతంలో ఒకసారి తనిఖీకి వచ్చిన అటవీ క్షేత్రాధికారి ఆనందరెడ్డి 24 గంటల్లో నే బదిలీ అయ్యారు. మరోవైపు గతంలో వరుసగా 8 నెలల పాటు రూ.51 లక్షల విద్యుత్ బిల్లు పెండింగ్‌లో పెట్టినప్పటికీ విద్యుత్ సరఫరా మాత్రం ఆగ లేదు. ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగానే ఈ బిల్లు ను చెల్లించడం గమనార్హం. ఇదిలా ఉండగా దీనిపై గత సెప్టెంబర్ 24న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టర్ జనరల్‌కు ఫిర్యాదు వెళ్లింది. అక్కడి నుంచి గత అక్టోబర్ 1న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ వచ్చింది. అక్కడి నుంచి గత డిసెంబర్ 3న మైనింగ్ డైరక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. తరువా త అక్కడి నుంచి నిజామాబాద్ మైనింగ్ ఏడీకి సర్వే కోసం ఆదేశాలు వచ్చాయి. అయితే ప్రధాన ప్రజాప్రతినిధి కన్నెర్ర చేయడంతో ఏడీ సర్వే చేయలేదు. ఆధారాలతో కోర్టుకు.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి మల్లికార్జున్‌రెడ్డి బట్టాపూర్ గుట్ట వ్యవహారంపై అనేక ఆధారాలతో, ‘సాక్షి’ కథనంతో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ వ్యాజ్యానికి సంబంధించి తాజాగా హైకోర్టు సీరియల్ నంబర్ 21393 ఆఫ్ 2023 కేటాయించింది. ఇందుకు సంబంధించి హైకోర్టు మైన్స్ అండ్ జియాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్మూర్ ఆర్డీవో, నిజామాబాద్ మైనింగ్ ఏడీ, ఏర్గట్ల తహసీల్దారులకు నోటీసులు పంపింది. హైదరాబాద్ బృందం సర్వే.. ఈ క్రమంలో వారం రోజుల కిందట హైదరాబాద్ నుంచి వచ్చిన మైన్స్ అండ్ జియాలజీ విభాగానికి చెందిన బృందం ‘ఈటీఎస్’ (ఎలక్ట్రానిక్ టోటల్ సర్వే) నిర్వహించారు. సదరు నివేదిక ఇప్పటికే మైన్స్ అండ్ జియాలజీ డైరక్టర్‌కు వెళ్లింది. కాగా గుట్టను తొలిచే క్రమంలో వాడుతున్న జిలెటిన్ స్టిక్స్, ఇతర పేలుడు పదార్థాలు ‘మ్యాగ్జిన్’లో స్టోర్ చేయాలి. లేనిపక్షంలో స్థానిక పోలీసుస్టేషన్లో ఉంచాలి. దేశ, సంఘవిద్రోహ శక్తులకు చేరకుండా ఉండేందు కు ఈ నిబంధన ఉంది. ఈ నిబంధనను సైతం ఇక్కడ తుంగలో తొక్కడం గమనార్హం. ప్రమాదకర పరిస్థితుల్లోనే పేలుడు పదార్థాలు నిల్వ ఉంచడం విస్మయం కలిగిస్తోంది. -
కొత్త రకం కరెంట్ బిల్లు బాదుడు.. ఏసీడీ పేరిట భారీ వసూళ్లు
రెంజల్ (బోధన్): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని విద్యుత్ వినియోగారులకు ఆ సంస్థ సంక్రాంతి పండగ షాకిచ్చింది. ఈ నెలలో ఏసీడీ డ్యూ పేరుతో కొత్త రకం వసూళ్లకు పూనుకుంది. బిల్లులు చూసి వినియోగదారులు షాకవుతున్నారు. ఇదేం బాదుడంటూ ట్రాన్స్‌కో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి నెల వచ్చే సాధారణ బిల్లుతో పాటు అదనపు బిల్లు రావడంతో మొదట్లో అర్థం కాక వదిలేశారు. బిల్లులు కట్టేందుకు వెళ్లిన వినియోగదారులకు సిబ్బంది ఏసీడీ డ్యూ చెల్లించాలని చెప్పడంతో ఖంగుతింటున్నారు. కొంత మందికి రూ. వందల్లో ఏసీడీ బిల్లు రాగా, మరి కొందరికి రూ. వేలల్లో బిల్లులు వచ్చాయి. దీంతో కొత్త రకం చార్జీలు ఎందుకు చెల్లించాలని వినియోగదారులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ముందుగా వినియోగదారులకు అవగాహన కల్పించాల్సిన ట్రాన్స్‌కో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోక పోవడంతో బిల్లులు చెల్లించేందుకు ఆందోళన చెందుతున్నారు. డిసెంబర్లో వినియోగించిన విద్యుత్ బిల్లును జనవరిలో విద్యుత్ వినియోగదారులకు అందించారు. అందులో ఏసీడీ డ్యూపేరుతో బిల్లుతో పాటు అదనపు బిల్లును వేశారు. గత సంవత్సరం వినియోగదారుల నుంచి అభివృద్ధి చార్జీల పేరుతో అదనంగా వసూలు చేసిన విద్యుత్ పంపిణీ సంస్థ ఈ యోడు మరో పిడుగు వేసింది. ఏసీడీ డ్యూ అంటే.. ఏసీడీ (అడిషనల్ కన్జమ్షన్ డిపాటిజ్) పేరు బిల్లుల్లో చేరడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. వినియోగంతో సంబంధం లేకుండా వేలల్లో బిల్లులు రావడంతో లబోదిబోమంటున్నారు. జిల్లాలో 4 లక్షల 80 వేల వరకు గృహావసరాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారు వినియోగించిన యూనిట్లతో సంబంధం లేకుండా చిన్నా, పెద్దా తేడాలేకుండా వినియోగదారైతే చాలు అన్నట్లు విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) వ్యవహరించిందనే విమర్శలు వస్తున్నాయి. గత సంవత్సరం గృహావసరాల వినియోగదారులకు యూనిట్‌కు 50 పైసలు, వ్యాపార సముదాయాలకు రూ. 1 చొప్పున పెంచారు. దీంతో పాటు కస్టమర్, డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేశారు. తాజాగా సంస్థ ఏసీడీ పేరుతో మరో రకం బాదుడుతో వినియోగారులు విలవిల్లాడుతునారు. అడ్జస్ట్ చేస్తాం.. తర్వాత విడతల వారీగా నెలవారి యూనిట్లలో వచ్చే బిల్లుల్లో తగ్గించడం జరుగుతుంది. వినియోగదారులు సంవత్సరం పాటు వినియోగించిన యూనిట్లను యావరేజ్‌గా తీసుకుని ఈ నెల బిల్లులో వేయడం జరిగింది. ప్రతి నెలా చెల్లించే బిల్లులో అడ్జస్ట్ చేస్తాం –రాపెల్లి రవీందర్, ఎస్ఈ -
ఇదెక్కడి గోల.. ఈ భారం మోయలేం..
కరీంనగర్: గ్రామపంచాయతీలో సరిపడా నిధులు లేక సర్పంచులు అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నారు. కనీసం కరెంట్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఉంది. ఇవే తలకుమించిన భారమైతే.. సర్పంచ్‌లపై ట్రాక్టర్ల నిర్వహణ భారం కత్తిమీద సాములా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో పారిశుధ్య నిర్వహణ కోసం ఇచ్చిన ట్రాక్టర్ల కిస్తీలు కట్టలేక తలలు పట్టుకుంటున్నారు. చిన్న పంచాయతీల పరిస్థితి అయితే మరింత దయనీయంగా తయారైంది. రెండు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘాల నుంచి ఒక్క రూపాయి కూడా రావడంలేదు. దీంతో పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. తలలు పట్టుకుంటున్న సర్పంచ్‌లు జిల్లాలో 16 మండలాల పరిధిలో మొత్తం 313 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో కొత్త పంచాయతీలు 57 ఉన్నాయి. అయితే.. చాలా పంచాయతీలకు ఆదాయ వనరులు తక్కువ. దీంతో సిబ్బందికి జీతాల చెల్లింపు భారంగా మారిందని సర్పంచ్‌లు చెబుతున్నారు. ఈ నిర్ణయాలను ఉపసంహరించుకొని పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. గ్రామాల్లో పంచాయతీలకు సంబంధించిన వివిధ బాధ్యతలు నిర్వహించేందుకు పలువురు సిబ్బంది అవసరం. పంచాయతీ వ్యవహారాలు చూసేందుకు కారోబార్‌తో పాటు పన్నుల వసూళ్లకు బిల్ కలెక్టర్, వాటర్ ట్యాంక్‌లు, బోర్ల నిర్వహణ, తాగునీటి సరఫరా పనులు చూసేందుకు వాటర్‌మెన్, వీధిలైట్ల మెయిన్టనెన్స్ కోసం ఎలక్ట్రిషియన్, పారిశుధ్య పనులు, చెత్త సేకరణ సఫాయి కార్మికులు అవసరం ఉంటారు. పంచాయతీ ట్రాక్టర్లు నడిపేందుకు డ్రైవర్లు అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా డ్రైవర్లను నియమించకపోవడంతో పంచాయతీ సిబ్బందిలో నుంచి ఒకరిని డ్రైవర్‌గా నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో సర్పంచ్‌లు అనుభవం లేని వారిని డ్రైవర్లను నియమించుకున్నారు. జరగరాని ప్రమాదం ఏదైనా జరిగితే బాధ్యులు ఎవరో తెలియని పరిస్థితి నెలకొందని సర్పంచ్‌లు వాపోతున్నారు. ప్రస్తుతం పంచాయతీ స్థాయి జనాభాను బట్టి సిబ్బంది ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బందికి రూ.5 వేల నుంచి రూ.3 వేల వరకు వేతనాలు ఉన్నాయి. జీతాలు వ్యయం తక్కువగానే ఉండడంతో పంచాయతీలు భరిస్తున్నాయి. మల్టీపర్పస్ వర్కర్లకు జీతాలు నెలకు రూ.8,500 చెల్లించాల్సి ఉండడంతో సర్పంచ్‌లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో తలలు పట్టుకుంటున్నారు. 500 జనాభాకు ఒకరు.. పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇదివరకు ఉన్న గ్రామపంచాయతీలను పునర్ వ్యవస్థీకరించి కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆమ్లెట్ గ్రామాలు, గిరిజన తండాలు కొత్త జీపీలుగా ఆవిర్భవించాయి. ఈ క్రమంలో వివిధ పనులు నిర్వహించేందుకు గాను గ్రామపంచాయతీలో 500 జనాభాకు ఒకరి చొప్పున మల్టీపర్పస్ వర్కర్లను నియమించుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. ప్రతీ పంచాయతీకి కనీసం ఇద్దరు మల్టీపర్పస్ వర్కర్లు ఉండాలని సూచించింది. 500 వరకు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 10 ఉన్నాయి. 3 వేలలోపు జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 244 ఉన్నాయి. 3 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామపంచాయతీలు 59 ఉన్నాయి. ఈ లెక్కన జిల్లా వ్యాప్తంగా 1800 నుంచి 2000 మందికిపైగా మల్టీపర్పస్ వర్కర్లు పనిచేస్తున్నారు. వీరు ముఖ్యంగా గ్రామాల్లో ట్రాక్టర్ డ్రైవింగ్, మురికికాలువలు తీయడం, బల్బులు పెట్టడం, వాటర్ సమస్యలను పరిశీలించడం వంటి పనులు చేయాల్సి ఉంటుంది. చిన్న పంచాయతీల్లో గందరగోళం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన 57 గ్రామ పంచాయతీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ట్రాక్టర్ కిస్తీ నెలకు రూ 16,000, పారిశుధ్య కార్మికుల వేతనాలు రూ.17,000, ట్రాక్టర్ మరమ్మ తు ఖర్చులు రూ.2,500, డీజిల్ ఖర్చు రూ.8,000 చొప్పున నెలకు రూ.43,000 ఖర్చు అవుతోంది. ప్రభుత్వం నుంచి చిన్న పంచాయతీలకు వచ్చే నిధులు రూ.85 వేలు మాత్రమే. మిగితా రూ.42 వేల నుండి పారిశుధ్య కార్మికులకు, వీధి లైట్లకు, ఇతరాత్ర వాటికి ఉపయోగించాలి. ప్రభుత్వమే భరించాలి ఇప్పటికే పంచాయతీలకు పైసలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. సమస్యలను పరిష్కరించలేకపోతున్నాం. ఉన్న సిబ్బందికి జీతాలు ఇచ్చుడే కష్టంగా ఉంది. ట్రాక్టర్ నిర్వహణ, మల్టీపర్సస్ వర్కర్ల వేతనాలు, విద్యుత్ బిల్లుల చెల్లింపు ఇతరాత్ర ఖర్చుల కోసం నానా తంటాలు పడుతున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీ ఖాతాల్లో నేరుగా నిధులను జమ చేస్తే వాటిని స్థానికంగా అభివృద్ధి పనులకు వినియోగించుకోనే అవకాశం ఉంటుంది. తలకు మించిన భారంగా తయారైన ట్రాక్టర్ నిర్వహణను ప్రభుత్వమే భరించాలి. – ఉప్పుల రాధమ్మ, గోలిరామయ్యపల్లె సర్పంచ్, రామడుగు (చదవండి: రెండు రోజుల్లో స్వగ్రామాలకు దుబాయ్ బాధితులు ) -
కరెంటు బిల్లులపై ‘ట్రూఅప్’ చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి ‘ట్రూఅప్’ చార్జీలను వసూలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (టీఎస్ఎన్పీడీసీఎల్/ టీఎస్ఎస్పీడీసీఎల్) రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి విజ్ఞప్తి చేశాయి. 2006–07 నుంచి 2020–21 మధ్య చేసిన విద్యుత్ సరఫరా, వసూలైన బిల్లుల్లో తేడాలకు సంబంధించి రూ.4,092 కోట్ల లోటు ఉందని.. ఈ మేరకు ట్రూఅప్ చార్జీల వసూలుకు ఓకే చెప్పాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించాయి. వచ్చే నెల 8 దాకా అభ్యంతరాలకు గడువు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసే ఎస్పీడీసీఎల్ రూ.3,259 కోట్ల మేర ట్రూఅప్ చార్జీల వసూలుకు అనుమతి కోరగా.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు విద్యుత్ సరఫరా చేసే ఎన్పీడీసీఎల్ మరో రూ.833.23 కోట్ల ట్రూఅప్ చార్జీల వసూలు కోసం ప్రతిపాదన సమర్పించింది. సెప్టెంబర్ 8వ తేదీలోగా ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు, సలహాలు, సూచనలను తెలపాలని రెండు డిస్కంలు గురువారం బహిరంగ ప్రకటన విడుదల చేశాయి. ఆయా అభ్యంతరాలకు రాతపూర్వకంగా వివరణ ఇస్తాయి. తర్వాత ఈఆర్సీ బహిరంగ విచారణ జరిపి మరోసారి అభిప్రాయ సేకరణ చేస్తుంది. అనంతరం ప్రతిపాదిత ట్రూఅప్ చార్జీల్లో ఎంతమేర వసూలు చేయాలి? ఎలా వసూలు చేయాలన్న అంశాలను నిర్ణయిస్తూ ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ మేరకు డిస్కంలు చార్జీలను వసూలు చేసుకుంటాయి. డిస్ట్రిబ్యూషన్ ట్రూఅప్ చార్జీలు అంటే? విద్యుత్ కొనుగోళ్ల వ్యయం కాకుండా.. వినియోగదారులకు విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అయ్యే అన్ని రకాల వ్యయాలను కలిపి డిస్ట్రిబ్యూషన్ వ్యయం అంటారు. ఇందులో డిస్ట్రిబ్యూషన్ లైన్లు, సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల నిర్వహణ, సిబ్బంది జీతాలు (ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ చార్జీలు), ఆదాయంపై పన్నులు, తరుగుదల, మూలధనంపై రాబడి, ఇతర ఖర్చులు వంటివి ఉంటాయి. ముందస్తుగా డిస్ట్రిబ్యూషన్ వ్యయ అంచనాలను ఈఆర్సీ ఆమోదిస్తుంది. దానికి తగినట్టుగా బిల్లుల వసూలుకు అనుమతి ఇస్తుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంచనాల కంటే డిస్ట్రిబ్యూషన్ వ్యయం పెరిగితే.. ఆ మేరకు ట్రూఅప్ చార్జీల రూపంలో వసూలు చేసుకోవచ్చు. ఒకవేళ వ్యయం తగ్గితే వినియోగదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఉదయ్ అమలు కాకపోవడంతో.. డిస్కంల ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉదయ్ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం చేరింది. ఈ పథకం కింద డిస్కంలకు సంబంధించిన రూ.8,200 కోట్ల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గతంలో ఒప్పందం జరిగింది. ఉదయ్ అమలుతో 2017–18, 2018–19లలో డిస్కంలకు రూ.2,233 కోట్లు ఆదా అవుతాయని ఈఆర్సీ అంచనా వేసింది. కానీ ఉదయ్ పథకం ఫలితాలు అందకపోవడంతో.. ఈ భారం ట్రూఅప్ చార్జీల రూపంలో వినియోగదారులపైనే పడనుంది. రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీలు కూడా.. ఈఆర్సీ ముందుగా ఆమోదించిన విద్యుత్ కొనుగోళ్ల వ్యయం, వాస్తవంగా జరిగిన వ్యయం మధ్య వ్యత్యాసాన్ని.. రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీల పేరుతో డిస్కంలు వసూలు చేసుకోవచ్చు. గత 8 ఏళ్ల రిటైల్ సప్లై ఆదాయ లోటు రూ.38 వేల కోట్ల వరకు ఉంటుందని డిస్కంలు పేర్కొంటున్నాయి. ఈ రిటైల్ సప్లై ట్రూఅప్ చార్జీల వసూలు కోసం డిస్కంలు ఈఆర్సీకి ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంది. ఇది అమల్లోకి వస్తే మరింత భారమనే అంచనాలు ఉన్నాయి. -
‘కాళేశ్వరం’ విద్యుత్ బకాయిలు 3,114 కోట్లు!
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల పథకం విద్యుత్ బిల్లులు ప్రభుత్వానికి భారంగా మారుతున్నాయి. మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 140 టీఎంసీల నీటిని తరలించగా మొత్తం రూ. రూ. 3,600 కోట్ల విద్యుత్ బిల్లులు వచ్చాయి. అయితే బిల్లులను ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఇప్పటివరకు జరిపిన చెల్లింపులు పోగా ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్)కు రూ. 2,575.58 కోట్లు, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)కు రూ. 538.51 కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఈ రెండు సంస్థలకు చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ. 3,114.09 కోట్లకు చేరుకున్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రెండు డిస్కంలు నీటిపారుదల శాఖకు తాజాగా లేఖలు రాశాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకమ్మసాగర్లకు నీళ్లను ఎత్తిపోయడానికి మూడేళ్లలో మొత్తం రూ.866.21 కోట్ల విద్యుత్ బిల్లులు రాగా, రూ. 327 కోట్లను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఒక టీఎంసీ నీటి తరలింపునకు రూ. 25.71 కోట్ల మేర విద్యుత్ చార్జీల వ్యయమైంది. అలాగే ఎకరం సాగుకు విద్యుత్ బిల్లుల రూపంలో రూ. 21,810 ఖర్చయింది. భవిష్యత్‌లో మరింత భారం... కాళేశ్వరం ఎత్తిపోతల కింద నెలకొల్పిన 19 పంపు స్టేషన్లలోని 82 మోటర్ల వినియోగానికి 4,627 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతుందని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. అంటే కనీసం 13,558 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం ఉంటుందని భావించింది. ఈ లెక్కన ఒక్కో యూనిట్‌కు రూ. 6.30 ల చొప్పున (పెరిగిన విద్యుత్ చార్జీలు కాకుండా) మొత్తం సంవత్సరానికి రూ. 8,541.54 కోట్లు ఖర్చవుతుందని అంచనా. మొత్తం 20 లిఫ్టులు ఈ ప్రాజెక్టుకు చెందిన లింకు ప్యాకేజీల్లో భాగం. కానీ ఇందులో 8 చోట్ల వినియోగించిన మోటారు పంపులకు మూడేళ్లలోనే రూ. 3,060 కోట్ల విద్యుత్ వినియోగం జరిగింది. ఇక పూర్తిస్థాయిలో అన్ని పంపుస్టేషన్‌లలో మోటారు పంపులను వినియోగిస్తే మరింత విద్యుత్ భారం పెరుగుతుందని ఇరిగేషన్, విద్యుత్తు శాఖల అధికారులు చెబుతున్నారు. పెరిగిన విద్యుత్ వ్యయం... ఈ ప్రాజెక్టుకు మొదట విద్యుత్ చార్జీలు యూనిట్‌కు వ్యయం రూ. 5.80 ఉంటే దానిని రూ. 6.30 పైసలకు పెంచారు. ఫిక్స్డ్ చార్జీలు కిలోవాట్‌కు రూ. 165 ఉంటే దానిని రూ. 275కి పెంచారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండేళ్లలో 99 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. 2019–20లో 66 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా 1906.59 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది. దీనికి గాను ఒక యూనిట్‌కు రూ.5.80 చొప్పున 1105.82 కోట్ల ఖర్చయింది. 2020–21లో 33 టీఎంసీల నీటిని తరలించగా 1,697.88 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. పెరిగిన చార్జీల ప్రకారం రూ. 984.77 కోట్ల విద్యుత్ బిల్లు వచ్చింది. ఈ ఏడాది ఆగస్టు 5 వరకు మూడేళ్లలో ఎత్తిపోసిన మొత్తం 140 టీఎంసీలకు రూ. 3,600 కోట్ల విద్యుత్ వినియోగం జరగ్గా రూ. 2,575.58 కోట్ల మేరకు బకాయిలు ఉన్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. -
అర్ధరాత్రి కరెంట్ కట్ చేస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘విద్యుత్ బిల్లులు చెల్లించాలి, లేకుంటే రాత్రిపూట విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తామని’ పేర్కొంటూ వినియోగదారులకు కొందరు వ్యక్తులు ఎస్ఎంఎస్లు/ఫోన్ కాల్స్ చేస్తున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎస్పీడీసీఎల్) సీఎండీ జి.రఘుమారెడ్డి హెచ్చరించారు. అలాంటి వారిని నమ్మి బ్యాంకు ఖాతా వివరాలు, డిబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల సమాచారం, ఓటీపీలను తెలపవద్దని ఆయన మంగళవారం ఓ ప్రకటనలో కోరారు. ఎవరైనా ఈ సమాచారం అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. వినియోగదారుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా సైబర్ మోసగాళ్లు వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులను డ్రా చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు/ చెల్లింపుల కోసం తమ సిబ్బంది వినియోగదారుల బ్యాంకు అకౌంట్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల వివరాలు అడగరని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించిన రసీదు మాత్రమే అడుగుతారని, బిల్లు చెల్లింపులు జరపడానికి ఎలాంటి వెబ్సైట్ లింకులను ఎస్ఎంఎస్ ద్వారా తాము పంపమని స్పష్టం చేశారు. బిల్లు చెల్లించినా, విద్యుత్ బిల్లు పెండింగ్ ఉందని ఎవరైనా వ్యక్తులు ఫోన్/మెసేజ్ చేస్తే.. బిల్లుల చెల్లింపు వివరాలను సంస్థ వెబ్ సైట్ www. tssouthernpower. com లేదా టీఎస్ఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో చెక్‌చేసుకోవచ్చని సూచించారు. ఏమైనా తేడాలుంటే ఆన్లైన్ ద్వారా సంస్థను లేదా సంబంధిత సెక్షన్ ఆఫీసర్(అఉ)ని సంప్రదించి సరిచూసుకోవాలని కోరారు. -
19 ఏళ్ల క్రితంనాటి బిల్లు కట్టాల్సిందే!
యాదగిరిగుట్ట: వారు 19 ఏళ్ల క్రితం ఓ ఇల్లు కొనుగోలు చేశారు. పాత యజమాని పేరిట ఉన్న విద్యుత్ మీటర్ తొలగించి కొత్త మీటర్ బిగించుకున్నారు. అప్పటి నుంచి నెలనెలా బిల్లులు చెల్లిస్తున్నారు. అయితే, పాత యజమాని పేరిట ఉన్న రూ.10 వేల బకాయి కట్టాలంటూ ఇప్పుడు విద్యుత్ అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. బిల్లు చెల్లించలేదని తాజాగా కరెంటు కనెక్షన్ కూడా తొలగించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం దాతారుపల్లిలో చోటుచేసుకుంది. బాధితుల తెలిపిన వివరాల ప్రకారం... 19 ఏళ్ల క్రితం దాతారుపల్లిలో జయిని నాగరాజుకు చెందిన ఇంటిని రాంపల్లి సక్కుబాయి కొనుగోలు చేశారు. అప్పట్లోనే పాత విద్యుత్ మీటర్ తొలగించి, సక్కుబాయి కుటుంబసభ్యుల పేరుతో కొత్త మీటర్ తీసుకున్నారు. అప్పటి నుంచి కరెంట్ బిల్లు రూ.500 కంటే తక్కువగానే వస్తోంది. కానీ, గత నెలలో విద్యుత్ అధికారులు వచ్చి గతంలో ఉన్న ఈ ఇంటి యజమాని పేరుతో బకాయి బిల్లు రూ.10 వేలు వచ్చింది, ఆ బిల్లు ఇప్పుడు కట్టాలని చెప్పారు. ఈ క్రమంలోనే గత నెల బిల్లు సక్కుబాయి కుటుంబసభ్యులు కట్టలేదు. దీంతో గురువారం విద్యుత్ అధికారులు దాతారుపల్లిలోని సక్కుబాయి ఇంటికి వెళ్లి ఈ నెల ఇంటి బిల్లుతోపాటు బకాయి ఉన్న బిల్లు కట్టాలని, లేకుంటే కరెంట్ కట్ చేస్తామంటూ కనెక్షన్ తొలగించారు. ఇదెక్కడి అన్యాయం.. తాము ఇల్లు కొనుగోలు చేసి 19 ఏళ్లు అయింది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పాత బకాయి ఉందని విద్యుత్ అధికారులు చెప్పలేదని సక్కుబాయి ఆవేదన వ్యక్తం చేసింది. కానీ, ఇప్పుడు ఈ విధంగా విద్యుత్ కనెక్షన్ తొలగించడమేమిటని ఆందోళన వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. -
Telangana: బిల్లులు చూస్తే.. ఫ్యూజులు అవుట్!
100 యూనిట్లలోపు విద్యుత్ వాడిన ఓ నిరుపేదకు బిల్లుల్లో వచ్చిన తేడా ఇలా.. చార్జీలు పెరగక ముందు.. నగరంలోని ఎంఎస్ మక్తా మురికివాడలో రెండు గదుల ఇంట్లో ఉండే ఓ నిరుపేద కుటుంబం గత మార్చిలో 83 యూనిట్ల విద్యుత్ వినియోగించింది. ఇంధన చార్జీలు రూ.152.55, కస్టమర్ చార్జీలు రూ.30, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.4.98 కలిపి బిల్లు రూ.188 వచ్చింది. చార్జీలు పెరిగిన తర్వాత... ఏప్రిల్‌లో ఆ కుటుంబం 89 యూనిట్ల విద్యుత్ వినియోగించింది. మార్చి కంటే కేవలం 6 యూనిట్లే ఎక్కువగా వాడినా ఇంధన చార్జీలు రూ.224.15, కస్ట మర్ చార్జీలు రూ.70, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.5.34, టారిఫ్ డిఫరెన్స్ (ఏప్రిల్‌లో పాత చార్జీలు వసూలు చేసిన రోజులకు సంబంధించిన మొత్తం) రూ.23.30 తోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిక్స్డ్ చార్జీలు రూ.10.. మొత్తం కలిపి (సెక్యూరిటీ డిపాజిట్‌పై వడ్డీ మినహాయించగా) రూ.307 బిల్లు వచ్చింది. అంటే మార్చితో పోలిస్తే బిల్లు 63.29 శాతం పెరిగింది. సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మోత, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడిపోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు.. ప్రస్తుత మే నెలలో విద్యుత్ బిల్లులు భారీ షాక్ ఇచ్చాయి. ఒక్కసారిగా భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులను చూసి గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో గత ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి రాగా, ఏప్రిల్ నెల వాడకానికి సంబంధించిన బిల్లులను ప్రస్తుత మే నెలలో జారీ చేస్తున్నారు. దీంతో విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం వినియోగదారులకు తెలుస్తోంది. ప్రధానంగా తక్కువ విద్యుత్ వినియోగించే పేద, మధ్య తరగతి ప్రజలపైనే అత్యధిక భారం పడింది. నెలకు 50 యూనిట్లు, 100 యూనిట్లు, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వినియోగదారులకు విద్యుత్ బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయి. 200 యూనిట్లు, ఆపై విద్యుత్ వినియోగించే ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల విద్యుత్ బిల్లులూ పెరిగినా, పెరుగుదల శాతం 15–10 శాతం లోపు మాత్రమే కనిపిస్తోంది. కస్టమర్, ఫిక్స్డ్ చార్జీలతో తడిసి మోపెడు 2022–23లో 14 శాతం విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదారులపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.5,596 కోట్ల అదనపు భారం వేసేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ).. ఉత్తర/దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్/టీఎస్ఎస్పీడీసీఎల్)లకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఎల్టీ కేటగిరీలోని గృహ వినియోగంపై యూనిట్‌కు 10–50 పైసలు చొప్పున, ఎల్టీ కేటగిరీలోని గృహేతర వినియోగంతో పాటు హెచ్‌టీ కేటగిరీలోని అన్ని రకాల వినియోగంపై యూనిట్‌కు రూ.1 చొప్పున విద్యుత్ చార్జీలు పెరిగాయి. గృహ కేటగిరీలో ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకు మారితే తొలి ఉప కేటగిరీకి యూనిట్‌కు 10 పైసలు చొప్పున, మిగిలిన అన్ని ఉప కేటగిరీలకు 50 పైసలు చొప్పున చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీల భారీ పెంపునకు తోడుగా కస్టమర్ చార్జీలూ పెంచడం, గృహాలపై తొలిసారిగా ఫిక్స్డ్ చార్జీలు విధించడంతో మే నెల విద్యుత్ బిల్లులు తడిసి మోపెడయ్యాయి. ఊరట కలిగిస్తున్న ఈఆర్సీ నిర్ణయం: గతంలో టెలిస్కోపిక్ విధానంలో విద్యుత్ చార్జీలు ఉండేవి. ఒక శ్లాబు నుంచి ఇంకో శ్లాబుకి మారినా ప్రభావం ఉండేది కాదు. అయితే గత ఏడేళ్ల నుంచి నాన్ టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఒక్క యూనిట్ పెరిగి శ్లాబు మారినా బిల్లు వందల్లో పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చార్జీల పెంపు సందర్భంగా ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. గృహ కేటగిరీలోని అన్ని శ్లాబుల్లోని ఉప కేటగిరీలకు 50 పైసలు చొప్పున చార్జీలు పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనలను పక్కన పెట్టి..ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకి మారితే తొలి ఉప కేటగిరీకి యూనిట్‌కు 10 పైసలు చొప్పున మాత్రమే పెంచాలని ఈఆర్సీ నిర్ణయించి వినియోగదారులకు కొంత మేలు చేసింది. ఉదాహరణకు 106 యూనిట్లు వాడితే తొలి 100 యూనిట్లకు 10 పైసలు చొప్పున చార్జీల పెంపు వర్తింపజేస్తున్నారు. మిగిలిన 6 యూనిట్లకు మాత్రం యూనిట్‌కు 50 పైసలు చొప్పున చార్జీలు పెంచి బిల్లులు వేస్తున్నారు. ఇలా శ్లాబు మారినా వినియోగదారులకు భారం కొంత తప్పింది. 200 యూనిట్లలోపు వాడకం విద్యుత్ చార్జీలు పెరగక ముందు.. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం గత మార్చిలో 123 యూనిట్ల విద్యుత్ వాడగా, ఇంధన చార్జీలు రూ.418.90, కస్టమర్ చార్జీలు రూ.50, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.7.38 కలిపి మొత్తం రూ.476 విద్యుత్ బిల్లు వచ్చింది. చార్జీలు పెరిగిన తర్వాత... ఏప్రిల్‌లో 127 యూనిట్ల విద్యుత్ వాడగా, ఎనర్జీ చార్జీలు రూ.469.60, ఫిక్స్డ్ చార్జీలు రూ.22.60, కస్టమర్ చార్జీలు రూ.90, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.7.62, అదనపు చార్జీలు రూ.25, టారిఫ్ డిఫరెన్స్ రూ.10.33 కలిపి మొత్తం (సెక్యూరిటీ డిపాజిట్‌పై వడ్డీ మినహాయించగా) రూ.622కు బిల్లు ఎగబాకింది. అంటే వాడకం దాదాపుగా అంతే ఉన్నా విద్యుత్ బిల్లు మాత్రం 30.67 శాతం పెరగడం గమనార్హం. దెబ్బ మీద దెబ్బ వేసవిలో పెరిగిన విద్యుత్ వినియోగానికి విద్యుత్ చార్జీల పెంపు తోడు కావడంతో దెబ్బపై దెబ్బ పడినట్టు అయ్యింది. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో ఎండల తీవ్రత పెరగడంతో గృహాల్లో విద్యుత్ వాడకం బాగా పెరిగిపోయింది. మధురానగర్‌కు చెందిన ఎస్.ప్రభాకర్ మార్చి నెలలో 96 యూనిట్లు వాడగా, ఏప్రిల్ తొలివారంలో రూ.226 బిల్లు వచ్చింది. ఏప్రిల్‌లో ఆయన 128 యూనిట్లు వినియోగించగా, మే తొలివారంలో రూ.604 బిల్లు వచ్చింది. కేవలం 32 యూనిట్లు అధికంగా వాడగా బిల్లు రెండింతలకు మించిపోవడం గమనార్హం. భారంగా కుటుంబ పోషణ వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలయ్య స్థానికంగా ఓ దుకాణంలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.10 వేలు సంపాదిస్తూ అతికష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రతి నెల 50–100 యూనిట్ల లోపు విద్యుత్ మాత్రమే వాడే ఆయనకు గతంలో రూ.100–130 లోపు విద్యుత్ బిల్లు వచ్చేది. మే నెలలో మాత్రం దాదాపుగా రెండింతలై రూ.265కు పెరిగిపోయింది. అసలే నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బంది పడుతుంటే, తాజాగా విద్యుత్ బిల్లులు పెరిగిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని బాలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
టైమ్‌సెన్స్ లేక నెలకు కోటి రూపాయల భారం!
సాక్షి, కూకట్పల్లి: వీధి దీపాల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా జీహెచ్ఎంసీ విద్యుత్ బిల్లుల భారం అధికమవుతోంది. కాలానుగుణంగా వీధి దీపాల టైమర్లను మారుస్తూ ఉండాలి. కానీ అలా చేయకపోవడంతో వేసవిలో ఉదయం..సాయంత్రం వేళల్లో దాదాపు గంటన్నరపాటు అదనంగా వీధి దీపాలు వెలుగుతున్నాయి. ఈ కారణంగా జీహెచ్ఎంసీ ఖజానాకు దాదాపు నెలకు రూ.కోటి రూపాయల భారం పడుతోంది. ఏం చేయాలంటే... ప్రతి రోజు 12 గంటల పాటు వీధి దీపాల కోసం టైమర్లను సెట్ చేసి విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అయితే..వేసవి కాలంలో 7 గంటలకు చీకటి పడుతుంది. ఉదయం పూట 5.30 గంటలకే తెల్లవారుతుంది. మామూలు రోజుల్లో సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 వరకు లైట్లు వెలుగుతుంటాయి. కానీ వేసవిలో సాయంత్రం 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5.30 వరకు మాత్రమే లైట్లు వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా టైమర్లలో మార్పులు చేస్తే దాదాపు గంటన్నరపాటు విద్యుత్ ఆదా అవుతుంది. లెక్క ఇలా.. వీధి దీపాలపై మామూలుగా రోజుకు లక్ష రూపాయల వరకు ఒక్కో సర్కిల్‌కు బిల్లు వస్తుంది. 12 గంటలకు లక్ష రూపాయల బిల్లు వస్తే..గంటన్నరకు సుమారు రూ.12,500 అవుతుంది. ఈ విధంగా నెలకు సుమారు 3 లక్షల 75 వేల రూపాయలు ఒక్కో సర్కిల్లో విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవచ్చు. ఈ విధంగా 30 సర్కిళ్లకు సుమారు కోటి రూపాయలకు పైగా అదనంగా బిల్లు వస్తోంది. వేసవి రెండు నెలలు టైమర్లను సెట్ చేస్తే కనీసం రూ.2 కోట్ల రూపాయలైనా జీహెచ్ఎంసీకి ఆదాయం మిగులుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. (చదవండి: హరితహారం లక్ష్యం 19.5 కోట్ల మొక్కలు) -
నెల తక్కువ.. మోత ఎక్కువ!
హైదరాబాద్‌లోని నవీన్‌నగర్‌కు చెందిన ప్రసాదరావు ఫిబ్రవరిలో 219 యూనిట్ల విద్యుత్ వాడితే రూ.894 బిల్లు వచ్చింది. మార్చిలో 178 యూనిట్లనే వాడినా బిల్లు ఏకంగా రూ.969 వచ్చింది. తక్కువ విద్యుత్ వాడితే బిల్లు తక్కువ రావాలి కానీ ఎందుకు పెరిగిందని అనుకుంటున్నారా? ఫిబ్రవరిలో 31 రోజులకు మీటర్ రీడింగ్ తీసి బిల్లేశారు. మార్చిలో నెల పూర్తవకముందే 27 రోజులకే రీడింగ్ తీసి బిల్లు ఇచ్చారు. 27 రోజుల్లో 178 యూనిట్లు వాడగా 31 రోజులకు 204 యూనిట్లు వాడతారని అంచనా వేసి 200 యూనిట్లకు పైగా వినియోగానికి సంబంధించిన శ్లాబును వర్తింపజేశారు. ఈ శ్లాబు కింద.. తొలి 200 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.5 చొప్పున, తర్వాత 201 నుంచి 300 యూనిట్ల వినియోగానికి యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీలు వర్తిస్తాయి. 204 యూనిట్లు వాడినట్టు అంచనా వేసినందున తొలి 200 యూనిట్లకు ఓ రేటు.. మిగిన 4 యూనిట్లకు మరో రేటు వర్తించనుంది. ఈ లెక్కన అసలు వాడిన 178 యూనిట్లలో 174 యూనిట్లకు యూనిట్‌కు రూ.5 చొప్పున, మిగిలిన 4 యూనిట్లకు యూనిట్‌కు రూ.7.20 చొప్పున చార్జీ విధించారు. ఈ దెబ్బకు చార్జీ రూ.898 (174్ఠ5 + 4్ఠ7.20) కు పెరిగింది. రూ.60 కస్టమర్ చార్జీలు, రూ.10 ఈడీ కలిపి బిల్లు రూ.969కు పెరిగింది. నెల కాకముందే బిల్లులు జారీ చేసి వినియోగదారులకు డిస్కంలు ఎలా టోపీ పెడుతున్నాయో ఈ కేసుతో అర్థమవుతుంది. సాక్షి, హైదరాబాద్: డిస్కంల తప్పు వల్ల వినియోగదారులకు విద్యుత్ బిల్లుల మోత మోగుతోంది. కొందరికి నెల పూర్తికాకముందే బిల్లులు జారీ చేస్తూ సగటున నెల వినియోగాన్ని అంచనా వేసి శ్లాబును మారుస్తుండటంతో బిల్లులు పెరిగి వినియోగదారులు లబోదిబోమంటున్నారు. తప్పు డిస్కంలదైనా మూల్యం మాత్రం వినియోగదారులు చెల్లిస్తున్నారు. ఇలా ఈఆర్సీ టారిఫ్ ఆర్డర్‌కు విరుద్ధంగా శ్లాబుల మార్పు అక్రమమని నిపుణులు తప్పుబడుతున్నారు. ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని.. నిబంధనల ప్రకారం నెల రోజులకు మీటర్ రీడింగ్ తీసి బిల్లులు జారీ చేయాలి. కానీ ఆచరణలో ఇది సాధ్యమవట్లేదు. నెల దాటాక కానీ, లేదా నెల పూర్తికాక ముందే బిల్లులు జారీ చేస్తున్నారు. నెల గడిచాక బిల్లులు జారీ చేస్తే వినియోగం పెరిగి బిల్లు శ్లాబులు మారిపోతున్నాయి. దీంతో బిల్లులు బాగా పెరుగుతున్నాయని గతంలో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో నెల సగటు వినియోగాన్ని అంచనా వేసి సంబంధిత శ్లాబు కిందే బిల్లులు జారీ చేయాలని డిస్కంలను ఈఆర్సీ ఆదేశించింది. దీన్ని అడ్డుగా పెట్టుకుని రివర్స్‌లో సైతం డిస్కంలు అమలు చేస్తున్నాయి. నెల పూర్తికాకుండానే జారీ చేసే బిల్లుల శ్లాబులను మార్చి అధిక బిల్లులు జారీ చేస్తున్నాయి. సకాలంలో మీటర్ రీడింగ్ తీయకపోవడం డిస్కంల పొరపాటైనా వినియోగదారులు భారీగా బిల్లు కట్టాల్సి వస్తోంది. ఎంత వాడితే ఆ స్థాయి శ్లాబే ఉండాలి విద్యుత్ నియంత్రణ మండలి జారీ చేసిన రిటైల్ సప్లై టారిఫ్ ఆర్డర్‌కు కట్టుబడి డిస్కంలు బిల్లులు జారీ చేయాలి. నెల గడవక ముందే జారీ చేసే బిల్లుల విషయంలో దీన్ని ఉల్లంఘిస్తున్నాయని విద్యుత్ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. టారిఫ్ ఆర్డర్ ప్రకారం ఎంత విద్యుత్ వాడితే అందుకు సంబంధించిన శ్లాబునే వర్తింపజేయాలి. నెల కాకముందే రీడింగ్ తీసి వినియోగాన్ని ఊహాజనితంగా అంచనా వేసి ఎక్కువ చార్జీలున్న శ్లాబును వర్తింపజేయడం అక్రమమని నిపుణులు అంటున్నారు. ఆటోమెటిక్‌గా శ్లాబులు మార్చి అధిక బిల్లులు జారీ చేసేలా మీటర్ రీడింగ్ యంత్రాల్లోని సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయడం గమనార్హం. దీనిపై ఈఆర్సీ పరిశీలన జరపాలని నిపుణులు కోరుతున్నారు. శ్లాబులు మార్చడం అక్రమమే నెల దాటాక రీడింగ్ తీసి బిల్లులు జారీ చేస్తే శ్లాబులు మారి బిల్లులు పెరుగుతున్నాయని గతంలో ఈఆర్సీని ఆశ్రయించాం. నెల దాటాక మీటర్ రీడింగ్ తీస్తే నెల రోజుల వినియోగాన్ని అంచనా వేసి శ్లాబును వర్తింపజేయాలని నాడు డిస్కంలకు ఈఆర్సీ ఆదేశించింది. నెల నిండక ముందే జారీ చేసే బిల్లులకూ డిస్కంలు ఈ ఉత్తర్వులను అక్రమంగా వర్తింపజేసి దోచుకుంటున్నాయి. వాడకాన్ని తగ్గించుకున్నా ఈ విధానం వల్ల ప్రయోజనం ఉండట్లేదు. దీన్ని డిస్కంలు ఆపకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇప్పటివరకు అధికంగా వసూలు చేసిన రూ. వందల కోట్ల బిల్లులను వినియోగదారులకు తిరిగివ్వాలి. –డి.నర్సింహారెడ్డి, విద్యుత్ రంగం నిపుణుడు వచ్చే నెల బిల్లుల్లో డబుల్ మోత ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి రానుండటంతో ఏప్రిల్ వినియోగానికి సంబంధించి వచ్చే మే నెలలో జారీ చేసే బిల్లులు భగ్గుమని మండబోతున్నాయి. ఈ పరిస్థితిలో నెల తిరగకుండానే మీటర్ రీడింగ్ తీసి తర్వాత శ్లాబునులను మార్చి బిల్లులు జారీ చేస్తే వినియోగదా రులపై డబుల్ భారం పడనుంది. -
‘టెలిస్కోపిక్’తో తక్కువ బిల్లులు
సాక్షి, అమరావతి: టెలిస్కోపిక్ బిల్లింగ్ ద్వారా తక్కువ భారం పడుతుందని గృహ విద్యుత్ వినియోగదారులకు విస్తృత అవగాహన కల్పించాలని ఇంధన శాఖ కార్యదర్శి బి.శ్రీధర్ విద్యుత్ సంస్థలను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఆదివారం ఆయన వెబినార్ ద్వారా సమీక్షించారు. ఇంధన సంరక్షణ మిషన్ సీఈవో ఏ.చంద్రశేఖర్ రెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ ఐ.పృథ్వీతేజ్, డిస్కమ్‌ల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె.పద్మాజనార్దన్ రెడ్డి, కె.సంతోష్ రావు, డైరెక్టర్లు ఏవీకే భాస్కర్, కె.ముథుపాండియన్, జి.చంద్రశేఖరరాజు ఇందులో పాల్గొన్నారు. టెలిస్కోపిక్ బిల్లింగ్‌కు సంబంధించిన వివరాలతో కరపత్రాలను విద్యుత్తు బిల్లులతో వినియోగదారులకు అందజేయాలని ఇంధన శాఖ కార్యదర్శి సూచించారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. నూతన టెలిస్కోపిక్ విధానంతో వినియోగదారులకు మేలు జరుగుతుంది. దీనివల్ల మొత్తం వినియోగానికి ఒకే స్లాబ్‌లో బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 250 యూనిట్లు వాడితే తొలి 30 యూనిట్లకు యూనిట్ రూ.1.90 చొప్పున, తర్వాత 45 యూనిట్లకు యూనిట్ రూ.3, ఆ తర్వాత 50 యూనిట్లకు యూనిట్ రూ.4.50, అనంతరం 100 యూనిట్లకు యూనిట్ రూ.6, చివరి 25 యూనిట్లకు యూనిట్ రూ.8.75 చొప్పున బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడంతో పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా ప్రక్రియను బలోపేతం చేసేందుకు ఏపీఈఆర్సీ కొత్త విద్యుత్తు టారిఫ్ ప్రకటించింది. 1.91 కోట్ల మంది వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేయడంలో డిస్కమ్‌లకు ఊరట కల్పించేలా కొత్త టారిఫ్ ఉంది. రాష్ట్రంలో 100 యూనిట్లలోపు విద్యుత్తు వాడే వారికి యూనిట్ రూ.3.11 చార్జీ పడుతుంది. ఇతర పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. కర్ణాటక, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో 100 యూనిట్లలోపు వాడే వినియోగదారులు యూనిట్ రూ.8.26, రూ.8.33, రూ.7.74, రూ.7.20, రూ.6.19, రూ.6.61, రూ.6.10 చొప్పున చెల్లిస్తున్నారు. రాష్ట్రంలోని 1.50 కోట్ల మంది గృహ వినియోగదారుల్లో 1.44 కోట్ల (95%) మంది 225 యూనిట్లలోపు వినియోగించే కేటగిరీలోనే ఉన్నారు. 225 యూనిట్లలోపు వినియోగించే వారి నుంచి డిస్కంలు సగటు ధర కంటే తక్కువగానే చార్జీలు వసూలు చేస్తున్నాయి. మూడు డిస్కంలకు మొత్తం సర్వీసు చార్జీ రూ.6.82 నుంచి రూ.6.98కి పెరిగినా వినియోగదారుల నుంచి తక్కువగానే వసూలు చేస్తున్నాం. జిల్లాల విభజన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యుత్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. పట్టణీకరణతో విద్యుత్తు డిమాండ్ కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. (చదవండి: పోలీస్ ఉద్యోగాల కోసం... యువతకు ఉచిత శిక్షణ) -
పేదింటికి పెద్ద షాక్..
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా పొంచి ఉన్న విద్యుత్ చార్జీల బాంబు ఒక్కసారిగా పేలింది. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలపై బాదుడుకు రంగం సిద్ధమైంది. అయితే ఇతర వర్గాలతో పోల్చుకుంటే పేదలపైనే అధిక భారం పడనుంది. గృహాలు, వాణిజ్యం, పరిశ్రమలు.. ఇలా అన్ని రంగాల విద్యుత్ చార్జీలు వచ్చే నెల నుంచే పెరగనుండగా, మే నుంచి బిల్లులు షాక్ కొట్టబోతున్నాయి. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.5,596 కోట్ల అదనపు భారం వినియోగదారులపై పడనుంది. ఈ మేరకు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ రిటైల్ సప్లై టారిఫ్ ను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్ఈఆర్సీ) చైర్మన్ తన్నీరు శ్రీరంగారావు..సభ్యులు ఎండీ మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యతో కల సి బుధవారం ప్రకటించారు. 18 శాతం విద్యుత్ చార్జీల పెంపునకు ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యు త్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్, టీఎస్ ఎస్పీడీసీఎల్)లతో పాటు సిరిసిల్ల కోఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లై సొసైటీ అనుమతి కోరగా, 14% పెంచుకోవడానికి అనుమతిచ్చినట్టు విలేకరులకు వెల్లడించారు. ఎల్టీ కేటగిరీలోని గృహ వినియోగంపై యూనిట్‌కు 10–50 పైసలు చొప్పున, ఎల్టీ కేటగిరీలోని గృహేతర వినియోగంతో పాటు హెచ్‌టీ కేటగిరీలోని అన్ని రకాల వినియోగంపై యూనిట్‌కు రూ.1 చొప్పున చార్జీలు పెరగనున్నాయి. గృహ కేటగిరీలో ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకు మారిన వెంటనే ఉండే తదుపరి ఉప కేటగిరీకి యూనిట్‌కు 10 పైసలు చొప్పున, మిగిలిన అన్ని ఉప కేటగిరీలకు 50 పైసలు చొప్పున చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతిచ్చింది. చార్జీలకు తోడుగా డిమాండ్ చార్జీలు, కస్టమర్ చార్జీలు సైతం పెరగనుండడంతో వచ్చే నెల నుంచి విద్యుత్ చార్జీలు తడిసిమోపెడు కానున్నాయి. పేదలకు కరెంటు వాత ఇలా గృహ కేటగిరీలోని అన్ని శ్లాబుల విద్యుత్ చార్జీలను యూని ట్‌కు 10–50 పైసలు చొప్పున పెంచాలని నిర్ణయించడంతో తక్కువ విద్యుత్ వినియోగించే పేద, మధ్య తరగతి ప్రజలపైనే అత్యధిక భారం పడబోతోంది. నెలకు 50 యూనిట్లు, 100 యూనిట్లు, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వినియోగదారులకు విద్యుత్ బిల్లులు చుక్కలు చూపించబోతున్నాయి. ఉదాహరణకు.. ఒకే గదిలో నివాసముండే పేద కుటుంబానికి చెందిన శ్రీనివాస్ నెలకు 50 యూనిట్లలోపు విద్యుత్ వాడుతుండగా, ఇప్పటివరకు నెలకు గరిష్టంగా రూ.97.5కు మించి బిల్లు ఎప్పుడూ రాలేదు. విద్యుత్ తో పాటు కస్టమర్ చార్జీలను సైతం పెంచడం, గృహాలపై కొత్తగా ప్రతి కిలోవాట్ లోడ్‌కు రూ.10 చొప్పున డిమాండ్ చార్జీలు విధించడంతో ఇకపై ఆయనకు రూ.147.5 బిల్లు (50% పైగా) రానుంది. అయితే 200 యూనిట్లు, ఆపై విద్యుత్ వినియోగించే ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాలపై భారం తక్కువగా పడనుంది. వీరికి 10% లోపే బిల్లులు పెరగనున్నాయి. ఎవరిపై ఎంత భారం: తెలంగాణ వచ్చాక తొలిసారిగా 2015–16లో, తర్వాత 2016–17లో విద్యుత్ చార్జీలు పెంచారు. మళ్లీ ఐదేళ్ల గ్యాప్ తర్వాత 2022–23లో చార్జీలు పెరగబోతున్నాయి. కొత్త చార్జీలు అమల్లోకి వస్తే ఏటా.. ఎల్టీ విభాగంలోని 1.10 కోట్ల గృహాలు, 44 లక్షల గృహేతర కేటగిరీల వినియోగదారులపై సుమారు రూ.2 వేల కోట్లు, హెచ్‌టీ విభాగంలోని అన్ని కేటగిరీలు కలిపి 13,717 మంది వినియోగదారులపై రూ.3,500 కోట్ల అదనపు భారం పడనుంది. రూ.8,221.17 కోట్లకు పెరిగిన సబ్సిడీ రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు 2022–23లో నిరంతర విద్యుత్ సరఫరా చేసేం దుకు రూ.53,054 కోట్ల వ్యయం కానుందని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ప్రతిపాదించగా, వ్యయాన్ని రూ.48,708 కోట్లకు తగ్గించి ఆమోదించినట్టు ఈఆర్సీ చైర్మన్ తెలిపారు. రూ. 16,580 కోట్ల ఆదాయ లోటు ఉండనుందని డిస్కంలు అంచనా వేయగా, రూ.14,237 కోట్లకు తగ్గించి ఈఆర్సీ ఆమోదించింది. వినియోగదారులపై భారం పెరగకుండా విద్యుత్ సబ్సిడీలను రూ.5,940 కోట్ల నుంచి రూ.8,221.17 కోట్లకు పెంచాలని ఈఆర్సీ కోరడంతో ప్రభుత్వం అంగీకరించింది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫ రాకు రూ.6,754.64 కోట్లు, గృహాలకు రాయితీపై విద్యుత్ సరఫరాకు రూ.1,466.53 కోట్లను సబ్సిడీ గా ప్రభుత్వం చెల్లించనుంది. గతంతో పోల్చితే ప్రభుత్వ సబ్సిడీలు 38.39శాతం పెరిగాయి. సబ్సి డీలను సర్దుబాటు చేయగా, మిగలనున్న రూ. 6,016 కోట్ల ఆదాయ లోటు భర్తీ చేసుకోవడానికి గాను విద్యుత్ చార్జీల పెంపు ద్వారా వినియోగదా రులపై రూ.5,596 కోట్ల అదనపు భారం వేయడానికి ఈఆర్సీ అనుమతిచ్చింది. డిస్కంలు రూ. 6,831 కోట్ల మేర పెంపును ప్రతిపాదించగా, రూ. 1235 కోట్ల భారాన్ని తగ్గించి ఆమోదించినట్టు శ్రీరంగారావు వెల్లడించారు. యూనిట్ విద్యుత్ సరఫరా చేయడానికి 2018–19లో సగటున రూ. 6.04 వ్యయం కాగా, 2022–23లో ఇది రూ.7.03 కు పెరగనుందని ఈ ఆర్సీ అంచ నా వేసింది. పెరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్య యం, డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ చార్జీల దృష్ట్యా చార్జీల పెంపునకు అనుమతించినట్టు చైర్మన్ చెప్పారు. సెలూన్లు, కుటీర పరిశ్రమలకు మినహాయింపు: వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు ఎస్సీ, ఎస్టీల గృహాలకు నెలకు ఉచితం గా 101 యూనిట్లు వంటివి యధాతథంగా కొనసాగనున్నాయి. నాయి బ్రాహ్మణుల హెయిర్ సె లూన్లు, రజకుల లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు నెలకు ఉచితంగా 250 యూనిట్లు, పవర్ లూమ్స్, పౌల్ట్రీలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్‌పై రూ.2 చొప్పున సబ్సిడీ వంటి పథకాలు కూడా కొనసాగుతాయి. హెయిర్ సెలూన్లు, కుటీర పరిశ్రమలు, హార్టీకల్చర్ నర్సరీలు, కార్పొరేట్ వ్యవసాయం, ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ కేంద్రాలకు చార్జీల పెంపు నుంచి మినహాయింపు లభించింది. బకాయిలు చెల్లించాలని కోరతాం ఎత్తిపోతల పథకాలు, గ్రామ పంచాయతీలు, ము న్సిపాలిటీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబం ధించిన రూ.12,598 కోట్ల విద్యుత్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడి ఉండగా, ప్రైవేటు వ్యక్తు లు, సంస్థలు రూ.4,603.41 కోట్ల బిల్లులను బకా యిపడి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద బకాయిదారుగా ఉన్న విషయాన్ని విలేకరులు ఈఆర్సీ దృ ష్టికి తీసుకెళ్లగా.. బకాయిలను చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామని శ్రీరంగారావు తెలిపారు. ఫిక్స్డ్/డిమాండ్ చార్జీలు ఏమిటి? కిలోవాట్లలో వినియోగించే లోడ్ ఆధారంగా విద్యుత్ కనెక్షన్లను జారీ చేస్తారు. అంటే తక్కువ విద్యుత్ వాడే వారికి తక్కువ కిలోవాట్ల లోడ్ ఉంటుంది. అధిక విద్యుత్ వాడే వారికి అధిక కిలోవాట్ల లోడ్ ఉంటుంది. కిలోవాట్ లోడ్‌కు కొంత మొత్తం చొప్పున మొత్తం లోడ్‌కు ఫిక్స్డ్/డిమాండ్ చార్జీలు విధిస్తారు. ఈ చార్జీలు అదనం.. విద్యుత్ బిల్లులో ఎనర్జీ చార్జీ, డిమాండ్ చార్జీ, కస్టమర్ చార్జీలతో పాటు ఎలక్ట్రిసిటీ డ్యూటీ, అడిషనల్ చార్జీ (అనుమతించిన లోడ్‌కు మించి విద్యుత్ వినియోగిస్తే), మినిమమ్ చార్జీ, ఇంధన సర్దుబాటు చార్జీ (ఎఫ్ఎస్ఏ), రీకనెక్షన్ చార్జీ, కెపాసిటర్ చార్జీ, టెస్టింగ్ చార్జీ, అపరాధ రుసుం వంటి వివిధ రకాల చార్జీలను విధిస్తారు. తాజాగా కస్టమర్ చార్జీలను 60–100 శాతం వరకు పెరిగాయి. హైటెన్షన్ కేటగిరీ వినియోగదారులపై కస్టమర్ చార్జీల పెంపు భారం భారీగా పడింది. ఈఆర్సీ మరికొన్ని నిర్ణయాలు.. హెచ్‌టీ కేటగిరీలోని పారిశ్రామిక వినియోగదారులపై యూనిట్‌కు రూ.2 చొప్పున గ్రీన్ టారిఫ్ విధించాలని డిస్కంలు ప్రతిపాదించగా, 66 పైసలకు తగ్గించి ఈఆర్సీ ఆమోదించింది. స్వీయ అవసరాలను తీర్చుకోవడానికి పారిశ్రామిక వినియోగదారులు నిర్వహించే కాప్టివ్ విద్యుత్ ప్లాంట్లపై గ్రిడ్ సపోర్ట్ చార్జీలు విధించాలని డిస్కంలు కోరగా, దీనిపై నిర్ణయాన్ని ఈఆర్సీ వాయిదా వేసింది. ఈ అంశాన్ని గ్రిడ్ కోఆర్డినేషన్ కమిటీకి రిఫర్ చేసింది. ప్రతి ఏటా నవంబర్ 30లోగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చార్జీల పెంపు ప్రతిపాదనలు (టారీఫ్ ప్రతిపాదనలు) సమర్పించడంలో డిస్కంలు విఫలమైతే జరిమానాలు విధించడానికి కొత్త మార్గదర్శకాలను ఈఆర్సీ ప్రకటించింది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లకు రెండేళ్లలోగా 2ఏ కమ్యూనికేషన్ మీటర్లను డిస్కంలు బిగించాలి. వ్యవసాయ విద్యుత్ వినియోగం లెక్కలు కచ్చితంగా తేలడానికి దీనిని తప్పనిసరి చేసినట్టు ఈఆర్సీ వెల్లడించింది. విద్యుత్ సాంకేతిక, వాణిజ్య నష్టాల మొత్తం (ఏటీఅండ్‌సీ లాసెస్) 15 శాతంపైన ఉన్న ప్రాంతాలపై డిస్కంలు ప్రత్యేక దృష్టి సారించి నష్టాలను తగ్గించేందుకు నిర్దేశిత కాలపరిమితితో కూడిన ప్రత్యేక కార్యాచరణను ఈఆర్సీకి సమర్పించాలి. లేకుంటే ఈ నష్టాలను తదుపరి ఏడాది చార్జీల పెంపు అంశంలో పరిగణనలోకి తీసుకోబోమని ఈఆర్సీ తెలిపింది. ∙ఆసక్తిగల వినియోగదారులందరికీ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్లు బిగించాలి. స్మార్ట్ గ్రిడ్ అభివృద్ధి కార్యాచరణను ఈఆర్సీకి డిస్కంలు సమర్పించాలి. -
Power Saving Tips: ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్లులు తక్కువ రావడం ఖాయం!
Power Saving Tips For House: ఎండా కాలం, చలి కాలం, వానా కాలం.. ఇలా సీజన్లతో సంబంధం లేకుండా కరెంట్ బిల్లులు సామాన్యుడికి గుబులు పుట్టిస్తున్నాయి. ఈమధ్య కాలంలో బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ చాలామంది గగ్గోలు పెడుతూ.. కరెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతుండడం చూస్తున్నాం. మరి కరెంట్ వినియోగం కూడా అదే స్థాయిలో ఉంటోంది కదా!. అందుకే ఆదా చేసే మార్గాలు ఉన్నప్పుడు.. కరెంట్ బిల్లులను తగ్గించుకోవడం మన చేతల్లోనే ఉంటుందని గుర్తు చేస్తున్నారు నిపుణులు. పైగా అవి సింపుల్ చిట్కాలే!. వ్యాంపైర్ అప్లియెన్సెస్.. కరెంట్‌ను జలగల్లా పీల్చేస్తాయి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. కాబట్టే వీటికి వ్యాంపైర్ అని పేరు పెట్టారు. విశేషం ఏంటంటే.. ఆఫ్‌లో ఉన్నా కూడా ఇవి ఎంతో కొంత కరెంట్‌ను లాగేస్తుంటాయి కూడా. సెల్‌ఫోన్ ఛార్జర్ల మొదలు.. వైఫై రూటర్లు, టీవీలు, కంప్యూటర్లు, ఐరన్బాక్స్లు, వాషింగ్‌మెషీన్, ల్యాప్‌ట్యాప్‌లు.. ఇలా ఫ్లగ్గులో ఉండి కూడా ఆఫ్‌లో ఉన్నప్పుడు కరెంట్‌ను తీసుకుంటాయి. అందుకే వినియోగించనప్పుడు వాటిని ఫ్లగ్‌ల నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఈరోజుల్లో స్టాండ్‌బై మోడ్ ఆప్షన్‌తో వస్తున్నా.. అవి ఎంతో కొంత వాట్లలో పవర్‌ను లాగేస్తున్నాయి. కాబట్టి, వీటి విషయంలో ఈ చిన్న సలహా పాటిస్తే బెటర్. సంబంధిత కథనం: ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసా? కెపాసిటీకి తగ్గట్లు.. వాషింగ్ మెషిన్, గ్రీజర్-వాటర్ హీటర్, ఏసీలు.. ఇలా హెవీ అప్లయెన్సెస్ ఏవి వాడినా కరెంట్ బిల్లు ఎక్కువగానే వస్తుంటుంది. కానీ, వాటిని వాడే విధానంలో తేడాల వల్లే బిల్లులు అంతలా వస్తుంటాయని తెలుసా?. కాబట్టి, ఒక పద్దతిలోనే వాటిని వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు వాషింగ్ మెషిన్‌ను ఫుల్ కెపాసిటీతో కాకుండా తక్కువ కెపాసిటీతో ఉపయోగించడం. అంటే తక్కువ బట్టలు వేసి.. రెగ్యులర్‌గా ఉతకడం. దీనివల్ల ఫుల్ కెపాసిటీ టైంలో పడే లోడ్ పడి కరెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది. వాషింగ్ మెషిన్లు మాత్రమే కాదు.. ఏసీలు, హీటర్లు, గ్రీజర్లు.. ఇలా ఏవైనా సరే వాటి లెవల్‌కు తగ్గట్లుగా స్మార్ట్‌గా ఉపయోగించడం వల్ల కరెంట్ బిల్లులను తగ్గించుకున్న వాళ్లు అవుతాం. ఇక కొత్తగా అప్లియెన్సెస్ కొనాలనుకుంటే.. వాటి రేటింగ్‌ను పరిగణనలోకి తీసుకోవడం అస్సలు మరవద్దు. తద్వారా కరెంట్ కన్జంప్షన్ తగ్గుతుంది. కరెంట్ సేవింగ్‌లో ఇదే ముఖ్యం బల్బులు, సీలింగ్ ఫ్యాన్లు ఇంటి ప్రాథమిక అవసరాలు. అలాగే కరెంట్ బిల్లుల విషయంలో వీటి భాగస్వామ్యం కూడా ఎక్కువే!. చివరికి కరెంట్ తక్కువ లాగుతాయనుకునే.. సీఎల్ఎఫ్, ఎల్ఈడీ బల్బులు సైతం ఆఫ్ కరెంట్‌ను ఎక్కువే తీసుకుంటాయి. కాబట్టి, అవసరం లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం, తక్కువ స్పేస్‌లో పని చేస్తున్నప్పుడు ఫోర్టబుల్ ల్యాంపులు, స్టడీ ల్యాంపులు ఉపయోగించడం బెటర్. పాతవి ఎక్కువే.. పాత అప్లియెన్సెస్.. కొత్తగా వస్తున్నవాటికన్నా ఎక్కువ ఎనర్జీని లాగేస్తాయి. అందుకు కారణం.. ఆప్టియం ఏజ్. అంటే కాలం చెల్లడంలాంటిదన్నమాట. అందుకే పాత అప్లియెన్సెస్‌ను మార్చేసి.. మంచి రేటింగ్ ఉన్న అప్లియెన్సెస్‌ను ఉపయోగించాలి. మాటిమాటికీ అక్కర్లేదు.. మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, దోమల బ్యాట్లు, ఛార్జింగ్ లైట్లు.. అవసరం లేకున్నా ఛార్జింగ్ పెట్టడం కొందరికి ఉండే అలవాటు. ముఖ్యంగా సెల్‌ఫోన్ ఛార్జింగ్‌ల విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. కానీ, దీనివల్ల కరెంట్ అడ్డగోలుగా కాలుతుంది. అందుకే అత్యవసం అయితేనే ఛార్జింగ్ పెట్టాలి. అవసరం లేనప్పుడు ఫ్లగ్‌ల నుంచి ఛార్జర్లను తొలగించాలి మరిచిపోవద్దు. కరెంట్ బిల్లులు మోగిపోవడానికి, మీటర్ గిర్రున తిరగడం ఒక్కటే కారణం కాదు. ఎంత ఉపయోగిస్తున్నామనేది మన చేతుల్లోనే ఉంటుంది. కానీ, చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ పాటిస్తూ కరెంట్‌ను ఆదా చేయడంతో పాటు జేబుకు చిల్లుపడకుండా చూసుకోవచ్చు. -
ఆఫ్ చేసినా ఇవి కరెంట్ లాగేస్తాయని తెలుసుకోండి
టెక్ ఏజ్‌లో సాంకేతికతకు పవర్ తోడైతేనే రోజువారీ పనులు జరిగేది. విచ్చల విడిగా వాడేస్తూ.. నెల తిరిగే సరికి కరెంట్ బిల్లును చూసి కళ్లు పెద్దవి చేసేవాళ్లు మనలో బోలెడంత మంది. అయితే మనకు తెలియకుండానే కరెంట్‌ను అదనంగా ఖర్చు చేస్తున్నామని తెలుసా?.. అదీ ఆఫ్ చేసినప్పటికీ!. యస్.. మొత్తం పవర్ బిల్లులలో మినిమమ్ 1 శాతం.. పవర్ ఆఫ్ చేసిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ వల్ల వస్తుందని ఇండియన్షెల్ఫ్ ఓ కథనం ప్రచురించింది. టెలివిజన్ సెట్స్.. చాలామంది టీవీలు చూస్తూ రిమోట్ ఆఫ్ చేసి వేరే పనుల్లో మునిగిపోతారు. లేదంటే రాత్రిళ్లు పడుకునేప్పుడు టీవీలను స్విచ్ఛాఫ్ చేయకుండా వదిలేస్తారు. ఇలా చేయడం స్టాండ్‌బై మోడ్‌లోకి వెళ్లే టీవీ.. రోజుకి 24 వాట్ల పవర్‌ను తీసుకుంటుంది. ఇది తక్కువే అనిపించినా.. రోజుల తరబడి లెక్క ఎక్కువేగా అయ్యేది!. సెల్‌ఫోన్ ఛార్జర్.. చాలామంది నిర్లక్క్ష్యం వహించేది దీని విషయంలోనే. ఫోన్ ఛార్జింగ్ అయ్యాకో, మధ్యలో ఫోన్ కాల్ వస్తేనో స్విచ్ఛాఫ్ చేయకుండా ఫోన్ నుంచి పిన్ తీసేస్తుంటారు. కానీ, పవర్ బటన్‌ను ఆఫ్ చేయడమో, సాకెట్ నుంచి ఛార్జర్‌ను తీసేయడమో చేయరు. ఛార్జర్ సగటున రోజుకి 1.3 వాట్ల పవర్‌ను లాగేసుకుంటుంది. అంతేకాదు ఛార్జర్ పాడైపోయే అవకాశం.. ఒక్కోసారి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. వైఫై మోడెమ్.. స్విచ్ఛాఫ్ చేయకుండా ఉంచే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉండేది ఇదే. ఇంటర్నెట్ను ఉపయోగించినా లేకున్నా, వైఫై పరిధి నుంచి మొబైల్స్, తదితర డివైజ్‌లు దూరంగా వెళ్లినా సరే.. 24/7 వైఫైలు ఆన్‌లోనే ఉంటాయి. ప్రత్యేకంగా ఇది ఎంత కరెంట్ కాలుస్తుందనేది ప్రత్యేకంగా చెప్పలేకపోయినా.. ఉపయోగించనప్పుడు, బయటికి వెళ్లినప్పుడు ముఖ్యంగా రాత్రిళ్లు పడుకునేప్పుడు ఆఫ్ చేసి ఫ్లగులు తీసేయడం బెటర్. మైక్రో ఓవెన్స్.. ఇది తక్కువ మంది ఇళ్లలో ఉండొచ్చు. కానీ, చాలామంది వీటిని పూర్తిగా ఆఫ్ చేయకుండా వదిలేస్తుంటారు. కానీ, మైక్రో ఓవెన్స్, ఓవెన్స్‌లు ఒకరోజులో 108 వాట్ల పవర్‌ను లాగేస్తాయి. సో.. వాడనప్పుడు వాటిని అన్‌ఫ్లగ్ చేయడం ఉత్తమం. మరికొన్ని.. పెద్దసైజులో ఉండే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లు వాషింగ్ మెషిన్స్, ఫ్రిడ్జ్(పెద్దగా పాడయ్యే సామాన్లు లేనప్పుడు)లతో పాటు డ్రైయర్స్, మిక్సర్లు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, టేబుల్ ఫ్యాన్లు, బ్లూటూత్ స్పీకర్లు ఆఫ్ చేయడం ముఖ్యంగా అన్‌ఫ్లగ్ చేయడం మంచిది. వర్క్ ఫ్రమ్ హోంలో చాలామంది ల్యాప్‌టాప్‌లను సిచ్ఛాఫ్ చేసినా అన్‌ఫ్లగ్ చేయరు. అడిగితే చాలామంది టైం ఉండదంటూ సాకులు చెప్తుంటారు. లేదంటే పరధ్యానంలో మరిచిపోతుంటారు. ఇంకొందరు ఓస్ అంతే కదా అని బద్ధకిస్తుంటారు. కానీ, పవర్సేవింగ్ను ఒక బాధ్యతగా గుర్తిస్తే.. కరెంట్‌ను ఆదా చేయడం, అప్లయన్సెస్‌ను పాడవకుండా కాపాడుకోవడంతో పాటు ఖర్చుల్ని తగ్గించుకున్నవాళ్లు అవుతారు. -సాక్షి, వెబ్‌డెస్క్ -
కరెంట్ బిల్లు రాయితీకి దరఖాస్తు చేసుకోండి..
సాక్షి, హైదరాబాద్: లాండ్రీషాపులు, దోబీఘాట్లు, సెలూన్ల కరెంటు రాయితీ కోసం జూన్ ఒకటో తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలి పారు. 250 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు రాయితీ కోసం ఆన్లైన్ బెనిఫిషియరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్టవ్యాప్తంగా 2 లక్షల రజక కుటుం బాలకు చెందిన లాండ్రీషాపులకు, దోబీఘాట్లకు, నాయీబ్రాహ్మణులకు చెందిన 70 వేల సెలూన్లకు లబ్ధి చేకూరుతుందన్నారు. 250 యూనిట్ల కరెంటు రాయితీని ప్రతి నెలా వారికి ప్రభుత్వం జమ చేస్తుందని తెలిపారు. ఈ సదుపాయాలు ఆన్లైన్లో పారదర్శకంగా ఉంటాయని, దళారులను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఆన్లైన్లో www.tsobmms.cgg.gov.in ద్వారా రజక, నాయీబ్రాహ్మణ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వ్యక్తిగత వివరాలు, షాపు వివరాలు, అప్లోడ్ వంటి మూడు ప్రధాన విభాగాలుగా ఉండే ఈ ఆన్లైన్ దరఖాస్తులో పేరు, జెండర్, మొబైల్, ఆధార్ నంబర్, కుల ద్రువీకరణపత్రం, ఉపకులం, యూనిట్ పేరు, యూనిట్ చిరునామాతోపాటు తన పేరున/అద్దె నివాసానికి చెందిన కమర్షియల్ ఎలక్ట్రికల్ కన్జూమర్ నంబర్ (కరెంట్ మీటర్ నంబర్) వంటి వివరాల్ని ఎంటర్ చేసి వీటికి సంబంధించి ఫొటో, తాజా విద్యుత్ బిల్లు, షాపు/యూనిట్ ఫొటో, షాపునకు సంబంధించి అద్దె నివాసంలో ఉంటే లీజు/అద్దె ఒప్పందం ఫొటోలతోపాటు ఆయా స్థానిక విభాగాలైన గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు చెందిన కార్మిక లేదా వాణిజ్య లైసెన్స్‌లను అప్లోడ్ చేసి స్వీయ ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. -
సమ్మర్ ఎఫెక్ట్: కరెంట్ మోత.. బిల్లుల వాత!
సాక్షి, సిటీబ్యూరో: ఎండలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సగటున40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం నగరవాసులు ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లో కరెంట్ మోత మోగుతోంది. సాధారణంగా ఫిబ్రవరి వరకు నెలకు 150 యూనిట్లలోపు వాడే వినియోగదారులు ప్రస్తుతం 250– 300 యూనిట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా మీటరు గిర్రున తిరిగి.. స్లాబ్‌రేట్ మారి నెలసరి విద్యుత్ బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల వినియోగదారుల చేతికందిన మార్చి నెల బిల్లులే ఇందుకు నిదర్శనం. భారీగా పెరిగిన బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనా కాలం.. ఆపై ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డ సగటు జీవులకు ఇవి మరింత భారంగా మారుతున్నాయి. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో.. ►నగరంలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. గత మార్చి వరకు రోజూ పగటిపూట పీక్ అవర్‌లో కరెంట్ డిమాండ్ 2500 నుంచి 2700 మెగావాట్లకు మించలేదు. తాజాగా ఇది 2900 నుంచి 3000 మెగావాట్లు నమోదవుతోంది. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ►సామర్థ్యానికి మించి డిమాండ్ నమోదవుతుండటంతో విద్యుత్ ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోతోంది. ఎప్పకప్పుడు డీటీఆర్లను పెంచకపోవడం, లూజ్లైన్లను సరిచేయక పోవడమే ఇందుకు కారణం. వేసవిలో తలెత్తే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు పీక్ అవర్‌లోనూ ఇంజినీర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. -
యూనిట్‌కు రూ.1.45 సబ్సిడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుదుత్పత్తై ప్రజల వద్దకు చేరవేసేందుకు యూనిట్‌కు రూ.7.74 చొప్పున ఖర్చవుతుండగా వినియోగదారుల నుంచి వచ్చే రాబడి సగటున యూనిట్‌కు రూ.6.29 మాత్రమే ఉంది. అంటే ప్రతి యూనిట్‌కూ రూ.1.45 చొప్పున నష్టం వాటిల్లుతుండగా ప్రభుత్వమే దీన్ని భరిస్తోంది. ప్రజలపై భారం మోపకుండా విద్యుత్‌ను సబ్సిడీ రేట్లకు అందిస్తోంది. పేద, మధ్య తరగతి వర్గాలకు పరిమితంగా ఉచిత విద్యుత్తూ అందుతోంది. ఎన్నడూ లేనంత సబ్సిడీ ఎన్నడూ లేనంతగా విద్యుత్ రంగానికి ఈ ఏడాది ప్రభుత్వం రూ.10,060.63 కోట్ల సబ్సిడీ ఇచ్చింది. ఇందులో రూ.1,707.07 కోట్లు గృహ విద్యుత్ వినియోగదారులకే ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో మొదటిసారి. ఫలితంగా 2020–21లో యూనిట్‌కు రూ.1.45 చొప్పున ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. నియంత్రణలోనూ... ప్రజలకు చౌకగా విద్యుత్ ఇవ్వాలంటే ముందుగా సంస్థలు అనవసర వ్యయాన్ని తగ్గించాలి. ఈ సూత్రాన్ని పాటించడం వల్ల ఏపీ విద్యుత్ సంస్థలు మెరుగైన ఫలితాలు చూపగలిగాయి. గత సర్కారు హయాంలో 2019లో విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.48,110.79 కోట్లు ఉండగా దీన్ని ప్రస్తుతం రూ.43,327.56 కోట్లకు తగ్గించగలిగారు. అంటే దాదాపు రూ.4,783.23 కోట్ల మేర అనవసర వృథాను అరికట్టారు. 2019లో యూనిట్ విద్యుదుత్పత్తి ఖర్చు రూ. 8.82 చొప్పున ఉండగా దుబారాను నివారించడం వల్ల ఈ ఏడాది రూ.7.74కి తగ్గింది. శాపాలైన గత పాపాలు.... 2015లో విద్యుత్ సంస్థల నిర్వహణ వ్యయం రూ.24,969.09 కోట్లు కాగా 2019 మార్చి నాటికి ఇది రూ.48,110.79 కోట్లకు చేరింది. ఐదేళ్ల వ్యవధిలో వ్యయం రెట్టింపైంది. మార్కెట్లో చౌకగా విద్యుత్ లభిస్తున్నా అత్యధిక రేట్లతో ప్రైవేట్ విద్యుత్ కొనుగోళ్లకే గత ప్రభుత్వం ఆసక్తి చూపడం ఇందుకు ప్రధాన కారణం. భారీగా సబ్సిడీ.. నిర్వహణ వ్యయం పెరిగిన కొద్దీ విద్యుత్ టారిఫ్ పెరుగుతుంది. గత ప్రభుత్వం నిర్వహణ వ్యయాన్ని నియంత్రణ మండలి ముందు స్పష్టం చేయకుండా ఐదేళ్ల తర్వాత 2019 జనవరిలో ట్రూ–ఆప్ పేరుతో రూ.19,604 కోట్ల భారాన్ని ప్రజలపై వేసేందుకు కమిషన్ అనుమతి కోరింది. ఈ భారమంతా ప్రజలపై పడకుండా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు భారీగా సబ్సిడీ ఇచ్చింది. 2015లో యూనిట్‌కు కేవలం 59 పైసలు మాత్రమే సబ్సిడీ ఇవ్వగా 2020లో యూనిట్‌కు రూ.1.45 చొప్పున సబ్సిడీ ఇవ్వడం వల్ల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతోంది. -
విద్యుత్ అధికారులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు
-
విద్యుత్ సిబ్బందిని స్తంభానికి కట్టేసి..
సాక్షి, మెదక్: అధిక విద్యుత్ బిల్లులపై వినియోగదారులు భగ్గుమన్నారు. ముట్టుకుంటేనే షాక్ కొడుతున్న కరెంట్ బిల్లులు చూసి ఆగ్రహం చెందిన మెదక్ జిల్లా మండల పరిధిలోని ముస్లాపూర్ గ్రామవాసులు విద్యుత్ సిబ్బందిపై తమ ప్రతాపం చూపించారు. విద్యుత్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన అధికారులను పట్టుకుని గ్రామస్తులు స్తంభానికి కట్టేశారు. ఉన్నతాధికారులు వచ్చేంతవరకు వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు. అధిక విద్యుత్ బిల్లులు, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి సమస్యలను చూసి చూడనట్టు వదిలేస్తున్న అధికారుల తీరుపై విసుగు చెందిన గ్రామస్తులు ఇలా నిరసనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రోజులకు రోజులు విద్యుత్ సరఫరాలో అంతరాయం, అధిక కరెంటు బిల్లులు వసూళ్ల గురించి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న నాథుడు లేడని గ్రామస్తులు వాపోయారు. ఇప్పటికైనా తమ వెతలకు పరిష్కారం చూపించాలని వేడుకుంటున్నారు. (చదవండి: నాటు వేస్తూ.. కబడ్డీ ఆడుతూ..) -
కరెంటు బిల్లులు మాఫీ చేయండి
సాక్షి, హైదరాబాద్: కరెంటు బిల్లులపై సీఎంకు కాంగ్రెస్ లేఖాస్త్రం సంధించింది. కరోనా కరుణించలేదు.. కనీసం మీరైనా కనికరించాలని విజ్ఞప్తి చేసింది. పేద కుటుంబాలు, ఎంఎస్ఎంఈలు లాక్డౌన్ కారణంగా బిల్లులు భరించలేకపోతున్నందున వాటిని మాఫీ చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి కోరారు. ఇతర వినియోగదారులకు కూడా బిల్లులో రాయితీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘బీపీఎల్ కుటుంబాలకు లాక్డౌన్ కాలానికి 100 శాతం విద్యుత్ బిల్లులను మాఫీ చేయాలని కోరుతున్నాం. తెల్లరేషన్ కార్డుదారులకు విద్యుత్ బిల్లులను పూర్తిగా మాఫీ చేయాలి. బిల్లింగ్ పద్ధతిలో తప్పులను సరిదిద్దడం ద్వారా ఇతర వినియోగదారులకు కూడా తగిన విధంగా తగ్గించాలి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థిర, సాధారణ చార్జీలు సహా విద్యుత్ బిల్లులు పూర్తిగా మాఫీ చేయాలి. జూన్‌లో విద్యుత్ బిల్లులు చాలా అన్యాయంగా ఉన్నాయి. వినియోగం మీద ఆధారపడి నెలవారీగా చార్జీలు వసూలు చేయాలి. కానీ, ఈఆర్సీ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ 90 రోజుల్లో చేసిన మొత్తం వినియోగం ఆధారంగా బిల్లులను తయారు చేశారు. పర్యవసానంగా, వినియోగదారులకు యూనిట్‌కు రూ.4.30కి బదులు రూ.9 బిల్లు వేశారు. ప్రజలపట్ల తన విధానాన్ని మార్చుకునే స్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. రెండు నెలలకుపైగా లాక్డౌన్ కారణంగా నష్టపోయిన ప్రజలపై భారాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవైపు కోవిడ్ –19 ని అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వం మరోవైపు సామాన్యులపై అదనపు ఆర్థిక భారం వేయడానికి ప్రయత్నిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది జీవనోపాధి వనరులను కోల్పోయి విద్యుత్ బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. పెరిగిన విద్యుత్ బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రమంతటా నల్ల జెండాలు, బ్యాడ్జ్‌లతో నిరసనలు నిర్వహిస్తాం’అని లేఖలో పేర్కొన్నారు. -
ట్రాన్స్‌కో సీఎండీని కలిసిన బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అధిక విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ బీజేపీ నేతలు ట్రాన్స్ కో సీఎండీ రఘమా రెడ్డిని బుధవారం కలిశారు. వీరిలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. సీఎండీని కలిసిన అనంతరం మోత్కుపల్లి మాట్లాడుతూ, లాక్డౌన్ కారణంగా ప్రజలెవ్వరూ మూడు నెలలుగా బయటకు రాలేదన్నారు. పనులు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలు వేల రూపాయల కరెంట్ బిల్లులు ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం కరెంట్ బిల్లులను మాఫీ చేయాలని కోరారు. కరోనా నియంత్రణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ మొదట్లో ఒక మాట ఇప్పడు ఒక మాట మాట్లాడుతున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. కరోనా రోగులందరికి ప్రభుత్వమే చికిత్సనందించాలని డిమాండ్ చేశారు. (‘కోవిడ్’ కేసుల్లో చార్జ్‌షీట్స్! ) అదేవిధంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ, రావాల్సిన కరెంట్ బిల్లులకంటే రెండు రెట్లు అధికంగా కరెంట్ బిల్లు వచ్చిందన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం సముచితం కాదన్నారు. దీని గురించి ట్రాన్స్‌కో సీఎండీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. (వాహనాలను ఆ మార్గంలో అనుమతించడం లేదు) -
వందల్లో వచ్చే బిల్లులు ఒక్కసారిగా వేలల్లోకి!
సాక్షి, రంగారెడ్డి: ప్రతి నెల వందల రూపాయల్లో వచ్చే విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా వేల రూపాయలు రావడంతో కొత్తూరు మండలంలోని ఇన్ముల్ నర్వ గ్రామస్తులు కంగుతిన్నారు. కరెంట్ బిల్లులు వసూలు చేయడానికి వచ్చిన సిబ్బందిని శుక్రవారం అడ్డుకున్నారు. వందల్లో వచ్చే కరెంట్ బిల్లులు వేలల్లో రావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఇంటికి 11వేల రూపాయల నుంచి 20వేల రూపాయల వరకు బిల్లులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ ఇళ్లకు సుమారు రూ.200 వందల నుంచి 400 వరకు బిల్లులు వచ్చేవని ఈ నెల మాత్రం 11 వేల రూపాయల నుంచి 15 వేల బిల్లులు వచ్చాయని తెలిపారు. కాయ కష్టం చేసుకొని బతికే తాము ఇన్ని బిల్లులు ఎలా కట్టాలని సిబ్బందిని నిలదీశారు. అసలే కరోనా లాక్‌డౌన్‌తో బతుకులు దుర్భరంగా మారాయని వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాక్కున్న చందంగా చేస్తోందని కొందరు విమర్శిస్తున్నారు. (చదవండి: కేటీఆర్‌కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు) -
ఎంత వాడితే అంతే బిల్లు : నాగలక్ష్మి
సాక్షి, విశాఖ: రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పెరిగాయనడంలో వాస్తవం లేదని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ నాగలక్ష్మి అన్నారు. కరెంట్ బిల్లులు పెరిగినట్లు వస్తున్న వార్తలను ఆమె తోసిపుచ్చారు. లాక్డౌన్ కారణంగానే గత నెల రీడింగ్ తీయలేదని నాగలక్ష్మి శుక్రవారం తెలిపారు. ఈ నెలలో రెండు నెలల రీడింగ్ తీసుకున్నామని, అయినప్పటికీ ఏ నెలకా నెల బిల్లుగానే లెక్కించి వేశామని, ఏ బిల్లు కూడా పెరగలేదని ఆమె స్పష్టం చేశారు. వేసవి కాలంతో విద్యుత్ ఎక్కువగా వినియోగించడంతోనే బిల్లులలో పెరుగుదల వచ్చిందన్నారు. ప్రజలు అపోహలకు గురి కావద్దని సూచించారు. ఒకవేళ కరెంట్ బిల్లులు పెరిగినట్లు ఎవరికైనా సందేహం వస్తే వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చని తెలిపారు. కాల్ సెంటర్ 1912కి కాల్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని, కరెంట్ బిల్లులు చెల్లించడానికి జూన్ 30వరకూ అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. టారిఫ్‌లలో కూడా గతంలో పోలిస్తే ప్రజలకు ఉపయోగపడే విధంగా డైనమిక్ విధానంలోకి తీసుకు వచ్చామన్నారు. వినియోగదారులు ఎంత వాడితే అంతే బిల్లు వచ్చేవిధంగా టారిఫ్ తీసుకువచ్చినట్లు చెప్పారు. గతంలో అయితే ఏడాది మొత్తం ఒకటే టారిఫ్ ఉండటం వల్ల తక్కువ వాడినప్పటికీ ప్రతి నెల ఒకటే టారిఫ్ అమల్లో ఉండేదని నాగలక్ష్మి తెలిపారు. -
కరెంట్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం
సాక్షి, విజయవాడ : విద్యుత్ బిల్లులపై ప్రతిపక్షం దుష్ప్రచారం చేస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్లాబుల ధరలు పెరగకపోయినా.. పెరిగినట్లు అనవసర రాద్ధాంతం చేస్తోందని, లాక్ డౌన్‌తో ప్రజలు ఇళ్లల్లోనే ఉండటంవల్ల కరెంట్ వినియోగం పెరిగిందని ఆయన అన్నారు. విద్యుత్ బిల్లులపై రాజకీయం సరికాదని హితవు పలికారు. మంత్రి బుగ్గన శుక్రవారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ...‘మార్చి, ఏప్రిల్ నెలల్లో బిల్లులు ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తున్న బిల్లులను మూడు నెలల సగటు యూనిట్లు లెక్కేసే ఇస్తున్నాం. మూడునెలల బిల్లు ఒకేసారి కట్టాల్సి రావడం వల్లే ఎక్కువ బిల్లు వచ్చినట్లు కనిపిస్తోంది. ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. జూన్ 30 వరకు బిల్లులు చెల్లింపులు ప్రభుత్వం అవకాశం ఇస్తే.. ఈనాడు దినపత్రికలో 15 వరకు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కొత్త టారీఫ్ చార్జీలుపై ఈనాడు పత్రిక తప్పుడు రిపోర్టింగ్‌తో ప్రజల్ని పక్కదారి పట్టిస్తోంది. ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ అమలులోకి వచ్చింది. మార్చి, ఏప్రిల్ నెలలో లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండటంతో విద్యుత్ బిల్లులు పెరిగాయి. అలాగే సోషల్ మీడియాలో కరెంట్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీటర్ రీడింగ్ రెండు నెలలు తీయక పోవడంతోనే టారిఫ్ శ్లాబ్ మారడంతో కరెంట్ బిల్లులు పెరిగాయి. టీడీపీ హయాంలో స్టాటిక్ అనే పద్ధతి 2016 నుంచి 2019 వరకు అమలులో గత ప్రభుత్వం తీసుకు వచ్చింది. భారత దేశంలో స్టాటిక్ పద్ధతి వాడటం లేదు. స్టాటిక్ పద్ధతితో ప్రజల్ని గందరగోళం చేస్తున్నారు. ఏపీ ఈఆర్సీ డైనమిక్ పద్ధతి అమలులోకి తీసుకు వచ్చాం.200 యూనిట్లు లోపు వాడితే దేశంలో తక్కువగా విద్యుత్ ఇస్తోంది. పవర్ పర్చేజ్ బకాయిలు 4900 కోట్లు 2014 లో ఉంటే.. 2019 నాటికి 20వేల కోట్లు బకాయిలుకు చేర్చారు. బకాయిలు 5వేల కోట్లు మా ప్రభుత్వం కట్టింది. 7120 పైగా కోట్లు 5వేల కోట్లు డిస్కంలకు చెల్లించాం. 2014లో యూనిట్ 4.33 పైసలకు కొనుగోలు చేస్తే టీడీపీ హయాంలో 2019లో యూనిట్ 6 రూపాయలకు పెంచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికరంలోకి రాగానే 5.16 పైసలుకు యూనిట్ తగ్గించాం. జెన్కోకు టీడీపీ హయాంలో 11వేల కోట్లు బకాయిలు ఉంటే 7 వేల కోట్లు మేము అధికారంలోకి రాగానే చెల్లించాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చినవి అన్ని ఈ ప్రభుత్వం అమలు చేస్తోంది. రెండు సంవత్సరాలు బిల్లులను ఆన్ లైన్లో ఉంచుతున్నాం.’ అని తెలిపారు. -
‘అపోహలే.. అందులో వాస్తవం లేదు’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ బిల్లులు పెరిగాయన్న ప్రచారంలో వాస్తవం లేదని, కేవలం అపోహలు మాత్రమేనని ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఆయన గురువారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘కరోనా నేపథ్యంలో మార్చి తర్వాత మే నెలలో మీటర్ రీడింగ్ తీసుకున్నాం. ఈ 60 రోజుల బిల్లు ఒకే కేటగిరీ కింద ఒకే శ్లాబ్ సిస్టమ్ కింద బిల్లు వేశారన్నది అపోహ మాత్రమే. 60 రోజుల బిల్లును రెండుతో భాగించి రెండు నెలలకు బిల్లు వేశామని’’ ఆయన వివరించారు. (టెన్త్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) మార్చి నెలలో 20 రోజులకు గత ఆర్థిక సంవత్సరంలో ఏ కేటగిరి కింద వినియోగదారుడు ఉంటే అదే కేటగిరి వర్తించేలా బిల్లు వేశామని పేర్కొన్నారు. ఏప్రిల్ నెలకు సంబంధించి కొత్తగా రూపొందించిన కేటగిరి ప్రకారం బిల్లులు వేశామన్నారు. గతంలో స్ట్రాటిక్ విధానం ఉండేదన్నారు. కానీ ఈ విధానం సరిగా లేని కారణంగా ఏపీఈఆర్సీలో వచ్చిన సూచనల మేరకు డైనమిక్ విధానం అమల్లోకి వచ్చిందన్నారు. ఒకవేళ ఒక నెలలో కరెంట్ బిల్లు అధికంగా వస్తే ఆ నెలలోనే కేటగిరి మారుతుందే తప్ప 12 నెలలకూ వర్తించదన్నారు. మే నెలలో వేసవి వల్ల అధికంగా బిల్లు వస్తే జూన్‌లో అదే కేటగిరి కొత్త విధానంలో ఉండదని చెప్పారు. బిల్లింగ్ విధానంపై ఎవరికైనా అనుమానాలుంటే వెబ్సైట్లో నంబర్ టైప్ చేసి పాత బిల్లులను కూడా తెలుసుకోవచ్చన్నారు. అనుమానాలుంటే ‘1912’ లో సంప్రదించవచ్చని.. ఉన్నతాధికారులు వెంటనే అందుబాటులోకి వచ్చి అనుమానాలు నివృత్తి చేస్తారని తెలిపారు. (విద్యుత్ బిల్లులపై ప్రజల్లోకి వెళ్దాం) ప్రతీ ఏడాది శీతాకాలంలో కరెంట్ బిల్లులు తక్కువగా ఉంటాయని వేసవిలో బిల్లులు అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల కూడా గృహ వినియోగం గతంలో కంటే ఈ సారి అధికంగా పెరిగిందన్నారు. అనుమానం ఉంటే ఆన్లైన్లో గత ఏడాది బిల్లులు, ఇప్పటి బిల్లులు చూసుకోవచ్చన్నారు. బిల్లింగ్ విధానం కూడా పూర్తి పారదర్శకంగా జరిగిందని ఎక్కడా తప్పు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. లాక్డౌన్ కారణంగా జూన్ 30 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు. గడువు పెంచిన కారణంగా ఈలోపు డిస్ కనెక్షన్ జరగదని, ఒకవేళ డిస్కనెక్షన్ చార్జీలు వేస్తే రాబోయే బిల్లులో మినహాయింపు ఇస్తామని వివరించారు. కరెంట్ బిల్లులపై ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేయడానికి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారని శ్రీకాంత్ స్పష్టం చేశారు.