surcharges
-
రూ.100 గెలిస్తే ఇచ్చేది మాత్రం రూ.68!
నిత్యం దేశవ్యాప్తంగా ఎక్కడో ఒకచోట ఫలానా వ్యక్తి లాటరీ గెలుచుకున్నారని వింటూంటాం. ఒకవేళ ఆ వ్యక్తి రూ.100 లాటరీ ద్వారా గెలుపొందితే ట్యాక్స్‌లు పోను తనకు చివరకు అందేది దాదాపు రూ.68 మాత్రమే. మిగతా రూ.32లు వివిధ ట్యాక్స్‌ల రూపంలో ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. అసలు లాటరీ పొందిన వారికి ఎలాంటి ట్యాక్స్‌లు విధిస్తున్నారు. అది ఎంత మొత్తంలో కట్టాల్సి ఉంటుందో తెలుసుకుందాం.కర్ణాటకలోని మాండ్య జిల్లా పాండవపురకు చెందిన అల్తాఫ్ పాషా అనే స్కూటర్ మెకానిక్ ఇటీవల ఏకంగా రూ.25 కోట్ల లాటరీ గెలుపొందారు. కేరళ ప్రభుత్వం నిర్వహించే తిరుఓనమ్ లాటరీలో పాల్గొనేందుకు రూ.500 పెట్టి టికెట్ కొన్నారు. ఈ నెల 9న తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డ్రా తీశారు. అందులో అల్తాఫ్ ఏకంగా రూ.25 కోట్లు గెలుచుకున్నట్లు ప్రకటించారు. అయితే ప్రభుత్వ ట్యాక్స్‌లో పోను చివరకు తనకు అందేది మాత్రం సుమారు రూ.17.25 కోట్లు కావడం గమనార్హం. అంటే రూ.7.8 కోట్లమేర ట్యాక్స్ కట్ అవుతుంది.ఇదీ చదవండి: ఎప్పటికీ మారనిది ఏంటో చెప్పిన టాటాట్యాక్స్లు ఇలా..ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194బీ కింద లాటరీలో గెలుపొందిన డబ్బుపై 30 శాతం పన్ను చెల్లించాలి. ఈ 30 శాతం పన్నుపై అదనంగా మరో నాలుగు శాతం వరకు సర్‌ఛార్జీ, సెస్ రూపంలో ట్యాక్స్ కట్టాలి. దాంతో మొత్తం సమకూరిన సొమ్ముపై 31.2 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సర్‌ఛార్జీ, సెస్‌ను ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, విద్యకు వెచ్చించాల్సి ఉంటుంది. ముందుగానే సదరు లాటరీ సంస్థలు టీడీఎస్(మూలం వద్ద పన్ను కోత) రూపంలో పన్ను కట్ చేసుకుని మిగతా డబ్బు విజేతలకు ఇస్తారు. లాటరీ ద్వారా గెలుపొందిన డబ్బు రెగ్యులర్ ఇన్కమ్ కిందకు రాదు. అది ‘ఇతర ఆదాయం’ విభాగంలోకి వస్తుంది. కాబట్టి బీమాకు సంబంధించిన 80డీ కింద ప్రభుత్వం గరిష్టంగా ఇచ్చే రూ.50 వేలు, 80సీ కింద ఇచ్చే రూ.1.5 లక్షలు పన్ను వెసులుబాటుకు అనర్హులుగా పరిగణిస్తారు. -
Budget 2023: సెస్సులు, సర్‌చార్జీలు ఎత్తివేయాలి
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు అదనపు భారంగా ఉంటున్న సెస్సు, సర్‌చార్జీలను ఎత్తివేయాలని, ట్యాక్స్ పరిధిలోకి మరింత మందిని చేర్చాలని బడ్జెట్‌కు సంబంధించి థింక్ చేంజ్ ఫోరం (టీసీఎఫ్) కేంద్ర ఆర్థిక శాఖను కోరింది. అలాగే, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రంగాలకు పన్నుల భారాన్ని తగ్గించాలని, ట్యాక్స్‌పేయర్లు నిబంధనలను పాటించేలా పర్యవేక్షణను మరింత మెరుగుపర్చాలని పేర్కొంది. ఆర్థిక వృద్ధి సాధనకు, అభివృద్ధి పనులపై ఇన్వెస్ట్ చేసేందుకు ప్రభుత్వం పన్ను ఆదాయాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని టీసీఎఫ్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు అభిప్రాయపడ్డారు. అధిక పన్నుల భారం, సంక్లిష్టమైన ట్యాక్స్ విధానాలు మొదలైనవి వివాదాలకు దారి తీస్తున్నాయని, నిబంధనల అమలు సరిగ్గా లేకపోవడం వల్ల వసూళ్లపై ప్రభావం పడుతోందని వారు తెలిపారు. అక్రమ వ్యాపారాలను అరికట్టడానికి ప్రభుత్వ ఏజెన్సీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా పన్ను ఎగవేతదారులు మరింత వినూత్న వ్యూహాలతో స్మగ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రీయ పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు మాజీ చైర్మన్ పీసీ ఝా చెప్పారు. అత్యధిక నియంత్రణలు, పన్నులు ఉండే పరిశ్రమలైన పొగాకు ఉత్పత్తులు, ఆల్కహాలిక్ పానీయాల రంగాల నుంచి ఖజానాకు రావాల్సిన రూ. 28,500 కోట్ల మేర ఆదాయానికి గండి పడుతోందని పేర్కొన్నారు. ఇలాంటివి అరికట్టేందుకు మరింత అధునాతన టెక్నాలజీని ఉపయోగించాలని, పోర్టుల్లో మరిన్ని స్కానర్లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. -
సెస్సులు, సర్‌చార్జీలతో రాష్ట్రాలకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, సర్‌చార్జీలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 1980–81లో కేంద్ర ప్రభుత్వ మొత్తం ఆదాయంలో సెస్సులు, సర్‌చార్జీలు కేవలం 2.3 శాతంగా ఉంటే.. 2022–23 నాటికి 20 శాతానికి చేరాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు సరికాదని విమర్శించారు. పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు విపరీతంగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని, తద్వారా దేశ పురోగతి కూడా కుంటుపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్ రూపకల్పనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్వహించిన సమావేశంలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు తరఫున ప్రసంగాన్ని ఆ శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్ చదివి వినిపించారు. పన్నుల వాటా తగ్గింది కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా తగ్గిపోయిందని.. 15వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాలని సిఫార్సు చేస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్నది 29.7 శాతమేనని హరీశ్‌రావు తన ప్రసంగ పాఠంలో స్పష్టం చేశారు. కేంద్ర సెస్సులు, సర్‌చార్జీలను ప్రస్తుతమున్న 20శాతం నుంచి పది శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆయా రాష్ట్రాల అవసరాలకు తగినట్టుగా అమలుచేసుకునే స్వేచ్ఛ కల్పించాలని కోరారు. న్యూట్రిషన్, సెక్టార్ స్పెసిఫిక్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వకపోవడం అన్యాయమని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ అంచనాల్లో మూలధన పెట్టుబడిని పెంచి చూపినా.. వ్యయం సరిగా చేయడం లేదని, ఈ విషయంలో వేగం పెంచాలని సూచించారు. ‘‘మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలు ముందున్నాయి. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక సహాయాన్ని మరో ఐదేళ్లు కొనసాగించాలి. ఇందుకోసం ఏటా రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలను రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా పరిగణించాలి. లేదా ఈ నిర్ణయాన్ని గత సంవత్సరాలకు వర్తింప చేయవద్దు’’ అని హరీశ్‌రావు కోరారు. రాష్ట్రానికి సంబంధించి కోరిన అంశాలివీ.. ►రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లను 2019–20 నుంచి నిలిపివేశారు. ఏటా రూ.450 కోట్ల లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంతో కలిపి మొత్తం రూ.1350 కోట్లు ఇవ్వాలి. వీటి యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ఇదివరకే సమర్పించాం. తెలంగాణ 10 జిల్లాల నుంచి 33 జిల్లాలుగా మారినందున మౌలిక సదుపాయాల కల్పన పెంచడానికి నిధులు ఇవ్వాలి. ►ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం మేరకు పన్ను ప్రోత్సాహకాలను కల్పించాలి. కేంద్రం తెలంగాణకు ప్రధాన పన్నుల రాయితీని ప్రకటించాలి. ►వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి బీహెచ్ఈఎల్–లక్డీకాపూల్ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్–ఎల్బీనగర్ వరకు 5 కిలోమీటర్ల దూరం రోడ్ల నిర్మాణానికి కలిపి రూ.8,453 కోట్లు ఇవ్వాలి. ►మిషన్ భగీరథ నిర్వహణకు రూ.2,350 కోట్ల సాయానికి కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో మరో రూపంలోనైనా నిధులు ఇవ్వాలి. ►కల్లాలు, ట్రీగార్డ్స్‌ను గ్రామీణ ఉపాధి హమీ పథకంలో చేపట్టినందుకు అయిన రూ.151.19 కోట్లను పదిహేను రోజుల్లో చెల్లించాలని కేంద్రం లేఖ రాసింది. చెల్లించకపోతే రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్లలో కత్తిరించుకుంటామని పేర్కొంది. కేంద్రం ఉత్పాదకత కోసం చేసిన పనులపై పరిమితులు పెట్టడం, ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామనడం సరికాదు. ►రాష్ట్రానికి ఐటీఐఆర్‌ను వెంటనే ఇవ్వాలి. విభజన చట్టం హామీలను వెంటనే అమలు చేయాలి. -
Telangana: అదనపు సర్‌చార్జీల మోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల నుంచి కాకుండా.. బహిరంగ మార్కెట్ నుంచి ఓపెన్ యాక్సెస్ విధానంలో నేరుగా విద్యుత్ కొనుగోలు చేస్తున్న వినియోగదారులపై అదనపు సర్‌చార్జీల మోత మోగనుంది. డిస్కంల కన్నా తక్కువ ధరకే విద్యుత్ విక్రయించే విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి కొన్ని భారీ పరిశ్రమలు నేరుగా ఓపెన్ యాక్సెస్ ద్వారా విద్యుత్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల నుంచి రూ.372.51 కోట్ల అదనపు సర్‌చార్జీల వసూలు చేసేందుకు దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (ఎస్పీడీసీఎల్/ఎన్పీడీసీఎల్) ప్రతిపాదించాయి. ఓపెన్ యాక్సెస్‌లో కొనుగోలు చేసే ప్రతి యూనిట్ విద్యుత్‌పై ...తొలి అర్ధవార్షికం లో రూ.2.01, రెండో అర్ధవార్షికంలో రూ.2.34 చొప్పున అదనపు సర్‌చార్జీలు వసూలు చేసుకోవడానికి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి కోరాయి. ఈ ప్రతిపాదనలపై ఈ నెల 23 వరకు అభ్యంతరాలు పంపించాలని ఈఆర్సీ కోరింది. డిసెంబర్ 7న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణ నిర్వహించి ఏ మేరకు అదనపు సర్‌చార్జీలు వసూలు చేయాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనుంది. బయటి కొనుగోళ్లతో మిగిలిపోతున్న విద్యుత్ దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ద్వారా డిస్కంలకు 2021–22 తొలి అర్ధభాగంలో 8,210.18 మెగావాట్లు, రెండో అర్ధభాగంలో 8,574.88 మెగావాట్ల విద్యుత్ లభ్యత ఉండనుంది. ఓపెన్ యాక్సెస్ వల్ల తొలి అర్ధభాగంలో 171.89 మె.వా, రెండోఅర్ధభాగంలో 219.76 మె.వా. విద్యుత్‌ను డిస్కంలు విక్రయించుకోలేకపోయాయి. ఈ విద్యుత్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీల నష్టాలు కలిపి ఓపెన్ యాక్సెస్ వినియోగదారుల నుంచి రూ.372.51 కోట్ల అదనపు సర్ చార్జీలను వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఎందుకు ఇలా? రాష్ట్రంలోని వినియోగదారులందరి అవసరాలకు సరిపడ విద్యుత్ కోసం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలతో డిస్కంలు పీపీఏలు కుదుర్చుకుంటాయి. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ లైన్లను వినియోగించి ఈ విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీలు చెల్లిస్తాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసే బిల్లుల ద్వారా ఈ ఖర్చులను డిస్కంలు తిరిగి వసూలు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒప్పందం మేరకు విద్యుత్ కొనుగోలు చేయకపోయినా, విద్యుదుత్పత్తి కంపెనీలకు డిస్కంలు.. కొనుగోలు చేయని విద్యుత్‌కు సంబంధించిన స్థిర చార్జీలను తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. అదే తరహాలో ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీలు చెల్లించక తప్పదు. కొంతమంది వినియోగదారులు నేరుగా బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుండడంతో, ఆ మేరకు ఫిక్స్డ్ చార్జీలు, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ చార్జీల భారం డిస్కంలపై పడుతోంది. ఈ నేపథ్యంలోనే సదరు నష్టాలను అదనపు సర్‌చా ర్జీల రూపంలో, అందుకు కారణమైన వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేస్తున్నాయి. -
క్యాబ్ చార్జీ ఇక మీ చేతుల్లో...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ చార్జీల విషయంలో ఇప్పటి వరకు అగ్రిగేటర్లదే తుది నిర్ణయం. రైడింగ్, పీక్‌టైం, సర్జ్ వంటి పేర్లతో కస్టమర్లపై అదనపు భారం మోపుతున్నాయి. ఇలాంటిది లేకుండా చార్జీని వినియోగదార్లే నిర్ణయించుకునేలా అమెరికాకు చెందిన ప్రముఖ క్యాబ్ అగ్రిగేటర్ ‘ఇన్‌డ్రైవర్’ తన సేవల్ని ప్రారంభించింది. ఈ సంస్థ డ్రైవర్ నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోదు. కస్టమర్ నగదు రూపంలో చార్జీని డ్రైవర్‌కే చెల్లించాలి. ఇదెలా పని చేస్తుందంటే.. కస్టమర్ తాను ఎక్కవలసిన, దిగాల్సిన స్థలం నిర్దేశిస్తూ ఎంత చెల్లించేదీ యాప్‌లో సూచించాలి. సమీపంలో ఉన్న డ్రైవర్లకు ఈ సమాచారం వెళ్తుంది. కస్టమర్ చెల్లించదల్చుకున్న మొత్తం నచ్చకపోతే డ్రైవర్ బేరమాడవచ్చు. హైదరాబాద్‌లో 2,000 మంది డ్రైవర్లతో చేతులు కలిపామని ఇన్‌డ్రైవర్ ఇండియా పీఆర్ మేనేజర్ పవిత్ నందా సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. బేస్ ఫేర్ రూ.40గా నిర్ణయించామన్నారు. ఆరు నెలల తర్వాత డ్రైవర్ల నుంచి 5–10 శాతం కమీషన్ తీసుకుంటామని చెప్పారు. -
మందగమనంపై సర్జికల్ స్ట్రైక్!
దేశ ఆర్థిక రంగంలో గుర్తుండిపోయే విధంగా కేంద్రంలోని మోదీ సర్కారు ఊహించని కానుకతో కార్పొరేట్లను సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. కార్పొరేట్ పన్ను(కంపెనీలపై ఆదాయపన్ను)ను తగ్గించాలని ఎప్పటి నుంచో చేస్తున్న అభ్యర్థనను ఎట్టకేలకు మన్నించింది. 30 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును ఏకంగా 22 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. దీంతో మధ్య, పెద్ద స్థాయి కంపెనీలకు భారీ ఊరట లభించనుంది. సెస్సులతో కలుపుకుని 35 శాతంగా చెల్లిస్తున్న పన్ను... ఇకపై 25.17 శాతానికి దిగొస్తుంది. ఇతర ఆసియా దేశాలైన దక్షిణ కొరియా, చైనా తదితర దేశాల సమాన స్థాయికి మన కార్పొరేట్ పన్ను దిగొస్తుంది. ప్రభుత్వం తీసుకున్న మరో విప్లవాత్మక నిర్ణయం... అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ 15 శాతమే అమలు కానుంది. కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. స్టాక్ మార్కెట్లలో మూలధన లాభాలపై ఆదాయపన్ను సర్‌చార్జీ చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) నుంచే ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తాయని మంత్రి ప్రకటించారు. అంతేకాదు వేగంగా ఇందుకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కూడా ప్రభుత్వం తీసుకొచ్చేసింది. ఇంతకుముందు మూడు విడతల్లో... ఆటోమొబైల్ రంగం, ఎగుమతులకు ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... అవేవీ పడిపోతున్న ఆర్థిక వృద్ధిని కాపాడలేవన్న విశ్లేషణలు వినిపించాయి. దీంతో కార్పొరేట్ కంపెనీలపై పన్ను భారాన్ని దించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను పరుగెత్తించాలని ప్రభుత్వం భావించే సాహసోపేతంగా ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల రూపంలో ఖజానాకు రూ.1.45 లక్షల కోట్ల వరకు పన్ను ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తగ్గిపోనుంది. ఈ నిర్ణయాలకు స్టాక్ మార్కెట్లు ఘనంగా స్వాగతం పలికాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ తన చరిత్రలోనే ఒకే రోజు అత్యధికంగా లాభపడి రికార్డు నమోదు చేసింది. బీఎస్ఈ సైతం దశాబ్ద కాలంలోనే ఒక రోజు అత్యధికంగా లాభపడింది. ప్రభుత్వ నిర్ణయాలను విమర్శకుల దగ్గర్నుంచి విశ్లేషకుల వరకు అందరూ మెచ్చుకున్నారు.. అభినందించారు. కంపెనీలపై కార్పొరేట్ పన్ను భారం నికరంగా 28 శాతం ఒకేసారి తగ్గిపోవడం, ఆరేళ్ల కనిష్ట స్థాయికి కుంటుపడిన దేశ ఆర్థిక రంగ వృద్ధిని (జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5 శాతం) మళ్లీ కోలుకునేలా చేస్తుందని, కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో కార్పొరేట్ ఇండియా (భారత కంపెనీలు) పోటీ పడగలదని విశ్వసిస్తున్నారు. జూలై 5 బడ్జెట్ తర్వాత నుంచి పడిపోతున్న స్టాక్ మార్కెట్లకు తాజా నిర్ణయాలు బ్రేక్ వేశాయి. ప్రభుత్వ తాజా నిర్ణయాలు వృద్ధిని, పెట్టుబడులను ప్రోత్సాహిస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. అయితే, ద్రవ్యలోటుపై దీని ప్రభావం పట్ల తాము అవగాహనతోనే ఉన్నామని, గణాంకాలను సర్దుబాటు చేస్తామని చెప్పారు. ప్రధాన నిర్ణయాలు ► కార్పొరేట్ ట్యాక్స్ బేస్ రేటు ప్రస్తుతం ఎటువంటి ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపులు పొందని రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న దేశీయ కంపెనీలపై 25 శాతంగా, అంతకుమించిన టర్నోవర్‌తో కూడిన కంపెనీలపై 30 శాతంగా ఉంది. ఇది ఇకపై 22 శాతమే అవుతుంది. ► 2019 అక్టోబర్ 1 తర్వాత ఏర్పాటు చేసి... 2023 మార్చి 31లోపు ఉత్పత్తి ప్రారంభించే తయారీరంగ కంపెనీలపై కార్పొరేట్ ట్యాక్స్ రేటు 15 శాతమే అమలవుతుంది. ఇతరత్రా ఎలాంటి రాయితీలు/ప్రోత్సాహకాలు పొందనివాటికే ఈ కొత్త రేటు వర్తిస్తుంది. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేస్తున్న వాటిపై ఈ పన్ను 25 శాతంగా అమల్లో ఉంది. ► ఎటువంటి పన్ను తగ్గింపుల విధానాన్ని ఎంచుకోని కంపెనీలకే ఈ కొత్త పన్ను రేట్లు. అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్) వంటి వాటిల్లో నడుస్తూ పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు పొందుతున్న కంపెనీలు ఇంతకుముందు మాదిరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత ట్యాక్స్ మినహాయింపు కాలవ్యవధి తీరిన తర్వాత కొత్త రేట్లు వాటికి అమలవుతాయి. ఇవి మ్యాట్‌ను చెల్లిస్తున్నాయి. ► బేస్ పన్ను రేటుకు అదనంగా స్వచ్ఛ భారత్ సెస్సు, విద్యా సెస్సు, సర్‌చార్జీలు కూడా కలిపితే కార్పొరేట్లపై వాస్తవ పన్ను 34.94 శాతంగా అమలవుతోంది. రూ.400 కోట్ల టర్నోవర్ వరకు ఉన్న కంపెనీలపై రూ.29.12 శాతం అమలవుతోంది. ఇవి ఇకపై అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలు కలిపి 25.17 శాతం చెల్లించాల్సి ఉంటుంది. కొత్తగా ఏర్పాటయ్యే తయారీ యూనిట్లపై అన్ని సెస్సులు, సర్‌చార్జీలు కలిపి అమలవుతున్న 29.12 శాతం పన్ను కాస్తా 17.01 శాతానికి దిగొస్తుంది. ► ఈ నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఖజానాకు 1.45 లక్షల కోట్ల ఆదాయం తగ్గిపోతుందని అంచనా. వాస్తవానికి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.16.5 లక్షల కోట్లు పన్నుల రూపంలో వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ► కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్)ను 18.5 శాతం నుంచి 15 శాతానికి తగ్గించారు. అసలు పన్ను చెల్లించకుండా తప్పించుకునే అవకాశం ఉండకూడదని భావించి, అన్ని కంపెనీలను పన్ను పరిధిలోకి తీసుకురావాలని 1996–97లో మ్యాట్‌ను ప్రవేశపెట్టారు. కంపెనీలు తాము పొందే పుస్తక లాభాలపై 18.5 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని 15 శాతానికి తగ్గించారు. సాధారణ కార్పొరేట్ పన్ను కట్టే కంపెనీలకు మ్యాట్ ఉండదు. ► 2023 మార్చి 31 తర్వాత ఉత్పత్తి ప్రారంభించే కంపెనీలు ఎటువంటి పన్ను మినహాయింపులు తీసుకోకపోతే, వాటిపై పన్ను రేటు అన్ని రకాల సెస్సులు, సర్‌చార్జీలతో కలిపి 17.01 శాతంగా అమల్లోకి వస్తుంది. ► కార్పొరేట్ కంపెనీలు సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్) తమ లాభాల్లో 2% ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలకు కూడా వర్తింపజేశారు. ► రూ.2 కోట్లకుపైన ఆదాయం ఉన్న వర్గాలు ఆర్జించే మూలధన లాభాలపై సర్‌చార్జీని భారీగా పెంచుతూ బడ్జెట్లో చేసిన ప్రతిపాదనను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ లోగడే ప్రకటించారు. ఇది కూడా అమల్లోకి వచ్చినట్టే. ► 2019 జూలై 5లోపు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిన కంపెనీలు దానిపై ఇక ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. -
మార్కెట్ ర్యాలీ..?
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత వారాంతాన పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు. శుక్రవారం మార్కెట్ ముగిసిన తరువాత.. భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపే పలు చర్యలను మంత్రి ప్రకటించారు. తాజా ప్రభుత్వ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో మార్కెట్‌కు జోష్ వచ్చే అవకాశం ఉందని దలాల్ స్ట్రీట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో ప్రతిపాదించిన సర్‌చార్జీని ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం సానుకూల అంశంగా ఉందని చెబుతున్నాయి. సర్‌చార్జ్ అంశం ఇటీవల దేశ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా నష్టపరచగా.. ఈ కీలక అంశంపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టంచేయడంతో మళ్లీ ఎఫ్‌పీఐల పెట్టుబడి భారత క్యాపిటల్ మార్కెట్‌కు వచ్చి చేరే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ మార్కెట్ ఫండమెంటల్స్ రీసెర్చ్ హెడ్ రస్మిక్ ఓజా విశ్లేషించారు. డాలరుతో రూపాయి మారక విలువ బలపడేందుకు కూడా ప్రభుత్వ తాజా నిర్ణయం దోహదపడనుందని అభిప్రాయపడ్డారు. ‘ఎఫ్‌పీఐల అమ్మకాల ప్రవాహం ఆగిపోయి.. కొనుగోళ్లు జరిగేందుకు అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నాం. అయితే, ఈ ర్యాలీ కొనసాగాలంటే.. కంపెనీల ఆదాయ వృద్ధి పుంజుకుని, ఆర్థిక వ్యవస్థలో మందగమనం తొలగిపోవాలి’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ్ కుమార్ అన్నారు. భారత జీడీపీలో వృద్ధి వేగంగా కొనసాగుతుందని ఆర్థిక మంత్రి భరోసా, ఎఫ్‌పీఐ సర్‌చార్జ్ ఉపసంహరణ వంటి కీలక అంశాల నేపథ్యంలో సోమవారం మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్‌కు చాన్స్ ఉందని ట్రేడింగ్ బెల్స్ కో–ఫౌండర్, సీఈఓ అమిత్ గుప్తా చెప్పారు. పీఎస్‌యూ బ్యాంక్ షేర్లకు మద్దతు..! ఆర్థిక వ్యవస్థలో రుణ మంజూరీని పెంచేందుకు ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000 కోట్లను మూలధన సాయంగా అందించనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. మరోవైపు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు (హెచ్ఎఫ్సీలు)కు అదనంగా రూ.20,000 కోట్ల నిధులను ఎన్‌హెచ్‌బీ ద్వారా అందించనున్నట్లు చెప్పారు. ఈ తాజా అంశాల నేపథ్యంలో పీఎస్‌యూ బ్యాంకుల షేర్లకు కొనుగోలు మద్దతు లభించే అవకాశం ఉందని ఎలారా క్యాపిటల్ విశ్లేషకులు గరిమా కపూర్ అన్నారు. ఇక ఆటో రంగానికి ఊతమిస్తూ.. ప్రభుత్వ శాఖలు, విభాగాలు పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం, వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు సవరణను 2020 జూన్ వరకు వాయిదా వేయడం వంటి పలు ప్రోత్సాహక నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ అంశానికి తోడుగా.. వస్తు, సేవల పన్ను ఊరట లభిస్తే ఆటో రంగ షేర్లలో పతనం ఆగుతుందనేది దలాల్ స్ట్రీట్ వర్గాల అంచనా. ఇక ఈ ఏడాది రెండో త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) జీడీపీ అంచనాల గణాంకాలను ప్రభుత్వం శుక్రవారం ప్రకటించనుంది. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలకు ధీటుగా చైనా సవాలు విసురుతోంది. ఇటీవల చైనా దిగుమతులపై 10% సుంకం విధించాలని అమెరికా తీసుకున్న నిర్ణయానికి ప్రతీకారంగా.. మొత్తం 75 బిలియన్ డాలర్ల విలువగల యూఎస్ వస్తువులపై అదనంగా 10% టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. దీంతో ట్రంప్ అదేరోజున మరోసారి తీవ్రంగా స్పందించారు. చైనా దిగుమతులపై అదనపు సుంకాలను విధించడంతో పాటు ఆదేశం నుంచి అమెరికన్ కంపెనీలు బయటకు వచ్చేయాలని కోరారు. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు ఆరోజున భారీ నష్టాలను చవిచూశాయి. నాస్డాక్ ఏకంగా 3% నష్టపోయింది. ఆగస్టులో రూ.3,014 కోట్లు ఉపసంహరణ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఆగస్టు 1–23 కాలానికి ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.12,105 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. అయితే, డెట్ మార్కెట్లో రూ.9,091 కోట్లను పెట్టుబడి పెట్టారు. దీంతో క్యాపిటల్ మార్కెట్లో వీరి నికర పెట్టుబడి ఉపసంహరణ ఈనెల్లో ఇప్పటివరకు రూ.3,014 కోట్లకు పరిమితమైంది. ఎఫ్‌పీఐ లపై కేంద్ర ప్రభుత్వం సర్‌చార్జ్ ఉపసంహరణతో వీరి పెట్టుబడులు మళ్లీ పెరిగేందుకు ఆస్కారం ఉందని భావిస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీ ఎండీ, సీఈఓ విజయ్ చందోక్ అన్నారు. ఆర్థిక మంత్రి ఇచ్చిన భరోసాతో పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని వి.కే విజయ్‌కుమార్ విశ్లేషించారు. -
ఎఫ్‌పీఐలు కార్పొరేట్లలా మారొచ్చు!
న్యూఢిల్లీ: ఆదాయపన్ను సర్‌చార్జీ పెంపు నుంచి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐలు) మినహాయింపు ఇవ్వటానికి అవకాశం లేదని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ పీసీ మోడీ స్పష్టం చేశారు. ఎఫ్‌పీఐలు కావాలనుకున్న పక్షంలో కార్పొరేట్ సంస్థగా రిజిస్టర్ చేసుకుని, ఆ విభాగంలో ఉన్న తక్కువ రేట్ల పరిధిలోకి మారొచ్చని సూచించారు. రూ.2 కోట్లపైన ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జ్ పెంచాలన్న నిర్ణయాన్ని... దేశ నిర్మాణం కోసం వారు మరింత చెల్లించగలరన్న ఉద్దేశంతోనే తీసుకున్నామన్నారు. ‘‘బేస్ రేటులో మార్పు లేదు. మారింది సర్‌చార్జీ మాత్రమే. ఇది ఎఫ్‌పీఐలు, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌పై (ఏఐఎఫ్) ప్రభావం చూపిస్తుంది. కానీ, కార్పొరేట్ సంస్థగా మారే ఆప్షన్ వారికి ఉంది. ఈ విషయంలో ఏవిధమైన భేదభావం లేదు’’ అని సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా మోదీ పేర్కొన్నారు. ఆదాయపన్ను పరిధిలో దిగువ స్థాయిల్లో ఉన్న వారికి ప్రయోజనాలు అందించేందుకు అధికాదాయ వర్గాలపై సర్‌చార్జీ పెంచినట్టు మోడీ తెలిపారు. బడ్జెట్ 2019–20లో అధిక ఆదాయం కలిగిన వారిపై సర్‌చార్జీలను పెంచుతూ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన విషయం విదితమే. రూ.2–5 కోట్ల మధ్య ఆదాయం ఉన్న వారిపై సర్‌చార్జీని 25 శాతానికి, రూ. 5 కోట్లు దాటిన వారిపై 37 శాతానికి పెంచేశారు. దాదాపు 40 శాతం మంది ఎఫ్‌పీఐలు నాన్ కార్పొరేట్ సంస్థల రూపంలో అసోసియేషన్ ఆఫ్ పర్సన్ లేదా ట్రస్ట్‌గా ఇన్వెస్ట్ చేస్తున్నందున వారిపై తప్పనిసరిగా ఈ భారం పడనుంది. ఎందుకంటే ఆదాయపు పన్ను చట్టం ప్రకారం వారిని వ్యక్తులుగానే పరిగణిస్తున్నారు. పన్నుల లక్ష్యాన్ని చేరుకుంటాం.. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష పన్నుల వసూళ్ల లక్ష్యాన్ని రూ.13.35 లక్షల కోట్లకు సవరించామని, ఇది ఆచరణ సాధ్యమేనని పీసీ మోడీ తెలిపారు. కార్పొరేట్ పన్ను మరింత తగ్గించే అంశాన్ని, ఈ రంగంలో మినహాయింపులు, తగ్గింపులన్నవి తొలగిపోయిన తర్వాతే ప్రభుత్వం పరిశీలించగలదన్నారు. ‘‘గత సవరించిన అంచనాల్లో మా పన్ను వసూళ్ల లక్ష్యం 2019–20 సంవత్సరానికి రూ.13.78 లక్షల కోట్లుగా ఉంది. కానీ, ఇది వాస్తవానికి దూరంగా ఉంది. ఎందుకంటే అంతకుముందు ఏడాది వసూళ్లతో పోలిస్తే 24 శాతం ఎక్కువ. బడ్జెట్ సంప్రదింపుల సమయంలో మేం ఇదే తెలియజేశాం. దీంతో పన్ను వసూళ్ల లక్ష్యాన్ని ఇప్పుడు రూ.13.35 లక్షల కోట్లుగా నిర్ణయించడం జరిగింది’’ అని మోడీ వివరించారు. దీంతో గతేడాది వసూళ్ల కంటే 17.5 శాతం ఎక్కువన్నారు. ఇది కష్టమైన లక్ష్యమే కానీ, అసాధ్యం మాత్రం కాదన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖ ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.11.37 లక్షల కోట్లను వసూలు చేసిం ది. బడ్జెట్లో పెట్టుబడులు, వృద్ధికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో, ఆర్థిక రంగం మంచి పనితీరు చూపుతుందని, దాంతో వసూళ్లు కూడా మెరుగ్గానే ఉంటాయని చెప్పారు. వస్తు సేవలç పన్ను (జీఎస్టీ) వసూళ్ల విషయంలో ఫలితాలు బాగుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు రెట్లు తగ్గిన భారత కంపెనీల ఎఫ్‌డీఐలు ఆర్బీఐ జూన్ గణాంకాలు ముంబై: భారత కంపెనీలు తమ విదేశీ వెంచర్లలో ఇన్వెస్ట్ చేసే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ఈ ఏడాది జూన్‌లో రెండు రెట్లకు పైగా తగ్గాయి. గత ఏడాది జూన్‌లో 229 కోట్ల డాలర్లుగా ఉన్న భారత కంపెనీల ఎఫ్‌డీఐలు ఈ ఏడాది జూన్‌లో 82 కోట్ల డాలర్లకు తగ్గాయని ఆర్బీఐ వెల్లడించింది. ఈ ఏడాది మేలో భారత కంపెనీల ఎఫ్‌డీఐలు 156 కోట్ల డాలర్ల మేర ఉన్నాయి. భారత కంపెనీల జూన్ ఎఫ్‌డీఐల్లో ఈక్విటీ మార్గంలో 34 కోట్ల డాలర్లు, రుణాల రూపంలో 22 కోట్ల డాలర్లు, గ్యారంటీల రూపంలో 26 కోట్ల డాలర్లు ఉన్నాయి. ఓఎన్జీసీ విదేశ్... తన వివిధ విదేశీ వెంచర్లలో 6 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసింది. ఏషియన్ పెయింట్స్ 4.3 కోట్ల డాలర్లు, అలోక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.4 కోట్ల డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశాయి. -
ప్చ్...సూపర్ రిచ్!
దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ధనవంతులు మరింత పన్ను చెల్లించడానికి సిద్ధం కావాలంటూ ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కోటీశ్వరులు చెల్లించే ఆదాయ పన్నుపై సర్‌చార్జీలను భారీగా పెంచేశారు. సర్‌చార్జీల పెంపువల్ల రూ.2–5 కోట్ల ఆదాయం ఉన్న వారిపై నికరంగా 3%, రూ.5 కోట్లు ఆదాయం దాటినవారిపై 7% వరకు అదనపు భారం పడుతుంది. ఈ సర్‌చార్జీల పెంపుతో రూ.5 కోట్లు ఆదాయం దాటిన వారు నికరంగా 42.74% పన్ను చెల్లించాల్సి రానుంది. ఇది అగ్ర రాజ్యం అమెరికాలోని వ్యక్తిగత ఆదాయ పన్ను రేటు కంటే అధికం. అమెరికాలో గరిష్టంగా ఆదాయ పన్ను రేటు 40 శాతంగా ఉంది. ఇప్పుడు ఆ రికార్డును సీతారమన్ బద్ధలు కొట్టారు. సంపన్నులపై సర్‌చార్జీలను పెంచడం ద్వారా రూ.12,000 కోట్ల అదనపు ఆదాయం రానుంది. ఇదే సమయంలో రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారు ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేదని ఆమె పేర్కొన్నారు. నిజానికి ఈ వెసులుబాటు గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే కల్పించారు. ఆదాయ పన్ను శ్లాబుల్లో ఎటువంటి మార్పులు చేయకుండా సెక్షన్ 87 కింద లభించే రిబేటును రూ.3.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు వరకు అప్పట్లోనే పెంచారు. దీనివల్ల రూ.5 లక్షల లోపు ఆదాయం వున్న వారు చెల్లించాల్సిన పన్నుపై రిబేటు లభిస్తుంది. సంపన్నులపై భారం ఇలా పెరిగింది.. ప్రస్తుతం పన్ను పరిధిలోకి వచ్చే వార్షికాదాయం రూ.10 లక్షల దాటితే 30% గరిష్ట పన్ను విధిస్తున్నారు. ఇది కాకుండా రూ.50 లక్షలు ఆదాయం దాటిన వారిపై రెండు రకాల సర్‌చార్జీలను విధిస్తున్నారు. రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల లోపు ఆదాయం ఉన్న వారిపై 10 శాతం, రూ. కోటి దాటితే 15% సర్ చార్జి విధిస్తున్నారు. దీనిపై 4% సుంకం అదనం. ఇప్పుడు రూ.2 కోట్ల నుంచి 5 కోట్ల లోపు ఉన్నవారిపై సర్ చార్జీని 15 శాతం నుంచి 25 శాతానికి, అదే రూ.5 కోట్లు దాటితే 15 శాతం నుంచి 37 శాతానికి పెంచుతూ బడ్జెట్లో ప్రతిపాదన చేశారు. దీంతో రూ.2–5 కోట్ల లోపు ఆదాయం ఉన్న వారు చెల్లించే నికర పన్ను రేటు (శ్లాబ్ రేటు+ సర్‌చార్జీ+ సుంకం) 35.88 శాతం నుంచి 39 శాతానికి పెరిగింది. అదే విధంగా రూ.5 కోట్ల ఆదాయం దాటిన వారి పన్ను భారం 42.74 శాతానికి చేరింది. గృహరుణంపై మరింత మినహాయింపు అందరికీ ఇళ్లు అన్న లక్ష్యాన్ని తొందరగా చేరుకోవడానికి అందుబాటు ధరల్లోని గృహాలపై పన్ను మినహాయింపు పరిమితిని పెంచుతూ బడ్జెట్లో నిర్ణయించారు. ప్రస్తుతం గృహరుణాలపై చెల్లించే వడ్డీపై రూ.2 లక్షల వరకు పన్ను మినహాయింపు లభించేది. ఇప్పుడు ఈ మొత్తాన్ని రూ.3.5 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. కానీ ఇంటి విలువ రూ.45 లక్షలలోపు ఉంటేనే ఈ పెంపు వర్తిస్తుంది. అలాగే మార్చి 31, 2020లోగా కొనుగోలు చేసిన ఇళ్లకు మాత్రమే ఈ మినహాయింపు లభిస్తుంది. 15 ఏళ్ల కాలానికి రుణం తీసుకుంటే వడ్డీ మినహాయింపు పరిమితిని అదనంగా రూ.1.5 లక్షలకు పెంచడం వల్ల సుమారుగా రూ.7 లక్షల వరకు ప్రయోజనం చేకూరనుందని సీతారామన్ పేర్కొన్నారు. పన్ను పరిధిలోకి మరింత మంది పన్ను పరిధిలోకి తీసుకువచ్చేందుకు బడ్జెట్లో పలు నిర్ణయాలను ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఏడాదికి రూ.50 లక్షలు దాటి చెల్లింపులు చేసే వారితో పాటు కాంట్రాక్టర్లు, వృత్తినిపుణులపై 5% టీడీఎస్‌ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కరెంట్ అకౌంట్ ఖాతాలో రూ. కోటికి మించి డిపాజిట్ చేస్తే, రూ. లక్ష మించి విద్యుత్ బిల్లు చెల్లిస్తే, అదే విధంగా ఏడాదిలో విదేశీ పర్యటనల రూపంలో రూ.2 లక్షలు ఖర్చు చేస్తే రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ట్యాక్స్ శ్లాబులు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయ పన్ను శ్లాబుల్లో ఈసారి బడ్జెట్ సందర్భంగా ఎలాంటి మార్పులూ చేయలేదు. అయితే శ్లాబులేవీ లెక్కించకుండా రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారికి ఎటువంటి పన్ను భారం లేకుండా గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే నిర్ణయం తీసుకున్నారు. సెక్షన్ 87 రిబేటు పరిమితిని నాటి బడ్జెట్ సందర్భంగా రూ.3,50,000 నుంచి రూ.5,00,000కు పెంచారు. దీంతో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు చెల్లించాల్సిన పన్నుపై రిబేటు లభించడం ద్వారా ఎటువంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈసారి బడ్జెట్లో మాత్రం వార్షికాదాయం రూ.2 కోట్లు దాటిన వారిపై మాత్రం అదనపు సర్‌ఛార్జీ విధిస్తున్నట్లు ప్రకటించారు. -
గోరక్షణ కోసం.. లిక్కర్‌పై పన్ను
జైపూర్: గోసంరక్షణ కొరకు రాజస్తాన్‌లోని వసుంధర రాజే (బీజేపీ) ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గోవుల రక్షణ కోసం నిధుల సమీకరణకు మద్యంపై 20 శాతం పన్ను విధించింది. ఈ మేరకు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ శర్మ ప్రకటన జారీ చేశారు. విదేశీ, స్వదేశీ, బీర్ లాంటి తేడాలు లేకుండా వాల్యు యాడెడ్ ట్యాక్స్ చట్టం 2003 ప్రకారం అన్నింటిపై ఇరవైశాతం పన్ను విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గత ఏడాది స్టాంప్‌డ్యూటీపై పదిశాతం పన్ను పెంచడంతో ఏడాదికి రూ.895 కోట్లు ఖజానాకు చేరిందని, ఈ మొత్తం కూడా గోరక్షణ కోసం ఉపయోగిస్తున్నామని అధికారులు తెలిపారు. రాజస్తాన్‌లోని బీజేపీ ప్రభుత్వం గోవుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న విషయం తెలిసిందే. గోరక్షణ కోసం 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ.132 కోట్లు, 2017-18లో రూ.123 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది. రాష్ట్రంలో మొత్తం 8.58 లక్షల గోవులు ఉన్నాయని వాటి కోసం 2562 సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని అధికారులు పేర్కొన్నారు. -
రివర్స్ బ్యాంక్
-
ఖాతాదారులకు కేంద్రం మరో వాత
-
క్రెడిట్, డెబిట్ కార్డు సర్‌చార్జీలపై వైఖరేంటి?
న్యూఢిల్లీ: క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలపై విధిస్తున్న సర్‌చార్జీలపై వస్తున్న ఫిర్యాదులపై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. సక్రమంగాలేని సర్‌చార్జీల విషయంలో నిర్ణీత గడువులోగా తమ వైఖరేంటో చెప్పాలని కేంద్ర ఆర్థిక శాఖ, భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)లను ఆదేశించింది. నగదు చెల్లింపుల్లో ఎలాంటి పన్ను లేదని, కార్డుల ద్వారా లావాదేవీలపై మాత్రం 2.5 శాతం, అంతకుమించి సర్‌చార్జీలు విధిస్తున్నారని పిటిషన్ వేసిన న్యాయవాది అమిత్ సాహ్ని తెలిపారు. -
ఆంధ్రా బ్యాంక్ వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రా బ్యాంక్ బహుళ ప్రయోజనాలతో కూడిన వీసా సిగ్నేచర్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది. రోజుకు రూ. 4,000 విలువైన ఇంధన కొనుగోలుపై ఎటువంటి సర్‌చార్జీలు లేకపోవడం, క్రెడిట్ కార్డు దొంగలించబడితే రూ. 1.50 లక్షల బీమా రక్షణ వంటి సౌకర్యాలను ఈ కార్డు అందిస్తోంది. ఈ కార్డు కనీస క్రెడిట్ లిమిట్‌ను రూ. 2 లక్షలుగా నిర్ణయించారు. మంగళవారం జరిగిన మేనేజర్ల మీటింగ్ సందర్భంగా వీసా సిగ్నేచర్ కార్డును ఆంధ్రా బ్యాంక్ సీఎండీ సి.వి.ఆర్.రాజేంద్రన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా నగదును అడ్వాన్స్‌గా తీసుకుంటే 2 శాతం చార్జీలు, అదే రోలోవర్ ఫెసిలిటీ వినియోగించుకుంటే 1.50 శాతం సర్వీస్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. -
కొండంత వెలుగు.. గోరంత బిల్లు
సాక్షి, రాజమండ్రి : వినియోగ చార్జీలకు తోడు ఇంధన సర్దుబాటు చార్జీలు, సర్‌చార్జీలు తడిసిమోపెడై.. నెల బడ్జెట్‌పై పెద్ద భారమవుతున్నాయి. ఈ తరుణంలో.. నెలకు 150 యూనిట్లలోపు వినియోగించిన వారికి కేవలం రూ.100 మాత్రమే బిల్లు వచ్చేలా చూస్తామన్న జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ.. ప్రజలకు మండుటెండలో మంచుకొండ మీది నుంచొచ్చిన గాలి సోకినంత ఉపశమనాన్ని ఇస్తోంది. ఆయన ముఖ్యమంత్రై.. ‘కొండంత వెలుగుకు గోరంత బిల్లు’ కట్టే రోజు రావాలని కాంక్షిస్తున్నారు. ఉక్కపోసే వేళ ‘ఫ్యాన్’ గాలి కోసం తహతహలా.. జిల్లాలో 12.20 లక్షల గృహ వినియోగ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 40 శాతం అంటే సుమారు 4.80 లక్షలకు పైగా నెలకు 150 యూనిట్లలోపు వినియోగించేవేనని అంచనా. ఒక కుటుంబం గరిష్టంగా 150 యూనిట్ల విద్యుత్తు వినియోగిస్తే ప్రస్తుతం యూనిట్ ధర ప్రకారం రూ.540 అవుతుంది. దీనికి విద్యుత్తు సుంకం, ఇతర సర్‌చార్జీలు తోడై బిల్లు రూ.750 నుంచి రూ.800 వరకూ వస్తుంది. కానీ నెలకో విధంగా ఇంధన సర్దుబాటు చార్జీలు విధిస్తుండడంతో వినియోగదారులు 150 యూనిట్లకు ఒక్కోసారి రూ.1000 నుంచి రూ.1,200 వరకూ కూడా బిల్లు కట్టాల్సి వస్తోంది. సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో వేసవిలో వినియోగం నెలకు కనీసం 150 యూనిట్లు ఉంటుంది. వీరంతా కరెంటు బిల్లులకే అధికంగా చెల్లించాల్సి వస్తోంది. జగన్ హామీ నెరవేరితే ఆ బిల్లు కాస్తా రూ.100తో సరిపోతుంది.పెనుభారంగా మారిన విద్యుత్ బిల్లుల బెడద నుంచి తెరిపిన పడేరోజు కోసం ప్రజలు.. ‘ఉక్కపోసే వేళ ‘ఫ్యాన్’ గాలి కోసం తహతహలాడినట్టు’ ఎదురు చూస్తున్నారు. ఆ హామీ అమలైతే గొప్పవరం.. కోరుకొండ మండలం బూరుగుపూడి ఎస్సీ కాలనీలో జోగు లక్ష్మి తమ ఇంటికి ప్రతి నెలా రూ.1000 నుంచి రూ.1,500 వరకూ కరెంటు బిల్లు వస్తోందని వాపోతోంది. ఒక ఫ్యాన్, రెండు లైట్లకు ఇంత బిల్లు రావడమేమిటని ఈ కుటుంబం గగ్గోలు పెడుతోంది. రెక్కాడితేకాని డొక్కాడని పరిస్థితిలో బిల్లులు కట్టడానికి తలకిందులవుతున్నామని మొత్తుకుంటోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యి.. 150 యూనిట్లకు రూ.వంద మాత్రమే వసూలు చేస్తామనడం తమలాంటి వారికి గొప్ప వరం అంటోంది. కరెంటు కష్టాలు తీరతాయని ఆశిస్తున్నాం.. నేను మండల కేంద్రమైన రంగంపేటలో సామాన్య రైతును. మాది ముగ్గురి కుటుంబం. అయినా బిల్లు వెయ్యికి పైగా వచ్చిం ది. తాజాగా బిల్లు రూ.1,065కు వచ్చింది. వినియోగం 150 యూనిట్ల లోపే అయినా సర్‌చార్జీలు, సర్దుబాటు చార్జీలు కలిపి తడిసి మోపెడయింది. జగన్ హామీ నెరవేరితే మావంటి వాళ్లకు చాలా ఊరటగా ఉం టుంది. ఆయన సీఎం అవుతారని, కరెంటు కష్టాలు విరగడవుతాయని ఆశిస్తున్నాం. - పోతుల సత్తిబాబు, రైతు, రంగంపేట పేదల ఆకాంక్ష అదే.. ఇద్దరు పిల్లలతో ఉన్న మాకు కూడా వెయ్యిరూపాయలు పైగా బిల్లు వచ్చేస్తోంది. వాడకం మాత్రం 150 యూనిట్ల లోపే ఉంటోంది. నెల నెలా ఇంత బిల్లు కట్టలేక పోతున్నాం. ఇలాంటి తరుణంలో జగన్ .. పేదవారికి విద్యుత్ భారం తగ్గిస్తామని, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని హామీ ఇస్తున్నారు. అవి నెరవేర్చుతారనే ఆశ ప్రతి పేదవాడిలో ఉంది. - షేక్ అహ్మద్ ఆలీ (బాబులు), సైకిల్‌షాపు మెకానిక్, రంగంపేట ప్రాణం పోశారు మాది తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం అయినాపురం శివారు పెదపేట. నాపేరు కుంచే బాలయోగి. నాకు భార్య, నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్యా పిల్లలను పోషించుకోవడానికి కూలి పనిచేసుకుంటూ ఎంతో కష్టపడేవాణ్ణి. ఒకరోజు సడన్‌గా గుండెనొప్పి వచ్చి ఆయాసం వచ్చింది. స్థానికంగా వైద్యం చేయించుకున్నాను. మా గ్రామానికి సమీపంలో ఉన్న పల్లంకుర్రులో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్యశ్రీ వైద్యశిబిరంలో పరీక్షలు చేయించుకున్నాను. వెంటనే గుండెజబ్బుకు ఆపరేషన్ చేయించుకోవాలని వైద్యులు చెప్పారు. నా భార్య, పిల్లలు ఒక్కసారిగా దిగులు చె ందారు. మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మా పాలిట వరమైంది. ఆ పథకంలో విశాఖ సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో 2010లో బైపాస్ సర్జరీ చేయించుకున్నాను. రూ. 1.40 లక్షలు ఖర్చయిన ఈ ఆపరేషన్‌ను ఉచితంగా చేశారు. ఆ మహానేత ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పుణ్యమా అని భార్యా పిల్లలతో ఆనందంగా ఉన్నాను. ఇప్పుడు పూర్తి ఆరోగ్యంతో పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. నాకు పునర్జన్మ ప్రసాదించిన దేవుడు వైఎస్ రాజశేఖరరెడ్డి. ఇప్పుడు ఇలా ఉన్నామంటే ఆయన చలవే. ఆయన రుణం తీర్చుకోలేనిది. - న్యూస్‌లైన్, ముమ్మిడివరం -
అ‘ధర’హో నామ సంవత్సరం
ఈ ఏడాది పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో లీటర్ పెట్రోల్ రూ. 73.16 ఉండగా, మధ్యలో రూ.80.80కి పెరిగింది. తర్వాత కొంత తగ్గి రూ. 78.94కు చేరింది. అలాగే డీజిల్ ధర కూడా పెరిగింది. ఈ ఏడాది తొలినాళ్లలో లీటర్‌కు రూ. 52.12 ఉండగా ఇప్పుడు రూ.57.59కి చేరింది. పెట్రోల్, డీజీల్ ధరల ప్రభావం అన్ని రంగాలపైనా పడింది. ముఖ్యంగా రవాణా రంగంపై పెను ప్రభావాన్ని చూపింది. దీంతో నిత్యావసరాలు, కూరగాయలు ఇలా అన్నింటి ధరలు పెరగడానికి కారణమైంది. కూర‘గాయాలు’ బియ్యం ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో సామాన్యులే కాదు మధ్యతరగతి ప్రజలూ ఇబ్బందులు పడ్డారు. ఏడాది ప్రారంభంలో క్వింటాలుకు రూ. 2,400 ఉన్న బీపీటీ బియ్యం మధ్యలో రూ. 4,500లకు చేరింది. ప్రస్తుతం రూ. 3,800లకు విక్రయిస్తున్నారు. నూనెల ధరలూ పెరిగాయి. రూ. 45కు లీటర్ ఉండే పామాయిల్ ధర రూ. 65కు చేరింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్‌కు రూ. 75 నుంచి రూ. 95కు పెరిగింది. పల్లి నూనె ధర లీటర్‌కు రూ. 90 నుంచి రూ. 110కి చేరింది. చుక్కల్లో చికెన్ ముక్క పండుగకో, పబ్బానికో మాంసాహార భోజనం చేసే పేదలకు మాంసం ధరలు ఆందోళన కలిగించాయి. చుట్టాలొచ్చినా మాంసం పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రూ. 80 నుంచి వంద రూపాయలకు కిలో ఉండే చికెన్ ధర రెండు వందల రూపాయలకు చేరింది. ప్రస్తుతం రూ. 140కి కిలో విక్రయిస్తున్నారు. గొర్రె, మేక మాంసం కొనలేనంతగా పెరిగింది. ప్రస్తుతం రూ. 400 లకు పైనే అమ్ముతున్నారు. మూడు రూపాయలుండే గుడ్డు ధర ప్రస్తుతం రూ. 4.50కు పెరిగింది. ఉల్లి.. వెల్లుల్లి.. ఈసారి ఉల్లిగడ్డలు సామాన్యుడి కంట కన్నీరు పెట్టించాయి. సాధారణంగా కిలోకు రూ. 10 నుంచి రూ. 15ల మధ్య లభించే ఉల్లిగడ్డల ధర వేసవిలో రూ. 80 దాటింది. అకాల వర్షాలతో పంటకు తీవ్రంగా నష్టం వాటిల్లడంతో ధర భారీగా పెరిగింది. ఏడాది చివరిలో కిలోకు రూ. 25 కు తగ్గిపోయింది. వెల్లుల్లి సైతం తక్కువ తినలేదు. ఏడాది ఆరంభంలో కిలోకు రూ. 240 వరకు పెరిగింది. తర్వాత రూ. 80కి తగ్గింది. కుదేలైన నిర్మాణ రంగం గృహ నిర్మాణాలకు సంబంధించి ఇసుక, ఇటుక, సిమెంటు, స్టీల్ ధరలు భారీగా పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైంది. ఈ ఏడాది ఇసుక కొరత తీవ్రంగా ఏర్పడింది. ట్రాక్టర్ ఇసుకకు గతంలో రూ. 2,500 నుంచి రూ. 3 వేలు ఉండగా, రూ. 6,500 నుంచి రూ. 7 వేల వరకు చేరుకుంది. ఇటుక ధర గతంలో ట్రాక్టర్ లోడ్‌కు రూ.6 వేల ఉండగా రూ. 8,500 నుంచి రూ. 10,500 వరకు పలికింది. స్టీల్ ధర క్వింటాలుకు రూ. 3,600 ఉండగా రూ. 4,100కు పెరిగింది. సిమెంటు బస్తా ధర రూ. 170 ఉండగా రూ. 280 కి చేరింది. సిమెంట్ ధర ఇటీవల రూ. 230కి తగ్గింది. రికార్డు స్థాయికి బంగారం బంగారం ధరలు ఈసారి భారీగానే పెరిగాయి. 10 గ్రాములకు *33 వేలు దాటి ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడ్డ పరిణామాలతో బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారం ధర ఒక్కసారిగా * 25 వేలకు పడిపోయింది. తర్వాత కోలుకొని రూ. 30 వేల వద్ద ఉంది. వెండి ధర కిలోకు 60 వేలకు చేరింది. తర్వాత 42 వేలకు పడిపోయినా ప్రస్తుతం 46 వేలకు కిలో విక్రయిస్తున్నారు. పెరిగిన బస్సు, రైలు చార్జీలు ఈ ఏడాది బస్సు, రైల్చార్జీలు భారీగా పెరిగాయి. దీంతో ప్రజలపై అదనపు భారం పడింది. ఆర్టీసీ చార్జీలు రెండు సార్లు పెరిగాయి. ఏసీ బస్సులపై 12 శాతం, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌లపై 10 శాతం, పల్లెవెలుగులపై 8 శాతం వడ్డించారు. సర్వీస్ చార్జీల పేరిట ప్రతి టికెట్టుపై ఒక్కో రూపాయి చొప్పున అదనంగా పెంచారు. ఈ సారి బస్సుపాస్‌ల రేటూ పెంచడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైలు చార్జీలూ పెరిగాయి. గతంలో కనీస చార్జి రూ. 2 ఉండగా దానిని రూ. 5కు పెంచారు. ఇతర చార్జీలూ పెరిగాయి. షాకిచ్చిన కరెంటు బిల్లులు ఈ ఏడాది విద్యుత్ వినియోగ చార్జీలతో పాటు సర్‌చార్జీలు వినియోగదారులకు షాకిచ్చాయి. సర్‌చార్జిల పేరుతో మూడు నెలలకోసారి అదనంగా విద్యుత్ చార్జీలు వడ్డించారు. దీంతో వినియోగదారులు విలవిల్లాడారు. పేద, మధ్యతరగతి ప్రజలపై భారం మోపేది లేదంటూనే ప్రభుత్వం ఆ వర్గాలపైనే అధిక భారం మోపింది. ఈఆర్సీ చెప్పిందంటూ చార్జీలను పెంచుతున్న ప్రభుత్వం మరోసారి చార్జీల వడ్డనకు సిద్ధపడింది. రెండు ఫ్యాన్లు, రెండు బల్బులు, టీవీ ఇతర గృహోపకరణాలు వాడే వినియోగదారులకు నెలకు * 6 వందల నుంచి * 8 వందల వరకు బిల్లులు వస్తున్నాయి. గతంలో రెండు మూడు నెలలకు కలిపితే వచ్చే బిల్లులు ఇప్పుడు ఒకే నెలకు వస్తుండడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. -
సర్‌చార్జీలపై ప్రభుత్వానికే అధికారం : దొర
గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : ఇటీవల కాలంలో పెంచుతున్న సర్‌చార్జీలు ప్రభుత్వ నిర్ణ యం మేరకే జరిగాయని... తామేమీ చేయలేమని ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ హెచ్.వై.దొర అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం నూజివీడు, గుడివాడ డివిజన్లలోని ఎలక్ట్రిసిటీ శాఖకు చెందిన డీఈ, ఏఈలతో ఆయన సమావేశాలను ఏర్పాటు చేశారు.ఆయనతో పాటు డెరైక్టర్ జె.నాగేశ్వరారవు, కృష్ణా-గుంటూరు-ప్రకాశం చీఫ్ ఇంజినీర్ రాజబాపయ్య, జేఈ ఆర్.మోహాన్‌కృష్ణ ఉన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని సబ్ స్టేషన్లో జరిగిన సమావేశంలో దొర మాట్లాడుతూ సర్‌చార్జీల విషయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేశారు. వ్యవసాయానికి 7గంటల విద్యుత్ అందించి రైతులకు మేలు చేస్తామన్నారు. అలాగే గ్రామాల్లో పూర్తిస్థాయిలో విద్యుత్‌ను అందిస్తామని తెలిపారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని ఏపీ ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ యూనియన్-327 సభ్యులు దొరను కోరారు. సమస్యలను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. యూనియన్ అధ్యక్షుడు వి.కృష్ణారావు, కార్యదర్శి ఓ.రాఘవ, వర్కింగ్ ప్రెసిడెంట్ జి.విన్సెంట్, ట్రెజరర్ శ్రీరామ్, జిల్లా వైస్‌ప్రెసిడెంట్ కృష్ణమోహాన్, సత్యప్రసాద్ పాల్గొన్నారు. నాణ్యమైన విద్యుత్ అందిస్తాం... నూజివీడురూరల్ : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అన్ని చర్యలు చేపట్టామని హెచ్‌వై దొర అన్నారు. స్థానిక డీఈ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వినియోగ దారుల అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. నూజివీడు డివిజన్ పరిధిలో 14 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామన్నారు. డిస్కం పరిధిలోని 6జిల్లాలో ‘హెచ్‌విడిఎస్’ పూర్తిచేయడానికి రూ.వెయ్యికోట్లతో చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యుత్ సమస్యలు పరిష్కరించుకునేందుకు సెంట్రలైడ్ కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేశామని, విద్యుత్ బిల్లుల కోసం ఆన్లైన్లో ‘స్పందన’ కార్యక్రమం ద్వారా సమస్యలను రికార్డు చేయవచ్చన్నారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది తక్షణం స్పందిస్తారని ఆయన పేర్కొన్నారు. ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ, డీఈలు వెంకటేశ్వరరావు, కమలకుమారి, పలువురు ఏఈలు పాల్గొన్నారు.