సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) గాను రూ.2.9 లక్షల కోట్ల వరకు అంచనాలతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని తెలుస్తోంది. 2022–23కు రూ.2.56 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈసారి ఆ మొత్తానికి 10 శాతం కంటే కొంచెం ఎక్కువగా రూ. 2.9 లక్షల కోట్ల వరకు బడ్జెట్ అంచనాలను ప్రతిపాదించనుందని సమాచారం.
ఎన్నికల ఏడాది కావడంతో సంక్షేమం, అభివృద్ధిని యథాతథంగా కొనసాగిస్తూ కొన్ని కొత్త పథకాలను జోడిస్తూ ప్రజారంజక బడ్జెట్ పెట్టే కసరత్తు పూర్తయిందని, సంక్షేమమే ప్రధాన ఎజెండాగా ఈసారి బడ్జెట్ పెట్టే అవకాశాలున్నాయని ఆర్థికశాఖ వర్గాల ద్వారా తెలిసింది. సోమవారం ఉదయం 10:30 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసనసభలో 2023–24 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత శాసనమండలిలో రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెడతారు.
సాగునీటికి, సంక్షేమానికి భారీగానే..
గత కొన్నేళ్లుగా బీఆర్‌ఎస్ మార్కుతో అమలవుతోన్న సంక్షేమ పథకాలన్నీ ఎన్నికల ఏడాదిలో యథాతథంగా కొనసాగేలా బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధమైనట్టు సమాచారం. ఈ పథకాలకు తోడు విద్య, వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, మన ఊరు–మన బడి లాంటి పథకాలకు ప్రత్యేక కేటాయింపులు ఈ బడ్జెట్‌లో ఉండనున్నాయని ఆర్థికశాఖ వర్గాలంటున్నాయి. వీటి తో పాటు సాగునీటి రంగానికి కూడా ఈసారి భారీ బడ్జెట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తెచ్చిన అప్పులు ఈ ఏడాది నుంచే తిరిగి చెల్లించాల్సి ఉండడంతో దాని కోసం, పాలమూరు–రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు వేగవంతం చేసేందుకు, ఆగిపోయిన పలు ప్రాజెక్టులను పూర్తి చేసి ఎన్నికల నాటికి ప్రజలకు అందించేలా.. రూ.35 వేల కోట్లకు పైగా సాగునీటి రంగానికి ప్రతి పాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుబంధు లాంటి ప్రతిష్టాత్మక పథకం కొనసాగింపుతో పాటు కొత్తగా పంటల బీమా పథకం అమలు చేసేందుకు గాను ఈసారి వ్యవసాయానికి రూ.25 వేల కోట్ల వరకు కేటాయింపులుంటాయని తెలుస్తోంది.
పంటల బీమా పథకం కోసం రూ.1,200 కోట్లు, రైతు బంధు పథకం కింద రూ. 8 వేల కోట్ల వరకు ప్రతి పాదించనున్నట్టు సమాచారం. ఇక దళిత బంధుకు గత ఏడాది పెట్టిన బడ్జెట్‌లో ఖర్చు కాకుండా మిగి లిన మొత్తాన్ని ఈ ఏడాదికి బదలాయిస్తూ రూ.20 వేల కోట్ల వరకు కేటాయింపుల్ని ఈ పథకానికి చూపెట్టనున్నట్టు తెలుస్తోంది. దళిత బంధు తరహా లోనే గిరిజన బంధును రూ. 5 వేల కోట్లు (అంచనా) కూడా ప్రకటించే అవకాశముందని, అయితే గిరిజన బంధుకు మార్గదర్శకాలు కూడా సిద్ధం కాని నేపథ్యంలో ఎన్నికల నాటికి బడ్జెట్‌ను ఖర్చు పెట్టగలిగేందుకు ఉన్న అవకాశాలను బట్టి ఈ పథకాన్ని బడ్జెట్‌లో పొందుపరిచే అవకాశాలున్నాయని గిరిజన సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి.
సొంత రాబడులపైనే ఆశలు..
రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయంపైనే ఆధారపడి బడ్జెట్ కేటాయింపులు ప్రతిపాదించనున్నట్టు ఆర్థికశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.08 లక్షల కోట్ల వరకు పన్ను రాబడులు అంచనా వేయగా, అంచనాలకు తగ్గట్టునే ఈ ఏడాది పన్ను ఆదాయం రూ.లక్ష కోట్లు దాటనుంది. ఈ నేపథ్యంలో సొంత పన్నులు.. ముఖ్యంగా ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ శాఖల ఆదాయాలను పరిగణనలోకి తీసుకుని గత బడ్జెట్ కంటే 10%నికి పైగా ఎక్కువ అంచనాలను రూపొందించినట్టు సమాచారం. అప్పుల విషయానికొస్తే ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట నిబంధనల మేరకు జీఎస్‌డీపీలో 3.5% వరకు ప్రతిపాదించనున్నారు.
ఉద్యోగులకు కొత్త ఆరోగ్య పథకం
ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం అమలు కోసం ఉద్యోగుల భాగస్వామ్యంతో కొత్త పథకాన్ని అమలు చేసే యోచనలో భాగంగా రూ.750 కోట్ల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇందులో తన వాటాగా రూ.350 కోట్లు ప్రతిపాదించనున్నట్లు సమాచారం. గత బడ్జెట్ తరహాలోనే సొంత జాగా ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల పథకం కింద రూ.12 వేల కోట్లు, ప్రతి గ్రామపంచాయతీకి రూ.10 లక్షల అభివృద్ధి నిధుల కోసం రాష్ట్రంలోని 12 వేల గ్రామ పంచాయతీలకు రూ.1200 కోట్లు కేటాయింనున్నారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పథకాలను కొనసాగించనున్నారు. ఆసరా పింఛన్లకు రూ.15 వేల కోట్ల వరకు ప్రతిపాదించనున్నారు. ఇక ఎన్నికల హామీలో నెరవేర్చడంలో భాగంగా రూ.లక్షలోపు రైతు రుణమాఫీకి ఈసారి నిధులు కేటాయిస్తారని, ఈ పద్దు కింద రూ.20 వేల కోట్లు అవసరమవుతాయనే చర్చ జరుగుతోంది. విద్యుత్ సబ్సిడీలు, ఆర్టీసీకి ఆసరా కోసం కూడా ప్రత్యేక కేటాయింపులు చూపెట్టనున్నారు. ఉద్యోగుల జీతభత్యాలు, పింఛన్ల పద్దుకు రూ.30 వేల కోట్లు, అప్పులు, వడ్డీల చెల్లింపునకు రూ.25 వేల కోట్ల వరకు కేటాయించనున్నట్టు సమాచారం.
కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంచనాలపై ఆసక్తి
కేంద్రం ఇచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ పద్దు కింద భారీగా అంచనాలు ప్రతిపాదించడం, కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు రాక డీలా పడిపోవడం ఆనవాయితీగా మారిపోయింది. గత ఏడాది రూ.38 వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వస్తాయని ఆశించినా రూ.10 వేల కోట్లు కూడా రాలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ ఈ అంచనాలు రూ.40 వేల కోట్లు దాటినా, ఈసారి కూడా గత ఏడాదిలాగానే మంజూరయ్యాయి.
దీంతో ఈసారి గ్రాంట్ ఇన్ ఎయిడ్, కేంద్ర పన్నుల్లో వాటా పద్దుల కింద రాష్ట్ర ప్రభుత్వం ఎంత అంచనా వేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి కేసీఆర్ మార్కు బడ్జెట్ అంకెలు ఉంటాయని, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.3 లక్షలు దాటిన నేపథ్యంలో బడ్జెట్ అంచనాలు కూడా రూ.3 లక్షల కోట్లు ఉంటాయనే ప్రచారం జరిగినా, వాస్తవికతకు అనుగుణంగానే ప్రభుత్వం ముందుకెళ్లనుందని సమాచారం. ఇక 2022–23 ఆర్థిక సంవత్సరంలో రూ.2.56 లక్షల కోట్ల బడ్జెట్ అంచనా వేసినా.. అప్పులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ పథకాల్లో కేంద్రం నిధుల కోత పెట్టిన కారణంగా సవరించిన అంచనాలు రూ.2.25 లక్షల కోట్లకు పరిమితమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment