సెస్సులు, సర్‌చార్జీలతో రాష్ట్రాలకు దెబ్బ  | Telangana Minister Harish Rao About Central Govt Over Cesses And Surcharges | Sakshi
Sakshi News home page

సెస్సులు, సర్‌చార్జీలతో రాష్ట్రాలకు దెబ్బ 

Published Sat, Nov 26 2022 3:00 AM | Last Updated on Sat, Nov 26 2022 10:47 AM

Telangana Minister Harish Rao About Central Govt Over Cesses And Surcharges - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న సెస్సులు, సర్‌చార్జీలు రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాన్ని దెబ్బతీస్తున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. 1980–81లో కేంద్ర ప్రభుత్వ మొత్తం ఆదాయంలో సెస్సులు, సర్‌చార్జీలు కేవలం 2.3 శాతంగా ఉంటే.. 2022–23 నాటికి 20 శాతానికి చేరాయని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు సరికాదని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు విపరీతంగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతోందని, తద్వారా దేశ పురోగతి కూడా కుంటుపడుతోందని పేర్కొన్నారు. కేంద్ర బడ్జెట్‌ రూపకల్పనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నిర్వహించిన సమావేశంలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు తరఫున ప్రసంగాన్ని ఆ శాఖ కార్యదర్శి రోనాల్డ్‌ రాస్‌ చదివి వినిపించారు. 

పన్నుల వాటా తగ్గింది 
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు రావాల్సిన వాటా తగ్గిపోయిందని.. 15వ ఆర్థిక సంఘం కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇవ్వాలని సిఫార్సు చేస్తే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వస్తున్నది 29.7 శాతమేనని హరీశ్‌రావు తన ప్రసంగ పాఠంలో స్పష్టం చేశారు. కేంద్ర సెస్సులు, సర్‌చార్జీలను ప్రస్తుతమున్న 20శాతం నుంచి పది శాతానికి తగ్గించాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆయా రాష్ట్రాల అవసరాలకు తగినట్టుగా అమలుచేసుకునే స్వేచ్ఛ కల్పించాలని కోరారు.

న్యూట్రిషన్, సెక్టార్‌ స్పెసిఫిక్, స్టేట్‌ స్పెసిఫిక్‌ గ్రాంట్లు, ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వకపోవడం అన్యాయమని స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌ అంచనాల్లో మూలధన పెట్టుబడిని పెంచి చూపినా.. వ్యయం సరిగా చేయడం లేదని, ఈ విషయంలో వేగం పెంచాలని సూచించారు. ‘‘మౌలిక వసతుల కల్పనలో రాష్ట్రాలు ముందున్నాయి. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ఇచ్చే ప్రత్యేక సహాయాన్ని మరో ఐదేళ్లు కొనసాగించాలి. ఇందుకోసం ఏటా రూ. 2 లక్షల కోట్లు కేటాయించాలి. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకునే రుణాలను రాష్ట్ర బడ్జెట్‌తో సంబంధం లేకుండా పరిగణించాలి. లేదా ఈ నిర్ణయాన్ని గత సంవత్సరాలకు వర్తింప చేయవద్దు’’ అని హరీశ్‌రావు కోరారు. 

రాష్ట్రానికి సంబంధించి కోరిన అంశాలివీ.. 
►రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లను 2019–20 నుంచి నిలిపివేశారు. ఏటా రూ.450 కోట్ల లెక్కన ఈ ఆర్థిక సంవత్సరంతో కలిపి మొత్తం రూ.1350 కోట్లు ఇవ్వాలి. వీటి యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను ఇదివరకే సమర్పించాం. తెలంగాణ 10 జిల్లాల నుంచి 33 జిల్లాలుగా మారినందున మౌలిక సదుపాయాల కల్పన పెంచడానికి నిధులు ఇవ్వాలి. 
►ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం మేరకు పన్ను ప్రోత్సాహకాలను కల్పించాలి. కేంద్రం తెలంగాణకు ప్రధాన పన్నుల రాయితీని ప్రకటించాలి. 
►వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చడానికి బీహెచ్‌ఈఎల్‌–లక్డీకాపూల్‌ వరకు 26 కిలోమీటర్లు, నాగోల్‌–ఎల్‌బీనగర్‌ వరకు 5 కిలోమీటర్ల దూరం రోడ్ల నిర్మాణానికి కలిపి రూ.8,453 కోట్లు ఇవ్వాలి. 
►మిషన్‌ భగీరథ నిర్వహణకు రూ.2,350 కోట్ల సాయానికి కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో మరో రూపంలోనైనా నిధులు ఇవ్వాలి. 
►కల్లాలు, ట్రీగార్డ్స్‌ను గ్రామీణ ఉపాధి హమీ పథకంలో చేపట్టినందుకు అయిన రూ.151.19 కోట్లను పదిహేను రోజుల్లో చెల్లించాలని కేంద్రం లేఖ రాసింది. చెల్లించకపోతే రాష్ట్రానికి ఇచ్చే గ్రాంట్లలో కత్తిరించుకుంటామని పేర్కొంది. కేంద్రం ఉత్పాదకత కోసం చేసిన పనులపై పరిమితులు పెట్టడం, ఆ అధికారులపై చర్యలు తీసుకుంటామనడం సరికాదు. 
►రాష్ట్రానికి ఐటీఐఆర్‌ను వెంటనే ఇవ్వాలి. విభజన చట్టం హామీలను వెంటనే అమలు చేయాలి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement