ఈ ఏడాది పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్ రూ. 73.16 ఉండగా, మధ్యలో రూ.80.80కి పెరిగింది. తర్వాత కొంత తగ్గి రూ. 78.94కు చేరింది.
అలాగే డీజిల్ ధర కూడా పెరిగింది. ఈ ఏడాది తొలినాళ్లలో లీటర్‌కు రూ. 52.12 ఉండగా ఇప్పుడు రూ.57.59కి చేరింది. పెట్రోల్, డీజీల్ ధరల ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ముఖ్యంగా రవాణా రంగంపై పెను ప్రభావాన్ని చూపింది. దీంతో నిత్యావసరాలు, కూరగాయలు ఇలా అన్నింటి ధరలు పెరగడానికి కారణమైంది.
కూర‘గాయాలు’
బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులే కాదు మధ్యతరగతి ప్రజలూ ఇబ్బందులు పడ్డారు. ఏడాది ప్రారంభంలో క్వింటాలుకు రూ. 2,400 ఉన్న బీపీటీ బియ్యం మధ్యలో రూ. 4,500లకు చేరింది. ప్రస్తుతం రూ. 3,800లకు విక్రయిస్తున్నారు. నూనెల ధరలూ పెరిగాయి. రూ. 45కు లీటర్ ఉండే పామాయిల్ ధర రూ. 65కు చేరింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్‌కు రూ. 75 నుంచి రూ. 95కు పెరిగింది. పల్లి నూనె ధర లీటర్‌కు రూ. 90 నుంచి రూ. 110కి చేరింది.
చుక్కల్లో చికెన్ ముక్క
పండుగకో, పబ్బానికో మాంసాహార భోజనం చేసే పేదలకు మాంసం ధరలు ఆందోళన కలిగించాయి. చుట్టాలొచ్చినా మాంసం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రూ. 80 నుంచి వంద రూపాయలకు కిలో ఉండే చికెన్ ధర రెండు వందల రూపాయలకు చేరింది. ప్రస్తుతం రూ. 140కి కిలో విక్రయిస్తున్నారు. గొర్రె, మేక మాంసం కొనలేనంతగా పెరిగింది. ప్రస్తుతం రూ. 400 లకు పైనే అమ్ముతున్నారు. మూడు రూపాయలుండే గుడ్డు ధర ప్రస్తుతం రూ. 4.50కు పెరిగింది.
ఉల్లి.. వెల్లుల్లి..
ఈసారి ఉల్లిగడ్డలు సామాన్యుడి కంట కన్నీరు పెట్టించాయి. సాధారణంగా కిలోకు రూ. 10 నుంచి రూ. 15ల మధ్య లభించే ఉల్లిగడ్డల ధర వేసవిలో రూ. 80 దాటింది. అకాల వర్షాలతో పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లడంతో ధర భారీగా పెరిగింది. ఏడాది చివరిలో కిలోకు రూ. 25 కు తగ్గిపోయింది. వెల్లుల్లి సైతం తక్కువ తినలేదు. ఏడాది ఆరంభంలో కిలోకు రూ. 240 వరకు పెరిగింది. తర్వాత రూ. 80కి తగ్గింది.
కుదేలైన నిర్మాణ రంగం
గృహ నిర్మాణాలకు సంబంధించి ఇసుక, ఇటుక, సిమెంటు, స్టీల్ ధరలు భారీగా పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైంది. ఈ ఏడాది ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది. ట్రాక్టర్ ఇసుకకు గతంలో రూ. 2,500 నుంచి రూ. 3 వేలు ఉండగా, రూ. 6,500 నుంచి రూ. 7 వేల వరకు చేరుకుంది. ఇటుక ధర గతంలో ట్రాక్టర్ లోడ్‌కు రూ.6 వేల ఉండగా రూ. 8,500 నుంచి రూ. 10,500 వరకు పలికింది. స్టీల్ ధర క్వింటాలుకు రూ. 3,600 ఉండగా రూ. 4,100కు పెరిగింది. సిమెంటు బస్తా ధర రూ. 170 ఉండగా రూ. 280 కి చేరింది. సిమెంట్ ధర ఇటీవల రూ. 230కి తగ్గింది.
రికార్డు స్థాయికి బంగారం
బంగారం ధరలు ఈసారి భారీగానే పెరిగాయి. 10 గ్రాములకు *33 వేలు దాటి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడ్డ పరిణామాలతో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా * 25 వేలకు పడిపోయింది. తర్వాత కోలుకొని రూ. 30 వేల వద్ద ఉంది. వెండి ధర కిలోకు 60 వేలకు చేరింది. తర్వాత 42 వేలకు పడిపోయినా ప్రస్తుతం 46 వేలకు కిలో విక్రయిస్తున్నారు.
పెరిగిన బస్సు, రైలు చార్జీలు
ఈ ఏడాది బస్సు, రైల్‌చార్జీలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజలపై అదనపు భారం పడింది. ఆర్టీసీ చార్జీలు రెండు సార్లు పెరిగాయి. ఏసీ బస్సులపై 12 శాతం, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లపై 10 శాతం, పల్లెవెలుగులపై 8 శాతం వడ్డించారు. సర్వీస్ చార్జీల పేరిట ప్రతి టికెట్టుపై ఒక్కో రూపాయి చొప్పున అదనంగా పెంచారు. ఈ సారి బస్సుపాస్‌ల రేటూ పెంచడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు చార్జీలూ పెరిగాయి. గతంలో కనీస చార్జి రూ. 2 ఉండగా దానిని రూ. 5కు పెంచారు. ఇతర చార్జీలూ పెరిగాయి.
షాకిచ్చిన కరెంటు బిల్లులు
ఈ ఏడాది విద్యుత్ వినియోగ చార్జీలతో పాటు సర్‌చార్జీలు వినియోగదారులకు షాకిచ్చాయి. సర్‌చార్జిల పేరుతో మూడు నెలలకోసారి అదనంగా విద్యుత్ చార్జీలు వడ్డించారు. దీంతో వినియోగదారులు విలవిల్లాడారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపేది లేదంటూనే ప్రభుత్వం ఆ వర్గాలపైనే అధిక భారం మోపింది. ఈఆర్‌సీ చెప్పిందంటూ చార్జీలను పెంచుతున్న ప్రభుత్వం మరోసారి చార్జీల వడ్డనకు సిద్ధపడింది. రెండు ఫ్యాన్లు, రెండు బల్బులు, టీవీ ఇతర గృహోపకరణాలు వాడే వినియోగదారులకు నెలకు * 6 వందల నుంచి * 8 వందల వరకు బిల్లులు వస్తున్నాయి. గతంలో రెండు మూడు నెలలకు కలిపితే వచ్చే బిల్లులు ఇప్పుడు ఒకే నెలకు వస్తుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.
అ‘ధర’హో నామ సంవత్సరం
Published Sun, Dec 29 2013 5:51 AM | Last Updated on Sat, Sep 2 2017 2:05 AM
Advertisement
Advertisement