రూ.40 వేల కోట్లు నిలిపేసింది | Telangana Minister Harish Rao criticized Central Govt Over Funds | Sakshi
Sakshi News home page

రూ.40 వేల కోట్లు నిలిపేసింది

Published Fri, Feb 10 2023 2:28 AM | Last Updated on Fri, Feb 10 2023 2:28 AM

Telangana Minister Harish Rao criticized Central Govt Over Funds - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రభాగాన ఉన్న తెలంగాణను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. 2022–23 వార్షిక సంవత్సరంలో వివిధ పద్దుల కింద రాష్ట్రానికి రావాల్సిన వాటాను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి చోద్యం చూస్తోందని విమర్శించారు.

ప్రస్తుత వార్షికంలో ఇప్పటివరకు దాదాపు రూ.40వేల కోట్లు నిలిపివేసి ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ ఒక్క సంక్షేమ పథకాన్నీ ఆపలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం శాసనమండలిలో బడ్జెట్‌పై సాధారణ చర్చలో సభ్యులు లేవనెత్తిన అంశాలకు హరీశ్‌ సమాధానమిచ్చారు.

రైతుబంధు, ఆసరా పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో కొన్ని పథకాలకు నిధుల విడుదలలో ఆలస్యం జరిగిన మాట వాస్తవమేనన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి మరో రెండు నెలల సమయం ఉన్నందున ఆలోపు అన్ని రకాల బకాయిలను క్లియర్‌ చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు సంబంధించి రూ.150 కోట్ల చెల్లింపులను అతి త్వరలో పూర్తి చేస్తామని, తాజా బడ్జెట్‌లోనూ ఈ పద్దులకు కేటాయింపులు పెంచినట్లు వెల్లడించారు. 

రూ. 4.7 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ... 
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని, దీంతో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం   క ల్పించిన హక్కులను కాలరాస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అణగారిన వర్గాల కోసం రాజ్యాంగం రిజర్వేషన్ల ద్వారా హక్కులు కల్పించిందని, ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణతో ఆయా రిజర్వేషన్లు దక్కవన్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.4.7లక్షల కోట్ల విలువైన ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రం ప్రైవేటు పరం చేసిందన్నారు. రాష్ట్రంలోని సంస్థలను ప్రైవేటీకరిస్తే ప్రోత్సాహక నిధులు ఇస్తామని కేంద్రం ఒత్తిడి చేస్తోందని, సీఎం కేసీఆర్‌ ఈ ప్రైవేటీకరణకు పూర్తి వ్యతిరేకి అని స్పష్టం చేశారు. సంపద సృష్టించాలన్న నినాదంతో కేసీఆర్‌ అభివృద్ధి ఉద్యమం చేస్తుంటే మోదీ మాత్రం ఆస్తుల అమ్మకంతో దేశాన్ని తిరోగమన దిశలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. ప్రతి జిల్లాకు ఒక నవోదయ స్కూల్‌ ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో మంత్రులకు విన్నవిస్తే ఇప్పటికీ గతి లేదన్నారు. ఇక విభజన చట్టం కింద రావాల్సిన బయ్యారం ఉక్కు కర్మాగారం ఊసే లేదని, గిరిజన వర్సిటీని పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు మండిపడ్డారు. 

ఉద్యోగుల రెండు డీఏలకు నిధులు కేటాయించాం... 
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల ఒక డీఏను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, మరో రెండు డీఏలకు సంబంధించి తాజా బడ్జెట్లో నిధులు కేటాయించామని హరీశ్‌రావు వివరించారు. ముఖ్యమంత్రి సమీక్షించి అమలు తేదీలను ప్రకటిస్తారని తెలిపారు. కొత్త నియామకాలకు సంబంధించి ఉద్యోగులు విధుల్లో చేరితే వారికి అవసరమైన వేతనాల కోసం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ సైతం ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమలు చేస్తామని... ఈమేరకు నిధులు కూడా బడ్జెట్‌లో కేటాయించినట్లు మంత్రి వివరించారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికకు అతి త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామన్నారు. కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు త్వరలోనే పదోన్నతులు, బదిలీలు చేపడతామని, ప్రభుత్వ టీచర్ల బదిలీల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేక పథకాన్ని ఏర్పాటు చేసి రూ.100 కోట్లు కేటాయించాలని సభ్యుడు జీవన్‌రెడ్డి ప్రస్తావించారు. పాడి రైతుకు ప్రోత్సాహక నిధులను విడుదల చేయాలని కోరగా అతిత్వరలో చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement