బీఏసీ సమావేశంలో పోచారం, పద్మారావు, వేముల, హరీశ్‌రావు, భట్టి తదితరులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 13 వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. శుక్రవారం అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన తర్వాత శనివారానికి వాయి దా పడ్డాయి. అనంతరం శాసనసభ, శాసన మండలి బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశాలు జరిగాయి. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారు. తాము ప్రతిపాదించిన అంశాలను చర్చించడం లేదనే కారణంతో ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ బీఏసీ సమావేశానికి దూరంగా ఉన్నారు. బీఏసీ భేటీకి బీజేపీకి ఆహ్వానం అందలేదు. వీలైనన్ని ఎక్కువ రోజులు సమావేశాలు జరపాలని భట్టి విజ్ఞప్తి చేశారు.
నేడు ప్రసంగానికి ధన్యవాదాలు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించేందుకు శాసనసభ, శాసన మండలి వేర్వేరుగా శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నాయి. ఈ నెల 5న ఆదివారం ఉభయ సభలకు విరామం ప్రకటించి.. సోమ వారం 6న సమావేశాలు ప్రారంభిస్తారు. ఆ రోజున శాసనసభలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను సమర్పిస్తారు.
7న ఉభయ సభలకు విరామం ప్రకటించనుండగా.. 8న బడ్జెట్‌పై సాధారణ చర్చ జరుగుతుంది. 9,10,11 తేదీల్లో శాఖల వారీగా పద్దులపై శాసనసభలో చర్చ జరగనుండగా.. ఈ మూడు రోజులు శాసన మండలికి విరామం ప్రకటిస్తారు. ఈ నెల 12 లేదా 13న ఉభయ సభల్లో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించిన తర్వాత నిరవధికంగా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఏయే తేదీల్లో ఏయే పద్దులపై చర్చ జరుగుతుందనే అంశంపై శనివారం స్పష్ట త రానున్నది. ఈ నెల 9, 10, 11 తేదీల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగనుండగా.. బడ్జెట్ సమావేశాలు కావడంతో స్వల్పకాలిక చర్చ ఉండే చాన్స్ లేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment